Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Budget -2019

కేంద్ర బడ్జెట్ - 2019

* తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ రూ.27.84 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌ 2019ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ తాత్కాలిక బడ్జెట్‌లో వివిధ వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా పలు పథకాలను ప్రకటించారు.

జాతీయ రహదారులు

మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఊతమిచ్చే దిశగా కేంద్ర బడ్జెట్లో జాతీయ రహదారులకు రూ.83,000 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి గ్రామసడక్‌ యోజన కింద కేటాయింపులను రూ.15,500 కోట్ల నుంచి రూ.19,000 కోట్లకు పెంచారు. సాగరమాల కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో పాటు దేశీయంగా నదీ మార్గాల్లో రవాణాను సత్వరం అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టనున్నారు.

లోక్‌పాల్‌కు అదే మొత్తం..

లోక్‌పాల్‌ వ్యవస్థ నిర్వహణకు బడ్జెట్‌ కేటాయింపులో ఎలాంటి పెంపుదల ప్రకటించలేదు. గత ఏడాది (2018-19)లో రూ.4.29 కోట్లు కేటాయించగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ అంతే మొత్తం కేటాయించారు. కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌కు (సీవీసీ) కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. 2018-19 సంవత్సరంలో ఆ సంస్థకు రూ.34 కోట్లు కేటాయిస్తే రానున్న ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తాన్ని 35.5 కోట్లకు పెంచారు.

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌)

చిన్న, మధ్యతరహా రైతులకు ఆర్థిక సహకారం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం కింద 2 హెక్టార్ల దాకా సాగుభూమి ఉండే రైతులకు ఏడాదికి రూ.6 వేలు అందజేస్తారు. ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకే బదిలీ చేస్తారు. విడతకు రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో అందిస్తారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుంది.
- దీనివల్ల సుమారు 12 కోట్ల మంది సన్న, మధ్యతరహా రైతు కుటుంబాలకు ప్రయోజనం అందుతుంది.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే వర్తిస్తుంది.
- 2018 డిసెంబరు 1 నుంచి అమలవుతుంది.
- మొదటి విడతలో రూ.2 వేలు మార్చినెల లోపు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
- పీఎం-కిసాన్‌ పథకం బాధిత రైతు కుటుంబాలకు అదనపు ఆదాయ హామీని ఇవ్వడమే కాకుండా పంట సీజన్‌కు ముందే అత్యవసర ఖర్చులకు చేదోడుగా నిలుస్తుంది. ఈ పథకం రైతులు డబ్బులు సంపాదించుకోవడానికి, గౌరవంగా జీవించేందుకు మార్గం సుగమం చేస్తుంది.
- పీఎం-కిసాన్‌ పథకానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.75 వేల కోట్లు కేటాయించారు.
- ఈ పథకంతో కేంద్ర ప్రభుత్వంపై 75 వేల కోట్ల రూపాయల భారం పడనుంది.
- 2018-19 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల కింద ఈ పథకం కోసం రూ.20 వేల కోట్లు అదనంగా కేటాయించారు.
- 22 గుర్తించిన పంటలకు కనీస మద్దతు ధరను పంట ఉత్పత్తి వ్యయం కంటే 50 శాతం ఎక్కువగా నిర్ణయించారు.
వడ్డీ రాయితీలు
- మత్స్య రంగం అభివృద్ధికి నిరంతరం దృష్టిసారించేందుకు వీలుగా ప్రత్యేకంగా మత్స్యశాఖ ఏర్పాటు.
- పశుపోషణ, చేపల పెంపకం చేపట్టిన రైతులకు 2 శాతం వడ్డీ రాయితీ. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా రుణాలు పొందిన వారికి ఇది వర్తిస్తుంది.
- సకాలంలో రుణాలు చెల్లించిన వారికి అదనంగా 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది.
- రుణప్రక్రియను సరళతరం చేయనున్నారు. రాయితీలతో కూడిన రుణాలను అందించడానికి రైతులందరినీ కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పరిధిలోకి తీసుకొచ్చేందుకు వీలుగా సరళతరమైన దరఖాస్తు సమగ్ర కార్యక్రమాన్ని చేపడతారు.
- తీవ్రస్థాయి ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్డీఆర్‌ఎఫ్‌) ద్వారా సహాయం అందజేయాలని నిర్ణయించారు.
- ప్రకృతి విపత్తు బాధిత రైతులకు 2 శాతం వడ్డీ రాయితీ. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి 3 శాతం అదనపు రాయితీ ప్రయోజనాన్ని కల్పించారు.
2019-20 ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు:
వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1,49,981 కోట్లు
* ఎరువుల సబ్సిడీ కి రూ.74,986 కోట్లు
కామధేను ఆయోగ్‌
గోవుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గో సంపదను జన్యుపరంగా తీర్చిదిద్దేందుకు, ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచేందుకు ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌’ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థికమంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. గోవులకు సంబంధించిన చట్టాలు, సంక్షేమ పథకాలను ప్రభావశీలంగా అమలు చేసేలా ఆయోగ్‌ పర్యవేక్షిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ‘రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌’ కోసం కేటాయింపులను రూ.750 కోట్లు పెంచారు.

మహిళా శిశు సంక్షేమం

మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖకు కేంద్రం ఈ బడ్జెట్‌లో రూ.29 వేల కోట్లు కేటాయించింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఈసారి కేటాయింపులను 20 శాతం పెంచింది. ప్రసూతి కార్యక్రమాలకు కేటాయింపులను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
- ప్రధానమంత్రి మాతృవందన యోజనకు (పీఎంఎంవీవై) రూ.2,500 కోట్లు.
- సమగ్ర శిశు అభివృద్ధి సేవల (ఐసీడీఎస్‌) కింద చిన్నారుల సంరక్షణ సేవా కార్యకమ్రాలకు రూ.1500 కోట్లు.
- మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.29,164.90 కోట్ల కేటాయింపు.
- బేటీ బచావో బేటీ పడావో పథకానికి రూ.280 కోట్లు.
- జాతీయ పౌష్టికాహార కార్యక్రమానికి (ఎన్‌ఎన్‌ఎం) రూ.3,400 కోట్లు.
- ‘మహిళా శక్తికేంద్రాల’కు రూ.150 కోట్లు.
- ఉద్యోగినులు కార్యాలయాల నుంచి తిరిగి వచ్చే వరకూ వారి పిల్లల ఆలనాపాలనా చూసే కేంద్రాలకు సంబంధించిన జాతీయ క్రెచ్‌ పథకానికి రూ.50 కోట్లు కేటాయించారు.
- వర్కింగ్‌ విమెన్స్‌ హాస్టల్‌ పథకానికి రూ.165 కోట్లు.
- అక్రమ రవాణా బాధితుల పునరావాస కార్యక్రమం ‘ఉజ్వల’కు రూ.30 కోట్ల కేటాయింపు.
- వితంతు శరణాలయాలకు బడ్జెట్‌ కేటాయింపులు రూ.15 కోట్లు.

గృహ నిర్మాణం

గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖకు బడ్జెట్‌లో ప్రాధాన్యం లభించింది. కిందటిసారితో పోలిస్తే 2019-20లో 17% మేర నిధులు పెరిగాయి. ఈ శాఖకు ప్రభుత్వం మొత్తం రూ.48,000 కోట్లు కేటాయించింది. ఇందులో ప్రధానమంత్రి పట్టణ ఆవాస్‌ యోజనకు రూ.6,853.26 కోట్లు; అమృత్‌ పథకానికి రూ.7,300 (6,000) కోట్లు; ఆకర్షణీయ నగరాలకు రూ.6,600 (6,169) కోట్లు; స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ.2,750 (2,500) కేటాయించారు.

