Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

AP Economic Survey 2017-18

ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక గణన 2017-18

ఆంధ్రప్రదేశ్ 'సామాజిక ఆర్థిక గణన 2017-18' నివేదికను ప్రభుత్వం 2018 మార్చి 8న శాసనసభలో ప్రవేశపెట్టింది.
ముఖ్యంశాలు:
* అవరోధాలు అధిగమిస్తూ అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, సేవా రంగాల్లో సానుకూల ఫలితాలు సాధిస్తోంది. తలసరి ఆదాయంలో మెరుగైన వృద్ధి కనబరుస్తోంది.
* రంగాలవారీ ప్రాధాన్యంలో భాగంగా వ్యవసాయంలో కరవు నివారణ చర్యలను నివేదిక వివరించింది. సంక్షేమానికి ఏటా రూ. 60వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ప్రతి కుటుంబానికీ రూ. 10వేల ఆదాయం అందించే పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించింది.
* ప్రభుత్వం ఈ ఏడాది 2358 డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేస్తోంది. 3500 పాఠశాలల్లో వర్చువల్ తరగతులను అంతర్జాల సౌకర్యంతో అందుబాటులోకి తెస్తోంది.
* 2016-17 ఖరీఫ్‌లో 39.70 లక్షల హెక్టార్లలో సాగవ్వగా 2017-18 ఖరీఫ్‌లో 40.72 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. 2016-17లో 149.16 లక్షల టన్నులు పండించగా ఈ ఏడాది అంచనా 157.59 టన్నులు.
* కర్నూలు జిల్లా తంగెడంచలో 579 ఎకరాల విస్తీర్ణంలో రూ. 650 కోట్ల వ్యయంతో మెగాసీడ్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు.
* రాష్ట్రంలో మత్స్యరంగం 14.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. 2017-18లో రొయ్యల ఎగుమతిలో దేశంలో తొలిస్థానం, ఉత్పత్తిలో 70 శాతం వాటా రాష్ట్రానిదే. కోడిగుడ్ల ఉత్పత్తిలో రూ.1582.74 కోట్లతో రెండోస్థానం, మాంసం ఉత్పత్తిలో 4, పాల ఉత్పత్తిలో 5వ స్థానం ఏపీదే.
* పట్టణ ప్రజలకు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, ఎన్టీఆర్ వైద్య పరీక్షలు, చంద్రన్న సంచార చికిత్స, జాతీయ ఉచిత డయాలసిస్, ఆరోగ్య ఏటీఎంలు, ముఖ్యమంత్రి బాల స్వస్థ్య భరోసా, స్వస్థ్య విద్యావాహిని పథకాలను ప్రారంభించారు. ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా 14.08 లక్షల మందికి శస్త్ర చికిత్సలు చేశారు.
* చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడానికి రూ. 100 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేశారు. 13 శాఖలకు సంబంధించి 1946 చిన్న, పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయి.
* రూ. లక్ష వరకు పంట రుణాలకు వడ్డీలేని రుణాల పథకం కింద 2016-17లో రూ. 249.48 కోట్లు చెల్లించారు. రూ. 3 లక్షల లోపు పంటరుణం తీసుకుని ఏడాదిలోగా చెలించిన వారికి పావలా వడ్డీ కింద రూ. 5.43 కోట్లు జమ చేశారు. 2017-18లో ఇప్పటిదాకా వడ్డీలేని రుణాలకింద రూ.128.41 కోట్లు, పావలా వడ్డీ కింద రూ.3.45 కోట్లు అందజేశారు.
* చంద్రన్న చేయూత ద్వారా 87 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ. 8604 కోట్లు పంపిణీ చేశారు.
తలసరి ఆదాయం పెరిగింది
* రాష్ట్రంలో తలసరి ఆదాయం నాలుగేళ్లలో దాదాపు 50 శాతం పెరిగింది. జాతీయ సగటుతో పోల్చినా తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉంది. 2015-16లో రూ 1,07,276, 2016-17లో రూ. 1,23,664, 2017-18 (అంచనా) రూ.1,42,054గా తలసరి ఆదాయం నమోదైంది.

