Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

కేంద్ర బడ్జెట్ 2016 - 17

బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన తేదీ: 29.02.2016
2016-17 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
వ్యవసాయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న గ్రామీణ భారతాన్ని ఆదుకొనేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నడుం బిగించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ లోక్‌సభలో ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్లో పూర్తిగా పేదల పక్షం వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, అక్కడ ఆదాయ మార్గాలను పెంచి ఆత్మహత్యలను నివారించేందుకు ఏకంగా రూ.1.77 లక్షల కోట్ల నిధులు కేటాయించారు.
వ్యక్తిగత, కార్పొరేట్ ఆదాయపు పన్ను అంచెల్లో ఎలాంటి మార్పులూ చేయలేదు. రూ.ఐదు లక్షల్లోపు ఆదాయమున్న చిరుద్యోగులకు రిటర్నుల సమర్పణకు ప్రతిఫలంగా అదనంగా మరో రూ.3 వేల ఆదాయపు పన్ను రాయితీ ఇచ్చారు. ఇప్పుడు రూ.రెండు వేల రాయితీ ఉంది. మధ్య తరగతిని మాత్రం ఈ ఏడాదికిలా సర్దుకోమని చెప్పారు. అద్దె భత్యం వర్తించని ఉద్యోగులకు రూ.60 వేల వరకు అద్దె కింద మినహాయింపునిచ్చారు. ప్రస్తుతం ఇది రూ.24 వేలు మాత్రమే. ఈ రెండు రాయితీలతో ప్రస్తుత బడ్జెట్లో ఒక వ్యక్తికి సిద్ధించే అవకాశం ఉన్న గరిష్ఠ ప్రయోజనం 6,600 రూపాయలు. మరోపక్క రూ.కోటి పైబడిన ఆదాయం వచ్చే వారికి మరో 3 శాతం (మొత్తం 15%) సర్‌ఛార్జి వడ్డించారు. దాదాపు అన్ని రకాల కార్లపై కాలుష్యం పన్ను వేశారు. దాంతో అన్ని రకాల కార్ల ధరలు పెరగనున్నాయి. విలాస కార్లకు గరిష్ఠంగా 2.5 శాతం వేశారు. కార్లపై పన్ను కాస్త మధ్య తరగతికి నొప్పించే విషయమే. 'దేశీయ నల్లధనం' వెల్లడించేందుకు జైట్లీ ధనవంతులకు 45 శాతం అపరాధ రుసుంతో మరోమారు అవకాశం ఇచ్చారు. ఇందులో 30 శాతం పన్ను. 7.5 శాతం అపరాధ రుసుం. మరో 7.5 శాతం మొత్తాన్ని 'కృషి కల్యాణ్' సర్‌ఛార్జి పేరుతో వ్యవసాయరంగ అభివృద్ధికి ఉపయోగిస్తారు. ఈ ఆదాయానికి లెక్కలు అడగరు. విదేశాల్లో దాచిన నల్లధనం అయితే 60 శాతం పన్ను కట్టాలి. రైతుల కోసం శీతల గిడ్డంగుల వ్యవస్థలు నిర్మించేందుకు దేశంలోని అన్ని సేవలపై అర శాతం 'కృషి కల్యాణ్'సెస్ వేశారు. దాంతో పన్ను వర్తించే అన్ని రకాల సేవల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. ఈపీఎఫ్, ఇతర భవిష్యనిధి, పెన్షన్‌నిధి ఖాతాలకు 2016 ఏప్రిల్ 1 తర్వాత జమ అయ్యే మొత్తాల్లో 60 శాతం సొమ్ముపై విత్‌డ్రాయల్ సమయంలో పన్ను వేయాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఇలాంటి ఇతర పథకాలకు వంద శాతం పన్ను ఉన్నందున సమాన అవకాశాల పేరుతో ఈపీఎఫ్‌కు కూడా పన్ను ప్రతిపాదించారు. గృహరుణం వడ్డీపై పన్ను రాయితీని రెండున్నర లక్షలకు (కొత్తగా రూ.50 వేలు) పెంచారు. ఇంటి విలువ రూ.50 లక్షలకు, రుణం విలువ రూ.35 లక్షలకు మించకూడదని పరిమితి విధించారు. ఆర్థిక మాంద్యం ప్రపంచమంతా అలముకున్నా ఎగుమతి ఆధార పరిశ్రమలకు ఎలాంటి రాయితీలు ప్రకటించలేదు. ద్రవ్యలోటును తగ్గించే కార్యక్రమానికి కట్టుబడుతూనే ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి నూతన విధానం ప్రకటించారు.

ప్రధాని నరేంద్ర మోదీ మానస పుత్రిక అయిన 'మేకిన్ ఇండియా'కు ఊపునిచ్చేందుకు స్టార్టప్‌లకు వచ్చే ఐదేళ్లలో మూడేళ్ల పాటు వంద శాతం పన్ను మినహాయింపు ప్రకటించారు. పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నీరుగార్చేందుకు ఎక్సైజ్ పన్నును 10 శాతం నుంచి 15 శాతానికి పెంచారు. చిరుద్యోగులకు ఇచ్చే రాయితీ వల్ల ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూ.1060 కోట్లు తగ్గుతున్నా పరోక్ష పన్నుల ఆదాయం పెరగడంతో రూ.19,610 కోట్ల అదనపు ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరంలో వస్తుందని జైట్లీ అంచనా వేశారు. ఆర్థిక మందగమన పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వపు ఖర్చును 15.3 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.19.78 లక్షల కోట్లు ఖర్చు పెడతారు. అందులో 5.5 లక్షల కోట్లు ప్రణాళిక వ్యయం. మొత్తం బడ్జెట్లో రూ.1.62 లక్షల కోట్లు ఒక్క రక్షణ రంగానికే కేటాయించారు. అప్పులపై వడ్డీ చెల్లింపుల భారం రూ.4.42 లక్షల కోట్ల నుంచి రూ.4.92 లక్షల కోట్లకు (బడ్జెట్లో నాలుగో వంతు) పెరిగింది. సబ్సిడీల భారం స్వల్పంగా తగ్గి రెండున్నర లక్షల కోట్లకు చేరింది.
''గ్రామీణ భారతం దురవస్థలో ఉంది. సవాళ్లను ఎదుర్కొంటోంది. అందుకే గ్రామీణ సామాజిక రంగానికి, మౌలిక సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం'' అని చెప్పారు. రాయితీలను ఎత్తేస్తూ కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి క్రమంగా తగ్గిస్తానని గత బడ్జెట్లో ఇచ్చిన హామీని జైట్లీ ప్రస్తావించారు. కొత్తగా పెట్టే యూనిట్లకు ఎలాంటి పన్ను రాయితీలు అడగకుండా ఉంటే 25 శాతం పన్ను విధానాన్ని ఇప్పుడే వర్తింపజేయడానికి సిద్ధమని చెప్పారు. దీర్ఘకాలిక మూలధన లాభాల స్వీకరణ పన్ను వర్తించకుండా ఉండే పరిమితిని 3 ఏళ్ల నుంచి 2 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు జైట్లీ వెల్లడించారు. ఏడాదికి పది లక్షలకు మించి డివిడెండ్ అందుకొనే వ్యక్తులకు, కుటుంబాలకు పది శాతం అదనపు పన్ను వేయాలని, ఈ మొత్తాన్ని వ్యవసాయ రంగానికి వెచ్చించాలని ప్రతిపాదించారు. బ్యాంకులు, బీమా సంస్థలు దివాలా పరిస్థితిని ఎదుర్కోకుండా నివారించేందుకు సమగ్ర ప్రవర్తనా నియమావళిని చట్టరూపంలో తెస్తామన్నారు. అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న సంస్థలను నిరోధించేందుకు కేంద్రం చట్టం తెస్తుందని చెప్పారు. ఆరోగ్య భద్రత పథకం కింద కుటుంబానికి రూ.లక్ష వరకు కవరేజి వర్తించేట్లు చూస్తామని ప్రకటించారు. భారత్‌లో ఆహార పదార్థాల ఉత్పత్తి, మార్కెటింగ్‌లో 100 శాతం ఎఫ్‌డీఐకి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. చిన్న దుకాణాలు వారమంతా తెరిచి ఉంచే వెసులుబాటు కల్పిస్తామని, 2018 మే నాటికి 100 శాతం గ్రామాల్లో విద్యుదీకరణ పూర్తి చేస్తామని, ఆధార్‌కు చట్టబద్ధత కల్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
వ్యవసాయ రంగం
దేశంలో రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేసే లక్ష్యంతో వ్యవసాయం, రైతుల సంక్షేమానికి మొత్తంగా రూ.44,485 కోట్లు కేటాయించారు. ఇందులో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు నికరంగా రూ.19,394 కోట్లు కేటాయించారు.
2017 మార్చి నాటికి 14 లక్షల మంది రైతులకు భూసార కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జాతీయ భూసార, సాఫల్య పథకానికి రూ.368 కోట్లు కేటాయించారు.
'పర్మపరాగత్ కృషి వికాస యోజన' ద్వారా వచ్చే మూడేళ్లలో 5 లక్షల ఎకరాల్లో సేంద్రియ సాగుకు ప్రోత్సాహం. ఈశాన్య భారతదేశంలో సేంద్రియ సాగు అభివృద్ధి. ఈ రెండింటికీ రూ.412 కోట్లు ఇచ్చారు.
దేశవ్యాప్తంగా ఉన్న 674 కృషి విజ్ఞాన కేంద్రాల పనితీరు పెంచే లక్ష్యంతో రూ.50 లక్షల బహుమతి మొత్తంతో జాతీయ స్థాయి పోటీ నిర్వహిస్తారు.
వ్యవసాయ రుణాలకు పెద్దపీట
రైతులకు సకాలంలో, తగినంత వ్యవసాయ రుణాలు అందించే దిశగా కార్యాచరణ. 2015-16లో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.8.5 లక్షల కోట్లు కాగా 2016-17కి మునుపెన్నడూ లేనంతగా రూ.9 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వ్యవసాయ రుణాలపై వడ్డీ భారం నుంచి రైతులకు ఉపశమనం కలిగించేందుకు రూ.15,000 కోట్లు కేటాయించారు.
ఏకీకృత వ్యవసాయ విపణి
ఈ ఏడాది ఏప్రిల్ 14న ఏకీకృత వ్యవసాయ విపణి (యూనిఫైడ్ అగ్రికల్చర్ మార్కెట్)ని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా 585 టోకు విపణులతో అనుసంధానిస్తూ ఈ-మార్కెట్ వేదిక ఏర్పాటుచేస్తారు.
దేశంలో రైతులందరికీ కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా చూస్తారు.
ఎరువులు
ఎరువుల విషయంలోనూ ప్రత్యక్ష నగదు బదిలీని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఎంపికచేసిన కొన్ని జిల్లాల్లో ఇది అమలు చేస్తారు.
ఎరువులపై రాయితీలకు 2015-16 బడ్జెట్‌లో రూ.73 వేల కోట్లు కేటాయించారు.
ఎరువుల తయారీ సంస్థలకు చెందిన 2000 విక్రయశాలల్లో వచ్చే మూడేళ్లలో భూసార, విత్తన పరీక్షలకు ఏర్పాట్లు చేస్తారు.
పాడిరైతులకు
రైతు కుటుంబాలు పాడిపరిశ్రమ ఆధారంగా అదనపు ఆదాయం సమకూర్చుకునేలా నాలుగు పథకాలను ప్రకటించి రూ.850 కోట్లు కేటాయించారు. పశువుల ఆరోగ్యానికి సంబంధించిన 'పశుధన్ సంజీవని'లో భాగంగా పాడిపశువులకు 'నకుల్ స్వస్థ పత్ర' పేరుతో ఆరోగ్య కార్డులు జారీ చేస్తారు. పశుసంపద వృద్ధి లక్ష్యంగా అధునాతన సంతానోత్పత్తి విధానాల అమలు. ఈ-పశుధన్ హాత్ పేరిట ఆన్‌లైన్ మార్కెటింగ్ సౌకర్యం, దేశీయ పశుజాతుల అభివృద్ధికి జాతీయ జినోమ్ కేంద్రం ఏర్పాటును బడ్జెట్‌లో పేర్కొన్నారు.
భారత ఆర్థిక రంగానికి వ్యవసాయమే వెన్నెముక. దేశంలోని 58% గ్రామీణ కుటుంబాలకు వ్యవసాయమే జీవనాధారం.
సాగుభూమి పరంగా మొదటి 5 స్థానాల్లో ఉన్న దేశాలు
దేశం (హెక్టార్లలో) వ్యవసాయ భూమి మొత్తం భూమిలో శాతం
అమెరికా
భారత్
చైనా
రష్యా
బ్రెజిల్
16,69,30,200
15,83,20,000
15,04,35,000
11,92,30,000
6,61,29,900
18.22
48.15
16.13
7.28
7.82
భారత్ మొత్తం భూభాగం: 32,87,59,000 హెక్టార్లు
మొత్తం వ్యవసాయ భూమి: 15,83,20,000 హెక్టార్లు
మొత్తం భూభాగంలో సాగు అవుతున్నది 48.15%
పట్టుగొమ్మ
దేశ ఎగుమతుల్లో 10 శాతం వ్యవసాయ ఉత్పత్తులే.
దేశంలో 26 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తవుతున్నాయి.
2014-15లో జీడీపీలో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 17.01
వృద్ధికి ఇవి అవసరం:
గోదాములు
శీతల గిడ్డంగులు
సాగునీటి సదుపాయాలు
యాంత్రీకరణ
దిగుబడి పెంచే సాంకేతికత
రైతులకు ప్రోత్సాహకాలు
ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ స్థానం ఎక్కడ?
రకం స్థానం మొదటి స్థానం
బియ్యం 2 చైనా
గోధుమలు 2 చైనా
పప్పుధాన్యాలు 1 భారత్
చిరుధాన్యాలు 1 భారత్
పొద్దుతిరుగుడు 13 ఉక్రెయిన్
వేరుసెనగ 2 చైనా
ఆరుగాలం కష్టించినా అక్కరకు రాని సాగుతో దిగాలుపడుతున్న అన్నదాతకు ధీమా కల్పించాలన్న లక్ష్యంతో మోదీ సర్కారు ప్రవేశపెట్టిన ''ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన'' వ్యవసాయ నిపుణుల ప్రశంసలు అందుకుంటోంది. పంటల బీమా చరిత్రలోనే అతి తక్కువ ప్రీమియంతో ప్రవేశపెట్టిన దీనికి తాజా బడ్జెట్‌లో రూ.5,500 కోట్లు కేటాయించారు.
ప్రపంచంలో అత్యధిక శాతం భూమిని వ్యవసాయానికి వినియోగిస్తున్న దేశం బంగ్లాదేశ్ - 68.6% (1,06,75,100 హెక్టార్లు).
ఆ తర్వాతి స్థానం ఉక్రెయిన్ 55.3%, మూడో స్థానం భారత్.
2019 నాటికి 50 శాతం పంట విస్తీర్ణానికి బీమా కల్పించాలనేది లక్ష్యం.
ఆదాయ పరిమితి
      గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతులే ప్రధానాంశాలుగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే, పన్ను చెల్లింపుదారులకు పెద్దగా ప్రయోజనం కల్పించలేదనే చెప్పాలి. ఆదాయపు పరిమితిని పెంచడం, శ్లాబుల్లో సవరణ తదితరాల జోలికి ప్రభుత్వం వెళ్లలేదు. స్వల్పాదాయ వర్గాలకు మాత్రం రూ.3 వేల అదనపు పన్ను రాయితీ కల్పించడం ఊరట. రూ.2,50,000 ఆదాయ పరిమితిలో ఎలాంటి మార్పూ చేయలేదు.
పన్ను రాయితీ: ఆదాయ పన్ను చట్టం 'సెక్షన్ - 87ఎ' ప్రకారం పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షల్లోపు ఉన్నప్పుడు, చెల్లించాల్సిన పన్నులో రూ.2 వేల వరకూ రిబేటు వస్తుంది. ఈ బడ్జెట్‌లో దీన్ని రూ.5 వేలకు పెంచారు. స్వల్పాదాయ పన్ను చెల్లింపుదార్లకు అందించిన ఏకైక ప్రయోజనం ఇదొక్కటే. దీనివల్ల దాదాపు 2 కోట్ల మంది ప్రయోజనం పొందుతారని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
ఉదాహరణకు ఒక వ్యక్తి పన్ను వర్తించే ఆదాయం రూ.3,50,000 ఉన్నప్పుడు, అతను రూ.10 వేల పన్ను చెల్లించాల్సి వస్తుంది. కొత్తబడ్జెట్ లెక్కల ప్రకారం ఇప్పుడు అతను చెల్లించాల్సిన పన్ను రూ.5 వేలే!
ఇంటి అద్దె: కొంతమంది ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం లభించదు. ఇలాంటివారు సెక్షన్ 80 జీజీ కింద రూ.24 వేల వరకూ లేదా వాస్తవంగా చెల్లించిన అద్దె మొత్తం ఆదాయంలో 10 శాతానికి మించి ఉంటే.. రెండింటిలో ఏది తక్కువయితే అది మినహాయింపు పొందొచ్చు. కొత్త బడ్జెట్‌లో దీన్ని రూ.60 వేలకు పెంచారు.
కొత్తగా ఇంటి రుణం: కొత్తగా ఇల్లు కొనేవారికి అదనపు మినహాయింపు కల్పించారు. ప్రస్తుత విధానంలో గృహరుణంపై వడ్డీకి రూ.2 లక్షల వరకూ మినహాయింపు లభిస్తోంది. దీనికి అదనంగా రూ.50 వేల వరకూ వడ్డీ మినహాయింపును ప్రతిపాదించారు.
ఇంటి విలువ రూ.50 లక్షల లోపు, రుణం రూ.35 లక్షల లోపు ఉండాలి.
చిన్న వ్యాపారులకు ఊరట: సెక్షన్ 44 ఏడీ కింద రూ.కోటి వరకూ వార్షిక అమ్మకాలు ఉన్నవారు ఎలాంటి పుస్తకాలూ నిర్వహించక్కర్లేదు. ఇప్పుడు ఈ పరిమితిని రూ.2 కోట్లకు పెంచారు. ప్రతిపాదిత బడ్జెట్‌లో రూ.50 లక్షల్లోపు ఆదాయం ఉన్నవారికీ ఈ సెక్షన్‌ను వర్తింపజేశారు.
డివిడెండ్లపై: ప్రస్తుత విధానంలో డివిడెండ్లపై ఎలాంటి పన్నూ లేదు. కొత్త విధానంలో ఏడాదికి రూ.10 లక్షల కంటే ఎక్కువ డివిడెండు పొందినప్పుడు 10% పన్ను చెల్లించాలి.
కార్పొరేట్ పన్నులు: కొత్త బడ్జెట్‌లో కార్పొరేట్ వర్గాలకూ పెద్ద ప్రయోజనాలేమీ కల్పించలేదు. చిన్న వ్యాపార సంస్థలకు మాత్రం కొంత పన్ను రాయితీ కల్పించారు.
మార్చి 1, 2016 తర్వాత నమోదై, ప్రారంభమయ్యే తయారీ సంస్థలకు వర్తించే పన్ను శాతాన్ని 25 శాతానికి తగ్గించారు. దీనికి సర్‌ఛార్జి అదనం. ఆ సంస్థ పెట్టుబడి ఆధార మినహాయింపులుగానీ, అదనపు తరుగుదలలుగానీ కోరకూడదు.
