Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Budget - 2019-20

కేంద్ర బడ్జెట్‌ 2019-20

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.27.86 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండో మహిళ నిర్మలా సీతారామన్‌ (59). 1970-71 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా ఇందిరాగాంధీ చరిత్రలో నిలిచిపోయారు. ఆ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్‌ రాజీనామాతో ఇందిర ఆ బాధ్యతను ఏడాది పాటు నిర్వహించారు. తాజాగా నిర్మల రూ.27,86,349 కోట్ల ఆదాయం-వ్యయ అంచనాలతో బడ్జెట్‌ను రూపొందించారు. ఇందులో ద్రవ్య లోటు రూ.7,03,760 కోట్లు. ఇది స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 3.3 శాతం. లోటును పూడ్చడానికి ఈ ఏడాది విదేశీ మార్కెట్‌ నుంచి రూ.4.48 లక్షల కోట్లు రుణాలు సేకరించనున్నారు. గత ఏడాది తీసుకున్న రుణాలు రూ.4.22 లక్షల కోట్లు. ప్రస్తుతం అంత కంటే ఎక్కువే తీసుకోనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న అన్ని రకాల రుణాలను కలిపితే రూ.5.71 లక్షల కోట్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.7.1 లక్షల కోట్ల మేర రుణాలు తీసుకోవాలని ప్రతిపాదించారు. వడ్డీల చెల్లింపులకు ఈ బడ్జెట్‌లో రూ.6,60,471 కోట్లు కేటాయించారు.

* దేశీయంగా, విదేశాల్లో కలిపి భారత ప్రభుత్వ అప్పులు పెరిగాయి. 2019-20 చివరి నాటికి ఈ రూ.98,67,921.44 కోట్లుగా అంచనా వేశారు. 2018-19 చివరికి సవరించిన అంచనాల ప్రకారం అప్పులు రూ.90,56,725.48 కోట్లుగా తేలింది.


ఇవీ ప్రధానాంశాలు..
* ఆదాయపు పన్ను శ్లాబులు యథాతథం
* సంపన్నులపై సర్‌ఛార్జి విధింపు
* ఏడాదికి రూ.కోటి దాటిన నగదు ఉపసంహరణలపై 2% పన్ను
* రూ.400 కోట్ల వరకు టర్నోవర్‌ కలిగిన కంపెనీలకు పన్ను 25 శాతమే
* వడ్డీపై పన్ను మినహాయింపుతో గృహనిర్మాణానికి ఊతం
* ఇక ఆధార్‌తోనూ ఐటీ రిటర్నుల దాఖలు
* ఆహారం, ఇంధనం, ఎరువుల రాయితీకి రూ.3.01 లక్షల కోట్లు
* ఆయుష్మాన్‌ భారత్‌కు రూ.6,400 కోట్లు
* ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల సహాయం
* స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు రూ.29 వేల కోట్లు
* త్వరలో కొత్త అద్దె ఇళ్ల చట్టం
* 2024 నాటికి ఇంటింటికీ నల్లా నీరు
దశ అంశాలతో దార్శనికత
కొత్త దశకానికి నాంది పలుకుదామంటూ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పది అంశాలతో కూడిన ప్రభుత్వ దార్శనికతను వివరించారు. 2014లో ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చినప్పుడు 1.85 కోట్ల డాలర్ల మేర ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ అయిదేళ్లలో 2.7 కోట్ల డాలర్లకు చేరిందని; మరో అయిదేళ్లలో 5 కోట్ల డాలర్లకు చేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

రైల్వే రంగం

రైల్వేలో మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు అవసరమైన నేపథ్యంలో ప్రభుత్వ-ప్రైవేటు-భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిని పెద్దఎత్తున వినియోగించుకోనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పన్నెండేళ్ల కాలంలో రూ.50 లక్షల కోట్లు కావాల్సి వస్తుందని అంచనా వేశారు. కేంద్ర బడ్జెట్లో భాగంగా రైల్వే సంబంధిత ప్రతిపాదనలను ఆమె పార్లమెంట్‌ ముందుంచారు. కేంద్రం తరఫున బడ్జెట్‌ సాయం కింద రైల్వేకు రూ.65,837 కోట్లు ఇస్తామని, మునుపెన్నడూ లేనంతగా మూలధన వ్యయం రూ.1.60 లక్షల కోట్లుగా ఉంటుందని చెప్పారు. గత ఏడాది బడ్జెట్‌ మద్దతు కింద రూ.55,088 కోట్లు, మూలధన వ్యయంగా రూ.1.48 లక్షల కోట్లు చూపించారు. ప్రయాణికుల సదుపాయాలకు కేటాయింపులు గత ఏడాది కంటే 200% పెంచి, రూ.3422 కోట్లు ఇచ్చారు. ప్రత్యేక ప్రయోజక వాహక సంస్థ (ఎస్పీవీ)ల ద్వారా సబర్బన్‌ రైల్వేల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తామని, పీపీపీ విధానంలో మెట్రో రైలు వ్యవస్థను పెంచుకుంటూ వెళ్తామని చెప్పారు.
* రైల్వేలోని 13 లక్షలమంది ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇస్తారు. ప్రయాణికులతో ఎలా మెలగాలి, ఖర్చులెలా తగ్గించుకోవాలి, పని సంస్కృతి మెరుగు అనే మూడు అంశాల్లో శిక్షణ ఉంటుంది. దీనిలో రాణించినవారికి తదుపరి దశ శిక్షణకు పంపిస్తారు.
* భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత సురక్షితమైన సంవత్సరంగా 2018-19 నిలిచిపోనుంది. కాపలాదారుల్లేని లెవెల్‌ క్రాసింగుల తొలగింపు, బ్రాడ్‌గేజ్‌ మార్పిడి పనులను ఆ ఏడాదిలో లక్ష్యం మేరకు పూర్తిచేశారు.
* స్వర్ణ చతుర్భుజి మార్గంలోని 2,568 రైల్వే క్రాసింగ్‌లపై వంతెనలు నిర్మించి వాహనాల రాకపోకలకు అడ్డంకులు లేకుండా చేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో 50-60% రైళ్ల రాకపోకలు ఈ మార్గంలోనే జరుగుతాయి. కాబట్టి వాటికి ఇబ్బందులు తొలగించడం వల్ల మొత్తంమీద రవాణా వేగవంతమవుతుంది.


* 2021-22 నాటికి మొత్తం బ్రాడ్‌గేజ్‌ వ్యవస్థ విద్యుదీకరణను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఈ ఒక్క సంవత్సరమే 7వేల కిలోమీటర్లు పూర్తిచేస్తారు.
* 2019-20లో కొత్తలైన్లు, గేజ్‌ మార్పిడి, అదనపు మార్గాలకు కలిపి 3,750 కిలోమీటర్ల లక్ష్యాన్ని పెట్టుకున్నారు.
* దిల్లీ-మేరఠ్‌ మధ్య నిర్మించిన ‘శీఘ్ర ప్రాంతీయ రవాణా వ్యవస్థ’ తరహాలో సబర్బన్‌ రైళ్లలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఎస్పీవీలను ఏర్పాటు చేయనున్నారు.
* నిర్భయ నిధి రూపంలో రూ.267.64 కోట్లు, అంతర్గత వనరుల ద్వారా రూ.10,500 కోట్లు సమకూర్చుకుంటారు.
* ప్రయాణికుల భద్రత కోసం అన్ని స్టేషన్లు, రైళ్లలో సీసీటీవీ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
* ఇప్పటివరకూ 455 స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 2020-21కల్లా మిగిలిన అన్ని స్టేషన్లలో ఏర్పాటు చేస్తారు.
* 1,203 కోచ్‌లలో ఉన్న సీసీ టీవీలను 2021-22 నాటికి అన్ని కోచ్‌లకూ అందుబాటులోకి తెస్తారు.
* ప్రయాణికులకు ఆహ్లాద వాతావరణాన్ని కల్పించడానికి రూ.3422.57 కోట్లతో పెద్దఎత్తున రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ చేపడతారు.
* 2023 నాటికి ముంబయి-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైళ్ల ప్రాజెక్టును పూర్తిచేయనున్నారు.
* దేశీయంగా తయారైన సెమీ హైస్పీడ్‌ ట్రైన్‌-18 (వందే భారత్‌) రైళ్లను ప్రవేశపెడతారు.
* ఇప్పటివరకు 1,603 రైల్వేస్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించారు. ఆగస్టు 31 నాటికి హాల్ట్‌ స్టేషన్లలో మినహాయించి మిగతా 4,882 స్టేషన్లలో ఈ సదుపాయం కల్పిస్తారు.
* 2019-20 ఆదాయం రూ.2.16 లక్షల కోట్లు, వ్యయం రూ.2.07 లక్షల కోట్లు.
* కొత్తలైన్లు, గేజ్‌ మార్పిడి, జంట మార్గాల నిర్మాణం (డబ్లింగ్‌), విద్యుదీకరణ లాంటి పనులు: 10వేల కి.మీ.
* 23,000 రైలు పెట్టెలు/ సరకు రవాణా వ్యాగన్ల (రోలింగ్‌ స్టాక్‌) కొనుగోలు.
* డీజిల్‌ ఇంజిన్లు కొనుగోలు చేయరు.
* సరకు రవాణా: 127.4 కోట్ల టన్నులు.
* ప్రయాణికుల సంఖ్య: 859.3 కోట్లు
* మూలధన వ్యయం: 1,60,175.64 కోట్లు
* బడ్జెటేతర మార్గంలో నిధుల సమీకరణ: ‘భారతీయ రైల్వే ఆర్థిక సంస్థ’ నుంచి రూ.29,031 కోట్లు, పీపీపీ ద్వారా రూ.28,100 కోట్లు

