Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Economic Survey 2017 - 18

కేంద్ర ఆర్థిక స‌ర్వే 2017 - 18

* ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ నేతృత్వంలో సిద్ధమైన ఈ సర్వేను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వృద్ధి అంచనాలు బాగున్నప్పటికీ.. కొన్ని సవాళ్లు ఎదురుకావొచ్చని సర్వే హెచ్చరించింది. ముఖ్యంగా పెరుగుతున్న ముడి చమురు ధరల నుంచి సవాలు ఎదురుకావొచ్చని చెబుతోంది. నిధులకు కొరత ఉన్నా విద్య, ఆరోగ్య రంగాలకు ఎనలేని ప్రాధాన్యం లభిస్తోందని తెలిపింది.
ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు
* ప్రస్తుత ఏడాది జీడీపీ వృద్ధిరేటు 6.75 శాతంగా నమోదు కానుంది. కేంద్ర గణక కార్యాలయం అంచనా వేసిన 6.5 శాతం కంటే ఇది ఎక్కువే. వచ్చే ఏడాది ఎగుమతులు, పెట్టుబడులు తిరిగి పుంజుకోనున్నాయి. 2016-17లో7.1%, అంతక్రితం ఏడాది 8%, 2014-15లో 7.5 శాతం చొప్పున వృద్ధి నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిపై జీఎస్‌టీ, పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడింది.
* వచ్చే ఆర్థిక సంవత్సరం (2018-19) భారత ఆర్థిక వృద్ధి 7-7.5 శాతం నమోదు కావొచ్చు.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ముడి చమురు ఎగుమతులు 14 శాతం మేర పెరగవచ్చు. 2018-19లో మరో 10-15 శాతం మేర పెరిగే అవకాశాలు ఉండొచ్చు. దీనివల్ల జీడీపీపై 0.2-0.3 శాతం; ద్రవ్యోల్బణంపై 0.2-0.3 శాతం మేర ప్రభావం పడే అవకాశం ఉంది. అదే సమయంలో పీపా ముడి చమురు ధర 10 డాలర్లు పెరిగితే కరెంట్‌ ఖాతా లోటు మరింత పెరిగే అవకాశం ఉంది.
* మగపిల్లాడు పుట్టేవరకు పిల్లల్ని కంటూ ఉండే సంప్రదాయం చాలామందిలో ఉంది. దీనివల్ల సహజంగానే ‘అవాంఛిత’ ఆడపిల్లల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటివారు దాదాపు 2.10 కోట్ల మంది ఉంటారు.
* ఆరుబయట మల విసర్జన అలవాటు నుంచి 8 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు పూర్తిగా బయటపడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో మరుగు అవసరాల కోసం ఆరుబయలు స్థలాలకు వెళ్లేవారు 2014 అక్టోబరులో 55 కోట్లు ఉంటే ఇప్పుడు 25 కోట్లకు తగ్గారు.
* పురుషులంతా పట్టణాలకు వలస వెళ్తుండడంతో వ్యవసాయం చేయాల్సిన బాధ్యత మహిళలపై పడింది. వారు కూడా రైతులు, కార్మికులు తదితర పాత్రలను సమర్థంగా పోషిస్తున్నారు.
* భారతీయుల ఆరోగ్య స్థితిగతులు గణనీయంగా మెరుగుపడ్డాయి. 1990 నుంచి 2015 మధ్య కాలంలో జీవన కాలం దాదాపు పదేళ్లు పెరగడమే దీనికి నిదర్శనం.
* కేసుల కారణంగా విద్యుత్తు, రైల్వేలు, రహదారుల మంత్రిత్వ శాఖలు చేపడుతున్న పనులు ఆగిపోతున్నాయి. ఇలాంటి కేసుల విలువ దాదాపు రూ.52 వేల కోట్లుగా ఉంది.
* దేశంలో నీటి కొరత పెరుగుతోంది.. చైనా, అమెరికాలకన్నా రెట్టింపు స్థాయిలో భూగర్భ జలాలు తోడేస్తుండటంతో గత 30ఏళ్లలో 13% తగ్గిపోయాయి.
* వర్షాకాలంలో అత్యంత వేడిగా ఉండే రోజులు 4.8% నుంచి 6.5% పెరిగాయి. మరోవైపు చల్లగా ఉండే రోజులు 7 నుంచి 3 శాతానికి తగ్గాయి.
* జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది 6.75%, 2018-19లో 7-7.5% మధ్య ఉండొచ్చు. దీంతో అత్యంత వేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ తన ప్రాభవాన్ని కొనసాగిస్తుంది.
* చమురు ధరలపై ఆందోళన కొనసాగవచ్చు. వినియోగదార్ల నుంచి గిరాకీ పెరగవచ్చు.
* అంతర్జాతీయ ముడి చమురు ధరలు 10 డాలర్లు పెరిగితే జీడీపీ 0.2-0.3% తగ్గవచ్చు.
* ఈ ఏడాది తయారీ రంగం 8 శాతం వృద్ధి రేటును నమోదు చేయవచ్చు.
* వచ్చే ఏడాది ఉద్యోగాలు, వ్యవసాయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జీఎస్‌టీని స్థిరపరచాలి. బ్యాంకులకు మూలధన పునర్నిర్మాణ ప్రణాళికను పూర్తి చేయాలి.
* వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఈ ఏడాది 2.1 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది.
* పెద్ద నోట్ల రద్దు అనంతరం, జీఎస్‌టీ అమలు నేపథ్యంలో 18 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదార్లు జతచేరారు. పరోక్ష పన్ను చెల్లింపుదార్ల సంఖ్య 50 శాతం పెరిగింది.
* దివాలా చట్టాన్ని సమర్థంగా అమలు చేయడంవల్ల ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయి.
* పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక పొదుపునకు ప్రోత్సాహం లభించింది.
* దివాలా స్మృతి వల్ల మొండి బకాయిల సమస్యల పరిష్కారానికి ఒక సాధనం లభించింది.
* రిటైల్‌ ద్రవ్యోల్బణం గత ఆరు ఆర్థిక సంవత్సరాల్లోనే అతి తక్కువగా ఈ సారి(2017-18) సగటున 3.3 శాతంగా నమోదు కావొచ్చు.
* సంస్కరణల నేపథ్యంలో 2017-18లో సేవల రంగంలో ఎఫ్‌డీఐ 15 శాతం పెరిగింది.
* కార్మిక చట్టాలను మెరుగ్గా తీసుకురావడానికి సాంకేతికతను ఉపయోగించుకోవాలి.

10 అంశాలు కొత్త కొత్తగా..
1. ప్రత్యక్ష, పరోక్ష పన్ను చెల్లింపుదార్ల సంఖ్య పెరిగింది. పరోక్ష పన్ను చెల్లింపుదార్ల సంఖ్య 50 శాతం పెరిగింది. ఏప్రిల్‌-నవంబరు 2017లో ప్రత్యక్ష పన్నులు 13.7%; పరోక్ష పన్నులు 18.3 శాతం వృద్ధి రేటును నమోదు చేసిన నేపథ్యంలో మొత్తం మీద ఇవి లక్ష్యాలను చేరేలా కనిపిస్తున్నాయి.
2. వ్యవసాయేతర ఉద్యోగాలు అంచనాల కంటే ఎక్కువగా ఉన్నాయి.
3. భారత చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్రాలకు చెందిన అంతర్జాతీయ ఎగుమతుల గణాంకాలను ఆర్థిక సర్వేలో పొందుపరచారు. ఈ గణాంకాలు ఎగుమతుల పనితీరుకు, రాష్ట్రాల జీవన ప్రమాణాలకు మధ్య గట్టి అనుబంధాన్ని సూచిస్తున్నాయి.
4. రెండు మూడేళ్ల పాటు ప్రతికూలంగా కనిపించిన ఎగుమతుల వృద్ధి రేటు 2016-17లో సానుకూలంగా మారింది. 2017-18లో మరింత వేగంగా పరుగులు తీస్తుంది.