వార్షిక టర్నోవర్ రూ.5 కోట్లలోపు ఉన్న కంపెనీలు 29% ఆదాయ పన్ను చెల్లించాలి.
అంకుర సంస్థలకు: అంకుర సంస్థలకు మొదటి ఐదేళ్లలో మూడేళ్లపాటు ఎలాంటి పన్నులూ చెల్లించనక్కర్లేకుండా 100% పన్ను రాయితీ ఇచ్చారు. ఏప్రిల్, 2016 నుంచి మార్చి, 2019 మధ్య ప్రారంభమయ్యే సంస్థలకే ఇది వర్తిస్తుంది.
నమోదుకాని కంపెనీల్లో పెట్టుబడుల దీర్ఘకాలిక మూలధన రాబడి వ్యవధిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించారు.
బ్యాంకింగేతర రుణ సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లకు వసూలు కాని, రాని బాకీలపై మినహాయింపు ప్రతిపాదించారు. ఈ మినహాయింపు వార్షికాదాయంలో 5 శాతం మేరకే అనుమతిస్తారు.
పింఛను పథకాల్లో: జాతీయ పింఛను పథకంలో మదుపు చేసిన మొత్తాన్ని ఉపసంహరించుకునేప్పుడు 40 శాతం మేర పన్ను మినహాయింపు లభిస్తుంది. మిగతా 60 శాతానికి పన్ను చెల్లించాలి. గుర్తింపు పొందిన ప్రావిడెంట్‌ఫండ్‌ల‌లో ఏప్రిల్ 1, 2016 తర్వాత జమచేసే మొత్తాలకు ఇది వర్తిస్తుంది. ఖాతాదారుడి వారసులు ఈ మొత్తాన్ని పొందినప్పుడు పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. సెక్షన్-10లో ప్రతిపాదించిన సవరణ ప్రకారం ఈపీఎఫ్ విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది.

కోటి దాటితే: రూ.కోటికి మించి ఆదాయం ఉన్న వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థలపై 12% సర్‌ఛార్జి విధిస్తున్నారు. కొత్తబడ్జెట్ ప్రకారం ఇది 15% కానుంది. మూలం వద్ద పన్ను వసూలు (టాక్స్ డిడెక్టెడ్ ఎట్ సోర్స్) చేసే వాటిలో అదనంగా చేర్చినవి...
రూ.10 లక్షలకు మించిన కారు కొనుగోలు చేసినప్పుడు మూలం వద్ద 1% వసూలు చేస్తారు.
రూ.2 లక్షలకు మించి నగదు కొనుగోళ్లు జరిపినా, సేవలు పొందినా 1% పన్ను అదనం.
పట్టణాలకు పట్టం
     దేశంలోని పట్టణాలు, నగరాల అభివృద్ధికి బడ్జెట్‌లో కేంద్రప్రభుత్వం ప్రాధాన్యం కల్పించింది. 'అటల్ పునరుజ్జీవన, పట్టణ రూపాంతీకరణ' (అమృత్) పథకానికి రూ.4,091 కోట్లను, 'ఆకర్షణీయ నగరాల'కు (స్మార్ట్‌సిటీలకు) రూ.3,205 కోట్లను కేటాయించింది. రెండుపథకాలకు కలిపి మొత్తంగా చూస్తే ఇది రూ.7,296 కోట్లు.
ఆకర్షణీయ నగరాలు
     'స్మార్ట్‌సిటీ'ల కింద దేశవ్యాప్తంగా 100 నగరాలను అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. దీనికి సంబంధించిన విధివిధానాలను గతేడాది జూన్‌లో కేంద్రప్రభుత్వం విడుదల చేసింది. వీటి ఆధారంగా తొలి 20 నగరాల పేర్లను గతనెల ప్రకటించింది. రెండు, మూడోదశల్లో 40 చొప్పున మిగిలిన 80 నగరాల పేర్లను వెల్లడించనుంది. ఒక్కో నగరానికి ఐదేళ్లవ్యవధిలో రూ.500 కోట్లను అందజేస్తారు. ఆయారాష్ట్ర ప్రభుత్వాలు కూడా రూ.500 కోట్లను ఈ నగరాల అభివృద్ధికి కేటాయించాల్సి ఉంటుంది. 'ఆకర్షణీయ నగరాల' పథకంలో భాగంగా ఆయానగరాల్లో స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రజారవాణా, సరసమైన ధరల్లో గృహవసతి, ఇంటర్నెట్ అనుసంధానం, ఐటీసేవలు, డిజిటలీకరణ, ఈ-పాలనలో పౌరులకు భాగస్వామ్యం, పర్యావరణ పరిరక్షణ, శాంతిభద్రతలు, విద్య, వైద్యాలకు ప్రాధాన్యతనిస్తారు.
ప్రవేశపెట్టిన పథకాలు
      పట్టణాల అభివృద్ధికి కేంద్రం ఇప్పటివరకూ తీసుకొచ్చిన పథకాలు.. ఆకర్షణీయ నగరాలు, అమృత్, వారసత్వ నగరాల అభివృద్ధి పథకం (హృదయ్), చిన్న - మధ్య తరహా పట్టణాల అభివృద్ధి, ఈశాన్య రాష్ట్రాల పట్టణాభివృద్ధి, మెట్రోరైలు ప్రాజెక్టులు. మొత్తంగా పట్టణాభివృద్ధికి వచ్చే 15 ఏళ్లలో రూ.40 లక్షల కోట్లు అవసరమని అంచనా.
అమృత్
      ఈ పథకంలో భాగంగా పట్టణాల్లో ప్రాథమిక సౌకర్యాలను నెలకొల్పుతారు. వీటిలో తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా ముఖ్యమైనవి. 18 రాష్ట్రాల్లోని 474 పట్టణాలను అమృత్ కింద గుర్తించారు.
నగరాలు, పట్టణాలు: 7,935
మొత్తం పట్టణ జిల్లాలు: 9
అమృత్‌కు రూ.4,091 కోట్లు
స్మార్ట్‌సిటీలకు రూ.3,205 కోట్లు
కేంద్ర బడ్జెట్లో పట్టణాభివృద్ధి శాఖకు కేటాయింపులు దాదాపు 39% మేర పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15,160 కోట్లు కేటాయిస్తే, వచ్చే ఏడాది అది రూ.21,000 కోట్లుగా ఉంటుంది. దీనిలో పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛభారత్ పనులకు రూ.2300 కోట్లు కేటాయించారు. ఆకర్షణీయ నగరాలకు ప్రస్తుత సంవత్సరం రూ.820 కోట్లు కేటాయిస్తే, కొత్త బడ్జెట్లో ఎకాఎకి రూ.3205 కోట్లకు పెంచారు. అటల్ పట్టణ రూపాంతరీకరణ, పునరుజ్జీవన పథకం (అమృత్) కోసం రూ.4090 కోట్లు, వివిధ నగరాల్లో మెట్రో పనులకు రమారమి రూ.10,000 కోట్లు కేటాయించారు. మెట్రో నిధుల్లో సింహభాగం (రూ.5400 కోట్లు) దిల్లీకి వెళ్తుండగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు రూ.106 కోట్లు ఇచ్చారు. గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖలకు రూ.5400 కోట్లు కేటాయిస్తున్నట్లు చూపించారు.
రవాణా రంగం
రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. లైసెన్సింగ్ నుంచి ప్రజారవాణా వ్యవస్థ వరకు.. అన్నిటా సమూల మార్పుల ద్వారా సామాన్యులకు మరింత చేరువకావాలనుకుంటున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెటులో పేర్కొనటం రవాణా రంగంలో చర్చనీయాంశమైంది. రవాణాశాఖలో విధివిధానాలను పూర్తిగా ప్రక్షాళించేందుకు అనువుగా రోడ్డురవాణా, భద్రత ముసాయిదా బిల్లును పార్లమెంటులో పెట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే సిద్ధంచేసింది. రవాణా చట్టంలో సవరణల ద్వారా పర్మిట్‌రాజ్ విధానాన్ని పూర్తిస్థాయిలో రద్దుచేస్తామని అరుణ్‌జైట్లీ స్పష్టంగా ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వాల సహకారంతో సాగుతోన్న ప్రజారవాణా రంగ ప్రయివేటీకరణకు ద్వారాలు తెరవనున్నట్లు ఆయన చెప్పారు. ఒకప్పుడు ప్రయివేటు సర్వీసులను జాతీయం చేసిన కేంద్ర ప్రభుత్వం.. ప్రస్తుతం అటుగా మరిన్ని అడుగులు వేస్తోంది.
సామాజిక న్యాయం, సాధికారత శాఖకు నిధుల కేటాయింపుల్లో 11.69% పెంపు చోటుచేసుకుంది. గతేడాది ఈ శాఖకు రూ.6,580 కోట్లు కేటాయించగా.. ఈ మొత్తాన్ని రూ.7,350 కోట్లకు పెంచింది. గిరిజన వ్యవహరాల శాఖకు సైతం గతేడాది కంటే రూ.253 కోట్లు అదనంగా.. రూ.4,826 కోట్లను కేటాయించింది.
విద్యుత్తు రంగం
మరో రెండేళ్లలో దేశంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్తు వెలుగులు నింపడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. విద్యుత్తు రంగానికి కేటాయింపులు భారీగా పెంచింది. ముఖ్యంగా నవ, పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ పెంపును ప్రతిపాదించింది. గత బడ్జెట్‌లో నవ, పునరుత్పాదక ఇంధన రంగానికి కేటాయింపులు రూ.287.67 కోట్లు కాగా ఈ సారి ఏకంగా రూ.5 వేల కోట్లు కేటాయించింది. రూ.12,200 కోట్లు కేటాయించడం ద్వారా సంప్రదాయ విద్యుత్తు రంగానికీ పెద్ద పీటే వేసింది.
ముఖ్యాంశాలు..
2018, మే 1 నాటికి అన్ని గ్రామాలకు విద్యుత్తు సౌకర్యం.
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన, సమగ్ర విద్యుత్తు అభివృద్ధి పథకాలకు రూ.8,500 కోట్లు.
అణు విద్యుత్తు రంగానికి ఏడాదికి రూ.3,000 కోట్ల కేటాయింపు
అణు విద్యుదుత్పత్తి రంగంలో పెట్టుబడుల పెంపునకు వచ్చే 15-20 ఏళ్ల కాలానికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడి.
పవన విద్యుత్తు జనరేటర్ల రోటార్ బ్లేడ్లు, వాటి విడిభాగాల తయారీకి ఉపయోగించే కర్బన పల్ట్రూసన్స్‌పై ఎక్సైజ్ సుంకం 12.5 శాతం నుంచి 6 శాతానికి తగ్గింపు.
2015, ఏప్రిల్1 నాటికి దేశంలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాల సంఖ్య 18,542. మిగిలిన గ్రామాలకు వెయ్యి రోజుల్లో విద్యుత్తు సౌకర్యం కల్పిస్తామని ప్రధాని మోదీ ఆగస్టు 15, 2015న ప్రకటించారు.

'ఆధార్'కు శాసన హోదా
ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, రాయితీలను లక్షిత లబ్ధిదారులకు నేరుగా చేరవేసే దిశగా కేంద్రం కీలక సంస్కరణకు నడుం బిగించింది. ఇకపై కేంద్ర ప్రభుత్వ రాయితీలన్నింటినీ ఆధార్ అనుసంధానం ద్వారానే లబ్ధిదారులకు అందించనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం 'ఆధార్'కు శాసనహోదా కల్పిస్తూ... ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే రెండు రోజుల్లో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు జైట్లీ ప్రకటించారు. పౌరసత్వ, స్థానిక హక్కులు మాత్రం ఆధార్‌తో ముడిపడి ఉండవని స్పష్టంచేశారు. ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో ఎల్పీజీ రాయితీ (డీబీటీఎల్)ని అందించే పహల్ పథకానికి ఇప్పటికే ఆధార్‌ను అనుసంధానం చేసిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. సదరు పథకం సఫలీకృతం కావడంతో... ఎరువుల రాయితీనీ ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో రైతులకు అందించేందుకు కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. దేశంలో 5.35 లక్షల చౌకధరల దుకాణాలున్నాయని... వచ్చే ఏడాది మార్చికల్లా మూడు లక్షల చౌకదుకాణాల్లో ఆటోమేషన్ సదుపాయాలను కల్పిస్తామని పేర్కొన్నారు. 'కనిష్ఠ ప్రభుత్వం-గరిష్ఠ పాలన' సాకారానికి తాజా నిర్ణయాలు దోహదం చేస్తాయని చెప్పారు.
వాస్తవానికి కేంద్ర పథకాల నుంచి లబ్ధి పొందాలంటే ఆధార్‌ను తప్పనిసరి చేయడానికి ప్రభుత్వం గతంలోనే యత్నించింది. అయితే, 'ఆధార్' చట్టబద్ధత, గోప్యతపై సుప్రీంకోర్టు సంశయాలు లేవనెత్తడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడానికి 'ఆధార్' తప్పనిసరేమీ కాదని... అది కేవలం స్వచ్ఛంద పథకమని పేర్కొంటూ గతేడాది అక్టోబరులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. 'భారత జాతీయ గుర్తింపు ప్రాధికార సంస్థ బిల్లు-2010' రాజ్యసభలో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న సంగతి గమనార్హం.
మొత్తం దేశ జనాభా (2016 ఫిబ్రవరి 29 నాటికి) 131.71 కోట్లు
జారీ అయిన ఆధార్ కార్డులు 98 కోట్లు
మొత్తం డీబీటీఎల్ ఖాతాలు 16.5 కోట్లు
ఆధార్‌తో అనుసంధానమైనవి 11.19 కోట్లు
ఆధార్ సంఖ్య కేటాయింపు కోసం 2009 జనవరి 28న కేంద్ర ప్రభుత్వం 'భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)'ని ఏర్పాటు చేసింది.
ఉజ్వల భారత్‌కు నవ నాడులు
     ''దేశ 'ఆహార భద్రత'కు వెన్నెముకైన అన్నదాతకు 'ఆదాయ భద్రత' కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది'' బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయరంగ ప్రాముఖ్యాన్ని ప్రస్తావిస్తూ అరుణ్‌జైట్లీ చేసిన వ్యాఖ్య ఇది. 2016-17 బడ్జెట్‌కు మూల స్తంభాలుగా ఆయన వ్యవసాయం సహా తొమ్మిది అంశాలను పేర్కొన్నారు. వాటిపైనే బడ్జెట్ భవనాన్ని నిర్మించారు. మెరుగైన భారత్‌ను ఆవిష్కరించేందుకు ఈ తొమ్మిది స్తంభాలు కీలకాధారమని స్పష్టం చేశారు.
అవి...
1. వ్యవసాయం...రైతు సంక్షేమం
ఐదేళ్లలో (2022 నాటికి) రైతుల ఆదాయం రెట్టింపు చేయడం దీని ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్య సాధనకు వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో ప్రభుత్వం వ్యవహరించే తీరుతెన్నులను పునఃపరిశీలిస్తారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజనను మరింత బలోపేతం చేస్తారు. నాబార్డ్ ఆధ్వర్యంలో రూ.20 వేల కోట్లతో దీర్ఘకాల నీటి పారుదల నిధి ఏర్పాటు చేస్తారు. భూగర్భ జలవనరుల నిర్వహణ, పరిరక్షణకు రూ.6 వేల కోట్లు కేటాయించారు. పండించిన పంటను పొలం నుంచి మార్కెట్‌కు చేరవేసే వ్యవస్థను మెరుగు పరుస్తారు. 674 కృషి విజ్ఞాన కేంద్రాల సమర్థతను వెలికితీసేందుకు రూ.50 లక్షల బహుమతితో ఏటా పోటీలు నిర్వహిస్తారు. ఏకీకృత వ్యవసాయ మార్కెటింగ్ పథకంలోని ఈ-మార్కెటింగ్ వ్యవస్థను బాబా సాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా (ఏప్రిల్ 14న) జాతికి అంకితం చేస్తారు. పశువుల సంరక్షణ, పునరుత్పత్తి తదితరాలకు... పశుదాన్ సంజీవని, పశు ఆరోగ్య కార్డులు, ఈ-పశుదాన్ హాట్, జాతీయ జినోమిక్ కేంద్రం పేరుతో నాలుగు పథకాలను తీసుకురానున్నారు.
2. గ్రామీణ భారతం
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, సమగ్ర మౌలిక సదుపాయాలు కల్పించడం దీని ఉద్దేశం. గ్రామాలు, చిన్న పట్టణాల పరిస్థితులు మెరుగుపరిచేందుకు రూ.2.87 లక్షల కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా కేటాయించారు.. గత ఐదేళ్ల కేటాయింపులతో పోల్చితే ఇది 228 శాతం ఎక్కువ. కరవు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడతారు. 2018 మే 1 నాటికి దేశంలో ఇంకా విద్యుత్ సదుపాయం లేని అన్ని గ్రామాలకు విద్యుత్ వెలుగులు ప్రసాదిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలందరికీ డిజిటల్ విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు కొత్తగా డిజిటల్ అక్షరాస్యత పథకాన్ని తీసుకొస్తారు. వచ్చే మూడేళ్లలో గ్రామాల్లోని 6 కోట్ల కుటుంబాలను దీని పరిధిలోకి తెస్తారు. వివాదాలకు తావులేని విధంగా భూ రికార్డుల నమోదును ఆధునికీకరించేందుకు కృషి చేస్తారు. భూ రికార్డుల సమాచార నిర్వహణకు పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. గ్రామీణాభివృద్ధికే ఈ బడ్జెట్‌లో భారీగా రూ.87,765 కోట్లు కేటాయించారు.
3. సామాజిక.. ఆరోగ్య రంగం
దేశంలోని ప్రజలందరినీ సంక్షేమ, ఆరోగ్య సేవల పరిధిలోకి తీసుకురావాలన్నది బడ్జెట్ సంకల్పం. కట్టెల పొయ్యిపై వంటలు చేస్తూ అనారోగ్యం బారిన పడుతున్న గ్రామీణ నిరుపేదలకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకుంటారు. నిరుపేదల ఇళ్లల్లోని మహిళల పేరిట గ్యాస్ కనెక్షన్లు ఇస్తారు. ఇందుకోసం రూ.2000 కోట్లు కేటాయించారు. అకస్మాత్తుగా కమ్ముకొచ్చే అనారోగ్య సమస్యలు పేద ప్రజల ఆర్థిక జీవనాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్న నేపథ్యంలో.. కొత్త ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనికింద కుటుంబానికి రూ.లక్ష వరకు బీమా వర్తింపుజేస్తారు. సరసమైన ధరలకే నాణ్యమైన ఔషధాలు అందేలా జెనెరిక్ మందులను ప్రోత్సహిస్తారు. 'జాతీయ డయాలిసిస్ సేవా కార్యక్రమం' కింద రక్తశుద్ధి అవసరమైన రోగులకు ఊరట కల్పిస్తారు. ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సహించేందుకు జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్‌ను ఏర్పాటుచేస్తారు.
