Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

కేంద్ర ఆర్థిక సర్వే 2015 - 16

ప్రవేశ పెట్టిన తేదీ: 26-02-2016
'ఆర్థిక సర్వే 2015-16'ను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. వివిధ రంగాల గురించి కూలంకషంగా చర్చించి, విశ్లేషించిన ఈ సర్వే ఆయా రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలను వివరించింది. జీడీపీ వృద్ధిరేటు 8% నుంచి 10 శాతానికి చేరేందుకుగాను మార్కెట్ వ్యతిరేక విధానాలకు దూరంగా జరగాలని, ఆరోగ్యం, విద్య రంగాల్లో పెట్టుబడులు ఎక్కువగా ఉండాలని, వ్యవసాయరంగంపై మరింత దృష్టి సారించాలని సూచించింది. అలాగే పన్ను - జీడీపీ నిష్పత్తిని పెంచాలంది. వస్తు సేవల పన్నును వేగవంతంగా అమలు చేయాలని సూచించింది.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వాతావరణం నిరాశాజనకంగా ఉన్నా, భారత్ మాత్రం సుస్థిర ప్రదేశమని ఆర్థిక సర్వే అభివర్ణించింది. 2015-16లో జీడీపీ వృద్ధి 7.6 శాతమని, 2016-17 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 7-7.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
అంతర్జాతీయ డిమాండ్ మందగమనంలో ఉండటంతో కొన్ని ఒడుదొడుకులు రావచ్చని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు కారణంగా రూ.1.02 లక్షల కోట్లు భరించాల్సి రావడం, బ్యాంకుల్లో పెట్టుబడుల సాయానికి మరో రూ.1.8 లక్షల కోట్లు భరించాల్సిన నేపథ్యంలో ద్రవ్యలోటు లక్ష్యాలను సమీక్షించుకోవాలని సూచించింది.
సంపన్నులు, ప్రైవేటు రంగానికి లబ్ధి చేకూర్చే పన్ను మినహాయింపు విధానాన్ని దశలవారీగా ఎత్తివేయాలని, ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వ్యక్తులకు హేతుబద్ధమైన పన్ను విధానం ఉండాలని సూచించింది. వ్యక్తులకు పన్ను మినహాయింపు పరిమితిని పెంచవద్దని కోరింది. 'ఆకర్షణీయ నగరాలకు ఆకర్షణీయంగా ఉండేలా ప్రభుత్వ ఆర్థిక సాయం అవసరం. భారత పట్టణ రంగ భవిష్యత్తుకు ఆస్తిపన్ను విధానం మెరుగ్గా ఉండాలి' అని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది.
సంఘటితరంగ ఉద్యోగాలు మరిన్ని పెరగాల్సిన అవసరం ఉందని, ఆయా సంస్థలు కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకునేలా చేస్తున్న నియంత్రణ అంశాలను పరిష్కరించాలని సూచించింది. ఈపీఎఫ్ లాంటి నియంత్రణల వల్ల సంఘటితరంగ ఉద్యోగుల నియామకానికి అవరోధంగా మారుతోందని విశ్లేషించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలని తెలిపింది.
ఎరువుల రంగంలో విస్తృత సంస్కరణలు తీసుకురావాలని ఆర్థిక సర్వే తెలిపింది. 'రైతులకు యూరియాపై స్థిర రాయితీని నేరుగా చెల్లించడం ద్వారా యూరియా మార్కెట్‌పై నియంత్రణ, దిగుమతులపై ఆంక్షలు ఎత్తివేయాలి. రైతులకు రాయితీపై ఇచ్చే ఎరువుల సంచులపై పరిమితి విధించాలి. బయోమెట్రిక్ గుర్తింపు విధానాన్ని తీసుకురావాలి' అని సూచించింది.
సంపన్నులకు పన్ను రాయితీనివ్వడాన్ని విమర్శిస్తూ ప్రధాని మోదీ చేసిన వాదనకు ఆర్థిక సర్వే నుంచి మద్దతు లభించింది. రూ.లక్ష కోట్ల రాయితీలు సంపన్నులకే వెళ్తున్నాయని, మరింత మెరుగైన ఆర్థిక సంక్షేమ నిర్వహణకు ఆ రాయితీలకు కోత పెట్టాలని సూచించింది.