విద్యా రంగం

అంతర్జాతీయ స్థాయిని అందుకోవడానికి ప్రముఖ విద్యాసంస్థలకు రూ. 400 కోట్లు కేటాయించారు. ఇది గత సంవత్సరం సవరించిన అంచనాల కంటే మూడు రెట్లు ఎక్కువ. ‘భారతదేశంలో చదవండి’ అనే కార్యక్రమం కింద విదేశీ విద్యార్థులు భారతీయ ఉన్నత విద్యాసంస్థల్లో చేరేలా దృష్టి సారించనున్నారు. దేశంలో ఉన్నత విద్యా రంగంలో సమగ్ర సంస్కరణలు తెచ్చేందుకు భారతీయ ఉన్నతవిద్యా కమిషన్‌ని ఏర్పాటుచేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు కృత్రిమ మేధ, ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), బిగ్‌ డేటా, 3-డి ముద్రణ, వర్చువల్‌ రియాలిటీ, రోబోటిక్స్‌ లాంటి కొత్తతరం నైపుణ్యాలను అందించడానికి కేంద్రం కృషి చేయనుంది. ‘పనే పరమార్థం’ అనే సూత్రానికి అనుగుణంగా కోటిమంది యువతకు పరిశ్రమకు కావల్సిన నైపుణ్యాలను ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన ద్వారా అందించాలని నిర్ణయించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావిధానంగా భారతీయ ఉన్నతవిద్యను మార్చేందుకు సరికొత్త జాతీయ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీని ప్రకారం పాఠశాల, ఉన్నత విద్యలో భారీ మార్పులుంటాయి.

స్త్రీ, శిశు సంక్షేమం

కేంద్రం మహిళల సర్వతోముఖాభివృద్ధికి తాజా బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం కల్పించింది. అతివల సంక్షేమం, అభివృద్ధి, భద్రత కోసం గతేడాది కంటే 17% అధికంగా స్త్రీ, శిశు అభివృద్ధిశాఖకు రూ.29,000 కోట్లు కేటాయించింది. స్త్రీ, పురుషుల వారీగా బడ్జెట్‌ కేటాయింపులు ఎలా ఉంటున్నాయో విశ్లేషించి, దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించేలా సూచనలు ఇవ్వడానికి విస్తృత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పది కోట్ల మంది శిశువులు, మహిళలకు పోషకాహారం అందించేలా జాతీయ పోషకాహార సంస్థకు ఈ బడ్జెట్‌లో రూ.3,400 కోట్లు ప్రకటించారు. గర్భిణులు, శిశువులు, బాలింతల సంక్షేమానికి రూ.6000 కోట్లు; అంగన్‌వాడీ సేవలకు రూ.19,834 కోట్లు; బేటీ బచావో, బేటీ పడావోకు రూ.280 కోట్లు కేటాయించారు. ముద్ర, స్టాండప్‌ ఇండియా, స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ) ద్వారా మహిళలకు మరింత తోడ్పాటు ఇస్తామని కేంద్రం పేర్కొంది. ఎస్‌జీహెచ్‌ సభ్యులు తమ జన్‌ధన్‌ ఖాతాల నుంచి రూ.5 వేల వరకూ ఓవర్‌డ్రాఫ్ట్‌ తీసుకునే సదుపాయం కల్పించింది. బృందంలోని ఒక సభ్యురాలికి రూ.లక్ష వరకు ముద్రా రుణం ఇవ్వాలని ప్రతిపాదించింది.

హోంశాఖ

తాజా బడ్జెట్‌లో కేంద్ర హోంశాఖకు కేటాయింపులు పెరిగాయి. గత బడ్జెట్‌తో పోలిస్తే 5.17 శాతం నిధులు పెంచి, రూ.1,19,025 కోట్లు కేటాయించారు. పోలీసు బలగాల ఆధునికీకరణ, పోలీసు శాఖలో, సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా కేటాయింపులు పెంచారు. సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, అసోం రైఫిల్స్, నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ తదితర కేంద్ర బలగాలన్నింటికీ కలిపి రూ.71,713.9 కోట్లు కేటాయించారు. ఇందులో అత్యధికంగా సీఆర్‌పీఎఫ్‌కు రూ.23,963.66 కోట్లు, బీఎస్‌ఎఫ్‌కు రూ.19,650 కోట్లు ఇచ్చారు.
* కేంద్ర దర్యాప్తు సంస్థకి (సీబీఐ) రూ.781.01 కోట్లు కేటాయించారు. ఇది గతేడాది కంటే రూ.2.08 కోట్లు ఎక్కువ. సంస్థ శిక్షణ కేంద్రాల ఆధునికీకరణ, ఈ గవర్నెన్స్, సాంకేతిక, ఫోరెన్సిక్‌ సంస్థల స్థాపన తదితరాలకు ఈ నిధులు వెచ్చించనున్నారు.
* ప్రభుత్వ సంస్థల్లో అవినీతిని నిరోధించడానికి ఏర్పడిన లోక్‌పాల్‌కు రూ.101.29 కోట్లను కేటాయించారు. ఖర్చులపై నిఘా ఉంచే సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌కి (సీవీసీ) రూ.35.55 కోట్లు ఇచ్చారు. గతేడాది కేటాయింపులు రూ.34 కోట్లు.

క్రీడా రంగం

క్రీడలకు మధ్యంతర బడ్జెట్‌లో చేసిన కేటాయింపులను ఏమాత్రం మార్చలేదు. ‘ఖేలో ఇండియా’ కార్యక్రమంలో అవకాశాలను మరింత పెంచేలా జాతీయ క్రీడావిద్యా బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖకు అంతకుముందు సంవత్సరం కంటే రూ.214.2 కోట్లు అధికంగా రూ.2216.92 కోట్లు కేటాయించారు. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు రూ.55 కోట్లు పెంచి రూ.450 కోట్లు ఇచ్చారు. ఖేలో ఇండియా కార్యక్రమానికి మధ్యంతర బడ్జెట్‌లో రూ.50.31 కోట్లు పెంచి రూ.601 కోట్లు ఇచ్చారు. జాతీయ క్రీడా సమాఖ్యలకు మాత్రం 13 లక్షలు తగ్గించి రూ.245 కోట్లను కేటాయించారు. క్రీడాకారుల ప్రోత్సాహానికి, అవార్డులకు ఇచ్చే మొత్తాన్ని రూ.94.07 కోట్లు పెంచారు.

