Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Economic Survey 2016 - 17

భారత ఆర్థిక సర్వే 2016 - 17

* కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జనవరి 31న ఆర్థిక సర్వే 2016-17ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆధ్వర్యంలోని బృందం దీన్ని రూపొందించింది.
      - బడ్జెట్ సమర్పణకు ముందు రోజున ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టడం సంప్రదాయంగా వస్తోంది. అందుకు అనుగుణంగా ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు.
ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు
* 2017 - 18లో స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.75- 7.5 శాతం.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.5 శాతం.
* నోట్ల రద్దు కారణంగా ఆర్థిక ప్రగతి 0.25 - 0.5 శాతం మేర తగ్గింది. అయితే దీర్ఘకాలంలో ప్రయోజనాలుంటాయి.
* వస్తుసేవల పన్ను (జీఎస్టీ), ఇతర వ్యవస్థాగత సంస్కరణల కారణంగా వృద్ధి రేటు 8 - 10 శాతం మధ్య ఉంటుంది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగ ప్రగతి 4.1 శాతం ఉంది. అంతకు ముందు ఏడాదిలో ఇది 1.2 శాతం మాత్రమే.
* 2016 - 17లో సేవారంగం వృద్ధి 8.9 శాతం ఉంటుంది.
* పారిశ్రామిక ప్రగతి గతేడాది 7.4 శాతం ఉండగా ప్రస్తుతం 5.2 శాతం ఉంది.
* పేదరిక నిర్మూలనకు ప్రస్తుతం ఇస్తున్న అనేక రాయితీలకు ప్రత్యామ్నాయంగా సార్వజనీన కనీస ఆదాయ పథకం (యూనివర్సల్ బేసిక్ ఇన్‌కం - యూబీఐ పథకం) పరిశీలన. వివిధ రూపాల్లో అందించే రాయితీలు, ఒకవేళ నిరుద్యోగ భృతి లాంటివి ఇవ్వాలంటే అవి నేరుగా లబ్ధిదారులకు బదలాయించడానికి వీలు కల్పించడం ఈ పథకం ఉద్దేశం. ఫిన్లాండ్ లాంటి కొన్ని దేశాల్లో యూబీఐను ఇప్పటికే అమలు పరుస్తున్నారు.
* స్థిరాస్తి రంగంలో ధరలు తగ్గడంతో మధ్యతరగతి వారికి ఇళ్లు అందుబాటులో ఉంటాయి.
* జనాభాలో వైవిధ్యం కారణంగా కలిగే ప్రయోజనాలు వచ్చే ఐదేళ్లలో గరిష్ఠ స్థాయిలో ఉంటాయి.
* ఏకాంతంగా ఉండే హక్కు మహిళకు ప్రాథమికమైంది. స్వచ్ఛ భారత్‌ను ఆ హక్కు అమలులో భాగంగానే చూడాలి.
* సామాజిక పరంగా చేపట్టే ఏ మార్పులైనా, ఆచరించే ఏ కొత్త ఆలోచనైనా దీర్ఘకాలంగా ఉన్న మూడు అతిపెద్ద సమస్యలను ఎదుర్కోవడానికేనని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. 1) సంపద పంపిణీలో అసమర్థత 2) ప్రయివేటు రంగం, ఆస్తి హక్కులపై ఉన్న ద్వంద్వ వైఖరి 3) దేశ సామర్థ్యాన్ని పెంచడం... వీటి పరిష్కారం పైనే దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యమైన 5 శాతం కంటే తక్కువగానే నమోదు కావొచ్చని ఆర్థిక సర్వే అంచనా కట్టింది.
* ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొండి బకాయిల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ (పబ్లిక్ సెక్టార్ రీహాబిలిటేషన్ ఏజెన్సీ - పారా)ను ఏర్పాటు చేయాలని ఆర్థిక సర్వే సూచించింది. దాదాపు 13 ప్రభుత్వ బ్యాంకుల్లో మొత్తం రుణాల్లో కనీసం 40 శాతం రుణాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని, అందులో 20 శాతం పైగా మొండి బకాయిలు (ఎన్‌పీఏలు)గా ఉన్నాయని సర్వే వివరించింది. అటు బ్యాంకింగ్, ఇటు కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్ల (టీబీఎస్) సమస్యకూ పారానే పరిష్కారం చూపించగలదని భావిస్తున్నట్లు సర్వే అభిప్రాయపడింది.
