Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Budget 2017-18

2017 - 18 కేంద్ర బడ్జెట్

* 2017 - 18 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
* ఈ బడ్జెట్ ప్రధాన ఉద్దేశం ఆర్థిక వ్యవస్థ వృద్ధిని వేగవంతం చేయడం. దీనికి తోడు రాజకీయ, ఆర్థిక వ్యవస్థల ప్రక్షాళన. ఆ పథాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేటాయింపులు జరిపారు.
* పది స్పష్టమైన భావనల కింద బడ్జెట్ ప్రతిపాదనలను పెడుతున్నట్లు జైట్లీ వెల్లడించారు.
ఆ పది భావనలు:
1. రైతులు: ఐదేళ్లలో వీరి ఆదాయం రెట్టింపు చేయడానికి కట్టుబడి ఉన్నాం.
2. గ్రామీణ జనాభా: ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన.
3. యువత: విద్య, నైపుణ్యాలు, ఉద్యోగాల ద్వారా బలోపేతం చేయడం
4. పేదలు, అణగారిన వర్గాలు: సామాజిక భద్రత, ఆరోగ్య రక్షణ, అందుబాటు ధరల్లో గృహ నిర్మాణ వ్యవస్థలను బలోపేతం చేయడం.
5. మౌలిక సదుపాయాలు: జీవన నాణ్యత, ఉత్పాదకత, సమర్థత కోసం
6. ఆర్థిక రంగం: బలమైన సంస్థల ద్వారా వృద్థి, సుస్థిరత
7. డిజిటల్ ఆర్థికత: సత్వర, పారదర్శక, జవాబుదారీతనం కోసం
8. ప్రజాసేవ: ప్రజా భాగస్వామ్యం ద్వారా సమర్థ పాలన, సమర్థ సేవ
9. సమర్థ ద్రవ్య యాజమాన్యం: వనరులను తగినంతగా కేటాయించి, ద్రవ్య స్థిరత్వాన్ని పరిరక్షించడం.
10. పన్ను పారిపాలన: నిజాయితీపరుల్ని గౌరవించడం.
2017 - 18 కేంద్ర బడ్జెట్: వివిధ రంగాలకు కేటాయింపులు
వ్యవసాయం

* మంచి పంట రావాలంటే రైతుకు సకాలంలో తగినంత రుణం అందాలన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రానున్న ఆర్థిక సంవత్సరంలో రైతులకు రూ.10 లక్షల కోట్ల రుణాల పంపిణీ లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ అభివృద్థి రేటు 4.1 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. కాంట్రాక్టు వ్యవసాయంపై నమూనా చట్టాన్ని రూపొందించి రాష్ట్రాలకు పంపారు.
* డిసెంబరు 31న ప్రకటించిన మేరకు రైతులకు 60 రోజుల పాటు వడ్డీ రద్దు.
* రైతులకు అదనపు ఆదాయంగా ఉన్న పాడి పరిశ్రమ అభివృద్ధికి రూ.2 వేల కోట్ల మూలనిధితో డెయిరీ ప్రాసెసింగ్ నిధి ఏర్పాటు. మూడేళ్లలో దీన్ని 8 వేల కోట్ల రూపాయలకు పెంచే యోచన.
* ధరల స్థిరీకరణ నిధి ప్రస్తుతం రూ.3,400 కోట్ల నుంచి రూ.3,500 కోట్లకు పెంచే ప్రతిపాదన.
* భూసార పరీక్షలను వేగవంతం చేసేందుకు 648 కృషి విజ్ఞాన కేంద్రాల్లో మినీ ప్రయోగశాలల ఏర్పాటు. శిక్షణ పొందిన వారితో మరో 100 మినీ ప్రయోగశాలల ఏర్పాటుకు రాయితీతో రుణాలు.
మౌలిక రంగం
* 2017 - 18 కేటాయింపులు రూ.3,96,135 కోట్లు
* 2016 - 17 కేటాయింపులు రూ.3,48,952 కోట్లు
* 2016 - 17 సవరించిన అంచనా రూ.3,58,634 కోట్లు
* మౌలిక రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న కేంద్రం బడ్జెట్ కేటాయింపుల్లోనూ అగ్ర పీఠం వేసింది. ఈ రంగానికి అత్యధికంగా రూ.3,96,135 కోట్లు కేటాయించింది. రైల్వేలు, రహదారులు, నదులు దేశానికి జీవనాడిగా పేర్కొంటూ, ఈ రికార్డు కేటాయింపులు జరిపింది.
విద్యుత్తు రంగం
* 2017 - 18 కేటాయింపులు రూ.13,881 కోట్లు
* 2016 - 17 కేటాయింపులు రూ.12,252 కోట్లు
* 2016 - 17 సవరించిన అంచనా రూ.10,475 కోట్లు
* కేంద్ర విద్యుత్ పథకాలైన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన (డీడీయూజీజేవై), పట్టణ విద్యుత్ పటిష్ఠతకు సంబంధించిన సమగ్ర విద్యుత్ అభివృద్ధి పథకానికి (ఐపీడీఎస్) బడ్జెట్‌లో రూ.10,365 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ రెండు పథకాలకు కేటాయింపులు రూ.8500 కోట్లు మాత్రమే. సవరించిన అంచనాల్లో ఈ మొత్తాన్ని రూ.7,874 కోట్లుగా పేర్కొన్నారు.
* దేశంలో గ్యాస్ కొరత కారణంగా నిలిచిపోయిన విద్యుత్ ప్రాజెక్టులను వినియోగంలోకి తెచ్చే లక్ష్యంతో ఏర్పాటుచేసిన 'విద్యుత్ వ్యవస్థ అభివృద్ధి నిధికి రూ.750 కోట్లు కేటాయించారు.
* దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తిని రెట్టింపు చేయాలని కేంద్రం సంకల్పించింది. ప్రస్తుతం 21 రాష్ట్రాల్లో 34 సౌర పార్కులు అభివృద్ధి దశలో ఉన్నాయి. వీటి సామర్థ్యం 20 వేల మెగావాట్లు (ఇందులో 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర పార్కులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి). ఈ సామర్థ్యాన్ని 40 వేల మెగావాట్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా తెలిపింది.
* అమెరికాలోని సగటు పౌరుడి విద్యుత్ వినియోగంలో మన వినియోగం 6% మాత్రమే కావడం గమనార్హం. భారత్‌తో పోలిస్తే అమెరికాలో తలసరి విద్యుత్ వినియోగం 17 రెట్లు ఎక్కువ.
పాతికేళ్లలో దేశంలో విద్యుత్తు లెక్కలు ఇవీ (బిలియన్ యూనిట్లలో)
సంవత్సరం: అవసరం - లభ్యత
1991 - 92: 289 - 266
1995 - 96: 390 - 354
2000 - 01: 507 - 467
2005 - 06: 632 - 579
2010 - 11: 862 - 788
2015 - 16: 1,114 - 1,091
* 13వ పంచవర్ష ప్రణాళిక ప్రకారం దేశంలో విద్యుదుత్పత్తి అంచనాలు (మెగావాట్లలో)
* బొగ్గు ఆధారితం 63,400
* జల విద్యుత్తు 12,000
* అణు విద్యుత్తు 18,000
ఆరోగ్య రంగం
* 2017 - 18 కేటాయింపులు రూ.48,878 కోట్లు
* 2016 - 17 కేటాయింపులు రూ.38,448 కోట్లు
* 2016 - 17 సవరించిన అంచనా రూ.39,879 కోట్లు
* 1.5 లక్షల ఆరోగ్య ఉప కేంద్రాలను ఆరోగ్య సంక్షేమ కేంద్రాలుగా మలచడం.
* స్పెషలిస్టు డాక్టర్ల కొరతను అధిగమించడానికి ఏటా అదనంగా 5 వేల పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల సృష్టి. పెద్ద జిల్లా ఆసుపత్రుల్లో డీఎన్‌బీ కోర్సుల ఆరంభానికి చర్యలు. ఎంపిక చేసిన ఈఎస్ఐ, నగరపాలిక ఆసుపత్రుల్లో పీజీ విద్య బలోపేతం.
* వృద్ధుల కోసం ఆధార్ ఆధారిత స్మార్ట్ కార్డుల ప్రవేశం (వృద్ధుల ఆరోగ్య వివరాలతో కూడిన వీటిని ముందు 15 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతారు).

