Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2015 - 16

2016 మార్చి 10న రాష్ట్ర బడ్జెట్‌తోపాటు సామాజిక, ఆర్థిక సర్వే 2015 - 16ను కూడా ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశపెట్టారు.
ముఖ్యాంశాలు:
ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో రాటుదేలుతోంది. విభజన సమస్యల్ని అధిగమిస్తూ అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోంది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు సంపూర్ణంగా అమలు కాకపోయినా, ఆర్థిక వనరులు అంతంత మాత్రంగానే ఉన్నా, నిత్యం శ్రమించే రాష్ట్ర ప్రజల విలక్షణ లక్షణంతో అభివృద్ధి అంకెల్లో దూసుకుపోతోంది. స్థూల రాష్ట్రోత్పత్తిలో 10.99 శాతం నికర వృద్ధిరేటుతో జాతీయ సగటుకు (7.6 శాతం) అందనంత ఎత్తులో ఉంది. పన్నులు, రాయితీలు పక్కనబెట్టి వేసే స్థూల వృద్ధిరేటు లెక్కల్లోనూ 10.5 శాతంతో జాతీయ సగటు (7.3 శాతం) కంటే చాలా ముందుంది. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో చెప్పుకోదగ్గ పనితీరుతో సమవృద్ధి లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ప్రశంసనీయ ప్రగతిని కనబరుస్తోందని ఆర్థిక సర్వే వ్యాఖ్యానించింది. ''ఏపీ పునర్విభజన చట్టంలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు, పలు రంగాల్లో రాష్ట్రాన్ని ఆదుకుంటామని రాజ్యసభలో నాటి ప్రధాని చేసిన భరోసా ఇంతవరకు నెరవేరలేదు. కొద్ది నెలలుగా ఆర్థిక సంఘం నుంచి వస్తున్న మద్దతు కూడా అంత ప్రోత్సాహకరంగా లేదు. చేయూతనివ్వాలని అభ్యర్థించినా రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది లేదు. రాష్ట్రాలకు వాటి అర్హతను బట్టి ఇచ్చే మొత్తాలే ఏపీకి ఇచ్చారు. తాజా కేంద్ర బడ్జెట్లోనూ ఏపీకి చెప్పుకోదగ్గ ప్రత్యేక కేటాయింపులేవీ లేవు" అని పేర్కొంది.
     
వృద్ధిరేటు
2011-12 ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికగా 2015-16 స్థూల రాష్ట్రోత్పత్తి రూ.4,93,641 కోట్లు. అంతకు ముందు సంవత్సరం అది రూ.4,44,752 కోట్లుగా ఉంది. దీని ప్రకారం నికర వృద్ధిరేటు 10.99 శాతంగా తేలింది. ప్రస్తుత ధరల ప్రకారమైతే రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.6,03,376 కోట్లు. వచ్చే ఏడాది వృద్ధిరేటు లక్ష్యాన్ని 15 శాతంగా పెట్టారు.
ఆదాయాలు-అప్పులు
ముగుస్తున్న ఆర్థిక సంవత్సరానికి ఏపీ సర్కారు తీసుకున్న మొత్తం రుణాలు రూ.1,70,115 కోట్లు. దీన్ని రాష్ట్ర పౌరులకు పంచితే తలసరి అప్పు దాదాపు రూ.37800 అవుతుంది. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం లక్ష దాటింది. గత ఏడాది రూ.95,689 ఉండగా, ఈ ఏడాది 1,07,532కి పెరిగింది. 12.38 శాతం వృద్ధి నమోదైంది.
రంగాలవారీగా జీడీపీ

రంగం లక్షల కోట్లు శాతం వృద్ధిరేటు
వ్యవసాయం
మత్స్యం
పశు సంపద
ఉద్యాన పంటలు
పారిశ్రామికం
సేవలు
1.64
-
-
-
1.32
2.62
29.42
32.78
11.22
9.96
23.62
46.96
8.40
-
-
-
11.13
11.39
సర్వేలోని ముఖ్యాంశాలు..