విద్యుత్‌ రంగం

ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ఎన్‌టీపీసీ, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ సహా ప్రభుత్వ రంగంలోని ఏడు విద్యుత్‌ కంపెనీలకు పెట్టుబడులను 23 శాతం మేర తగ్గించింది. అత్యధికంగా పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌కు 47.34 శాతం మేర కోత విధించారు. గత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాలు రూ.56,742.49కోట్లు. ‘ఒకే దేశం, ఒకే గ్రిడ్‌’ లక్ష్యాన్ని సాధించేందుకు విద్యుత్‌ రంగానికి ప్రభుత్వం త్వరలో ఒక ప్యాకేజీని ప్రకటించనుంది. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ల పూర్తవుతున్న నేపథ్యంలో ఉజ్వల, సౌభాగ్య పథకాల కింద 2022 నాటికి గ్రామాల్లో కోరుకున్న ప్రతి ఇంటికీ వంటగ్యాస్, విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తామని నిర్మల పేర్కొన్నారు. క్రాస్‌ సబ్సిడీ ఛార్జీలు, ఓపెన్‌ యాక్సెస్‌ విక్రయాలు లేదా పరిశ్రమల్లో క్యాప్టివ్‌ విద్యుదుత్పత్తి, భారీ విద్యుత్‌ వినియోగదారులపై అవాంఛనీయ సుంకాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేయనున్నట్లు కేంద్రం వివరించింది. పాత, సమర్థత లేని విద్యుత్‌ కర్మాగారాలను ఉపసంహరించడం, సహజవాయువు లభ్యత తక్కువగా ఉన్నందువల్ల గ్యాస్‌ ఆధారిత కర్మాగారాలను చాలా తక్కువ స్థాయిలో పనిచేయించడం లాంటి అంశాలపై అత్యున్నత స్థాయి కమిటీ చేసిన సిఫారసుల త్వరలోనే అమలు చేయనున్నట్లు పేర్కొంది.
* ఉజ్వల యోజన కింద దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటి వరకు 7 కోట్లకుపైగా వంట గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చింది. సౌభాగ్య పథకం కింద 2.63 కోట్ల కుటుంబాలకు విద్యుత్‌ కనెక్షన్‌ లభించింది. ఛత్తీస్‌గఢ్‌ మినహా మిగతా రాష్ట్రాల్లో 100 శాతం విద్యుదీకరణ సాధ్యమైంది. ఉజ్వల యోజన కింద 35 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేసినట్లు నిర్మల తెలిపారు. దీనివల్ల ఏటా రూ.18,341 కోట్లు ఆదా అవుతున్నట్లు పేర్కొన్నారు.

ఆదాయపు పన్ను

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన తొలి బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపులకు సంబంధించి గతంలో ఉన్న శ్లాబులనే కొనసాగించారు. సంపన్నులపై సర్‌ఛార్జీ పెంచారు. అందుబాటు ధరలో ఇల్లు కొన్నవారికి అదనంగా రూ.1,50,000 మినహాయింపు కల్పించారు. మధ్యంతర బడ్జెట్‌లో చెప్పినట్లుగా పన్ను వర్తించే ఆదాయం రూ.5,00,000 లోపు ఉన్నప్పుడు గరిష్ఠంగా రూ.12,500 వరకు పన్ను రిబేటు లభించడం ద్వారా ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఈ పద్ధతినే కొనసాగించనున్నారు. వార్షిక పన్ను వర్తించే ఆదాయం రూ.5,00,000 గణించేటప్పుడు ప్రామాణిక తగ్గింపు రూ.50,000, సెక్షన్‌ 80సీ కింద రూ.1,50,000, గృహరుణ వడ్డీలాంటి ఇతర మినహాయింపులను తీసేస్తారు. పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షలు దాటితే, వర్తించే శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.


* స్థిరాస్తి రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఒక ప్రత్యేక మినహాయింపు సెక్షన్‌ను తీసుకొచ్చారు. రూ.45 లక్షలలోపు ఇంటిని కొనుగోలు చేసిన వారికి సెక్షన్‌ 80ఈఈఏ కింద గృహరుణం వడ్డీపై అదనంగా రూ.1,50,000 పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇప్పటి వరకు గృహరుణాలపై వడ్డీ మినహాయింపు పరిమితి రూ.2 లక్షలుగా ఉంది. తాజా మినహాయింపుతో ఆ పరిమితి రూ. 3.5 లక్షలకు పెరుగుతుంది. ఏప్రిల్‌ 1, 2019 - మార్చి 31, 2020 మధ్య తీసుకున్న గృహరుణాలకే ఇది వర్తిస్తుంది. ఇంటి రుణం పొందేనాటికి మరో సొంతిల్లు ఉంటే ఈ మినహాయింపు పొందలేరు.
* ప్రస్తుతం అమల్లో ఉన్న సెక్షన్‌ 111ఏ ప్రకారం, షేర్లలో మదుపు చేసి వాటిని స్వల్పకాలంలో విక్రయించినప్పుడు 15 శాతం పన్ను చెల్లించాలి. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్లకూ ఈ వెసులుబాటు వర్తించేలా తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇప్పటివరకు స్వల్పకాలంలో విక్రయించిన ఈక్విటీ ఫండ్లపై వచ్చిన రాబడిని మొత్తం ఆదాయంలో కలిపి చూపించాల్సి వచ్చేది.
* ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఆస్తి విలువ రూ.50 లక్షలు దాటినప్పుడు కొనుగోలు మొత్తంపై 1% మూలం వద్ద పన్ను విధించాలి. ఈ విలువను గణించేటప్పుడు క్లబ్‌ మెంబర్‌షిప్‌ ఫీజు, కారు పార్కింగ్, విద్యుత్, నీటి వసతి తదితర సౌకర్యాలకు చెల్లించే మొత్తాలన్నింటినీ కలిపి చూపించాల్సి ఉంటుంది.

ఇంధన రంగం

* ఇంధన ధరలు సామాన్యులకు మరింత భారమయ్యాయి. ప్రస్తుత బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని లీటరుకు రూ.1 చొప్పున పెంచారు. వాటిపై రోడ్డు-మౌలిక వసతుల సెస్సు కూడా లీటరుకు రూ.1 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.28 వేల కోట్లకుపైగా నిధులు లభిస్తాయి. మూల ధరకు ఎక్సైజ్‌ సుంకం కలిపిన తర్వాత స్థానిక అమ్మకపు పన్ను లేదా వ్యాట్‌ను విధిస్తారు. వాటి పెరుగుదలను కూడా పరిగణనలోకి తీసుకుంటే పెట్రోల్‌ ధర లీటరుకు రూ.2.5కి పైగా, డీజిల్‌ ధర లీటరుకు రూ.2.3కి పైగా పెరుగుతుంది.
* ముడి చమురుపై టన్నుకు రూపాయి చొప్పున కస్టమ్స్‌ లేదా దిగుమతి సుంకాన్ని విధించనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. మనదేశం ఏటా సగటున 22 కోట్ల టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ లెక్కన ఖజానాకు రూ.22 కోట్లు అదనంగా అందనున్నాయి. ప్రస్తుతం ముడి చమురుపై కస్టమ్స్‌ సుంకమేదీ లేదు.

వ్యవసాయ రంగం

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న నరేంద్ర మోదీ తొలి ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాన్ని సాధించే దిశగా నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు జరిపారు. వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖకు 2019-20 బడ్జెట్‌లో రూ.1.39లక్షల కోట్లు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం కిసాన్‌ సమ్మాన్‌ నిధికి రూ.75 వేల కోట్లను కేటాయించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.


* వచ్చే అయిదేళ్లలో దేశంలో కొత్తగా 10 వేల రైతు ఉత్పాదక సంఘాల (ఎఫ్‌పీఓ) ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
* ఇ-నామ్‌ల ద్వారా రైతులకు మరిన్ని ప్రయోజనాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేయాలని నిర్ణయించింది.
* రైతులపై రుణ భారాన్ని తగ్గించేలా, పంటల సాగు ఖర్చును తగ్గించేలా ప్రకృతి వ్యవసాయానికి (జీరో బడ్జెట్‌ ఫార్మింగ్‌కు) కార్యాచరణ.
* వ్యవసాయ వ్యాపార సామర్థ్యాలు పొందేలా 75 వేల మందికి తర్ఫీదు ఇస్తారు.


