Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Budget -2019-20

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2019-20

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రూ.2,27,975 కోట్లతో 2019-20 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో రూ.75 వేల కోట్లకు పైగా సంక్షేమ రంగానికే కేటాయించారు. రైతన్నలకు రూ.28,866 కోట్ల విలువైన వరాలు ప్రకటించారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద 942 రకాల వైద్యసేవలే ఉచితంగా అందజేస్తుండగా, ఈ సంఖ్యను 1059కి పెంచారు. ప్రభుత్వం గ్రామీణ, స్థానిక సంస్థల్లో సరికొత్త పాలనకు తెర తీసింది. ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే వాలంటీర్ల వ్యవస్థ, అక్టోబరు 2 నుంచి అమల్లోకి వచ్చే గ్రామ, వార్డు సచివాలయాల కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. రెండు వేల జనాభాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్న గ్రామ సచివాలయాల్లో లక్ష, అయిదు వేల జనాభాకు ఒకటి చొప్పున ప్రారంభిస్తున్న వార్డు సచివాలయాల్లో 42 వేల మందికి రాష్ట్రంలో కొత్తగా శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించబోతోంది. దీనికి జులై 15న ఉద్యోగ ప్రకటన జారీ చేయనున్నారు. పురపాలక, పంచాయతీ ఎన్నికలకు బడ్జెట్‌లో రూ.149.57 కోట్లు కేటాయించారు. ఇందులో పురపాలక సంఘాలకు రూ.60 కోట్లు, పంచాయతీలకు రూ.89.57 కోట్లు సమకూర్చారు. మైనారిటీలకు ప్రభుత్వం మెజార్టీ స్థాయిలో నిధులు కేటాయించింది. తొలిసారిగా వక్ఫ్‌ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించడానికి రూ.20 కోట్లు, వక్ఫ్‌ ఆస్తుల రీ సర్వేకు రూ.20 కోట్లు కేటాయించింది. వైఎస్సార్‌ షాదీకా తోఫా పేరుతో మైనారిటీ యువతుల వివాహాలకు ఆర్థిక సాయాన్ని రూ.లక్షకు పెంచుతూ దాని కోసం రూ.100 కోట్లు ఇచ్చారు. ఇమామ్‌/మౌజమ్‌లకు గౌరవ వేతనం రూ.15 వేలు పెంపునకు అనుగుణంగా రూ.100 కోట్లు ఇచ్చింది. మొత్తంగా మైనారిటీల ఆర్థిక పురోగతికి రూ.952.47 కోట్లు కేటాయించింది.

విద్యారంగం

ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి పెద్దపీట వేసింది. కేటాయింపులు పెంచడంతోపాటు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. గతేడాదితో పోల్చితే ఈ బడ్జెట్‌లో 34.87% నిధులను పెంచింది. మొత్తం బడ్జెట్‌లో 14.31% నిధులను విద్యకు కేటాయించింది. సాంకేతిక విద్య మినహా మొత్తంగా విద్యకు రూ.32,618.46 కోట్లు ఇచ్చింది. పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు విద్యార్థులను పంపే తల్లులకు ‘జగనన్న అమ్మఒడి’ కింద రూ.15వేలు ఇవ్వనున్నారు. ఇందుకు బడ్జెట్‌లో రూ.6,455 కోట్లను కేటాయించారు. ‘జగనన్న విద్యా దీవెన పథకం’ కింద విద్యార్థులకు పూర్తిగా బోధన రుసుముల చెల్లింపు, భోజనం, ప్రయాణం, వసతి, పుస్తకాలకు ఏడాదికి ఒక్కో విద్యార్థికి రూ.20వేలు ఇవ్వనున్నారు. ఇందుకు రూ.4,962.3 కోట్లు కేటాయించారు. పాఠశాలల నిర్వహణకు ఇచ్చే నిధులను ఇక నుంచి వైఎస్‌ఆర్‌ పాఠశాలల నిర్వహణ నిధిగా పిలవనున్నారు. ఇందుకు రూ.160 కోట్లు చూపారు. పాఠశాలల్లో రెండేళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ ఏడాది రూ.1500 కోట్లు ఇచ్చారు. మధ్యాహ్న భోజనం సరఫరా బాధ్యతలను అక్షయపాత్రకు అప్పగించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా కేంద్రీయ వంటశాలల నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయించారు.


ఉన్నత విద్య

ఉన్నత విద్యకు గతేడాది కంటే 6.59% నిధులను అదనంగా నిధులను కేటాయించారు. గతేడాది రూ.2,834.90 కోట్లు కేటాయించగా.. ప్రస్తుతం రూ.3,021.63 కోట్లు కేటాయించారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి రూ.4.29 కోట్లు, డాక్టర్‌. బీఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక వర్సిటీకి రూ.4.53 కోట్లు కేటాయించారు. రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక వర్సిటీకి రూ.41.16 కోట్లు, జేఎన్‌టీయూ అనంతపురానికి రూ.60 కోట్లు, జేఎన్‌టీయూ కాకినాడకు రూ.38.35 కోట్లు కేటాయించారు. సాంకేతిక వర్సిటీలు మినహా యూజీసీ-2016 వేతన బకాయిలు, సీపీబ్రౌన్‌ మెమోరియల్‌ గ్రంథాలయం కడపతో కలిపి మొత్తం విశ్వవిద్యాలయాలకు రూ.1,418.96 కోట్లు కేటాయించారు.

సాంకేతిక విద్య

సాంకేతిక విద్యాశాఖకు ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గాయి. గతేడాది రూ.818.02 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.580.29 కోట్లే ఇచ్చారు.

ఉన్నత విద్యామండలి

ఉన్నత విద్యామండలికి ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.0.02 లక్షలు కేటాయించారు. గతేడాదికి అసలు బడ్జెట్‌ కేటాయింపులే లేకపోగా ఈసారి రూ.2 వేలుగా చూపారు. 2017-18లో రూ.2.13 లక్షలు కేటాయించారు.