జనాభా
ఏపీ 4.95 కోట్ల మందితో జనాభా పరంగా పదో అతిపెద్ద రాష్ట్రంగా అవతరించింది. దేశ జనాభాలో ఏపీ వాటా 4.1 శాతం. ఆంధ్రప్రదేశ్ జనాభా డెబ్బయి, ఎనభై దశకాల్లో శరవేగంగా పెరిగి ఆ తర్వాత బాగా తగ్గుముఖం పట్టింది. గడచిన దశాబ్దపు జనాభా వృద్ధిరేటు కేవలం 9.21 శాతం. జాతీయ సగటు 17.72 కంటే చాలా తక్కువ. అంతకుముందు దశాబ్దపు ఏపీ జనాభా వృద్ధిరేటు 11.89 శాతంగా ఉంది. రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 17.08 శాతం, ఎస్టీలు 5.53 శాతం ఉన్నారు.
మానవాభివృద్ధి
అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ బాగా వెనుకబడింది. జాతీయ సగటు 72.98 శాతంతో పోలిస్తే 67.35 శాతంతో బాగా వెనుకబడింది. మహిళా అక్షరాస్యత కూడా జాతీయ సగటు(64.64 శాతం) కంటే చాలా తక్కువగా (59.96 శాతం) ఉంది. రాష్ట్రంలో పట్టణీకరణ ఉద్ధృతంగా జరుగుతోంది. పదేళ్లలో పట్టణ జనాభా 24.13 శాతం నుంచి 29.47 శాతానికి పెరిగింది. ఏపీలో జన సాంద్రత చదరపు కిలోమీటరుకు 304 మంది. దేశ సగటు 368 మంది.
పేదరికం
రాష్ట్రంలో ఒకవైపు 90 శాతం మంది ప్రజలకు పేదరికం ప్రాతిపదికగా సామాజిక సంక్షేమ కార్యక్రమాలు భారీగా సాగుతున్నాయి. మరోపక్క పేదరికం పదిశాతం కూడా లేదని ఆర్థిక సర్వే చెబుతోంది. పల్లెల్లో పేదరికం 10.96 శాతం, పట్టణాల్లో 5.81 శాతం ఉన్నాయని పేర్కొంది. సగటున రాష్ట్రంలో 9.20 శాతం మాత్రమే పేదరికం ఉందని తేల్చింది. జాతీయ సగటు 21.92తో పోలిస్తే రాష్ట్రం చాలా మెరుగైన పరిస్థితిలో ఉన్నట్లే లెక్క.పేదరికం రాష్ట్రంలో ఏటా తగ్గుతోందని తెలిపింది.
సాగు లేదు బాగు
రాష్ట్ర భూభాగంలో కేవలం 38.31 శాతమే ఏటా సాగవుతోంది. 22.51 శాతం అడవులు, 12.3 శాతం వ్యవసాయేతర వినియోగంలో ఉండగా, మిగిలినవి తోటలు, బీళ్లు, పోడు భూములు, చిత్తడి నేలలుగా ఉన్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది 41.30 లక్షల హెక్టార్లలో ఆహార పంటల సాగు జరిగింది. అంతకుముందు ఏడాది కంటే ఇది 4.21 శాతం అధికం. 137.56 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పండించారు. గత ఏడాదితో పోలిస్తే 160.03 లక్షల టన్నులు (14.04 శాతం తగ్గింది). ఉద్యాన పంటల సాగు 14.74 లక్షల హెక్టార్లలో జరుగుతోంది. 188.22 లక్షల టన్నులు ఉత్పత్తవుతోంది.