పెరిగిన రిబేటు.. శ్లాబులు యథాతథం

ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయకుండానే మధ్య తరగతి వర్గాలకు ఉపశమనం కలిగించే చర్యలను ప్రస్తుత తాత్కాలిక బడ్జెట్‌లో ప్రతిపాదించారు. కనీస ఆదాయపు పరిమితిని పెంచకుండా, రిబేటు మొత్తాన్ని పెంచడం ద్వారా ప్రయోజనం చేకూర్చారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్ను మార్పుల్లో చెప్పుకోదగ్గ అంశం ఇదొక్కటే.
ఇప్పుడు అమల్లో ఉన్న ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం కనీస ఆదాయ పరిమితులు మూడు రకాలుగా ఉన్నాయి. 60 ఏళ్లలోపు వారందరికీ రూ.2,50,000 వరకూ, 60-80 ఏళ్ల లోపు వారికి రూ.3,00,000 వరకూ, 80 ఏళ్లు ఆపైన వారికి రూ.5,00,000 వరకూ ఆదాయ పన్ను వర్తించదు. ప్రస్తుత బడ్జెట్‌లో ఈ పరిమితుల్లో ఎలాంటి సవరణలూ చేయలేదు. అయితే, రిబేటు పరిధిని మాత్రం సవరించారు. గతంలో రూ.3,50,000లోపు పన్ను వర్తించే వార్షికాదాయం ఉన్న వారికి సెక్షన్‌ 87ఏ ప్రకారం రూ.2,500 రిబేటు లభించేది. ఈ పన్ను వర్తించే ఆదాయ పరిమితిని ఇప్పుడు రూ.5,00,000లకు పెంచారు. దీంతో రూ.12,500 రిబేటు లభిస్తుందన్నమాట. ఈ రిబేటు పొందాలంటే ఈ నిబంధనలకు లోబడి పొందవచ్చు..
- వార్షిక పన్ను వర్తించే ఆదాయం రూ.5,00,000 లోపు ఉండాలి. (మొత్తం ఆదాయం నుంచి సెక్షన్‌ 80సీ కింద రూ.1,50,000ల మినహాయింపు, సెక్షన్‌ 80డీ, ప్రామాణిక తగ్గింపు, గృహ రుణ వడ్డీ తదితర మినహాయింపులన్నీ తీసేసిన తర్వాత వచ్చే పన్ను వర్తించే ఆదాయం రూ.5,00,000 దాటకూడదు)
- ఒక్కమాటలో చెప్పాలంటే.. మినహాయింపులన్నీ పోను రూ.5 లక్షలకు మించి పన్ను వర్తించే ఆదాయం ఉంటే ఎలాంటి రిబేటు వర్తించదు. వారికి ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను నిబంధనలే వర్తిస్తాయి.
పన్ను శాతాలు
2019-20 ఆర్థిక సంవత్సరంలో
60 ఏళ్ల లోపు వారికి పన్ను శ్లాబులు
రూ.2,50,000 పన్ను లేదు
రూ.2,50,0001-రూ.5,00,000 5%
రూ.5,00,001-రూ.10,00,000 20%
రూ.10,00,001 ఆ పైన 30%
పన్ను వర్తించే ఆదాయం రూ.5,00,000లోపు ఉన్నప్పుడు రూ.12,500 పన్ను చెల్లించాలి. ఈ మొత్తానికే కొత్త బడ్జెట్‌లో రిబేటును ప్రకటించారు. కొన్ని సంస్థల్లో ఈ రిబేటును నేరుగా ఇస్తారు. మరికొన్ని సంస్థల్లో పన్ను మొత్తాన్ని టీడీఎస్‌ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేయాలి. అప్పుడే రిఫండు రూపంలో ఈ మొత్తం వెనక్కి వస్తుంది.

ద్రవ్య లోటు..

వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) నాటికి ద్రవ్యలోటును జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో 3 శాతానికి పరిమితం చేయాలని, ప్రాథమిక లోటు పూర్తిగా లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉన్నప్పుడు దాన్ని ద్రవ్య లోటు అంటారు. దీన్ని భర్తీ చేయడానికి రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. ద్రవ్యలోటు నుంచి చెల్లించిన వడ్డీలను తీసివేస్తే వచ్చే మొత్తాన్ని ప్రాథమిక లోటుగా పిలుస్తారు. చేసిన అప్పులను తీర్చడానికి మళ్లీ రుణాలు తీసుకోవాల్సి వస్తే ఆ పరిస్థితిని కూడా ప్రాథమిక లోటు అని అంటారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ప్రాథమిక లోటును ‘సున్నా’కు పరిమితం చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 3.4 శాతంగా ఉండగా, 2019-20లోనూ 3.4 శాతంగా ఉంది. లోటును 3.3 శాతానికి పరిమితం చేయాలని అనుకున్నామని, కానీ రైతు సంక్షేమం కోసం అధికంగా నిధులు ఖర్చు చేయడం వల్ల పెరిగిందని తాత్కాలిక ఆర్థిక మంత్రి గోయల్‌ తెలిపారు. గత బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ.75,000 కోట్లు కేటాయించామని చెప్పారు.

వర్గీకరణకు ప్రత్యేక కమిటీ

దేశంలో ఇప్పటివరకు వర్గీకరణకు నోచుకోని విముక్త (డీ నోటిఫైడ్‌), సంచార, పాక్షిక సంచార (సెమీ నొమాడిక్‌) జాతుల గుర్తింపు ప్రక్రియను పూర్తిచేసేందుకు ప్రభుత్వం నీతి ఆయోగ్‌ కింద ఓ కమిటీని ఏర్పాటుచేయనుంది. ఆ జాతుల ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చేలా ప్రత్యేక వ్యూహాలు రూపొందించేందుకు సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ పరిధిలో సంక్షేమాభివృద్ధి మండలిని కూడా ఏర్పాటు చేయనున్నారు.

అసంఘటిత కార్మికులకు రూ.3 వేల పింఛను

అసంఘటిత రంగంలో ఉన్న కోట్లాదిమంది కార్మికులకు నెలనెలా రూ.3000 పింఛను అందించే మెగా పింఛను పథకాన్ని కేంద్రం ప్రకటించింది. ‘‘ప్రధాన్‌మంత్రి శ్రమ్‌ యోగి మాన్‌ధన్‌ - పీఎంఎస్‌వైఎం’’ అనే ఈ కొత్త పథకంతో వచ్చే అయిదేళ్లలో సుమారు పదికోట్లమంది ప్రయోజనం పొందనున్నారని అంచనా. రూ.15వేల వరకు నెలవారీ ఆదాయం పొందేవారు ఈ పథకానికి అర్హులు. కార్మికుడు తన వంతుగా రూ.వంద నెలనెలా చెల్లిస్తే, కేంద్ర ప్రభుత్వం మరో రూ.వంద జత చేస్తుంది. కార్మికుడు తన 60వ ఏట నుంచి రూ.3000 పింఛను పొందవచ్చు.
ఎంత చిన్నవయసులో ప్రారంభిస్తే అంత మేలు!
60వ ఏట నుంచి రూ.3000 నెలవారీ పింఛను పొందాలంటే, కార్మికుడు ఎంత చిన్నవయసులో పథకంలో చేరితే అంత తక్కువగా తన వంతు నగదు జమ చేయాల్సి ఉంటుంది. కార్మికుడి వయసు పెరిగిన కొద్దీ నగదు కూడా పెరుగుతుంది. ఉదాహరణకు 29 ఏళ్ల వ్యక్తి నెలనెలా రూ.వంద చొప్పున పథకంలో జమ చేయాలి. అదే 18 ఏళ్ల వ్యక్తి అయితే రూ.55 చెల్లిస్తే చాలు. కనిష్ఠ, గరిష్ఠ పరిమితుల గురించి ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించలేదు. ‘ప్రధాన్‌మంత్రి శ్రమ-యోగి మాన్‌ధన్‌’ పేరుతో ప్రతిపాదించిన ఈ పథకం ఎంతోమందికి అండగా నిలుస్తుందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. దేశంలోని కోట్లమంది అసంఘటిత రంగం కార్మికుల కోసం ఇప్పటికే ‘‘పీఎం జీవన్‌ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన, ఆయుష్మాన్‌ భారత్‌’’ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది.
పది కోట్ల మందికి లబ్ధి
రిక్షా కార్మికులు, ఆటోడ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఇతర ఎన్నో రకాలైన పనులు చేసి జీవనం సాగించే ఎంతోమందికి ఈ పథకం వల్ల మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకంలో వచ్చే అయిదేళ్లలో దాదాపు పదికోట్ల మంది కార్మికులు చేరతారని అంచనా. అదే జరిగితే ప్రపంచంలో ఇదే అతిపెద్ద పింఛను పథకం అవుతుంది. దీనికి ప్రస్తుత బడ్జెట్‌లో కేంద్రప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. అవసరమైతే ఇంకా అధిక నిధులు ఇస్తారు.