అమరావతికి రూ.615 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతికి ఈ బడ్జెట్‌లో రూ.615 కోట్లు కేటాయించింది. గత ప్రభుత్వం అమరావతి భూసమీకరణ విభాగం కింద రైతులకు వార్షిక కౌలు చెల్లించేందుకు గత బడ్జెట్‌లో రూ.166.53 కోట్లు కేటాయించగా, ఈసారి ఆ ప్రస్తావన లేదు. రాజధానిలో అత్యవసర మౌలిక వసతుల అభివృద్ధికి రూ.500 కోట్లు ప్రత్యేకంగా కేటాయించింది.

వైఎస్సార్‌ కల్యాణ కానుక

వైఎస్సార్‌ కల్యాణ కానుకకు బడ్జెట్‌లో రూ.716.26 కోట్లు కేటాయించారు. మైనారిటీ యువతుల వివాహాలకు సాయం అందించే దుల్హన్‌ పథకాన్ని ‘వైఎస్సార్‌ షాదీకా తోఫా’గా మార్పు చేశారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతుల వివాహానికి రూ.50 వేలు, బీసీలకు రూ.35 వేల సాయం కింద అందిస్తున్నారు. గతేడాది ఆయా వర్గాలలో 83వేల వివాహాలు జరిగాయి. వీరికి రూ.320 కోట్ల మేర సాయం ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,27,858 వివాహాలు జరిగే అవకాశం ఉందని, దీనికి రూ.716.26 కోట్లు అవసరమని అంచనా.

పేదలకు ఇళ్లు

వచ్చే ఏడాది మార్చి 25న (ఉగాది) మహిళల పేరుమీద 25 లక్షల ఇళ్లపట్టాలను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. స్థల సేకరణకు బడ్జెట్‌లో రూ.8,615 కోట్లు కేటాయించింది. వైఎస్సార్‌ గృహవసతి పథకం కింద గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానికి రూ.5వేల కోట్లు, వైఎస్సార్‌ పట్టణ గృహనిర్మాణ పథకానికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే గృహనిర్మాణ పథకాలకు రూ.2,105 కోట్లు కేటాయించింది. మొత్తం గృహ నిర్మాణాలకు రూ.16,720 కోట్లు కేటాయించినట్లయ్యింది. 300 చదరపు అడుగుల వరకు ఉండే గృహాలకు సంబంధించి పట్టణ గృహనిర్మాణ లబ్ధిదారుల రుణభారాన్ని మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో 1.50 లక్షల మంది లబ్ధిదారులకు సంబంధించిన రూ.3,975 కోట్లు బకాయిలు రద్దుకానున్నాయి. గత ప్రభుత్వం పట్టణాల్లో 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగులతో ఇళ్ల నిర్మాణం చేపడుతోంది. వీటిలో 1.50 లక్షల మందికి 300 చదరపు అడుగుల ఇళ్ల నిర్మాణాలు మంజూరయ్యాయి. ఒక్కో ఇంటిపై రూ.2.65 లక్షలు బకాయిలు ఉన్నాయి.

ఆర్టీసీకి రూ.1,572 కోట్లు

ప్రభుత్వం ఆర్థిక సాయం, కొత్త బస్సుల కొనుగోలు, రాయితీల రీయింబర్స్‌మెంట్‌ తదితర పద్దుల కింద ఏపీఎస్‌ఆర్టీసీకి రూ.1,572 కోట్లు కేటాయించింది. ఆర్టీసీ బస్సు ఒక కిలోమీటరు నడిపేందుకు రూ.44.58 వ్యయం అవుతుండగా రూ.38.05 మాత్రమే ఆదాయం వస్తోంది. వివిధ రకాల కారణాలతో గత నాలుగేళ్లలో సంస్థకు ఏటా దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర నష్టాలు వచ్చాయి. దీంతో ఆర్థిక సాయం కింద రూ.1000 కోట్లు; రాయితీల రీయింబర్స్‌మెంటుకు రూ.500 కోట్లు; కొత్త బస్సుల కొనుగోలుకు రూ.50 కోట్లు, ఇతర అవసరాలకు రూ.22 కోట్లు కలిపి మొత్తం 1,572 కోట్లు కేటాయించారు.

డ్వాక్రా మహిళలకు 1,788 కోట్లు

స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా గ్రూపు)లకు ఆర్థిక భరోసా కల్పించడానికి, పేద మహిళలపై భారం లేకుండా సున్నా వడ్డీకే రుణాలిచ్చేలా ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని’ అమల్లోకి తెచ్చారు. డ్వాక్రా మహిళలకు ఆదాయ కల్పన కోసం ఇచ్చిన రుణాలపై వడ్డీ రాయితీ చెల్లింపునకు నిధులు ఇస్తామని బడ్జెట్‌లో ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లోని 6,32,254 సంఘాలకు రూ.1,140 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని 1,66,727 సంఘాలకు రూ.648 కోట్లు ఇందుకోసం కేటాయించింది.

‘స్థానిక’ సచివాలయాలకు శాశ్వత సిబ్బంది

అధికార వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో మొదటిసారి గ్రామ సచివాలయాలను అక్టోబరు 2 నుంచి ప్రారంభిస్తున్నారు. గ్రామాల్లో ప్రతి 2000 జనాభాకు ఒకటి చొప్పున, పట్టణాల్లో 5వేల జనాభాకు ఒకటి చొప్పున దాదాపు 20వేల సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో ప్రతి సచివాలయానికి పదిమంది, పట్టణాల్లో 5గురు చొప్పున శాశ్వత ఉద్యోగులను కొత్తగా నియమించనున్నారు. 12 ప్రభుత్వ శాఖలకు భాగస్వామ్యం కల్పిస్తున్నారు. ఈ సచివాలయాల ఏర్పాటుకు బడ్జెట్‌లో రూ.880 కోట్లు చూపింది. ఇవికాక వాలంటీర్ల నియామకానికి రూ.వెయ్యి కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించింది.