* గ్రామాల్లోని సంప్రదాయ పరిశ్రమలను పునరుజ్జీవింపజేసి, ఉన్నతీకరించేందుకు నిధులు అందిస్తారు. తద్వారా వాటిని ఉత్పాదక కేంద్రాలుగా తీర్చిదిద్ది, ఉపాధి కల్పన కేంద్రాలుగా మలుస్తారు. ఈ తరహా పరిశ్రమలతో కూడిన 100 క్లస్టర్స్‌ ఏర్పాటు చేస్తారు. తేనె, వెదురు, ఖాదీ తదితర ఉత్పత్తులపై దృష్టి సారిస్తారు.
* ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి వచ్చేలా 50వేల మంది చేతి వృత్తిదారులకు తర్ఫీదు ఇస్తారు.

మత్స్యశాఖ

మత్స్య పరిశ్రమ ఆధునికీకరణ, సముద్రంలో చేపల అన్వేషణ, ఉత్పత్తి, వేట తర్వాత నిల్వ పద్ధతులు, నాణ్యత పరిరక్షణ, చేపల ఉత్పత్తులకు అదనపు విలువల జోడింపు తదితరాల కోసం నూతన పథకాన్ని ప్రకటించారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) అమలుకు ఈ బడ్జెట్‌లో రూ.3,737 కోట్లు కేటాయించారు.

ఆరోగ్య రంగం

2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య రంగానికి రూ.62,659.12 కోట్లు కేటాయించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఇది అత్యధికం. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.52,800 కోట్లు కేటాయిస్తే ఈసారి 19 శాతం పెంచారు. వీటిలో ఆయుష్మాన్‌భారత్‌కు రూ. 6,400 కోట్లు, పట్టణ ఆరోగ్య మిషన్‌ ఆరోగ్య, వెల్‌నెస్‌ కేంద్రాలకు రూ.249.96 కోట్లు, గ్రామీణ ఆరోగ్య మిషన్‌ ఆరోగ్య, వెల్‌నెస్‌ కేంద్రాలకు రూ.1,349.97 కోట్లు, జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ. 32,995 కోట్లు, జాతీయ ఎయిడ్స్, ఎస్టీడీ నియంత్రణ కార్యక్రమానికి రూ.2,500 కోట్లు, ఎయిమ్స్‌కు రూ.3,599.65 కోట్లు కేటాయించారు.

గిరిజన సంక్షేమం

గిరిజన సంక్షేమానికి కేంద్రం పెద్దపీట వేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గిరిజన వ్యవహారాల శాఖకు 2018-19 బడ్జెట్‌ (రూ.6000 కోట్లు) కంటే 15 శాతం అధికంగా రూ.6,814.96 కోట్లు కేటాయించింది. గిరిజన విద్యకు రూ.1953.50 కోట్లు ప్రకటించారు. 275(1) అధికరణం కింద 46 శాతం అధికôగా రూ.2,662.55 కోట్లను గ్రాంట్లుగా కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.5,659.24 కోట్లు, వనబంధు కల్యాణ్‌ యోజనకు రూ.406.52 కోట్లు, ఉన్నత విద్య చదివే ఎస్టీ విద్యార్థుల ఉపకారవేతనాలకు రూ.102 కోట్లు, గిరిజన సంస్థలకు రూ.83 కోట్లు ప్రకటించింది.

పర్యటక రంగం

దేశంలో పర్యటక రంగాన్ని బలోపేతం చేసేందుకు 17 ప్రముఖ పర్యటక కేంద్రాలను ప్రపంచస్థాయి పర్యటక ఆకర్షణలుగా తీర్చిదిద్దనున్నట్లు కేంద్రం ప్రకటించింది. గత బడ్జెట్‌లో ఈ శాఖకు రూ. 2,150 కోట్లు కేటాయించగా ఈసారి రూ.2,189.22 కోట్లకు (1.82%) పెంచారు. సాంస్కృతిక శాఖకు గతేడాది రూ.2,843.32 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్‌లో రూ.3,042.35 కోట్లకు (7%) పెరిగింది. పర్యటక శాఖకు కేటాయించిన నిధుల్లో రూ.1,378.53 కోట్లు మౌలిక వసతుల కల్పనకు, రూ.575.50 కోట్లు ప్రచార కార్యకలాపాలకు నిర్దేశించారు.

గ్రామీణాభివృద్ధి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన తొలి బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి భారీగా నిధులు ప్రతిపాదించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1.17లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. గత బడ్జెట్‌ కంటే ఇది 4.4 శాతం అధికం. 2018-19లో ఈ శాఖకు కేటాయించింది రూ.1.12 లక్షల కోట్లు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన, జాతీయ జీవనోపాధి కార్యక్రమానికి కూడా నిధులు పెరిగాయి. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఈసారి రూ.1084 కోట్ల మేర, ప్రధానమంత్రి ఆవాస యోజనకు (గ్రామీణ) రూ.900 కోట్ల మేర కోత విధించారు. రెండో దశలో భాగంగా రానున్న రెండేళ్లలో 1.95 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ గత బడ్జెట్‌ కంటే తక్కువ నిధులు కేటాయించారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా సంప్రదాయ పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం కల్పించనున్నారు. దీనికోసం కొత్తగా ‘స్ఫూర్తి’ (స్కీం ఆఫ్‌ ఫండ్‌ ఫర్‌ అప్‌గ్రేడేషన్‌ అండ్‌ రిజెనరేషన్‌ ఆఫ్‌ ట్రెడిషనల్‌ ఇండస్ట్రీస్‌ - ఎస్‌ఎఫ్‌యూఆర్‌టీఐ) అనే పథకాన్ని రూపొందించారు.

పరిశోధనా రంగం

దేశంలో పరిశోధనలకు నిధులిచ్చి, సమన్వయం చేసి, ప్రోత్సహించేందుకు జాతీయ పరిశోధన ఫౌండేషన్‌ను (ఎన్‌ఆర్‌ఎఫ్‌) ఏర్పాటుచేయనున్నారు. వివిధ మంత్రిత్వశాఖలు పరిశోధన కోసం ఇచ్చే నిధులన్నింటినీ ఎన్‌ఆర్‌ఎఫ్‌ కలుపుతుంది.

రాయితీలు

ఎరువులు, ఇంధనం, ఆహారంపై రాయితీ ఇచ్చేందుకు 2019-20 బడ్జెట్‌లో రూ.3,01,694 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈ ఏడాది 13.32 శాతం మేర కేటాయింపులు పెరిగాయి. కేంద్రం ఇస్తున్న రాయితీల్లో ఇంధన రాయితీకే సింహభాగం నిధులు వినియోగిస్తున్నారు.

ఈవీఎంలు

ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల కోసం 2018-19లో ఈవీఎంలను సమకూర్చుకునేందుకు కేంద్రం దాదాపు రూ.4 వేల కోట్లు ఖర్చు చేసినట్లు బడ్జెట్‌ పత్రాన్ని బట్టి తెలుస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సాధారణ ఎన్నికల వ్యయంలో తిరిగి చెల్లింపులకు సంబంధించిన కేంద్రవాటా కింద రూ.339.54 కోట్లను కేటాయించారు. కాలం చెల్లిన ఈవీఎంలను నిర్వీర్యం చేసేందుకు ఈ నిధులు వినియోగిస్తారు.

సిబ్బంది మంత్రిత్వ శాఖ

బ్యూరోక్రాట్ల శిక్షణ కోసం కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖకు రూ.235 కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది కేటాయింపు కంటే 24 శాతం ఎక్కువ. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునళ్ల కోసం రూ.126.52 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నియామక పరీక్షలు నిర్వహించే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌కు రూ.240.22 కోట్లు కేటాయించారు.