* సర్వే అంచనా ప్రకారం భారత్ ప్రగతికి కొన్ని అవరోధాలు ఎదురుకానున్నాయి. ప్రభుత్వరంగ కంపెనీలను ప్రైవేటుపరం చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో పౌర విమానయానం, బ్యాంకింగ్, ఎరువుల రంగాల్లో మరింత ప్రయివేటీకరణ అవసరమని సర్వే అభిప్రాయపడింది. ఆరోగ్యం, విద్య లాంటి సేవలను అందించడంలో సామర్థ్యం తక్కువగా ఉండటం, అవినీతి, కఠిననిబంధనలు, రెడ్ టేపిజం లాంటివి అధిక స్థాయిల్లో ఉండటం కూడా వృద్ధికి ఆటంకాలేనని పేర్కొంది.
* ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ సంస్కరణల వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐలు) ఆకర్షణీయ గమ్య స్థానంగా భారత్ మారింది. మునుపెన్నడూ లేని విధంగా దేశంలోకి ఎఫ్‌డీఐలు గణనీయ స్థాయిలో పెరిగాయి. రక్షణ, రైల్వే, నిర్మాణం, ఔషధం సహా పలు రంగాల్లో ఎఫ్‌డీఐ విధానాలను ప్రభుత్వం సరళీకరించింది. అలాగే వ్యాపారానుకూల దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే ఉద్దేశంతో మేకిన్ ఇండియా, ఇన్వెస్ట్ ఇండియా, స్టార్టప్ ఇండియా పేరుతో పలు కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. 2015-16లో నికర ఎఫ్‌డీఐలు జీడీపీలో 1.7 శాతం ఉండగా 2016-17 రెండో త్రైమాసికం నాటికి ఇవి జీడీపీలో 3.2 శాతానికి పెరిగాయి.
* పెద్ద నోట్ల రద్దు కాకుండా అంతర్జాతీయంగా చమురు ధరల రూపంలోనూ భారత్ వృద్ధికి సవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. చమురు ధరలు పెరిగితే వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. 2016-17 స్థాయితో పోలిస్తే చమురు ధరలు సుమారు 15 శాతానికి పైగా పెరగొచ్చని అంచనా. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకోవు. అంచనాలకు మించి కూడా పెరిగే అవకాశమూ ఉంది.
* దేశంలో పశువుల సంఖ్య అధికంగానే ఉన్నా వధశాలల్లో వాటి అందుబాటు చాలా పరిమితం. దీంతో తోళ్ల పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఫలితంగా పాదరక్షల పరిశ్రమలో మన దేశం నుంచి ఎగుమతుల వాటా తక్కువగా ఉంది. 2008లో పశువుల తోళ్లు, చర్మం ఎగుమతుల్లో ప్రపంచంలో మన దేశ వాటా 0.4 శాతం ఉండగా, 2013లో కేవలం 0.1% శాతానికి పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా పశువుల జనాభాలో 1991లో మన దేశం వాటా 15.8 శాతం కాగా 2013లో 12.8కి తగ్గింది.
* చైనా, అమెరికా, బ్రిటన్‌లతో పోలిస్తే శిలాజ ఇంధనాలపై భారత్ తక్కువగానే ఆధారపడుతోంది. అయితే, వాటి వినియోగాన్ని మరింతగా తగ్గించుకోవడం ద్వారా వాతావరణ మార్పుల నియంత్రణలో మన దేశం కీలక పాత్ర పోషించాలి. 2014 జూన్ నుంచి అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుండగా పెట్రోలు, డీజిలుపై ఎక్సైజ్ సుంకాలను భారత్ క్రమంగా పెంచింది. 2016 డిసెంబరు కల్లా దేశంలో పెట్రోలుపై పన్ను రెట్టింపు కన్నా ఎక్కువైంది. తద్వారా శిలాజ ఇంధనాల వినియోగం తగ్గుదలకు ప్రభుత్వం కృషి చేసింది.
భారతావని అష్టావతారం
* మన దేశానికి సంబంధించి ఆర్థిక సర్వే 8 ఆసక్తికర అంశాలను బయటపెట్టింది. వివక్షపూరిత దృష్టి కోణం దగ్గర నుంచి ఆర్థిక అంతరాల వరకు భారత్‌కు సంబంధించిన వివిధ సునిశిత అంశాల్ని సర్వే స్పృశించింది.
1. భారతీయులు ప్రయాణం కట్టారు!
దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసవెళ్లే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రైలు ప్రయాణీకుల రద్దీ గణాంకాల ఆధారంగా వేసిన అంచనాలు దీన్ని రుజువుచేస్తున్నాయి. పనుల సంబంధ వలసలు ఏటా 90 లక్షల వరకు ఉంటున్నాయి. 2011 జనాభా లెక్కల్లో చెప్పిన దానికన్నా ఈ సంఖ్య దాదాపు రెట్టింపు. అయితే 2013-14తో పోలిస్తే 2015-16 నాటికి ఇది కాస్త తగ్గింది.