5. దుస్తులకిచ్చిన ప్రోత్సాహక ప్యాకేజీ రెడీమేడ్‌ దుస్తుల ఎగుమతులకు ఊతమిచ్చింది.
6. భారత్‌లో తల్లిదండ్రులు కుమారులు పుట్టేంతవరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా కుమారులు పుట్టాలనే బలమైన కోరిక కనిపిస్తూనే ఉంది. దీని వల్ల గర్భవిచ్ఛిత్తులు(అబార్షన్లు) ఉంటూనే ఉన్నాయి. దీని వల్ల 6.3 కోట్ల మంది మహిళలు ‘కనుమరుగవుతున్నా’రని అంచనా.
7. న్యాయ వ్యవస్థలో అధిక పనిభారం వల్ల ఆలస్యాలు, వాయిదాలు ఎక్కువగా ఉంటున్నాయి. పన్ను వివాదాల్లోనూ ప్రతి దశలోనూ వివిధ ప్రక్రియల (ఇంజెంక్షన్లు, స్టేలు) కారణంగా తీర్పులు ఆలస్యమవుతూనే ఉన్నాయి.
8. వృద్ధికి ఊతమివ్వడానికి పొదుపు చేయడం కంటే పెట్టుబడులు చాలా ముఖ్యం. పొదుపులో వృద్ధి వల్ల ఆర్థిక వృద్ధి కనిపించదు.. కానీ పెట్టుబడులు ఆ పనిని చేయగలవని సర్వే పేర్కొంది.
9. రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాల ప్రత్యక్ష పన్నులు ఇతర దేశాల్లోని ఆయా వ్యవస్థలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి.
10. తీవ్ర వాతావరణ ప్రభావం వల్ల వ్యవసాయ దిగుబడులపై ప్రభావం కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు పెరగడం; వర్షపాతం పెరగడం వంటి మార్పుల వల్ల వ్యవసాయంపై ప్రభావం ఉంటోంది.

* జీఎస్‌టీ అమలు కారణంగా పరోక్ష పన్ను చెల్లింపుదార్ల సంఖ్య 50 శాతం పెరిగింది. పన్ను పరిధిలోకి 34 లక్షల మంది కొత్తగా వచ్చారని ఆర్థిక సర్వే పేర్కొంది. స్వచ్ఛందంగా రిజిస్ట్రేషన్లు పెరగడంతో జీఎస్‌టీ నమోదిత వ్యక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ను అందిపుచ్చుకోవడం కోసం చిన్న కంపెనీలు వరుస కట్టాయి. జీఎస్‌టీ కారణంగా ఆదాయ పన్ను వసూళ్లు పెరిగాయి. ఇది నిజంగా ఆశ్చర్యకరమే. జులైలో రూ.95,000 కోట్లు, ఆగస్టులో రూ.91,000 కోట్లు; సెప్టెంబరులో రూ.92,150 కోట్లు, ఆక్టోబరులో రూ.83,000 కోట్లు; నవంబరులో రూ.80,808 కోట్లు; డిసెంబరులో రూ.86,703 కోట్లు చొప్పున వసూలయ్యాయి. అత్యధికంగా జీఎస్‌టీ నమోదులు జరిగిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌, తమిళనాడు, గుజరాత్‌లున్నాయి. పాత పన్ను విధానంతో పోలిస్తే అధికంగా పన్ను నమోదిత వ్యక్తుల సంఖ్య పెరిగిన విషయంలో ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బంగలు ముందు నిలిచాయి. రూ.20 లక్షల కంటే ఆదాయ పన్ను తక్కువగా ఉన్నప్పటికీ 17 లక్షల మంది వ్యాపారస్తులు జీఎస్‌టీలోకి చేరడం విశేషం.
* డిసెంబరు 2017 నాటికి 98 లక్షల మంది వ్యాపారులు జీఎస్‌టీలో చేరారు. జీఎస్‌టీకి ముందు కేంద్రం, రాష్ట్రాల పన్ను వసూళ్లు రూ.9.7 లక్షల కోట్లు ఉండగా.. జీఎస్‌టీ వార్షిక వసూళ్లు రూ.10.9 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా.
* సంఘటితరంగంలో అంచనా వేసిన దానికంటే అధిక సంఖ్యలో ఉద్యోగాలున్నాయని ఆర్థిక సర్వే తెలిపింది. ఉపాధి వయస్సులోని యువత సంఖ్య అధికమవుతున్నందున, వారికి నాణ్యమైన ఉద్యోగాలు కల్పించడం మధ్యకాలానికి సవాలేనని పేర్కొంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌ఓ), కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) సమాచారం ప్రకారం వ్యవసాయేతర సంఘటితరంగంలో 7.5 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని భావిస్తే, వాస్తవంలో 12.7 కోట్ల మంది పనిచేస్తున్నారని తెలిపింది. సామాజిక భద్రతా పథకాల ప్రకారం సంఘటితరంగంలోని ఉద్యోగుల సంఖ్య 6 కోట్లు మాత్రమే. రక్షణ బలగాలు మినహా, ప్రభుత్వ ఉద్యోగాల్లో 1.5 కోట్ల మంది ఉన్నారని, ఫలితంగా మొత్తం ఉద్యోగుల సంఖ్య 7.5 కోట్లుగా నమోదైందని పేర్కొంది. స్థిర, సమగ్ర, తాజా వివరాలు అందుబాటులో లేకపోవడమే ఈ తేడాలకు కారణమని పేర్కొంది.
* వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి పొందుతున్న వారు 24 కోట్ల మంది. దీనిప్రకారం సంఘటిత రంగంలో 31 శాతం మంది వ్యవసాయేతర రంగంలో ఉన్నారు.
* పన్ను గణాంకాల ప్రకారం సంఘటితరంగ ఉద్యోగులు 11.2 కోట్ల మంది. ప్రభుత్వ ఉద్యోగులు జతైతే, ఈ సంఖ్య 12.7 కోట్లు అవుతుంది. అంటే వ్యవసాయేతర రంగాల్లో 54 శాతం మంది సంఘటిత వ్యవస్థల్లో పనిచేస్తున్నారు.
* జీఎస్‌టీలో నమొదైన చిన్న సంస్థలు కూడా తమ కొనుగోళ్లపై పన్ను క్రెడిట్‌ పొందవచ్చు. దీనివల్ల జీఎస్‌టీ ఆవల ఉండే ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి రంగాల్లోని ఉద్యోగులు నమోదు కాకపోవచ్చు.
* కొత్త దివాలా స్మృతి చట్టం ద్వారా బ్యాంకింగ్‌ రంగంలోని మొండి బకాయిల సమస్యలను పరిష్కరించడానికి చురుగ్గా ప్రయత్నం చేస్తున్నారు. కొత్త చట్టంల న్యాయ అంశాల చేదోడు ఎక్కువగా ఉంది. దీని కింద కఠిన సమయ పరిమితులుండడం ఇందుకు నేపథ్యం. దివాలా చట్టం తీసుకువచ్చిన ప్రణాళిక కారణంగా కార్పొరేట్లు తమ బ్యాలెన్స్‌షీట్లలను ప్రక్షాళించుకోవడానికి, రుణాలను తగ్గించుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్‌ రంగ పనితీరు ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్తబ్దుగా ఉండొచ్చు. సెప్టెంబరు 30, 2017 నాటికి ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో మొత్తం బ్యాంకు ఆస్తుల్లో 17 శాతాన్ని, బ్యాంకు డిపాజిట్లలో 0.26 శాతాన్ని కలిగి ఉన్నాయి. వీటి ఏకీకృత బ్యాలెన్స్‌ సీట్‌ పరిమాణం 5 శాతం(మార్చి 2017తో పోలిస్తే సెప్టెంబరు 2017లో) పెరిగి రూ.20.7 లక్షల కోట్లకు చేరింది.
* మార్చి 2017 నుంచి సెప్టెంబరు 2017 మధ్య వాణిజ్య బ్యాంకుల్లో స్థూల నిరర్థక ఆస్తుల అడ్వాన్సుల(జీఎన్‌పీఏ) నిష్పత్తి 9.6 శాతం నుంచి 10.2 శాతానికి పెరిగింది.