విద్యారంగం

* కేంద్ర బడ్జెట్‌లో విద్యా వ్యవస్థ పునరుద్ధరణకు తెరతీశారు. ఇందులో భాగంగా ఉన్నత విద్యా సంస్థల్లో చేరికకు ఇక అన్ని ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)గా వ్యవహరించే ఈ సంస్థ స్వయం సాధికారత ఉన్న స్వతంత్ర సంస్థ. అన్ని రకాల ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతనూ ఇదే స్వీకరించడం వల్ల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్స్ (సీబీఎస్ఈ) లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల అదనపు భారం తగ్గుతుంది. పాలనాపరమైన బాధ్యతలు వైదొలగడంతో అవి ఇక పూర్తిగా విద్యా సంబంధిత (అకడమిక్) వ్యవహారాలపై దృష్టి సారించేందుకు వీలవుతుంది. ప్రస్తుతం సీబీఎస్ఈ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ - యూజీ), సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్), జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ), యూజీసీ నెట్ తదితర ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తోంది. 2017 - 18 సంవత్సరానికి ప్రవేశ పరీక్షల ప్రకటనలు ఇప్పటికే విడుదల అయినందున నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2018 - 19 నుంచి పరీక్షల నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది.
* ఝార్ఖండ్, గుజరాత్‌లలో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను ఒక్కొక్కటి చొప్పున (రెండు సంస్థలను) ఏర్పాటు చేయనున్నారు.
* 'స్వయం' వేదిక కింద 350 ఆన్‌లైన్ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నారు. డీటీహెచ్ ఛానళ్లతో వీటిని అనుసంధానిస్తారు.
* ఉన్నత విద్యలో మన దేశం అమెరికా, చైనాలతో సమానంగా పోటీ పడుతోంది. ఈ-లెర్నింగ్ రంగంలో అమెరికా తర్వాత భారత్ 2వ స్థానంలో ఉంది. 2020 నాటికి పట్టభద్రుల సంఖ్యలో ప్రపంచంలో 2వ స్థానంలో నిలవనుంది.

రక్షణ రంగం

* రక్షణ రంగానికి కేటాయింపులు ఒక మోస్తరుగా 6.2 శాతం పెరిగాయి. గత బడ్జెట్‌తో పోలిస్తే కేటాయింపులు రూ.16 వేల కోట్లు మేర పెరిగాయి. మాజీ సైనికుల పింఛన్లను ఇందులో జోడించలేదు.
* ఖర్చు చేసే ప్రతి రూపాయిలో రక్షణ రంగ వాటా 9 పైసలు.
* మన రక్షణ అవసరాల్లో సొంతంగా ఆయుధాల ఉత్పత్తి చేసుకుంటున్నది 40 శాతం. వచ్చే ఐదేళ్లలో పెంచాలనుకుంటున్నది 70 శాతం.
* ఆయుధాల దిగుమతిని 20 - 25 శాతం తగ్గించినా దేశంలో కనీసం లక్ష మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
* ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యానికి మోదీ ప్రభుత్వం అంకురార్పణ చేస్తోంది. రిలయన్స్ ఏరో స్పేస్, పంజ్‌లాయడ్ కంపెనీలతో రాకెట్ లాంఛర్లు, రక్షణ రంగానికి తగిన వాహనాల తయారీకి ఒప్పందం చేసుకుంది.
* రక్షణ రంగ కేటాయింపుల్లో భారత్ స్థానం 4. తొలి మూడు స్థానాలు అమెరికా, చైనా, బ్రిటన్‌లవి.