ఉపాధికి ఊతం..

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్రం రూ.60వేల కోట్లు కేటాయించింది. 2018-19 బడ్జెట్‌ కేటాయింపులైన రూ.55వేల కోట్లతో పోలిస్తే ఇవి 11శాతం ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.61,084 కోట్లు వ్యయం చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా రూ.2019-20 బడ్జెట్‌ అంచనాల్లో రూ.60వేల కోట్లు కేటాయించినా, వాస్తవంలో ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఆహార ధాన్యాలు అందించడానికి 2013-14లో రూ.92వేల కోట్లు వ్యయం చేయగా, 2018-19లో రూ.1,70,000 కోట్లు వ్యయం చేసినట్లు పీయూష్‌ గోయల్‌ చెప్పారు.
- ‘‘ప్రధాన్‌మంత్రి గ్రామీణ ఆవాస్‌ యోజన-గ్రామీణ’’ పథకానికి 2018-19తో పోలిస్తే రెండు వేల కోట్లు తక్కువగా రూ.19 వేల కోట్లు మాత్రమే కేటాయించారు.
- ‘‘ప్రధాన్‌మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన పథకం’’ కేటాయింపులో మార్పు లేదు. రూ.19 వేల కోట్లకు పరిమితం చేశారు.
- పలు ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ‘‘జాతీయ సామాజిక సహాయక పథకానికి’’ కేటాయింపులను తగ్గించారు. 2018-19లో రూ.9975 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.9200 కోట్లకు తగ్గించారు.

ఈశాన్యానికి 5,600 కోట్లు

ప్రత్యేక హోదా ఉన్న ఈశాన్య, హిమాలయ ప్రాంత రాష్ట్రాలకు కేంద్రం సుమారు రూ.5,600 కోట్ల ప్రయోజనాలు కల్పిస్తోంది. ఇందులో పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద రూ.2608 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.3వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పారిశ్రామిక పన్ను రాయితీలు అడిగితే, ఎవరికీ ఇవ్వలేదని చెప్పే కేంద్రం ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు మాత్రం ఈ పద్దు కింద రూ.1700 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది.

ఆయుష్మాన్‌ భారత్‌కు 6400 కోట్లు

కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి రూ.61,398 కోట్లు కేటాయించింది. అందులో రూ.6400 కోట్లను ప్రతిష్ఠాత్మక ‘ఆయుష్మాన్‌ భారత్‌ - ప్రధాన్‌మంత్రి జన్‌ఆరోగ్య యోజన’కు ప్రత్యేకించింది. 2018-19 కేటాయింపుల కంటే ఇవి 16 శాతం ఎక్కువ.
* గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవల కోసం ఆయుష్మాన్‌ భారత్‌ కింద వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటుకు రూ.250 కోట్లు
* జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌ కింద వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటుకు రూ.1,350.01 కోట్లు. 2022 కల్లా 1.5 లక్షల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి పెంపు. ఈ కేంద్రాల్లో రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, వృద్ధాప్య సంబంధ వ్యాధులకు చికిత్సలు
* జాతీయ ఆరోగ్య మిషన్‌కు (ఎన్‌హెచ్‌ఎం)కు రూ.31,745 కోట్లు. గత బడ్జెట్‌లో ఈ కేటాయింపు రూ.30,129 కోట్లు
* ఎన్‌హెచ్‌ఎం ఆధ్వర్యంలో నడిచే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనకు నిధుల్లో భారీ కోత వేశారు. రూ.156 కోట్లు మాత్రమే కేటాయించారు. గతేడాది కేటాయింపు కంటే ఇది రూ.1844 కోట్లు తక్కువ కావడం గమనార్హం
* ఎయిడ్స్, ఎస్‌టీడీ నియంత్రణ కార్యక్రమాలకు గతేడాది కంటే రూ.400 కోట్లు ఎక్కువగా రూ.2500 కోట్లు కేటాయించారు.
* జిల్లా ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల (పోస్టు గ్రాడ్యుయేట్‌ సీట్లు) ఆధునికీకరణ, వసతుల విస్తరణకు రూ.800 కోట్లు, నర్సింగ్‌ సేవల ఆధునికీకరణ, బలోపేతానికి రూ.64 కోట్లు, ఫార్మసీ కళాశాలల అభివృద్ధికి రూ.5 కోట్ల కేటాయింపు.
* ప్రభుత్వ వైద్య కళాశాలలు (గ్రాడ్యుయేట్‌ సీట్లు), కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఆరోగ్య సంస్థల బలోపేతానికి రూ.1,361 కోట్లు
* కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ.2 వేల కోట్ల కేటాయింపు.
కాలుష్య నిధులకు కోత..
కాలుష్య నియంత్రణ బడ్జెట్‌లో 50 శాతం కోత పడింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.20 కోట్లు ఉండగా, 2019-20లో రూ.10 కోట్లే కేటాయించారు. నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల రంగానికి ఎలాంటి కేటాయింపులు జరపలేదు. వాతావరణ మార్పుల కార్యాచరణ ప్రణాళిక కోసం గత ఏడాదిలాగే రూ.40 కోట్ల కేటాయింపునే కొనసాగించారు. జాతీయ శుద్ధ వాయు కార్యక్రమం (ఎన్‌సీఏపీ) కేటాయింపుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డుకు రూ.100 కోట్లు కేటాయించారు. జంతు సంరక్షణ బోర్డుకు రూ.12 కోట్లు, జాతీయ హరిత భారత్‌ కమిషన్‌కు రూ.240 కోట్లు కేటాయించారు.
పర్యావరణానికి 20% పెంపు
పర్యావరణ మంత్రిత్వ శాఖకు 2019-20 సంవత్సరానికి రూ.3,111.20 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,586.67 కోట్లు కేటాయించగా ఈసారి 20.27 శాతం పెరిగింది. ప్రాజెక్టు టైగర్‌కు గత ఏడాది రూ.350 కోట్లు, ప్రాజెక్టు ఎలిఫెంట్‌కు రూ.30 కోట్లు కేటాయించగా, ఈసారి కేటాయింపుల్లో మార్పేమీ లేదు. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థకు రూ.10 కోట్లు కేటాయించారు.

సింగరేణి, విశాఖ ఉక్కు కర్మాగారాలు..

తెలుగు రాష్ట్రాల్లోని రెండు భారీ ప్రభుత్వరంగ సంస్థలైన సింగరేణి బొగ్గు గనులు, విశాఖ ఉక్కు కర్మాగారానికి ఈ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం వరసగా రూ.1850 కోట్లు, రూ.1,400 కోట్లు కేటాయించింది. సింగరేణి కాలరీస్‌కు 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.2వేల కోట్లు కేటాయించినా, అంచనాల సవరణ నాటికి అందులో రూ.900 కోట్లకు కోతపడింది. చివరకు రూ.1,100 కోట్లకే పరిమితమైంది. విశాఖ ఉక్కు కేటాయింపులు యథాతథంగా ఉన్నాయి.

వినోదానికి ‘ఏకగవాక్షం’

ప్రధాన ఉపాధి కల్పన రంగాల్లో ఒకటైన వినోద పరిశ్రమను ప్రోత్సహించేందుకు తాజా బడ్జెట్‌లో కేంద్రం ఏకగవాక్ష పద్ధతిని ప్రకటించింది. సినిమా షూటింగ్‌లకు ఇప్పటిదాకా కేవలం విదేశీయులకు మాత్రమే పరిమితమైన ఏకగవాక్ష అనుమతుల విధానం ఇప్పుడిక భారత సినిమా తయారీదారులకు వర్తిస్తుంది. పైరసీని అరికట్టేందుకు సినిమాటోగ్రాఫ్‌ చట్టంలో మార్పులు చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది.