* భారీమొత్తంలో రుణాలు ఎగవేసిన 11 కంపెనీలకు సంబంధించి రూ.3.13 లక్షల కోట్ల విలువైన క్లెయిమ్‌లు దివాలా స్మృతి ప్రక్రియకు చేరాయని సర్వే తెలిపింది.
* వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకోవడానికి భారత్‌లోని సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) కంపెనీలకు సరైన రుణ సదుపాయాలు లభించడం లేదు. మొత్తం రుణాల జారీలో ఈ రంగానికి కేవలం 17.4 శాతం వాటానే దక్కుతోంది. సూక్ష్మ, చిన్న కంపెనీలకిచ్చే రుణాల్లో వృద్ధి 4.6 శాతం పెరగ్గా.. మధ్య స్థాయి వాటికి 8.3 శాతం వరకు తగ్గింది. 2016-17లో ప్రధాన్‌ మంత్రి ముద్ర యోజన కింద ఇచ్చిన రుణాలు లక్ష్యాన్ని(రూ.1.8 లక్షల కోట్లు) అధిగమించాయి. ఇందులో రూ.1.23 లక్షల కోట్లు బ్యాంకులివ్వగా.. రూ.57,000 కోట్లు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలిచ్చాయి.
* కొత్త పన్ను(జీఎస్‌టీ) కింద లేదా బయట ఎగుమతుల ఉత్పత్తులపై పడే పలు పన్నుల విషయాన్ని జీఎస్‌టీ మండలిని సమీక్షించాలి. వాటిలో పన్నుపై పన్ను పడే అంశాలను తొలగించడం వల్ల ఆ రంగానికి ఊతమివవ్వచ్చు. దుస్తుల రంగానికిచ్చిన రూ.6000 కోట్ల ప్యాకేజీ వల్ల పట్టు, నూలు వంటి ఉత్పత్తులపై సానుకూల ప్రభావం కనిపించినట్లు గణాంకాలు తెలపడం లేదు. అంతర్జాతీయ దుస్తుల ఎగుమతుల విషయంలో చైనా వాటా తగ్గుతున్న ఈ నేపథ్యంలో ఆ అవకాశాలను భారత్‌ అందిపుచ్చుకోవడం లేదు.
* భారీ రుణాలతో పాటు కాల్స్‌, డేటా విషయంలో ఛార్జీల యుద్ధం వల్ల నష్టాలు పెరుగుతుండటం, సహేతుకం కాని రీతిలో ఉన్న స్పెక్ట్రమ్‌ ధరల వల్ల టెలికాం సంస్థలకు ఆదాయం తగ్గి, తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని ఆర్థిక సర్వే పేర్కొంది. రిలయన్స్‌ జియో పేరును ప్రస్తావించకుండానే, కొత్త సంస్థ అతి తక్కువ ధరలకు డేటా సేవలు ఇవ్వడం వల్ల పాత టెలికాం సంస్థల ఆదాయం పడిపోయిందని పేర్కొంది. ఇందువల్ల ఏర్పడిన సంక్షోభంతో పెట్టుబడిదారులు, రుణదాతలు, భాగస్వాములు, టెలికాం సంస్థలకు సేవలు, ఉత్పత్తులు సరఫరా చేసిన విక్రయదార్లు ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. టెలికాం రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అధికంగా వస్తున్నాయని తెలిపింది.
* వేలంలో స్పెక్ట్రమ్‌, ఇతర ఆస్తుల ధరలు మితిమీరి పెరగకుండా చూసేలా విధానాలు రూపొందించాలని సూచించింది. ప్రోత్సాహకాలను ఎలా వినియోగిస్తున్నారో చూడాలని తెలిపింది. చట్టపరమైన వివాదాల వల్ల, అవరోధాలు ఎదురవుతున్నాయని, నూతన టెలికాం విధానంలో వీటికి పరిష్కారాలు చూడాలని తెలిపింది.
* ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు మధ్య సహకారం ఉంటే.. వాణిజ్య పరమైన వివాదాల జాప్యం తగ్గించవచ్చు. అప్పీలేట్‌, కోర్టుల్లో ఈ ఆలస్యాలను పరిహరించి వ్యాపారాలను సులువుగా నిర్వహించుకోవడానికి వీలు కల్పించాలి. వివాదాల పరిష్కారాలను ఆపడం, పెట్టుబడులను నిరుత్సాపరచడం, ప్రాజెక్టులను ఆపడం, పన్ను చెల్లింపుదార్లపై ఒత్తిడి తీసుకురావడం వంటి వాటిని అడ్డుకోవాలి. ప్రపంచ బ్యాంకు ఇచ్చిన సులువుగా వ్యాపారం నిర్వహించుకోవడానికి వీలయ్యే దేశాల జాబితాలో 100వ స్థానానికి భారత్‌ ఎగబాకినప్పటికీ.. వివాదాల పరిష్కారాల విషయంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. సుప్రీం కోర్టు, ఎకనమిక్‌ ట్రైబ్యునల్‌లలో పెండింగ్‌లో ఉన్న ఆర్థిక కేసుల సంఖ్య అధికంగా ఉంది. న్యాయ వ్యవస్థలో ఉన్న అధిక పనిఒత్తిడి వల్ల కూడా ఈ జాప్యాలు జరుగుతున్నాయి. కేవలం కోర్టులు, ట్రైబ్యునళ్లకే ఈ వివాదాల పరిష్కార జాప్యం పరిమితం కావడం లేదు. పన్ను విభాగాల్లోనూ ఈ పరిస్థితులున్నాయి. ప్రభుత్వాలు, కోర్టులు కలిసి భారీ సంస్కరణలను తీసుకురావడం ద్వారా పరిస్థితులను చక్కదిద్దాలి.
* 2017 నాటికి హైకోర్టుల్లో 35 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధాన హైకోర్టుల్లో సగటున ఒక్కో కేసు 4.3 ఏళ్ల పాటు పెండింగ్‌లో ఉంటున్నాయి. ఇక కమిషనర్‌(అప్పీళ్లు), సీఈఎస్‌టీఏటీ, హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కలిపి మార్చి 2017 త్రైమాసికం చివరకు మొత్తం 1.45 లక్షల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి.
* ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉంది. 2017-18లో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠ స్థాయి అయిన 3.3 శాతానికి చేరింది. గత నాలుగేళ్లలో ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణం నుంచి.. స్థిరమైన ధరల దిశగా మార్పు చెందింది. వరుసగా నాలుగో ఏడాదీ సీపీఐ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ద్రవ్యోల్బణం తగ్గింది. వ్యవసాయ దిగుబడి రాణించడం; ప్రభుత్వం నిరంతరం ధరలను పర్యవేక్షించడం వల్ల ఇది సాధ్యమైంది. ఇటీవల కొద్ది నెలల్లో ఆహార ద్రవ్యోల్బణం పెరిగింది. ఇందుకు కూరగాయలు, పళ్ల ధరలు కారణమయ్యాయి.
* 2017-18లో రాష్ట్రాల వారీగా ద్రవ్యోల్బణాన్ని చూస్తే.. చాలా వరకు రాష్ట్రాల్లో రిటైల్‌ ద్రవ్యోల్బణం బాగా తగ్గింది. 17 రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం 4 శాతంలోపే నమోదు కావొచ్చు.
* పర్యాటక రంగానికి 2017లో 27.7 బిలియన్‌ డాలర్ల విదేశీ మారకం లభించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 20.8 శాతం ఎక్కువ. ప్రభుత్వం ఈ రంగం కోసం తీసుకున్న పలు చర్యలు ఇందుకు దోహదం చేశాయి. 2017లో మొత్తం 1.02 కోట్ల మంది విదేశీ పర్యాటకులు వచ్చారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 15.6 శాతం ఎక్కువ. 2016లో వీరి ద్వారా వచ్చిన విదేశీ మారక నగదు 22.9 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 163 దేశాల పౌరులకు ఇ-వీసా అమలు, అంతర్జాతీయ స్థాయిలో మాధ్యమాల్లో ప్రచారం, ‘ద హెరిటేజ్‌ ట్రయల్‌’ పేరిట వినూత్న కార్యక్రమం.. తదితరాల వల్ల విదేశీ పర్యాటకులను భారత్‌ ఆకర్షించింది.
* తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, కర్ణాటకలు పర్యాటకులను ఆకర్షించడంలో తొలి అయిదు స్థానాల్లో నిలిచాయి. 2016లో వచ్చిన విదేశీ పర్యాటకుల్లో 61.3 శాతం మంది ఈ రాష్ట్రాలకే వచ్చారు.
* ప్రయాణికుల టికెట్ల విక్రయాల పరంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద, శరవేగంగా వృద్ధి చెందుతున్న దేశీయ విమానయాన విపణి మనదే అని ఆర్థిక సర్వే తెలిపింది. ఇప్పటివరకు విమానయాన సేవలు పొందని, అత్యంత స్వల్పంగా లభిస్తున్న వారికోసం ప్రాంతీయ విమానయాన పథకం (ఉడాన్‌) ప్రారంభించి, పలు మార్గాలు వివిధ సంస్థలకు కేటాయించినట్లు వివరించింది. గిరాకీకి అనుగుణంగానే చిన్న విమానాశ్రయాల పునరుద్ధరణ, అభివృద్ధి ఉంటుందని, విమానయాన సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కీలకమని పేర్కొంది. ఈ ఏడాది డిసెంబరులోగా 50 విమానాశ్రయాల అభివృద్ధికి రూ.4,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. ఇందువల్ల వృద్ధి వేగవంతమవుతుందని పేర్కొంది.
* మదుపర్ల నుంచి మ్యూచువల్‌ ఫండ్లకు మంచి స్పందన వచ్చింది. 2016-17లో వీటిలో పెట్టుబడులు 400 శాతం మేర పెరిగింది. బ్యాంకు డిపాజిట్లు, జీవిత బీమా ఫండ్‌లు, షేర్లు, డిబెంచర్లలోకి వెళ్లిన పెట్టుబడులు వరుసగా 82%, 66%, 345% చొప్పున పెరిగాయి.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-నవంబరులో భారత కంపెనీలు ప్రాథమిక మార్కెట్ల ద్వారా రూ.70,000 కోట్లకు పైగా నిధులను సమీకరించాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇవి 45 శాతం ఎక్కువ. ఇందులో రూ.66,420 కోట్లు ఈక్విటీ, మిగతా రూ.3896 కోట్లు రుణ మార్గంలో సమీకరించాయి.
* పంచాయ‌తీల స్థాయిలో ప‌న్నుల వ‌సూళ్లు అత్యంత త‌క్కువ‌గా ఉంటుండ‌డంపై స‌ర్వే ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. సపంచాయ‌తీలు సొంత వ‌న‌రుల ద్వారా 5% నిధుల‌నే స‌మీక‌రించుకుంటున్నాయి. మిగ‌తా 95% కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఆధార‌ప‌డుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు త‌గిన‌న్ని ప‌ను్న అధికారాల‌ను పంచాయ‌తీల‌కు ఇవ్వ‌లేదు. ఆస్తిప‌న్ను, వినోద ప‌న్ను వంటివి పంచాయ‌తీలు వ‌సూలు చేస్తున్నా భూమిశిస్తు, ర‌ఙ‌దారి సుంకం వంటివి మాత్రం వాటి ప‌రిధిలో లేవు. ఆస్తుల‌కు త‌క్కువ విలువ క‌ట్ట‌డం, పన్నునే త‌క్కువ‌గా నిర్ణ‌యించ‌డం వ‌ల్ల రెవెన్యూ వ‌సూళ్లు 7 నుంచి 19 శాత‌మే ఉంటున్నాయ‌ని తెలిపింది.
* స‌మాచార సాంకేతిక విజ్ఞానం (ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ అండ్ క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ - ఐసీటీ) ఎగుమ‌తుల్లో భార‌త్ పోటీ ఎదుర్కొంటోంది. ప్ర‌ధానంగా చైనా - బె్ర‌జిల్ లు పోటీ ఇస్తున్నాయి. ర‌ష్యా, ఫిలిప్పీన్స్‌, ఉక్రెయిన్ వంటి దేశాలు కూడా రంగంలో ఉన్నాయి. ప్ర‌పంచ బ్యాంకు నివేదిక ఆధారంగా స‌ర్వే ఈ నిర్ణ‌యానికి వ‌చ్చింది. 2006లో భార‌త్ నుంచి ఎగుమ‌తి అయిన మొత్తం సేవ‌ల్లో ఐటీసీ వాటా 68 శాతం కాగా 2016 నాటికి అది 67 శాతానికి త‌గ్గింది. ఇది స్వ‌ల్ప‌మే అయిన‌ప్ప‌టికీ, మిగిలిన దేశాల నుంచి పోటీ ఎదుర‌వుతోంద‌న్న విష‌యాన్ని గుర్తు చేస్తోంద‌ని తెలిపింది.
* నిధుల కొరత ఉన్నప్పటికీ ప్రజల విద్య, ఆరోగ్య సంబంధ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిరంతరంగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. ‘‘వర్ధమాన ఆర్థిక వ్యవస్థ కావడంతో భారత్‌లో విద్య, ఆరోగ్యం వంటి కీలక సామాజిక మౌలిక వసతుల్లో వ్యయాన్ని పెంచడానికి సరిపడా నిధులు లేవు. అయినా ప్రజల విద్య, ఆరోగ్య స్థితిగతులను బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిరంతరంగా ప్రాధాన్యం ఇస్తోంది’’ అని వివరించింది.
* జీఎస్‌డీపీలో సామాజిక సేవల వాటా 6 శాతం (2014-15) నుంచి 6.9 శాతాని (2016-17)కి పెరిగింది.
* పాఠశాలల్లో చేరిక, పాఠశాల భవనాలు, తరగతి గదులు, తాగునీటి వసతులు, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయుల నియామకం వంటి సంఖ్యాపరమైన సూచికల్లో భారత్‌ గణనీయ పురోగతి సాధించింది. అయితే బిహార్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో సరిపడా టీచర్లు లేని పాఠశాలలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.
* బాలికా రక్షణ, విద్యను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘బేటీ బచావో బేటీ పడావో’ పథకాన్ని దేశంలోని 640 జిల్లాలకు విస్తరించడానికి ప్రభుత్వం అంగీకరించింది.
* ఈ ఆర్థిక సంవత్సరం నుంచి జాతీయ పోషకాహార మిషన్‌ ఏర్పాటుకు సమ్మతించింది. ఇది.. పోషకాహార లోపం, రక్తహీనత, తక్కువ బరువుతో శిశు జననాలు వంటివాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
* ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద కాలుష్యానికి వీల్లేని వంట గ్యాస్‌ను అందించడం ద్వారా మహిళలు, చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి వీలవుతుంది. ఈ నెల 18 నాటికి 3.3 కోట్ల కనెక్షన్లు ఇచ్చారు.
* 2020 నాటికి రాష్ట్రాలు తమ బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి 8 శాతం కన్నా ఎక్కువ నిధులు కేటాయించాలని జాతీయ ఆరోగ్య విధానం-2017 సూచిస్తోంది.
అభివృద్ధి పరంగా ఎదురవుతున్న అనేక సవాళ్లను ఎదుర్కోవాలంటే మన దేశం క్రమేణా విజ్ఞాన ఖనిగా అవతరించాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే ఆకాంక్షించింది. వాతావరణ మార్పుల నుంచి భద్రతపరమైన సవాళ్ల వరకు అనేక రకాల ముప్పులను, సైబర్‌ యుద్ధాలను, డ్రోన్ల వంటి స్వతంత్ర వ్యవస్థలను ఎదుర్కొని పునరుత్థానం పొందడానికి విజ్ఞాన ఖని వీలు కల్పిస్తుందని పేర్కొంది. శాస్త్ర పరిశోధనల విస్తృతిలో పురోగతి తక్కువగా ఉందని పెదవి విరిచింది. నాస్కాం అంచనా ప్రకారం ఐ.టి. పరిశ్రమ గత ఆర్థిక సంవత్సరంలో 8.1% వృద్ధి సాధించి 140 బిలియన్‌ డాలర్లను (సుమారు రూ.9,38,000 కోట్లు) చేరిందని తెలిపింది. ఐ.టి. ఎగుమతుల్లో 7.6% వృద్ధి నమోదైందని తెలిపింది.