సంక్షేమ రంగం
* ఎస్సీల సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.52,393 కోట్లు కేటాయించింది (గతేడాది కంటే 35 శాతం ఎక్కువ).
* ఎస్టీల సంక్షేమానికి రూ.31,920 కోట్లు.
* మైనారిటీల సంక్షేమానికి రూ.4,195 కోట్లు. చాలా ఏళ్ల తర్వాత ఈ శాఖకు నిధుల కేటాయింపు పెరగడం విశేషం.
* ఎస్సీలు, ఎస్టీలు, మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు 'స్టాండప్ ఇండియా కార్యక్రమం ప్రారంభించారు.
* ప్రతి బ్యాంకు శాఖ కనీసం ఈ వర్గాల్లో ఒక్కొక్కరికైనా సాయం అందించాలి.
* రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు నిధులు సమకుర్చుతారు. మొత్తంగా 2.5 లక్షల మందికి ఉపాధికి చేయూతనివ్వడం దీని ఉద్దేశం.
* జనాభాలో దళితులు 20.14 కోట్లు (16.6%).
* ఎలాంటి విద్యార్హత లేని ముస్లిం యువతకు వృత్తి నైపుణ్యంతో కూడిన విద్యను అందించేందుకు 2015 - 16లో 'నయీ మంజిల్' పథకాన్ని తీసుకొచ్చారు. తయారీ, ఇంజినీరింగ్, సేవలు, సాఫ్ట్‌స్కిల్స్‌లో వారికి శిక్షణ ఇస్తున్నారు.
* మైనారిటీ మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ప్రారంభించిన 'నయీ రోషిణీ' పథకం ద్వారా మూడేళ్లలో 1.67 లక్షల మందికి శిక్షణ ఇస్తున్నారు.
* ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజనకు నిధులు రెట్టింపు చేసి రూ.2700 కోట్లకు పెంచారు. ఈ పథకం కింద ఆసుపత్రిలోనే ప్రసవం చేయించుకోవడంతో పాటు తమ శిశువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించే మహిళల ఖాతాలో నేరుగా రూ.6 వేలు జమ. ఈ పథకాన్ని ఇప్పటికే 53 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు.
* ప్రధాని మానస పుత్రికగా 'బేటీ బచావో... బేటీ పడావో'కి రూ.200 కోట్లు కేటాయింపు. గతేడాది బడ్జెట్ కంటే ఇది ఐదు రెట్లు ఎక్కువ.
* 'నిర్భయ నిధి'కి గతేడాది లాగే ఈసారీ రూ.500 కోట్లు కేటాయించారు. దీంతో ఈ నిధికి కేటాయించిన మొత్తం రూ.3 వేల కోట్లకు చేరింది.
* ఆరోగ్య వివరాలు పొందుపరుస్తూ ఆధార్ కార్డు ఆధారిత స్మార్ట్ కార్డులు వయోవృద్ధులకు అందజేయాలని నిర్ణయించారు. 2017-18లో ప్రయోగాత్మకంగా 15 జిల్లాల్లో ఈ పథకం అమలుచేస్తారు.
* పదేళ్ల పాటు 8 శాతం కనీస వడ్డీ దక్కేలా వృద్ధుల కోసం ఎల్ఐసీ ఆధ్వర్యంలో ప్రత్యేక పింఛను పథకం.
పట్టణాభివృద్ధి
* గతేడాది బడ్జెట్‌లో పట్టణాభివృద్ధి శాఖకు రూ.24,523 కోట్లు కేటాయించగా తాజాగా ఈ మొత్తాన్ని రూ.34,212 కోట్లకు పెంచింది.
* ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టుకు కేంద్రం రూ.48,000 కోట్లను వెచ్చించనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంతే మొత్తాన్ని జోడిస్తాయి. ఇలా రూ.96 వేల కోట్ల నిధులతో ఐదేళ్లలో స్మార్ట్ నగరాలను తీర్చిదిద్దుతారు.
* దేశవ్యాప్తంగా 100 నగరాలను ఇలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం 2015, జూన్ 25న ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిందే 'స్మార్ట్ సిటీ' మిషన్. దీనికి 2016 - 17లో కేటాయింపులు రూ.3,205 కోట్లు. 2017 - 18లో కేటాయింపులు రూ.3,989.50 కోట్లు.
* దేశంలో నగరాలు, పట్టణాలు 7,935. పట్టణవాసులు దేశ జనాభాలో 31.16%. స్మార్ట్ సిటీ మిషన్ కింద ఇప్పటివరకు ఎంపికైన నగరాలు 60. ఇంకా ఎంపిక చేయాల్సినవి 40 (మొత్తం నగరాలు 150కి కూడా పెరగొచ్చు).
ప్రజా పంపిణీ వ్యవస్థ
* దేశంలో 1942లో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ప్రారంభమైంది. 1997 నుంచి లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థగా మారి ఆహార భద్రతకు ఆయువు పట్టుగా నిలుస్తోంది. వ్యవసాయ ఉత్పత్తిదారులకు కనీస మద్దతు ధర దక్కేలా చేయడం, ఆహార కొరత రాకుండా తగిన నిల్వలు నిర్వహించడం, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి నెలనెలా ఆహార ధాన్యాలు, పలు ఇతర సరకుల సరఫరా లక్ష్యంగా రాష్ట్రాల సహకారంతో కేంద్రం ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వహిస్తోంది.

ఉపాధి కల్పన, నైపుణ్యాలు, జీవనోపాధి రంగం
* 2017 - 18 కేటాయింపులు రూ.17,273 కోట్లు
* 2016 - 17 కేటాయింపులు రూ.12,141 కోట్లు
* 2016 - 17 సవరించిన అంచనాలు రూ.14,870 కోట్లు
* విద్య, నైపుణ్యాలు, ఉద్యోగాలతో యువతలో మరింత శక్తిని నింపడం పది ప్రధాన కార్యక్రమాల్లో ఒకటిగా ప్రభుత్వం గుర్తించింది. నైపుణ్యాల అభివృద్ధికి, ఉపాధి కల్పనకు సంబంధించి బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలు:
* 3.5 కోట్ల మంది యువతకు ఉద్యోగాలు పొందేందుకు దోహదపడే శిక్షణ కోసం రూ.4 వేల కోట్లతో 'సంకల్ప్ కార్యక్రమం అమలు.
* యువతలో నైపుణ్యాల మెరుగుదలకు రూ.2,200 కోట్లతో 'స్త్ట్రెవ్' పథకం మలి దశ ప్రారంభం.

* ప్రస్తుతం 60 జిల్లాల్లో ఉన్న ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాలు 600కు పైగా జిల్లాలకు విస్తరణ.
* విదేశీ భాషల్లో కోర్సుల నిర్వహణకు 100 'భారత అంతర్జాతీయ నైపుణ్య కేంద్రాల' ఏర్పాటు.
* 2022లోగా గ్రామాల్లోని ఐదు లక్షల మందికి తాపీ పనిలో శిక్షణ.
* గ్రామ ప్రజల నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి అవకాశాల పెంపునకు దీన్‌దయాళ్ అంత్యోదయ పథకం, జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమానికి రూ.4,500 కోట్లు.
బీ దేశంలో ఏటా చదువులు పూర్తిచేసుకుని బయటకు వస్తున్నవారు 2.6 కోట్ల మంది. వీరిలో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు ఉన్నవారు 2%, అసలు ఎలాంటి నైపుణ్యాలు లేనివారు 65%.
* 2020 నాటికి 50 కోట్లమంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా 2015లో ఎన్డీఏ సర్కారు 'స్కిల్ ఇండియా'ను ప్రారంభించింది.
* 2015 - 16లో జాతీయ నైపుణ్యాభివృద్ధి మండలికి రూ.1500 కోట్లు కేటాయించారు. దీని ద్వారా 10 రాష్ట్రాల్లో 2,400 పాఠశాలలు, 2 బోర్డుల ద్వారా 2.5 లక్షల మందికి వృత్తి శిక్షణ, తోలు అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా 51,216 మందికి వృత్తి శిక్షణ ఇచ్చారు.
* జాతీయ నైపుణ్యాభివృద్ధి మండలి 21 విశ్వవిద్యాలయాలు, కళాశాలలతో అనుసంధానమై ఉంది. నైపుణ్యాభివృద్ధి నిర్వహణ వ్యవస్థ (ఎస్‌డీఎంఎస్) ద్వారా 1400 శిక్షణ సంస్థలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఐదు చోట్ల 'పాదరక్షల రూపకల్పన, అభివృద్ధి విద్యాసంస్థ'ల ద్వారా ఏటా 1.4 లక్షల మందికి శిక్షణ ఏర్పాట్లు చేశారు.
జాతీయ రహదారుల రంగం