2. వివక్షాపూరిత దృక్కోణం
వివిధ రేటింగ్‌ సంస్థలు మన దేశాన్ని ఒకలాగా, పొరుగుదేశం చైనాను మరోలా చూస్తున్నాయి. రుణాలు, వృద్ధిరేటుకు సంబంధించి అవి వేసిన అంచనాలు, కడుతున్న రేటింగ్‌ వాటి వివక్షాపూరిత దృక్కోణాన్ని బయటపెడుతోంది. చైనా స్థూలదేశీయోత్పత్తి(జీడీపీ)లో అప్పులు నానాటికీ పెరిగిపోయి.. వృద్ధిరేటు తగ్గిపోతున్నా... ఆ దేశం క్రెడిట్‌ రేటింగ్‌ను ఏ(ప్లస్‌) నుంచి ఏఏ(మైనస్‌)కు 2010 డిసెంబరులో రేటింగ్‌ సంస్థలు పెంచేశాయి. భారత్‌ను మాత్రం 2009 నుంచి 2015 దాకా బీబీబీ(మైనస్‌) స్థాయిలోనే మార్చకుండా ఉంచాయి. చైనా జీడీపీలో అప్పుల వాటా 142 శాతం నుంచి 205 శాతానికి పెరిగింది. వృద్ధిరేటు తగ్గిపోయింది. భారత్‌లో జీడీపీలో అప్పుల వాటా స్థిరంగా ఉంది. వృద్ధిరేటు 2012 నుంచి పెరుగుతూ వచ్చి.. 2015-16లో కాస్తంత తగ్గింది. ఈ కింది గ్రాఫ్‌లు ఈ విషయాల్ని సూచిస్తున్నాయి..

3. సామాజిక కార్యక్రమాల గురి తప్పింది!
కేటాయింపుల్లో దేశంలోని వివిధ జిల్లాల మధ్య అసమతౌల్యం కొనసాగుతోంది. పేదల సంఖ్య ఎక్కువగా ఉండే జిల్లాల్లో సామాజిక కార్యక్రమాలపై వెచ్చించే మొత్తాలు నానాటికీ గణనీయంగా తగ్గిపోతున్నాయి. బాగా వెనుకబడిన 40 శాతం జిల్లాలు కేవలం 29 శాతం నిధుల్నే పొందుతున్నాయి. పైనున్న రెండు మ్యాప్‌లలో మొదటి మ్యాప్‌లోని ఎరుపు రంగు దేశంలోని బాగా వెనుకబడిన జిల్లాల్ని, రెండో మ్యాప్‌లోని ఎరుపురంగు నిధుల కేటాయింపులు గణనీయంగా తగ్గిపోయాయనే విషయాన్ని సూచిస్తోంది.

