Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Budget -2019

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్ - 2019

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఫిబ్రవరి 5న శాసనసభలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.2.26 లక్షల కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్‌లో వివిధ సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపులు పెంచారు. కొత్తగా రూ.5 వేల కోట్లతో అన్నదాతా - సుఖీభవ పథకాన్ని ప్రకటించారు. పసుపు - కుంకుమ పథకానికి గత బడ్జెట్‌లో రూ.1700 కోట్లు కేటాయించగా ఈసారి రూ.4వేల కోట్లకు పెంచారు (135.29%).

కొన్ని ముఖ్యాంశాలు:

- పేదలకు గృహ నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు రూ.500 కోట్లు కేటాయించారు.
- చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలకు రూ.400 కోట్లు
- వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయినప్పుడు రైతును ఆదుకునేందుకు ఉద్దేశించిన నిధిని రూ.500 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్లకు పెంపు
- పశువుల బీమా కేటాయింపులు రూ.50 కోట్ల నుంచి రూ.200 కోట్లకు పెంచారు.
- 21 బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా ప్రకటించడంతో పాటు ఇటీవలే మరో తొమ్మిది కార్పొరేషన్లను వెల్లడించిన ప్రభుత్వం... వాటికి రూ.3 వేల కోట్లు నిధులు ఇచ్చింది.
- ప్రస్తుతం ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తున్న ప్రభుత్వం త్వరలో దీన్ని రూ.2 వేలకు పెంచాలని భావిస్తోంది. దానికి తగ్గట్టుగా రూ.1200 కోట్లు చూపించింది.
- అన్న క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించనున్న ప్రభుత్వం కేటాయింపులను రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పెంచింది.
- అసంఘటిత రంగంలోని కార్మికులు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఉద్దేశించిన చంద్రన్న బీమాకు రూ.140 కోట్ల నుంచి రూ.354.02 కోట్లకు పెంచారు.
- వైశ్య కార్పొరేషన్‌కి రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్లకు, బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.75 కోట్ల నుంచి రూ.100 కోట్లకు, క్రిస్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కి రూ.75 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంపు.
- వివిధ వెనుకబడిన వర్గాలకు చెందిన వధువులకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందించే చంద్రన్న పెళ్లికానుకకు నిధులను రూ.132.22 కోట్లకు పెంచింది.

రెవెన్యూ లోటు రూ.2,099 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.2,26,177 కోట్లతో భారీ బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. 2018-19 బడ్జెట్‌ అంచనాల కంటే ఇది రూ.35,113 కోట్లు అధికం. 2014-15 నుంచి ఏటా సగటున రూ.15 వేల కోట్లు చొప్పున కేటాయింపులు పెరుగుతుండగా, 2018-19లో ఒక్కసారిగా రూ.34,064.21 కోట్లకు పెంచారు. రెవెన్యూ వ్యయాన్ని రూ.1,80,369 కోట్లుగా, మూలధన వ్యయాన్ని రూ.29,596 కోట్లుగా పేర్కొన్నారు. రుణాల చెల్లింపులకు రూ.14,917 కోట్లను చూపించారు. 2018-19 సవరించిన బడ్జెట్‌ అంచనాల్లో రూ.2,494.12 కోట్ల రెవెన్యూలోటు చూపించగా, ఈసారి రూ.2,099 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 2018-19 సవరించిన అంచనాల ప్రకారం ద్రవ్యలోటు రూ.29,141.72 కోట్లు. ఈసారి అది రూ.32,391 కోట్లకు పెరిగింది. రాష్ట్రానికి సమకూరే ఆదాయంలో కేంద్ర పన్నుల్లో వాటాల రూపంలో రూ.36,360 కోట్లు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో రూ.60,721 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల నుంచి రూ.75,438 కోట్లు వస్తుందని అంచనా వేశారు.

Posted on 06.02.2019