* 2 వేల కి.మీ. తీర ప్రాంత అనుసంధాన రహదారుల నిర్మాణం, అభివృద్ధిని కేంద్రం గుర్తించింది. వీటి ద్వారా నౌకాశ్రయాలతో మారుమూల గ్రామాలకు అనుసంధానత ఏర్పడుతుంది.
* 2014 - 15 నుంచి ఇప్పటివరకూ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద దేశవ్యాప్తంగా 1,40,000 కి.మీ. రహదారులను నిర్మించారు. ఇది అంతకు ముందు మూడు సంవత్సరాల్లో నిర్మించిన రహదారుల కంటే ఎక్కవ.
* వామపక్ష తీవ్రవాదం గల మండలాల్లో 100 మందికి పైగా నివసిస్తున్న నివాస ప్రాంతాలకు పీఎంజీఎస్‌వై కింద 2019 నాటికి రహదారుల అనుసంధానత కల్పించాలని నిర్ణయించారు.


శాస్త్ర సాంకేతిక రంగం
* శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖల (అంతరిక్ష, అణు ఇంధన; శాస్త్ర, సాంకేతిక; భూవిజ్ఞాన శాస్త్రాల శాఖలు)కు కేటాయింపులు గణనీయంగా పెంచుతూ రూ.37,435 కోట్లను ప్రతిపాదించారు. గత బడ్జెట్‌లో వీటికి రూ.32,030.72 కోట్లను ప్రత్యేకించారు.
పర్యాటక రంగం
* పర్యాటక రంగానికి తాజా బడ్జెట్‌లో రూ.1,840.77 కోట్లు కేటాయించారు.
* గత బడ్జెట్‌లో పర్యాటక రంగానికి రూ.1,590.32 కోట్లు కేటాయించగా ఈసారి రూ.200 కోట్లు పెంచారు.
* ఇందులో పర్యాటక వలయాల సమగ్ర అభివృద్ధి పథకం (స్వదేశ్ దర్శన్)కు రూ.959.91 కోట్లు ప్రత్యేకించారు. 13 పర్యాటక వలయాలు - ఈశాన్య, బౌద్ధ కేంద్రాలు, హిమాలయాలు, కోస్తా, కృష్ణా, ఎడారి, గిరిజన, పర్యావరణ, వన్యమృగ, గ్రామీణ, ఆధ్యాత్మిక, వారసత్వ వలయాల్లో సౌకర్యాలు కల్పించనున్నారు.
* 13 పట్టణాలు - అజ్మీర్, అమృత్‌సర్, అమరావతి, ద్వారక, గయా, కామాక్ష్య, కాంచీపురం, కేదారనాథ్, మథుర, పట్నా, పూరీ, వారణాసి, వేలంకణిలను అభివృద్ధి చేయనున్నారు.
* పుణ్యక్షేత్రాల పునరుద్ధరణ పథకం (పిలిగ్రిమేజ్ రిజువెనేషన్ అండ్ స్పిరిట్యుయల్ ఆగ్‌మెంటేషన్ డ్రైవ్ - ప్రసాద్)కు రూ.100 కోట్లు ఇచ్చారు.
ఆహారం, పెట్రోలియం, ఎరువులపై రాయితీలు
* ఆహారం, పెట్రోలియం, ఎరువులపై రాయితీల భారం 2017 - 18లో రూ.2,40,338.6 కోట్లకు చేరనుంది. ప్రస్తుత 2016 - 17 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది మూడు శాతం కంటే ఎక్కువ.

