BITSAT

బిట్స్‌ సీటు.. ఇదిగో రూటు!

* అడ్మిషన్ల ప్రకటన విడుదల
* ఆన్‌లైన్‌ పరీక్ష.. బిట్‌శాట్‌

ఐఐటీలతో సరితూగే ఉత్తమ విద్యాసంస్థల్లో ప్రముఖమైనది...బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌). అంతర్జాతీయ స్థాయి బోధన పద్ధతులను దేశీయంగా అవలంబిస్తున్న ఈ విశిష్ట సంస్థ.. అడ్మిషన్ల ప్రకటనను ఇటీవలే వెలువరించింది. ఇక్కడ ఇంజినీరింగ్‌ తోపాటు బీఫార్మసీ, ఎమ్మెస్సీ కోర్సులున్నాయి. బిట్స్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (బిట్‌శాట్‌)లో మంచి స్కోరు సాధించినవారు పిలానీ, గోవా, హైదరాబాద్‌ క్యాంపసుల్లో చదువుకోవచ్చు. ఇంటర్‌ మ్యాథ్స్‌, సైన్స్‌ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు.

నాణ్యమైన ఇంజినీరింగ్‌, సైన్స్‌ కోర్సులు చదువుతూనే పరిశోధనకు ఆస్కారం, పారిశ్రామిక అనుభవం పొందాలనుకుంటే బిర్లా సంస్థలు చక్కని గమ్యస్థానం. అందించే కోర్సుల ద్వారా సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందింపజేస్తూ సమాజావసరాలకు అనుగుణంగా ఆధునికీకరిస్తూ ఉంటారు. విద్యార్థి తన ఆసక్తికి అనుగుణంగా కోర్సులను ఎంచుకునే వెసులుబాటు (ఫ్లెక్సిబుల్‌ లర్నింగ్‌) బిట్స్‌ ప్రత్యేకత. ఇక్కడ చదివినవారికి మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇంటర్మీడియట్‌ చదివినవారికి మూడు రకాల ఇంటిగ్రేటెడ్‌ ఫస్ట్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తోంది బిట్స్‌. (ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీలో చదువుతున్న ప్రధాన కోర్సుతో పాటు విద్యార్థి ఆసక్తి, ప్రతిభలను బట్టి మైనర్‌ ప్రోగ్రాంలో కోర్సులనూ పూర్తిచేయవచ్చు).

* బీఈ: కెమికల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎల‌్రక్టికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎల‌్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఎల‌్రక్టానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెకానికల్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, బయో టెక్నాలజీ విభాగాలు.
* బీఫార్మసీ: ఈ కోర్సుకు ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు ఉంది.
* ఎమ్మెస్సీ: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయలాజికల్‌ సైన్సెస్‌, ఎకనామిక్స్‌, జనరల్‌ స్టడీస్‌.
అర్హత: ఇంజినీరింగ్‌, ఎమ్మెస్సీ కోర్సులకు ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్‌ తప్పనిసరి. బీఫార్మసీకి బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో సంబంధిత గ్రూప్‌లో కనీసం 75 శాతం మార్కులు సాధించాలి. సంబంధిత సబ్జెక్టుల్లోనూ విడిగా 60 శాతం మార్కులు ఉండాలి. 2020లో పరీక్షలు రాస్తున్నవారు, 2019లో ఉత్తీర్ణులు మాత్రమే అర్హులు.

ముఖ్య తేదీలు
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31
ఆన్‌లైన్‌ పరీక్షలు: మే 16 నుంచి 25 వరకు
వెబ్‌సైట్‌:www.bitsadmission.com

ప్రాక్టీస్‌ స్కూల్‌
అకడమిక్స్‌, పరిశ్రమలకు మధ్య చక్కని వారధిగా బిట్స్‌ ప్రాక్టీస్‌ స్కూల్‌ విద్యార్థికి ఉపయోగపడుతుంది. బోధనలో నేర్పే అంశాలకు పారిశ్రామిక రంగాన్ని జత చేయడం ద్వారా అనుభవపూర్వకంగా విద్యార్థులు తమ సబ్జెక్టుల్లో పరిపూర్ణత పొందే వీలు దీనిద్వారా కలుగుతుంది. సంబంధిత పరిశ్రమలు, కంపెనీల్లో పనిచేస్తున్న నిపుణుల పర్యవేక్షణలో విద్యార్థి తాను నేర్చుకున్న విషయాల ఆచరణాత్మకతను గ్రహించడానికి ఇదో మంచి అవకాశం. రెండేళ్ల కోర్సు పూర్తిచేశాక ప్రాక్టీస్‌ స్కూల్‌-1 ద్వారా 8 వారాల శిక్షణ పొందవచ్చు. ఇది సాధారణంగా వేసవి సెలవుల్లో ఉంటుంది. దీనితర్వాత ఐదున్నర నెలల పాటు ప్రాక్టీస్‌ స్కూల్‌-2 ద్వారా విద్యార్థి విభిన్న పరిశ్రమలు, కంపెనీల్లో రకరకాల ప్రాజెక్టుల్లో పనిచేయవచ్చు.

కటాఫ్‌ ఎంత?
బిట్‌శాట్‌ కటాఫ్‌ స్కోర్లు ఏయేటి కాయేడు పెరుగుతున్నాయి. బిట్‌శాట్‌ -2019 స్కోరుతో పిలానీ క్యాంపస్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ కటాఫ్‌ 383. గోవా క్యాంపస్‌ 352, హైదరాబాద్‌ క్యాంపస్‌ 342గా ఉన్నాయి. ఎల‌్రక్టికల్‌ అండ్‌ ఎల‌్రక్టానిక్స్‌ ఈ మూడు క్యాంపస్‌ల్లోనూ వరుసగా 341, 310, 308గా ఉన్నాయి. 2020 పరీక్షకు కటాఫ్‌లు మారవచ్చు. కనీసం 260 మార్కులు సాధించినవారికి ఏదో ఒక ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌లో సీటు దక్కే వీలుంది. కెమికల్‌, సివిల్‌ బ్రాంచీల కంటే ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో చేరడానికి గత ఏడాది ఎక్కువ మంది ఆసక్తి చూపారు. అందువల్ల ఎమ్మెస్సీ కటాఫ్‌ స్కోర్‌ వాటికంటే ఎక్కువగా ఉంది.

బిట్‌శాట్‌ ఇలా...
ఇది ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఉంటుంది. ఇందులో 4 విభాగాలుంటాయి.
పార్ట్‌ -1: ఫిజిక్స్‌ 40,
పార్ట్‌- 2: కెమిస్ట్రీ 40,
పార్ట్‌- 3: ఎ. ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ 15, బి. లాజికల్‌ రీజనింగ్‌ 10,
పార్ట్‌- 4: మ్యాథ్స్‌ / బయాలజీ (బీఫార్మసీ కోసం) 45 ప్రశ్నలు వస్తాయి. మొత్తం 150 ప్రశ్నలు. వీటికి 3 గంటలు కేటాయించారు. సరైన జవాబుకు 3 మార్కులు. తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు.
బోనస్‌ ప్రశ్నలు: నిర్ణీత సమయం కంటే ముందే ప్రశ్నలన్నింటికీ జవాబులు గుర్తించినవారికి అదనంగా 12 ప్రశ్నలు లభిస్తాయి. వీటికి సరైన సమాధానాలు గుర్తిస్తే మార్కులూ అదనంగా లభిస్తాయి. మ్యాథ్స్‌/ బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ఒక్కో సబ్జెక్టు నుంచి 4 చొప్పున ఇవి వస్తాయి. బోనస్‌ ప్రశ్నలను ఆన్సర్‌ చేస్తూ లేదా చేసిన తర్వాత కానీ మొదటి 150 ప్రశ్నలను తిరిగి చూసుకోవడానికి గానీ, వాటి సమాధానాలను మార్చడానికి గానీ సాధ్యం కాదు. అత్యుత్సాహంతో బోనస్‌ ప్రశ్నలను ఎంచుకునేకంటే మొదటి 150 ప్రశ్నలను జాగ్రత్తగా ఆన్సర్‌ చేయడం మేలు.
ఇంటర్‌ పరీక్షల్లో వివిధ బోర్డుల్లో టాపర్లుగా నిలిచినవారు బిట్‌శాట్‌ రాయకుండానే నేరుగా ప్రవేశం పొందవచ్చు. మెరిట్‌ విద్యార్థులకు ఉపకార వేతనం లభిస్తుంది. ప్రతిభ, అవసరాల ప్రాతిపదికన వీరికి 15 నుంచి వంద శాతం ట్యూషన్‌ ఫీజులో రాయితీ లభిస్తుంది. ప్రతి సంవత్సరం 30 శాతం మంది విద్యార్థులు ఈ తరహా ప్రోత్సాహకాలను అందుకుంటున్నారు. బిట్‌శాట్‌ స్కోర్‌తో నిట్‌ (ఎన్‌ఐఐటీ) యూనివర్సిటీ ప్రవేశాలు కల్పిస్తోంది.