4. విద్య..నైపుణ్యం..ఉద్యోగ సృష్టి:
భారత్‌ను మేధో సంపన్న దేశంగా, ఉత్పాదక సమాజంగా తీర్చిదిద్దడం జైట్లీ ప్రతిపాదించిన 'నాలుగో స్తంభం' ఉద్దేశం. ప్రజలకు నాణ్యమైన విద్యను అందించడంపై దృష్టి పెడతారు. నవోదయ విద్యాలయాల్లేని 62 జిల్లాల్లో వాటిని రెండేళ్లలో నెలకొల్పుతారు. ఉన్నత విద్యా సంస్థలు ప్రపంచస్థాయి బోధన, పరిశోధన కేంద్రాలుగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తారు. రూ.1000 కోట్లతో ఉన్నత విద్య ఆర్థిక సహకార ఏజెన్సీ ఏర్పాటు చేస్తారు. భవిష్యత్‌లో ఉపయోగపడేలా విద్యార్థుల టీసీలు, డిగ్రీ సర్టిఫికెట్లు, మార్కుల పత్రాలు డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు. నైపుణ్యాల అభివృద్ధి కోసం దేశ వ్యాప్తంగా 1500 బహుళ నైపుణ్య శిక్షణ కేంద్రాలు నెలకొల్పుతారు. విద్యార్థులను పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహించేలా కళాశాలల్లో కొత్త కోర్సులు ప్రారంభిస్తారు. ఉద్యోగ నియామకాలు పెరిగేలా సంస్థలకు ప్రోత్సాకాలుంటాయి. ఉద్యోగార్థులు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు మరో 100 'మోడల్ కెరీర్ సెంటర్'లు ప్రారంభిస్తారు. రాష్ట్రాల ఉపాధి కల్పన కేంద్రాలను... జాతీయ కేంద్రంతో అనుసంధానిస్తారు. చిల్లర వర్తక రంగంలో ఉపాధి అవకాశాలు మరింత పెంచేందుకు విధివిధానాలు సడలిస్తారు. పెద్ద షాపింగ్ మాల్స్ మాదిరిగానే... చిన్న షాపుల వారికీ వారం రోజులూ తెరిచే అవకాశం ఇవ్వడంపై సానుకూల వైఖరి ప్రదర్శించారు.
5. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు
మౌలిక వసతులను పెంపొందించడం, నాణ్యమైన జీవన విధానానికి తోడ్పడటం 'ఐదో స్తంభం' లక్ష్యమని జైట్లీ పేర్కొన్నారు. రోడ్లు, జాతీయరహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ఆ రంగానికి రూ.55 వేల కోట్లు ప్రతిపాదించారు. రహదారులకు సంబంధించి ఇతరత్రా పథకాలకు మరిన్ని నిధులు కేటాయించారు. మొత్తమ్మీద రైల్వే బడ్జెట్, రహదారుల బడ్జెట్ కలిపి రూ.2,18,000 కోట్లకు చేరుకుంది. ప్రజా రవాణా సాఫీగా సాగేందుకు వీలుగా చట్ట సవరణలు చేయనున్నారు. జాతీయ జలమార్గాలపై కార్యాచరణను వేగవంతం చేస్తారు. వినియోగంలో లేని విమానాశ్రయాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటారు. ప్రాజెక్టుల నిర్మాణంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానం మరింత సమర్థంగా, వివాదరహితంగా పనిచేసేలా చట్ట సవరణలు చేస్తారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్నీ సంస్కరిస్తారు.
6. ఆర్థిక క్రమశిక్షణ
ద్రవ్య లోటును అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. మొత్తం జీడీపీలో ద్రవ్యలోటు 2015-16 (సవరణ అంచనా)లో 3.9 శాతానికి తగ్గించగలిగారు. 2016-17లో 3.5శాతానికి తీసుకురాగలరని అంచనావేస్తున్నారు. ప్రభుత్వ వ్యయంలో నాణ్యతను పెంచేందుకు ప్రతి కొత్త పథకాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ఫలితాలను సమీక్షించనున్నారు. 2015-16 సవరణ అంచనా ప్రకారం రాబడి లోటును 2.8 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించగలిగినట్లు జైట్లీ పేర్కొన్నారు. ద్రవ్య నియంత్రణ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్‌బీఎం) చట్టం అమలు తీరుపై సమీక్షకు, సూచనలు చేసేందుకు కమిటీని నియమించాలని మంత్రి ప్రతిపాదించారు.
7. పాలన... సునాయాసంగా వ్యాపారం
అనుమతుల విషయంలో ప్రజలకు చికాకు కల్పించే అప్రాధాన్య అంశాలను పరిహరించడం దీని ప్రధాన ఉద్దేశం. సంస్థలు నెలకొల్పడం, వ్యాపార వాణిజ్యాలను సులువుగా కొనసాగించుకునేందుకు వీలైన చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం సంస్కరణల మార్గంలో, ఐటీ ఆధారిత ప్రక్రియతో సుపరిపాలన అందించడానికి ప్రాధాన్యమివ్వనున్నారు. ప్రజలు తమ శక్తి సామర్థ్యాలు గుర్తించేలా చేసి అభివృద్ధివైపు సాగేలా చూస్తారు. అర్హులకే ప్రభుత్వ రాయితీలు అందేలా చర్యలు తీసుకుంటారు. సుపరిపాలనకు దేశంలోని ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు రాష్ట్రాలు, జిల్లాల భాగస్వామ్యంతో 'ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్' పేరుతో కార్యక్రమం ప్రారంభిస్తారు.
8. ఆర్థిక రంగ సంస్కరణలు
ఆర్థిక రంగంలో పారదర్శకత, సుస్థిరత సాధన లక్ష్యంగా ముందుకు సాగడం మరో అత్యంత కీలకాంశంగా జైట్లీ పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి ప్రధానమైన ఈ రంగంలో పలు చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్థిక సంస్థలు దివాళా తీసే పరిస్థితిని ప్రస్తావిస్తూ... దీనిపై ఒక సమగ్ర చట్టాన్ని తీసుకువస్తామన్నారు. ఫైనాన్సియల్ డేటా మేనేజ్‌మెంట్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.
9. పన్ను సంస్కరణలు
ప్రజల విశ్వాసం చూరగొనేలా.. పన్నుల భారం తగ్గేలా సంస్కరణలు తీసుకొస్తారు. పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చే ప్రతి రూపాయినీ దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సంక్షేమం, గ్రామీణాభ్యున్నతిని సాధించే దిశగా ఖర్చు చేస్తున్నట్లు జైట్లీ తెలిపారు. ఈ ఏడాది పన్నుల ప్రతిపాదనలకు సంబంధించి ఆర్థిక మంత్రి లక్ష్యాలు నిర్దేశించారు. వాటిలో... చిన్న పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించటం, భారత్‌లో తయారీకి ఉపకరించేలా ప్రోత్సాహాలు, పింఛను భద్రత కలిగిన సమాజం సాకారం, అందుబాటు ధరలతో స్వగృహ స్వప్నం నెరవేరడం, పన్ను వివాదాల తగ్గింపు, పన్నుల సరళీకరణ, హేతుబద్ధీకరణ తదితరాలున్నాయి.
రహదారులు
      ఆర్థికాభివృద్ధికి రహదారులు జీవనాడులు. దేశ ప్రగతి వారధులు. అందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆరంభం నుంచే వీటిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈసారి వాటికి మరింత పుష్టినిచ్చేందుకూ ప్రయత్నించింది. 50 వేల కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చటంతో పాటు నిలిచిపోయిన రూ.లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులను తిరిగి కొనసాగించాలని.. వచ్చే సంవత్సరంలో కొత్తగా సుమారు 10 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులకు అనుమతించాలని కంకణం కట్టుకుంది. చాలాకాలంగా సంస్కరణల కన్ను సోకని రోడ్ల రంగాన్ని సమూలంగా మార్చి, పర్మిట్ రాజ్‌కు అంతం పలకటమే కాదు.. ప్రయాణ విభాగంలో కొత్తవారికి దారులు తెరవాలనీ సంకల్పించింది. ఈ దిశగానే బడ్జెట్‌లో భారీ కేటాయింపులతో చిత్తశుద్ధిని చాటుకుంది.
రోడ్లు, జాతీయ రహదారులు.. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన.. ఇలా అన్నింటికీ కలిపి ఈసారి రహదారుల రంగానికి మొత్తం రూ.97 వేల కోట్లు కేటాయించారు.
రోడ్లు, జాతీయ రహదారులకు రూ.55 వేల కోట్ల కేటాయింపు. దీనికి అదనంగా జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ బాండ్ల విక్రయం ద్వారా రూ.15 వేల కోట్లను సేకరించి ఇస్తారు.
'ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన'కు 2015-16లో రూ.14,291 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.19 వేల కోట్లు ఇచ్చారు. రాష్ట్రాల వాటానూ కలిపి ప్రస్తుత సంవత్సరంలో ఈ పథకం కింద మొత్తం రూ.27 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.
2021 సంవత్సరం వరకు మొత్తం 2.23 లక్షల కిలోమీటర్ల రహదారుల నిర్మాణంతో రహదారి సౌకర్యం లేని 65 వేల గ్రామాలను అనుసంధానం చేయాలన్నది ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఉద్దేశం. కానీ ఈ లక్ష్యాన్ని రెండేళ్ల ముందుగానే.. అంటే 2019లోనే చేరుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి.. రోజుకు 100 కంటే ఎక్కువ కిలోమీటర్ల రహదారులను నిర్మించాలని అనుకుంటోంది.
మోటారు వాహనాల చట్టంలో అవసరమైన సవరణలు చేయాలనీ తలపెట్టింది. దీని ప్రకారం రోడ్డు రవాణా రంగంలో ప్రయాణికుల విభాగంలో ఇతరులకూ అవకాశం లభిస్తుంది. సంబంధిత భద్రతా, సామర్థ్య నిబంధనల మేరకు వివిధ మార్గాల్లో బస్సులను నడపటానికి పారిశ్రామికవేత్తలకు అనుమతిస్తారు. దీంతో ప్రజా రవాణా సదుపాయాలు మరింత మెరుగుపడటంతో పాటు కొత్త పెట్టుబడులు రావటానికి, ఉద్యోగావకాశాలకు దారులు తెరవనుంది.
రవాణా రంగానికి మొత్తంగా 2015-16లో రూ.1,78,502 కోట్లు కేటాయించగా.. 2016-17లో 2,29,874 కోట్లు కేటాయించారు.
దేశంలో మొత్తం రహదారులు 48.65 లక్షల కి.మీ.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రహదారి వ్యవస్థ మనది.
కొత్తగా వేస్తున్న రోడ్లు రోజుకు 100 కి.మీ.
గతేడాది రోడ్ల నిర్మాణ లక్ష్యం 6,300 కి.మీ. వేసింది: 4,400 కి.మీ.
దేశం రోడ్లు (కి.మీ.)
అమెరికా
భారత్
చైనా
బ్రెజిల్
రష్యా
65,90,000
48,65,000
44,60,000
17,51,868
13,96,000
ఉద్యోగానంతర సేవలపై పన్ను మినహాయింపులు రద్దు
      ఉద్యోగానంతర సేవలపై ఇప్పటి వరకూ అందిస్తున్న పన్ను మినహాయింపులకు ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ప్రకారం సీనియర్ న్యాయవాదులు ఈ మినహాయింపులను కోల్పోనున్నారు. అలాగే పన్ను చెల్లింపుదారు సేవల పన్నును వసూలు చేసి దానిని (రూ.2 కోట్లు పైబడి) ప్రభుత్వానికి చెల్లించకుండా ఎగవేసిన సందర్భంలో మాత్రమే అరెస్టు చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అంతకు ముందు ఈ పరిమితి కోటి రూపాయల వరకే ఉండేది. తాజా బడ్జెట్ ప్రకారం 'నిషేధిత జాబితా' లో ఏసీ వాహానాలతో బాటు సాధారణ వాహనాల్లో (స్టేజి క్యారియర్స్) ప్రయాణికుల రవాణా వంటి సేవలకు జూన్ 1వ తేదీ నుంచి 5.6 శాతం సేవాపన్ను విధించనున్నారు. న్యాయవాదికి సీనియర్ న్యాయవాది అందించే సేవలు, న్యాయసేవలు అందించే న్యాయవాదుల భాగస్వామ్యసంస్థకు, మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్ ప్రతినిధి వంటివారికి 14 శాతం సేవా పన్ను విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రధానమంత్రి అవాస్ యోజన (పీఎంఏవై), తక్కువ ఖర్చు ఇళ్లపై విధిస్తున్న 5.6 సేవా పన్నును మార్చి 1 నుంచి రద్దు చేశారు. 60 చదరపు మీటర్ల గృహాలకు ఇది వర్తిస్తుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెబీ, ఐఆర్‌డీఏ, పీఎఫ్ఆర్‌డీఏ వంటి నియంత్రణ సంస్థలకు వర్తిస్తున్న 14 శాతం సేవాపన్ను రద్దుకానుంది. అదేవిధంగా 'నిరామయ' ఆరోగ్య బీమా పథకం కింద ఆటిజం, సెరిబ్రల్ పాల్సీ, బుద్ధిమాంద్యత వంటి ఆరోగ్య సమస్యలకు అందించే సాధారణ బీమా సేవలపై విధిస్తున్న 14 శాతం సేవా పన్ను కూడా రద్దుకానుంది. సింగిల్ ప్రీమియం పింఛను పాలసీలపై గల 3.5 శాతం పన్నును 1.4 శాతానికి తగ్గించారు.
సంక్షేమ రంగం
        సమాజంలో వెనకబడిన వర్గాలు, మహిళల సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్ద పీటే వేశారు. మహిళా, శిశు సంక్షేమ పథకాలకు, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయింపులు పెంచారు. ప్రధానంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించడం ద్వారా లక్షిత వర్గాల అభివృద్ధికి బాటలు వేయనున్నట్లు ప్రకటించారు.
ఎస్సీ, ఎస్టీలు, మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు 'స్టాండప్ ఇండియా' కార్యక్రమం కింద రూ.500 కోట్లు ప్రకటించారు. కనీసం 2.5 లక్షల మందికి లబ్ధి చేకూర్చడం లక్ష్యం. ప్రతి బ్యాంకు శాఖ ఈ మూడు విభాగాల్లో ఒక్కొక్కరికి సాయం అందించాల్సి ఉంటుంది.
అంబేద్కర్ 125వ జయంత్యుత్స‌వాల‌ను నిర్వహించుకోనున్న ఈ ఏడాదిని ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తల్లో ఆర్థిక సాధికారత సంవత్సరంగా మారుస్తామన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వశాఖలో ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తల కోసం ఓ హబ్ ఏర్పాటు చేసి ఔత్సాహికులకు వృత్తిపరమైన సాయమందిస్తారు.
మైనారిటీల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి కోసం చేపట్టే బహుళ విభాగ అభివృద్ధి పథకం, సంప్రదాయ కళల నైపుణ్య అభివృద్ధి పథకం (ఉస్తాద్) వంటి కార్యక్రమాలు పక్కాగా అమలు చేసేందుకు చర్యలు. మదర్సాలతో పాటు మైనారిటీల విద్యాపథకాలకు రూ.120 కోట్లు, బహుళ రంగాల్లో మైనారిటీల అభివృద్ధి కోసం రూ.1,125 కోట్లు కేటాయింపు.
దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాల్లో మహిళల పేరిట వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.2 వేల కోట్ల కేటాయింపు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.4,576 కోట్ల మేర కేటాయింపుల పెంపు.
'బేటీ బచావో బేటీ పడావో' పథకానికి కేటాయింపులు రూ.75 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంపు
మహిళల భద్రత, రక్షణ కార్యక్రమాల కోసం 'నిర్భయ నిధి'కి రూ.150 కోట్లు కేటాయింపు.
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమానికి బడ్జెట్‌లో వేల కోట్లు వెచ్చిస్తున్నారు. దళితులు, గిరిజనులు, మైనారిటీల అభివృద్ధి లక్ష్యంగా వీటితో పలు పథకాలు అమలు చేస్తున్నారు. మాతా శిశుసంరక్షణ, ఆరోగ్య, సామాజిక అభివృద్ధి కోసం స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు భారీగా నిధులు కేటాయిస్తున్నారు.
సామాజిక సంక్షేమం
దళిత జనాభా 20.14 కోట్లు (16.6%)
ఎస్టీలు 10.86 కోట్లు (8.9%)
వికలాంగులు 2.19 కోట్లు (2011 జనాభా లెక్కల ప్రకారం)
బేటీ బచావో బేటీ పడావో
     బాలికల రక్షణ, విద్యాభివృద్ధి లక్ష్యంగా 2015 జనవరిలో హరియాణాలో ఈ పథకాన్ని ప్రారంభించారు. చిన్నారుల లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో తొలిదశలో శ్రీకారం చుట్టారు.
గత బడ్జెట్‌లో రూ.75 కోట్ల కేటాయింపు
మరో 68 జిల్లాలకు విస్తరించే ప్రతిపాదనకు ఈ ఏడాది జనవరి 5న ఆమోదం
గిరిజన ప్రగతి కోసం..
దేశంలో గిరిజనుల సంఖ్య 10.86 కోట్లు
వీరి అభివృద్ధి కోసం గిరిజన ఉప ప్రణాళిక.
గిరిజన సంక్షేమ పథకాల అమలు, పర్యవేక్షణకు ప్రధాని అధ్యక్షతన జాతీయ గిరిజన సలహా మండలి ఏర్పాటు.
గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి 'వనబంధు కల్యాణ్ యోజన' ప్రారంభం.
దేశంలో మహిళల జనాభా 63.6 కోట్లు
స్త్రీ పురుష లింగ నిష్పత్తి 943 : 1000
శిశు, మాతృ మరణాలను అరికట్టే లక్ష్యంతో జననీ సురక్ష యోజన, జననీ శిశు రక్షణ కార్యక్రమం తదితర పథకాలు అమలవుతున్నాయి. బడిఈడు పిల్లలకు మధ్యాహ్నభోజన పథకాన్ని నిర్వహిస్తున్నారు.
విద్యుత్ ఛార్జీలు
         బొగ్గుపై సుంకం (సెస్) రెట్టింపైంది. కొత్తగా కృషి కల్యాణ్ సెస్, మౌలిక సౌకర్యాల పన్నులను మోపారు. బొగ్గుపై సుంకం పెంపుతో విద్యుత్ ఛార్జీలు; మౌలిక సౌకర్యాల సెస్‌తో కార్ల ధరలు; కృషి కల్యాణ్ సెస్‌తో విమానయానం, రెస్టారెంట్ భోజనం, మోబైల్ ఫోన్ బిల్లులు పెరగనున్నాయి. చమురుపై పన్ను విధానంలో మార్పు తెచ్చారు. ఫలితంగా ప్రభుత్వానికి కొంత ఆదాయం తగ్గనుంది.
         మరోవైపు సంవత్సరానికి రూ.50 కోట్లకు మించి ఆదాయం రాని 13 రకాల సుంకాలను రద్దు చేశారు. మొత్తంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో 5 ప్రధాన పన్నుల ఆదాయం రూ.54,450 కోట్లకు చేరవచ్చని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన పన్ను ఆదాయ అంచనా రూ.31,335 కోట్లతో పోలిస్తే ఇది రూ.23,116 కోట్లు ఎక్కువ. వివిధ రకాల సుంకాల పేరిట ఇప్పటివరకు వసూలు చేసిన నిధుల్లో రూ.1,44,522 కోట్లను నిర్దేశించిన లక్ష్యాలకు వినియోగించలేదని కాగ్ నివేదిక స్పష్టం చేస్తున్నా... కొత్త సుంకాలు విధించడం విశేషం.