* 2016 - 17 సవరించిన అంచనాల ప్రకారం సబ్సిడీల బిల్లు రూ.2,32,704.68 కోట్లు. ఇందులో ఆహార రాయితీల భారం రూ.1,35,172.96 కోట్లు కాగా 2017 - 18లో ఇది రూ.1,45,338.6 కోట్లుగా ఉంటుందని అంచనా.
* రూ.70 వేల కోట్ల ఎరువుల రాయితీలో మార్పు లేదు. రూ.35 వేల కోట్ల రాయితీ బకాయిలను చెల్లించాలని దేశీయ పరిశ్రమలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కేటాయింపులు పెంచలేదు.
* ఎరువుల రాయితీలో యూరియాకు రూ.49,768 కోట్లు కేటాయించారు.
సాంస్కృతిక శాఖ
* బడ్జెట్‌లో సాంస్కృతిక శాఖకు కేటాయించిన నిధుల్లో 10 శాతం పెంపు కనిపించింది.
* గత బడ్జెట్‌లో రూ.2500 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.2738.47 కోట్లు ఇచ్చారు.
గ్రామీణాభివృద్ధి శాఖ
* గ్రామీణాభివృద్ధి శాఖకు మొత్తం కేటాయింపులు 2016 - 17లో రూ.97,760 కోట్ల నుంచి వచ్చే ఏడాదికి రూ.1,07,758 కోట్లకు పెంచారు.
* 2017 - 18 బడ్జెట్‌లో మొత్తంగా గ్రామీణ రంగానికి రూ.1,87,200 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 24 శాతం అధికం కావడం గమనార్హం. దేశ చరిత్రలో గ్రామీణ రంగానికి ఇదే అత్యధిక కేటాయింపు కూడా. ఇందులో ఒక్క గ్రామీణాభివృద్ధి శాఖకే రూ.1,07,758 కోట్లు ఇచ్చారు.
ఉపాధి హామీ పథకం
* ఈ పథకానికి రికార్డు స్థాయిలో రూ.48,000 కోట్లను కేటాయించారు.
* గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు కచ్చితంగా ఉపాధి భద్రతను కల్పించడం ఈ పథకం ఉద్దేశం. 2005లో దీని కోసం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కార్యరూపం దాల్చింది. 2008 నుంచి దేశంలోని అన్ని జిల్లాల్లో ఇది అమలవుతోంది. గ్రామాల్లో మౌలిక వసతుల పెంపునకు ఈ పథకాన్ని మరింత సమర్థంగా వినియోగించుకునే దిశగా క్రీడా ప్రాంగణాలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం లాంటి వాటిని కూడా మోదీ ప్రభుత్వం దీనిలోకి చేర్చింది.
* ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళల సంఖ్య 48 శాతం నుంచి ఇప్పుడు 55 శాతానికి చేదిందని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
స్వచ్ఛ భారత్
* 2017 - 18లో ఈ కార్యక్రమానికి రూ.13,948 కోట్లు కేటాయించారు. 2016 - 17లో ఈ కేటాయింపులు రూ.9,000 కోట్లుగా ఉన్నాయి. అంటే 55 శాతం పెంపు చోటు చేసుకుంది.
* భారత్‌ను పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మోదీ 2014 అక్టోబరు 2న ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని కోసం నిధులను సమకూర్చేందుకు గాను అరశాతం స్వచ్ఛభారత్ సెస్‌తో పాటు క్లీన్ ఎన్విరాన్‌మెంట్ సెస్‌ను కూడా వసూలు చేస్తున్నారు.
* 2019 అక్టోబరు 2 నాటికి దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం పారిశుద్ధ్యాన్ని (సెప్టిక్ మరుగుదొడ్ల నిర్మాణం) కల్పించడం లక్ష్యం.
జాతీయ గ్రామీణ తాగునీటి పథకం (ఎన్ఆర్‌డీడబ్ల్యూపీ)
* 2017 - 18 తాజా బడ్జెట్ కేటాయింపులు రూ.6,050 కోట్లు. 2016 - 17 బడ్జెట్ కేటాయింపులు రూ.5,000 కోట్లుగా ఉన్నాయి.
* భారత్ నిర్మాణ్ కార్యక్రమంలో భాగమైన ఈ పథకానికి మోదీ ప్రభుత్వం నిధులను అంతకంతకూ పెంచుతోంది. దేశంలో తాగునీటి సౌకర్యం లేని అన్ని మారుమూల గ్రామీణ ప్రాంతాలకూ సురక్షితమైన, తగినంత నీటిని అందించాలనేది ఈ పథకం లక్ష్యం. కేంద్రం నుంచి రాష్ట్రాలకు కొన్ని నిధులు మంజూరవుతాయి. మిగతా మొత్తాన్ని రాష్ట్రాలు వెచ్చించాలి.
* నాలుగేళ్లలో 28,000 ఆర్సినిక్, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని అందించాలనేది కూడా ఈ పథకంలో భాగంగా మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన
* 2017 - 18 కేటాయింపులు రూ.10,635 కోట్లు కాగా 2016 - 17లో ఇవి రూ.8,500 కోట్లుగా ఉన్నాయి.
* విద్యుత్ సౌకర్యం లేని లక్ష గ్రామాలకు కరెంటు, బీపీఎల్ కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలనే లక్ష్యంతో 2005లో ఈ పథకం ప్రారంభమైంది.
* 2015 ఏప్రిల్ 1 నాటికి దేశంలో ఇంకా 18,542 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదని మోదీ సర్కారు లెక్కగట్టింది. 2018 మే 1 నాటికల్లా దేశంలో అన్ని గ్రామాలకూ విద్యుత్ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జైట్లీ ప్రకటించారు.
గ్రామీణ టెలిఫోన్
* 2017 - 18 కేటాయింపులు రూ.11,636 కోట్లు, 2016 - 17 కేటాయింపులు రూ.2,755 కోట్లు. పెంపు 322% కావడం విశేషం.
* భారత్ నెట్ కార్యక్రమంలో భాగంగా దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ (జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ - ఎన్ఓఎఫ్ఎన్) ఇంటర్నెట్ కనెక్టవిటీతో పాటు పంచాయతీ స్థాయిలో భారత్ నిర్మాణ్ కామన్ సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా గ్రామాల్లో మొబైల్స్ వినియోగాన్ని పెంచడం, 2017 నాటికి టెలీ డెన్సిటీని 70 శాతానికి చేర్చాలన్నది లక్ష్యం.
* డిజిటల్ టెక్నాలజీ ద్వారా టెలీ మెడిసిన్, విద్య, నైపుణ్యాల కల్పన కోసం 'డిజిగావ్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. డిజిటల్ సేవల కోసం తక్కువ టారిఫ్‌లతో వైఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేయనున్నారు.
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)
* 2017 - 18 కేటాయింపులు రూ.19,000 కోట్లు. 2016 - 17 కేటాయింపులు రూ.19,000 కోట్లు. పెంపు లేదు.
* గ్రామీణ ప్రాంతాలన్నింటికీ రోడ్డు సదుపాయాల్ని కల్పించే ఉద్దేశంతో 2000లో అప్పటి వాజ్‌పేయీ ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని ప్రారంభించారు.
* 2021 నాటికి దేశంలో మిగిలిన 65,000 అర్హత గల గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రోడ్లతో అనుసంధానించేందుకు దాదాపు 2.3 లక్షల కి.మీ. మేర రోడ్లను నిర్మించాలన్నదే లక్ష్యం. దీన్ని 2019 నాటికే పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)
*
2017 - 18 కేటాయింపులు రూ.23,000 కోట్లు.
* 2016 - 17 కేటాయింపులు రూ.15,000 కోట్లు. పెంపు 53.3 శాతం.
* 2022 కల్లా దేశంలో అందరికీ సొంతింటి కలను సాకారం చేస్తామంటున్న మోదీ సర్కారు ఈ బడ్జెట్‌లో చౌక గృహ నిర్మాణ రంగానికి పోత్సాహకాలను ప్రకటించింది.
* 2019 నాటికి ఇల్లు లేని వాళ్లు, పూరిళ్లలో ఉంటున్న వారికి ఒక కోటి పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జైట్లీ పేర్కొన్నారు.
* దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న కుటుంబాలు, ఎస్‌సీ/ ఎస్‌టీలు, వికలాంగులు, బీపీఎల్ మైనారిటీలు ఈ పథకంలో లబ్ధిదారులు. వీరికిచ్చే నిధుల్లో 75 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రాలు భరిస్తాయి.
* ప్రధాన ప్రాంతాల్లో పేదలకు ఒక్కో ఇంటికి రూ.1.2 లక్షలు, కొండ ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రూ.1.3 లక్షల చొప్పున సాయాన్ని ఇస్తున్నారు.
* స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ సెప్టిక్ మరుగుదొడ్డి నిర్మాణాన్ని తప్పనిసరి చేశారు.
* పీఎంఏవై కిందకు రాని గ్రామీణ కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం, ఆధునికీకరణకు తీసుకునే రుణాల్లో రూ.2 లక్షల వరకూ మొత్తంపై 3 శాతం వడ్డీ రాయితీని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
హోం శాఖ
* 2017 - 18 కేటాయింపులు రూ.83,823.30 కోట్లు.
* 2016 - 17 కేటాయింపులు రూ.75,355.48 కోట్లు. పెంపు 11.24 శాతం
* పోలీసు బలగాలను ఆధునికీకరించడంపై ఈసారి దృష్టి పెట్టారు.
పర్యావరణ శాఖ
* 2017 - 18 బడ్జెట్‌లో పర్యావరణ శాఖకు రూ.2,250.34 కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది కంటే సుమారు 19 శాతం ఎక్కువ.
క్రీడా రంగం
* తాజా బడ్జెట్‌లో క్రీడల అభివృద్ధికి రూ.1943 కోట్లు కేటాయించారు. గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.350 కోట్లు ఎక్కువ కావడం విశేషం.
* 'ఖేలో ఇండియా' కార్యక్రమానికి భారీగా రూ.350 కోట్లు కేటాయించారు.
న్యాయ వ్యవస్థలో సంస్కరణలు
* న్యాయ వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా జాతీయ మిషన్ కింద నిధులను రూ.52 కోట్ల వరకు తాజా బడ్జెట్‌లో పెంచారు. గతంలో రూ.379.90 కోట్లు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్‌లో రూ.432.50 కోట్లు కేటాయించారు.
సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు
* క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్కింగ్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్) ప్రాజెక్టు ఈ ఏడాది పట్టాలెక్కే అవకాశం ఉంది. గతేడాది రూ.845 కోట్లు కేటాయించిన కేంద్రం తాజా బడ్జెట్‌లో రూ.800 కోట్లు కేటాయించింది. పోలీసు బలగాల ఆధునికీకరణ పథకంతో కలిపి సీసీటీఎన్ఎస్‌కు ఈ నిధులు కేటాయించారు.
తోళ్లు, పాదరక్షల రంగంలో కొత్త పథకం
* తోళ్లు, పాదరక్షల రంగంలో వృద్ధికి ఊతమివ్వడంతో పాటు ఉద్యోగాల వ్యాప్తి దిశగా ప్రభుత్వం త్వరలోనే పథకాన్ని ప్రారంభించనున్నట్లు బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి వెల్లడించారు.
* జౌళి రంగంలో మూడేళ్లలో కోటి ఉద్యోగాలను సృష్టించేందుకు గాను గతేడాది జూన్‌లో రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సంగతిని జైట్లీ గుర్తు చేశారు. అదే తరహాలో తోళ్ల పరిశ్రమలకు చేయూతనందిస్తున్నామన్నారు.
* తోళ్లు, పాదరక్షల రంగంలో మన దేశంలో 30 లక్షల మంది నేరుగా ఉపాధి పొందుతున్నారు.
* ఈ రంగంలో ప్రతి రూ.కోటి పెట్టుబడితో కొత్తగా 250 మందికి ఉపాధి దొరుకుతుందన్నది విశ్లేషకుల అంచనా.
* ఈ రంగంలో మన దేశం ఎగుమతుల విలువ ప్రస్తుతం సుమారు రూ.45 వేల కోట్లు. 2020 కల్లా ఈ మొత్తాన్ని రూ.98 వేల కోట్లను పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
రాష్ట్రాలకు పెరిగిన పన్నుల వాటా
* కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా పెరిగింది. 2017 - 18 ఆర్థిక సంవత్సరంలో రూ.6.74 లక్షల కోట్ల పన్నులను కేంద్రం రాష్ట్రాలకు పంపిణీ చేయబోతోంది. ఇది గతేడాది కంటే రూ.66,565 కోట్లు అధికం. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.29,138.82 కోట్లు, తెలంగాణకు రూ.16,505 కోట్లు రానుంది.
* ఏపీకి 2016 - 17 బడ్జెట్ కంటే ఈసారి రూ.2874.94 కోట్లు అధికంగా దక్కనుంది.
* తెలంగాణకు 2016 - 17 బడ్జెట్ కంటే ఈసారి రూ.1628.41 కోట్లు అధికంగా రానుంది.
* కేంద్ర పన్నుల్లో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు 17.95% మొత్తం దక్కుతోంది.
పార్టీలు పొందే విరాళాలపై పరిమితులు
* ఎన్నికల్లో నల్లధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు, రాజకీయ పార్టీల నిధుల సమీకరణ విధానాన్ని పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ దిశగా బడ్జెట్‌లో నూతన విధానాలను ప్రకటించింది.
* ఎన్నికల కమిషన్ సూచన మేరకు ఒక్కో వ్యక్తి నుంచి నగదు రూపంలో పార్టీలు తీసుకునే విరాళాలకు గరిష్ఠ పరిమితిని రూ.2 వేలకు తగ్గించింది. అంతకుముందు నగదు రూపంలో రూ.20 వేల వరకు విరాళం సేకరించేందుకు వీలుండేది.
* చెక్కులు, డిజిటల్ పద్ధతుల్లో దాతల నుంచి పార్టీలు విరాళాలు పొందవచ్చు. వీటిపై ఏ నియంత్రణా లేదు.
* ఆర్బీఐ చట్టానికి సవరణ చేసి ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తుంది. బ్యాంకుల్లో బాండ్లు కొనుగోలు చేసి దాతలు వాటిని పార్టీలకు విరాళాలుగా ఇవ్వవచ్చు. పార్టీలు తిరిగి బ్యాంకుల్లో వాటిని మార్చుకుని నిధులు పొందుతాయి. కొనుగోలుదారుల వివరాలు ఉంటాయి కాబట్టి ఈ విధానం పారదర్శకంగా ఉంటుంది.
ప్రభుత్వరంగ చమురు - గ్యాస్ సంస్థలన్నీ ఒకే గూటికి
* అంతర్జాతీయంగా అతి పెద్ద చమురు కంపెనీలతో పోటీపడేలా ప్రస్తుత ప్రభుత్వరంగ చమురు - గ్యాస్ కంపెనీలన్నింటినీ విలీనం చేయనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017 - 18 బడ్జెట్లో ప్రకటించారు. దేశంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారైన ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలో 13 ప్రభుత్వ రంగ చమురు కంపెనీలను విలీనం చేస్తారు.
* ఈ 13 కంపెనీల కలయిక వల్ల ఏర్పడే సంస్థ అంతర్జాతీయంగా అతిపెద్ద తొమ్మిదో దిగ్గజ చమురు కంపెనీ అవుతుంది. అదే సమయంలో రష్యాకు చెందిన రోస్ నెఫ్ట్, భారత్‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంటే పెద్దది అవుతుంది.
ఒడిశా, రాజస్థాన్‌లలో రెండు చమురు నిల్వ కేంద్రాలు
* అంతర్జాతీయ చమురు మార్కెట్ల ఊగిసలాటలను తట్టుకోవడానికి ఒడిశా, రాజస్థాన్‌లలో రెండు భూగర్భ చమురు నిల్వ కేంద్రాలను నిర్మించనున్నట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
* ఇప్పటికే విశాఖపట్నం (1.33 మి.టన్నులు), మంగళూరు (1.5 మి.ట.), పాడూర్ (2.5 మి.ట.)లలో నిల్వ కేంద్రాలున్నాయి.
ఎగుమతుల కోసం కొత్త పథకం
* ఎగుమతుల కోసం ఉపయోగించే మౌలిక వసతులకు నిధులను సమకూర్చడానికి ఒక కొత్త పథకాన్ని 2017 - 18లో ప్రారంభించనున్నట్లు బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించారు.
* 'ట్రేడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్‌పోర్ట్ స్కీమ్ (టైస్)' పేరుతో మొదలుపెట్టే ఈ పథకం ద్వారా ట్రేడర్ల లావాదేవీల వ్యయాలు తగ్గుతాయి.
* ప్రస్తుతం రాష్ట్రాల్లో మౌలిక వసతుల ఏర్పాటు కోసం భారత ఎగుమతిదార్లు తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో భారత వస్తువులపై ప్రభావం పడుతోంది.
విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) రద్దు
* ఇక విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలన్నీ సంబంధిత మంత్రిత్వ శాఖలే నిర్ణయిస్తాయి. ఇప్పటివరకు ఉన్న విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ)ను రద్దు చేస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించడమే ఇందుకు నేపథ్యం.
* అదే సమయంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానాన్ని మరింత సరళీకరించనున్నారు.
పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.72,500 కోట్లు
* రైల్వే టికెట్, క్యాటరింగ్ సేవలు అందిస్తున్న ఐఆర్‌సీటీసీ సహా మరో రెండు రైల్వే ప్రభుత్వ రంగ సంస్థలు ఐఆర్ఎఫ్‌సీ (ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్), ఐఆర్‌సీఓఎన్ (ఇండియన్ రైల్వే కన్‌స్ట్రక్ కంపెనీ)లను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
* వీటితో సహా మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల్లో వాటాల ఉపసంహరణ ద్వారా రూ.72,500 కోట్లు సమీకరించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
చిన్న సంస్థలకు ఆదాయపు పన్ను 25 శాతమే
* ఉపాధి కల్పనలో అగ్ర పాత్ర పోషిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు ఆదాయపు పన్నును 5 శాతం తగ్గించే ప్రతిపాదనను ప్రభుత్వం బడ్జెట్‌లో చేసింది.
* దేశంలోని పరిశ్రమల్లో 96 శాతం ఎంఎస్ఎంఈ విభాగంలోనివే కావడం గమనార్హం.
* రూ.50 కోట్ల వరకు వార్షిక టర్నోవర్ కలిగిన ఎంఎస్ఎంఈలకు ఆదాయపు పన్నును 25 శాతానికి తగ్గించాలని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. పెద్ద సంస్థలతో పోటీపడి, మనుగడ సాధించేందుకు సహకరించడంతో పాటు కంపెనీగా మారేందుకు ఇది ఉపకరిస్తుందన్నది ప్రభుత్వ ఉద్దేశం.
* 2015 - 16 మదింపు సంవత్సరంలో 6.94 లక్షల కంపెనీలు రిటర్నులు వేస్తే, అందులో 6.67 లక్షలు (96 శాతం) ఎంఎస్ఎంఈ విభాగంలోనివే అని, వీరందరికీ ప్రయోజనం కలుగుతుందనీ జైట్లీ తెలిపారు. ఇందువల్ల ఖజానాపై రూ.7,200 కోట్ల భారం పడనుంది.
ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధన సాయం రూ.10,000 కోట్లు
* వచ్చే ఆర్థిక సంవత్సరం (2017 - 18)లో ప్రభుత్వరంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) మూలధనం కింద రూ.10,000 కోట్లు ఇవ్వనున్నట్లు బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. ఇంధ్రధనుస్సు పథకంలో భాగంగా పై మొత్తాన్ని పీఎస్‌బీలకు అందజేయనున్నట్లు మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
* ఇంధ్ర ధనుస్సు పథకాన్ని 2015లో ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా నాలుగేళ్ల కాలంలో రూ.70,000 కోట్లను పీఎస్‌బీలకు ఇవ్వాలని నిర్ణయించింది.
ఏఐబీపీకి స్వస్తి
* రెండు దశాబ్దాలుగా అమలులో ఉన్న సత్వర సాగునీటి ప్రయోజన పథకానికి (ఏఐబీపీ) కేంద్రం స్వస్తి పలికింది. ఇక నుంచి జాతీయ హోదా ప్రాజెక్టులు, గతంలో ఏఐబీపీ కింద, ప్రస్తుతం ప్రధానమంత్రి కృషి సించయి యోజన కింద గుర్తించిన ప్రాజెక్టులకు నాబార్డు ద్వారానే నిధులు అందుతాయి. ఇందుకోసం జలవనరుల మంత్రిత్వ శాఖ ద్వారా నాబార్డులో పెట్టుబడికి రూ.9,020 కోట్లు కేటాయించింది.
* 1996 - 97 నుంచి అమలులో ఉన్న సత్వర సాగునీటి ప్రయోజన పథకాన్ని (ఏఐబీపీ) కూడా పీఎంకేఎస్‌వై (ప్రధానమంత్రి కృషి సించయి యోజన) కిందకు కేంద్రం తెచ్చింది.
చౌక గృహాల నిర్మాణానికి మౌలిక హోదా