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ

వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉన్న అన్ని కుటుంబాలకు వైద్య ఖర్చులు రూ.వెయ్యి మించితే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వర్తించనుంది. ఎన్ని లక్షలు ఖర్చయినా ఉచిత వైద్యం అందించనున్నారు. సరిహద్దు జిల్లాల ప్రజల ప్రయోజనం కోసం బెంగళూరు, హైదరాబాద్, చెన్నైవంటి నగరాల్లోని పెద్ద ఆస్పత్రులను ప్రభుత్వ జాబితాలో చేర్చనున్నారు. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.1,740కోట్లు కేటాయించారు. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిద్దేందుకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చింది. ఆస్పత్రుల్లో మౌలికవసతుల కల్పనకు రూ.1500 కోట్లు కేటాయించింది. మూత్రపిండ వ్యాధుల నివారణకు శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రత్యేక పరిశోధన కేంద్రం, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు బడ్జెట్‌లో రూ.50కోట్లు కేటాయించారు. అరకు/పాడేరు ప్రాంతాల్లో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పేరుతో గిరిజన వైద్య కళాశాల, గుంటూరు జిల్లా పల్నాడులోని గురజాల, విజయనగరంలో వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ.66కోట్ల వంతున కేటాయించారు. కొత్తగా ‘108 అంబులెన్సులు’ 432, ‘104 అంబులెన్సులు’ 676 కొనుగోలు చేసేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. మొత్తంగా బడ్జెట్‌లో రూ.11,399.23 కోట్లు ఇచ్చారు. గతేడాదితో పోల్చితే నిధుల కేటాయింపు 34.69% పెరిగింది. మొత్తం బడ్జెట్‌లో వైద్య రంగం కేటాయింపు 5%గా ఉంది.


* ఉద్యోగుల ఆరోగ్య పథకానికి రూ.200 కోట్లు

* ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌కు రూ.30 కోట్లు.

* కేంద్రీయ ఔషధాలు, మందులు కొనుగోలుకు రూ.126 కోట్లు.

* జాతీయ ఆరోగ్య మిషన్‌కు రాష్ట్రం వాటాగా రూ.509 కోట్లు

* ఆయుష్‌ కళాశాలల పటిష్ఠతకు రూ.52 కోట్లు

పారిశ్రామిక రంగం

పారిశ్రామిక రంగానికి బడ్జెట్‌లో రూ.3,986 కోట్లు కేటాయించి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ. 573.60 కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఎంఎస్‌ఎంఈల మౌలిక సదుపాయాల కల్పన, ప్రోత్సాహాల కోసం రూ. 400 కోట్లు కేటాయించారు.

* కడప ఉక్కు కర్మాగారానికి రూ. 250 కోట్లు

* ఏపీఐఐసీకి రూ. 360 కోట్లు

* పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 250 కోట్లు

* ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న లక్షకు పైగా ఎంఎస్‌ఎంఈలకు రూ. 200 కోట్ల చేయూత

* ఈ రంగంలో కొత్తగా ఏర్పడే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, దీనిపై రూ. 200 కోట్ల ప్రత్యేక ప్రణాళిక
మౌలిక వసతులు, అభివృద్ధికి నిధులు (రూ. కోట్లలో)
ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ - 700
రాజధానిలో మౌలిక వసతుల కల్పన - 500
రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్ట్‌ - 50
రాజధాని ప్రాంత సామాజిక భద్రత నిధి - 65
కడప యాన్యుటీ ప్రాజెక్టులు - 120
పులివెందుల ప్రాంత అభివృద్ధి ఏజెన్సీ - 100
అమరావతి-అనంతపురం జాతీయ రహదారి - 100
మంగళగిరి మోడల్‌ టౌన్‌ అభివృద్ధి - 50
ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి - 500
ఉపాధిహామీ అనుసంధాన పథకాలు - 500
పీఎంజీఎస్‌వై - 376.35
పంచాయతీరాజ్‌ రహదారులు - 350

నీటిపారుదల రంగం

ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.13,139.04 కోట్లు కేటాయించింది. పోలవరం ప్రాజెక్టుకు అత్యధికంగా రూ.5254 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. పోలవరం పూర్తి కావాలంటే ఇంకా రూ.34,751.06 కోట్లు కావాలి. ఏడాది కాలంలోనే వెలిగొండ ప్రాజెక్టును కొంతమేర పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 1.19 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. రెండో సొరంగం పనులు కూడా పూర్తి చేసి రెండేళ్లలో రెండోదశను కూడా పూర్తిచేస్తామని ప్రకటించారు.


జలవనరులశాఖలో కేటాయింపులు (రూ. కోట్లలో)

తాజా బడ్జెట్‌లో కొన్ని ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులు (రూ. కోట్లలో)

* చింతలపూడి ఎత్తిపోతల - 720

* తోటపల్లి ప్రాజెక్టు - 156

* గుండ్లకమ్మ ప్రాజెక్టు - 28

* తాడిపూడి ఎత్తిపోతల - 55

* గాలేరు నగరి - 391

* హంద్రీనీవా - 1134

* వెలిగొండ ప్రాజెక్టు - 592

* ముసురుమిల్లి - 32

* పులివెందుల కాలువ - 112

* చిన్ననీటి వనరులు - 589

* ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు - 479
ఎన్ని నిధులు కావాలి?