* రాజకీయ రంగం, విధానపర నిర్ణయాలు తీసుకునే వ్యవహారాల్లో మహిళల పాత్ర తక్కువగా ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇంటి బాధ్యతలు; సామాజిక, ఆర్థిక అంశాలు, కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లేకపోవడం, నమ్మకం తక్కువగా ఉండడం ఇందుకు కారణాలని విశ్లేషించింది. రువాండాలాంటి ఆఫ్రికన్‌ దేశంలో 60 శాతం మంది ప్రజాప్రతినిధులు మహిళలే ఉన్నారు. భారత్‌ జనాభాలో 49 శాతం మంది మహిళలు ఉన్నప్పటికీ పార్లమెంటులో వారి ప్రాతినిధ్యం 11 శాతంగా ఉంది. లోక్‌సభలో 64 మంది (11.8%), రాజ్యసభలో 27 మంది (11%) మహిళలు ఉన్నారు. దేశవ్యాప్తంగా 4,118 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో మహిళల సంఖ్య కేవలం ఎనిమిది శాతం మాత్రమే. 2010-17 మధ్యకాలంలో పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం కేవలం ఒక్క శాతం మాత్రమే పెరిగింది. పంచాయతీ స్థాయిలో మహిళల ప్రాతినిధ్యం బాగుంది. 43% మంది మహిళా సర్పంచులు ఉండగా, 44.2% మంది మహిళా ప్రతినిధులు ఉన్నారు.
* ఆరుబయట మల విసర్జన అలవాటు నుంచి 8 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు పూర్తిగా బయటపడ్డాయని ఆర్థిక సర్వే పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో మరుగు అవసరాల కోసం ఆరుబయలు స్థలాలకు వెళ్లేవారు 2014 అక్టోబరులో 55 కోట్లు ఉంటే ఇప్పుడు 25 కోట్లకు తగ్గారని తెలిపింది. ‘పరిశుభ్రమైన వాతావరణం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 296 జిల్లాలు, 3,07,349 గ్రామాలు బహిరంగ మల విసర్జన నుంచి బయటపడ్డాయి. సిక్కిం, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, హరియాణా, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌, దమణ్‌-దీవ్‌, చండీగఢ్‌లు ఈ అలవాటుకు స్వస్తి పలికాయి. ఆరుబయట అలవాటు కొనసాగుతున్న జిల్లాల్లో అతిసార కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్‌)గ్రామాల ప్రజలు ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్థికంగానూ ప్రయోజనం పొందుతున్నారు. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం పారిశుద్ధ్య సదుపాయాల లేమి వల్ల భారత్‌ 6% మేర స్థూల జాతీయోత్పత్తిని నష్టపోతోంది. ఓడీఎఫ్‌ గ్రామాల్లో ఒక్కో కుటుంబం ఏటా రూ.50వేలు ఆదా చేయగలుగుతుందని యూనిసెఫ్‌ అంచనా’ అని ఆర్థిక సర్వే వివరించింది.
* కేంద్ర ప్రభుత్వం తీసుకున్న క్రియాశీల చర్యల కారణంగా ఆగిపోయిన రహదారుల పనులు పునఃప్రారంభమయ్యాయని ఆర్థిక సర్వే పేర్కొంది. రహదారుల మంత్రిత్వశాఖ రూ.3.17 లక్షల కోట్ల వ్యయంతో 482 ప్రాజెక్టులు చేపట్టగా అందులో 117 రహదారుల పనులు ఆగిపోయాయి. ఇందులో 43 ప్రాజెక్టుల వ్యయం పెరిగింది. 74 ప్రాజెక్టుల గడువు పెరిగింది. ప్రభుత్వం తగిన విధంగా సమస్యలు పరిష్కరించడంతో 88 శాతం పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. భూ సేకరణ, పర్యావరణ అనుమతులు, గుత్తేదార్లు సక్రమంగా పనిచేయకపోవడం, స్థానికుల ఆందోళనలు తదితర కారణాలు రహదారుల పనులకు అడ్డంకిగా మారాయి. రాష్ట్రప్రభుత్వాలు, గుత్తేదారులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించింది. రహదారుల పనులకు వివిధ సంస్థల నుంచి నిధులు అందేలా చర్యలు తీసుకొంది. రహదారుల ప్రాజెక్టులకు 2012-13లో రూ.1,27,430 కోట్లు రుణాలు ఇవ్వగా, గత సెప్టెంబరు నాటికి రూ.1,80,277 కోట్లు ఇచ్చారు. ఇదే సమయంలో రుణాల తిరిగి చెల్లింపులు బాగా తగ్గాయి. 2012-13లో బాకీలు 1.9 శాతం ఉండగా, ప్రస్తుతం 20.3 శాతానికి పెరిగాయి.
* మహిళల ఆధారిత వ్యవసాయ విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని సర్వే సిఫార్సు చేసింది. పురుషులంతా పట్టణాలకు వలస వెళ్తుండడంతో మహిళలు కూడా రైతులు, కార్మికులు పాత్రలను సమర్థంగా పోషిస్తున్నారు. ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర విస్మరించలేనిది. అందువల్ల భూమి, నీరు, రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం, విత్తనాలు, మార్కెట్‌ తదితర సౌకర్యాలను వారికి చేరువ చేయాలని పేర్కొంది. మహిళలకు అనుకూలమైన పరిజ్ఞానం, శిక్షణ ఉండాలని సూచించింది. ఈ దశగా ఇప్పటికే ప్రభుత్వాలు అడుగేస్తున్నాయి. పథకాల లబ్ధిదారుల్లో కనీసం 30 శాతం మంది మహిళలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయి. మహిళా స్వయం సేవా సంఘాలకు రుణ సదుపాయాలు కల్పిస్తున్నాయి.
* దేశంలో కార్మిక చట్టాలను సమర్థంగా అమలు చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపకరిస్తుందని, మరింత పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకొస్తుందని సర్వే వెల్లడించింది. శ్రమసువిధ పోర్టల్‌, సార్వత్రిక ఖాతా సంఖ్య, జాతీయ కెరియర్‌ సేవా పోర్టల్‌ వంటి వాటిని ప్రస్తావించింది. 2017-18లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద మునుపెన్నడూ లేనంత కేటాయింపులు చేసినట్లు వివరించింది. 4.6 కోట్ల కుటుంబాలకు ఉపాధి లభించిందని, 177.8 కోట్ల పనిదినాలు లభించాయని తెలిపింది.
* దేశంలో రానున్న 25 ఏళ్లలో మౌలిక వసతుల అభివృద్ధికి 4.5 ట్రిలియన్‌ డాలర్లు (రూ.301 లక్షల కోట్లు) అవసరమవుతాయని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇందులో 3.9 ట్రిలియన్‌ డాలర్లు (రూ.261 లక్షల కోట్లు) సొంతంగా సమకూర్చుకోగలుగుతుందని పేర్కొంది. ప్రస్తుత పద్ధతుల్లోనే మౌలిక సౌకర్యాల కల్పన జరిగితే 2040 నాటికి భారీ కొరత ఉంటుందని తెలిపింది. ప్రయివేటు సంస్థల సహకారంతో ఈ లోటును భర్తీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. కేవలం మౌలిక వసతుల ప్రాజెక్టులకే నిధులు ఇచ్చే నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌ఐఐబీ), ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ), న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (గతంలో బ్రిక్స్‌ బ్యాంకు)ల సహాయం తీసుకోవచ్చని సూచించింది. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యం విధానం విఫలమవడమూ ఇందుకు ఒక కారణంగా. భూమి, అడవుల అనుమతులు సకాలంలో రాక ఇంధనం, టెలికాం రంగాల్లో పెట్టుబడులు పెట్టిన ప్రయివేటు సంస్థలకు నష్టాలు రావడంతో వీటి ఆసక్తి తగ్గిందని పేర్కొంది. రైల్వే, విమానయాన, నౌకాయానంతో పాటు మొత్తం రవాణా రంగం, టెలికాం రంగాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై విశ్లేషించింది.