రాయితీపై ఇచ్చే వంట గ్యాస్ సిలిండర్లను ఏడాదికి పదికి తగ్గించాలని ఆర్థిక సర్వే తెలిపింది. ప్రస్తుతం రాయితీపై 12 సిలిండర్లు ఇస్తున్నారు. 12 సిలిండర్లపైన ఎన్ని సిలిండర్లు కావాలన్నా మార్కెట్ ధరకు కొనుక్కోవాల్సిందే.
గత ఏడాది వాతావరణంలో విపరీత మార్పులకు కారణమైన ఎల్‌నినో ఈసారి ప్రభావం చూపించకపోవచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. తీవ్ర ఎల్‌నినో తర్వాత తీవ్ర లానినో రావచ్చని, అయితే లానినో ప్రభావం చూపించి భారత్‌లో వర్షాలు పడేసరికి అదనుకాలం దాటిపోవచ్చని అంచనా వేసింది. వర్షాకాలానికి తగ్గ ప్రణాళికలతో ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని, ఖరీఫ్ విత్తనాలు వేయడానికి చాలా ముందుగానే కనీస మద్దతు ధరలను ప్రకటించాలని, దిగుబడులు పెరిగేలా రైతులను ప్రోత్సహించాలని సూచించింది. కొరత ఏర్పడే అవకాశమున్న వ్యవసాయోత్పత్తుల దిగుమతులకు సకాలంలో ఏర్పాట్లు చేసుకోవాలంది.
'వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయరాదు. రైతులకు సుస్థిర జీవనోపాధి లభించేలా, ప్రజలందరికీ ఆహార భద్రత లభించేలా ఈ రంగంలో మార్పులు రావాలి. వ్యవసాయంలో ప్రతి పనికి మెరుగైన యంత్రాలను ప్రవేశపెట్టాలి. ఇందుకు భారత్ చేయాల్సింది చాలా ఉంది. సాగునీటి వసతులను మెరుగుపర్చడానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇతర ఉపాధి పథకాల నిధులను ఉపయోగించాలి. విత్తనాల మార్కెట్‌లో పోటీ మరింత పెరిగితే విత్తనాల నాణ్యత పెరుగుతుంది. ధరలు తగ్గుతాయి. ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో విత్తనాభివృద్ధి పరిజ్ఞానాలను ప్రోత్సహించాలి' అని ఆర్థిక సర్వే పేర్కొంది.
సంప్రదాయ బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం వల్ల 21,500 మెగావాట్ల మేర విద్యుత్తు డిమాండ్ తగ్గనుంది. రూ.45 వేల కోట్లకు పైగా ఆదా కానుంది. వార్షికంగా 109 బిలియన్ యూనిట్లు ఆదా అవుతాయి. అంతేకాదు వార్షికంగా 85 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం ద్వారా వాతావరణ మార్పులను నియంత్రించడానికి వీలవుతుంది. ఈ విషయాన్ని ఆర్థిక సర్వే వెల్లడించింది. ఇళ్లలో 77 కోట్ల సంప్రదాయ బల్బుల స్థానంలో, 3.5 కోట్ల వీధి దీపాల స్థానంలో 2019, మార్చికి ఎల్ఈడీ బల్బులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ ఏడాది జనవరి నాటికి ఇళ్లకు 4.77 కోట్లు, వీధి దీపాల కింద 5.51 లక్షల ఎల్ఈడీ దీపాలను పంపిణీ చేసింది.