* 2004 నుంచి కొనసాగుతున్న ప్రాజెక్టుల తాజా విలువ: రూ.1,57,770 కోట్లు

* 2019 మార్చి 31 నాటికి ఖర్చు రూ.62,251 కోట్లు

* మిగిలిన పనుల విలువ రూ.95,519 కోట్లు

* పాలనామోదం పొంది ప్రారంభించని పనుల విలువ: రూ.10,704 కోట్లు

* పనులు మొదలు పెట్టి 25% లోపు ఖర్చుచేసిన ప్రాజెక్టుల విలువ: రూ.22,880.44 కోట్లు

* టెండర్లు పిలిచి ఖరారు చేసి పనులు ప్రారంభించని వాటి విలువ: రూ.7302.56

* తాజా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పనులు ఆపగా కొనసాగుతున్న పాత పనుల విలువ: రూ.21,681.30 కోట్లు

సాంఘిక సంక్షేమం

కులవృత్తులను జీవనోపాధిగా ఎంచుకున్న సామాజికవర్గాల ఆదాయ మార్గాలు పెరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆర్థిక మద్దతు పథకాలను ప్రకటించింది. బీసీ ఉప ప్రణాళికకు రూ.15,061 కోట్లు కేటాయించింది. గతేడాది కేటాయింపు (రూ.12,200 కోట్ల) కంటే ఇది 23.46 శాతం అధికం. వివిధ పథకాల అమలు కోసం బీసీ సంక్షేమ శాఖకు రూ.7271.45 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది 17.03 శాతం ఎక్కువ.

139 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు

బీసీల్లోని 139 కులాల ఆర్థికాభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీల్లోని 29 కులాలకు ప్రస్తుతం ప్రత్యేక కార్పొరేషన్లు ఉన్నా రుణాల జారీలో జాప్యం జరుగుతోంది. కులానికో కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తే ఆయా వర్గాల అభివృద్ధికి ఆర్థిక సాయం నేరుగా అందించవచ్చన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా మరో 110 కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మహిళలకు రూ.75 వేలు ఇచ్చే ‘వైఎస్సార్‌ చేయూత’ పథకాన్ని కూడా కొత్త కార్పొరేషన్ల ద్వారానే అందించనుంది.

దర్జీలకు ఏటా రూ.10 వేలు

కులవృత్తిని జీవనోపాధిగా ఎంచుకున్న నాయీబ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు ఏటా రూ.10 వేలు ఇచ్చే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వృత్తిపరంగా ఉపయోగించే యంత్రాలు, ఉపకరణాల ఆధునికీకరణ, కొత్తవాటి కొనుగోలుకు సాయంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా దాదాపు 3 లక్షల మంది నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలు లబ్ధి పొందుతారని పేర్కొంది. ఈ పథకానికి రూ.300 కోట్లు కేటాయించారు. చేనేత పనిమీద ఆధారపడ్డ కుటుంబాల జీవనోపాధి కోసం ఎలాంటి షరతులు లేకుండా ఏటా రూ.24 వేల ఆర్థిక సాయం అందించే పథకాన్ని బడ్జెట్‌లో ప్రతిపాదించింది. మగ్గాల ఆధునికీకరణ, ప్రస్తుత విపణిలో పోటీపడేందుకు ఈ సాయం అందిస్తున్నట్లు ప్రకటించింది.

ఎస్సీ, ఎస్టీల సంక్షేమం

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. ఆయా వర్గాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో రోడ్లు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు పెంచేలా ఉపప్రణాళికలకు ఎక్కువ నిధులు కేటాయించింది. ఎస్సీ ఉపప్రణాళికకు గతేడాది కంటే 33.60 శాతం అధిక నిధులు ప్రతిపాదించింది.
ఉపకారవేతనాలు, బోధనా రుసుములు, ఉచిత విద్యుత్తు పథకం, సంక్షేమ గురుకులాలు, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, రోడ్లు, తాగునీటి సదుపాయాలు, బ్రాడ్‌బ్యాండ్‌ సదుపాయాల విస్తరణకు ఎక్కువ నిధులిచ్చింది.

పేదింట ఉచిత ‘వెలుగు’

ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితవిద్యుత్‌ పరిమితిని 200 యూనిట్లకు పెంచింది. దీనివల్ల అదనంగా 3.42 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుంది.

* చేనేత కుటుంబాలకు ఏటా రూ.24 వేలు అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. చేనేతపై ఆధారపడ్డ కుటుంబాలు - 98 వేలు

బీమా ధీమా

18 - 60 ఏళ్లలోపు పౌరులు సహజంగా మరణిస్తే వారి కుటుంబాలకు రూ.లక్ష ఇచ్చే ‘వైఎస్‌ఆర్‌ బీమా’ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు ఇవ్వనుంది. దీనికోసం రూ. 404.02 కోట్లు కేటాయించారు.

ఆహారబుట్టకు 100 కోట్లు

గిరిజనులకు పోషహాకార పథకానికి ప్రభుత్వం కేటాయింపులు పెంచింది. ఆహారబుట్ట పథకం పరిధిలోకి వచ్చే కుటుంబాల సంఖ్య 4.24 లక్షలకు పెరిగినందున కేటాయింపులు పెంచింది. బడ్జెట్‌లో కేటాయింపులు - రూ. 100 కోట్లు

* వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధి, జీవనోపాధి పెంపు లక్ష్యంగా ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపులు చేసింది. బీసీ ఉపప్రణాళికకు రూ.15,061 కోట్లు కేటాయించింది.

కాపు సంక్షేమానికి రూ. 2000 కోట్లు

కాపు కార్పొరేషన్‌కు రూ. 2వేల కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయింపుల కంటే ఇది రెట్టింపు. ఎస్సీ ఉపప్రణాళికకు రూ.15 వేల కోట్లు ఇచ్చారు. 2018-19 సంవత్సరంలో కేటాయించిన రూ.11,228 కోట్లకు ఇది 33.60 శాతం అధికం.