కేంద్రం అందించే సాయంతో రాష్ట్రాల్లో నడిచే పథకాలు (సీఎస్ఎస్)
* దేశాభివృద్ధికి కేంద్రం అందించే సాయంతో రాష్ట్రాల్లో నడిచే పథకాలు చాలా కీలకమైనవి. ముఖ్యంగా శుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం, పోలియో నిర్మూలన, టీబీ నియంత్రణ, అందిరికీ విద్య లాంటి జాతీయ స్థాయి లక్ష్యాలను చేరుకోవడానికి కేంద్రం వివిధ పథకాల కింద రాష్ట్రాలకు నిధులు అందిస్తుంటుంది. ప్రాధాన్యత రీత్యా వీటిని మూడు రకాలుగా చెప్పుకోవచ్చు.

2017 - 18 ఆర్థిక సంవత్సరానికి వర్తించే పన్ను శ్లాబులు:

2017 - 18 బడ్జెట్ విశిష్టతలు
1. మామూలుగా ఫిబ్రవరి మాసాంతంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం శతాబ్దాల ఆనవాయితీ. కానీ నిర్వహణ సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి నెల రోజులు ముందుకు జరిపి ఫిబ్రవరి 1నే ప్రవేశపెట్టారు.
2. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం ప్రస్తావన లేకుండా సమర్పించిన బడ్జెట్ ఇది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడంతో తొలిసారిగా ఈ మార్పు తీసుకొచ్చారు.
3. రైల్వేలకు వేరేగా బడ్జెట్ సమర్పించడం ఆనవాయితీ. ఈసారి రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ లేకుండా దాన్ని ఒక పద్దుగా సాధారణ బడ్జెట్‌లోనే కలిపేశారు.