* రాయితీల కొనసాగింపు లేదా పెంపు ప్రభుత్వాల సంప్రదాయంగా వస్తుండగా 2014 నుంచి మోదీ ప్రభుత్వం భిన్నమైన పంథాను ఎంచుకుంది. మొత్తం వ్యయంలో రాయితీల శాతాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. 2014-15లో మొత్తం వ్యయంలో రాయితీల మొత్తం 15.52 శాతం కాగా 2017-18లో 11.2శాతానికి తగ్గింది.
* రుసుములను ఆకర్షణీయమైన రీతిలో నిర్ణయించకపోవడం వల్ల సరకు రవాణాలో భారతీయ రైల్వే వాటా గత కొన్నేళ్లలో క్రమంగా పడిపోతోంది. ప్రయాణికుల టికెట్‌ రుసుములు దాదాపు ఒకే విధంగా ఉంటున్నా సరకు రవాణాకు వసూలు చేసే మొత్తాలు మాత్రం గణనీయంగా పెరిగాయని ఆర్థిక సర్వే గుర్తుచేసింది. ‘రైలు రవాణాను ఆకర్షణీయంగా మార్చి, రైల్వేవాటా మరింతగా పడిపోకుండా చూడడానికి 2017 ఆర్థిక సంవత్సరంలో వివిధ చర్యలు చేపట్టారు. ధరల హేతుబద్ధీకరణ, వేర్వేరు స్టేషన్ల కోసం భిన్నమైన మార్గదర్శకాలు రూపొందించడం, ఇనుప ఖనిజం ఎగుమతికి ద్వంద్వ ధరల విధానాన్ని ఉపసంహరించుకోవడం, బొగ్గు రవాణా ధరల్ని క్రమబద్ధం చేయడం వంటి చర్యల్ని ఇటీవల తీసుకున్నారు. వీటన్నింటి వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రథమార్థంలో రైల్వేలు 55.81 కోట్ల టన్నుల సరకుల్ని రవాణా చేయగలిగాయి. అంతకు ముందు సంవత్సర ప్రథమార్థంతో (53.12 కోట్ల టన్నులు) పోలిస్తే ఇది 5% అధికం’ అని వివరించింది. సామర్థ్యంతో పాటు అనుసంధానతను, ప్రైవేటు/ విదేశీ పెట్టుబడుల్ని పెంచడం వంటి చర్యల్ని ప్రభుత్వం చేపట్టిందని తెలిపింది. రైల్వేస్టేషన్ల చుట్టుపక్కల రైల్వే ఆధీనంలో ఉన్న మిగులు స్థలాలను వాణిజ్య ప్రాతిపదికన అభివృద్ధి చెందించడానికి ఉద్దేశించిన ‘స్టేషన్ల పునరభివృద్ధి పథకా’నికి శ్రీకారం చుట్టిందని గుర్తుచేసింది. దిల్లీ మెట్రో రైలు విజయవంతం కావడంతో ఇలాంటి వ్యవస్థ కోసం అనేక రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపింది. దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ సహా వివిధ నగరాల్లో 425 కి.మీ. మేర మెట్రో రైలు వ్యవస్థ ఉందనీ, వివిధ నగరాల్లో మరో 684 కి.మీ. వ్యవస్థ నిర్మాణమవుతోందనీ వివరించింది.
* వాతావరణ మార్పులు రైతుల ఆదాయంపై దాదాపు 25 శాతం వరకూ ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక సర్వే (2017-18) హెచ్చరించింది. సగటున ప్రతిరైతుకు 15-18 శాతం, వర్షాధార భూముల వారికి గరిష్ఠంగా 25 శాతం ఆదాయం తగ్గుతుందని వెల్లడించింది. స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయం వాటా తగ్గుతున్నా.. ప్రగతికి చోదకశక్తిగానే ఉంటుందని పేర్కొంది.
* దేశంలో నీటి కొరత పెరుగుతోంది.. చైనా, అమెరికాలకన్నా రెట్టింపు స్థాయిలో భూగర్భ జలాలు తోడేస్తుండటంతో గత 30 ఏళ్లలో 13 శాతం తగ్గిపోయాయి.
* అధికవర్షాల కారణంగా ఖరీఫ్‌లో - పప్పుధాన్యాలు (18%); జొన్న, వరి (15%); వేరుసెనగ (14%); రబీలో - కంది (10%); ఆవాలు (4%) పంటల్లో ఉత్పాదకత తగ్గింది.
సూచనలు.. సిఫార్సులు
* రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి.. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు జీఎస్టీ మండలి తరహాలో యంత్రాంగం ఏర్పాటు.
* విద్యుత్తు, ఎరువుల రాయితీలకు బదులు ప్రత్యక్ష నగదు బదిలీ.
* నీటి పారుదల, ఆధునిక సాంకేతిక పద్ధతుల వినియోగంలో గణనీయమైన పురోగతి అవసరం. సమర్ధమైన బిందు, తుంపర్ల (సాంకేతిక) విధానాల అమలు. ప్రతి నీటిబొట్టుకూ అధిక పంట దిగుబడులు సాధించేలా నీటి యాజమాన్య పద్ధతులు.
* సమర్ధ పంటల బీమా పథకం అమలు. వాతావరణానికి అనుగుణంగా రైతులకు నష్ట పరిహారం అంచనాలు.. వారాల వ్యవధిలోనే చెల్లింపు. ఇందుకుగాను డ్రోన్లు వంటి సాంకేతిక పద్ధతులు, వ్యవసాయ విజ్ఞానం అందుబాటులోకి తేవడం. ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన విస్తరణ.
* రైతులకు ఇతర ఆదాయ అవకాశాల కల్పన. ఇందుకు అనుగుణంగా పాడి, మత్స్య తదితర రంగాల అభివృద్ధి.
* అనేక సమస్యలతో సతమతమయ్యే ప్రభుత్వ బడుల్లో పరిస్థితులు గత కొన్నాళ్లుగా మెరుగుపడ్డాయని 2017-18 ఆర్థిక సర్వే వెల్లడించింది. లింగ సమానత్వ సూచీ(జీపీఐ)లో అంతరం తగ్గుముఖం పట్టిందని, పాఠశాలల్లో చేరే బాలికల సంఖ్య గణనీయంగా పెరిగిందని సర్వే పేర్కొంది. తాగునీరు, మరుగుదొడ్లు వంటి వసతులూ సమకూరాయని తెలిపింది. ఇక పాఠశాల చదువులు పూర్తిచేసే వారి సంఖ్యా అధికమయ్యందని, మధ్యలోనే ఎగనామం పెట్టే వారి సంఖ్య తగ్గుముఖంపట్టిందని వివరించింది.
* ప్రాథమిక పాఠశాలల స్థాయిలో ఉపాధ్యాయుల నియామకాలు, అదనపు తరగతి గదుల నిర్మాణంపైనా సంతృప్తి వ్యక్తంచేసింది. మొత్తంగా విద్యార్థులు-తరగతి గదుల నిష్పత్తి(ఎస్‌సీఆర్‌), విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి (పీటీఆర్‌) మెరుగుపడి ప్రభుత్వ విద్యలో నాణ్యతకు బాటలుపరిచిందని సర్వే వివరించింది.
* ఒక విద్యాసంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుని ఎంత మంది విద్యార్థులకు ఒక తరగతి (ఎస్‌సీఆర్‌)ఉండాలో నిర్ణయించారు. దీని ప్రకారం ప్రతి 30 మంది చిన్నారులకు ఒక తరగతి గది ఉండటం ఆదర్శప్రాయం.
* 2009లో 30 మందికన్నా ఎక్కువ మంది విద్యార్థులున్న తరగతి గదుల జాతీయ సగటు 43 శాతం.