* సాంఘిక సంక్షేమ శాఖకు రూ.5,919 కోట్లు కేటాయింపు

* ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఆర్థిక పథకాలకు రూ.350.27 కోట్లు

* సంక్షేమ వసతి గృహాల నిర్వహణకు రూ.475.78 కోట్లు

* భూమి కొనుగోలు పథకానికి రూ.35 కోట్లు

గిరిజన ఉపప్రణాళిక

గిరిజన ఉప ప్రణాళికకు ప్రభుత్వం రూ.4988.52 కోట్లు కేటాయించింది. గతేడాది రూ.4176 కోట్ల కన్నా ఇది 19.44 శాతం అధికం. గిరిజన సంక్షేమ శాఖకు రూ.2,153 కోట్లు ప్రతిపాదించింది.
గిరిజనాభివృద్ధి కోసం ప్రధాన కేటాయింపులు (రూ. కోట్లలో)

* వైఎస్‌ఆర్‌ గిరిజన విశ్వవిద్యాలయ అభివృద్ధికి - 50

* ఏజెన్సీ ప్రాంతాల్లో కాఫీ తోటల అభివృద్ధికి - 30.46

* ఆర్థిక మద్దతు పథకాలకు - 161.77

* బ్రాడ్‌బ్యాండ్‌ సదుపాయాల విస్తరణకు - 30

* గిరిజన విద్యాసంస్థల్లో మౌలిక వసతులకు - 137.24

గ్రామ, వార్డు సచివాలయాలకు కేటాయింపులు

* గ్రామ వాలంటీర్లు రూ. 720 కోట్లు

* గ్రామ సచివాలయాలు రూ. 700 కోట్లు

* మున్సిపల్‌ వార్డు వాలంటీర్లు రూ. 280 కోట్లు

* మున్సిపల్‌ వార్డు సచివాలయాలు రూ. 180 కోట్లు

* అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆర్థిక భరోసా రూ. 1,150 కోట్లు

వ్యవసాయ బడ్జెట్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 2019-20 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్ద పీట వేసిన ప్రభుత్వం బడ్జెట్‌లో వాటికి రూ.28,866.23 కోట్లు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌కు 81.51 శాతం, పశుసంవర్థక, మత్స్య రంగాలకు 9.71 శాతం చొప్పున కేటాయింపులు పెంచింది. రైతుకు పెట్టుబడి సాయం అందించే వైఎస్సార్‌ రైతు భరోసా, సాగుకు పగటిపూట 9 గంటల విద్యుత్తు సరఫరా పథకాలకే రూ.13,275 కోట్లు ఖర్చు చేయనుంది.
పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం (జడ్‌బీఎన్‌ఎఫ్‌) విధానాన్ని భారీస్థాయిలో ప్రోత్సహించాలని నిర్ణయించింది. పశుసంవర్థకంలో జీవాలు, పశువుల బీమాకు రూ.50 కోట్లు, మత్స్య రంగ అభివృద్ధిలో భాగంగా జెట్టీలు, ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు రూ.100 కోట్లు ఇవ్వనుంది. ధరల స్థిరీకరణకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ.3000 కోట్లు కేటాయించింది. ఇప్పటికే ఏర్పాటు చేసిన రైతుమిషన్‌ ధరల వ్యవహారాన్ని పరిశీలించి అదనపు మద్దతు ధర కల్పించేందుకు వీలుగా మార్కెట్‌ స్థిరీకరణకు ఈ నిధులు వినియోగించనుంది. మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణ శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.


వైఎస్సార్‌ రైతు భరోసా

రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ పథకాన్ని ఈ ఏడాది రబీ నుంచి అమలు చేయబోతోంది. ఈ పథకానికి రూ. 8,750 కోట్లు కేటాయించారు. దీనికింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.12,500 మొత్తాన్ని సొంతంగా ఇవ్వనుంది. కేంద్రం ఏడాదికి మూడు విడతల్లో ఇచ్చే రూ.6 వేలు కూడా కలిపితే ఒక్కో రైతుకు రూ.18,500 అందుతుంది. దీని వల్ల 64.07 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం దక్కనుంది. ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్తును రూ.1.50 చొప్పున ఇచ్చేందుకు రూ.475 కోట్లు ప్రతిపాదించారు. ఈ ఏడాది 50 వేల సౌర విద్యుత్తు పంపుసెట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.

వడ్డీలేని రుణాలు

రైతులు బ్యాంకు నుంచి రూ.లక్ష లోపు పంటరుణం తీసుకుని గడువులోగా చెల్లిస్తే అందుకయ్యే వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. బడ్జెట్‌లో కేటాయింపు: రూ.100 కోట్లు

ఉపాధి హామీ కింద సాగుకు రూ.3,626 కోట్లు

కరవు నివారణ కార్యక్రమాల్లో భాగంగా మినీ గోకులం, పట్టుపరిశ్రమ, చేప పిల్లలను పెంచే చెరువులు, ఎండబెట్టే యార్డులు, పండ్ల తోటల పనులకు ఉపాధి హామీ నిధుల్ని వినియోగించుకునే దిశగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.3,626 కోట్లను వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఖర్చు చేయనుంది. 81 వేల ఎకరాల్లో పండ్ల తోటలు, 5 వేల కిలోమీటర్ల పరిధిలో రహదారులకు ఇరువైపులా మొక్కల పెంపకం, 25 వేల చెరువుల పునరుద్ధరణ, 35 వేల చెరువుల్లో పూడికతీత, 35 వేల ఎకరాల్లో భూమి అభివృద్ధి, 25,500 ఊటకుంటల ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందించింది.

వైఎస్సార్‌ రైతు బీమా

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 7 లక్షల పరిహారం అందిస్తుంది. ఈ మొత్తాన్ని అప్పులవారు తీసుకునే వీలు లేకుండా చట్టం తెచ్చే దిశగా చర్యలు తీసుకుంటోంది. 2014-19 మధ్య ఆత్మహత్య చేసుకుని పరిహారం అందనివారిలో అర్హులను గుర్తించి వారికి కూడా పరిహారం ఇవ్వనుంది. దీనికి రూ. 100 కోట్లు కేటాయించారు.