వీవీఐపీ విమానాల నిర్వహణ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం దేశంలోని అత్యంత ప్రముఖుల (వీవీఐపీ) ప్రయాణాలకు ఉద్దేశించిన ఎయిర్‌ ఇండియా విమానాల నిర్వహణ వ్యయం అంచనాను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. గత ఏడాది బడ్జెట్‌లో ఈ పద్దు కింద విదేశాంగ శాఖకు రూ.141 కోట్లు కేటాయించగా ఇప్పుడు దాన్ని రూ.420 కోట్లుగా సవరించింది. వీవీఐపీ విభాగంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ఉంటారు.

ఇతర అంశాలు..

- లోక్‌సభ ఎన్నికల కోసం రూ.వెయ్యికోట్లు, ఖర్చుల కోసం రూ.339.54 కోట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
- దేశంలోని మెట్రో రైల్‌ ప్రాజెక్టులన్నింటికీ కలిపి రూ.19,152 కోట్లు ఇస్తున్నట్లు ప్రస్తావించారు. ఆ పద్దు కింద విజయవాడ, విశాఖపట్నం మెట్రోలతో పాటు దిల్లీ, బెంగళూరు, చెన్నై తదితర ప్రాజెక్టులను చేర్చారు. ఇందులో వేటికెంత అన్నది స్పష్టం చేయలేదు. 2017 మెట్రో విధానం ప్రకారం ఏపీ ప్రభుత్వం విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల డీపీఆర్‌లే ఇంతవరకూ సమర్పించలేదు. కాబట్టి వాటికి ఈ బడ్జెట్‌లో నిధులు రావడం కష్టమే.
- హైదరాబాద్‌లోని ఆటమిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థకు రూ.319.39 కోట్లు కేటాయించారు.
- విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌కి రూ.131.12 కోట్లు, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌కు రూ.20కోట్లు కేటాయించారు.

రక్షణ శాఖ

ఈ దఫా రక్షణ శాఖ బడ్జెట్‌ 6.87 శాతం మేర పెరిగింది. తొలిసారిగా రూ.3 లక్షల కోట్లు దాటింది. ఈ పద్దు కింద గత ఏడాది బడ్జెట్‌లో సవరించిన అంచనాలు రూ.2.98 లక్షల కోట్లుగా ఉండగా.. ఈసారి కేటాయింపులు రూ.3.18 లక్షల కోట్లకు పెంచారు.
- రక్షణ బడ్జెట్‌ను తొలుత ‘ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో’ (పీఐబీ) రూ.3,05,296 కోట్లుగా పేర్కొంది. అయితే అది రూ.3,18,931 కోట్లుగా రక్షణ శాఖ ఆ తర్వాత తెలిపింది.
- తాజా కేటాయింపుల్లో కొత్త ఆయుధాలు, యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, ఇతర సైనిక హార్డ్‌వేర్‌ కొనుగోలుకు ఉద్దేశించిన పెట్టుబడి వ్యయం కోసం రూ.1,08,248 కోట్లు ప్రత్యేకించారు. గత ఏడాది ఈ పద్దు కింద రూ.93,982 కోట్లు కేటాయించారు.
- పింఛన్ల చెల్లింపు కోసం రూ.1,12,079 కోట్లను ప్రతిపాదించారు.
- పెట్టుబడి వ్యయం కింద సైన్యానికి రూ.29,447 కోట్లు, నౌకా దళానికి రూ.23,156 కోట్లు, వైమానిక దళానికి రూ.39,302 కోట్లు కేటాయించారు.
- వేతనాల చెల్లింపు, సైనిక వ్యవస్థల నిర్వహణ కోసం ఉద్దేశించిన రెవెన్యూ వ్యయాన్ని రూ.2,10,682 కోట్లుగా ఖరారు చేశారు. గత బడ్జెట్‌లో ఈ పద్దు కింద రూ.1,88,118 కోట్లు ఇచ్చారు.

హోం శాఖ

కేంద్ర హోంశాఖకు బడ్జెట్‌ కేటాయింపులు తొలిసారిగా రూ.లక్ష కోట్ల మార్కు దాటడం విశేషం. ఈ శాఖకు గత బడ్జెట్‌తో పోలిస్తే 2019-20 సంవత్సరంలో కేటాయింపులు 4.9 శాతం మేర పెంచి, రూ.1,03,927 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్‌లో హోంశాఖకు రూ.99,034 కోట్లు ఇచ్చారు.
- దిల్లీ పోలీసులకు రూ.7,496.91 కోట్లు.
- భారత్‌-పాక్, భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు మౌలిక వసతుల అభివృద్ధికి రూ.2వేల కోట్లు కేటాయింపు.
- సీఆర్పీఎఫ్‌కు రూ.23,742.04 కోట్లు ప్రతిపాదించారు. 2018-19 బడ్జెట్‌లో ఈ దళానికి రూ.22,646.63 కోట్లు ఇచ్చారు.
- భారత్‌ - పాక్, భారత్‌ - బంగ్లాదేశ్‌ సరిహద్దులను పరిరక్షించే బీఎస్‌ఎఫ్‌కు రూ.19,647.59 కోట్లు కేటాయించారు.
- సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్, సశస్త్ర సీమా బల్, అసోం రైఫిల్స్, జాతీయ భద్రతా దళంతో (ఎన్‌ఎస్‌జీ) కూడిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు రూ.71,618.70 కోట్లు ఇచ్చారు.
- పోలీసుల మౌలిక వసతులు, క్వార్టర్ల నిర్మాణం; వాహనాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి కొనుగోలుకు రూ.5117 కోట్లు కేటాయింపు.
- ‘నిర్భయ నిధి’ కింద మహిళల భద్రతా పథకానికి రూ.50 కోట్లు.

ఎస్సీ, ఎస్టీల సంక్షేమం..

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి నిధుల కేటాయింపును కేంద్రంగా భారీగా పెంచింది. 2018-19 బడ్జెట్‌ అంచనా(బీఈ)లో ఎస్సీల సంక్షేమం కోసం తొలుత రూ.56,619 కోట్లను కేటాయించారు. ఆ తరువాత సవరించిన అంచనా(ఆర్‌ఈ)ల్లో దీన్ని రూ.62,474 కోట్లకు పెంచారు. తాజాగా 2019-20 బడ్జెట్‌ అంచనాల్లో ఈ నిధులను రూ.76,801 కోట్లకు పెంచారు. అంటే 2018-19తో పోలిస్తే 35.6శాతం అధికంగా కేటాయించారు. ఇదేకాలావధికి ఎస్టీల సంక్షేమం కోసం కేటాయింపు ప్రతిపాదనలను సైతం 28శాతం పెంచారు. గతంలో రూ.39,135 కోట్లు ఉన్న నిధులను రూ.50,086 కోట్లకు పెంచారు.