పశువులు ఆదుకున్నాయి
రాష్ట్రం కరవుతో అల్లాడుతున్నా ప్రజలు ఎలా నెగ్గుకొస్తున్నారన్న ప్రశ్నకు ఆర్థిక సర్వే సమాధానం ఇచ్చింది. రాష్ట్రంలో సగం (49.38 శాతం) కుటుంబాలకు పశు పోషణ అదనపు ఆదాయ వనరుగా ఉంది. కోడిగుడ్ల ఉత్పత్తిలో దేశంలో రెండో స్థానంలో (ఏడాదికి 1309 కోట్ల గుడ్లు) ఉంది. మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానం (5 లక్షల టన్నులు), పాల ఉత్పత్తిలో ఆరో స్థానం (96 లక్షల టన్నులు) సంపాదించింది. ఈ రంగం స్థూల రాష్ట్రోత్పత్తికి దాదాపు 9 శాతం అందిస్తోంది.
మత్స్యావతారం
ఏపీ అభివృద్ధి గణాంకాల్లో మత్స్యరంగం విశ్వరూపం ప్రదర్శించింది. చేపలు, రొయ్యల ఉత్పత్తి తొమ్మిదేళ్లలో రెండున్నర రెట్లయ్యింది. ఏటా పది శాతం వృద్ధిరేటును సాధిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరుకే 16 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించింది. క్రమంగా ఏపీ ప్రపంచానికే మత్స్య సంపద కేంద్రంగా మారుతోంది. వ్యవసాయం కుంటుతున్నా పశుపోషణ, మత్స్య రంగాలు దూసుకుపోతుండటం వల్లే వృద్ధిరేటు రెండంకెలు దాటింది.
సామాజిక ప్రయోజనం
ప్రతి నెలా 43 లక్షల మందికి పింఛను అందజేస్తున్నారు. అతిపెద్ద సామాజిక భద్రత పథకం ఇది. ఎన్టీఆర్ వైద్యసేవ కింద వైద్య సేవల ఖర్చు పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచారు. 1038 రోగాలకు ఇందులో కవరేజీ లభిస్తుంది. శిశు మరణాల రేటు 39కి, మాతా మరణాల రేటు 92కి తగ్గింది. రాష్ట్రంలో బడి మధ్యలో మానేసిన పిల్లల సంఖ్య ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. గత ఆర్థిక సంవత్సరం 1-5 తరగతుల మధ్య బడి మానేసిన పిల్లలు 8.76 శాతం ఉండగా 1-8 తరగతుల మధ్య 14.75 శాతం మంది ఉన్నారు. 1 నుంచి 10 తరగతుల మధ్య 23.87 శాతం ఉన్నారు. పైతరగతుల్లో ఎక్కువ మంది బడి మానేస్తున్నారు. చేతికి అందిన పిల్లల్ని కుటుంబ పోషణ కోసం ఉపాధికి మళ్లిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.
విద్యుత్: ఆంధ్రప్రదేశ్ 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యంగా పని చేస్తోంది. 1.87 కోట్ల ఎల్ఈడీ బల్బుల పంపిణీతో ఏటా 112 కోట్ల యూనిట్ల విద్యుత్ ఆదా చేస్తోంది. వ్యవసాయ పంపుసెట్ల మార్పిడి కార్యక్రమాన్నీ చేపడుతోంది. ఇంధన సామర్థ్యంలో ఏపీ ట్రాన్స్‌కో 5 జాతీయ అవార్డులు గెలుచుకుంది.
పారిశ్రామికం: ఏపీని పారిశ్రామిక రాష్ట్రంగా మలచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పెట్టుబడిదారులకు ఇబ్బందులు లేకుండా సింగిల్ డెస్క్ పోర్టల్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రూ.18,431 కోట్ల పెట్టుబడులతో 66 భారీ పరిశ్రమల నిర్మాణం జరుగుతోంది. రూ.11,464 కోట్ల పర్యాటక ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, సరకు రవాణా సౌకర్యాల కల్పన పెద్ద ఎత్తున సాగుతోంది. మందులు, ప్లాస్టిక్‌లు, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, సాఫ్ట్‌వేర్ తదితరాలు కలిపి ఎగుమతుల విలువ రూ.19,183.74 కోట్లకు చేరుకుంది.