* ఉచిత పంటల బీమా కింద రాష్ట్రంలో సాగయ్యే అన్ని పంటలకు ఉచితంగా బీమా కల్పిస్తారు. రైతు చెల్లించాల్సిన వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. బీమా చేసే విస్తీర్ణం: 55 లక్షల హెక్టార్లు. దీనివల్ల 85 లక్షల మందికి (ఖరీఫ్, రబీల్లో) లబ్ధి కలుగుతుంది. దీనికోసం రూ. 1,163 కోట్లు కేటాయించారు.

* రాష్ట్రంలో 6,663 వ్యవసాయ విద్యుత్తు ఫీడర్లున్నాయి. ఇందులో 3,854 ఫీడర్ల (60శాతం)లోనే ప్రస్తుతం 9 గంటల సరఫరాకు అనువైన సౌకర్యాలు ఉన్నాయి. మిగిలిన వాటికి సదుపాయాల కల్పనకు రూ. 1700 కోట్ల కేటాయింపు. దీనివల్ల 18.15 లక్షల పంపుసెట్లు వినియోగించే రైతులకు ప్రయోజనం కలుగుతుంది.

* వేటకు వెళ్లి ప్రమాదాల పాలయ్యే మత్స్యకార కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం చెల్లించనున్నారు. సముద్రంలో ఏటా 61 రోజులు వేట నిషేధించిన సమయంలో భృతిగా ఇస్తున్న రూ.4 వేలను రూ.10 వేలకు పెంచారు. దీనివల్ల 96,662 మంది మత్స్యకారులకు లబ్ధి కలగనుంది. బడ్జెట్‌లో దీనికోసం రూ. 100 కోట్లు కేటాయించారు.

* కొత్తగా ఏర్పాటు చేయబోయే గ్రామ సచివాలయాల్లో రైతు సేవల కోసం వ్యవసాయ, అనుబంధ రంగాల నుంచి ఇద్దరు సహాయకులను నియమించబోతున్నారు. వ్యవసాయ, ఉద్యాన రంగాల నుంచి గ్రామ వ్యవసాయ సహాయకుడిని (విలేజి అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌), మత్స్య, పశుసంవర్థక రంగాల నుంచి పశుసంవర్థక సహాయకుడిని (ఏహెచ్‌ అసిస్టెంట్‌) నియమిస్తారు.

* తక్కువ పెట్టుబడితో ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులను పండించడానికి ప్రభుత్వం ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ పథకాన్ని అమలు చేయనుంది. పరంపరాగత కృషి వికాస యోజన పథకం కింద రూ.91.31 కోట్లు ప్రతిపాదించింది.

* రాష్ట్రంలో హెక్టారు భూమిలో వ్యవసాయానికి 2.5 కిలోవాట్ల యంత్రశక్తి అవసరం. ప్రస్తుతం 1.72 కిలోవాట్లు మాత్రమే అందుబాటులో ఉంది. యాంత్రీకరణను పెంచే క్రమంలో రైతు సంఘాలను గుర్తించి కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయించాలని నిర్ణయించింది. అక్కడ రైతులకు అవసరమయ్యే అన్ని వ్యవసాయ యంత్ర పరికరాలు అందుబాటులో ఉంచుతారు. ప్రస్తుత బడ్జెట్లో ఈ పథకానికి రూ.460.05 కోట్లు ప్రతిపాదించారు.

* ఎరువులు, పురుగుమందులు, విత్తనాల్లో కల్తీని నివారించడానికి ప్రతి నియోజకవర్గంలోనూ సమగ్ర పరీక్షా కేంద్రం (ఇంటిగ్రేటెడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌) ఏర్పాటు చేయనున్నారు. పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన తర్వాతే రైతులకు ఉత్పత్తులు అందిస్తారు. బడ్జెట్లో దీనికి రూ.109.28 కోట్లు కేటాయించారు.

* రాష్ట్రంలో పంట ఉత్పత్తుల నిల్వ కోసం 10 లక్షల టన్నుల సామర్థ్యంతో గోదాములు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి గోదాముల మౌలిక వసతుల నిధి కింద రూ.200 కోట్లు కేటాయించింది. కొత్త గోదాముల నిర్మాణానికి రూ.37 కోట్లు ఇవ్వబోతోంది. కొత్తగా 100 రైతు బజార్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది.

* ఉద్యానశాఖ ద్వారా పసుపు- గ్రామ విత్తన కార్యక్రమం ద్వారా కర్కుమిన్‌ అధికంగా ఉండే వంగడాలను రైతుకు 50 శాతం రాయితీపై అందించే దిశగా ప్రణాళిక రూపొందించారు. కేరళలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పైసెస్‌ రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఆర్‌) ఆధ్వర్యంలో విడుదల చేసిన అధిక దిగుబడినిచ్చే మహిమ, వరద రకాల అల్లాన్ని కూడా రైతులకు అందిస్తారు. కొత్తగా 100 రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేయబోతున్నారు.

* రాష్ట్రంలో రైతు సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించి అమలు చేయడమే లక్ష్యంగా వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు చేశారు. ప్రతి నెలా మిషన్‌ విధిగా సమావేశమవుతుంది. ప్రకృతి విపత్తుల నిధి రూ.2 వేల కోట్లు, ధరల స్థిరీకరణ నిధి రూ.3వేల కోట్లు నిధుల్ని ఎలా వినియోగించాలో కూడా ఇదే నిర్ణయించనుంది.

* సహకార రంగంలోని పాల సమాఖ్యలు, పాల సేకరణ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు కేటాయించింది. సహకార డెయిరీలకు పాలు పోసే రైతులకు లీటరుకు రూ.4 చొప్పున బోనస్‌ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

మరికొన్ని పథకాలకు కేటాయింపులు ఇలా..