వృద్ధి జాతీయం కన్నా ఎక్కువే:
* సుస్థిర కృషి, వినూత్న విధానాల వల్ల రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటును సాధిస్తూ వస్తోంది. ప్రభుత్వ ప్రత్యేక వ్యూహాలు రెండంకెల అభివృద్ధి సాధన దిశగా విజయవంతమైన ఫలితాలు ఇచ్చాయి. గత మూడేళ్లలో ఏపీ వృద్ధిరేటు సగటున 10.96 శాతం నమోదవ్వగా, భారత ఆర్థిక వ్యవస్థ 7.31 శాతం మాత్రమే ఉంది.

ఎగుమతుల్లో పురోగమనం:
* ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ది తొమ్మిదో ర్యాంకు. మొత్తం ఎగుమతుల్లో 2.80% వాటా. 2016-17లో మొత్తం ఎగుమతులు రూ. 80460 కోట్ల డాలర్లుగా ఉన్నాయి.
* సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ది కీలకపాత్ర.
* వివిధ రంగాలకు సంబంధించి రాష్ట్రంలో 83 ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు) పనిచేస్తున్నాయి.
* వాహనాలు, విమాన, నౌకా, తత్సంబంధిత రవాణా పరికరాల ఎగుమతులు ఏపీ నుంచి ఎక్కువగా జరుగుతున్నాయి.
ఆర్థిక వృద్ధికి నూతన జవసత్వాలు:
* గత రెండేళ్లుగా సగటున రాష్ట్రంలో జీఎస్‌డీపీ వృద్ధిరేటు 11.28% నమోదవుతోంది.
* 2016-17లో దాదాపు 57 పెద్ద, మెగా పారిశ్రామిక ప్రాజెక్టుల ఏర్పాటు. 23,756 మందికి ఉపాధి కల్పన. వ్యవస్థీకృత రంగంలో 9,900 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుచేసి 1,07,609 మందికి ఉపాధి కల్పన.
* ప్రైవేటు నిర్మాణ సంస్థల సహకారంతో ప్రభుత్వం 'ఆర్థిక నగరాల్ని' నిర్మిస్తోంది. విద్య, ఆరోగ్యం, షాపింగ్, వినోదాల విషయంలో స్వయం సమృద్ధిని సాధించేలా ఇవి ఉంటాయి.
* శిక్షణ పొందిన మానవ వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయి.
పెట్టుబడులకు ఊతం:
* గత మూడున్నరేళ్లలో రాష్ట్రానికి హామీగా లభించిన రూ. 1,31,500 కోట్ల పెట్టుబడులతో ఇప్పటికే వివిధ రంగాల్లో ఉత్పత్తి మొదలైంది. మరో రూ. 3,14,200 కోట్ల పెట్టుబడులు పురోగమన దశలో ఉన్నాయి. ప్రపంచంలోని అనేక దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి.
సమర్థ పాలనే లక్ష్యం:
* సమర్థ పాలనే లక్ష్యంగా ప్రభుత్వం వినూత్న రీతిలో అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో 'ఆర్‌టీజీ' కేంద్రాన్ని నెలకొల్పింది. ప్రభుత్వ పథకాల అమలు తీరు నుంచి భూగర్భ జలాల లభ్యత, వాతావరణ పరిస్థితులు, ముఖ్యమైన సంఘటనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.
* 'ఇ-ప్రగతి' పేరుతో నెలకొల్పిన రాష్ట్రవ్యాప్త 'ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్చర్' 33 ప్రభుత్వశాఖలు, 315 విభాగాలు, 745 సేవల తీరు తెన్నులను పర్యవేక్షిస్తుంది.