పరిశుభ్ర పర్యావరణ పన్ను.. ఆదాయ లక్ష్యం రూ.26,148 కోట్లు:
      పరిశుభ్ర ఇంధన (క్లీన్ ఎనర్జీ) పన్ను పేరును పరిశుభ్ర పర్యావరణ పన్నుగా మర్చారు. ఇందులో బొగ్గు, లిగ్నెట్, వంటచెరకుపై ఇప్పటివరకు టన్నుకు రూ.200గా ఉన్న సుంకాన్ని రూ.400కు పెంచారు. గత బడ్జెట్‌లో ఈ పన్నును టన్నుకు రూ.100 నుంచి రూ.200కు పెంచడం గమనార్హం. బొగ్గుపై సెస్ రెట్టింపు ఫలితంగా విద్యుత్ ధరలు యూనిట్‌కు 10 నుంచి 16 పైసల వరకు పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సరాసరిన టన్ను బొగ్గు ధర ప్రస్తుతం రూ.1000-1100 ఉంది. టన్నుకు రూ.200 చొప్పున సెస్ పెరగడంతో బొగ్గు ధర 20% మేర పెరగనుందని కోల్ ఇండియా అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. బొగ్గుపై సెస్ పెంపు ప్రభావం దక్షిణ భారత్‌లోని విద్యుత్ ప్లాంట్‌లపై అధికంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ప్లాంట్లు ఎక్కువగా మహానది బొగ్గుక్షేత్రాల నుంచి లో-గ్రేడ్ బొగ్గును వినియోగిస్తున్నాయి. ఈ బొగ్గు ధర టన్ను 700-800 వరకు ఉంది. ఇప్పుడు సెస్ పెరగడంతో ఈ బొగ్గు ధర 25 శాతం పెరగనుంది. పరిశుభ్ర ఇంధన సెస్ మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన ఆదాయ అంచనా రూ.12,623 కోట్లుగా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.26,148 కోట్లకు చేరనుంది.
కృషి కల్యాణ సెస్.. ఆదాయ లక్ష్యం రూ.5,000 కోట్లు:
      పన్ను పరిధిలోకి వచ్చే అన్ని సేవలపై కొత్తగా 0.5% కృషి కల్యాణ సెస్ విధించారు. జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పన్ను ఆదాయాన్ని వ్యవసాయ రంగంలో కొత్త పథకాలకు, సాగు అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి వెచ్చిస్తారు. విమాన ప్రయాణాలు, రెస్టారెంట్‌భోజనాలు, మొబైల్ ఫోన్ బిల్లులు తదితరాలపై ఈ పన్ను విధిస్తారు. ఇప్పటివరకు 14.5% ఉన్న సేవా పన్ను దీంతో 15% చేరనుంది.
మౌలిక సౌకర్యాల పన్ను.. ఆదాయ లక్ష్యం రూ.3,000 కోట్లు:
      మౌలిక సౌకర్యాల పన్ను పేరిట చిన్నస్థాయి పెట్రోల్, ఎల్‌పీజీ, సీఎన్‌జీ కార్లపై 1% సుంకం విధించారు; నిర్ణీత సామర్థ్యం కలిగిన డీజిల్ కార్లపై 2.5%; అధిక ఇంజిన్ సామర్థ్యం కలిగిన ఇతర కార్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు (ఎస్‌యూవీ), పెద్ద సెడాన్ కార్లపై 4% సుంకం విధించారు. ఈ పన్నుతో ప్రభుత్వానికి రూ.3,000 కోట్లు ఆదాయం రావచ్చని అంచనా.
వీటికి మినహాయింపు:
      త్రిచక్ర వాహనాలు, విద్యుత్‌తో నడిచే వాహనాలు, హైబ్రిడ్, హైడ్రోజన్ వాహనాలు; ట్యాక్సీ సేవలకు వినియోగించే వాహనాలు, అంబులెన్స్‌లు, దివ్యాంగులు వినియోగించే కార్లకు మౌలిక సౌకర్యాల పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు.
చమురు పరిశ్రమల అభివృద్ధి పన్నులో మార్పు.. తగ్గనున్న ఆదాయం:
      అయిల్ పరిశ్రమల అభివృద్ధి పన్నును మెట్రిక్ టన్నుకు రూ.4,500 కాకుండా.. ధరపై 20% చొప్పున విధించనున్నారు. ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర 35 డాలర్లుగా ఉంది. దీనిపై 20% పన్నుతో ప్రభుత్వానికి టన్ను చమురుపై రూ.3,500 ఆదాయం మాత్రమే రానుంది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వానికి రూ.10,303 కోట్ల ఆదాయం మాత్రమే రానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం 14,962 కోట్లుగా ఉంది.
స్వచ్ఛ భారత్ పన్ను ఆదాయం.. రూ.10,000 కోట్లు:
      గత నవంబరులో ప్రారంభించిన స్వచ్ఛ భారత్ సెస్ (0.5%) మీద వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కోట్లు రావచ్చని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరలో ఈ ఆదాయం 3,750 కోట్లుగా ఉంది.
మలిసంధ్యలో అండగా..
      దేశంలో 2015 నాటికి 11 కోట్ల మంది వృద్ధులున్నారు. వీరిలో మూడింట రెండొంతుల మంది దారిద్య్రరేఖకు దిగువనున్నవారే. సంపాదన సామర్థ్యం లేని వీరు మలిదశలో ఎన్నో ఆటుపోట్లకు గురవుతున్నారు. ఇలాంటి వారి కోసం చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నాయి. వీటిలో కొన్నింటికి కేంద్రసాయం అందుతుంది.
      కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేసి విరమణ పొందినవారికి పింఛన్లకు అయ్యే మొత్తం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1.23 లక్షల కోట్లు దాటింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో రూ.88,521 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల ప్రకారం అది రూ.95,731 కోట్లుగా తేలింది. ఈసారి అది మరో రూ.28 వేల కోట్లు పెరిగింది.
అటల్ పింఛను యోజనకు గడువు పెంపు
      ప్రజలు ఎవరైనా పొదుపు చేసుకుని పింఛను పొందగలిగే 'అటల్ పింఛను' పథకాన్ని గత బడ్జెట్‌లో ప్రకటించారు. దీనిలో చేరేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రీమియంలో 50 శాతాన్ని (గరిష్ఠంగా రూ.1000)ను ఐదేళ్లపాటు కేంద్రం చెల్లిస్తుందని చెప్పారు. ఇందుకోసం 2015 డిసెంబర్ 31ను తుదిగడువుగా ప్రకటించారు. ఈ ప్రయోజనం మరింతమందికి చేరాలనే ఉద్దేశంతో ఈ గడువును పెంచుతున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. 50 శాతం చెల్లించేందుకు 2016-17 బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసి పింఛన్లు తీసుకుంటున్నవారు దేశంలో 52 లక్షల మంది ఉన్నారు.
సైన్యంలో ఒకే ర్యాంకు ఒకే పింఛను పథకంతో దేశ ఖజానాపై పడే భారం రూ.16 వేల కోట్లు.
2050 నాటికి 60 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య 30 కోట్లకు చేరనుంది.
దీంతో పింఛన్లకు జీడీపీలో చేస్తున్న ఖర్చు ప్రస్తుత కేటాయింపులతో పోల్చితే రెట్టింపవుతుందని క్రిసిల్ అంచనా.
గత బడ్జెట్‌లో..
బీమా, పింఛను పథకాల్లో పెట్టుబడులకు ఇచ్చే పన్ను మినహాయింపు వర్తించే మొత్తాన్ని రూ.50 వేలు నుంచి రూ.లక్షకు పెంపు.
తక్కువ ప్రీమియంతో బీమా ధీమా కల్పించేందుకు అటల్ పింఛను పథకం, ప్రధాన మంత్రి సురక్ష బీమా పథకం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకాలను ప్రకటించారు.
దేశం జీడీపీలో పింఛన్ల వాటా
బ్రెజిల్
రష్యా
భారత్
దక్షిణాఫ్రికా
9.1%
9%
2.2%
4%
నైపుణ్యాభివృద్ధికి....
దేశంలోని యువతలో నైపుణ్యాల పెంపునకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం పెరిగింది. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద మరో మూడేళ్లలో కోటి మంది యువతను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా 1500 బహుళ నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.1700 కోట్లను వెచ్చించారు. ప్రధాన మంత్రి కౌశల్ యోజనను మరింత పటిష్ఠం చేయడంతో పాటు.. నైపుణ్యాభివృద్ధి ధ్రువీకరణ మండలిని ఏర్పాటు చేస్తారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ కౌశల్య యోజన కింద అందించే సేవలకు సేవా పన్నును మినహాయించారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు వీలుగా 2200 కళాశాలలు, 300 పాఠశాలలు, 500 ప్రభుత్వ ఐటీఐ సంస్థలు, 50 వృత్తి శిక్షణ సంస్థల్లో వ్యాపార, విద్య శిక్షణను అమలు చేస్తామని ఈ బడ్జెట్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం కింద అధునాతన ఐటీఐలను బహుళ నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. ఈ కేంద్రాలను వెనుకబడిన జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు. దేశాభివృద్ధికి దోహదపడే తొమ్మిది అంశాల్లో విద్య, నైపుణ్యం.. ఉపాధి సృష్టిలు కూడా కీలకమని జైట్లీ చెప్పారు. మరోవైపు జులై 2015లో జాతీయ కెరీర్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా 3.5 కోట్ల మంది యువత ఉద్యోగాల కోసం నమోదు చేసుకున్నారు. దీన్ని రాష్ట్రాల్లోని ఉపాధి కల్పనా కేంద్రాలకు అనుసంధానం చేయనున్నారు. యువతకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ ఏడాది ఆఖరుకు 100 ఆదర్శ కెరీర్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
నైపుణ్య భారత్:
      దేశంలో అపారమైన మానవ వనరులున్నాయి. యువశక్తీ పుష్కలంగా ఉంది. కానీ ఏం లాభం? నైపుణ్యం లేదు. దేశంలోని 58 శాతం కంపెనీలు తమకు నిపుణులైన మానవ వనరుల్లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని రూపుమాపేందుకే మోదీ సర్కారు 'నైపుణ్య భారత్' పథకాన్ని చేపట్టింది. మరో ఆరేళ్లలో దేశంలో 40 కోట్ల మందిని నైపుణ్యమున్న యువతగా తీర్చిదిద్దాలన్నది ఈ పథక లక్ష్యం.
2022 నాటికి దేశంలో నిర్మాణ రంగంలో 3 కోట్ల మంది నిపుణులైన పనివారు అవసరమని అంచనా.
ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్ రంగాల్లో 46 లక్షల మంది నిపుణులవసరం.
నైపుణ్యంలో మనమెక్కడ?
దక్షిణ కొరియాలో నైపుణ్యమున్న యువత 96 శాతం
జపాన్‌లో 80 శాతం
జర్మనీ 75 శాతం
బ్రిటన్ 69 శాతం
భారత్‌లో.. 3 కంటే తక్కువ శాతం!!
ప్రస్తుత పరిస్థితి
భారత్‌లోని ప్రతి ముగ్గురు పట్టభద్రుల్లో ఒకరు నిరుద్యోగి.
భారత్‌లో ఎంబీఏ పూర్తిచేసిన వారికీ 10 శాతం మందికే తగిన నైపుణ్యముంటోంది.
ఇంజినీరింగ్‌లోనూ ఇంతే.. 17 శాతం మందే ప్రతిభావంతులుగా బయటకొస్తున్నారు.
ఆవిష్కరణలు:
      అపార మానవ వనరులున్నాయి, అంతరిక్షంలో దూసుకుపోతున్నాం కానీ పరిశోధనల్లో వెనకే ఉంటున్నాం. మన దేశం నుంచి గొప్ప ఆవిష్కరణలుండటం లేదు. ఈ విషయంలో చైనా, అమెరికా, కెనడా, ద. కొరియా వంటి దేశాలు చాలా ముందున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న పేటెంట్ దరఖాస్తులు
(10 లక్షల మంది జనాభాకు)
బ్రెజిల్
చైనా
అమెరికా
కెనడా
దక్షిణ కొరియా
భారత్‌లో
34
541
910
3716
4451
17

ఒక్కో పరిశోధకుడిపై ఖర్చు (రూపాయల్లో)
కెనడా
చైనా
అమెరికా
ద.కొరియా
బ్రెజిల్
భారత్
10676
11764
23256
13736
12308
11628
భారత్‌లో పరిశోధకుల సంఖ్య 2 లక్షలు. వీరిలో మహిళలు 14%
దేశంలో ఐఐటీలు 17, ఎన్ఐటీలు 31
విశ్వవిద్యాలయాలు 757
సీఎస్ఐఆర్ ప్రయోగశాలలు 40
ఏటా నమోదవుతున్న డాక్టరేట్‌లు 29000 (ఇందులో సైన్స్‌కు సంబంధించినవి: 9000)
నిరుద్యోగ భారతం
      దేశంలో కోట్లాది మంది నిరుద్యోగులున్నారు. అయితే ఈ సమస్యకు రెండు భిన్న పార్శ్వాలున్నాయి. సరిపడా కొలువుల్లేని ఓపక్క యువత నిట్టూరుస్తుంటే.. మరోవైపు నైపుణ్యమున్న మానవ వనరుల కొరతతో ఏటా రూ.50 వేల కోట్లకు పైగా నష్టపోతున్నామని పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో నిరుద్యోగుల సంఖ్య 12 కోట్లు.
2000-14 మధ్య దేశంలో పెరిగిన కొలువులు 2.2% (జాతీయ నమూనా సర్వే సంస్థ అధ్యయనం ప్రకారం) కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు 12 కోట్లు. రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి.
నిరుద్యోగం ఎక్కడెంత (శాతాల్లో..)
చైనా...................4.05
రష్యా..................5.8
బ్రెజిల్................7.9
భారత్.................9.6
దక్షిణాఫ్రికా..........25
2012లో భారత్‌లో పనిచేయగలవారి సంఖ్య 48.4 కోట్లు.
2020 నాటికి ఇది 85 కోట్లకు చేరుతుందని అంచనా. అంటే ప్రపంచ శ్రమశక్తిలో మన వాటా 25%.
ఆహార శుద్ధి, మార్కెటింగ్‌లో వంద శాతం ఎఫ్‌డీఐలు
ఆహార శుద్ధి, మార్కెటింగ్‌లో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు కేంద్రం ఆమోదం తెలిపింది. రైతులకు ప్రయోజనకరంగా ఉండేలా, కూరగాయలు, పండ్ల వృథాను తగ్గించేందుకు ఈ మేరకు నిర్ణయించినట్లు వెల్లడించింది. దీంతో సాగుచేసే రైతులకు సరైన ధరను అందించడంతో పాటు, ఆహార శుద్ధి పరిశ్రమకు ప్రోత్సాహాకాన్ని ఇవ్వనుంది. తద్వారా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి.
కేంద్రమంత్రుల ప్రయాణ ఖర్చుల్లో 54 శాతం కోత
కేంద్రమంత్రుల ప్రయాణ ఖర్చుల్లో భారీ కోత పడింది. గత కేటాయింపులతో పోల్చితే ఈ బడ్జెట్‌లో 54 శాతం కోత వేశారు. 2015-16లో బడ్జెట్‌లో రూ.269 కోట్లు కేటాయించినా.. చివరకు దీనిని రూ.566.66 కోట్లకు పెంచారు. 2016-17 బడ్జెట్‌లో రూ.259 కోట్లుకు తగ్గించారు.
సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు రూ.2,500 కోట్లు
2016-17 బడ్జెట్‌లో ప్లానింగ్ రూ.1,755 కోట్లు, నాన్‌ప్లానింగ్ రూ.745 కోట్లు.కేటాయించారు. ఈ నిధులతో కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న 3,686 పురావస్తు కట్టడాల పరిరక్షణ, 21 ప్రపంచ వారసత్వ కట్టడాల పరిరక్షణ, మ్యూజియాలు, గ్రంథాలయాల నిర్వహణ, ప్రముఖుల వర్ధంతి/జయంతి కార్యక్రమాలు తదితరాలకు వీటిని వినియోగించనున్నారు.
పర్యాటకానికి నిధుల కేటాయింపులో 70శాతం పెంపు
పర్యాటకానికి 2015-16లో రూ.932 కోట్లు కేటాయింపులు ఉండగా ఈసారి భారీగా పెంచారు. 2016-17 బడ్జెట్‌లో రూ.1,590 కోట్లు దీనికి కేటాయించారు. పర్యాటకరంగ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన తదితర కార్యక్రమాల కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు.
వైద్యరంగం
      జనారోగ్యాన్ని, దాని అవసరాలను గుర్తిస్తూ కేంద్రం తాజా బడ్జెట్‌లో ఆరోగ్య మంత్రిత్వశాఖకు ఈసారి రూ.38,206 కోట్లు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్ కన్నా ఇది సుమారు రూ.4375 కోట్లు అధికం. ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద ఈ మొత్తం కేటాయింపులు జరిగాయి. ఆరోగ్య పరిశోధన విభాగానికి కేటాయించిన దాదాపు రూ.1145 కోట్లూ ఇందులో భాగమే. ఇక సంప్రదాయ వైద్యవిధానమైన ఆయుష్ అభివృద్ధికి ఈసారి గత ఏడాది (రూ.1125 కోట్లు) కన్న కాస్త మిన్నగా సుమారు రూ.1326 కోట్లు కేటాయించారు. ప్రణాళిక పద్దు కింద రూ.1050 కోట్లు, ప్రణాళికేతరం పరిధిలో రూ.276 కోట్ల కేటాయింపులు జరిగాయి. సామాన్యులు, నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నూతన ఆరోగ్య భద్రత పథకం, జాతీయ రక్తశుద్ధి కార్యక్రమం, దేశవ్యాప్తంగా వేలాది జెనరిక్ మందుల దుకాణాల ఏర్పాటు తదితరాలు కొత్త బడ్జెట్‌లో చెప్పుకోదగ్గ అంశాలు.
నిరుపేదలకు అండగా...
తీవ్రమైన వ్యాధుల బారిన పడే నిరుపేద కుటుంబాలకు అండగా వారి ఆరోగ్య భద్రత కోసం కొత్త పథకాన్ని బడ్జెట్‌లో ప్రకటించారు. దీని పరిధిలో ప్రతి పేద కుటుంబానికి రూ.లక్ష వరకు ఆరోగ్య బీమా లభిస్తుంది. 60 ఏళ్లు దాటిన వయోవృద్ధులకైతే అదనంగా మరో రూ.30 వేల వరకు అది వర్తిస్తుంది.
దేశంలో ఏటా 2.2 లక్షల మంది మూత్రపిండ వ్యాధిగ్రస్తులు కొత్తగా నమోదవుతున్నారు. జాతీయ స్థాయిలో ఇప్పటికే ఉన్న 2,950 రక్తశుద్ధి కేంద్రాలు దేశవ్యాప్తంగా సగం మంది రోగుల అవసరాలను మాత్రం తీర్చగలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మేలుచేసేలా జాతీయ రక్తశుద్ధి సేవల కార్యక్రమాన్ని బడ్జెట్‌లో ప్రకటించారు. ఈమేరకు జాతీయ ఆరోగ్య కార్యక్రమం పరిధిలో ప్రతి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రక్తశుద్ధి కేంద్రాలను ఏర్పాటుచేస్తారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో ఇవి పనిచేస్తాయి. ఈ కొత్త కేంద్రాల ఏర్పాటుకు అవసరమయ్యే పరికరాలపై ప్రాథమికంగా కస్టమ్స్, ఎక్సైజ్, ప్రత్యేక అదనపు సుంకాల ఎత్తివేతకు ప్రతిపాదించారు. తద్వారా చికిత్స వ్యయాన్ని వీలైనంత తగ్గేంచే యోచన చేస్తున్నారు.