పథకం - కేటాయింపు (రూ.కోట్లలో)
వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా - 1,163
సూక్ష్మసేద్యం - 1,105.66
నూనెగింజల అభివృద్ధి - 141.26
మౌలిక వసతుల కల్పన - 341
రాయితీ విత్తనాలు - 200
ఉచిత సూక్ష్మపోషకాలు - 30.05
భూసార పరీక్షలు - 30.43
రైతు శిక్షణ - 89.63
సుస్థిర సాగు విధానం - 233
ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం - 355
ఆయిల్‌పామ్‌ తోటల సాగుకు ప్రోత్సాహం - 65.15
ఆయిల్‌పామ్‌ రైతులకు ధరలో వ్యత్యాసం - 80
పశుదాణా పథకాలు - 100

11 లక్షల కొత్త పింఛన్లు

సామాజిక భద్రత పింఛన్ల అర్హత వయసును 60 ఏళ్లకు తగ్గించడంతో పాటు తలసేమియా, పక్షవాతం, కుష్ఠు వ్యాధిగ్రస్తులకు తోడుగా నిలిచేలా ప్రభుత్వం సాయం అందించనుంది. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్‌ బాధితులకు రూ.2,250, హిజ్రాలు, డప్పు కళాకారులు, దివ్యాంగులకు రూ.3 వేలు, డయాలసిస్‌ రోగులకు రూ.10 వేలు చొప్పున ప్రతి నెలా సాయం అందిస్తోంది. అర్హత వయసున్న వారికి పింఛను మంజూరు చేయడం, అర్హత వయసు 60 ఏళ్లకు తగ్గించడంతో కొత్తగా పెరిగే లబ్ధిదారులతోపాటు తలసేమియా, పక్షవాతం, కుష్ఠు వ్యాధిగ్రస్తులకు కూడా పింఛన్లు మంజూరు చేస్తే కొత్తగా 11.20 లక్షల మంది అదనంగా పెన్షన్లకు అర్హత సాధిస్తారని సర్కారు గుర్తించింది. వైఎస్సార్‌ అభయహస్తం పింఛనుదారులకు కొత్తగా నెలకు రూ.2,750 చొప్పున ప్రతి నెలా పింఛను అందించనుంది. ఈ మేరకు బడ్జెట్‌లో 15,746.58 కోట్లు కేటాయించింది. అక్టోబరు 2 నుంచి కొత్తవారికి పింఛన్లు పంపిణీ చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.


* ఇంటి పెద్ద ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షల పరిహారం చెల్లించేలా వైఎస్‌ఆర్‌ బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కుల సహజ మరణానికి రూ.లక్ష చెల్లిస్తారు. దీనికోసం రూ.404.02 కోట్లు కేటాయించారు.

* విజయవాడ, విశాఖపట్నం మెట్రోరైలు ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఆశలు పెట్టుకుంది. ఈ జాబితాలో తాజాగా అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టునూ ప్రతిపాదించారు. వీటి ప్రాథమిక అవసరాల కోసం రూ.10 కోట్లకు పైగా బడ్జెట్‌లో కేటాయించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో విశాఖలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులను చేపట్టాలి. విశాఖలో ప్రాజెక్టుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు సవివర పథక నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేస్తున్నారు.

* పురపాలక, నగరపాలక సంస్థల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలుచేస్తున్న కార్యాక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం అమృత్‌కు రూ.373.61 కోట్లు, ఆకర్షణీయ నగరాలకు రూ.50 కోట్లు, పేదరిక నిర్మూలన, మహిళా సంక్షేమానికి మరో రూ.23.40 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. విజయవాడలో మౌలిక సదుపాయాల కల్పనకు నగరపాలక సంస్థకు ప్రత్యేకంగా రూ.50 కోట్లు సమకూర్చారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌లో మరికొన్ని ముఖ్యాంశాలు

* వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు పన్ను మినహాయింపు

* భూసారం, విత్తనం, ఎరువులు, పురుగు మందులను పరీక్షించే సదుపాయాలతో వైఎస్‌ఆర్‌ అగ్రిల్యాబ్స్‌ ఏర్పాటు

* వైఎస్‌ఆర్‌ గిరిజన విశ్వవిద్యాలయం అభివృద్ధికి రూ.50 కోట్లు

* ఇమామ్‌లకు రూ.10 వేలకు, మౌజమ్‌లకు రూ.5 వేలకు గౌరవ వేతనం పెంపు. పాస్టర్లకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం

* 2వేల వరకూ జనాభా కలిగిన ప్రతి పంచాయతీకి రూ.30వేలతో, 5వేల వరకూ జనాభా కలిగిన ప్రతి పంచాయితీకి రూ.60 వేలు, 10 వేల వరకూ జనాభా కలిగిన ప్రతి పంచాయతీకి రూ.90 వేలు, 10 వేలకు మించి జనాభా కలిగిన ప్రతి పంచాయతీకి రూ.1.20 లక్షలతోనూ దూప, ధీప, నైవేద్యం కల్పన. ధార్మిక సంస్థలకు వైఎస్‌ఆర్‌ గ్రాంటు కింద ఈ పథకం అమలు చేస్తారు. దీనికోసం రూ.234 కోట్లు కేటాయించారు.

* న్యాయవాదులు ప్రాక్టీసు మొదలుపెట్టిన తొలి మూడేళ్లపాటు నెలకు రూ.5 వేల స్టయిపండ్‌ చెల్లింపు. రూ.100 కోట్లతో న్యాయవాదుల సంక్షేమ ట్రస్టు ఏర్పాటు

* సొంతంగా వాహనం కలిగిన ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏడాదికి రూ.10వేల ఆర్థిక సాయం

* కడప ఉక్కు కర్మాగారానికి రూ.200 కోట్లు

* అమరావతి-అనంతపురం జాతీయ రహదారికి రూ.100 కోట్లు

* రాష్ట్ర క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు: రూ.43.60 కోట్లు

అప్పులు రూ.1,00,658.37 కోట్లు

ఏపీకి 2014 జూన్‌లో రాష్ట్ర విభజన సమయంలో రూ.1,30,654.34 కోట్ల అప్పులను కేటాయించారని, ఇందులో విభజించని ప్రజా పద్దు రూ.33,477.52 కోట్లు ఉందని, అప్పటినుంచి ఈ ఏడాది మే వరకు రాష్ట్ర ప్రభుత్వ నికర అప్పు రూ.1,00,658.37 కోట్లకు చేరిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు.