* వివిధ విభాగాల పరిపాలనా వ్యవహారాలను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కీలకంగా పనిచేస్తున్న 'కోర్' (చీఫ్‌మినిస్టర్స్ ఆఫీస్ రియల్‌టైమ్ ఎగ్జిక్యూటివ్) డ్యాష్‌బోర్డు దేశావ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది.దీన్ని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తే మేలని నీతిఆయోగ్ సూచించింది.
* ఆసియాలోనే అతిపెద్ద కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 13 జిల్లాల కేంద్రాలతో సంపూర్ణ అనుసంధానం రాష్ట్ర వ్యాప్తంగా 25,000 కిమీ ఫైబర్‌గ్రిడ్ ద్వారా ఆర్‌టీజీ పర్యవేక్షణ.
ఆర్‌టీజీ పర్యవేక్షణలో తెలిసే అంశాలు:
* సెన్సార్ల ద్వారా భూగర్భ జలాల పర్యవేక్షణ, వాతావరణ పరిస్థితులపై అంచనా, రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి లభ్యతపై పర్యవేక్షణ, ఈ-ఔషధి, బయోమెట్రిక్, ఐరిస్ ద్వారా ఎన్టీఆర్ భరోసా పథకం అమలు తీరుతెన్నులపై నిఘా, వీధి దీపాల నిర్వహణపై పర్యవేక్షణ, పోలీసు సీసీ కెమెరాలు, మొబైల్ అప్లికేషన్ ద్వారా గ్రామీణాభివృద్ధి కార్యకలాపాల నిర్వహణ.
ఇతర ముఖ్యాంశాలు:
* పండ్లు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ఏపీది మొదటి స్థానం. మిర్చి, కోకో, నిమ్మ, ఆయిల్ పామ్, బొప్పాయి, టమోటా, ఉత్పదకతలోనూ తొలిస్థానం.
* జీడిమామిడి, మామిడి, బత్తాయిలో రెండోస్ధానంలో నిలిచింది.
* 2016-17లో రాష్ట్రం నుంచి రూ. 80,559.87 కోట్ల ఎగుమతులు జరిగాయి. కాగా 2017-18లో (నవంబరు వరకూ) రూ. 50,404.75 కోట్లు విలువైన ఎగుమతులు జరిగాయి. రాష్ట్రం నుంచి ఎగుమతుల్లో ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాణాధార మందులు, ఖనిజాలు, ఖనిజ ఉత్పత్తులు, సాఫ్ట్‌వేర్ ఉన్నాయి.
* 2017-18లో జీఎస్‌డీపీ పెరుగుదల రేటు 11.22 శాతం. రాష్ట్ర పన్నుల ఆదాయం రూ. 52,717 కోట్లు.
* 2018లో నిర్వహించిన మూడో భాగస్వామ్య సదస్సులో 737 ఎంవోయూలు, 4.39 లక్షల కోట్ల పెట్టుబడులు, 11 లక్షల ఉద్యోగాలు లెక్కతేలాయి.
* 2017-18 డిసెంబరు నాటికి ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పన 43,987 గా ఉంది.
* రాష్ట్రంలో పేదరికం 9.2 శాతం (దేశంలో 21.92 శాతం) గా ఉంది.
* ఎల్‌పీజీ కనెక్షన్లలో ఏపీదే తొలిస్థానం. 2017-18లో 12.46 లక్షల కనెక్షన్లు ఇచ్చారు.
* గతేడాది 95.36 లక్షలుగా ఉన్న వాహనాలు ఇపుడు 103.58 లక్షలకు చేరాయి.
* చౌకదుకాణాల్లో ఈ-పోస్ యంత్రాల అమలుతో రూ. 1525.87 కోట్లు మిగులు.
* ఎన్టీఆర్ భరోసా కింద 58 లక్షల మంది ఫించన్లు తీసుకుంటున్నారు. ప్రధానమంత్రి -చంద్రన్న భీమా పథకంలో 2.46 కోట్ల మంది నమోదయ్యారు.
* జీవీఏ అంచనాలు (రంగాల వారీగా రూ.కోట్లలో)

సంవత్సరం వ్యవసాయం పారిశ్రామికం సేవలు
2015-16 1,20,927 1,22,588 2,02,688
2016-17 1,38,957 1,31,657 2,21,760
2017-18 1,63,635 1,42,837 2,41,967