* 2015-16లో అవి 25.7 శాతానికి తగ్గాయి.
* కొన్ని వ్యత్యాసాలున్నప్పటికీ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఎస్‌సీఆర్‌ మెరుగుపడిందని సర్వే వెల్లడించింది.
* విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిలో జాతీయ సగటు మెరుగ్గానే ఉన్నా బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక్కడి పీటీఆర్‌ 60:1గా ఉండటం గమనార్హం. ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌లలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని సర్వే పేర్కొంది. ఈ నాలుగు రాష్ట్రాలలోనూ పీటీఆర్‌ను 30:1స్థాయికి తీసుకురావాల్సి ఉందని సర్వే అభిప్రాయపడింది.
* బేటీ పడావో, బేటీ బచావో వంటి కార్యక్రమాల అమలుతో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చేరే బాలికల సంఖ్య గణనీయంగా పెరిగిందని సర్వే వెల్లడించింది. అయితే, ఉన్నత విద్యాసంస్థల్లో బాలికల సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉందని పేర్కొంది.
* ప్రాథమిక విద్యలో పీటీఆర్‌ 30:1, ప్రాథమికోన్నత విద్యలో 35:1గా ఉండటం ఆదర్శప్రాయంగా భావిస్తారు. అయితే 2015-16లో మన జాతీయ సగటు నిష్పత్తి 23:1గా ఉంది. అంటే ప్రతి 23 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ ఉన్నారు.
* మనలాంటి సామాజిక, ఆర్థిక పరిస్థితులున్న దేశాల పీటీఆర్‌తో పోల్చినప్పుడు భారత్‌లో విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి మెరుగ్గానే ఉందని యునెస్కో గణాంక సంస్థ సమాచారం వెల్లడిస్తోంది. 2015లో పీటీఆర్‌లో అంతర్జాతీయ సగటు 23.4:1 అదే సమయంలో చైనాలో పీటీఆర్‌ 16.3:1, బ్రెజిల్‌లో 20.9:1, రష్యాలో 19.8:1, దక్షిణాఫ్రికాలో 33.6:1గా ఉంది. పొరుగుదేశాలైన శ్రీలంకలో పీటీఆర్‌ 23.2:1, నేపాల్‌లో 23.1:1, భూటాన్‌లో 26.7:1, పాకిస్థాన్‌ 46.3:1.
* వివిధ రంగాల్లో అగ్రస్థాయిలో నిలిచిన దేశంలోని తొలి అయిదు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు స్థానం సంపాదించాయి. సోమవారం కేంద్ర ఆర్థికమంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2017-18 ఆర్థిక సర్వే నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. విదేశాలకు జరిగే ఎగుమతుల్లో తెలంగాణ 5వ స్థానం సాధించగా, దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్‌ 3వ స్థానంలో నిలిచింది. ఇళ్లకు వందశాతం విద్యుత్తు ఇచ్చిన రాష్ట్రాల సరసన ఏపీ నిలిచింది.
* దేశంలో చాలా రాష్ట్రాలు రాష్ట్ర ఆర్థిక సంఘాలను ఏర్పాటు చేసినా వాటి సిఫార్సులను కొన్నే పరిగణలోకి తీసుకున్నాయి. పంచాయతీరాజ్‌ డెవెల్యూషన్‌ నివేదిక (2015-16) ప్రకారం కర్ణాటక అత్యల్పంగా 11% సిఫార్సులను ఆమోదించింది. పశ్చిమబెంగాల్‌, ఏపీ, రాజస్థాన్‌లు 50% వరకు ఆమోదించాయి.
* కర్ణాటక, తమిళనాడు, కేరళతో పోలిస్తే ఏపీలో ఇంటి పన్ను వసూలు బాగానే ఉంది. ఇక్కడ 40% దాకా వసూలవుతోంది.
* కేరళ, ఏపీ, కర్ణాటకల్లో సొంత పన్ను వసూళ్లు, కొన్ని ప్రత్యక్ష పన్నులు వసూలవుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లాంటి రాష్ట్రాలు పూర్తిగా కేంద్రం పంచే పన్ను వాటాలపైనే ఆధారపడ్డాయి.
* గత దశాబ్ది కాలంలో ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో, రాయలసీమలోని కర్ణాటక సరిహద్దులో ఉన్న అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దాదాపు 0.5 డిగ్రీలమేర తగ్గాయి. దక్షిణ తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో 0.25 నుంచి 0.75 డిగ్రీల దాకా పెరిగాయి.
* పదేళ్లలో తెలంగాణలోని కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దునున్న కొన్ని జిల్లాల్లో మినహాయించి ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణల్లోని మిగతా జిల్లాల్లో వర్షపాతం 50 మిల్లీమీటర్ల వరకు పెరిగింది.
* లింగనిష్పత్తి విషయంలో దేశంలోని ప్రధాన రాష్ట్రాలకంటే ఈశాన్య రాష్ట్రాలే మంచి పనితీరు కనబరుస్తున్నాయి. ఏపీ, తమిళనాడులాంటి రాష్ట్రాల్లో వాటి అభివృద్ధి స్థాయితో పోలిస్తే లింగనిష్పత్తి పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఇప్పటికీ కుమారులకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు.
* కేరళ, తమిళనాడు, ఏపీ, గోవా, గుజరాత్‌, పంజాబ్‌లు ఇళ్లకు వందశాతం విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చాయి. బిహార్‌, ఝార్ఖండ్‌, నాగాలాండ్‌లలో ఇది 50%కంటే తక్కువ ఉంది.
* దేశంలో 18 హరిత విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. వాటిలో ఉత్తరాంధ్రలోని భోగాపురం, రాయలసీమలోని ఓర్వకల్లు ఉన్నాయి. తెలంగాణలోని కొత్తగూడెం విమానాశ్రయానికి కేంద్రం స్థలానుమతి దక్కింది.
* 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 5%, పట్టణ ప్రాంతాల్లో 31% మంది అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు. పట్టణీకరణ అధికంగా ఉన్న గుజరాత్‌, మహారాష్ట్ర, ఏపీలో అద్దె ఇళ్లలో ఉన్న వారి శాతం అధికంగా ఉంది. చిన్న పట్టణాల్లో 28% మంది, మధ్యస్థాయి పట్టణాల్లో 36% మంది, పెద్ద నగరాల్లో 40% మంది అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు.
* సేవల వృద్ధిలో ఏపీ 21వ స్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో చండీగఢ్‌, దిల్లీ, ఆరోస్థానంలో తెలంగాణ ఉన్నాయి.
* మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణల నుంచే అంతర్జాతీయంగా 70% ఎగుమతులు జరుగుతున్నాయి. ఇందులో మహారాష్ట్ర వాటా 22.3%, గుజరాత్‌ వాటా 17.2%, కర్ణాటక వాటా 12.7%, తమిళనాడు వాటా 11.5%, తెలంగాణ వాటా 6.4% ఉంది. ఏపీ వాటా కేవలం 2.8% మాత్రమే. ఎగుమతుల్లో తెలంగాణ దేశంలో 5వ స్థానంలో, ఏపీ 9వ స్థానంలో ఉన్నాయి.
* మొత్తం సాగుభూమిలో నికర సాగునీటి సౌకర్యం ఉన్న భూమి ఏపీలో 30%పైగా, తెలంగాణలో 20%పైగా ఉంది. ఈ విషయంలో ఏపీ దేశంలో 7వ స్థానంలో, తెలంగాణ 10వ స్థానంలో ఉన్నాయి.
* దేశీయ పర్యాటకులు అత్యధికంగా వచ్చిన తొలి అయిదు రాష్ట్రాల్లో ఏపీ మూడోస్థానంలో నిలిచింది. 2016లో దేశీయ పర్యాటకుల్లో 61.3% మంది తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, ఏపీ, మధ్యప్రదేశ్‌, కర్ణాటకలకు వచ్చారు.
* ఏపీలో 676 కి.మీ. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేశారు. తెలంగాణలో ఇది 119 కి.మీ.గా ఉంది.