4. పథకాలను కేంద్ర ప్రణాళిక, రాష్ట్ర ప్రణాళిక అంటూ వేర్వేరుగా చూపకపోవడమూ పెద్ద మార్పే. కేంద్రం నేరుగా అమలుచేసేవి, రాష్ట్రాల వెనకుండి కేంద్రం నడిపించేవి ఇలా రెండే వర్గాలుగా ప్రతిపాదించారు.
5. త్వరలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమలు కానున్న నేపథ్యంలో సేవా పన్ను, ఎక్సైజ్ సుంకాల ప్రస్తావన ఉన్న చిట్టచివరి బడ్జెట్ ఇదే కావొచ్చు.

కేంద్ర బడ్జెట్ - తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు
* రాష్ట్ర విభజన చట్టంలో నిర్దేశించిన పారిశ్రామిక పన్ను రాయితీలకు కేంద్ర ప్రభుత్వం మళ్లీ మొక్కుబడిగానే నిధులను కేటాయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి 2017 - 18 బడ్జెట్‌లో రూ.100 కోట్లే కేటాయించింది. విభజన తర్వాత పారిశ్రామిక రంగానికి ప్రత్యక్ష పన్ను రాయితీలిస్తామని కేంద్రం ప్రకటించింది.
* తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు గతేడాది రూ.కోటికేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాన్ని వరంగల్‌లో స్థాపించాలని నిర్ణయించింది. స్థల ఎంపిక పూర్తయింది. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.100 కోట్లను ప్రభుత్వం కోరింది. కాగా రూ.5 కోట్లనే కేటాయించింది.
* మహిళల సాధికారత, డిజిటల్ అక్షరాస్యత కోసం అంగన్‌వాడీ కేంద్రాల్లో మహిళా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో తెలంగాణలో 35,700 కేంద్రాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి.
* విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో నిర్మించబోయే మెట్రో రైలు ప్రాజెక్టులు సహా పలు మెట్రో ప్రాజెక్టులకు బడ్జెట్‌లో రూ.18,366 కోట్లు కేటాయించారు. దీని ప్రకారం విజయవాడ, విశాఖ మెట్రోలకు పెద్ద మొత్తంలో నిధులు వచ్చే అవకాశం ఉంది.
* తిరుపతి, విశాఖపట్నం, కాకినాడలను కేంద్రం ఆకర్షణీయ నగరాల జాబితాలో ప్రకటించింది. ఒక్కో నగరానికి కేంద్రం ఐదేళ్లలో రూ.500 కోట్ల నిధులు ఇస్తుంది.
రైల్వే బడ్జెట్
* 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలిసారి రైల్వే బడ్జెట్ ప్రణాళికను సాధారణ బడ్జెట్లో భాగంగా పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
ముఖ్యాంశాలు:
* 2017 - 18 ఆర్థిక సంవత్సరంలో రైల్వేల్లో మూలధన, అభివృద్ధి వ్యయాన్ని రూ.1,31,000 కోట్లుగా (గత బడ్జెట్‌లో కంటే రూ.10 వేల కోట్లు అదనం) ప్రతిపాదించారు. భారతీయ రైల్వేను అభివృద్ధి పథాన నడిపించేందుకు దోహదపడే కీలక నిర్ణయమిది. ఇందులో రూ.55 వేల కోట్లను ప్రభుత్వం బడ్జెట్ నుంచి సమకూరుస్తుంది.
* ఆన్‌లైన్‌లో ఐఆర్‌సీటీసీ ద్వారా రైలు టికెట్లను కొనుగోలు చేసే వారికి సర్వీస్ ఛార్జి ఉండదు. ప్రస్తుతం స్లీపర్ టికెట్ బుక్ చేస్తే రూ.10, ఏసీ టికెట్టుకు రూ.40 సర్వీస్ ఛార్జి వసూలు చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ ఛార్జీల్ని రద్దు చేశారు. ఏప్రిల్ నెల నుంచి ఇది అమల్లోకి వస్తుంది. రైల్వేల్లో నగదు రహిత రిజర్వేషన్లు 58 శాతం నుంచి 68 శాతానికి పెరిగాయి.
* 9 రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి రైల్వేలు సంయుక్త రంగ ప్రాజెక్టుల్ని అమలు చేస్తాయి. నిర్మాణాలు, అభివృద్ధి కోసం ఇప్పటికే 70 ప్రాజెక్టుల్ని గుర్తించారు.

* 2017 - 18 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 3500 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లు పనిచేయడం ప్రారంభిస్తాయి. 2016 - 17లో ఇది 2,800 కి.మీ. మాత్రమే.
* రైల్వేల్లోని అన్ని బోగీల్లో 2019 కల్లా జీవ మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తారు. ఘన వ్యర్థాలను పర్యావరణ అనుకూలమైన రీతిలో నిర్మూలించడం, జీవ వ్యర్థాలను ఇంధనంగా మార్చడం కోసం దిల్లీ, జైపూర్ రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మక ప్లాంట్ల ఏర్పాటు. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఇలాంటివి మరో ఐదు ప్లాంట్ల ఏర్పాట్లకు ప్రతిపాదన.
* పట్టణ రవాణాలో మెట్రో రైలు ప్రధాన సాధనంగా మారింది. అందువల్ల త్వరలో కొత్త మెట్రో రైలు విధానాన్ని ప్రకటిస్తారు. అధునాతన అమలు పద్ధతులు, ఆర్థిక నిర్వహణ లాంటివన్నీ ఇందులో ఉంటాయి. దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
* దేశవ్యాప్తంగా ఉన్న 14 మెట్రో రైలు ప్రాజెక్టులకు రూ.17,810 కోట్లు కేటాయింపు. దిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కత, ముంబయి, జైపూర్, కొచ్చిన్, వైజాగ్, విజయవాడ, అహ్మదాబాద్, లఖ్‌నవూ, నాగపూర్, పుణె, నోయిడా మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వ వాటా, రుణాలు, సహాయం రూపంలో ఈ మొత్తాన్ని అందిస్తారు.
* రైల్వే ప్రభుత్వరంగ సంస్థలైన ఐఆర్‌సీటీసీ, ఐఆర్ఎఫ్‌సీ, ఐఆర్‌సీఓఎన్‌లను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేస్తారు.
* ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా రూ.లక్ష కోట్ల కార్పస్ నిధితో 'రాష్ట్రీయ రైల్ సంరక్ష కోచ్ (జాతీయ రైలు భద్రత నిధి)ను ఏర్పాటు చేస్తారు. బ్రాడ్‌గేజ్ లైన్లపై కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌లను 2020 కల్లా పూర్తిగా తొలగిస్తారు.
* ఆధునికీకరణకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం రైల్వే స్టేషన్లను కేంద్రం ఎంపిక చేసింది.
* ఆంధ్రప్రదేశ్‌కు నూతన రైల్వే జోన్‌పై బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనా చేయలేదు.
* సికింద్రాబాద్ పరిధిలో ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంటు ఏర్పాటుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది.

- సీహెచ్.కృష్ణప్రసాద్

posted on 13.2.2017