కొత్త రైళ్లూ.. లైన్లు లేవు

కొత్త లైన్లూ, రైళ్ల జోలికి వెళ్లకుండా పాత ప్రాజెక్టులను పూర్తి చేయడానికే రైల్వే శాఖ ప్రాధాన్యం ఇచ్చింది. సౌకర్యాల కల్పనకూ పెద్ద పీట వేసింది. కేంద్రం ప్రకటించిన మధ్యంతర బడ్జెట్‌లోని రైల్వే కేటాయింపుల్లో దక్షిణ మధ్య రైల్వేకు సమకూరిన నిధుల వివరాలను ద.మ. రైల్వే అదనపు జనరల్‌ మేనేజర్‌ జాన్‌ థామస్‌ వెల్లడించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ద.మ. రైల్వే పరిధిలోని రైల్వే అభివృద్ధికి రూ.5,924 కోట్లు సమకూరాయన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రూ.172 కోట్లు అదనపు కేటాయింపులు జరిగాయన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసేలా నిధులు కేటాయించారని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి బడ్జెట్‌లో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రాధాన్యమిచ్చిందన్నారు. ఇప్పటికే ప్రకటించిన మార్గాల్లో కొత్త లైన్లు వేసేందుకు రూ.834 కోట్లు కేటాయించిందన్నారు. ఇప్పటికే ఉన్న మార్గాల్లో రెండో లైను వేయడానికి రూ.1,905 కోట్లు, రైల్వేపరంగా మౌలిక వసతుల కల్పనకు రూ.138 కోట్లు సమకూరాయని చెప్పారు. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడానికి రూ.229 కోట్లు కేటాయించారన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది రూ.120 కోట్లు అదనమని జాన్‌ థామస్‌ చెప్పారు.
కొంతమేర పూర్తయినవి
- ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని నడికుడి- శ్రీకాళహస్తి మార్గంలో కొత్త లైను వేయడానికి రూ.700 కోట్లు కేటాయించారు. 309 కిలోమీటర్ల ఈ లైను పనులను 2011-12లో ప్రారంభించారు. రూ,2,450 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 50 శాతం వ్యయాన్ని భరిస్తోంది. ఇప్పటి వరకు రూ.414 కోట్లు ఖర్చు చేశారు. పిడుగురాళ్ల- శావల్యపురం మధ్య 46 కిలోమీటర్ల మేర కొత్త లైను అందుబాటులోకి రానుంది.
- తెలంగాణలోని మనోహరాబాద్‌- కొత్తపల్లి కొత్తగా రైల్వే లైను నిర్మాణానికి ఈ బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. 150 కి.మీ. మేర కొత్త లైను నిర్మించేందుకు 2006-07లో ఆమోదం లభించింది. రూ.1,160 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు రూ.137 కోట్లను వెచ్చించారు. ఈ ప్రాజెక్టులో మొదటి దశ కింద మనోహరాబాద్‌- గజ్వేల్‌ మార్గంలో 32 కి.మీ. మేర కొత్త లైనును ఈ జూన్‌కల్లా పూర్తి చేయాలన్నది లక్ష్యం.
- తెలంగాణలోని మునిరాబాద్‌- మహబూబ్‌నగర్‌ మార్గంలో కొత్త లైను నిర్మాణానికి రూ.275 కోట్లు కేటాయించారు. మొత్తం 246 కి.మీ. రైల్వే నిర్మాణానికి 1997-98లో అమోదం లభించింది. రూ.645 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. ఈ మార్గంలో 66 కి.మీ. మార్గం తెలంగాణ పరిధిలోకి, మిగిలినది కర్ణాటక పరిధిలోకి వస్తుంది. దేవరకద్ర- జక్లైర్‌ మధ్య 29 కి.మీ.లైను నిర్మాణం పూర్తయింది. గత నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టు కింద రూ.508 కోట్లు వెచ్చించారు.
- ఎంఎంటీఎస్‌ రెండో దశ పొడిగింపులో భాగంగా ఘట్‌కేసర్‌- యాదాద్రి మధ్య 33 కిలోమీటర్ల మేర రైలు మార్గం నిర్మాణానికి రూ.20 కోట్లు కేటాయించారు. 2016-17లో మొత్తం రూ.412 కోట్ల అంచనాతో ఈ పనులను ఆమోదించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇతర కేటాయింపులు
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర పరిధిలోని బైపాస్‌ లైన్ల నిర్మాణానికి రూ.143 కోట్లు
- హైదరాబాద్‌కు సమీపంలోని చర్లపల్లిలో శాటిలైట్‌ టెర్మినల్‌ నిర్మాణానికి రూ.5 కోట్లు
- మౌలాలిలో రైల్వే ఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణానికి రూ.1.5 కోట్లు
- కాజీపేటలోని రైల్వే వర్క్‌షాపునకు రూ.10 కోట్లు
- కర్నూలులో మిడ్‌లైఫ్‌ రిహాబిలిటేషన్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి రూ.80 కోట్లు
- తిరుపతి రైల్వేస్టేషన్‌లో రెండోవైపు ప్రవేశమార్గానికి రూ.12.45 కోట్లు
- తిరుచానూర్‌ రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి రూ.6 కోట్లు
- మహారాష్ట్ర పరిధిలోని ముద్‌ఖేడ్‌- పర్బనీ మధ్య రెండో లైను నిర్మాణానికి రూ.34.50 కోట్లు
ముఖ్యమైన ప్రాజెక్టులవారీ కేటాయింపులు ఇలా..
- తెలంగాణలోని అక్కంపేట- మెదక్‌ మధ్య 17 కి.మీ. కొత్త మార్గం నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సగం వ్యయం భరిస్తోంది. గత నాలుగేళ్లలో రూ.89 కోట్లు ఖర్చు చేశారు.
- ఆంధ్రప్రదేశ్‌లోని ఓబులవారిపల్లె- కృష్ణపట్నం కొత్త లైను నిర్మాణానికి రూ.30 కోట్లు ఈ బడ్జెట్‌లో కేటాయించారు. 113 కిలోమీటర్ల ఈ లైను నిర్మాణానికి 2005-06లో ఆమోదం లభించింది. రూ.733 కోట్ల అంచనాతో ఈ పనులు చేపట్టారు. ఈ మార్గంలో వెంకటాచలం -ఓబులవారిపల్లె మధ్య 93 కిలోమీటర్ల మార్గాన్ని 2019-20 ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలన్నది లక్ష్యం.
- గుంటూరు- తెనాలి మార్గంలో 24 కిలోమీటర్ల రెండో లైను వేసేందుకు రూ.5 కోట్లు కేటాయింపు. నాలుగున్నరేళ్ల క్రితం మంజూరైన ఈ రెండో లైను నిర్మాణ పనులను రూ.197 కోట్లతో చేపట్టారు. ఇప్పటికే రూ.164 కోట్లను వెచ్చించి కొంతవరకూ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
ఏప్రిల్, మే నెలల్లో ఎంఎంటీఎస్‌ రెండో దశ
ఎంఎంటీఎస్‌ రెండో దశకు రైల్వే బడ్జెట్‌లో రూ.10 లక్షలు కేటాయించారు. 2012-13లో మంజూరైన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.817 కోట్లు. గత నాలుగేళ్లలో రూ.540 కోట్లు వెచ్చించారు. తెల్లాపూర్‌- రామచంద్రాపురం మధ్య 5.75 కిలోమీటర్లు, మౌలాలి- ఘట్‌కేసర్‌ మధ్య 12.5 కిలోమీటర్ల లైనును అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏప్రిల్, మే నెలల్లో ఎంఎంటీఎస్‌ రెండో దశ అందుబాటులోకి వస్తుందని జాన్‌ థామస్‌ తెలిపారు.
రైలు టికెట్లు యథాతథం..
కేంద్ర తాత్కాలిక బడ్జెట్‌లో రైల్వేశాఖకు పెద్దపీట లభించింది. ప్రయాణికుల టికెట్లు, సరకు రవాణా రుసుములను ఈసారి కూడా యథాతథంగా ఉంచారు. 2014 తర్వాత వీటిని పెంచలేదు. మునుపెన్నడూ లేని రీతిలో రూ.1.58 లక్షల కోట్లను మూలధన ఖర్చు రూపేణా ఈ శాఖకు కేటాయించారు. 2014తో పోలిస్తే ఈసారి ప్రతిపాదించిన ప్రణాళిక వ్యయం 148% ఎక్కువ. 2019-20 కోసం ‘బడ్జెట్‌ పరమైన మద్దతు’ కింద మరో రూ.64,587 కోట్లు కేటాయించారు. గత ఏడాది సాధారణ బడ్జెట్లో రైల్వేకు మూలధన ఖర్చు కింద రూ.1.48 లక్షల కోట్లు, బడ్జెట్‌ మద్దతు కింద రూ.55,088 కోట్లు కేటాయించారు. ఆర్థిక శాఖ బాధ్యతలను తాత్కాలికంగా నిర్వర్తిస్తున్న రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తన సొంత మంత్రిత్వశాఖకు చేసిన కేటాయింపులను బడ్జెట్లో వివరించారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు రైల్వేశాఖ సురక్షితంగా ఉందని, బ్రాడ్‌గేజ్‌ వ్యవస్థలో కాపలాదారుల్లేని అన్ని లెవెల్‌ క్రాసింగ్‌లను ఎత్తివేశామని చెప్పారు.