ఆధార్‌తో ఐటీ

ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్నులు దాఖలు చేసేందుకు శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) అవసరం అనే నిబంధనను తాజా బడ్జెట్‌లో తొలగించారు. ఆధార్‌ సంఖ్య ఆధారంగానూ ఇకపై రిటర్నులు దాఖలు చేయొచ్చు. పాన్‌ పేర్కొనాల్సిన ప్రతి సందర్భంలోనూ ప్రత్యామ్నాయంగా ఆధార్‌ను వినియోగించవచ్చు. ఐటీ రిటర్నుల దాఖలును మరింత సరళీకృతం చేసేలా పలు మార్పులు రాబోతున్నాయి. ఇందులో భాగంగా ముందే పూరించిన రిటర్నుల పత్రాలు పన్ను చెల్లింపుదారులకు అందుబాటులోకి రానున్నాయి. వేతనం, సెక్యూరిటీల ద్వారా వచ్చిన మూలధన లాభం, బ్యాంకుల నుంచి వచ్చిన వడ్డీ, డివిడెండ్లు ఇలా అన్ని ఆదాయాల వివరాలు అందులో ఉంటాయి. మన దేశ పాస్‌పోర్టు ఉన్న ప్రవాస భారతీయులకు ఆధార్‌ కార్డు ఇవ్వడానికి నిర్దేశిత గడువు నిబంధనను తొలగించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం వారు ఆధార్‌కార్డు పొందడానికి 180 రోజులు నిరీక్షించాలి.

కొత్త నాణేలు

ప్రధాని నరేంద్ర మోదీ జులై 7న ఒకటి, రెండు, ఐదు, పది, ఇరవై రూపాయిల విలువైన నాణేలను విడుదల చేస్తారని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇవి చూపులేని వారు కూడా సులభంగా గుర్తించేలా ఉంటాయి.

స్వచ్ఛభారత్‌ అభియాన్‌

2014లో ప్రవేశపెట్టిన ఈ పథకం ప్రారంభమైన తర్వాత దేశంలో 9.6 కోట్ల మరుగుదొడ్లు నిర్మితమయ్యాయి. 5.6 లక్షల గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా రూపుదిద్దుకున్నాయి. స్వచ్ఛ ఉద్యమం ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడంతో పాటు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో వ్యర్థాల నుంచి శక్తి ఉత్పాదన జరుగుతోంది. స్వచ్ఛభారత్‌ ఉద్యమం మరింతగా విస్తరించడం ద్వారా గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ మరింత మెరుగుపడుతుందని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

గాంధీపీడియా

దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహాత్మా గాంధీ సిద్ధాంతాలు, బోధనలు, ఆయన నేర్పిన విలువలను యువతరానికి తెలియజెప్పేందుకు వీలుగా ‘గాంధీపీడియా’ను రూపొందించనున్నారు. సైన్స్‌ మ్యూజియంల జాతీయ మండలి దీన్ని అభివృద్ధి చేయనుంది. 2019 అక్టోబరు 2 నాటికి బాపూజీ కలలుగన్న స్వచ్ఛభారతాన్ని సాధించాలని ప్రధాని సంకల్పించారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధిస్తున్న సందర్భంగా రాజ్‌ఘాట్‌లోని గాంధీదర్శన్‌ వద్ద అక్టోబరు 2న రాష్టీయ్ర స్వచ్ఛత కేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

మౌలిక వసతులు

వచ్చే అయిదేళ్లలో మౌలిక వసతుల కోసం రూ.100 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంది. ఈ రంగంలో ఆర్థిక అవసరాలు ఏటా రూ.20 లక్షల కోట్ల మేర ఉండొచ్చని అంచనా. మౌలిక వసతుల కోసం పెట్టుబడులను అందించే వనరులను పెంచనున్నట్లు నిర్మల వెల్లడించారు. ‘క్రెడిట్‌ గ్యారంటీ ఎన్‌హెన్స్‌మెంట్‌ కార్పొరేషన్‌’ ఏర్పాటు కూడా ఇందులో ఉంది. నిధుల సమీకరణ అంశాన్ని అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.

గ్రామీణ రహదారులు

గ్రామాల్లో అర్హత ఉన్న ఆవాసాలకు సార్వత్రిక సంధానతను సాధించే కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు లక్ష్యాన్ని 2022 నుంచి 2019కి ప్రభుత్వం కుదించింది. ఇలాంటి 97 శాతం ఆవాసాలకు అన్నికాలాల్లోనూ రవాణా యోగ్యత కల్పించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత వెయ్యి రోజుల్లో రోడ్డు నిర్మాణ వేగాన్ని రోజుకు 130 నుంచి 135 కిలోమీటర్లకు పెంచింది. ఆర్థిక వ్యవస్థలో మార్పుల దృష్ట్యా గ్రామాల్లోని రోడ్లను గ్రామీణ మార్కెట్లను సంధానించడం ముఖ్యమని స్పష్టం చేసిన ప్రభుత్వం ఇందుకోసం పీఎంజీఎస్‌వై-3 కింద రూ.80,250 కోట్లతో 1.25 లక్షల కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లను బలోపేతం చేయనుంది.

గ్రామాల్లో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌

సార్వత్రిక సేవా నిధి తోడ్పాటుతో భారత్‌నెట్‌ ప్రాజెక్టు కింద గ్రామీణ భారత్‌లో ఇంటర్నెట్‌ సంధానత వేగాన్ని పెంచడానికి కేంద్రం చర్యలు చేపట్టనుంది. గ్రామీణ-పట్టణ డిజిటల్‌ అంతరాలను తొలగించేందుకు దేశంలోని అన్ని గ్రామ పంచాయతీల్లోని స్థానిక సంస్థల్లో ఇంటర్నెట్‌ సంధానతను కల్పించాలని, 2020 మార్చి నాటికి 2.5 లక్షల గ్రామ పంచాయతీలను హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌తో సంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్‌ సాక్షరతా అభియాన్‌ కింద 2 కోట్ల మందికిపైగా గ్రామీణ భారతీయులకు డిజిటల్‌ అక్షరాస్యత కల్పించినట్లు ఆర్థిక మంత్రి వివరించారు.

కార్డుతో చెల్లింపులు

నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డ్‌ (ఎన్‌సీఎంసీ) ప్రమాణాల ఆధారంగా మొట్టమొదటిసారిగా దేశీయంగా చెల్లింపుల వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీన్ని ఈ ఏడాది మార్చిలో ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ కార్డు వల్ల దేశవ్యాప్తంగా మెట్రో సర్వీసులు, టోల్‌ ట్యాక్స్‌ లాంటి అన్ని రకాల రవాణా రుసుములను చెల్లించవచ్చు. జాతీయ హైవే కార్యక్రమాన్ని పునర్‌వ్యవస్థీకరించి, అవసరమైన స్థాయిలో జాతీయ హైవే గ్రిడ్‌ను సిద్ధం చేసే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

అంతర్గత జలరవాణా

జాతీయ జలమార్గాల్లో నౌకాయానాన్ని పెంచడానికి జల మార్గ్‌ వికాస్‌ ప్రాజెక్టు చేపట్టినట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. రోడ్డు, రైలు నుంచి గణనీయ స్థాయిలో సరకు రవాణాను అంతర్గత జలమార్గాలకు మళ్లించాలని ఆర్థిక మంత్రి కోరారు. జలమార్గ్‌ వికాస్‌ ప్రాజెక్టులో భాగంగా గంగా నదిలో నౌకాయానాన్ని పెంపొందించేందుకు వారణాసిలో మల్టీమోడల్‌ టెర్మినల్‌ 2018 నవంబరులో వినియోగంలోకి వచ్చింది. 2019-20లో సాహిబ్‌గంజ్, హల్దియాల్లో మరో రెండు టెర్మినళ్లు పూర్తవుతాయని ప్రభుత్వం తెలిపింది. గంగానదిపై సరకు రవాణా వచ్చే నాలుగేళ్లలో నాలుగు రెట్లు పెరుగుతుందని అంచనా వేసింది. తాజా బడ్జెట్‌లో ఈ రంగానికి రూ.1902.56 కోట్లను కేటాయించింది. 2018-19లో రూ.1881.13 కోట్లు కేటాయించగా, సవరించిన అంచనాల్లో అది రూ.1938.76 కోట్లకు చేరింది.