4. వాణిజ్యంలో చైనాను మించిపోయాం:

2011 నాటికి జీడీపీలో మనదేశ వాణిజ్యం వాటా చైనాను మించిపోయింది. అంతకుముందు దాకా పెరుగుదలలో ఉన్న చైనా వాణిజ్యంలో తిరోగమనం మొదలైంది. వృద్ధిరేటు పెరుగుదలకు వాణిజ్యాన్నే ఇంధనంగా వాడుకునే చైనాకు ఇది చేదు కబురే. ఈ విషయంలో ఇప్పటికీ మనదే పైచేయిగా ఉంది. జీడీపీలో దేశీయ వాణిజ్యం వాటా కూడా ఇతరదేశాలకు ఏ మాత్రం తీసిపోమన్న విషయాన్ని ఈ కింది చిత్రమే రుజువుచేస్తోంది.

5. ఆర్థిక ప్రజాస్వామ్యమేదీ?
దేశంలో రాజకీయ ప్రజాస్వామ్యం పుష్కలంగా ఉంది. కానీ ఆర్థికపరమైన ప్రజాస్వామ్యం లేదనే విషయాన్ని ఆర్థికసర్వే కళ్లకు కట్టింది. దేశంలో అతికొద్ది మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు. ప్రతి 100 మంది ఓటర్లలో ఏడుగురు మాత్రమే పన్ను కడుతున్నారు. ఈ విషయంలో జీ-20లోని 18 ప్రజాస్వామ్య దేశాల్లో మన ర్యాంకు 13.

6. విలక్షణ జన సంఖ్యాశాస్త్రం
భారత్‌లో జనాభాకు, ఇతర దేశాల్లోని జనాభాకు వైవిధ్యం ఉంది. మన దేశంలో పనిచేసే వయసున్న వారు ఎక్కువ. వృద్ధాప్యంతో పనిచేయలేకుండా ఆగిపోయే వారు తక్కువ. దీనివల్ల వృద్ధిరేటు అధికంగా ఉంటుంది. కానీ ఇతర దేశాల్లో పనిచేయకుండా.. ఎక్కువకాలం జీవించే వృద్ధులు అధిక శాతం ఉంటారు.
7. దేశంలో ఆర్థిక అంతరం
దేశంలో ఆర్థిక అంతరాలు(2004-14 మధ్య కాలం) నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. మిగతా దేశాలు ఆఖరికి చైనాతో పోల్చుకున్నా.. ఈ సమస్య ఇక్కడ ఎక్కువ. దేశంలో ప్రజల మధ్య ఎలాంటి హద్దుల్లేకుండా ఎవరు ఎటైనా వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ... ఈ భేదం కొనసాగుతోంది.
8. ఆస్తిపన్ను వసూలు చాలా తక్కువ
ఆస్తిపన్ను వసూలు స్థానిక పాలన నిర్వహణకు అత్యంత ఆవశ్యకం. కానీ ఇక్కడ వసూలవుతున్న ఆస్తిపన్ను చాలా తక్కువ. బెంగుళూరు, జైపూర్‌లలో వాస్తవానికి వసూలుకావాల్సిన దానిలో కేవలం 5-20 శాతం మధ్యే పన్ను వసూలవుతున్నట్లు ఉపగ్రహ ఛాయాచిత్ర గణాంకాలు తెలియజేస్తున్నాయి.

- సీహెచ్. కృష్ణప్రసాద్‌