ప్రధానమంత్రి జన ఔషధి పథకం పరిధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 3000 జనరిక్ మందుల దుకాణాలను తెరవనున్నట్లు ప్రకటించారు. సామాన్యులకు అత్యల్ప ధరలకే నాణ్యమైన మందులు అందజేయటం దీని ఉద్దేశంగా పేర్కొన్నారు.
ఉపాధిహామీ పథకం
      పొట్టకూటి కోసం వలస పోతున్న పల్లె జనానికి భరోసానిచ్చేలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో బడ్జెట్ కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి రూ.3,800 కోట్ల అదనపు నిధులను కేటాయించారు. ప్రకృతి, జల సంరక్షణ కోసం ఈ పథకం కింద సమూహ సౌకర్యాల బృందాలు (క్లస్టర్ ఫెసిలిటేషన్ టీమ్స్) ఏర్పాటవుతాయి. జీవనోపాధిని పెంచడంలో భాగంగా స్వయంసహాయ బృందాల ఏర్పాటును విస్తృతం చేస్తారు. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ పథకం ప్రారంభమై పదేళ్లు పూర్తయింది. శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ పథకం కింద 300 సమూహాలను ఎంపిక చేసి అక్కడ మౌలిక వసతుల కల్పనతో పాటు రైతులకు మార్కెట్ వసతి కల్పిస్తారు. ఇవి గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను కూడా పెంచుతాయి.
      వ్యవసాయం లాభసాటిగా లేక వలసబాట పడుతున్న గ్రామీణ ప్రజానీకానికి ఉపాధి కల్పించేందుకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని (ఎంఎన్‌జీఆర్ఈఎస్) యూపీఏ ప్రభుత్వం 2006లో ప్రారంభించింది. ఏడాదిలో కనీసం 100 రోజుల ఉపాధి కల్పించడం దీని లక్ష్యం. ప్రారంభ సంవత్సరంలో రోజుకు రూ.69గా ఉన్న కూలిని ప్రస్తుతం రూ.174 వరకు పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీకి రూ.34,699 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. కరవు పరిస్థితుల నేపథ్యంలో తర్వాత మరో రూ.5 వేల కోట్లు ప్రకటించింది.

అమలవుతున్న మొత్తం జిల్లాలు 660
గ్రామ పంచాయతీలు 2,57,718
మొత్తం జాబ్‌కార్డులు 13.14 కోట్లు
వినియోగంలో ఉన్నవి 6.43 కోట్లు
నమోదైన మొత్తం కూలీలు 27.63 కోట్లు
వీరిలో పని చేస్తున్నవారు 9.9 కోట్లు
జీడీపీ
      స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుకు మోదీ సర్కారు నూతన ఊపిరిలూదింది. మదుపరుల్లో విశ్వాసాన్ని పాదుకొల్పుతూ దీన్ని 7.6 శాతానికి తీసుకెళ్లింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.3 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ అంచనాలను మించి మోదీ సర్కారు తాజా వృద్ధి రేటును నమోదుచేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర ఒడుదొడుకులు, ఎగుమతుల్లో 4.4 శాతం క్షీణత, ఏళ్లుగా కొనసాగుతున్న మందగమన వృద్ధిరేటు, ధరల పెరుగుదల, లోటు వర్షపాతం, ఇదివరకటి ప్రభుత్వ పనితీరుపై మదుపరుల్లో అసంతృప్తి లాంటి ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటూ ఈ ఘనత సాధించింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో చివరి మూడేళ్లూ ప్రపంచ ఎగుమతుల్లో 7.7 శాతం వృద్ధి చోటుచేసుకున్నప్పటికీ.. వృద్ధి రేటు 6.3 శాతానికి మించని సంగతి తెలిసిందే.
మన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) సుమారు రూ.140 లక్షల కోట్లు. జీడీపీలోభారత్‌ది ప్రపంచంలోనే ఏడో స్థానం.
చాలా దేశాలతో పోలిస్తే భారత్‌లో జీడీపీలో పన్నుల వాటా తక్కువ. అయినా ప్రపంచంలో ఏడో స్థానంలో నిలవడం విశేషం.
మనకంటే ముందున్న దేశాల్లో జీడీపీలో పన్నుల వాటా 4వ వంతుకు పైనే ఉంటోంది. ఫ్రాన్స్‌లో అయితే జీడీపీలో దాదాపు సగభాగం పన్నులతోనే వస్తుంది.
జీడీపీ తలసరి ఆదాయంలో కూడా చాలా వెనుకబడి ఉన్నాం. అమెరికాలో ఇది రూ.37 లక్షలు ఉండగా భారత్‌లో రూ.86 వేలు.
జలవనరులు
జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన శాఖకు తాజా బడ్జెట్‌లో రూ.6,201.21 కోట్లు కేటాయించారు. ఇది 2015-16 ఆర్థిక సంవత్సరం కేటాయింపులతో పోలిస్తే రూ.1969.21 కోట్లు అదనం కావడం గమనార్హం. రూ.6,201.21 కోట్లలో రూ.5,500 కోట్లు ప్రణాళిక వ్యయం కింద, మిగిలిన మొత్తం ప్రణాళికేతర వ్యయం పద్దుల కింద చూపారు. ఇందులో ప్రతిష్ఠాత్మక 'నమామి గంగ'పథకానికి రూ.2,250 కోట్లు ఇచ్చారు.

సాగునీటి రంగం అభివృద్ధికి కేంద్రం గతేడాది కొత్తగా తీసుకొచ్చిన ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కింద రూ.1,877.13 కోట్లు కేటాయించారు. ఈ పథకాన్ని మరింత బలోపేతం చేసి విస్తృతంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే దీని కింద వచ్చే ఐదు సంవత్సరాల్లో 70,42,503 ఎకరాలు (28.5 లక్షల హెక్టార్ల)కు సాగునీరు అందించాలని భావిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులు, ఉత్పాదకత పెంచడానికి అత్యంత కీలకమైన సాగునీటి వ్యవస్థను మెరుగుపరచాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో 34,84,18,588 (141 మిలియన్ హెక్టార్లు) ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా, ఇందులో 46 శాతానికే సాగునీటి సౌకర్యం ఉంది.
భూగర్భ జలాల వనరుల నిర్వహణ కోసం రూ.6000 కోట్ల అంచనాతో బహుపాక్షిక నిధుల ఏర్పాటును విత్తమంత్రి తన ప్రసంగంలో ప్రతిపాదించారు. దీంతోపాటు జలవనరుల నిర్వహణ నిమిత్తం పరిశోధన అభివృద్ధి కార్యక్రమం కింద రూ.660.27 కోట్లు కేటాయించారు. నదీ పరివాహకప్రాంత నిర్వహణ (నదుల అనుసంధానం, వరదల అంచనాలు)కు రూ.259.60 కోట్లు కేటాయించారు.
ఇంకా ఏఐబీపీ కింద రూ.1,377 కోట్లు, వాటర్‌షెడ్‌కు రూ.1,500 కోట్లు, తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టును సాగులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ప్రతినీటి బొట్టుతో అదనపు ఆయకట్టు పథకానికి రూ.2,340 కోట్లు, హర్‌కేత్ పానీ పథకానికి రూ.500 కోట్లు కేటాయించారు. రూ.20 వేల కోట్ల మూలధనంతో నాబార్డ్ ఆధ్వరంలో ప్రత్యేక దీర్ఘకాలిక సాగునీటి నిధి ఏర్పాటు చేయనుంది. ఇందులో రూ.12,517 కోట్లను బడ్జెట్ సహాయం, మార్కెట్ రుణాలు ద్వారా సమకూరుస్తారు. వర్షపాతం ఉండే ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కేటాయింపులతో ఐదు లక్షల పంటకుంటలు, బావుల తవ్వకం, సేంద్రియ ఎరువుల ఉత్పత్తి పెంపకానికి 10 లక్షల సేంద్రియ ఎరువు కుంటల ఏర్పాటుకు నిర్ణయించారు.
కొత్త ఉద్యోగాలకు ప్రోత్సాహం
      దేశంలో ఉద్యోగాల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా సరికొత్త చర్యలకు ఉపక్రమించింది. కొత్త ఉద్యోగులను నియమించుకునే యాజమాన్యాలకు భవిష్యనిధి (పీఎఫ్) చెల్లింపు భారం కాకుండా ఆ వ్యయాన్ని ప్రభుత్వమే భరించేందుకు ముందుకొచ్చింది. ఆదాయపు పన్ను చెల్లింపులోనూ కొన్ని వెసులుబాట్లు సూచించింది. కొత్తగా చేర్చుకునే ప్రతి ఉద్యోగి పింఛను పథకం ఖాతాలో యాజమాన్యం చెల్లించాల్సిన వాటా (మూల వేతనంలో 8.33%) పీఎఫ్‌ను తొలి మూడేళ్లు ప్రభుత్వమే జమ చేయనుంది. దీని కోసం బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లను ప్రతిపాదించారు. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల భవిష్యనిధి సంస్థలో సభ్యులుగా చేరేవారి సంఖ్య పెరుగుతుందని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించటానికి సంస్థల యాజమాన్యాలు ముందుకొస్తాయని, ఉద్యోగులు కూడా ఈపీఎఫ్ఒ రక్షణ పరిధిలోకి వస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నారు. నెలకు రూ.15 వేల వరకు వేతనం పొందే వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది.
అభయ'ముద్ర'!
      'ప్రధానమంత్రి ముద్రా యోజన' కింద 2016-17లో ఇచ్చే రుణాలను రూ.1,80,000 కోట్లకుపెంచాలని నిర్ణయించినట్లుగా బడ్జెట్లో ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెల ప్రారంభానికి ఈ పథకం కింద 2.5 కోట్ల మందికి రూ.లక్ష కోట్ల రుణాలు మంజూరైనట్లు తెలిపారు. ముద్రాబ్యాంకుకు కేంద్రప్రభుత్వం వాటా మూలధనం కింద రూ.2,400 కోట్లను, దీనికి అదనంగా రుణహామీనిధిని అందజేయనున్నట్లుగా బడ్జెట్‌లో పేర్కొన్నారు.

అంతరిక్ష రంగం
      అంతరిక్ష రంగానికి ఈసారి మంచి కేటాయింపులు దక్కాయి. తాజా బడ్జెట్‌లో ఈ విభాగానికి రూ.7509 కోట్లు కేటాయించారు. గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే రూ.550 కోట్లు అదనంగా ప్రతిపాదించారు. తాజా కేటాయింపుల్లో రూ.1509 కోట్లను వివిధ ప్రాజెక్టులకు ప్రత్యేకించారు. భారీ అంతరిక్ష ప్రయోగాల కోసం అభివృద్ధి చెందిన దేశాలు కూడా మన సహకారం కోరే స్థాయికి భారత్ ఎదిగింది. 30 శాతం తక్కువ ఖర్చుతో భారీ అంతరిక్ష ప్రయోగాలను చేపట్టి వాటిని విజయవంతం చేస్తుండటంతో ఈ రంగంలో కలిసి పనిచేసేందుకు అగ్రదేశాలు ఆసక్తి చూపుతున్నాయి. అంతరిక్ష రంగంలో భారత్‌కన్నా ముందు అమెరికా, రష్యాలు మాత్రమే ఉన్నాయి.
ఇస్రో వరుసగా 30 ప్రయోగాలను విజయవంతం చేసింది.
విదేశాలకు చెందిన 51 ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
విదేశీ ఉపగ్రహాలతో ఇస్రోకి రూ.750 కోట్ల దాకా ఆదాయం వచ్చినట్లు అంచనా
2015-16లో..ప్రయోగించిన ఉపగ్రహాలు...25 (వీటిలో వాణిజ్య ఉపగ్రహాలు 17)
లక్ష్యాలు
1. రాకెట్ ఇంధనాలకు బదులుగా కిరోసిన్ వాడకం
2. మళ్లీమళ్లీ వాడగలిగే రాకెట్ల రూపకల్పన
3. చంద్రయాన్ 2, ఆదిత్య, నిసార్ ప్రాజెక్ట్‌లు
4. మూడేళ్లలో 30 ప్రయోగాలు
అంగార‌క‌ యానానికి నాసా రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తే.. అదే తరహా ప్రయోగానికి భారత్ చేపట్టిన మంగళయాన్ ప్రాజెక్ట్ ఖర్చు రూ.450 కోట్లు.
ఐటీ రంగం
హార్డ్‌వేర్ రంగంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం.
తాజా బడ్జెట్‌లో సమాచారం, సాంకేతిక పరిజ్ఞాన రంగానికి భారీ ప్రోత్సాహం కల్పించారు. ఐటీ సంబంధిత ఉత్పత్తులపై కస్టమ్స్.. ఎక్సైజు సుంకాన్ని భారీగా తగ్గించారు. ఇప్పటి వరకూ 12.5 శాతమున్న ఈ సుంకాన్ని నాలుగు శాతానికి పరిమితం చేశారు. దీంతో దేశీయంగా ఈ ఉత్పత్తుల తయారీ పెరిగే అవకాశముంది. ఐటీ హార్డ్‌వేర్‌కి సంబంధించి ఈ ఏడాది భారత్‌కి పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశముంది. ఎక్సైజు సుంకం తగ్గింపుతో రౌటర్లు, సెట్ టాప్ బాక్స్‌లు, మోడెం, ఐపీ కెమెరా, డిజిటల్ వీడియో రికార్డర్ల ధరలు ఎనిమిది శాతం మేర తగ్గుతాయి. కొత్తగా పలు ఐటీ హార్డ్‌వేర్ పరిశ్రమల ఏర్పాటయ్యే అవకాశమూ ఉంది.
ఐటీ రంగంలో 2015లో భారత్ 23% వృద్ధి సాధించింది. మోదీ ప్రభుత్వం డిజిటల్ ఇండియా, అంకుర భారత్ వంటి పథకాలను చేపట్టడంతో భవిష్యత్తులో ఐటీ గణనీయంగా వృద్ధి చెందే అవకాశముంది.
ఐటీతో ఆర్థిక వృద్ధి
ప్రపంచంలో ఐటీ సేవలకు అతిపెద్ద గమ్యస్థానం భారత్.
దేశంలో ఐటీ రంగ ఉద్యోగులు 1 కోటి.
2015-16లో ఐటీ ద్వారా వచ్చిన ఆదాయం 8 లక్షల కోట్లు.
మనదే పైచెయ్యి
ఖర్చులు అమెరికా కంటే 4 రెట్లు తక్కువ.
నిపుణుల లభ్యత చాలా ఎక్కువ.
1998లో జీడీపీలో ఐటీ వాటా 1.2 శాతం ఇప్పుడు 9.5 శాతం.
దేశంలో మొత్తం ఐటీ సంస్థలు 8400. 2020 నాటికి వీటి సంఖ్య 11500 (అంచనా).
2020 నాటికి ఐటీ రంగ విలువ రూ.20 లక్షల కోట్లు.
సానుకూలాంశాలు
మంచి వాతావరణం
ప్రభుత్వ ప్రోత్సాహం
ప్రైవేటు సహకారం
ఆదాయ వెల్లడికి మరో అవకాశం
దేశంలోని నల్లధన కుబేరులు తమ ఆదాయ వివరాలను వెల్లడించేందుకు కేంద్రం మరో అవకాశం ఇచ్చింది. తద్వారా వారు తమ ఆదాయాన్ని వెల్లడించి, 45% పన్ను చెల్లించడం ద్వారా ఆ మొత్తాన్ని చట్టబద్ధమైన ఆదాయంగా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ఈ 45% మొత్తంలో 30% పన్ను, 7.5% జరిమానా, 7.5% కృషి కల్యాణ్ సర్‌ఛార్జి కలిసి ఉంటాయి. సర్‌ఛార్జిగా వసూలయ్యే మొత్తాన్ని వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి వినియోగిస్తారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ఈ 'ఆదాయ వెల్లడి పథకం' అందుబాటులోకి రానుంది. ఈ పథకం కింద ఆదాయాన్ని వెల్లడించినప్పుడు... ఎలాంటి తనిఖీలు నిర్వహించరు. బినామీ చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోరు. పైగా వివరాలను వెల్లడించినవారికి సంబంధిత చట్టాల కింద దర్యాప్తు నుంచి మినహాయింపు ఇస్తారు.

''పన్ను ఎగవేతదారులకు ఇది క్షమాభిక్ష పథకమో, స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకమో కాదు. సకాలంలో పన్ను చెల్లించనందుకు అపరాధ రుసుముతో కలిపి చెల్లించేలా వారికి మరోసారి అవకాశమిస్తున్నాం. తద్వారా లెక్కల్లోకి రాని ధనాన్ని ఆర్థిక వ్యవస్థ పరిధిలోకి తీసుకొస్తాం.''
- ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
రాయితీపై 5 కోట్ల గ్యాస్ కనెక్షన్లు
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బి.పి.ఎల్.) అయిదు కోట్ల నిరుపేద కుటుంబాలకు రాయితీ ధరపై వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. 2018-19 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ.1600 చొప్పున రాయితీ లభిస్తుందని ఆయ‌న‌ చెప్పారు. ఒకే సిలిండర్ ఉన్న కనెక్షన్ పొందడానికి దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ రూ.3400 చొప్పున అవుతోందని తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యకలాపాలకు వసూలు చేసే నిధుల నుంచి బీపీఎల్ కుటుంబాలకు రాయితీ ఇస్తామని వివరించారు. 2017-18లో 1.5 కోట్ల మందికి, 18-19లో మిగిలిన 2 కోట్ల మందికి కనెక్షన్లు లభిస్తాయని చెప్పారు. బీపీఎల్ పరిధిలోకి రాని కుటుంబాలకు కూడా మూడేళ్లలో 5 కోట్ల కనెక్షన్లు ఇవ్వాలనే ప్రణాళిక ఉందనీ, బిహార్, పశ్చిమ్‌బంగ, ఒడిశా వంటి రాష్ట్రాల్లో వంటగ్యాస్‌ను ఎక్కువ మందికి చేరువ చేస్తామనీ ప్రధాన్ వివరించారు. రాయితీతో కూడిన ఎల్పీజీ కనెక్షన్ల నిమిత్తం 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.2000 కోట్లు కేటాయించారు. ఆ ఒక్క ఏడాదిలోనే 1.50 కోట్ల మందికి లబ్ధి కలిగించడానికి ఇది ఉపయోగపడుతుంది.
బడ్జెట్‌లో సింహభాగం ఆక్రమించే రాయితీల భారం తగ్గించుకునే దిశగా ఎన్డీయే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత బడ్జెట్‌లో రాయితీలను దాదాపు 10% తగ్గించింది. ఒక్క పెట్రోలియం ఉత్పత్తుల రాయితీలోనే ఏకంగా రూ.30 వేల కోట్లు కోత పెట్టింది.