ఇలా చదివితే స్కోరింగ్‌
ప్రస్తుతం బోర్డు పరీక్షలు సమీపిస్తున్న సమయం కాబట్టి సబ్జెక్టులను చదువుతూనే ప్రాథమిక భావనల పట్ల అవగాహన పెంచుకోవాలి. బోర్డు పరీక్షల తర్వాత బిట్‌శాట్‌కు కేటాయించే సమయం పెంచుకోవచ్చు. జేఈఈ పరీక్ష స్థాయితో పోలిస్తే బిట్‌శాట్‌ కొంత సులభమైనదే. కాకపోతే పరీక్షలో అడిగే ప్రశ్నల సరళి, సబ్జెక్టుల విభాగాల్లో అంతరం ఉంది. దరఖాస్తుదారుల సంఖ్యకూ, వారికి లభ్యమయ్యే సీట్ల సంఖ్యకూ ఉన్న నిష్పత్తిపరంగా పోలిస్తే మాత్రం జేఈఈ కంటే బిట్‌శాట్‌లోనే పోటీ ఎక్కువ అని చెప్పొచ్చు.
* బిట్‌శాట్‌కు తయారయ్యే విద్యార్థులు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ లేదా బయాలజీ సబ్జెక్టుల్లో 11, 12 తరగతుల ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను సిలబస్‌కు అనుగుణంగా చదవాలి.
* సిద్ధమయ్యేటపుడు ముఖ్యమైన పాయింట్లు, ఫార్ములాలు, గ్రాఫులను షార్ట్‌నోట్స్‌ రూపంలో రాసుకోవాలి. వాటిని పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి.
* ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ, లాజికల్‌ రీజనింగ్‌ల కోసం మార్కెట్లో చాలా పుస్తకాలు లభ్యమవుతున్నాయి.
* అన్ని విభాగాల్లో సమతుల్యంగా పట్టు సాధించడానికి వీలైనన్ని నమూనా టెస్టులు సాధన చెయ్యడం మంచిది. బిట్స్‌ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా మాదిరి ప్రశ్నపత్రం దొరుకుతుంది. వీటి సాధన ద్వారా సమయపాలనపై నియంత్రణ సాధించాలి.
* తేలికపాటి ప్రశ్నలను త్వరగా ఆన్సర్‌ చేసి; కఠినంగా, ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలను చివర్లో ఆన్సర్‌ చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. మాక్‌ టెస్టుల ద్వారా ఈ పద్ధతి అలవడితే అసలు పరీక్షను కంగారుపడకుండా ధైర్యంగా ఎదుర్కోవచ్చు.
* రుణాత్మక మార్కుల వల్ల తుది స్కోరు లేదా మార్కులు తగ్గుతాయి. అందుకే ప్రశ్నకు సమాధానం సరైనదని పూర్తిగా నమ్మితేనే దాన్ని గుర్తించాలి. లాటరీ పద్ధతిలోనో, ఊహించో సమాధానం గుర్తించడం నష్టదాయకమని మర్చిపోవద్దు.
* నమూనా టెస్టులతో పాటు గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను కూడా సాధన చేస్తే మంచిది. దీనివల్ల బిట్‌శాట్‌లో ఇచ్చే ప్రశ్నల స్థాయి, సరళిలపై అవగాహన పెరుగుతుంది.
* అనుభవం పెంచుకోవడానికి సాధన చేసే టెస్టులన్నీ ఆన్‌లైన్‌ పద్ధతిలోనివి ఎంచుకుంటే చాలా మేలు జరుగుతుంది.


కొండముది రవీంద్రకుమార్‌

Posted on 03-02-2020