ఖర్చులు

ఆంధ్రప్రదేశ్‌లో 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.1,62,134 కోట్లు ఖర్చుచేసినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. వీటిని 2018-19 ప్రీ అకౌంట్స్‌గా చెబుతారు. అడ్వకేట్‌ జనరల్‌ పరిశీలన తర్వాత మరో నాలుగు నెలలకు వాస్తవ లెక్కలు తేలుస్తారు. బడ్జెట్‌ ప్రతిపాదనలతో పోలిస్తే 84.8% మేర ఖర్చుచేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత గడిచిన 5 ఏళ్లలో చివరి ఆర్థిక సంవత్సరంలోనే బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే ఖర్చు తక్కువ. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ ఆదాయంగా రూ.1,55,598.27 కోట్లు వస్తాయని అధికారులు అంచనాలు వేశారు. కానీ రూ.1,14,684 కోట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తం మీద కేంద్రం నుంచి రూ.50,695 కోట్లు వస్తుందనుకుంటే రూ.19,457 కోట్లే లభించాయి. రాష్ట్ర పన్నుల ద్వారా రూ.65,535 కోట్లు ఆదాయాన్ని అంచనా వేయగా రూ.58,125 కోట్లే వచ్చింది. 2018-19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రతిపాదన సమయంలో రెవెన్యూ మిగులు ఉంటుందని వేసిన అంచనా తప్పింది. ప్రస్తుతం సవరించిన అంచనాల ప్రకారం.. రూ.11,654.90 కోట్లుగా రెవెన్యూ లోటు తేలింది.

రెవెన్యూ లోటు

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రెవెన్యూ లోటు కుంగదీస్తోంది. రాష్ట్రంలో సొంతపన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రపన్నుల్లో వాటాలు, కేంద్రం నుంచి అందే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అన్నింటినీ కలిపి రెవెన్యూ ఆదాయంగా లెక్కిస్తారు. రెవెన్యూ ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటే రెవెన్యూ లోటుగా పరిగణిస్తారు. ఈసారి రూ.1778.52 కోట్ల రెవెన్యూ లోటుతో బడ్జెట్‌ సమర్పించారు. 2014-15 నుంచి రెవెన్యూలోటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సవాలు విసురుతూనే ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే రూ.5235.23 కోట్ల మిగులుతో బడ్జెట్‌ ప్రతిపాదించారు. ఆ తర్వాత బడ్జెట్‌ సంవత్సరం ముగిసేనాటికి మిగులు కనిపించలేదు. దాంతో అది కూడా లోటు సంవత్సరంగానే మారింది.


గత ఆరేళ్ల రెవెన్యూ లోటు (రూ.కోట్లలో)

ముఖ్యమైన రంగాలకు కేటాయింపులు

* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి: 31,564.75 కోట్లు

* రెవెన్యూ: 9,496.93 కోట్లు

* రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌: 145.75 కోట్లు

* నైపుణ్యాభివృద్ధి, ఇన్నోవేషన్‌: 363.42 కోట్లు

* సాంఘిక సంక్షేమం: 5,919.07 కోట్లు

* రవాణా, రహదారులు, భవనాలు: 6,202.98 కోట్లు

* న్యాయశాఖ: 937.37 కోట్లు

* శాసన సభ: 121.17 కోట్లు

* పురపాలిక, పట్టణాభివృద్ధి: 6,587.09 కోట్లు

* మైనార్టీ సంక్షేమం: 952.47 కోట్లు

* యువజన, క్రీడలు: 604.55 కోట్లు

* ప్రణాళిక: 1,439.55 కోట్లు

* వ్యవసాయం: 18,327.94 కోట్లు

* మత్స్య, పాడి, పశుసంవర్ధక: 1,912.29 కోట్లు

* అటవీ, పర్యావరణం: 446.77 కోట్లు

* ఉన్నత విద్య: 3,021.63 కోట్లు

* బీసీ సంక్షేమం: 7,271.45 కోట్లు

* విద్యుత్‌: 6,861.03 కోట్లు

* పింఛన్లు: 15,746 కోట్లు

* జగనన్న అమ్మ ఒడి: 6,455.80 కోట్లు

* వైఎస్సార్‌ రైతు భరోసా: 8,750 కోట్లు

* జగనన్న విద్యా దీవెన: 4,962.34 కోట్లు

* గృహనిర్మాణ పథకాలు: 16,720 కోట్లు

* ‘డ్వాక్రా’ సున్నా వడ్డీ రుణాలు: 1,788 కోట్లు

* జలయజ్ఞం: 13,139 కోట్లు

* వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ: 1,740 కోట్లు

* గ్రామ, పట్టణ వాలంటీర్లు: 1,880 కోట్లు

* పాఠశాల విద్య: 29,772.79 కోట్లు

* ఆహారం, పౌరసరఫరాలు: 4,429.43 కోట్లు

* ఆర్థిక: 46,858.81 కోట్లు

* సాధారణ పరిపాలన: 1,010.78 కోట్లు

* వైద్యం, కుటుంబ సంక్షేమం: 11,399.23 కోట్లు

* హోం: 7,461.92 కోట్లు

* గృహనిర్మాణం: 3,617.37 కోట్లు

* జలవనరులు: 13,139.04 కోట్లు

* మహిళ, శిశు: 2,689.36 కోట్లు

* పరిశ్రమలు: 3,986.05 కోట్లు

* ఐటీ, ఎలక్ట్రానిక్స్‌: 453.56 కోట్లు

* కార్మిక, ఉపాధి కల్పన: 978.58 కోట్లు

Posted on 12.07.2019