తగ్గుతున్న భారం
ఆర్థిక సంవత్సరం మొత్తం రాయితీలు (రూ.కోట్లలో) బడ్జెట్‌లో వాటా
2012-13
2013-14
2014-15
2015-16
2016-17
2,57,079
2,54,632
2,66,692
2,43,811
2,31,781
18.23
16.33
15.86
13.72
11.71

2016-17 బడ్జెట్‌లో రాయితీలు (రూ.కోట్లలో)..
మొత్తం కేటాయింపు: 2,31,781
ఆహారానికి
ఎరువులకు
పెట్రోలియంకు
1,36,834
70,000
26,947
పెట్రోలియం ఉత్పత్తుల కోసం కేటాయించిన మొత్తంలో సుమారు రూ.22 వేల కోట్లు వంటగ్యాస్ రాయితీ కిందే పోతోంది.
ఆహారానికి కేటాయించిన రాయితీల్లో అత్యధికంగా రూ.65 వేల కోట్లు జాతీయ ఆహారభద్రత చట్టం అమలుకే.
దేశంలో వంటగ్యాస్ కనెక్షన్లు 16.35 కోట్లు.
నకిలీల ఏరివేత తర్వాత మిగిలినవి 14.78 కోట్లు
నగదు బదిలీ అమలు, నకిలీల ఏరివేతతో 2015లో ఆదా అయింది రూ.14,600 కోట్లు
స్వచ్ఛందంగా గ్యాస్ రాయితీని వదులుకున్న వారు 75 లక్షలు. దీంతో ఆదా అయ్యింది రూ.2,000 కోట్లు
పన్ను చెల్లించే ఆదాయం రూ.10 లక్షలు దాటిన వారు 20 లక్షల మంది. వీరికి రాయితీ తీసేస్తే అదా అయ్యేది రూ.300 కోట్లు.
పల్లెకు డిజిటల్ కళ
గ్రామీణ భారత్‌లో డిజిటల్ అక్షరాస్యతను వ్యాప్తి చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. 16.8 కోట్ల గ్రామీణ కుటుంబాల్లో 12 కోట్ల కుటుంబాలకు కంప్యూటర్లు లేవు. డిజిటల్ అక్షరాస్యులూ లేరు. డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించేందుకు జాతీయ డిజిటల్ అక్షరాస్యత మిషన్, డిజిటల్ సాక్షరత అభియాన్ (దిశ)ల పేరిట ప్రభుత్వం ఇప్పటికే రెండు పథకాలను చేపట్టింది. ఈ క్రమంలో గ్రామీణ భారత్ కోసం సరికొత్త 'డిజిటల్ అక్షరాస్యత పథకం' ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో 6 కోట్ల కుటుంబాలను చేర్చాలన్నది లక్ష్యం.
భూముల రికార్డుల ఆధునికీకరణ: డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద..జాతీయ భూమి రికార్డు ఆధునికీకరణ కార్యక్రమాన్ని ప్రక్షాళన చేసి, 2016 ఏప్రిల్ 1 నుంచి కేంద్రరంగ పథకంగా అమలు చేస్తారు. రూ.150 కోట్లు కేటాయించారు.
డిజిటల్ అక్షరాస్యత అంటే: కంప్యూటర్లు, ట్యాబ్లెట్ పీసీలు, స్మార్ట్‌ఫోన్లు, అంతర్జాలాన్ని వినియోగించగలిగే సామర్థ్యమే డిజిటల్ అక్షరాస్యత.
డిజిటల్ ఇండియా కార్యక్రమం: ఈ-లెర్నింగ్, ఈ-పంచాయతీ, భూరికార్డుల ఆధునికీకరణ.. కేటాయింపులు.రూ.2059 కోట్లు.
ముడి చమురు
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో దీని నుంచి మరింత లబ్ధి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశంలో నిల్వలు పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముడి చమురును దేశంలో నిల్వచేసే విదేశీ కంపెనీలకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. ఆయా కంపెనీలు ముడిచమురు నిల్వ, అమ్మకం ద్వారా ఆదాయాన్ని పొందినా దాన్ని వ్యాపారంగా పరిగణించమని..భారత్‌లో అది పన్ను పరిధిలోకి రాదని పేర్కొంది. మరోవైపు అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పతనంతో భారత్‌కి బాగా కలిసొచ్చినా.. ఈ విషయాన్ని బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రధానంగా ప్రస్తావించలేదు. భారత్ చమురు కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ఈ చమురు ధరల క్షీణత వల్ల ఆదా అయ్యే మొత్తం దేశంలో ఇతర సంక్షేమ పథకాల అమలుకు ఉపకరిస్తోంది.
ముడిచమురు బ్యారెల్ ధర 2014 జూన్‌లో 120 డాలర్లు. ప్రస్తుతమది 30 డాలర్లకు కాస్త అటుఇటుగా ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 188.23 మిలియన్ టన్నుల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంది. 2016-17లో 188.23 మిలియన్ టన్నుల్ని దిగుమతి చేసుకోవాలని చూస్తోంది.
అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే దేశాలు సౌదీ అరేబియా, రష్యా. ఇవి చెరో 13% ఉత్పత్తి చేస్తున్నాయి.
10% మాత్రమే ఉత్పత్తి చేసే అమెరికా మాత్రం 20% చమురు వాడేసుకుంటోంది.
గ్రామీణాభివృద్ధికి:
మోదీ సర్కారు గ్రామీణాభివృద్ధికి ఊతమిచ్చేలా కేటాయింపులు చేసింది. భాజపా ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలు, ధనికులకే అనుకూలమైన విధానాలను అనుసరిస్తోందన్న ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో.. గ్రామీణాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. గతంలో కంటే రూ.8200 కోట్లకు పైగా పెంచి మొత్తం రూ.87,765 కోట్లు కేటాయించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూడా గతంలో కంటే రూ.3,800 కోట్లు పెంచి రూ.38,500 కోట్లు కేటాయించింది.
14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా రూ.2.87 లక్షల కోట్లు కేటాయించారు. గతంతో పోల్చితే ఇది 228% ఎక్కువ.
ఈ నిధులను సగటున ఒక్కో పంచాయతీకి రూ.80 లక్షలు, పురపాలికకు రూ.21 కోట్లు చొప్పున అందించవచ్చు.
కరవు, గ్రామీణ ప్రాంతాల సమస్యలపై అత్యవసరంగా దృష్టి.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సత్వరమే స్వయం సహాయక సంఘాల ఏర్పాటు.
నీటి సంరక్షణ, సహజ వనరుల నిర్వహణకు క్లస్టర్ ఫెసిలిటేషన్ బృందాల (సీఎఫ్‌టీ)ను ఏర్పాటు చేయడం.
ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద కరవు పీడిత ప్రాంతాలకు ప్రాధాన్యమివ్వడం.
శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద 300 రూర్బన్ సమూహాలను అభివృద్ధిపర్చడం.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు పంచాయతీరాజ్ సంస్థలు పాలనా సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. ఇందుకోసం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.655 కోట్లు కేటాయింపు.
2018 మే 1 కల్లా అన్ని గ్రామాలకు విద్యుత్ సదుపాయాన్ని కల్పించడమే లక్ష్యం.
గ్రామీణాభివృద్ధి
సంవత్సరం కేటాయింపులు (రూ.కోట్లలో)
2015 - 16
2016 - 17
79,526
87,765
వర్ధమాన దేశాల్లోని 75 శాతం పేదలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు.
2020 నాటికి గ్రామీణ పేదరికం 60 శాతానికి తగ్గుతుందని అంచనా.
ప్రపంచంలో అత్యధిక గ్రామీణ జనాభా ఉన్న దేశం భారత్.
గ్రామాల్లో 64 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు.
ప్రధాన పథకాలు
గ్రామీణ ఉపాధి హామీ.
గ్రామీణ జీవనాధార కార్యక్రమం.
దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన.
కృషి సించాయీ యోజన.
సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన.
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన.
గ్రామ సమూహాల్లో పట్టణ స్థాయి సదుపాయల కల్పనకు ఇటీవల రూర్బన్ మిషన్ ప్రారంభించారు.
రక్షణరంగం
రక్షణ శాఖకు కేటాయింపులు ఒక మోస్తరుగా పెరిగాయి. గత బడ్జెట్‌తో పోలిస్తే 9.76 శాతం మేర నిధులను పెంచారు. ఈసారి రూ.2.58 లక్షల కోట్లు కేటాయించారు. సైనిక పింఛన్లకు కేటాయింపులను భారీగా రూ.82 వేల కోట్లకు పెంచారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఆశ్చర్యకరంగా ఈసారి తన బడ్జెట్ ప్రసంగంలో రక్షణ రంగ కేటాయింపుల అంశాన్ని ప్రస్తావించలేదు.
2016-17 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం చేయబోయే వ్యయం రూ.19.78 లక్షల కోట్లు కాగా.. అందులో రక్షణ బడ్జెట్ వాటా 17.2 శాతంగా ఉంది.
రక్షణ కేటాయింపుల్లో త్రివిధ దళాల ఆధునికీకరణకు ఉద్దేశించిన ప్రణాళిక వ్యయం రూ.78,586.68 కోట్లు. గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.4287.07 కోట్ల మేర మాత్రమే పెరిగింది. దీనికి ప్రధాన కారణం.. 2015-16 బడ్జెట్‌లో కేటాయించిన పెట్టుబడి బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడమే.
రక్షణ రంగంలో పొరుగు దేశం చైనాను అధిగమించాలన్నది భారత లక్ష్యం. తదనుగుణంగా ఏటికేడు రక్షణ బలగాలు.. ఆయుధ సంపత్తిని పెంచుతున్నారు. ముందుటేడాదితో పోలిస్తే 2015-16లో 7.9% అధిక నిధులు కేటాయించారు.
లక్ష్యాలు
హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం సాధించాలి.
అత్యాధునిక యుద్ధవిమానాలు, హెలికాప్టర్లను సమకూర్చుకోవటం.
రక్షణ ఉత్పత్తులను సొంతంగా తయారు చేసుకోవటం. 2027కి రక్షణ ఉత్పత్తుల్లో 70% దేశీయంగానే తయారవ్వాలి.
గత ఆర్థిక సంవత్సరంలో రూ.630 కోట్ల విలువైన ఎగుమతులు చేశాం. రానున్న పదేళ్లలో దీన్ని 20,025 కోట్లకు చేర్చాలి.
రాబోతున్న హెలికాప్టర్లు, యుద్ధవిమానాలు:
దస్సాల్ట్ నుంచి యుద్ధవిమానాలు
తేలికపాటి హెలికాప్టర్లు
అత్యంత తేలికపాటి హెలికాప్టర్లు
అపాచే అటాక్ హెలికాప్టర్లు
మధ్యస్థాయి లిఫ్ట్ హెలికాప్టర్లు
126
197
145
15
22
జీడీపీలో రక్షణ మీద ఏ దేశం ఎంత ఖర్చు పెడుతోంది?
దేశం అమెరికా రష్యా చైనా బ్రిటన్ సౌదీ భారత్
జీడీపీలో శాతం 3.5 4.5 2.1 3.5 10.4 2.4
హోంశాఖ
హోంశాఖకు ఈసారి 24.56 శాతం మేర నిధులు పెంచి, రూ.77,383.12 కోట్లు కేటాయించారు. ఇందులో అధికశాతం పారామిలటరీ దళాలకు ప్రత్యేకించారు. ప్రణాళికేతర వ్యయం కింద రూ.67,408.12 కోట్లు, ప్రణాళిక వ్యయం కింద రూ.9,975 కోట్లు ఇచ్చారు.
ఏడు పారామిలటరీ దళాలకు రూ.50,176.45 కోట్లు కేటాయించారు. ఇందులో అత్యధికంగా సీఆర్పీఎఫ్‌కు రూ.16,228.18 కోట్లు, సరిహద్దు భద్రతా దశానికి రూ.14,652.90 కోట్లు, కేంద్ర పారిశ్రామిక భద్రతాదళానికి (సీఐఎస్ఎఫ్) రూ.6,067.13 కోట్లు ఇచ్చారు.
ఉగ్రవాద నిరోధక కమాండో విభాగమైన జాతీయ భద్రతా దళానికి (ఎన్ఎస్‌జీ) రూ.688.47 కోట్లు దక్కాయి. దిల్లీ పోలీసు విభాగానికి రూ.5,657.84 కోట్లు కేటాయించారు.
పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి సహా పలు సందర్భాల్లో పాక్ ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చిన నేపథ్యంలో భారత్-పాక్, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె, రోడ్లు నిర్మాణానికి, అధునాతన నిఘా వ్యవస్థ ఏర్పాటుకు రూ.2,490 కోట్లను ప్రత్యేకించారు.
దిల్లీలో మహిళల భద్రతకు ఉద్దేశించిన 'నిర్భయ నిధి'కి రూ.150 కోట్లు.
శాంతిభద్రతలు:
దేశంలో శాంతి భద్రతల పరిరక్షణకు కేంద్రం ప్రాధాన్యమిస్తూ ఏటికేడు హోంశాఖకు నిధులు పెంచుతూ వస్తోంది. 2014-15లో రూ.56,372.45 కోట్లు కేటాయించగా, 2015-16లో అంతకు 10.2% అధికంగా రూ.62,124.52 కోట్లు కేటాయించింది. అయినా, ఉండాల్సినన్ని ఠాణాల్లేవు. పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు.
పోలీసు పరిశోధన, అభివృద్ధి బ్యూరో (బీపీఆర్‌డీ)-2015 నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా సగటున 547 మందికో పోలీసు ఉండాలి. కానీ, 720 మందికో పోలీసు మాత్రమే ఉన్నారు.
దేశంలో అంతర్గత భద్రత పరిస్థితిదీ
  2004 2014
జనాభా
పోలీసులు
ఠాణాలు
ఔట్ పోస్ట్‌లు
108.99 కోట్లు
15.30 లక్షలు
12,548
7,245
123.89 కోట్లు
22.63 లక్షలు
15,090
8,689
తెలంగాణలో ఠాణాలు: 728 (581 మందికో పోలీసు ఉండాలి. కానీ 728 మందికో పోలీసు ఉన్నారు)
ఆంధ్రప్రదేశ్‌లో ఠాణాలు: 999 (740 మందికో పోలీసు ఉండాలి. కానీ 908 మందికో పోలీసు ఉన్నారు)
స్వచ్ఛభారత్
స్వచ్ఛభారత్ పథకం అమలుకు కేంద్రప్రభుత్వం రూ.11,300 కోట్ల మొత్తాన్ని కేటాయించింది. దీంట్లో గ్రామీణప్రాంతాలకు రూ.9,000 కోట్లు కాగా.. పట్టణప్రాంతాలకు రూ.2,300 కోట్లని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. పరిసరాల పరిశుభ్రత అనేది జాతిపిత గాంధీజీకి అత్యంత ఇష్టమైన అంశమని జైట్లీ పేర్కొన్నారు. స్వచ్ఛభారత్ నేపథ్యంలోనే పారిశుద్ధ్యంపై పార్లమెంటులో ఒక సమగ్రచర్చ జరిగిందని, స్వాతంత్య్రానంతరం ఇది తొలిసారని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రతీఇంటిలో దీనిపై చర్చ జరుగుతోందని, పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి నగరాలు, పట్ణణాలకు ర్యాంకులను ఇవ్వటం ద్వారా వాటిమధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రవేశపెట్టామని తెలిపారు.
గాంధీజీ స్ఫూరిగా..: ప్రపంచంలోని అత్యంత పరిశుభ్రమైన దేశాల్లో భారత్ ఒకటిగా ఉండాలన్న లక్ష్యంతో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా 2014 అక్టోబరు 2న స్వచ్ఛభారత్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. గాంధీజీ 150వ జయంతి అయిన 2019 అక్టోబరు 2 నాటికి దేశాన్ని పూర్తి పరిశుభ్రంగా మార్చడం స్వచ్ఛభారత్ లక్ష్యం. దీంట్లోభాగంగా ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కలిగించేలా ప్రచారం జరపటం, బహిరంగ మలవిసర్జన లేకుండా చేయడం, పట్టణాల్లోని ఘనవ్యర్థాల నిర్వహణ, 2019 నాటికి కోటికి పైగా మరుగుదొడ్లను నిర్మించేలా కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది.
విద్యారంగం
'ప్రాథమిక' నుంచి 'ఉన్నత' వరకు నాణ్యత పెంచాలని నిర్ణయం.
విద్యారంగానికి సంబంధించి నాలుగు ప్రధాన నిర్ణయాలు వెలువడ్డాయి. ఇందులో రెండు ఉన్నత విద్యకు సంబంధించినవి ఉన్నాయి. ఉన్న త విద్యా సంస్థల అభివృద్ధికి రూ.1000 కోట్ల ప్రారంభ మూలధనంతో ఉన్నత విద్య ఆర్థిక సహాయ సంస్థ (హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ-హెచ్ఈఎఫ్ఏ)ను ఏర్పాటు చేయనుంది. లాభాపేక్ష రహితంగా పని చేసే ఈ సంస్థ మార్కెట్ నుంచి నిధులు సేకరించడంతో పాటు, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధి నుంచి విరాళాలు స్వీకరించనుంది. ఈ నిధులతో మౌలిక వసతుల మెరుగు కోసం ఐఐటీల్లాంటి ఉన్నత విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తుంది. ఆయా సంస్థలు తమ అంతర్గత వనరులను పెంచుకోవడం ద్వారా ఈ సొమ్మును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
రెండోది, దేశంలోని పది ప్రభుత్వ, మరో పది ప్రయివేటు విద్యాసంస్థలు ప్రపంచ స్థాయి బోధన, పరిశోధన కేంద్రాలుగా ఎదిగేందుకు అవసరమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడం. సామాన్యులకు సయితం ఉన్నత ప్రమాణాలుగల విద్య అందేలా చూడడమే దీని ఉద్దేశం. ఇందుకు సంబంధించి పూర్తి విధివిధానాలతో ప్రణాళికను రూపొందించనుంది.
ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం మూడో అంశం. ఈ రంగానికి గత ఏడాదితో పోల్చితే రూ.1,368 కోట్లు అదనంగా కేటాయించారు. ప్రాథమిక విద్యా రంగం విస్తరణకు ఇంతవరకు ప్రాధాన్యం లభించగా, ఇప్పుడు నాణ్యత పెంచడంపై 'భారీ ముందడుగు' వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సర్వశిక్షా అభియాన్ పథకానికి నిధులను పెంచింది. రానున్న రెండేళ్లలో కొత్తగా 62 నవోదయ విద్యాలయాలను నెలకొల్పనుంది. ఇంతవరకు ఏర్పాటు కాని జిల్లాల్లో వీటిని స్థాపించనున్నారు.
విద్యార్హత ధ్రువపత్రాల కోసం డిజిటల్ డిపాజిటరీని నెలకొల్పనుంది. సెక్యూరీటీ పత్రాల మాదిరిగా మార్కుషీట్లు, స్కూలు, డిగ్రీ సర్టిఫికెట్లకు కూడా డిజిటల్ డిపాజిటరీని ఏర్పాటు చేస్తారు. దీంతో పత్రాల ధ్రువీకరణ, భద్రత, వాటిని పొందడం సులువవుతుంది. ఈ విధానం ద్వారా ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం, ఉద్యోగాల్లో చేరే సమయాల్లో సంబంధిత పత్రాలు సరైనవి అవునో కాదో ఆన్‌లైన్‌లోనే ధ్రువీకరించుకునే వీలు ఉంటుంది.