జలశక్తి శాఖ

జలజీవన్‌ మిషన్‌ కింద రాష్ట్రాలతో కలిసి 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ఇళ్లకీ కుళాయి నీటిని (హర్‌ ఘర్‌ జల్‌) అందించే దిశగా కృషి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం జలశక్తి మంత్రిత్వశాఖకు 2019-20 బడ్జెట్‌లో రూ.28,261.59 కోట్లు కేటాయించారు. తాగునీరు, పారిశుద్ధ్య విభాగం నీటి నిర్వహణలో స్థానిక స్థాయిలో డిమాండ్, సప్లయిలపై దృష్టిపెడుతుంది. వాననీటి సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జి, గృహాల్లోని వ్యర్థ జలాలను వ్యవసాయానికి తిరిగి ఉపయోగించుకోడం లాంటి స్థానిక మౌలిక సదుపాయల కల్పనపై దృష్టి సారిస్తుంది.

అంతరిక్ష రంగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఉత్పత్తులను అంతర్జాతీయ విపణిలో విక్రయించి సొమ్ము చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ‘న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌)’ అనే ప్రభుత్వరంగ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తాజా బడ్జెట్‌లో ప్రకటించింది. ఈ సంస్థ అంతరిక్ష శాఖకు వాణిజ్య విభాగంగా పనిచేస్తుంది. ఇస్రో ఉత్పత్తులను అంతర్జాతీయ విపణిలో విక్రయిస్తుంది. వాహక నౌకల ఉత్పత్తి, సాంకేతికతల బదిలీ, అంతరిక్ష ఉత్పత్తుల మార్కెటింగ్‌ లాంటి వ్యవహారాలను చూసుకుంటుంది. 2030లోగా సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఇస్రో లక్ష్యానికి ఎన్‌ఎస్‌ఐఎల్‌ దోహదపడనుంది.

రక్షణ రంగం

ఈ బడ్జెట్‌లో రక్షణశాఖకు కేటాయింపులు పెద్దగా పెంచలేదు. ఇంతకుముందు రూ.2.98 లక్షల కోట్లుగా ఉన్న రక్షణ బడ్జెట్‌ను ఈసారి రూ.3.18 లక్షల కోట్లు చేశారు. ఇది గత బడ్జెట్‌ కంటే 7.93% ఎక్కువ, సవరించిన అంచనాల కంటే 6.87% ఎక్కువ. తాత్కాలిక బడ్జెట్‌లో చేసిన కేటాయింపును యథాతథంగా ఉంచారు. కేటాయించిన రూ. 3.18 లక్షల కోట్లు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 1.6 శాతం మాత్రమే. ఇది 1962లో చైనాతో యుద్ధం జరిగిన తర్వాతి నుంచి అత్యంత తక్కువ. దేశంలో తయారుకాని ఆయుధాలను దిగుమతి చేసుకునేటప్పుడు వాటిపై కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపు ఇవ్వడంతో రాబోయే అయిదేళ్లలో సుమారు రూ. 25వేల కోట్లు ఆదా అవుతుందని రక్షణ మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. కొత్త ఆయుధాల కొనుగోళ్లకు రూ.1,08,248 కోట్లను కేటాయించారు. పెట్టుబడి వ్యయంలో సైన్యానికి రూ.29,447 కోట్లు, నౌకాదళానికి రూ.23,156 కోట్లు, వైమానికదళానికి రూ.39,302 కోట్లు కేటాయించారు.

గృహ నిర్మాణ రంగం

గృహ నిర్మాణం, ఇళ్ల అద్దె వ్యవహారాలపై కేంద్రం ఎక్కువగా దృష్టి సారించింది. అద్దె చట్టాల్లో మార్పులకు తోడు, భారీ స్థాయిలో ఇళ్ల నిర్మాణాలకు ఊతమివ్వాలని సంకల్పించింది. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న అద్దె చట్టాలకు కాలం చెల్లిందని, అద్దెకు ఇచ్చిన, తీసుకున్న వ్యక్తుల మధ్య సంబంధాలపై ఆయా చట్టాల్లో స్పష్టత లేదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో నమూనా అద్దె చట్టాన్ని తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం 1948 నాటి అద్దె నియంత్రణ చట్టం అమల్లో ఉంది. దీని స్థానంలో కొత్త అద్దె చట్టం రానుంది. యజమానులు, అద్దెకు తీసుకునే వారి బాధ్యతలు, హక్కులను స్పష్టంగా నిర్వచించటం, అద్దె ఒప్పందాలను రిజిస్టర్‌ చేయటం, వివాదాల పరిష్కారానికి ‘రెంట్‌ ట్రైబ్యునళ్ల’ను నెలకొల్పడం లాంటి పలు నిబంధనలను దీనిలో పొందుపరస్తారు.
* 2022 నాటికి ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో మోదీ ప్రభుత్వం 2015లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనను (పట్టణ/ గ్రామీణ) ప్రారంభించింది. సొంతగా నిర్మించుకున్నా, రాష్ట్రాలు కట్టించి ఇచ్చినా ప్రజలకు ఏదో రూపంలో గృహ వసతి దక్కేలా ప్రోత్సాహాన్ని అందించటం ఈ పథకం ఉద్దేశం. ప్రాథమికంగా ఈ పథకాల్లో కేంద్రం 75%, రాష్ట్రం 25% భరించాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు వాటి సొంత పథకాలతో కలిపి దీన్ని వేర్వేరు విధానాల్లో అమలు చేస్తున్నాయి.


* పట్టణ, గృహ వ్యవహారాల శాఖకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యం లభించింది. ఈ శాఖకు రూ.48 వేల కోట్లు కేటాయించారు. గతంతో పోలిస్తే ఇది 17% అధికం. ఇందులో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ) కింద ఇళ్ల నిర్మాణాల కోసం రూ.6,853 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వచ్చే రెండేళ్లలో 1.95 కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరా, మురికి కాలవల నిర్మాణం తదితర సదుపాయాల కల్పన కోసం ఉద్దేశించిన ‘అమృత్‌’ పథకం అమలు కోసం రూ.7,300 కోట్లు ఇవ్వనున్నారు. 100 ఆకర్షణీయ నగరాల (స్మార్ట్‌సిటీ) అభివృద్ధి కోసం రూ.6,450 కోట్లు వెచ్చించనున్నారు.

బ్యాంకింగ్, ఆర్థిక రంగం

ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70 వేల కోట్ల మూలధన సాయం అందజేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. బ్యాంకుల్లో ఇప్పటికే లక్ష కోట్ల రూపాయల మేర నిరర్థక ఆస్తులు తగ్గాయన్నారు. దివాలా చట్టం కింద రూ.4 లక్షల కోట్ల మొండి బకాయిలను బ్యాంకులు వసూలు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే పీసీఏల ద్వారా ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులను సంక్షోభం నుంచి గట్టెక్కించినట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.1.05 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్మల వెల్లడించారు. ఎయిరిండియా సహా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాల విక్రయాలు కొనసాగుతాయని తెలిపారు.
* కంపెనీల్లో ప్రజల వద్ద ఉండే కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. దీనివల్ల ప్రమోటర్లు రూ.3.87 లక్షల కోట్ల విలువైన వాటాలను విక్రయించాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టీసీఎస్‌ (రూ.59,600 కోట్లు), విప్రో (రూ.15,000 కోట్లు), డి మార్ట్‌ (రూ.14,000 కోట్లు) నుంచి ఎక్కువ విక్రయాలు జరగవచ్చని అంచనా.
* ఎల్రక్టానిక్‌ ఫండ్‌రైజింగ్‌ ప్లాట్‌ఫాం పేరిట ఒక సామాజిక స్టాక్‌ ఎక్స్ఛేంజీని ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా సామాజిక కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలను నమోదు చేయించడానికి వీలు కలుగుతుంది.
* విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐ)కు కేవైసీ నిబంధనలను సరళీకరించారు.
* ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెట్‌ ఫండ్‌-నాన్‌ బ్యాంక్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఐడీఎఫ్‌-ఎన్‌బీఎఫ్‌సీలు)లు జారీ చేసే డెట్‌ సెక్యూరిటీల్లో ఎఫ్‌ఐఐలు, ఎఫ్‌పీఐలు పెట్టే పెట్టుబడులను దశల వారీగా దేశీయ మదుపర్లకు బదిలీ చేయడానికి, విక్రయించడానికి అనుమతి ఇవ్వనున్నారు.
* ప్రభుత్వం జారీ చేసే ట్రెజరీ బిల్లులు, సెక్యూరిటీల్లో రిటైల్‌ మదుపర్లు పెట్టుబడులు పెట్టేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
* స్టాక్‌ మార్కెట్లలో సులువుగా పెట్టుబడులు పెట్టడం కోసం ఎన్‌ఆర్‌ఐ పోర్ట్‌ఫోలియో మార్గాన్ని ఎఫ్‌పీఐ మార్గంతో విలీనం చేయనున్నారు.
* తక్కువ కార్పొరేట్‌ పన్ను అయిన 25 శాతాన్ని పొందడానికి ఉన్న వార్షిక టర్నోవరు పరిమితిని రూ.250 కోట్ల నుంచి రూ.400 కోట్లకు పెంచారు. ఈ ప్రతిపాదన పరిధిలోకి దేశంలోని 99.3% కంపెనీలు వస్తాయి.
* సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ)ను సెటిల్‌మెంట్, స్ట్రైక్‌ ప్రైస్‌ల మధ్య తేడాకు మాత్రమే వర్తింపజేస్తారు.