పప్పుల కొరత లేదు: అననుకూల వాతావారణం వల్ల రాష్ట్రంలో ఆహార ధాన్యాల దిగుబడి తగ్గిపోయింది. అయితే పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిలో మాత్రం గణనీయమైన పెరుగుదల ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పప్పు ధాన్యాల దిగుబడి 12.65 లక్షల టన్నులు ఉండొచ్చని ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 33 శాతం పెరుగుదల అని తేల్చింది. నూనె గింజల ఉత్పత్తి కూడా 8.69 లక్షల టన్నులు ఉండగలదని, ఇది 47 శాతం పెరుగుదలను సాధిస్తుందని అంచనా.
కరవుతో ఎరువు బరువు: కరవు వల్ల పంట విస్తీర్ణం తగ్గడంతో ఎరువుల వినియోగమూ తగ్గింది. పురుగు మందుల వినియోగం కూడా తగ్గుతూ వచ్చింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 4,050 మెట్రిక్ టన్నుల పురుగు మందులు వాడితే ఈ దఫా గత సెప్టెంబరు నాటికి 1,180 మెట్రిక్ టన్నులే ఉపయోగించారు. వ్యవసాయ యాంత్రీకరణ వ్యయం పెరిగింది.
ద్విచక్రవాహనాలే అత్యధికం
డిసెంబరు నాటికి రాష్ట్రంలో 85.05 లక్షల వాహనాలు ఉన్నాయి. రోడ్డు మీద తిరుగుతున్న వాహనాల్లో 78.19 శాతం ద్విచక్ర వాహనాలే. ఆ తర్వాత స్థానంలో కార్లు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు 11,962 ఉన్నాయి.
పర్యాటకం
పర్యాటకంలో ప్రతి ఏడాదీ 7.5 మిలియన్ల మంది పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు.
ఏడంచెల వ్యూహం
2022 నాటికి దేశంలోని మూడు అగ్రశ్రేణి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచం పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లుగా రాష్ట్రప్రభుత్వ 'సామాజిక ఆర్థిక సర్వే 2015-16' పేర్కొంది. 2029 వరకూ ప్రతిఏడాదీ రెండంకెల వృద్ధిరేటును సాధిస్తేనే లక్ష్యాన్ని చేరుకోవటం వీలవుతుందని తెలిపింది. ఈ లక్ష్యసాధనకు ఏడంచెల వ్యూహాన్ని (సెవెన్ మిషన్స్) రూపొందించినట్లు వెల్లడించింది.
1. ప్రాథమికరంగం
వ్యవసాయ, మత్స్య, పశుపోషణ రంగాలకు ప్రోత్సాహం
గ్రామీణస్థాయిలో ఆచరణ ప్రణాళిక
పంటనమూనాల అభివృద్ధి
విత్తనాలు, ఎరువులు, పోషకాల నిర్వహణ
'పంటసంజీవని' పేరుతో పొలాల్లో కుంటల నిర్మాణాన్ని ప్రోత్సహించడం
నీటి సంరక్షణ చర్యల ద్వారా కరవును రూపుమాపడం
గిడ్డంగుల నిర్వహణ, అదనపు విలువను సమకూర్చడం
2014-15లో 19.74 లక్షల టన్నులుగా నమోదైన చేపలు, రొయ్యల ఉత్పత్తిని 2020 నాటికి 40 లక్షల టన్నులకు పెంచడం
పాల ఉత్పత్తి అధికంగా ఉన్న 400 గ్రామాలపై దృష్టిపెట్టి మార్కెటింగ్ తదితర సౌకర్యాలు కల్పించడం
659 గ్రామపంచాయతీల్లో ఘనవ్యర్థాల నిర్వహణ
గ్రామపంచాయతీల్లో పౌరులకు డిజిటల్ సేవలు
2. పారిశ్రామికరంగం
రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణం
'ప్రత్యేక ఆర్థిక మండళ్లు' (సెజ్), 'జాతీయ పెట్టుబడులు, తయారీరంగ మండళ్ల' (నిమ్జ్) ఏర్పాటు.