ముఖ్యాంశాలు-ఆర్థిక సర్వే విశ్లేషణ

ద్రవ్యోల్బణం:
     వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5% - 5% మధ్య నమోదు కావచ్చని అంచనా. అంతర్జాతీయ కమొడిటీ ధరల్లో క్షీణత కొనసాగుతుండటానికి తోడు సాధారణ వర్షపాతం కురుస్తుందన్న అంచనాలు కూడా ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని తగ్గించవచ్చు. మరో ఏడాదిపాటు సామర్థ్యం కంటే తక్కువ వృద్ధి నమోదు కావొచ్చన్న అంచనాలు సైతం ద్రవ్యోల్బణాన్ని మరింత కిందకు తీసుకువచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే రిటైల్ ద్రవ్యోల్బణం 2016-17లో 4.5 శాతం నుంచి 5 శాతంగా నమోదు కావచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సైతం జనవరి 2016 కల్లా ద్రవ్యోల్బణం 6%కి చేరుతుందని; 2016-17లో 5% లోపునకు పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ద్రవ్యలోటు:
     ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యమైన 3.9 శాతాన్ని ప్రభుత్వం చేరగలదు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో ద్రవ్యలోటు లక్ష్యం (3.5%) సాధించడం మాత్రం సవాలుతో కూడిన అంశమే. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో మందగమనం; ఏడో వేతన సంఘం సిఫార్సులు ఇందుకు కారణం కావొచ్చని అంటున్నారు. వేతన సంఘం సిఫారసులు అమలు; ఒకే హోదా ఒకే పింఛను పథకం కారణంగా ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది. ఈ భారాన్ని తగ్గించుకోవాలంటే పన్ను విధానాలను మెరుగుపర్చి కొత్త వనరుల ద్వారా మరింత ఆదాయాన్ని పొందాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలల్లో పరోక్ష పన్నుల వసూళ్లను చూస్తే బడ్జెట్ అంచనాలను సాధించే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఎఫ్‌డీఐ:
     2015 ఏప్రిల్-నవంబరులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 31% పెరిగి 24.8 బిలియన్ డాలర్ల (రూ.1.68 లక్షల కోట్లు)కు చేరాయని ఆర్థిక సర్వే తెలిపింది. కిందటి ఏడాది ఇదే సమయంలో ఎఫ్‌డీఐ 18.9 బిలియన్ డాలర్లు (రూ.1.22 లక్షల కోట్లు)గా ఉంది. స్వేచ్ఛా, సరళీకృత ఎఫ్‌డీఐ విధానాలు; సులువుగా వ్యాపారం చేసుకునే వాతావరణాన్ని దేశంలో సృష్టించడం కోసం ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టిందని సర్వే కితాబునిచ్చింది. ఏప్రిల్-నవంబరులో వచ్చిన ఎఫ్‌డీఐల్లో దాదాపు 60% సింగపూర్, మారిషస్ లాంటి చిన్న దేశాల నుంచి వచ్చినవే. 2014లో ప్రవేశపెట్టిన 'భారత్‌లో తయారీ' వల్ల అక్టోబరు 14 - జూన్ 15 మధ్య 40% మేర ఎఫ్‌డీఐలు పెరిగాయి.
అంకుర సంస్థలు:
     దేశంలో టెక్నాలజీ ఆధారిత అంకుర సంస్థలు (స్టార్టప్‌లు) 19,400కు చేరాయి. ఈ విషయంలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచింది. 5000 సంస్థలు ఒక్క 2015లోనే ప్రారంభమై, 85,000 వరకు ఉద్యోగాలు కల్పించాయి. వీటిల్లో పెట్టుబడి పెట్టినవారు ఉపసంహరించుకోవాలంటే తక్కువ విలువే లభిస్తోంది. 2014 తొలి 6 నెలల్లో ఇవి 3.5 బిలియన్ డాలర్ల (రూ.28,800 కోట్లు) నిధులు పొందాయి. 2014లో 220 మంది పెట్టుబడిదారులే ఉండగా, 2015లో వీరి సంఖ్య 490కి పెరిగింది. 2010 నుంచి ఇప్పటివరకు 2,000 అంకుర సంస్థలకు వెంచర్ క్యాపిటల్/ఏంజెల్ ఇన్వెస్టర్ల నిధులు లభిస్తే, 2015 లోనే 1,005 సంస్థలకు అందాయి. రూ.6,800 కోట్ల విలువ సాధించిన సంస్థల్లో 8 భారత్‌వే.