జాతీయ విద్యా మిషన్‌కు రూ.28,010 కోట్లు కేటాయించగా, అందులో సర్వశిక్షా అభియాన్‌కు రూ.22,500 కోట్లు ప్రత్యేకించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి రూ.9,700 కోట్లు ఇచ్చారు. ప్రస్తుత బడ్జెట్‌లో పాఠశాల విద్య, సాహిత్య రంగాలకు రూ.43,554 కోట్లు కేటాయించగా, గత బడ్జెట్ (సవరణ)లో ఈ కేటాయింపులు రూ.42, 186 కోట్లు. ఉన్నత విద్యకు గత బడ్జెట్ (సవరణ)లో రూ.25,399 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో నిధులను రూ.28,840 కోట్లకు పెంచారు.
ప్రపంచంలోనే అత్యధిక విద్యార్థులున్న దేశం భారత్. ఇక్కడ వారికి సరిపడా పాఠశాలలు.. వసతులు.శిక్షణ సంస్థలు లేవు. ఫలితంగా విద్యా రంగంలో చాలా వెనుకబడి ఉన్నాం. రాబోయే ఏడేళ్లలో దేశంలో నిర్మాణరంగం, రవాణా, ఆటోమొబైల్, చిరువర్తకం వంటి 24 రంగాల్లో 12 కోట్ల మంది నిపుణుల అవసరం ఉంది. దీన్ని సాధించడం విద్యారంగం ముందున్న పెద్ద సవాలు.
భారత్‌లో ప్రభుత్వ విద్యాలయాలు
* విశ్వవిద్యాలయాలు 757
* కశాశాలలు దాదాపు 38056
* ప్రాథమిక పాఠశాలలు 15 లక్షలు
విద్యార్థులు
* భారత్‌లో 32 కోట్లు
* చైనాలో 25 కోట్లు
ప్రాథమిక విద్య
దేశంలో పటిష్ఠ పునాదితో చదువుతున్నవారు 22 శాతం మంది మాత్రమే
అమెరికాలో 95, బ్రిటన్‌లో 58 శాతం
భారత్‌లో 1వ తరగతి పుస్తకం చదవలేని మూడో తరగతి విద్యార్థులు 60 శాతం
అంకెలు రాని రెండో తరగతి విద్యార్థులు 20 శాతం
దేశంలో 60 లక్షల మంది చిన్నారులు చదువుకు దూరం. ఏటా 10 లక్షల విద్యార్థులు మధ్యలోనే బడి మానేస్తున్నారు.
మాధ్యమిక, ఉన్నత విద్య
ప్రపంచంలోనే అత్యుత్తమ 200 విశ్వవిద్యాలయాల్లో ఒకటీ లేని బ్రిక్ దేశం భారత్
మనకంటే తక్కువ జనాభా ఉన్న అమెరికాలో 5000 వర్సిటీలుంటే.. మనకున్నవి 757
భారత్‌కన్నా చిన్నదేశం జపాన్‌లో 727 వర్సిటీలు
ప్రాథమిక దశలో 30 శాతం, మాధ్యమిక దశలో 40 శాతం విద్యార్థులు బడిమానేస్తున్నారు.
ఎఫ్‌డీఐ
మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు వెలువడ్డాయి. బీమా, పింఛను, ఆస్తుల పునర్ నిర్మాణ కంపెనీలు (ఏఆర్‌సీ), స్టాక్ ఎక్స్ఛేంజీల వంటి రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సరళీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా ప్రతిపాదనల ప్రకారం..
బీమా: ఆటోమేటిక్ పద్ధతి ద్వారా బీమా, పింఛను రంగాల్లో 49 శాతం దాకా ఎఫ్‌డీఐకి అనుమతినిస్తారు. ప్రస్తుతం 26 శాతం వరకే అనుమతి ఉంది.
ఏఆర్‌సీలు: ఏఆర్‌సీల్లో ఆటోమేటిక్ పద్ధతి ద్వారా ప్రస్తుతం 49 శాతం దాకా ఎఫ్‌డీఐలకు అనుమతి ఉండగా.ఆ పరిమితిని 100 శాతానికి చేర్చనున్నారు. దీని ప్రకారం.. ఏఆర్‌సీలు జారీ చేసే సెక్యూరిటీల్లో ప్రతి విడతలోనూ 100 శాతం వరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐ) పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే రంగాల వారీ పరిమితులు వర్తిస్తాయి.
స్టాక్ ఎక్స్ఛేంజీలు: భారత స్టాక్ ఎక్స్ఛేంజీల్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని 5 శాతం నుంచి 15 శాతానికి పెంచనున్నారు. భారత స్టాక్ ఎక్స్ఛేంజీలు అంతర్జాతీయంగా పోటీనివ్వడానికి; అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ మార్కెట్ పద్ధతులను పాటించడానికి ఈ చర్య దోహదం చేస్తుంది.
భారత్‌లో తయారీని ప్రోత్సహించడం కోసం కొన్ని షరతులకు లోబడి విదేశీ మదుపర్లకు 'రెసిడెన్సీ' హోదాను ఇస్తారు. గత ఏప్రిల్-డిసెంబరులో ఎఫ్‌డీఐ 40% పెరిగి 29.44 బి.డాలర్ల (దాదాపు రూ.2 లక్షల కోట్లు)కు చేరాయి. తాజా నిర్ణయంతో విదేశీ పెట్టుబడులు మరింత పెరగనున్నాయి.
విదేశీ మదుపర్లకు పెద్ద ఊరట
పన్ను వివాదాల్లో అపరాధ రుసుము, వడ్డీల తొలగింపు.
విదేశీ మదుపర్లకు గొప్ప ఊరట లభించింది. వెనకటి తేదీ నుంచి అమలయ్యే సవరణ పన్ను చట్టాల కారణంగా కేసుల్లో ఇరుకున్న విదేశీ కంపెనీలు ఒకేసారి సెటిల్‌మెంటు చేసుకోవడానికి వీలు కల్పించింది. ప్రాథమికంగా ఎంతైతే పన్ను కట్టాలో అంతే కడితే సరిపోతుంది. అంతక్రితం విధించిన అపరాధ రుసుము, వడ్డీలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇందు కోసం ఒక 'ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కార పథకం'ను తీసుకురానున్నారు.
డిజిన్వెస్ట్‌మెంట్
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17) ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూలు) వాటా విక్రయ లక్ష్యాన్ని రూ.56,500 కోట్లుగా ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్లో ప్రతిపాదించారు. మరోవైపు ఈ రూ.56,500 కోట్లలో రూ.36,000 కోట్లను పీఎస్‌యూల్లో మైనార్టీ వాటా విక్రయం ద్వారా సమీకరించాలని అనుకుంటున్నట్లు జైట్లీ చెప్పారు. లాభాలను ఆర్జిస్తున్న పీఎస్‌యూలతో పాటు నష్టాల్లో నడుస్తున్న సంస్థల్లో వ్యూహాత్మక (వాటా విక్రయం మినహా ఇతరత్రా రూపేణా) అమ్మకాల ద్వారా మిగిలిన రూ.20,500 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వ్యూహాత్మక విక్రయాలకు అవకాశమున్న పీఎస్‌యూలను నీతి ఆయోగ్ గుర్తిస్తుందని పేర్కొన్నారు.స్థలం, తయారీ యూనిట్లు తదితరాలను విక్రయించి కొత్త ప్రాజెక్టులకు అవసరమైన నిధులను సమకూర్చుకునే వెసులుబాటును పీఎస్‌యూలకు ఇవ్వనున్నట్లు జైట్లీ చెప్పారు.
పెట్టుబడుల ఉపసంహరణ విభాగం పేరును ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల విభాగం (డీఐపీఏఎం)గా ప్రభుత్వం మార్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వాటా విక్రయ లక్ష్యమైన రూ.69,500 కోట్లలో ఇప్పటివరకు రూ.25,312 కోట్లను మాత్రమే ప్రభుత్వం సమీకరించింది. దీనిని బట్టి చూస్తే ఈ సారి కూడా వాటా విక్రయ లక్ష్యాన్ని ప్రభుత్వం అందుకునే అవకాశం కన్పించడం లేదు.
పన్నులు
పారిశ్రామిక కార్యకలాపాల ప్రోత్సాహానికి, ఉద్యోగాల సృష్టి కోసం ప్రభుత్వం కార్పొరేట్ పన్నును తగ్గించింది. కొత్త తయారీ ప్లాంట్లపై కార్పొరేట్ పన్నును 25 శాతానికి పరిమితం చేసింది. రూ.5 కోట్ల టర్నోవరు ఉన్న చిన్న సంస్థలకు సైతం 29 శాతానికి తగ్గించనున్నట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలు వివరంగా..
మార్చి 1, 2016న లేదా ఆ తర్వాత ఏర్పాటయ్యే కొత్త తయారీ కంపెనీలకు 25 శాతం కార్పొరేట్ పన్ను మాత్రమే విధిస్తారు. దీనికి సర్‌ఛార్జీ, సెస్సులు అదనం. అయితే లాభాలు, పెట్టుబడులకు సంబంధించిన మినహాయింపులకు వీరు అర్హులు కారు.
రూ.5 కోట్లకు మించని టర్నోవరు ఉండే చిన్న కంపెనీలకు పన్నును 30% నుంచి 29 శాతానికి తగ్గించారు. వీటికి సర్‌ఛార్జీ, సెస్సులు అదనం.
కార్పొరేట్ రంగానికి ఇస్తున్న మినహాయింపుల తొలగింపుపై తుది ప్రణాళికను సైతం బడ్జెట్లో జైట్లీ ప్రకటించారు. అవేంటంటే.. ఏప్రిల్ 1, 2017 నుంచి ఐటీ చట్టం కింద త్వరిత తరుగుదల (యాక్సిలరేటెడ్ డిప్రీసియేషన్)ను గరిష్ఠంగా 40 శాతానికే పరిమితం అవుతుంది. ఏప్రిల్ 1, 2017 తర్వాత ఏదైనా మౌలిక ప్లాంటులో చేపట్టే అభివృద్ధి, కార్యకలాపాలు, నిర్వహణపై ఎలాంటి మినహాయింపులూ ఉండకుండా.. ఆదాయ పన్ను చట్టం 80ఐఏను సవరిస్తారు.
రూ.10 లక్షల పైబడిన డివిడెండుపై 10% పన్ను:
వ్యక్తులు, కంపెనీలు రూ.10 లక్షలకు పైగా డివిడెండు పొందితే ఇక పన్ను కట్టాల్సిందే. ఈ తరహా సందర్భాల్లో 10 శాతం పన్ను వర్తింపజేయాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. డివిడెండు పంపిణీ పన్నుకు అదనంగా రూ.10 లక్షల కంటే ఎక్కువ డివిడెండు (సంవత్సర కాలంలో)ను పొందితే.. స్థూల డివిడెండు మొత్తంపై ఈ 10 శాతాన్ని వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌లు), సంస్థలు కట్టాల్సి వస్తుంది.

పసిడి బాండ్లు
పెట్టుబడి కోసం మేలిమి బంగారం బిస్కెట్లు, నాణేలు కొనుగోలు చేసేవారికి ప్రత్యామ్నాయంగా ఆవిష్కరించిన పసిడి బాండ్లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ప్రతిపాదనను బడ్జెట్లో అరుణ్ జైట్లీ చేశారు. ఈ బాండ్ల రిడెంప్షన్ సమయంలో, మూలధన లాభ పన్ను వర్తించదని పేర్కొన్నారు. 2017 ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని బ్యాంకులలో డిపాజిట్ చేస్తే, వడ్డీ ఆదాయం పొందే 'పసిడి నగదీకరణ' పథకానికీ మూలధన లాభ పన్నును మినహాయించారు. ఇది మాత్రం 2016 ఏప్రిల్ 1నుంచే అమల్లోకి రానుంది. పసిడి నగదీకరణ 2015 కింద జారీ చేసిన సర్టిఫికెట్లను మూలధన ఆస్తులుగా పేర్కొనబోరని, అందువల్ల మూలధన లాభ పన్ను వర్తించదని పేర్కొన్నారు. పసిడి నగదీకరణ పథకంలో లభించే వడ్డీపైనా పన్ను లేని విధంగా ఆదాయపు పన్ను చట్టాన్ని సవరించనున్నారు.
ఆభరణాల తయారీ సంస్థలపై 1 శాతం ఎక్సైజ్ సుంకం: పసిడి ఆభరణాల తయారీ సంస్థల నుంచి 1 శాతం ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల బ్రాండెడ్ ఆభరణాలపై 1 శాతం ఎక్సైజ్ సుంకం పడుతుంది. ఆభరణాల తయారీ సంస్థలకు రూ.6 కోట్ల విలువైన ఆభరణాల వరకు ఈ సుంకం పడదు. అయితే ఇంతకుమించి విలువైన ఆభరణాలనే సంస్థలు తయారు చేస్తుంటాయి కనుక, 1 శాతం సుంకం తప్పదు. గతంలో ఉన్న కొన్ని అంశాలను సరళీకరించి, ఈ ఒక్క సుంకమే విధించినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ భారాన్ని కూడా కొనుగోలు దారుల నుంచే వసూలు చేస్తారని విక్రేతలు తెలిపారు. రూబీ, ఎమరాల్డ్, సఫైర్ వంటి విలువైన రాళ్లు పొదిగినవి మినహా, వెండి ఆభరణాలను మాత్రం ఎక్సైజ్ సుంకం నుంచి మినహాయించారు. గిల్టు నగల (ఇమిటేషన్ జువెలరీ)పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచారు. దీనివల్ల వీటి ధరలు పెరుగుతాయి.
బ్యాంకుల బలోపేతానికి
మూలధన సాయం ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సాయం కింద రూ.25,000 కోట్లను ఇవ్వాలని జైట్లీ ప్రతిపాదించారు. 'మొండి బకాయిల వసూళ్లపై బ్యాంకులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. ఆగిపోయిన ప్రాజెక్టుల పునరుద్ధరణకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ విషయంలో బ్యాంకులకు అండగా నిలవాలి. రుణ వితరణ వృద్ధికి తోడ్పడాలి. కేసుల సత్వర పరిష్కార నిమిత్తం రుణ వసూళ్ల ట్రిబ్యునల్‌ను ప్రభుత్వం బలోపేతం చేయనుంద'ని ఆయన చెప్పారు. అదనపు మూలధనం అవసరం పడితే ఇతర ఆర్థిక వనరులను అన్వేషిస్తామని పేర్కొన్నారు. బ్యాంక్ బోర్డు కార్యకలాపాలు 2016-17లో మొదలవుతాయని చెప్పారు.
ఐడీబీఐ బ్యాంకులో 50% దిగువకు వాటా: ప్రభుత్వరంగంలోని ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటాను 50 శాతం దిగువకు తీసుకొచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ తెలిపారు. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వానికి 80.16 శాతం వాటా ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకులను బలోపేతం చేసిన తర్వాత బ్యాంకుల ఏకీకరణపై (అనుబంధ బ్యాంకుల ఏకీకరణ, ప్రధాన బ్యాంకులో అనుబంధ బ్యాంకుల విలీనం, బలమైన బ్యాంకులో బలహీన బ్యాంకును కలపడం) దృష్టి సారిస్తామని బడ్జెట్ అనంతరం విలేకరులతో మాట్లాడూతూ జైట్లీ తెలిపారు. దీర్ఘకాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 52 శాతానికి ప్రభుత్వ వాటాను తగ్గించనున్నట్లు పేర్కొన్నారు.
వాహన రంగం
     చిన్న కార్ల నుంచి పెద్ద కార్ల వరకూ ధరలు రూ.2,000 నుంచి లక్ష దాకా ప్రియమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ రకాల వాహనాలపై 4 శాతం వరకూ మౌలిక సెస్సును విధించాలని బడ్జెట్లో ప్రతిపాదించడమే ఇందుకు కారణం. ఏ వాహనాలపై ఎంత సెస్సు ప్రతిపాదించారంటే..
చిన్న పెట్రోలు కార్లు, ఎల్‌పీజీ, సీఎన్‌జీ కార్లపై.. 1%
(4 మీటర్లలోపు పొడువున్న; ఇంజిన్ సామర్థ్యం 1200 సీసీ మించని వాహనాలు)
డీజిల్ కార్లపై.. 2.5%
(4 మీటర్ల కంటే ఎక్కువ పొడువున్న, 1500 సీసీ ఇంజిన్ సామర్థ్యం మించని కార్లు)
అధిక సామర్థ్యం గల వాహనాలు, ఎస్‌యూవీలపై..4%
(1500 సీసీ సామర్థ్యంపైన, ఎస్‌యూవీలన్నిటిపైనా)
వీటికి మినహాయింపు: త్రిచక్ర వాహనాలు, విద్యుత్‌తో నడిచే వాహనాలు, హైబ్రిడ్ వాహనాలు, హైడ్రోజన్ వాహనాలు, టాక్సీలు, అంబులెన్సులు, వికలాంగులు వాడే కార్లు, పర్యావరణహిత కార్లు.
     ఇంకా.. రూ.10 లక్షల విలువకు పైగా ఉండే విలాసవంతమైన కార్ల కొనుగోలుపై; రూ.2 లక్షలకు పైగా విలువైన వస్తువులు, సేవల కొనుగోలుపై మూలం వద్ద 1 శాతం పన్ను విధింపు.
మరింత భారం..
     ప్రస్తుతం ఈ రంగాన్ని అధిక పన్నులు వేధిస్తున్నాయి. కంపెనీ వ్యయాల్లో 77 శాతం పన్నులదే వాటా కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో అన్ని పన్నులనూ కలిపి ఒకే పన్ను విధించాలని పరిశ్రమ కోరుకుంది. అదే సమయంలో పన్ను స్థాయిని కూడా తగ్గించాలనీ కోరింది. ప్రస్తుతం చిన్న కార్లపై 12.5%, 4 మీటర్ల కంటే ఎక్కువ పొడువు 1500 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న కార్లపై 24%; ఎస్‌యూవీలపై 27% చొప్పున, గ్రౌండ్ క్లియరెన్స్ 170 ఎమ్ఎమ్ కంటే ఎక్కువున్న వాటిపై 30% చొప్పున ఎక్సైజ్ సుంకం ఉంది. ఇంకా, ఆటోమొబైల్ సెస్సు 0.125 శాతం; జాతీయ విపత్తు నిర్వహణ సుంకం (ఎన్‌సీసీడీ) 1% ఇలా.. వివిధ రకాల పన్నులున్నాయి. కానీ మౌలిక సెస్సు రూపంలో పన్ను బాదుడు అధికం కావడం గమనార్హం.
అత్యధిక ఉత్పత్తి చేస్తున్న కంపెనీల జాబితాలో టాటా 19వ స్థానం, ఎం & ఎం 25వ స్థానాల్లో ఉన్నాయి.
వాహనాల ఉత్పత్తి విషయంలో ప్రపంచంలో మనది ఆరో స్థానం.
అంకుర సంస్థలు
ఉద్యోగాల కోసం ఎదురు చూడటం కాదు.. ఇతరులకు ఉద్యోగం ఇచ్చేలా, సొంతంగా పరిశ్రమ/వాణిజ్య సంస్థను యువత ప్రారంభించేలా చూడాలన్న ఆకాంక్షను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తం చేస్తుంటారు. ఇందుకోసమే 'అంకురసంస్థ' (స్టార్టప్) విధానాన్ని ఇప్పటికే ప్రకటించారు. అంకుర సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలను ప్రతిపాదించడం ద్వారా, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రభుత్వ నిబద్ధతను బడ్జెట్ ద్వారా చాటారు.