రూ.18,431 కోట్ల పెట్టుబడులతో కూడిన 66 భారీస్థాయి పరిశ్రమల ఏర్పాటు జరుగుతోంది. వీటిద్వారా 35,886 మందికి ఉపాధి లభించనుంది.
3. సేవారంగం
'సమాచార సాంకేతిక పెట్టుబడుల మండలి' (ఐటీఐఆర్), ఎలక్ట్రానిక్ పరిశ్రమ సముదాయాల (క్లస్టర్లు) అభివృద్ధి
100 శాతం ఫైబర్ఆప్టిక్ అనుసంధానం, హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్
'ఈ-ప్రగతి' పేరుతో 33 విభాగాలు, 315 ఏజెన్సీలు, 745 సేవలను ఒక్క గొడుగు కిందికి తీసుకొస్తూ భారీ కార్యక్రమం. రానున్న రెండేళ్లలో ఇది అమలులోకి వస్తుంది. దీనిద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానం పెరుగుతుంది. పౌరులకు మెరుగైన ప్రభుత్వ సేవలు లభిస్తాయి.
4. విజ్ఞాన, నైపుణ్యాభివృద్ధి
నైపుణ్యం, విజ్ఞానంతో కూడిన సుశిక్షితులైన మానవ వనరులను సిద్ధం చేయడం
ప్రపంచస్థాయి శిక్షణకేంద్రాలను నెలకొల్పడం
కొత్త ఆలోచనలకు, పరిశోధనలకు ప్రోత్సాహం
5. సామాజికాభివృద్ధి
అంతరాలు లేని అభివృద్ధి
ఆరోగ్యం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతనిస్తూ జీవనప్రమాణాలను పెంచడం
ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించగం
6. పట్టణాభివృద్ధి
అవసరమైన సదుపాయాల కల్పన
ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల అభివృద్ధి
సామాజిక రక్షణ వ్యవస్థలు అంతర్భాగంగా సౌకర్యాల మెరుగుదల
ఉద్యోగావకాశాలు, గృహవసతి, రవాణా రంగాలకు ప్రాధాన్యం
7. మౌలిక సదుపాయాలు
ప్రాథమిక, ద్వితీయ, తృతీయ సెక్టార్లలో కనీస మౌలిక సౌకర్యాల అభివృద్ధి
పారిశ్రామిక ప్రాంతాలను నెలకొల్పడం, వాటి అభివృద్ధికి అవసరమైన సౌకర్యాలను కల్పించడం
కరెంటు సరఫరాలో అంతరాయాన్ని గణనీయంగా తగ్గించడం, సరఫరా, పంపిణీ నష్టాలను ఒక్క అంకెకు పరిమితం చేయడం.
సౌరశక్తి, పవనశక్తి ఉత్పత్తికి ప్రోత్సాహం
అయిదింట గ్రిడ్లు, ప్రచారం
లక్ష్యసాధనలో ఏడు మిషన్లకు అనుబంధంగా అయిదు గ్రిడ్లు, అయిదు ప్రచార కార్యక్రమాలు పని చేస్తాయని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. అయిదు గ్రిడ్లు.. నీటిగ్రిడ్, విద్యుత్‌గ్రిడ్, రహదారుల గ్రిడ్, గ్యాస్ గ్రిడ్, ఆప్టిక్ ఫైబర్ గ్రిడ్. అభివృద్ధికి కీలకమైన అయిదురంగాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి, నిర్ణీత కాలవ్యవధికి అనుగుణంగా పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించడానికి గ్రిడ్లు ఉపకరిస్తాయి. వీటితోపాటు ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం అయిదురంగాల్లో ప్రచార కార్యక్రమాలను రాష్ట్రప్రభుత్వం నిర్వహించనుంది. ఇవి..
1. బడి పిలుస్తోంది
2. పేదరికంపై గెలుపు
3. ఆరోగ్యం, పరిశుభ్రత
4. నీరు-చెట్టు
5. పొలం పిలుస్తోంది.