సేవల రంగం:
     విదేశీ మారక ద్రవ్యార్జనలో, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఆకర్షణలో, ఉద్యోగాల కల్పనలో, వాణిజ్యంలో సేవారంగమే కీలకంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థలకు అతి ముఖ్యమైన వనరుగా మారింది. ఏడాదికేడాది వార్షిక వృద్ధి (సీఏజీఆర్)లోనూ చైనాను అధిగమిస్తోంది. సేవల రంగం ఎగుమతులు 2001లో 16.8 బిలియన్ డాలర్లు కాగా, 2014 నాటికి 155.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. జీడీపీలో 7.5% వాటా పొందడమే కాక, సేవల ఎగుమతుల్లో ప్రపంచంలో దేశానికి 8వ స్థానం సాధించింది. ప్రసార మాధ్యమాలు, వినోద సేవల రంగం గత రెండు దశాబ్దాల్లో దేశీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందింది.
బ్యాంకులకు మరింత మూలధనం:
     ప్రభుత్వరంగ బ్యాంకు (పీఎస్‌బీ)లను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొన్ని ఆస్తులను విక్రయించొచ్చని ఆర్థిక సర్వే సూచించింది. అయితే ఆర్థికేతర ఆస్తులను మాత్రమే అమ్మాలని తెలిపింది. 'ఇంద్రధనుష్' కింద రూ.70,000 కోట్ల మూలధనాన్ని బ్యాంకుల్లోకి ప్రవహింపజేయనున్నట్లు గతేడాది ప్రభుత్వం ప్రకటించింది. బాసెల్-3 నిబంధనలను పాటించడానికి అదనంగా రూ.1.1 లక్షల కోట్లను బ్యాంకులు సమీకరించాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.25,000 కోట్లు; వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ అంతే మొత్తం; ఆ తర్వాతి వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.10,000 కోట్లు చొప్పున పీఎస్‌బీలు పొందుతాయి.
స్వల్ప కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అత్యంత కీలక సవాలు... బ్యాంకులు, కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్ల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులేనని సర్వే పేర్కొంది. ప్రైవేటు పెట్టుబడులకు ఇవి విఘాతం కలిగిస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో కోలుకోకుండా చేస్తున్నాయని అభిప్రాయపడింది. పై సమస్యను తీర్చడానికి నాలుగు ఆర్‌లు అవసరమని సర్వే తెలిపింది. అవి... గుర్తింపు (రికగ్నిషన్); మళ్లీ మూలధనం ఇవ్వడం (రీక్యాపిటలైజేషన్); తీర్మానం (రిసొల్యూషన్); సంస్కరణ (రిఫామ్).
స్థిరాస్తి రంగంలోకి రూ.68,000 కోట్ల పెట్టుబడులు:
     ఆదాయం, ఉద్యోగావకాశాలు కల్పించే స్థిరాస్తి రంగం ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. గత ఏడేళ్లలోనే అత్యధికంగా 2015 నుంచి స్థిరాస్తి రంగంలోకి రూ.68,000 కోట్ల (10 బిలియన్ డాలర్ల) పెట్టుబడులు దేశ, విదేశీ పెట్టుబడిదార్ల నుంచి వచ్చాయి. నిధులు అధికంగా రావడంవల్లే, స్థిరాస్తి ధరలు అధికంగా ఉంటున్నాయి. ఇందులో అత్యధికం రుణమే కనుక, ఇళ్ల అమ్మకాల్లో స్తబ్దత కొనసాగితే, రీఫైనాన్సింగ్ నష్టభయం అధికమే. అధిక ధరల వల్ల కొనుగోళ్లు తగ్గి, అమ్ముడుకాని ఇళ్లపై పెట్టిన పెట్టుబడుల విలువ ఒక్కసారిగా పెరిగేందుకు కారణమైంది.