‘దేశీయంగా రూపొందించిన సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ మన ప్రయాణికులకు ప్రపంచశ్రేణి అనుభూతిని అందించబోతోంది. ఒక్కొక్కటి రూ.97 కోట్లు చొప్పున ఆరు ట్రైన్‌-18 లను (వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌) నూతన ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేయబోతున్నాం. పూర్తిగా మన ఇంజినీర్లే అభివృద్ధి చేసిన సాంకేతికతతో ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమానికి ఊతం లభించనుంది. ఇది అనేక ఉద్యోగాలనూ కల్పించనుంది’ అని వివరించారు. రైలు పెట్టెల తయారీకి కేటాయింపును 64% పెంచుతున్నట్లు ప్రకటించారు. వస్తున్న ఆదాయాన్ని తిరిగి రైల్వే వ్యవస్థ కోసమే ఖర్చు చేస్తున్నామని చెప్పారు. సిబ్బంది జీతభత్యాల రూపేణా ప్రస్తుత ఏడాది కంటే రూ.14,000 కోట్లు ఎక్కువగా ఖర్చు కానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు లక్ష మంది కొత్త ఉద్యోగులను తీసుకోనున్నారు. వారిపై రూ.4500 కోట్లు వ్యయమవుతుందని అంచనా.
ఇవీ ముఖ్యాంశాలు...
- 2019-20 ఆర్థిక సంవత్సరంలో రైల్వే స్థూల ఆదాయం: రూ.2,72,705.68 కోట్లు. (ఇది 18-19 సంవత్సర సవరించిన అంచనాల కంటే రూ.22,854.67 కోట్లు అధికం.)
- 2019-21 మధ్య ఉత్పత్తి కానున్న రైలు పెట్టెలు: 15,000
- 2019-20లో జీతాలు సహా రెవెన్యూ వ్యయం: రూ.85,800 కోట్లు
- నూతన మార్గాల నిర్మాణం: రూ.7255 కోట్లు
- గేజ్‌ మార్పిడి పనులు: రూ.2200 కోట్లు
- జంట మార్గాల (డబ్లింగ్‌) పనులు: రూ.700 కోట్లు.
- రైలు పెట్టెలు, బోగీలు వంటి రోలింగ్‌ స్టాక్‌కు: రూ.6114.82 కోట్లు
- సిగ్నల్‌-టెలికాం పనులు: రూ.1750 కోట్లు
- ప్రయాణికుల సదుపాయాలు: రూ.3422 కోట్లు.

కృత్రిమ మేధస్సు కేంద్రం

నూతన సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు ఫలాలను గ్రామీణులకు సైతం చేరువ చేయడానికి, నియంత్రించడానికి జాతీయ కృత్రిమ మేధస్సు కేంద్రాన్ని కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వచ్చే అయిదేళ్లలో లక్ష గ్రామాలను డిజిటల్‌ గ్రామాలుగా అభివృద్ధి పరచనుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే మూడు లక్షల ఉమ్మడి సేవా కేంద్రాల(సీఎస్‌ఎస్‌) ద్వారా 12లక్షల మంది డిజిటల్‌ సేవలందిస్తున్నారు. వీరంతా గ్రామాలకు మౌలిక డిజిటల్‌ సేవలు అందించడం ద్వారా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామాలకు చేరువచేయడానికి కృషి చేస్తారు.
శాస్త్ర, సాంకేతిక రంగాలు..
సైన్స్‌ వ్యవహారాలకు సంబంధించిన రెండు ముఖ్య శాఖలైన భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వశాఖ; శాస్త్ర, సాంకేతిక శాఖకు తాజా బడ్జెట్‌లో ఒక మోస్తరు స్థాయిలో కేటాయింపులను పెంచారు. ఈ రెండింటికీ కలిపి రూ.14,697 కోట్లను ప్రతిపాదించారు.
- భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వంటి కీలక సంస్థలు కలిగిన భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వశాఖకు రూ.1,901 కోట్లు దక్కాయి. గత బడ్జెట్‌లో ఇది రూ.1800 కోట్లుగా ఉంది. కొత్త రాడార్లు, ఆటోమేటిక్‌ వాతావరణ కేంద్రాలు, వాతావరణ పరిశోధనల నిర్వహణ కోసం విమానాన్ని కొనుగోలు చేయడానికి, సముద్ర గర్భంలో మైనింగ్‌పై పరిశోధన చేయడానికి సబ్‌మెర్సిబుల్‌ నౌకను సమకూర్చుకోవడానికి ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు.
- శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖలో బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ); శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల విభాగం (డీఎస్‌టీ); శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌) అంతర్భాగంగా ఉన్నాయి. ఈ మూడింటికీ కలిపి 70కిపైగా పరిశోధన సంస్థలు ఉన్నాయి.

విద్యారంగానికి రూ.93,847 కోట్లు

విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో రూ.93,847.64 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం కేటాయించిన రూ.85,010 కోట్లతో పోలిస్తే ఇది 10% ఎక్కువ. ప్రస్తుత కేటాయింపుల్లో పాఠశాల విద్యకు రూ.56,386.63 కోట్లు, ఉన్నత విద్యకు రూ.37,461.01 కోట్ల నిధులను నిర్దేశించారు.
- ‘2022 నాటికి విద్యావిధానం, మౌలిక వసతులను పునరుత్తేజితం’ చేసే దిశగా ఒక పథకాన్ని ప్రతిపాదించారు. రానున్న నాలుగేళ్లలో ఈ పథకం కోసం రూ.లక్ష కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. విద్యా, వైద్య రంగాల్లో ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పరిశోధన, మౌలిక వసతుల పెట్టుబడులకు ఈ నిధులను వ్యయం చేస్తారు.
- పరిశోధన, ఆవిష్కరణలకు తాజాగా కేంద్రం 608.87 కోట్లు కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి కేటాయింపు గణనీయంగా పెరిగింది. నిరుడు ఈ రంగానికి రూ.350 కోట్లు కేటాయించారు.
- రెండు పూర్తిస్థాయి స్కూల్స్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌లను (స్పా) ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్నట్లు గోయల్‌ చెప్పారు.
- దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థలుగా అదనంగా 18 ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ స్కూళ్లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రతిపాదనలను సమర్పించాల్సిందిగా ఆయా సంస్థల డైరెక్టర్లను, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను కోరినట్లు కేంద్రమంత్రి తెలిపారు.
- పాఠశాలల్లో విద్య నాణ్యతను పెంచేందుకు నిర్దేశించిన ఆపరేషన్‌ డిజిటల్‌ బోర్డ్‌ కార్యక్రమ విధివిధానాలను రూపొందించేందుకు ఉన్నత విద్యాశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని మంత్రి ప్రకటించారు.

ఐఐటీ, ఐఐఎం, ఐసర్‌ల నిధుల్లో కోత

దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఐఐఎంలు, ఐసర్‌లు.. చట్టబద్ధ సంస్థలైన యూజీసీ, ఏఐసీటీఈల కేటాయింపుల్లో కేంద్రం కోత విధించింది. 2019 నుంచి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తున్న నేపథ్యంలో అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో 25% సీట్లు పెంచనున్నారు. ఈ క్రమంలో నిధుల కేటాయింపులు తగ్గడం గమనార్హం. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లకు (ఐఐఎం) తాజాగా 415.41 కోట్లు కేటాయించారు. గత ఏడాది కేటాయింపులు రూ.1,036 తో పోలిస్తే ఇది 59.9% తక్కువ. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీలకు (ఐఐటీ) ఈసారి 6,223 కోట్లు కేటాయించారు. కిందటి ఏడాది ఇచ్చిన నిధులు రూ.6,326 కోట్లు. గత సంవత్సరం కూడా అంతకుముందు ఏడాదితో పోలిస్తే నిధుల్లో కోత విధించడం గమనార్హం.

