close

ఏపీపీఎస్సీ > ప్రధాన కథనాలు

కార్యదర్శి కొలువులకు మార్గదర్శి!

ఏపీ పంచాయతీరాజ్‌ శాఖలో పంచాయతీ కార్యదర్శి ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 1051 పోస్టులు! గ్రామ స్థాయిలో కీలకమైన ఈ ఉద్యోగ ప్రాధాన్యం ఎంతో. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిగ్రీ అర్హతతో పోటీపడవచ్చు. రెండంచెల్లో ఉండే పరీక్షకు ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధమై ముందుకు సాగాలి. అందుకు ఉపకరించే సూచనలు ఇవిగో!

వన్‌ మ్యాన్‌ ఆర్మీ.. అతడే/ ఆమె సైన్యం! ... ఈ వాక్యం పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి చక్కగా నప్పుతుంది. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ శాఖలో క్షేత్ర స్థాయి పోస్టు - పంచాయతీ కార్యదర్శి 24 శాఖలకు సంబంధించిన బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ 51 రకాల సేవలను గ్రామానికి అందించే శక్తిమంతమైన పోస్టు. వ్యవసాయం, పశుసంరక్షణ, గృహనిర్మాణం, సేద్యపునీరు, విద్య, వైద్య - ఆరోగ్యం, శాంతిభద్రతలు ఇలా అవసరం ఏదైనా గ్రామ ప్రజల చూపు పంచాయతీ కార్యదర్శి వైపే.

ప్రజాస్వామ్యానికి అధికారాల వికేంద్రీకరణే ఆయువుపట్టు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామపంచాయతీల వరకు అధికారాల బదలాయింపులో భాగంగా గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)లకు గ్రామసభలే వేదికలయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇది సంపూర్ణమైతే సూక్ష్మ స్థాయిలో నిధుల కేటాయింపులకు గ్రామపంచాయతీలే వేదికలవుతాయి. పంచాయతీ సెక్రటరీలే ఇందుకు కంకణధారులవుతారు. ఇంతటి కీలకమైన పంచాయతీ కార్యదర్శుల ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉపక్రమించింది.

ఈ పోస్టుకు రెండు అంచెల ఎంపిక విధానం ఉంటుంది.
* స్క్రీనింగ్‌ టెస్ట్‌ బహుళైచ్ఛిక విధానంలో రెండు పేపర్లుగా జరుగుతుంది. మొత్తం మార్కులు 150.
* మెయిన్స్‌ పరీక్ష కూడా రెండు పేపర్లలో బహుళైచ్ఛిక విధానంలో ఉంటుంది. మొత్తం 300 మార్కులకు జరుగుతుంది.
పోటీపడేవారు లక్షల్లో ఉంటారు. కాబట్టి తొలుత వడపోత పరీక్షను నర్వహించి ఇందులో నుంచి ప్రతిభ ఆధారంగా మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.

దశలు- లాభాలు.. రెండు
రెండు అంచెల్లో రాతపరీక్ష ఉందని ఆందోళన చెందాల్సిన పనిలేదు. రెండు దశల్లోనూ సన్నద్ధం కావాల్సిన సిలబస్‌ ఒక్కటే కావడం అభ్యర్థులకు కలసివచ్చే అంశం. అలాగే రెండు దశల్లోనూ రాయాల్సిన పేపర్లు బహుళైచ్ఛిక విధానంలోనే ఉంటాయి. అయితే వడపోత పరీక్ష కంటే ప్రధాన పరీక్ష (మెయిన్స్‌)లో ప్రశ్నల స్థాయిలో కాఠిÈన్యత పెరిగే అవకాశం ఉంటుంది. రెండు దశల్లోనూ రెండు పేపర్లే. వీటిలో మొదటి పేపర్‌ జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ.

రెండోది గ్రామీణాభివృద్ధి - గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు - ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి. ఒకే సిలబస్‌పై రెండు దశల్లో సన్నద్ధత, పరీక్షను ఎదుర్కోవడం అనేది నిశితమైన, లోతైన దృష్టితో చదివే అభ్యర్థులకు రానురానూ సులభతరం అవుతుంది. తొలిదశలో రెండు పేపర్లలో కలిపి మొత్తం 150 మార్కులకు గరిష్ఠ మార్కులు సాధిస్తేనే ప్రధాన పరీక్షకు పంపుతారు. ప్రధాన పరీక్ష రెండు పేపర్లలో కలిపి 300 మార్కులకు గరిష్ఠ మార్కులతో అగ్రభాగాన నిలిస్తేనే పోస్టు వచ్చేది. మరయితే పోస్టు సాధించేందుకు సన్నద్ధత ఎలా సాగాలి?

సిలబస్‌ విహంగవీక్షణం
వడపోత పరీక్ష - ప్రధాన పరీక్షల్లోని సిలబస్‌లను వీక్షిస్తే రెండు పేపర్లలో ఒక్కోదానిలో 12 విభాగాల చొప్పున 24 విభాగాలను అభ్యర్థి చదవాల్సి ఉంటుంది. వీటిని అధ్యయన అవగాహన కోసం రెండు వర్గాలుగా విభజిస్తే మంచిది.

సబ్జెక్టుపరంగా స్థిరంగా ఉండి అంతకుమించి సబ్జెక్టులో కదలిక లేనివి స్థిర విభాగాలుగా గుర్తించవచ్చు. మొదటి పేపర్‌ జనరల్‌ స్టడీస్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం ఇస్తూ భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర ఈ కోవకు చెందినదే. అలాగే భారత ఉపఖండం, ఆంధ్రప్రదేశ్‌ భౌతిక భౌగోళిక శాస్త్రం, లాజికల్‌ రీజనింగ్, డేటా అనాలిసిస్‌ వంటి ఆరు విభాగాల వరకు ఉన్నాయి. ఇంకా పేపర్‌ 2 గ్రామీణాభివృద్ధిలోని 12 అధ్యాయాల్లో సగం వరకు ఈ స్వభావంగలవే.
భారతదేశంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ పరిణామ క్రమం, పంచాయతీ కార్యదర్శి విధులు- బాధ్యతలు, ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ రుణ వ్యవస్థ, బ్యాంకులు, సహకార సంస్థలు, సూక్ష్మ రుణాలు, మహిళా సాధికారత - ఆర్థికాభివృద్ధి, స్థానిక సంస్థల ఆదాయ వ్యయ నిర్వహణ, నిధుల వినియోగ జమ ఖర్చుల నిర్వహణ తదితర అధ్యాయాలు స్థిర స్వభావం గలవిగా చెప్పవచ్చు.
మిగతా విభాగాలు, అధ్యాయాలు గమనశీలమైనవిగా గుర్తించాలి. దీని వల్ల ప్రయోజనమేమిటంటే స్థిర స్వభావం గల సబ్జెక్టుల్లో కొత్తగా సమాచారం ఏదీ అదనంగా వచ్చి చేరదు, కాబట్టి పేపర్‌ 1 లోని ఈ విభాగాలను, పేపర్‌ 2 లో ఈ తరహా అధ్యాయాలను సన్నద్ధత తొలి దశలో పూర్తిచేసేసి పక్కన పెట్టేయాలి.

నోటిఫికేషన్‌ ముఖ్యాంశాలు
మొత్తం ఖాళీలు: 1051
కనీస విద్యార్హత: డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 01.07.2018 నాటికి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధులకు 5 ఏళ్ల పన్ను మినహాయింపు, దివ్యాంగులగు 10 ఏళ్ల మినహాయింపు.
దరఖాస్తు రుసుము: రూ.250. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుసుము మినహాయింపు.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌: 27.12.2018 నుంచి 19.01.2019 వరకు.
వడపోత పరీక్ష: 21.04.2019
ప్రధాన పరీక్ష: 02.08.2019
వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in

ఇదీ వ్యూహం
పరీక్ష ఏప్రిల్లో. ఇప్పటి నుంచి దాదాపు 4 నెలల సమయం ఉన్నందున సమయవిభజన ఇలా ఉంటే మెరుగైన ఫలితాలుంటాయి.

తొలి దశ 2 నెలల సమయంలో సగం సిలబస్‌ పూర్తికావడంతో కాస్త ఉపశమనం దొరకుతుంది. ఆపై రెండు నెలల వ్యవధిని ఎప్పటికప్పుడు తొలి సమాచారం వచ్చి చేరే విభాగాలపై (వీటినే గమనశీల సబ్జెక్టులంటారు) దృష్టి పెట్టాలి.
జనరల్‌ స్టడీస్‌లో కరెంట్‌ అఫైర్స్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, భారత రాజకీయ వ్యవస్థ- రాజ్యాంగం, భారత దేశ ఆర్థిక వ్యవస్థ వంటి విభాగాలు, పేపర్‌ - 2 గ్రామీణాభివృద్ధిలోని గ్రామీణాభివృద్ధి పథకాలు, పంచాయతీ రాజ్‌శాఖ పథకాలు, సాముదాయిక సంస్థలు, సంక్షేమ పథకాలు వంటి అధ్యాయాలనుఓపక్క సన్నద్దమవుతూ మరో పక్క వాటికి అనుసంధానమయ్యే తాజా సమాచారాన్ని వర్తమాన విషయాల నుంచి క్రోడీకరించుకుంటూ ఉండాలి. గమనశీల అధ్యాయాల సన్నద్థత మాత్రం చివరి వరకు సాగుతునే ఉండాలి. దీని పుల్‌స్టాప్‌ లేదు.

స్వీయ మదింపు
రెండు దశల సన్నద్ధ్దతలో ప్రతి విభాగంలో అధ్యయనం తర్వాత టాపిక్‌ వారీగా ప్రశ్నలకు జవాబులు గుర్తించడం, ఆపై మొత్తం విభాగం పూర్తయిన తర్వాత సాధన ప్రశ్నలు చేయడం అంతర్భాగంగా జరగాలి. అలా చేయగలిగినప్పడే పునశ్చరణకు వినియోగించే 15 రోజుల తుది సన్నద్ధత ఫలవంతమవుతుంది. రెండు దశల సన్నద్ధత పూర్తయిన తర్వాత పేపర్‌ వారీగా సాధన ప్రశ్నపత్రాలను వ్యవధి నిర్దేశించుకొని చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయితే వడపోత పరీక్ష దగ్గరకు వస్తుంది. పరీక్ష రాశాక ప్రశ్నపత్ర విశ్లేషణ చేసుకొని సన్నద్ధతలో లోపాలను నిజాయతీగా గుర్తించి ప్రధాన పరీక్షకు ఉపక్రమించాలి. నాలుగు దశాబ్దాలు సాగే ఉద్యోగపు సాధనకు 4 నెలల నిబద్ధతతో కూడిన సన్నద్ధతే పెట్టుబడి. ఈ పెట్టుబడిని లోభత్వం లేకుండా ఎంత పెట్టగలిగితే అంతగా విజయావకాశాలుంటాయి.

నోటిఫికేషన్ వెబ్‌సైట్‌‌

Posted on 22.12.2018