అంకుర సంస్థలకు మూడేళ్ల పాటు 100 శాతం పన్ను మినహాయింపులను ప్రతిపాదించారు. సంస్థ నమోదు ప్రక్రియ కూడా ఒక్కరోజులోనే పూర్తిచేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. వీటితో పాటు స్టాండప్ పథకానికి కలిపి రూ.1,100 కోట్లు కేటాయించారు. వినూత్న అభివృద్ధి, కొత్త ఉత్పత్తి తయారీ, విక్రయాలు, టెక్నాలజీ ఆధారిత సేవలు - కార్యాచరణ, మేథోహక్కుల రంగాల్లోని అర్హత కలిగిన అంకుర సంస్థలు ఆర్జించే లాభాలపై నూరుశాతం పన్ను మినహాయింపు ఉంటుంది. 2019 ఏప్రిల్ 1 లోపు నెలకొల్పే అంకుర సంస్థలకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. టర్నోవర్ రూ.5 కోట్ల కంటే తక్కువ ఉండే సంస్థలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ ఆదాయపు పన్ను రేటు 29 శాతమే ఉంటుంది.
ఇల్లు అమ్మి పెట్టుబడి పెడితే, పన్ను చెల్లించనవసరం లేదు: అంకుర సంస్థల్లో 3 ఏళ్ల పాటు పెట్టుబడి కొనసాగించి, ఆర్జించే మూలధన లాభంపై పన్ను మినహాయింపు ఉంటుంది. రూ.50 లక్షల వరకు ఇలా పెట్టుబడి ప్రత్యేక నిధి ద్వారా పెట్టొచ్చు. నివాసగృహం/ఫ్లాట్ విక్రయించి, ఆ సొమ్మును అంకురసంస్థలో పెట్టుబడిగా పెట్టినా, దీర్ఘకాల మూలధన లాభం పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. కంపెనీలో వ్యక్తిగతంగా/హిందూ అవిభక్త కుటుంబం 50 శాతంపైగా వాటా కలిగిన వారికి ఇది వర్తిస్తుంది.
పేటెంట్లపై..: దేశీయంగా పేటెంట్‌ను అభివృద్ధి చేసి, నమోదు చేసుకుంటే, దీనిద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆర్జించిన ఆదాయంపై 10 శాతం పన్ను మాత్రమే వసూలు చేస్తారు.
మహిళ, ఎస్‌సీ/ఎస్‌టీలకు ప్రత్యేక నిధి
మహిళా, ఎస్‌సీ/ఎస్‌టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సంస్థలు ప్రారంభించేందుకు, సహకరించేందుకు వీలుగా 'స్టాండప్ ఇండియా' పథకం కింద రూ.500 కోట్ల నిధిని ఏర్పాటు చేయనున్నారు.
విమానయాన రంగం
మరింతమందికి విమానయానాన్ని చేరువ చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. దేశంలో 160 చిన్న విమానాశ్రాయలు పునరుద్ధరించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఒక్కో విమానాశ్రయానికి రూ.50-100 కోట్లు కేటాయిస్తారు. గతంలో వినియోగించి కొంతకాలంగా నిరుపయోగంగా ఉన్న వాటిని, ఉపయోగించకుండా ఉన్న విమానాశ్రయాల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తారు. ప్రాంతీయ అనుసంధానత (రీజినల్ కనెక్టివిటీ) కోసం కొన్ని విమానాశ్రయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం, పనిచేయకుండా ఉన్న 25లో పదింటిని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అభివృద్ధి చేస్తుంది.వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రధాన విమానాశ్రయాలు, నౌకాశ్రయాలలో కస్టమ్స్ ఏకగవాక్ష విధానం అమలు చేస్తారు.
విమాన ఇంధనంపై ఎక్సైజ్‌సుంకం పెంపు: ప్రాంతీయ విమానయాన పథకంలోని విమానాశ్రయాలలో నింపే ఇంధనం మినహా, మిగిలిన విమానాలకు వాడే ఇంధనం (ఏటీఎఫ్)పై ఎక్సైజ్ సుంకాన్ని ప్రస్తుత 8 శాతం నుంచి 14 శాతానికి పెంచాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అయితే ప్రాంతీయ విమానయాన విమానాశ్రయాలుగా ఇప్పటివరకు వేటినీ గుర్తించనందున, అన్ని విమానాలలో వాడే ఇంధనంపై భారం పెరుగుతుందనే భావిస్తున్నారు. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో, 40 శాతం ఇంధన ఖర్చే ఉంటుంది. ఫలితంగా విమాన టికెట్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే విలువ జతచేరిన సుంకం (వ్యాట్) కూడా ఏటీఎఫ్‌పై ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. 80 సీట్లలోపు విమానాలనే ప్రాంతీయ సేవలకు వినియోగించేవిగా పరిగణిస్తారనే అభిప్రాయం కూడా ఉంది.
ఎంఆర్ఓ కేంద్ర పరికరాలకు పన్ను ప్రోత్సాహకాలు: దేశీయంగా విమానాల సంఖ్య పెరుగుతున్నందున, వీటికి నిర్వహణ, మరమ్మతు (ఎంఆర్ఓ) కేంద్రాల అవసరం అధికంగా ఉంది. ఈ రూపేణ భారీమొత్తం విదేశీ మారక ద్రవ్యాన్ని విమానయాన సంస్థలు చెల్లిస్తున్నాయి. దేశీయంగా ఎంఆర్ఓ కేంద్రాలకు అవసరమైన యంత్రాలు, పరికరాలకు కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలు తగ్గించాలని ప్రతిపాదించారు.
టెలికాం రంగం
     దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు గత బడ్జెట్‌లో దిగుమతి చేసుకునే సెల్‌ఫోన్లపై కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ (సీఓడీ)ని 6 శాతం నుంచి 12.5 శాతానికి పెంచడం సత్ఫలితాన్ని ఇచ్చింది. గత ఏడాదిలో అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్లు 15 తయారీ-అసెంబ్లింగ్ యూనిట్లను నెలకొల్పేందుకు అనుమతులు పొందాయి. ఇది కొనసాగేలా సెల్‌ఫోన్లపై సుంకాలను ఏమీ మార్చలేదు. సెల్‌ఫోన్లకు తప్పనిసరి అయిన బ్యాటరీలు, చార్జర్లు, స్పీకర్ల వంటివి విదేశాల నుంచే ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. ఇప్పుడు వీటిపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం (బీసీడీ), ప్రత్యేక అదనపు సుంకం (ఎస్ఏడీ), కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ (సీవీడీ) విధిస్తున్నారు.కస్టమ్స్, సీవీడీ చెరి 12.5 శాతం చొప్పున, ఎస్ఏడీ 4 శాతం విధిస్తారు. అంటే 29.44 శాతం పన్ను భారం పడి ఖరీదవుతాయి. ఫలితంగా సెల్‌ఫోన్ల ధరలు కూడా 4-5 శాతం పెరుగుతాయి. వీటినీ దేశీయంగా తయారు చేసుకునేందుకు వీటి విడిభాగాలను దిగుమతి చేసుకుంటే ఈ సుంకాలు వర్తించవు. దేశీయ మొబైల్ తయారీ సంస్థల కోసం వీటిని ఇక్కడ రూపొందించే సంస్థలకు ఎక్సైజ్ డ్యూటీ.. ఇన్వెస్ట్‌మెంట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) లేకుండా 2 శాతం, ఐటీసీ పొందితే 12.5 శాతం విధిస్తారు. విడిభాగాలపై ఎక్సైజ్ కూడా ఉండదు. దిగుమతులతో పోలిస్తే, దేశీయంగా విడిభాగాల ధర 27 శాతానికి పైగా తక్కువగా ఉంటుంది.
పర్సనల్ కంప్యూటర్ల (ల్యాప్‌టాప్/డెస్క్‌టాప్) తయారీ కోసం దిగుమతి చేసుకునే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (పీసీబీ)లపై ఎస్ఏడీని 0 నుంచి 4 శాతానికి, మొబైల్ పీసీబీలపై 0 నుంచి 2 శాతానికి పెంచారు. సెల్‌ఫోన్, టాబ్లెట్ల ధరల్లో పీసీబీ విలువే దాదాపు సగం ఉంటుంది కనుక, 2 శాతం ఎస్ఏడీ భారం వల్ల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశాలున్నాయి. పీసీబీల తయారీ ఏడాదిలోపు సాధ్యం కాదు కనుక వీటిపై పన్ను వద్దని పరిశ్రమ కోరుతోంది. విడిభాగాలను దేశీయంగా తయారు చేసుకునేందుకు సుంకాలు విధించే సమయాన్ని పొడిగించాలి. చార్జర్లు/అడాప్టర్లకు ఈ ఏడాది జూన్ 1, బ్యాటరీలు, స్పీకర్లు/హెడ్‌సెట్‌లకు ఈ ఏడాది సెప్టెంబరు 1 వరకు గడువు పొడిగించాలి.
ఇ-రీడర్లపైనా 7.5 శాతం పడుతుంది.
దేశీయంగా మైక్రోవేవ్ ఓవెన్ల తయారీలో వినియోగించేందుకు దిగుమతి చేసుకునే 1-1.5 కేవీ మాగ్నెట్రన్‌లపై విధిస్తున్న కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి పూర్తిగా రద్దు చేశారు.
ఎల్‌సీడీ ఫ్యాబ్రికేషన్, విద్యుత్తు యంత్రాల పరికరాలపై విధిస్తున్న 4 శాతం బీసీడీ, ఎస్ఏడీని రద్దు చేశారు.
రూటర్లు, బ్రాడ్‌బ్యాండ్ మోడెమ్‌లు, సెట్‌టాప్ బాక్సులు, డిజిటల్ వీడియో రికార్డర్లు, సీసీటీవీ కెమేరాలపై సుంకాలన్నీ రద్దు చేశారు. వీటి ధరలు 8 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (వీఓఐపీ) ఫోన్లపై ఇప్పటివరకు సుంకమే లేదు. ఇకపై 10 శాతం పడుతుంది.
స్థిరాస్తి రంగం
కేంద్ర బడ్జెట్‌లో చౌక ఇళ్ల (అఫర్డబుల్ హౌసింగ్) నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించిన చర్యలపై సానుకూలత వ్యక్తం అవుతోంది. 60 చదరపు మీటర్ల కంటే తక్కువ విస్తీర్ణం కల ఇళ్లకు సేవా పన్నును మినహాయించాలని జైట్లీ ప్రతిపాదించారు. సొంతిల్లు నిర్మించుకోలేని పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు దేశంలో ఎంతో మంది ఉన్నారు. ఈ విభాగంలో ఇళ్ల నిర్మాణం వాణిజ్య ప్రాతిపదికన లాభదాయకం కాదనే భావనతో, ఇటువంటి ఇళ్లు పెద్దఎత్తున చేపట్టే సంస్థలు కూడా తక్కువే. ఈ విభాగంపై సంస్థలు దృష్టి సారించేలా, పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజల ఇంటి కలను నెరవేర్చేదిగా సేవా పన్ను భారాన్ని తగ్గించారు. ఇది చిన్న నిర్ణయమే అయినప్పటికీ గృహ నిర్మాణ పరిశ్రమకు, ఇల్లు కొనుగోలు చేసే వారికి మేలు జరుగుతుందని స్థిరాస్తి వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులకు అండ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు (ఆర్ఈఐటీఎస్), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు (ఐఎన్ఐటీఎస్) విషయంలో ప్రతిపాదించిన సంస్కరణల ఫలితంగా స్థిరాస్తి రంగం ఉత్తేజితం కానుంది. ఈ ట్రస్టులపై డివిడెండ్ పంపిణీ పన్ను (డీడీటీ) పెద్ద సమస్యగా పరిగణిస్తున్నారు. ట్రస్టుల కార్యకలాపాల విస్తరణకు డీడీటీ అవరోధంగా ఉందని సంబంధిత వర్గాల భావన. దీన్ని తొలగించాలని ప్రతిపాదించటంతో అంతర్జాతీయ విధానాలను మనదేశంలోనూ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌ల విషయంలో అనుసరించినట్లు అవుతుందని విశ్లేషిస్తున్నారు. దీనివల్ల నిధుల లభ్యత పెరిగి స్థిరాస్తి అభివృద్ధి కార్యకలాపాలు అధికం అవుతాయని భావిస్తున్నారు.
ఈ విషయాల్లో స్పష్టత ఏదీ?: అయితే కొన్ని కీలక అంశాలపై స్పష్టత నిచ్చే అవకాశాన్ని ఆర్థిక మంత్రి వదులుకున్నారని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్ఈజడ్) లపై మ్యాట్ (కనీస ప్రత్యామ్నాయ పన్ను) తొలగించాలని కోరితే ప్రభుత్వం స్పందించలేదనేది ఒక అభిప్రాయం. సంయుక్త అభివృద్ధి ఒప్పందాలు, డెవలపర్స్ ఒప్పందాలపై సేవా పన్ను తొలగిస్తారని భావించారు. బడ్జెట్ ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటున్న స్థిరాస్తి అభివృద్ధి రంగానికి మేలు చేసేందుకు విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ) తీసుకునే వెసులుబాటు కల్పిస్తారని ఎదురుచూశారు. దీన్ని కూడా ఆర్థిక మంత్రి పరిగణనలోకి తీసుకోలేదు.
మరికొన్ని ప్రతిపాదనలు: ప్రస్తుతం గృహ రుణం తీసుకున్న వారు దానిపై చెల్లించే వార్షిక వడ్డీ మొత్తంలో రూ.2 లక్షల వరకు ఆదాయపు పన్ను నిమిత్తం మినహాయింపు పొందవచ్చు. దీన్ని రూ.2.5 లక్షలకు పెంచుతూ ఆర్థిక మంత్రి నిర్ణయం తీసుకున్నారు. రూ.50 లక్షల లోపు ఖరీదైన ఇళ్లకు, రూ.35 లక్షల లోపు రుణం తీసుకున్న లబ్దిదార్లకు, అది కూడా మొదటిసారిగా కొనుగోలు చేస్తున్న ఇంటి విషయంలో ఈ అదనపు మినహాయింపు వర్తిస్తుంది. సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో నివసిస్తున్న వారికి కూడా తీపి కబురు ఈ బడ్జెట్లో ఉంది. ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పొందుతూ వార్షిక ఆదాయంలో అద్దె తగ్గింపు పరిమితిని ఇప్పుడున్న రూ.24,000 నుంచి రూ.60,000 కు పెంచారు. దీని వల్ల ఒక్కో ఆదాయపు పన్ను చెల్లింపుదారుడు రూ.3,708 నుంచి రూ.12,793 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
తెలంగాణకు నిరాశే
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం వంటి భారీ పథకాలకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులను ఆశించినా కేంద్ర బడ్జెట్‌లో వీటి ప్రస్తావన లేదు. దీంతో వీటికి ప్రత్యేకంగా నిధులు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎంపీలు పలు దఫాలుగా కేంద్రంలోని మంత్రులను కలిసి ప్రత్యేక నిధుల కోసం విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి రెండోవారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రిని కలిసి ప్రత్యేక గ్రాంటు ఇవ్వాలని కోరారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు చేపట్టామని, నీతి అయోగ్ కూడా తెలంగాణకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని సిఫార్సు చేసిందని, నాలుగేళ్లలో రూ.30,571 కోట్లు గ్రాంటు ఇవ్వాలని కోరగా, బడ్జెట్‌లో వీటి ప్రస్తావన లేదు. కేంద్రం సత్వరసాగునీటి ప్రయోజన పథకం లాంటి వాటికి కూడా కేటాయింపులు తగ్గించినందున వీటి నుంచి రాష్ట్రానికి నిధులు వచ్చే అవకాశం లేదు. ప్రాణహిత-చేవెళ్ల పునరాకృతిలో భాగంగా ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టులను చేపట్టామని, రూ.71,436 కోట్లతో చేపట్టిన కాళేశ్వరం నీటిపారుదల పథకానికి జాతీయ హోదా కల్పించి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
2013లో అప్పటి ప్రభుత్వం హైదరాబాద్‌ను ఐటీఐఆర్ పథకానికి ఎంపిక చేసిందని, దీనిని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన నిధులు కేటాయించాలని కోరగా ఏమీఇవ్వలేదు.
తెలంగాణలో నెలకొల్పే గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయంగా గుర్తించి నిధులు విడుదల చేయాలని కోరగా, గిరిజన విశ్వ విద్యాలయానికి రూ.కోటి కేటాయించింది.
రూ.40వేల కోట్లతో మిషన్ భగీరథ చేపట్టామని, రూ.పదివేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని కోరగా దీనిపై ప్రస్తావనలేదు.
రాష్ట్రంలో ఎయిమ్స్ నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాలను కేటాయించింది. కాబట్టి 2016-17లో నిధులు విడుదల చేయాలని కోరగా.. ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. అయితే పి.ఎం.ఎస్.ఎస్.వై కింద చేసిన రూ.2450 కోట్ల కేటాయింపుల్లో కొత్త ఎయిమ్స్ గురించి ప్రస్తావన ఉన్నందున రాష్ట్రానికి ఏమైనా రావచ్చేమోనన్న అభిప్రాయాన్ని ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేశాయి.
టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి సెంటర్‌కు అవసరమైన నిధులు కేటాయించాలని కోరగా.. దీని ప్రస్తావనా బడ్జెట్‌లో లేదు.
రెండు పడక గదుల ఇళ్లకు 2016-17లో సుమారు రూ.14వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఈ పథకానికి కేంద్రం నుంచి భారీగా నిధులు ఆశించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్లు రాగా, కేంద్ర బడ్జెట్‌లో పెరిగిన కేటాయింపులను పరిగణనలోకి తీసుకున్నా మరికొంత మాత్రమే అదనంగా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణానికి అంచనా వేసిన మొత్తంలో దాదాపు రూ.13,700 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ ఐఐటీకి రూ.20 కోట్లు, హైదరాబాద్‌లోని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రానికి రూ.15 కోట్లు కేంద్ర బడ్జెట్‌లో కేటాయించారు. వీటితో పాటు సాలార్‌జంగ్ మ్యూజియానికి రూ.10.90 కోట్లను ప్రణాళికేతర వ్యయం కింద కేటాయించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిగింది కేంద్రం ఇచ్చింది
గిరిజన విశ్వవిద్యాలయానికి జాతీయ హోదా రూ.కోటి రూపాయలు
నైపర్ శాశ్వత ప్రాంగణానికి రూ.35 కోట్లు కేటాయింపు
రూ.200 కోట్ల అంచనా వ్యయం జహీరాబాద్, ముచ్చర్లకు మంజూరైన నిమ్జ్‌లకు భారీగా నిధులు ఎలాంటి నిధులు కేటాయించలేదు.
తెలంగాణలో స్థాపించే పరిశ్రమలకు పన్ను మినహాయింపు కొత్తగా స్థాపించే పరిశ్రమలకు వడ్డీ రాయితీకి అనుమతి, రూ.50 కోట్లు కేటాయింపు అన్నదాతకు ఆదాయ భద్రత