* మన దేశంలో ఆడపిల్లల పట్ల వివక్షను రూపుమాపాల్సిన అవసరం ఉందని చాటడానికి ఆర్థిక సర్వే నివేదికను గులాబీ రంగు అట్టతో తీర్చిదిద్దారు. మహిళలపై హింసకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా ఈ రంగును ఎంచుకున్నారు. మగబిడ్డ మాత్రమే కావాలనుకునే ప్రాధాన్యాన్ని సమాజం విడనాడాల్సిన అవసరం ఉందని సర్వే పేర్కొంది. లింగ నిష్పత్తిలో అసమానతల వల్ల 6.30 కోట్ల మంది మహిళలు గల్లంతయ్యారని తెలిపింది. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఉపాధి, గర్భనిరోధక సాధనాల వాడుక, పాప కావాలా- బాబు కావాలా అనే ఎంపికల విషయంలో మాత్రం వెనుకబడిపోయిందని వివరించింది. సరళతర వ్యాపార నిర్వహణలో ర్యాంకును మెరుగుపరచుకున్నరీతిలోనే లింగ సమానత్వంలోనూ సాధించాలని ఆకాంక్షించింది.
* పనిచేసే మహిళల సంఖ్య 2005-06లో 36% ఉంటే 2015-16 నాటికి అది 24 శాతానికి తగ్గిపోయింది. మహిళలను విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రోత్సహించడానికి రాష్ట్రాలు, ఇతర భాగస్వామ్య సంస్థలు కీలకపాత్ర పోషించాలని సర్వే సూచించింది. మగపిల్లాడు పుట్టేవరకు పిల్లల్ని కంటూ ఉండే సంప్రదాయం చాలామందిలో ఉంది. దీనివల్ల సహజంగానే ‘అవాంఛిత’ ఆడపిల్లల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటివారు దాదాపు 2.10 కోట్ల మంది ఉంటారు.
* తమ ఆరోగ్యం విషయంలో నిర్ణయాలు తీసుకునే మహిళల సంఖ్య 2005-06లో 62.3% ఉంటే పదేళ్లలో అది 74.5 శాతానికి పెరిగింది. భౌతిక, భావోద్వేగ హింసకు గురికాని మహిళల సంఖ్య 63% నుంచి 71 శాతానికి పెరిగింది. తొలిసారి పిల్లల్ని కంటున్నవారి సగటు వయసు 1.3 ఏళ్లు పెరిగింది
* భారతీయుల ఆరోగ్యానికి పెను సవాల్‌ విసురుతున్న ముప్పుల్లో ‘‘మాతా శిశు పోషకాహార లోపం’’ ప్రధానమైనదిగా కొనసాగుతోందని ఆర్థిక సర్వే తెలిపింది. వాయు కాలుష్యం, ఆహార సంబంధిత ముప్పులు, రక్తపోటు, మధుమేహాలనూ ప్రధాన ఆరోగ్య ముప్పులుగా పేర్కొంది. అయినప్పటికీ భారతీయుల ఆరోగ్య స్థితిగతులు గణనీయంగా మెరుగుపడ్డాయని నొక్కిచెప్పింది. 1990 నుంచి 2015 మధ్య కాలంలో జీవన కాలం దాదాపు పదేళ్లు పెరగడమే దీనికి నిదర్శనమని వివరించింది. మరోవైపు వ్యాధుల నియంత్రణ, రోగులకు మెరుగైన చికిత్సల్లో.. నాణ్యమైన వైద్య సేవల అందుబాటు, కొనుగోలు శక్తి లాంటి అంశాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు తెలిపింది. అనారోగ్యం బారిన పడితే సొంతంగా ఖర్చుపెట్టాల్సిన మొత్తం (ఓవోపీఈ) 62 శాతంగా ఉంటోందని, ఇది పేదల పాలిట శరాఘాతంగా మారుతోందని, ఆర్థిక అసమానతలనూ పెంచుతోందని వివరించింది. వ్యాధి నిర్ధరణ పరీక్షల ధరలు ఒక్కోనగరంలో ఒక్కోలా ఉంటున్న విషయాన్నీ ప్రస్తావించింది. వీటి నాణ్యత తగ్గకుండా చూడటంతోపాటు ధరల హేతుబద్ధీకరణా జరగాల్సిన అవసరముందని అభిప్రాయపడింది.
* న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు పేరుకుపోతున్న ప్రభావం వివిధ ప్రాజెక్టుల అమలుపై కనిపిస్తోందని ఆర్థిక సర్వే పేర్కొంది. పనులు త్వరగా పూర్తి కావాలంటే తీర్పులు కూడా సకాలంలో రావాలని అభిప్రాయపడింది. ఈ విషయంలో న్యాయవ్యవస్థ, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలంది. కేసుల కారణంగా విద్యుత్తు, రైల్వేలు, రహదారుల మంత్రిత్వ శాఖలు చేపడుతున్న పనులు ఆగిపోతున్నాయి. ఇలాంటి కేసుల విలువ దాదాపు రూ.52 వేల కోట్లుగా ఉంది. ఈ కేసులు కోర్టులపైనా భారం మోపుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, న్యాయవ్యవస్థ కలిసి భారీ సంస్కరణలు చేపట్టాల్సి ఉంది. ఆర్థిక, వాణిజ్యానికి సంబంధించిన వ్యాజ్యాలు విచారించేలా కింది స్థాయి కోర్టులను బలోపేతం చేసి తద్వారా హైకోర్టు, సుప్రీంకోర్టులపై భారం తగ్గించాలి. కోర్టుల ఆధునికీకరణ, డిజిటలైజేషన్‌పై దృష్టి పెట్టి తగిన నిధులు కేటాయించాలి. మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉంటే వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. పెండింగ్‌ కేసుల్లో అలహాబాద్‌ హైకోర్టు ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ సివిల్‌/క్రిమినల్‌ కేసుల సగటు కాలం 10.71 సంవత్సరాలుగా ఉంది. కలకత్తా హైకోర్టులో 3.01 ఏళ్లు, మద్రాసు హైకోర్టులో 2.92 ఏళ్లు, బాంబే హైకోర్టులో 2.49 ఏళ్లుగా ఉంది.
* పన్ను సంబంధిత వివాదాల పరిష్కరణకు హైకోర్టుల్లో ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటుచేయాలని ఆర్థిక సర్వే సిఫార్సు చేసింది. ‘‘సుప్రీం కోర్టులో పన్ను వివాద పరిష్కార ధర్మాసనం చక్కగా పనిచేస్తోంది. ఇతర ఆర్థిక, వాణిజ్య అంశాలపైనా ఇలాంటి ధర్మాసనాలను ఏర్పాటుచేయాలి. హైకోర్టులూ ఇదే విధానాన్ని అనుసరించాలి’అని సర్వే సూచించింది. ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుచేసిన అనంతరం సుప్రీం కోర్టులో పోగుపడుతున్న పన్ను కేసుల కథ పూర్తిగా మారిందని వివరించింది. ‘ఇలాంటి ధర్మాసనాలతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్రత్యేక చట్టాలపై న్యాయమూర్తులు దృష్టికేంద్రీకరిస్తూ సమర్థంగా కేసులను పరిష్కరించగలుగుతారు’అని తెలిపింది. న్యాయవ్యవస్థపై పెరుగుతున్న పని ఒత్తిడి వల్లే పన్ను కేసులు పోగుపడుతున్నాయని పేర్కొంది.
* మూసధోరణికి భిన్నంగా ఈ ఏడాది ఆర్థిక సర్వే కళకళలాడింది. బాలీవుడ్‌ డైలాగులు, ప్రముఖ కవులు, నోబెల్‌ గ్రహీతల వ్యాఖ్యలతో తళతళ మెరిసింది. షేక్‌స్పియర్‌ నుంచి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వరకూ, జాన్‌ కీట్స్‌ నుంచి కీన్స్‌ వరకూ ప్రముఖ రచయితల వ్యాఖ్యలు చాలా అధ్యాయాల ప్రారంభంలో దర్శనమిచ్చాయి.