మౌలికానికి అధిక ప్రాధాన్యం:
     అధిక వృద్ధిరేటు సాధించేందుకు మౌలిక సదుపాయాలు తప్పనిసరి కావడంతో, ప్రభుత్వం ఈ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రభుత్వ విధానాల్లో మార్పుల వల్ల ఎఫ్‌డీఐలు పెరిగి, మౌలిక రంగం మెరుగుపడుతోంది. 'భారత్‌లో తయారీ' కూడా ఉపకరిస్తోంది. ప్రభుత్వం అధిక పెట్టుబడులు పెడుతున్నందున, ప్రైవేటు రంగం కూడా ముందుకొస్తోంది. 2013-14తో పోలిస్తే, 2014-15లో విద్యుత్తు, రోడ్లు, రైల్వేలు, విమానయానం, నౌకాశ్రయాలు, టెలికాం రంగాలు రాణించాయి. విద్యుదుత్పత్తి 4.4% పెరిగి 3030 మెగావాట్లు అదనంగా గ్రిడ్‌కు అనుసంధానమైంది. సౌర, పవన విద్యుత్తు రంగాల నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్తు 38,820 మెగావాట్లకు పెరిగింది.
మౌలిక రంగానికి ఇచ్చిన రుణాల్లో ఒత్తిడికి గురవుతున్నవి 2015 మార్చిలో 22.9% కాగా, జూన్‌కి 24%కి పెరగడం ఆందోళనకరం. పౌర విమానయాన రంగంలో 58.9% నుంచి 61%కి పెరిగాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాల్లో 24.2% గనులు, ఇనుము-ఉక్కు, జౌళి, మౌలిక, విమానయాన రంగాలకే చేరాయి. ఒత్తిడికి గురవుతున్న మొత్తం రుణాల్లో వీటి వాటా 53%.
ఎగుమతులు పుంజుకుంటాయి
     డిసెంబరు 2014 నుంచి తగ్గుతూ వస్తోన్న ఎగుమతులు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పుంజుకుంటాయని ఆర్థిక సర్వే అంచనా వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కమోడిటీ ధరలు తక్కువ స్థాయిలో కొనసాగుతుండటంతో వాణిజ్యం కూడా కింది స్థాయిలో నమోదవుతుంది. దీంతో కరెంట్ ఖాతా లోటు పరిమితంగానే ఉండనుంది. ప్రస్తుతానికి మాత్రం ఎగుమతుల్లో మందగమనం కొనసాగనుంది. చైనా వృద్ధిపై ఆందోళనలు కాస్తా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడంతో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే భారత మూలాలు బలంగా ఉండటంతో మన విదేశీ వాణిజ్యం కూడా బలంగానే కొనసాగొచ్చు. ఏప్రిల్-జనవరి 2015-16లో ఎగుమతులు 17.65% క్షీణించి 217.67 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.14 లక్షల కోట్లు)కు చేరుకొన్నాయి. కిందటి ఏడాది ఇదే సమయంలో ఇవి 264.32 బిలియన్ డాలర్లు (రూ.17.18 లక్షల కోట్లు)గా ఉన్నాయి. ప్రధాన ఎగుమతి రంగాలైన ఇంజినీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాభరణాలు, జౌళీ, రసాయనాలు, వ్యవసాయం సరైన వృద్ధిరేటును నమోదు చేయలేకపోవడంతో ఎగమతులు కుంగాయి. రూపాయి మారక విలువ 2014-15లో 1% క్షీణించినప్పటికీ ఇతర కరెన్సీలతో పోలిస్తే బలంగా మారనుండటం సానుకూలాంశం.
మొబైల్ చెల్లింపులు, 4జీతో అందరికీ బ్యాంకింగ్:
     మొబైల్‌తో చెల్లింపులకు సాంకేతికతకు అనుగుణంగా అవకాశాలు పెరగడానికి తోడు 4జీ సేవల ప్రవేశంతో అందరికీ బ్యాంకింగ్ సేవలు అందించడం సులభమవుతుంది. సామాజిక సంక్షేమ పథకాలను మరింత సురక్షితంగా, వేగంగా, ప్రజలకు సౌకర్యం కలిగేలా అమలు చేయవచ్చు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్ వల్ల ఈ పథకాలు పారదర్శకంగా మారతాయి. ప్రభుత్వ సేవలను మొబైల్‌పై అందించే తీరునే 4జీ మార్చేస్తుంది. వీటికి సేవల ద్వారా టెలికాం రంగం వృద్ధిచెందుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టెలీకమ్యూనికేషన్లలో వచ్చిన మార్పు సామాజిక ఆర్థికాభివృద్ధికి కీలకంగా మారడం ప్రోత్సాహకర మార్పే. మొబైల్ కనెక్షన్లు భారీగా పెరుగుతున్నందున, టెలీ సాంద్రత (ప్రతి 100 మందికి మొబైల్/టెలిఫోన్ కలిగినవారు) 8.15%కి చేరింది. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు కూడా 12.1 కోట్లకు చేరాయి.