దార్శనిక పత్రం 2030

ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా అభివృద్ధిచెందుతున్న మన దేశం వచ్చే అయిదేళ్లలో రూ.360 లక్షల కోట్ల (5 ట్రిలియన్‌ డాలర్‌) స్థాయికి చేరుకోనుందని తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఇందుకు అవసరమైన పూర్వరంగాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సిద్ధం చేసిందని అన్నారు. ఈ లక్ష్య సాధనకు అవరోధాలుగా ఉన్న అనేక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందని బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే, మన దేశానికి ఇంతకుమించిన శక్తిసామర్థ్యాలు ఉన్నాయని, వచ్చే దశాబ్దానికి (2030) రూ.720 లక్షల కోట్ల (10 ట్రిలియన్‌ డాలర్‌) స్థాయికి మన ఆర్థిక వ్యవస్థ చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఈ లక్ష్య సాధన కోసం పది కీలకాంశాలతో కూడిన దశ దిశల దార్శనిక పత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. తన ప్రసంగంలో పీయూష్‌ గోయల్‌ వాటిని వివరించారు.
1: ‘‘ప్రజల జీవన ప్రమాణాలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు, రూ.720 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను రూపొందించేందుకు అవసరమైన భౌతిక, సామాజిక మౌలిక వసతుల కల్పన ఈ దార్శనిక పత్రంలోని తొలి అంశం. అత్యాధునికమైన రహదారులు, రైల్వేమార్గాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, పట్టణ రవాణా వ్యవస్థలు, సహజవాయువు, విద్యుత్తు సరఫరాలు, అంతర్గత జలమార్గాల ఏర్పాటు వంటివి దీనిలో భాగం. ఇక సామాజిక మౌలిక వసతులు.... ప్రతి కుటుంబం ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన, స్వచ్ఛమైన పరిసరాలను కలిగి ఉండేలా ఉంటాయి. అత్యున్నతమైన విద్యాసంస్థల ద్వారా ఉన్నతమైన నాయకత్వాన్ని అందించేలా నాణ్యమైన, విజ్ఞాన ఆధారిత విద్యావ్యవస్థను రూపొందిస్తాం.
2: దేశంలోని మారుమూలలకూ, ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగానికీ చేరుకొనేలా, ప్రతి పౌరుడి జీవితాన్ని ప్రభావితం చేసేలా డిజిటల్‌ ఇండియాను తీర్చిదిద్దటం. ఇటీవలి సంవత్సరాల్లో ప్రైవేటు, ప్రభుత్వ లావాదేవీలు డిజిటలీకరణ చేయటంలో సాధించిన విజయాల ఆధారంగా 2030నాటికి డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను, డిజిటల్‌ మౌలిక వసతులను నిర్మిస్తాం. మన యువత ప్రారంభిస్తున్న అసంఖ్యాక అంకుర సంస్థలు, వారు సృష్టిస్తున్న లక్షల ఉద్యోగాలు మనల్ని ఈ గమ్యం దిశగా నడిపిస్తాయి.
3: భూమాతను సతత హరితంగా మలచుకోవటం, భారత్‌ను కాలుష్యరహిత దేశంగా తీర్చిదిద్దుకోవటం. విద్యుత్తు వాహనాలు, పునరుత్పాదక ఇంధనాల భారీ వినియోగం. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, ప్రజలకు ఇంధన భద్రత కల్పిస్తూ... విద్యుత్తు నిల్వ ఉపకరణాలు, విద్యుత్తు వాహనాల వినియోగంలో విప్లవాత్మక విధానాలను అందిపుచ్చుకోవటంలో ప్రపంచానికి మన దేశం మార్గ నిర్దేశం చేస్తుంది.
4: ఆధునిక డిజిటల్‌ సాంకేతికతల దన్నుతో గ్రామీణ పారిశ్రామికీకరణను విస్తరింపజేస్తూ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించటం. మేకిన్‌ ఇండియా చూపిన మార్గంలో దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ అంకుర సంస్థలను ప్రోత్సహించటం, మధ్య, చిన్నతరహా పరిశ్రమలను స్థాపించటం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకుంటాం.
5: నదులు, జలాశయాలే మన జీవనాధారం. గంగా నది శుద్ధికి ప్రభుత్వం ఎంతో కృషిచేస్తోంది. 2030కల్లా పరిశుద్ధమైన నదులు, దేశ ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి తీసుకురావటం, సాగు రంగంలో సమర్థ నీటియాజమాన్య పద్ధతులు అనుసరించేలా చేయటం.
6: సుదీర్ఘమైన సముద్రతీరం దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. తీర ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సముద్ర సంపదను మనం పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. సాగరమాల కార్యక్రమాన్ని వేగవంతం చేయటంతో పాటు ఇతర జలమార్గాలనూ సత్వరమే అభివృద్ధి చేసుకోవటం.
7: మన అంతరిక్ష కార్యక్రమాన్ని మరింతగా విస్తరించుకోవటం. ఉపగ్రహాల ప్రయోగాలకు మన దేశం ప్రపంచ దేశాలకూ వేదికగా మారింది. ఇదే క్రమంలో 2022 నాటికి మన దేశ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపించడం.
8: సేంద్రియ విధానాల్లో ఆహారోత్పత్తిని పెంచటం, ఈ రంగంలో స్వయంసమృద్ధిని సాధించటం. ప్రపంచ దేశాల ప్రజల అవసరాలు తీర్చేలా ఆహారోత్పత్తులను ఎగుమతి చేయటం. వ్యవసాయంలో అత్యాధునిక విధానాలు అనుసరించటం, అధికోత్పత్తిని సాధించటం, అదనపు విలువలు జోడించటం.. దీనిలో భాగంగానే ఆహారశుద్ధి, నిల్వ, ప్యాకింగ్, గొలుసుకట్టు విధానంలో శీతల గోదాముల నిర్మాణం తదితరాలపై దృష్టిసారించటం.
9: ఆరోగ్య భారత్‌ నిర్మాణంలో భాగంగా ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించటం. దీనికి అవసరమైన మౌలిక వసతులు సమకూర్చటం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. 2030కల్లా ఆరోగ్య సంరక్షణకు సమగ్ర వ్యవస్థలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావటం. మహిళలకు సాధికారత, సమాన హక్కులు, పూర్తిస్థాయిలో భద్రత కల్పించటంతో పాటు వారిని సంపూర్ణ భాగస్వాములను చేయటం ద్వారా ఆరోగ్యకరమైన దేశ నిర్మాణం.
10: ‘కనిష్ఠ ప్రభుత్వం...గరిష్ఠ పాలన’ అందించేలా దేశాన్ని మలచుకోవటానికి ప్రజా ప్రభుత్వాలతో కలసికట్టుగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందరి కృషితోనే లక్ష్యాలను సాధించుకోగలం. 2030కల్లా ప్రజల పట్ల స్నేహ పూర్వకంగా, బాధ్యతాయుతంగా, సానుకూల దృక్పథంతో స్పందించే అధికారయంత్రాంగాన్ని దేశంకలిగి ఉండాలి.
సమగ్రమైన ఈ పది అంశాల దార్శనికతతో... పేదరికం, పౌష్టికాహార లోపం, నిరక్షరాస్యత, అపరిశుభ్రతలు వంటివి గతించిపోయిన సమస్యలు అవ్వాలి. భారతదేశం అంటే అత్యాధునిక, సాంకేతికాధారిత, భారీ అభివృద్ధి, పారదర్శకమైన సమాజం కలిగిన దేశంగా గుర్తింపు పొందాలి’’.

ఉపసంహరణ లక్ష్యం రూ.90,000 కోట్లు

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో (సీపీఎస్‌ఈ) వాటాల విక్రయం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.90,000 కోట్లు సమీకరించాలని తాత్కాలిక బడ్జెట్‌లో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.80,000 కోట్ల లక్ష్యాన్ని నిర్ణయించుకున్నా, ఇప్పటివరకు రూ.35,100 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. మిగిలిన రూ.44,000 కోట్లు వచ్చే రెండు నెలల్లో సమీకరించగలమనే విశ్వాసాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. ప్రజాధనంతో నడుస్తున్న సీపీఎస్‌ఈలు మరింత జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రస్తుతం 57 సీపీఎస్‌ఈలు స్టాక్‌మార్కెట్లో నమోదై ఉన్నాయి. వీటి మొత్తం మార్కెట్‌ విలువ రూ.13 లక్షల కోట్లుగా ఉంది. 2017-18లో కొన్ని సంస్థల్లో వాటాల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు పైగా సమీకరించగలగడం గమనార్హం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలº
- ఆర్‌ఐటీఈఎస్‌ (రూ.460 కోట్లు), ఇర్‌కాన్‌ ఇంటర్నేషనల్‌ (రూ.470 కోట్లు), గార్డెన్‌రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ (రూ.345 కోట్లు) సంస్థలు తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చాయి.
- సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ మూడోవిడత కింద రూ.17,000 కోట్లు, భారత్‌ 22 ఈటీఎఫ్‌పై రూ.8,300 కోట్లు సమీకరించారు.
- భెల్‌ (రూ.1628 కోట్లు), కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ (రూ.200 కోట్లు), నాల్కో (రూ.505 కోట్లు), ఎన్‌ఎల్‌సీ (రూ.1250 కోట్లు), కేఐఓసీఎల్‌ (రూ.214 కోట్లు) షేర్లను తిరిగి కొనుగోలు చేశాయి.

ఎంఎస్‌ఎంఈలకు..

వచ్చే ఆర్థిక సంవత్సరానికి సూక్ష్మ, చిన్న, మధ్య, తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) మంత్రిత్వ శాఖకు రూ.7,011.29 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. గతంలో ఎన్నడూ కూడా ఎంఎస్‌ఎంఈ శాఖకు ఈ స్థాయిలో కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. అలాగే ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ వ్యయ అంచనాలను రూ.6,552.61 కోట్లుగా సవరించారు. ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన పథకానికి (పీఎంఈజీపీ) కూడా రికార్డు స్థాయిలో రూ.2,327 కోట్లను కేటాయించారు

క్రీడలకు అదనంగా రూ.214.20 కోట్లు

కేంద్ర బడ్జెట్‌లో క్రీడలకు కేటాయింపులు పెరిగాయి. ఈ మధ్యంతర బడ్జెట్‌లో క్రీడలకు రూ.2216.92 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి రూ.214.20 కోట్లు అదనంగా నిధులు అందించారు. 2018-19 బడ్జెట్‌లో క్రీడలకు రూ.2002.72 కోట్లు ఇచ్చారు.

రాష్ట్రీయం (టీఎస్‌)

తాజా బడ్జెట్‌లో తెలంగాణ, ఏపీ గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ.8 కోట్లను కేటాయించారు. ఇందులో తెలంగాణకు రూ.4 కోట్లు వస్తాయి. 2018-19లో రెండు రాష్ట్రాలకు రూ.20 కోట్లను కేటాయించిన కేంద్రం అందులో రూ.కోటిని ఏపీలో వెచ్చించింది. తెలంగాణలో ఒక్కరూపాయీ ఖర్చు చేయలేదు.
కేంద్ర, భాగస్వామ్య సంస్థలకు..
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచే సింగరేణి సంస్థకు 2018-19లో మొదట్లో రూ.2000 కోట్లను కేటాయించగా.. సవరణ బడ్జెట్‌లో దానిని రూ.1100 కోట్లకు తగ్గించారు. తాజా బడ్జెట్‌లో రూ.1850 కోట్లు కేటాయించారు.
- హైదరాబాద్‌ ఐఐటీకి కేటాయించిన నిధులు రూ.80 కోట్లు.
- హైదరాబాద్‌లోని అణు ఖనిజ అన్వేషణ, పరిశోధన సంచాలయానికి (ఏఎండీఈఆర్‌) 319.32 కోట్లను కేటాయించింది. 2018-19లో అది రూ.310.22 కోట్లు కేటాయించి సవరణ బడ్జెట్‌లో దాన్ని రూ.306.92 కోట్లకు తగ్గించింది.
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ.20 వేల కోట్లు
కేంద్ర పన్నుల్లో వాటా కింద తెలంగాణకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.20,583.05 కోట్లు రానున్నాయి. గతేడాది కంటే ఇది రూ.1,978 కోట్లు అధికం. అంటే 10% ఎక్కువ. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర పన్నుల్లో 2.437% మొత్తాన్ని కేంద్రం తెలంగాణకు ఇస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం రాష్ట్రానికి రూ.17,960.01 కోట్లు రావాల్సి ఉండగా, సవరించిన అంచనాల నాటికి ఆ మొత్తం రూ.18,560.88 కోట్లకు పెరిగింది. అంటే తొలి అంచనాల కంటే రూ.600 కోట్లు అధికంగా వచ్చింది. కార్పొరేట్, సీజీఎస్‌టీ, ఆదాయ పన్ను రూపంలో కేంద్రం నుంచి అధిక మొత్తంలో వాటా రాష్ట్రానికి దక్కుతోంది.
కేంద్రం నుంచి రాష్ట్రానికి అందేది 30 శాతమే
బడ్జెట్‌లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధుల పెంపుదల నామమాత్రంగా ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, వైద్యం-ఆరోగ్యం, విద్య, సాగునీరు, తాగునీరు వంటి కీలక కార్యక్రమాలకు రాష్ట్ర అంచనాలకు కేంద్రం ఇస్తున్న నిధులు మూడో వంతు కూడా అందుబాటులోకి రావడంలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాలకు రూ.29 వేల కోట్లకు పైగా అందుతుందని భావించినా డిసెంబరు నాటికి అందుబాటులోకి వచ్చిన నిధులు రూ.6 వేల కోట్లు మాత్రమే. ఏటా రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్న గ్రాంటుల్లో 30 శాతం నిధులకు మించి అందడంలేదు.
- రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కింద గ్రామీణ ఆరోగ్య పథకం, మాతా శిశు సంరక్షణకు సగటున ఏడాదికి రూ.1000 కోట్లను కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. కేంద్రం ఇవ్వాల్సిన 60 శాతం నిధుల్లో కోత పడుతోంది.
- స్మార్ట్‌ నగరాలుగా ఎంపికైన వరంగల్, కరీంనగర్‌లలో వరంగల్‌కు మాత్రమే నిధులు అందుబాటులోకి వచ్చాయి.
- అమృత్‌ కింద తెలంగాణలో 12 నగరాలు, పట్టణాలు ఎంపిక కాగా 11చోట్ల ఈనిధులను తాగునీటి పథకాలకు అనుసంధానం చేశారు. సిద్దిపేటలో మురుగునీటి కాలువల నిర్మాణానికి అమృత్‌ను వర్తింపచేస్తున్నారు.
- ఈఏడాది అక్టోబరు 2నాటికి దేశవ్యాప్తంగా 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యం కాగా స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద నిధుల కేటాయింపు భారీగా తగ్గింది.
- ఉపాధి హామీకి గత ఏడాది కంటే రూ.వెయ్యి కోట్లు తగ్గాయి. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజనలో గతేడాది కేటాయింపులే కొనసాగాయి.
తెలంగాణ రైతులకు రూ.2,824 కోట్లు
అయిదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు బ్యాంకు ఖాతాకు ఏటా రూ.6 వేలు జమ చేస్తామని కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించడంతో తెలంగాణ రైతులకు రూ.2,824.59 కోట్లు వస్తాయని రాష్ట్ర వ్యవసాయశాఖ అంచనా వేసింది. కేంద్రం ఇచ్చే రూ.6 వేలను మూడు దఫాలుగా రూ.రెండేసి వేల చొప్పున రైతు ఖాతాలో జమ చేస్తుంది. మొదటి విడతలో రూ.2 వేల చొప్పున మొత్తం 47.08 లక్షల మంది రైతులకు రూ.941.53 కోట్లు జమ కానున్నాయి. ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్‌లో రైతు బంధు పథకం కింద 52 లక్షల మంది రైతులను అర్హులుగా రాష్ట్ర వ్యవసాయశాఖ గుర్తించింది. వీరిలో అయిదెకరాల్లోపు భూమి ఉన్నవారు 47.08 లక్షల మంది అని తేలింది. వీరందరి బ్యాంకు ఖాతాలకు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.6 వేల చొప్పున జమ చేస్తే రూ.2,824.59 కోట్లు రాష్ట్ర రైతులకు వస్తాయని లెక్కగట్టింది.

 

Posted on 02.02.2019