బంగారం

బంగారం దిగుమతిపై కస్టమ్స్‌ సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీంతో విదేశాలతో పోలిస్తే దేశీయంగా కొనుగోలుదార్లు మరింత అధిక మొత్తం వెచ్చించాల్సి వస్తుంది. దేశీయ పసిడి అవసరాల్లో 90-95 శాతం వరకు దిగుమతులే తీరుస్తుండటం దీనికి కారణం. నాణేలు, బిస్కెట్ల రూపంలో లభించే స్వచ్ఛమైన బంగారమైనా, ఆభరణాలైనా అదనపు భారం తప్పదు.
* 13 శాతం: ఇప్పటివరకు బంగారంపై 10 శాతం కస్టమ్స్‌ సుంకం, 3 శాతం వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలవుతున్నాయి. అంటే 13 శాతం పన్ను పడుతోంది.
* 15.5 శాతం: ఇకపై 12.5 శాతం కస్టమ్స్, 3 శాతం జీఎస్‌టీ కలిపితే 15.5 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. అంటే ప్రతిగ్రాము కొనుగోలుపైనా పన్నుల రూపంలోనే 2.5 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తుంది. వెండి, ప్లాటినమ్‌ పరిస్థితీ ఇంతే.
* మన దేశం ఏడాదికి 800-900 టన్నుల పసిడిని విదేశాల నుంచి అధికారికంగా దిగుమతి చేసుకుంటోంది. అయితే కస్టమ్స్, జీఎస్‌టీ భారం వల్ల, దుబాయి లాంటి దేశాలతో పోల్చినా, దేశీయంగా పసిడి ధర కిలోకు రూ.4 లక్షల వరకు అధికంగా ఉంటోంది. మేలిమి బంగారం ఔన్సు (31.10 గ్రాములు) 1412 డాలర్ల మేర ఉంది. డాలర్‌ విలువ రూ.68.506గా ఉంది. అందువల్ల ఔన్సు విలువ రూ.96,742 అవుతుంది. అంటే గ్రాము రూ.3110 మాత్రమే. దీనికి 15.5 శాతం పన్ను రూ.482 కలిపితే రూ.3592 అవుతుంది. ఇతర వ్యయాలు గ్రాముకు రూ.10 కలిపి హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో రూ.3602గా చూపుతున్నారు. ఇదే అనధికారిక విపణిలో గ్రాము రూ.3390కే లభిస్తోందని కొందరు విక్రేతలు చెబుతున్నారు. అంటే మేలిమి బంగారం గ్రాముకు రూ.212 తక్కువకు లభిస్తోంది. పాత పన్నురేటు 13 శాతం ప్రకారం అయితే, ఈ ధరకు గ్రాముకు రూ.404 అవుతుంది. అంటే మేలిమి బంగారంపై గ్రాముకు రూ.78 చొప్పున భారం పెరిగిందన్న మాట. 10 గ్రాములకు రూ.780 అదనపు భారం పడుతుంది.


రూ.50 లక్షలు మించితే.. టీడీఎస్‌ తప్పదు

పన్ను పరిధిని పెంచడానికి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టర్లు లేదా వృత్తినిపుణులకు వ్యక్తులు చేసే చెల్లింపులు ఒక ఏడాదిలో రూ.50 లక్షలకు మించితే 5 శాతం మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్‌) విధిస్తారు. టీడీఎస్‌ను తమ శాశ్వత ఖాతా నంబరు (పాన్‌) ఉపయోగించి ట్రెజరీలో డిపాజిట్‌ చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఏ వ్యక్తి లేదా హిందు అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్‌) కానీ కాంట్రాక్టర్లు లేదా వృత్తినిపుణులకు చేసే చెల్లింపులపై ఎటువంటి టీడీఎస్‌ లేదు.

రూ.కోటికి మించి నగదు తీసుకుంటే 2 శాతం పన్ను

ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా బ్యాంకు ఖాతా నుంచి రూ.కోటికి మించి నగదును వెనక్కి తీసుకుంటే, ఆ మొత్తంపై బ్యాంకు 2 శాతం మూలం వద్ద పన్ను కోత విధించాలనే కొత్త నిబంధన ప్రతిపాదించారు. అంటే.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.3 కోట్ల నగదు బ్యాంకు ఖాతా నుంచి వెనక్కి తీసుకుంటే, రూ.6లక్షల వరకూ పన్ను చెల్లించాలి. ఇలా మినహాయించిన పన్నును రిటర్నులలో చూపించుకోవచ్చా, అది తిరిగి వస్తుందా అనే విషయంలో స్పష్టత లేదు.

రూ.400 కోట్ల టర్నోవరు వరకు కార్పొరేట్‌ పన్ను 25%

25 శాతం కార్పొరేట్‌ పన్ను పరిధిలోకి వచ్చే కంపెనీల వార్షిక టర్నోవరు పరిమితిని రూ.250 కోట్ల నుంచి రూ.400 కోట్లకు పెంచాలని తాజా బడ్జెట్‌లో నిర్ణయించారు. ఈ ప్రతిపాదనతో దేశంలోని సుమారు 99.3 శాతం కంపెనీలు ఈ జాబితాలోకి వచ్చే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. కేవలం 0.7 శాతం కంపెనీలు మాత్రమే 25 శాతం కార్పొరేట్‌ పన్నుకు బయట ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం కార్పొరేట్‌ పన్ను 30 శాతంగా ఉంది.

ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు

మీడియా, విమానయానం, బీమా, ఏక బ్రాండ్‌ రిటైల్‌ రంగాల్లో మరిన్ని విదేశీ నిధులను ఆకర్షించేందుకు వీలుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల్ని తాజా బడ్జెట్‌లో సడలించారు. బీమా బ్రోకరేజీ సంస్థల్లో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించబోతున్నామని, ఏక బ్రాండ్‌ రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐల కోసం స్థానిక సోర్సింగ్‌ నిబంధనలను సడలిస్తామని ఆర్థిక మంత్రి వివరించారు. ప్రస్తుతమున్న ఎఫ్‌డీఐ విధానం ప్రకారం, బీమా రంగంలోకి 49 శాతం ఎఫ్‌డీఐలనే అనుమతిస్తున్నారు. ఇందులో బీమా సంస్థలతోపాటు బీమా బ్రోకరేజీ సంస్థలు, థర్డ్‌ పార్టీ అడ్మినిస్ట్రేటర్లు (టీపీఏలు), సర్వేయర్లు, తదితరులు ఉన్నారు.

ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలకు ఊరట

ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డ్‌ అసెంబ్లింగ్, సెల్‌ఫోన్ల కెమేరా మాడ్యూల్, ఛార్జర్‌/అడాప్టర్, లిథియం అయాన్‌ బ్యాటరీ, డిస్‌ప్లే మాడ్యూల్, సెట్‌టాప్‌ బాక్స్, కాంపాక్ట్‌ కెమేరా మాడ్యూల్‌ల తయారీ, బిగింపు (అసెంబ్లింగ్‌) కోసం వినియోగించే యంత్రాలపై ప్రస్తుతం అమలవుతున్న పన్నును పూర్తిగా పరిహరిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

అంకురాలకు టీవీ ఛానల్‌

అంకురాల కోసం ప్రత్యేకంగా ఓ టీవీ ఛానల్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. అంకురాల వృద్ధికి అవరోధంగా నిలుస్తున్న సమస్యలు, నిధుల అవసరాలు, పన్నుల ప్రణాళిక లాంటి అంశాలను చర్చించేందుకు ఈ ఛానల్‌ ఒక వేదికగా ఉపయోగపడుతుందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఛానల్‌ రూపకల్పన దగ్గర నుంచి నిర్వహణ వరకు అంకురాలే స్వయంగా నిర్వహిస్తాయని పేర్కొన్నారు. ఇది దూరదర్శన్‌ ఛానళ్లలో భాగంగానే ఉంటుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఏంజెల్‌ ట్యాక్స్‌

ఏంజెల్‌ ట్యాక్స్‌ కేసుల విషయంలో అంకుర సంస్థలు (స్టార్టప్‌) ఎదుర్కొంటున్న కష్టాలను దూరం చేసేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. డిక్లరేషన్‌ దాఖలు చేయడంతో పాటు రిటర్న్‌ల్లో పూర్తి సమాచారాన్ని అందించిన వారికి ఎలాంటి నిశిత పరిశీలన (స్క్రూటినీ) ఉండబోదని స్పష్టం చేసింది. ఏంజెల్‌ ట్యాక్స్‌కు సంబంధించి పెట్టుబడులు పెట్టిన సంస్థ/ వ్యక్తి ఎవరో, ఎక్కడి నుంచి నిధులు సమీకరించారో తెలుసుకోవడానికి ఇ-వెరిఫికేషన్‌ విధానాన్ని అందుబాటులోకి తేనుంది. దీని వల్ల నిధులు సమీకరించిన అంకుర సంస్థలు ఆదాయపు పన్ను విభాగం నుంచి ఏ తరహా పరిశీలన ఎదుర్కోనవసరం లేదు. అంకుర సంస్థలకు సంబంధించి పెండింగ్‌ అసెస్‌మెంట్‌ కేసుల పరిష్కారానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అంకురాల్లో పెట్టుబడులు పెట్టే ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (ఏఐఎఫ్‌) కేటగిరి- 2కి ఏంజెల్‌ ట్యాక్స్‌ నుంచి పూర్తి మినహాయింపును ఇచ్చారు. ఒక అంకుర సంస్థ పోటీ విపణుల్లో అడుగుపెట్టే సమయంలో పెట్టుబడులు పెట్టే సంస్థను ఏంజెల్‌ ఇన్వెస్టర్‌ అంటారు. ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్‌ 56(2)(7బీ) ప్రకారం.. సాధారణ మార్కెట్‌ విలువకు మించి నిధులు సమీకరించినప్పుడు.. ఆ నిధులను ఇతర వనరుల నుంచి లభించిన ఆదాయంగా పరిగణించి 30 శాతం పన్ను విధిస్తారు. దీనినే ఏంజెల్‌ ట్యాక్స్‌గా నిర్వచిస్తున్నారు.

సౌర విద్యుత్‌ యూనిట్లు

సౌర విద్యుత్తు వినియోగానికి తోడ్పడే సెల్స్, బ్యాటరీలు, ఛార్జింగ్‌ వ్యవస్థల తయారీ యూనిట్లను దేశీయంగా నెలకొల్పేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ఆవిష్కరించనుంది. ఈ పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలు కల్పించనుంది. పారదర్శక బిడ్డింగ్‌ ద్వారా భారీ తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు అంతర్జాతీయ కంపెనీలను ఆహ్వానిస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. సెమీ కండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌కూ ప్రోత్సాహకాలిస్తారు. సౌర ఫొటో వోల్టాయిక్‌ సెల్స్, లిథియం స్టోరేజీ బ్యాటరీలు, సౌర విద్యుత్తు ఛార్జింగ్‌ వ్యవస్థ, కంప్యూటర్‌ సర్వర్లు, ల్యాప్‌టాప్‌ల యూనిట్లకూ ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు.

క్షమాభిక్ష పథకం

వివాదాల పరిష్కార, క్షమాభిక్ష పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ‘సబ్కా విస్వాస్‌ లెగసీ డిస్పూట్‌ రెసొల్యూషన్‌ స్కీమ్‌-2019గా పిలిచే ఈ పథకం వల్ల సేవా, ఎక్సైజ్‌ సుంకాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులకు పరిష్కారం లభించనుంది. పన్ను బకాయిని బట్టి 40% నుంచి 70% దాకా ఈ పథకం నుంచి ఊరట పొందే అవకాశం ఉంది. వడ్డీ, అపరాధ రుసుముల నుంచి కూడా ఈ పథకం ద్వారా ఊరట పొందవచ్చు. జీఎస్‌టీ అమల్లోకి రాకముందు భారీ సంఖ్యలో ఉన్న ఎక్సైజ్, సేవా పన్నులపై కేసులు ఇంకా తేలలేదు. ఈ కేసుల్లో రూ.3.75 లక్షల కోట్లు పైగా చిక్కుకుని ఉన్నాయి. ఈ ఒత్తిడిని తగ్గించి ఆయా వ్యాపారులు ముందుకు వెళ్లడానికి వీలుకల్పించేందుకే ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.

వాటా విక్రయ లక్ష్యం రూ.1,05,000 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్‌ఈ) వాటా విక్రయం ద్వారా రికార్డు స్థాయిలో రూ.1,05,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ఎయిరిండియా సహా పలు సీపీఎస్‌ఈల ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రారంభించనుంది. మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.90,000 కోట్లకు మించి తాజా లక్ష్యాన్ని నిర్దేశించారు. తాజా వ్యూహాత్మక వాటా విక్రయ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం తన వాటాను 51 శాతం లోపునకు తగ్గించుకోనుంది. పరిమిత వాటాను కలిగి ఉన్నప్పటికీ ఆ సంస్థల నియంత్రణ మాత్రం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. తదనుగుణంగా విధానాల్లో మార్పులు చేయనుంది.

నమోదిత కంపెనీలకు 20% బైబ్యాక్‌ పన్ను

నమోదిత కంపెనీలు షేర్లను తిరిగి కొనుగోలు చేసేటప్పుడు 20% బైబ్యాక్‌ పన్నును చెల్లించాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇంతవరకూ నమోదు కాని కంపెనీలు మాత్రమే ఈ పన్నును చెల్లించేవి. అయితే డివిడెండు పంపిణీ పన్ను (డీడీటీ) ఎగ్గొట్టడానికి చాలా కంపెనీలు బైబ్యాక్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు గుర్తించడంతో వాటికి కూడా బైబ్యాక్‌ పన్నును అమలు చేస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. కంపెనీలు తాము ఆర్జించే లాభాల్లో కొంతభాగాన్ని వాటాదార్లకు పంచేందుకు వీలుగా డివిడెండ్లు చెల్లిస్తుంటాయి. ఈ సమయంలో అవి ప్రభుత్వానికి డీడీటీని చెల్లించాల్సి ఉంటుంది. అయితే నమోదిత కంపెనీలు ఆ లాభాలతో షేర్ల బైబ్యాక్‌కు దిగుతుండటంతో బైబ్యాక్‌ పన్నును అమలు చేసినట్లు తెలుస్తోంది.

విద్యుత్తు వాహనాలు కొంటే రాయితీ

విద్యుత్తు వాహనాల (ఈవీ) కొనుగోళ్లను ప్రోత్సహించడానికి వాటి నిమిత్తం తీసుకునే రుణాలపై చెల్లించే వడ్డీకి ఆదాయపు పన్నులో రూ.1.50 లక్షల వరకు మినహాయింపు ఇవ్వాలని తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇందువల్ల మొత్తంమీద వినియోగదార్లకు రూ.2.50 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుంది. అధునాతన బ్యాటరీ కలిగి, రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యుత్తు వాహనాల వినియోగదార్లకే ఇది వర్తిస్తుంది. ఈవీల విడిభాగాలు కొన్నింటిపై కస్టమ్స్‌ సుంకాన్ని కూడా ప్రభుత్వం పూర్తిగా పరిహరించింది. విద్యుత్‌ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్లతో ఫేమ్‌ 2 పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అలాగే వీటిపై జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది.


 

Posted on 05.07.2019