మొబైల్ సేవల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం తరచూ స్పెక్ట్రమ్‌ను వేలం ద్వారా విక్రయిస్తోంది. 2015-16లో 2జీ, 3జీ, 4జీ సేవలకు ఉపయోగపడే 470.75 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌కు వేలం నిర్వహించి, 418.05 మెగాహెర్ట్జ్ ను కేటాయించింది కూడా. ఇందులో 67.8% చెల్లింపుల ద్వారానే ఖజానాకు ఇప్పటికే రూ.1,09,874.91 కోట్లు సమకూరాయి. భారత్ నెట్ కింద 2.5 లక్షల పంచాయతీలకు అత్యధిక వేగం బ్రాడ్‌బ్యాండ్ అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 1.03 లక్షల కిలో మీటర్ల పొడవునా పైపులు, 74,994 కి.మీ. మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేసి, 32,049 పంచాయతీలను అనుసంధానించారు. లక్ష పంచాయతీలను ఈ ఏడాది చివరి నాటికి అనుసంధానించాలన్నది ప్రభుత్వ తాజా ప్రణాళిక.
ఇతర ముఖ్యాంశాలు
2015-16లో పారిశ్రామిక వృద్ధి 7.3%, తయారీరంగ వృద్ధి 9.5%, సేవారంగ వృద్ధి 9.2 శాతంగా నమోదు కావొచ్చు.
ప్రత్యక్ష నగదు బదిలీ వల్ల గ్యాస్ సిలిండర్ రాయితీ (సబ్సిడీ) వ్యయంలో 24% ఆదా.
చమురు ధరల క్షీణతతో 2015-16లో సబ్సిడీ వ్యయాలు జీడీపీలో 2% లోపే ఉన్నాయి.
ద్రవ్య స్థిరీకరణకు రాయితీలను హేతుబద్ధీకరించాలి.
ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా ధరలు మరింత స్థిరీకరణ కావాలి.
2015-16 ఏప్రిల్-సెప్టెంబరులో 1.4 శాతంగా ఉన్న కరెంటు ఖాతా లోటు (సీఏడీ), 2016-17లో 1 శాతం నుంచి 1.5 శాతం మధ్య ఉండొచ్చు.
రూపాయి మారకం విలువలో ఎలాంటి మార్పూ లేదు. బలపడేందుకు ప్రత్యేకంగా చర్యలు అనవసరం.
చైనా తరహాలోనే కరెన్సీ విలువలో సర్దుబాట్లు చేసేందుకు భారత్ సిద్ధంగా ఉండాలి.
2018-19 నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీలు)కు రూ.1.8 లక్షల కోట్ల మూలధనం అవసరం.
పీఎస్‌బీలకు బడ్జెట్ కేటాయింపుల ద్వారా రూ.70,000 కోట్లను అందించాలని నిర్ణయం.
ప్రభుత్వ ఎగుమతుల మందగమనం ఇంకొంతకాలం కొనసాగొచ్చు.
కార్పొరేట్ రంగానికి ఇచ్చిన మొండిబకాయిలను విక్రయించాలి/ పునర్‌వ్యవస్థీకరించాలి.
2015-16 ఏప్రిల్-జనవరిలో వాణిజ్య లోటు 11,960 కోట్ల డాలర్ల నుంచి తగ్గి 10,680 కోట్ల డాలర్లకు పరిమితమైంది.
పన్ను మినహాయింపులను దశలవారీగా ఎత్తేయాలి.
ఆస్తి పన్ను విధానాన్ని తక్షణం సమీక్షించాల్సిన అవసరం ఉంది.
స్థిరాస్తి, వ్యవసాయ ఆదాయంపై సహేతుక పన్ను విధానాలను తీసుకొని రావాలి.
ఆస్తి పన్ను రేటు అధికంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు పెరుగుతాయి.
మౌలిక రంగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వ పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉంది.