Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

రైల్వే బడ్జెట్ 2016-17

'రైల్వే బడ్జెట్ 2016-17' ను కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2020 నాటికి 'సౌకర్యాల రైలు'ను పట్టాల పైకి ఎక్కించి సామాన్యుడి దీర్ఘకాల ఆకాంక్షలకు పట్టం కట్టే ప్రణాళికలను ఈ సందర్భంగా రైల్వే మంత్రి ఆవిష్కరించారు. భారతీయ రైల్వేల సమున్నత భవితపైనే ప్రధానంగా దృష్టి సారించారు.
ప్రయాణికులపై, సరకు రవాణాపై కొత్తగా ఎలాంటి భారం మోపకుండా సురేష్ ప్రభు తన రెండో రైల్వే బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సవాళ్లను అధిగమించడం, రైల్వేల పునర్వ్యవస్థీకరణ, పునర్నిర్మాణం, పునరుజ్జీవనానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. సామర్థ్యం పెంపుపై ప్రధానంగా దృష్టి పెట్టారు. కొత్త ఆదాయ మార్గాలు, కొత్త విధానాలు, కొత్త వ్యవస్థలు అనే మూడు అంశాలు తన వ్యూహానికి ప్రాతిపదికలని చెప్పారు. 2019 కల్లా తూర్పు-పశ్చిమ, ఉత్తర-దక్షిణ, తూర్పు తీర ప్రత్యేక సరకు రవాణా రైలు మార్గాలను నిర్మిస్తామని గంటసేపు సాగిన తన బడ్టెట్ ప్రసంగంలో ప్రకటించారు.
ముఖ్యాంశాలు
ప్రయాణంలో నాణ్యతను పెంచేందుకు సురేష్ ప్రభు కొత్తగా మూడు రకాల సూపర్‌ఫాస్ట్ రైళ్లను ప్రవేశపెట్టారు.
1. హమ్‌సఫర్: ఇది మొత్తం థర్డ్ ఏసీ బోగీలతో భోజన సదుపాయంతో నడిచే రైలు.
2. తేజస్: ఇది వైఫై లాంటి అత్యాధునిక సేవలతో, వినోదం, స్థానిక వంటకాల హంగులతో 130 కిలోమీటర్ల వేగంతో నడిచే రైలు.
3. ఉదయ్: రాత్రి బయల్దేరి ఉదయంలోగా గమ్యస్థానం చేరే డబుల్ డెక్కర్ ఏసీ రైలు. అత్యంత రద్దీ మార్గాల్లో ప్రవేశపెడతారు.
ఇవికాక రిజర్వేషన్ లేని ప్రయాణికుల అగచాట్లను తీర్చేందుకు అంత్యోదయ సూపర్ ఫాస్ట్ ఏసీ రైళ్లను ప్రకటించారు.
2015-16 బడ్జెట్ అంచనాలకు 20% పెంపుతో తాజా బడ్జెట్‌లో రూ.1.21 లక్షల కోట్ల పెట్టుబడులను (ప్రణాళిక వ్యయం) ప్రతిపాదించిన సురేష్‌ప్రభు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడమే తన లక్ష్యమంటూ కొత్త ప్రాజెక్టుల ప్రకటనకు దూరంగా ఉన్నారు.
రైల్వే వ్యవస్థలో అన్ని రకాల ధరలను నిష్పాక్షికంగా నిర్ధారించేందుకు 'రైల్వే అభివృద్ధి ప్రాధికార సంస్థ'ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. తద్వారా పోటీతత్వం, ప్రమాణాలు పెరుగుతాయని, ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడవచ్చని చెప్పారు.
ఆన్‌లైన్‌లో నిమిషానికి 2000 టికెట్ల బుకింగ్ సామర్థ్యాన్ని 7200 టికెట్లకు పెంచామని వెల్లడించారు. 92,714 కోట్లతో 44 ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఈ ఏడాది కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 40 వేల కోట్లతో రెండు లోకోమోటివ్ ఫ్యాక్టరీలను నిర్మించనున్నట్లు ప్రకటించారు.

భారతీయ రైల్వే విజన్ 2020
1. డిమాండుకు అనుగుణంగా బెర్తుల రిజర్వేషన్ సదుపాయం.
2. 'భద్రమైన' ప్రయాణానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం.
3. కాపలాలేని లెవెల్ క్రాసింగులు పూర్తిగా తొలగింపు.
4. రైల్వేల సమయపాలన సామర్థ్యాన్ని 95%కి పెంచడం.
5. విశ్వసనీయ సేవల హామీతో సరకు రవాణాను సకాలంలో చేరవేయడం.
6. సగటున సరకు రైళ్లను గంటకు 50 కి.మీ., మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లను 80 కి.మీ. వేగంతో నడపడం.
7. మానవ విసర్జితాలు పట్టాలపై పడకుండా చర్యలు.
8. స్వర్ణ చతుర్భుజి వెంబడి సెమీ హైస్పీడ్ రైళ్లు నడపడం.
దివ్యాంగులపై ప్రభు కరుణ
     వికలాంగులను దివ్యాంగులని పిలిచి ప్రధాని మోదీ సమాజంలో వారికి సముచిత స్థానం కల్పించిన అనంతరం.. బడ్జెట్‌లో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సైతం వారిని అక్కునచేర్చుకున్నారు. వయోవృద్ధులపైనా ఆయన వరాలు కురిపించారు.
స్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా అన్ని సదుపాయాలూ వీరికి అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు.
ఏ1 తరగతి స్టేషన్లలోని అన్ని ప్లాట్‌ఫాంలలోనూ దివ్యాంగుల సౌకర్యార్ధం ఓ మరుగుదొడ్డి నిర్మాణం.
అంతర్జాలంలో టిక్కెట్టు బుక్ చేసుకునేటప్పుడు రాయితీ పొందేందుకు ఒకసారి రిజస్ట్రేషన్ చేసుకుంటే సరిపోయేలా వెసులుబాటు.
'చక్రాల కుర్చీ'లను సైతం అంతర్జాలంలో బుక్‌చేసుకునే సౌకర్యం.
సీట్లను సులువుగా గుర్తుపట్టేందుకు కొత్త రైలు పెట్టెల్లో ఉబ్బెత్తుగా ఉండే బ్రెయిలీ అక్షరాలతో నంబర్లు.
దివ్యాంగులకు సాయం చేసేందుకు కొంకణ్ రైల్వేలో 'సారథి' సేవలు విస్తరణ.
స్టేషన్లలో సదుపాయాలివీ...
స్టేషన్లలో 2,500 వాటర్ వెండింగ్ మిషన్లు.
ఇష్టమైన ఆహారం పొందేలా స్టేషన్లవారీగా ఈ-కేటరింగ్, మొబైల్ కేటరింగ్ సేవలు.
ఆదర్శ స్టేషన్లుగా తీర్చిదిద్దేందుకు ఎంపికచేసిన వెయ్యి స్టేషన్లలో 956 చోట్ల పనులు పూర్తి. కొత్తగా మరో 143 స్టేషన్ల ఎంపిక.
స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటును విస్తృతం చేస్తారు.
'స్వచ్ఛ రైల్-స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో భాగంగా 475 స్టేషన్లలో అదనంగా మరుగుదొడ్లను నిర్మిస్తారు.
ప్రయాణికులకు పరిశుభ్రమైన దుప్పట్లు అందించేందుకు యంత్రాలతో బట్టలను ఉతికే కేంద్రాలను ఏర్పాటుచేస్తారు. ప్రస్తుతం ఎంపికచేసిన స్టేషన్లలో వాడి పారేసే దుప్పట్లను అన్ని తరగతుల ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు.
స్టేషన్లలో 2,500 తాగునీటి విక్రయ యంత్రాలను ఏర్పాటుచేశారు.
దేశవ్యాప్తంగా 1,780 స్వయంచాలక (ఆటోమేటిక్) టికెట్ విక్రయ కేంద్రాలు, 225 నగదు-కాయిన్లు-స్మార్ట్ కార్డ్‌తో పనిచేసే టికెట్ విక్రయ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు.
స్టేషన్లలో సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు వాటిని నవీకరించనున్నారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో 400 స్టేషన్ల నవీకరణకు కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. భోపాల్‌లోని హబిబ్‌జంగ్ స్టేషన్‌ను నవీకరించడానికి టెండర్లు స్వీకరించారు. మరిన్ని పెద్ద, మధ్యస్థాయి స్టేషన్ల అభివృద్ధికి టెండర్లు పిలవనున్నారు. బహుపాక్షిక (మల్టీలేటరల్) పెట్టుబడుల సేకరణ, రాష్ట్రాలతో కలిసి స్టేషన్లను అభివృద్ధి చేసే విధానాలను పరిశీలిస్తారు.
రిజర్వేషన్ టికెట్ల రద్దుకు ఇకపై బుకింగ్ కౌంటర్ల వద్దకు వెళ్లకుండానే 139 హెల్ప్‌లైన్ నంబరు ద్వారా రద్దు చేసుకునే అవకాశం.
రైల్వేస్టేషన్లలో విశ్రాంతి గదులను గంటల ప్రాతిపదికన ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు ప్రతిపాదించారు. విశ్రాంతి గదుల నిర్వహణను ఐఆర్‌సీటీసీకి అప్పగిస్తారు.
అన్ని ఏ1 క్లాస్ స్టేషన్లను శ్రేష్ఠ కేంద్రాలు (ఎక్స్‌లెన్స్ సెంటర్లు)గా నిర్వహించేందుకు వీలుగా తగిన అధికారాలతో స్టేషన్ డైరెక్టర్లను నియమించనున్నారు.
స్టేషన్లను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు సామాజిక సంస్థల సహకారం తీసుకుంటారు.
స్థానిక కళలను ప్రోత్సహిస్తూ, స్టేషన్ల వద్ద కుడ్య చిత్రాలను ప్రోత్సహిస్తారు.
రైళ్లల్లో వసతులిలా...
ఏసీ బోగీల్లో చెత్త డబ్బాలు, 17 వేల బయో టాయిలెట్లు ఏర్పాటు చేస్తారు.
మహిళా బోగీలకు గట్టి భద్రత.
బోగీల్లో వేధింపుల నివారణకు శక్తి, నిర్భయ మహిళా దళాలు.
జనరల్ బోగీల్లో సెల్‌ఫోన్ ఛార్జింగ్ సదుపాయం.
స్టేషన్లలో టీవీలు, ఎస్కలేటర్లు, బ్యాటరీ వాహనాల ఏర్పాటు.
రద్దీ మార్గాల్లో తిరిగే పలు రైళ్లలో 884 బోగీలను పెంచి అదనంగా 65 వేల బెర్తులను అందుబాటులోకి తెచ్చారు.
ఐఆర్‌సీటీసీ ద్వారా ప్రయాణికులకు కోరుకున్న ఆహారం సరఫరా. పదార్థాల జాబితాలో ప్రాంతీయ వంటకాలకు చోటు.
రైలు ప్రారంభమైన తర్వాత శుభ్రత పనుల నిర్వహణ సదుపాయాన్ని మరో 74 రైళ్లలో కల్పించారు. త్వరలో మరో 400 రైళ్లలో ఈ సౌకర్యం కల్పిస్తారు.
డిబ్రూగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో బయో వాక్యూమ్ టాయిలెట్లు వినియోగంలోకి తెచ్చారు. ఇలాంటి సౌకర్యం ప్రపంచంలోని ఇంకే రైల్వేల్లోనూ లేదు.
నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రైళ్ల జాప్యాన్ని నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. భవిష్యత్తులో వీటిని మరింత సమర్థంగా అమలుచేస్తారు.
వయో వృద్ధులకు
ప్రతిపెట్టెలోనూ కింది బెర్తుల్లో కోటా పెంపు. ఫలితంగా ఓ రైలులో దాదాపు 120 సీట్ల కేటాయింపు.
కింది బెర్తుల కోటా పెంపు
మరిన్ని ఎస్కలేటర్లు, లిఫ్టులు
పిల్లలకు
స్టేషన్, రైళ్లలో పాలు, మరగబెట్టిన నీళ్లు
మరుగుదొడ్డి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు
విద్యార్థులకు
100 మంది ఇంజనీరింగ్, ఎంబీఏ విద్యార్థులకు రైల్వేలో ఆర్నేళ్లపాటు శిక్షణ
పాత్రికేయులకు
రాయితీ పాసులపై పాత్రికేయులు ఆన్‌లైన్‌లో టికెట్ పొందే వీలు.
ప్రవాస భారతీయులకు
విదేశీ కార్డులతో అంతర్జాలంలో టిక్కెట్లు బుక్‌చేసుకునే సదుపాయం
పర్యటకులకు
గైడ్లు, పర్యటక వలయ యాత్రలు.
హైటెక్ సేవలు
     ఈ-టికెటింగ్ వ్యవస్థ సామర్థ్యాన్ని నిమిషానికి 2 వేల టికెట్ల స్థాయి నుంచి 7200 టికెట్లకు పెంచారు. లోగడ ఏకకాలంలో 40 వేల సామర్థ్యం ఉండగా.. దాన్ని 1.2 లక్షలకు మందికి సేవలందించేలా స్థాయిని పెంచారు.
అన్‌రిజర్వ్‌డ్, ప్లాట్‌ఫామ్ టికెట్లు కొనుగోలు కోసం మొబైల్ ఆధారిత యాప్‌లను ప్రవేశపెట్టారు. సాధారణ, రిజర్వేషన్ టికెట్ల కొనుగోలుకు నగదురహిత 'గో ఇండియా స్మార్ట్ కార్డు'ను అందుబాటులోకి తెచ్చారు.
ఎంపిక చేసిన రైళ్లు, స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం కల్పించారు. ఈ ఏడాది వంద స్టేషన్లలో ఆ సౌకర్యాన్ని కల్పించాలన్నది లక్ష్యం. రెండేళ్లలో మరో 400 స్టేషన్లకు విస్తరణ.
రైలు బోగీలు లభించే సౌకర్యాలను వివరిస్తూ సమాచార బోర్డులను ఏర్పాటు చేస్తారు.
రాబోయే స్టేషన్ల సమాచారాన్ని పేర్కొంటూ రైలు పెట్టెల్లో జీపీఎస్ ఆధారిత డిజిటల్ డిస్‌ప్లేలు ఏర్పాటవుతాయి.
2 వేల స్టేషన్లలో 20 వేల స్క్రీన్లతో కూడిన హైటెక్ కేంద్రీకృత నెట్‌వర్క్ ఏర్పాటు పనులు సాగుతున్నాయి.
నిరీక్షణ జాబితా టికెట్‌కు బెర్తు లభించగానే ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం అందివ్వడం, దిగాల్సిన స్టేషన్ రాగానే నిద్రలేపేలా వేక్అప్ కాల్స్ సౌకర్యం కల్పించారు.
ఎంపిక చేసిన స్టేషన్లలో ప్రయోగాత్మకంగా బార్ కోడ్ కలిగిన టికెట్లు, స్కానర్ల ఏర్పాటు.
ఎఫ్ఎం రేడియో స్టేషన్ల ద్వారా రైళ్లలో వినోదం.
స్మార్ట్ కోచ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదన. ఈ పెట్టెల్లో స్వయంచాలిత తలుపులు, బార్‌కోడ్ రీడర్లు, బయో వాక్యూమ్ టాయ్‌లెట్లు, నీటి పరిమాణ సూచీలు, సౌకర్యవంతమైన సీట్లు, చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, విక్రయ యంత్రాలు, వినోద తెరలు, ప్రకటనల కోసం ఎల్ఈడీ తెరలు, స్పీకర్లు ఉంటాయి.
ప్రయాణికుల భద్రత, సమస్యలపై ఫిర్యాదుకు 182, 138 హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులోకి తెచ్చారు.
ట్విట్టర్‌లో ఫిర్యాదుచేసే వీలు కల్పించారు. బోగీని శుభ్రపరచమని ఎస్సెమ్మెస్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు 'క్లీన్ మై కోచ్' సర్వీసు అందుబాటులోకి రానుంది.
టికెట్‌ను బుక్ చేసుకున్నప్పుడే కోరుకుంటే ప్రయాణ బీమాను పొందే అవకాశం కల్పించనున్నారు.
5 రైల్వే ఆసుపత్రుల్లో 'ఆయుష్' సేవలను ప్రవేశపెడతారు.
సబర్బన్, స్వల్పదూరం వెళ్లే ప్రయాణికుల కోసం చేతిలో ఇమిడే యంత్రాలతో టికెట్లు జారీ చేస్తారు.
ప్లాట్‌ఫాం టికెట్ విక్రయ యంత్రాల్లో నగదుతో పాటు క్రెడిట్, డెబిట్ కార్డులూ పనిచేసేలా ఏర్పాట్లు.
2015 నుంచి అమలవుతున్న వికల్ప్ (ప్రత్యామ్నాయ రైలు ప్రయాణ ఏర్పాటు వ్యవస్థ) విస్తరిస్తారు.
చెన్నైలో ఆటోహబ్
     భారతీయ రైల్వే సరకు రవాణాలో బొగ్గు, ముడి ఇనుము, సిమెంట్, ఆహారధాన్యాలు వంటి పది రకాలదే కీలకపాత్ర. వీటితోపాటు వాణిజ్యానికి ఎక్కువ అవకాశమున్న ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ రంగ ఉత్పత్తులకు ప్రముఖ స్థానం కల్పించాలని రైల్వేశాఖ యోచిస్తోంది. సరకు రవాణా ఛార్జీల పెరుగుదల, ప్రధాన రంగాల్లో ఉత్పత్తి తక్కువ ఉండడంతో రైల్వేల్లో సరకు రవాణా కొంతకాలంగా తగ్గుతూ వస్తోంది. రోడ్డు రవాణాతో ఉన్న పోటీని తట్టుకుని మొత్తం సరకు రవాణాలో రైల్వేల వాటాను 36 నుంచి 45 శాతానికి పెంచడం తమ లక్ష్యమని రైల్వే బోర్డు ఛైర్మన్ ఏకే మిత్తల్ చెప్పారు. 2024 కల్లా దీన్ని సాధించాలంటే ప్రధాన రంగాలతోపాటు మిగిలిన రంగాల ఉత్పత్తులు రవాణా అయ్యేలా సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. ఇందుకోసం చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు.
సరకు రవాణా రైళ్ల కోసం సమయసారిణిని (టైమ్‌టేబుల్‌) రూపొందిస్తారు.
ఆటోమొబైల్ రంగం నుంచి రవాణా ఆర్డర్లు పెంచుకోవడానికి చైన్నెలో ఆటోహబ్‌ను ప్రారంభించనున్నారు. ఇక్కడి నుంచి కార్లను రైళ్ల ద్వారా రవాణా చేస్తారు.
నేరుగా సరకుతో నిండిన లారీలనే వ్యాగన్‌లోకి ఎక్కించి గమ్యస్థానానికి చేర్చే 'రోల్ ఆన్- రోల్ ఆఫ్ 'వ్యవస్థను లేదా కంటైనర్ల మాదిరిగా ఉండే రైళ్లను ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నారు.
ప్రత్యేకంగా సరకు రవాణా కోసమే మరో మూడు కారిడార్లను ప్రవేశపెట్టనున్నారు. పశ్చిమ, తూర్పు నడవాల్లో 56 కి.మీ. ఈ సంవత్సరం అందుబాటులోకి రానుంది. 2019 కల్లా ఇవి పూర్తిస్థాయిలో సిద్ధమవుతాయి.
ఆధ్యాత్మిక ప్రాంతాలకు 'ఆస్థా' రైళ్లు
    భారత్‌లో విహారయాత్ర అంటే దాదాపుగా ఆధ్యాత్మికయాత్రే. ఈ సంగతిని గుర్తించిన రైల్వేశాఖ ఆధ్యాత్మిక కేంద్రాలైన అజ్మీర్, అమృత్‌సర్, బిహార్ షరీఫ్, చెంగనూర్, ద్వారక, గయ, హరిద్వార్, మధుర, నాగపట్నం, నాందేడ్, నాసిక్, పాలి, పార్శనాథ్, పూరి, తిరుపతి, వేలాంకణి, వారణాసి, వాస్కో స్టేషన్లలో సౌకర్యాలను పెంచడంతోపాటు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతామని తాజా బడ్జెట్‌లో వెల్లడించింది. ఈ యాత్రా స్థలాలను అనుసంధానిస్తూ ఆస్థా వలయ రైళ్లను కూడా నడపనుంది.
మరోవైపు, టిక్కెట్టేతర ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 400 స్టేషన్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద అభివృద్ధి చేయనుంది. మంత్రి మండలి ఈ విషయమై ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో హబీబ్‌గంజ్ స్టేషన్ అభివృద్ధికి బిడ్ దాఖలైంది. మిగిలిన 4 స్టేషన్లకు బిడ్డింగ్ కొనసాగుతోంది.
కొన్ని స్టేషన్లను రాష్ట్రప్రభుత్వాల భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తారు.
రైల్వేస్టేషన్లలో కుడ్యచిత్రాలు అమర్చుతున్నారు. ఇందులో వన్యప్రాణి సంరక్షణవంటి ఇతివృత్తాలను తీసుకుంటున్నారు. దీనివల్ల ప్రయాణికులకు పర్యావరణ అంశాలపై అవగాహన ఏర్పడుతుందనేది రైల్వేశాఖ ఉద్దేశం.
సవాయ్ మాధోపూర్‌లో వన్యప్రాణి సంరక్షణ ఇతివృత్తంతో కుడ్యచిత్రాలు ఇప్పటికే ఏర్పాటు చేశారు. హజారియాబాగ్, బొరివలి, ఖార్, ఉదయ్‌పూర్, బికనీర్ తదితర స్టేషన్ల గోడలపై స్థానికుల నైపుణ్యంతో సిద్ధమైన కుడ్యచిత్రాలు కొలువుతీరనున్నాయి.
హైస్పీడ్ రైళ్ల ప్రాజెక్టుకు ప్రత్యేక సంస్థ
    దేశంలో హైస్పీడ్ రైలు మార్గాల ప్రాజెక్టుల్ని చేపట్టడం కోసం ప్రత్యేక సంస్థను ఫిబ్రవరిలోనే నమోదు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో భారతీయ రైల్వేలకు సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పాదక సామర్థ్య ప్రయోజనం కలుగనుంది.
దీర్ఘకాల అవసరాలపై దృష్టి
    రైల్వే శాఖ దీర్ఘకాల అవసరాలను తీర్చే లక్ష్యంతో జాతీయ రైల్వే ప్రణాళిక (నేషనల్ రైల్ ప్లాన్- 2030) ఏర్పాటైంది. ప్రయాణికులకు అత్యాధునిక సాంకేతికతను అందుబాటులో ఉంచడంతో పాటు మెరుగైన సేవలను అందించడం ఈ ప్రణాళిక లక్ష్యం. రైల్వే ప్రణాళికలో రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత కేంద్ర మంత్రుల భాగస్వామ్యం తీసుకోనున్నారు. 15 ఏళ్లలో ప్రణాళిక లక్ష్యాలను సాధిస్తారు.
బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న విశ్లేషణలు
ఏకీకరణ్: రైల్వే పరిధిలోని కంపెనీలను ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారు. వాటిని మరింత బలోపేతం చేస్తారు. అనుబంధ పరిశ్రమల ఆస్తులనూ పూర్తిగా వినియోగించుకుంటారు.
శోథ్, వికాస్: హైస్పీడ్‌రైలు, సిగ్నలింగ్ వ్యవస్థ తదితరాల మెరుగుకు ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికతను వాడుతున్న దేశాల సహకారాన్ని, భాగస్వామ్యాన్ని త్వరలో తీసుకుంటారు. ఇందుకోసం ఫారెన్ రైల్ టెక్నాలజీ కార్పొరేషన్ స్కీం (ఎఫ్ఆర్‌టీసీఎస్) ఏర్పాటవుతుంది.
శ్రేష్ట: పరిశోధన, అభివృద్ధిని నిరంతరం చేసేందుకు స్ట్రాటజిక్ టెక్నాలజీ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్‌మెంట్ (శ్రేష్ట) విభాగం ఏర్పాటుకానుంది. ప్రముఖ శాస్త్రవేత్త నేతృత్వం వహించే ఈ విభాగంలో శాస్త్రవేత్తలు, రైల్వే నిపుణులు సభ్యులుగా ఉంటారు. ఈ విభాగంలో ప్రస్తుతం ఉన్న రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్‌వో) ఏ రోజుకారోజు అంశాలనే పరిశీలిస్తోంది.
విశ్లేషణ్: నిర్వహణ, పెట్టుబడి ఖర్చు తగ్గింపునకు స్పెషల్ యూనిట్ ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ రీసెర్చ్ అనలిటిక్స్ (సూత్ర) ఏర్పాటుకానుంది. నిపుణులైన విశ్లేషకులను ఇందుకోసం నియమిస్తారు.
నవ్‌రచన: ఉద్యోగులు, ఇతర స్టార్టప్‌ల నవ్యావిష్కరణలను ప్రోత్సహించేందుకు రూ.50 కోట్లు కేటాయించారు. సంక్లిష్ట సమస్యలను కూడా ఇది పరిష్కారం చూపుతుంది. రైల్వేకు 'కాయకల్ప్' సేవలందిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటాతో పాటు, ప్రసిద్ధ పెట్టుబడిదారులు, రైల్వేబోర్డు, భారత రైల్వే జాతీయ అకాడమీ ప్రతినిధులు ఆవిష్కరణలను గుర్తిస్తారు. తక్కువ ఎత్తున్న ప్లాట్‌ఫారాలపై దిగే సౌకర్యం, స్టేషన్ల డిజిటల్ సామర్థ్యం పెంపు, కోచ్‌ల సామర్థ్యం పెంపును ఈ ఏడాది లక్ష్యాలుగా నిర్దేశించారు.
రైల్వే ప్రాజెక్టుల పర్యవేక్షణకు డ్రోన్లు, ఉపగ్రహాలు
    దేశంలోని ప్రధాన రైల్వే ప్రాజెక్టుల అమలు తీరును భౌతికంగా పరిశీలించడానికి అధునాతన డ్రోన్‌లతోపాటు జియో స్పేషియల్ ఆధారిత ఉపగ్రహ పరిజ్ఞానాన్ని వినియోగించాలని రైల్వేలు కసరత్తు చేస్తున్నాయి. వీటిని 2016-17 నుంచి వినియోగంలోకి తీసుకురానున్నాయి. సరకు రవాణాకు ప్రత్యేకించిన మార్గ ప్రాజెక్టు పురోగతిని దీని సాయంతో పర్యవేక్షించనున్నారు. ప్రస్తుతం రైల్వేలు ఏటా 100 టెరాబైట్లకు పైగా డేటాను సేకరిస్తున్నాయి. దీన్ని విశ్లేషించడానికి రవాణా పరిశోధన, విశ్లేషణ ప్రత్యేక కేంద్రా (సూత్రా)న్ని ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు.
నౌకాశ్రయాల అనుసంధానంతో అభివృద్ధి
      భారత్‌లాంటి సుదీర్ఘ తీరరేఖ గల దేశాల్లో వాణిజ్యంలో సముద్ర రవాణాది అత్యంత కీలకపాత్ర. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రం తాజా రైల్వే బడ్జెట్‌లో నౌకాశ్రయాల అనుసంధానానికి అగ్రతాంబూలం ఇస్తున్నట్లుగా వెల్లడించింది. గతేడాది తీరప్రాంత అనుసంధాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్రం.. ఈ ఏడాది ట్యూనా పోర్ట్‌తో రైలు మార్గం అనుసంధానం ప్రక్రియ ముగిసినట్లు ప్రకటించింది. ప్రస్తుతం జాయ్‌గఢ్, దిఘీ, రేవాస్, పారదీప్ నౌకాశ్రయాలు రైల్వే లైనుతో అనుసంధానించే ప్రక్రియ వేగంగా సాగుతోంది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో నార్గోల్, హజీరా నౌకాశ్రయాలను రైలు మార్గంతో అనుసంధానించే ప్రక్రియను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టనున్నారు.
భారత్‌కున్న 7,517 కిలోమీటర్ల తీరరేఖ వెంబడి ఉన్న పోర్టులను రైలు మార్గంతో అనుసంధానించడానికి ఉత్సుకతగా ఉన్న కేంద్రం ఈ విషయంలో భాగస్వామ్య పద్ధతిలో వచ్చిన ఏ చిన్న ప్రతిపాదననీ వదులుకోరాదనే దృక్పథంతో ఉంది.
ఈశాన్యంతో మరింత అనుసంధానం
      ఈశాన్య రాష్ట్రాలను భారత్‌లోని మిగిలిన ప్రాంతాలతో మరింతగా అనుసంధానించేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ విషయమై తీసుకుంటున్న చర్యల ఫలితంగా.. అస్సాంలోని లుండింగ్-సిల్చార్ సెక్షన్‌లోని బ్రాడ్‌గేజ్ మార్గం ఈ ఏడాది ప్రారంభమైంది. దీనివల్ల దేశంలోని మిగిలిన ప్రాంతంతో బరాక్ లోయకు అనుసంధానం ఏర్పడింది. త్రిపుర రాజధాని అగర్తలాకు బ్రాడ్‌గేజ్ సదుపాయం లభించింది. ఈశాన్య రాష్ట్రాల అన్ని రాజధానులకు 2020 కల్లా రైలు కూత వినిపించేలా చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించుకుంది.
ఈశాన్య రాష్ట్రాలకు బడ్జెట్‌లో మొత్తంగా రూ.5,340 కోట్లు కేటాయించారు. 2009-2014 మధ్య బడ్జెట్ కేటాయింపుల సగటుతో పోల్చితే ఇది 151 శాతం ఎక్కువ.
కథాఖల్-బైరాబి, అరుణాచల్-జరిబామ్ మార్గాల గేజ్‌మార్పిడి ప్రక్రియ త్వరలోనే పూర్తవనుంది. అప్పుడు దేశ బ్రాడ్‌గేజ్ చిత్రపటంలో మిజోరాం, మణిపూర్‌లకు చోటు దక్కుతుంది.
కాట్రా-బనిహాల్ సెక్షన్‌లోని ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న 95 కిలోమీటర్ల సొరంగంలో 35 కి.మీ. పనులు పూర్తయ్యాయి.
కశ్మీర్‌లోయను దేశంతో అనుసంధానించే జలంధర్-జమ్మూమార్గంలో 2 వంతెనల డబ్లింగ్ పనులు మార్చిలో పూర్తవనున్నాయి.
2024కి బుల్లెట్ రైలు!
గంటకు 200 కి.మీ.ల వేగానికి మించితే దాన్ని హైస్పీడ్ రైలుగా గుర్తిస్తారు. మన దేశంలో ఇప్పటిదాకా ఇంత వేగంతో ప్రయాణించగలిగిన మార్గం.. రైలు ఒక్కటీ లేదు. ఈ విషయంలో పొరుగుదేశం చైనా కూడా చాలా ముందుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2024కి ముంబయి - అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలును అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ మార్గానికి కేంద్రం కూడా ఆమోదించింది. దాని కంటే ముందు 'సెమీ హైస్పీడ్' మార్గాల వైపు దృష్టిసారించారు. ఈ రైళ్ల వేగం గంటకు 160 కి.మీ. వరకూ ఉంటుంది. ఇలాంటి మార్గాలు మొత్తం 9 ప్రతిపాదించగా ఒక్క దిల్లీ-ఆగ్రా మార్గం పూర్తయింది. దీని ప్రయోగాత్మక పరుగును నిర్వహించారు.
దేశంలో బుల్లెట్ రైళ్లను.. రైలు మార్గాలను నిర్మించేందుకు జపాన్ ఆసక్తి చూపుతోంది. దీనికి సంబంధించి పలు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. వాటిలో 500 కిలోమీటర్ల ముంబయి-అహ్మదాబాద్ మార్గం మొదటిది!
ముంబయి - అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గం స్థితి
బుల్లెట్ రైలు పట్టాలెక్కడానికి 9 ఏళ్లు పడుతుంది.
అత్యధిక వేగం 350 కిలోమీటర్లు.
ఈ మార్గంలో నాన్‌స్టాప్‌గా వెళితే 2 గంటల్లో, ఆపుతూ వెళ్తే 3 గంటల్లో గమ్యం చేరుకోవచ్చు.
నిర్మాణ వ్యయం అంచనా రూ.లక్ష కోట్లు.
పూర్తి ప్రయాణం టికెట్ ధర రూ.2700.

రైలు పేరు
సగటు వేగం కి.మీ.
రాజధాని/శతాబ్ది
85-90
సూపర్‌ఫాస్ట్
55
మెయిల్/ఎక్స్‌ప్రెస్
50
ఈఎంయూ
40
ప్యాసింజర్
36

రైళ్లలో ఇక 'తేజస్సు'
      హమ్‌సఫర్, తేజస్, ఉదయ్... ఇవి రిజర్వేషన్ సదుపాయంతో కూడిన ప్రయాణం కోసం కొత్త బడ్జెట్లో ప్రతిపాదించిన రైళ్ల రకాలు. టికెట్ ధరలు, ఇతర విధానాల ద్వారా ఖర్చును రాబట్టుకునేందుకు మొదటి రెండు రకాల రైళ్లు వీలు కల్పిస్తాయి.
హమ్‌సఫర్‌లో అన్నీ తృతీయశ్రేణి ఎ.సి. పెట్టెలే ఉంటాయి. కావాలంటే వీటిలో భోజనం సరఫరా చేస్తారు.
తేజస్ రైళ్లు భవిష్యత్తులో భారతదేశంలో ప్రయాణం ఎలా ఉండబోయేదీ చాటుతాయి. వీటి కనీస వేగం గంటకు 130 కిలోమీటర్లు. ఈ రైళ్లలో వినోదాన్ని అందించే ఏర్పాట్లు ఉంటాయి. స్థానిక వంటకాలు లభిస్తాయి. వైఫై వాడుకోవచ్చు.
ఉదయ్ అనేది 'ఉత్కృష్ట్ డబుల్ డెకర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రి'కి సంక్షిప్త రూపం. బాగా రద్దీ ఉండే మార్గాల్లో రాత్రిపూట ప్రయాణానికి వీలుగా ఈ రైళ్లను నడుపుతారు. మామూలు రైళ్ల కంటే 40% ఎక్కువమందిని ఇవి తీసుకుపోగలవు.
ఇక సాధారణ ప్రయాణికుల కోసం... రిజర్వేషన్ అవసరం లేని సాధారణ పెట్టెలతో కూడిన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లను అంత్యోదయా ఎక్స్‌ప్రెస్‌ల పేరుతో నడుపుతారు. కిక్కిరిసిన రైళ్లు తిరిగే మార్గాల్లో వీటిని ప్రవేశపెడతారు.
దూరప్రాంత రైళ్లలో రెండు నుంచి నాలుగు చొప్పున 'దీన్‌దయాళ్ కోచ్'లను సాధారణ తరగతి ప్రయాణికుల కోసం జత చేస్తారు. వీటిలో సురక్షితమైన తాగునీరు లభిస్తుంది.
రైల్వేల ఉన్నతికి ఏడు లక్ష్యాలు
      భారతీయ రైల్వేలను సమూలంగా మార్చివేయటానికి రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు ఒక సమగ్ర కార్యాచరణ పథకాన్ని ప్రకటించారు. సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంపొందించుకోవటం నుంచి రైళ్ల వేగాన్ని పెంచటం; అంతర్గతంగా ఆదాయ, వ్యయాలపై కచ్చితమైన నియంత్రణను నెలకొల్పటం వరకూ వివిధ అంశాలతో కూడిన ఏడు లక్ష్యాలను 'అవతారాలు' పేరుతో వివరించారు.
1. 20 టన్నుల సామర్థ్యం
      సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంపొందించుకోవటం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవటం. దీంట్లోభాగంగా గూడ్సురైళ్లలోని ఒక్కో వ్యాగన్ 25 టన్నుల సరుకును తీసుకెళ్లేలా చర్యలు. 2016-17 నాటికి మొత్తం సరుకు రవాణాలో 10-20 శాతం, 2019-20 నాటికి 70 శాతం ఈ 20 టన్నుల సామర్థ్యమున్న వ్యాగన్ల ద్వారా జరపాలన్నది లక్ష్యం.
2. ప్రమాదరహితం
      ప్రమాదాల నివారణే లక్ష్యంగా పటిష్ఠమైన చర్యలు. ఇవి రెండు రకాలు..
కాపలా లేని రైల్వే లెవెల్ క్రాసింగ్‌లను పూర్తిగా తొలగించటం. మొత్తం ప్రమాదాల్లో 40 శాతం, మొత్తం మరణాల్లో 68 శాతం కాపలాలేని లెవెల్ క్రాసింగ్‌ల వద్దే జరుగుతున్నాయి. వీటివల్ల రైళ్ల వేగం కూడా తగ్గిపోయి మొత్తం రైల్వే వ్యవస్థపైన ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో బ్రాడ్‌గేజ్ మార్గంలో కాపలాలేని లెవెల్ క్రాసింగ్‌లను వచ్చే మూడునాలుగేళ్లలో పూర్తిగా తొలగించటానికి అన్నిరకాల ప్రయత్నాలు.
రైళ్లు ఎదురెదురుగా ఢీకొనకుండా నిరోధించే టెక్నాలజీని మనదేశంలోని నిపుణులు అభివృద్ధిపరిచారు. దీనివల్ల రైలుప్రమాదాలను నివారించటమేగాక రైళ్ల వేగాన్ని పెంచటం కూడా సాధ్యమవుతుంది. ఈ సాంకేతికతను మూడేళ్లలో అన్నిరైళ్లలోనూ అమర్చాలన్నది లక్ష్యం.
3. కొనుగోళ్ల విధానం
      అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రైల్వే విభాగం కొనుగోళ్ల విధానాన్ని రూపొందించుకోవటం. దీంట్లోభాగంగా ఇప్పుడున్న వినియోగ పద్ధతులను సమీక్షించి వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేలా మెరుగుపరచటం, వృథాను అరికట్టి 2016-17లో రూ.1500 కోట్ల మొత్తాన్ని ఆదా చేయటం లక్ష్యం. తుక్కును గుర్తించి, వదిలించుకోవటంపైనా త్వరలో కొత్త విధాన రూపకల్పన.
4. కొత్త సైడింగ్‌ల ఏర్పాటు
      రైల్వేట్రాఫిక్‌లో 85 శాతం.. సరుకు టెర్మినళ్లు, ప్రైవేట్ సైడింగ్‌ల ద్వారా జరుగుతోంది (సరుకులను గూడ్స్‌రైలులోకి తరలించే లేదా రైల్లోంచి సరుకులను దించే కేంద్రాన్ని టెర్మినల్ అంటారు. సరుకు రవాణా కోసం ప్రైవేట్‌సంస్థల వరకూ వేసిన రైలుమార్గాన్ని సైడింగ్ అని పిలుస్తారు). ప్రస్తుతం కొత్తగా మరో 400 సైడింగ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలున్నాయి. వీటిలోంచి కనీసం 100 సైడింగ్స్‌ను మరో రెండేళ్లలో ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ప్రస్తుత సైడింగ్/ ప్రైవేట్ సరుకురవాణా విధానాన్ని సమీక్షించి ప్రైవేట్‌సంస్థల భాగస్వామ్యానికి అవకాశం కల్పించేదిశగా కృషిచేస్తారు. కొత్త దరఖాస్తుల ఆమోదం కోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్ఏర్పాటు చేస్తారు.
5. సరకు రవాణా మార్గాలు
      దిల్లీ-ముంబయి, దిల్లీ-కోల్‌కతా మధ్య సరకు రవాణాకు ప్రత్యేకంగా ఏర్పాటైన రెండు మార్గాలను 2019లోగా ప్రారంభించటం. ఇప్పుడున్న గూడ్సురైళ్లను ఈ ప్రత్యేకమార్గాల్లోకి తరలించటం వల్ల.. ప్రయాణికుల రైళ్ల సేవలను మరింత మెరుగుపరచటానికి వీలవుతుంది.
6. వేగంలో వృద్ధి
      రానున్న ఐదేళ్లలో సరుకు రవాణా (గూడ్సు) రైళ్ల సగటు వేగాన్ని రెట్టింపు చేయటం. సూపర్‌ఫాస్ట్ మెయిల్/ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సగటు వేగాన్ని ఇప్పుడున్నదానికన్నా 25 కి.మీ./గంట అదనంగా పెంచటం. లోకో ప్యాసింజర్ రైళ్ల (ఇంజిన్‌ను అనుసంధానించి నడిపే రైళ్ల) స్థానంలో ఈఎంయూ (ఇరువైపులా ఇంజిన్లుండే) రైళ్లను రానున్న ఐదేళ్లలో ప్రవేశపెట్టేందుకు చర్యలు.
7. లావాదేవీల్లో కచ్చితత్వం
      రైల్వేల్లో జరుగుతున్న వ్యయాన్ని కచ్చితంగా లెక్కించే పద్ధతులను ఇప్పటివరకూ పాటించలేదు. దీనిని ఇకపై సమూలంగా మార్చటానికి ప్రయత్నాలు. ఏకపద్దుల విధానం నుంచి జంటపద్దుల విధానానికి మారటం, నగదు ఆధారిత ఖాతాల నుంచి మెరుగైన అక్రూయల్ ఖాతాలకు మారటం వంటి చర్యలు. ఆదాయ, వ్యయాలను కచ్చితంగా లెక్కించే పద్ధతులను పాటించటం.
రోజుకు 7 కి.మీ. కొత్త మార్గం
      
ప్రపంచంలో అతిపెద్ద రైల్వేలలో ఒకటైన భారతీయ రైల్వే సంస్థ తన పరిధిని మరింతగా విస్తరించటానికి, ఆధునికతను అందిపుచ్చుకోవటానికి వడివడిగా అడుగులేస్తోంది. ఈ లక్ష్యం దిశగా పయనాన్ని ప్రారంభించిన కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం 2016-17 బడ్జెట్‌లోనూ దానిని వేగవంతం చేసే చర్యలను ప్రతిపాదించింది.
2016-17 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2800 కి.మీ. పొడవైన బ్రాడ్‌గేజ్ రైల్వే ట్రాక్‌ను వినియోగంలోకి తీసుకురావాలని రైల్వే మంత్రి ప్రతిపాదించారు. ప్రస్తుత ఏడాది (2015-16)లో 2500 కి.మీ. రైల్వే మార్గాన్ని బ్రాడ్‌గేజ్‌గా మార్చారు.
గత ఆరేళ్లుగా సగటున రోజుకు 4.3 కి.మీ. చొప్పున బ్రాడ్‌గేజ్ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. దీనిని రోజుకు 7 కి.మీ.కి పెంచనున్నారు. 2017-18లో రోజుకు 13 కి.మీ. చొప్పున, 2018-19లో 19 కి.మీ. చొప్పున ఉండేలా నిర్మాణ వేగాన్ని పెంచనున్నారు.
రైల్వే లైన్ల విద్యుదీకరణ శీఘ్రతరం కానుంది. 2016-17లో ఈ పనుల లక్ష్యాన్ని 2000 కి.మీ.గా నిర్దేశించారు. ప్రస్తుత ఆర్థిక సంత్సరం లక్ష్యం 1600 కి.మీ. దేశంలో 40 శాతం రైలు మార్గాల్లోనే విద్యుదీకరణ జరిగింది. మిగిలిన 60 శాతం మార్గాల్లో డీజిల్ ఇంజిన్లే ఆధారం.
సరకు రవాణాకు ప్రత్యేక కారిడర్లు: సరకు రవాణాకు ఉద్దేశించిన ప్రత్యేక కారిడర్ల నిర్మాణ పనులను వేగవంతం చేసినట్లు రైల్వే మంత్రి తెలిపారు. ఈ ప్రత్యేక కారిడర్లలో గత 6 ఏళ్లలో రూ.13000 కోట్ల విలువైన పనులను గుత్తేదార్లకు అప్పగించగా, తాను మంత్రి పదవి చేపట్టిన ఈ రెండళ్లలోనే రూ.24000 కోట్ల పనులు అప్పగించటం జరిగిందన్నారు. ప్రధానంగా మూడు మార్గాలు...దిల్లీ-చెన్నై, ఖరగ్‌పూర్-ముంబయి, ఖరగ్‌పూర్-విజయవాడ మార్గాలను నిర్దేశిత సమయంలో నిర్మించటానికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో చేపట్టనున్నట్లు వెల్లడించారు.
బుల్లెట్ రైలు మార్గం: దేశంలోనే తొలిసారిగా నిర్మించనున్న ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గం కోసం ఈ నెలలోనే ప్రత్యేక వాహకం నమోదు. జపాన్ ప్రభుత్వ సహకారంతో దీనిని నిర్మించనున్నారు.
విస్తృతంగా గోదాముల నిర్మాణం రైల్వేల ద్వారా సరకు రవాణాను మరింతగా పెంచేందుకు రైలు మార్గాలకు సమీపంలోని రైల్వే స్థలాల్లో భారీగా గోదాములు, లాజిస్టిక్ పార్కులు పీపీపీ విధానంలో నిర్మించనున్నారు. దీనికోసం కొత్తగా ట్రాన్స్‌పోర్ట్ లాజిస్టిక్స్ కంపెనీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10 గూడ్స్ షెడ్‌లను అభివృద్ధిపరచనున్నారు.
యాదాద్రికి రైలుమార్గం
       రైల్వే బడ్జెటులో ఈ ఏడాది తెలంగాణకు భారీ వరాలు లేవు. కానీ, రాష్ట్రప్రభుత్వం ఖర్చును భరించేందుకు ముందుకొచ్చిన ప్రాజెక్టులకు కేంద్రం ప్రాధాన్యమిచ్చింది. యాదాద్రికి రైలుమార్గం ఏర్పాటుకు సమ్మతించింది. రాజధానిలోని ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గించడానికి శివారుల్లో టెర్మినల్ స్టేషన్ల రూపేణా వెసులుబాటు చూపించింది. వివిధ ప్రాజెక్టుల కోసం రూ.790 కోట్లను (గతేడాది రూ.755 కోట్లు) కేటాయించింది. పెండింగు ప్రాజెక్టులకు మాత్రం నామమాత్రపు నిధులిచ్చింది. 22 ఏళ్ల క్రితం ప్రారంభించిన పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ మార్గానికి, పదేళ్ల కిందట మొదలెట్టిన జగ్గయ్యపేట-మేళ్లచెరువు-జాన్‌పహాడ్ మార్గాలను పూర్తిచేయటానికి తలూపింది. కాజీపేటకు వ్యాగన్ వర్క్‌షాప్‌ను మంజూరుచేసింది. హైదరాబాద్ సబర్బన్‌రైళ్ల విస్తరణతో పాటు రైల్వే, రాష్ట్రప్రభుత్వాల భాగస్వామ్యంలో మరో రెండు ప్రాజెక్టులను చేపేట్టేందుకు సుముఖత తెలిపింది.

తెలంగాణ పరంగా కీలకాంశాలు..
సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వేస్టేషన్లపై ఒత్తిడిని తగ్గించేందుకు చర్లపల్లిలో శాటిలైట్ టెర్మినల్ నిర్మాణానికి ఆమోదం.
హైదరాబాద్‌లో సబర్బన్ రైళ్ల విస్తరణకు ప్రకటన.
పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ మార్గానికి మోక్షం. రూ.70 కోట్లు కేటాయింపు (ఈ లైను పూర్తిగా అందుబాటులోకి వస్తే నిజామాబాద్, కరీంనగర్ మీదుగా ముంబయి, దిల్లీకి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటవుతుంది).
జగ్గయ్యపేట-మేళ్లచెరువు-జాన్‌పహాడ్ మార్గాల పూర్తికి రూ.110 కోట్లు కేటాయింపు (ఈ మార్గం పూర్తయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు మరో ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తుంది).
కాజీపేటకు వ్యాగన్ వర్క్‌షాప్ మంజూరు. రూ.269 కోట్లతో తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు రూ.20 కోట్లు కేటాయింపు.
కాజీపేటలోని ఎలక్ట్రికల్ లోకోషెడ్ సామర్థ్యాన్ని 125 నుంచి 175 ఇంజిన్లకు పెంచనున్నట్లు ప్రకటన.
రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో సికింద్రాబాద్-జహీరాబాద్, బోధన్-బీదర్, గడ్‌చిందూరు (మహారాష్ట్ర)-అదిలాబాద్ ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతి.
175 కిలోమీటర్ల మేర మహబూబ్‌నగర్-దోన్ మార్గం డబ్లింగ్‌కు, 130 కిలోమీటర్ల బోధన్-లాతూర్ రోడ్డు కొత్త మార్గం నిర్మాణానికి అనుమతి.
ప్రమాదాల నియంత్రణకు తెలంగాణలోని 14 ప్రాంతాల్లో సబ్‌వేలు, వంతెనల ఏర్పాటుకు పచ్చజెండా.
అమరావతికి అనుసంధానం
       ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైలు మార్గం అనుసంధానానికి తొలి అడుగు పడింది. విజయవాడ నుంచి గుంటూరుకు అమరావతి మీదుగా రైలు నిర్మాణ సర్వేకు రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. విజయవాడ నుంచి అమరావతికి, అమరావతి నుంచి గుంటూరు 67 కి.మీ. మార్గం సర్వే పనులు పూర్తయ్యాక రాజధాని దృష్టిలో పెట్టుకుని నిధుల కేటాయింపు, నిర్మాణ పనుల్లోనూ ప్రాజెక్టుకు ప్రాధాన్యం లభిస్తుందన్న అభిప్రాయాలున్నాయి. బడ్జెట్‌లో అమరావతి అనుసంధాన సర్వేతో పాటు.. నిర్మాణంలో ఉన్న ముఖ్యమైన కొత్త రైలు ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు గతేడాదితో పోలిస్తే పెరిగాయి. గుంటూరు నుంచి గుంతకల్లు రైలు మార్గం ప్రస్తుతం సింగిల్‌లైన్‌గా ఉండగా డబుల్‌గా మార్చేందుకు రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. 443 కి.మీ.ఈ మార్గానికి రూ.4 వేల కోట్లు ఖర్చుకానున్నాయి. ఈ లైను నిర్మిస్తే రాయలసీమ నుంచి రాజధాని ప్రాంతానికి రాకపోకలు వేగవంతమవుతాయి. విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా పశ్చిమ్‌బంగాలోని ఖరగ్‌పూర్ వరకు ప్రత్యేకంగా సరుకు రవాణా కోసం పీపీపీ విధానంలో మూడో ప్రాజెక్టు నిర్మాణానికి రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. కీలక ప్రాజెక్టులకు అధిక నిధులు, రాజధానికి అనుసంధానత విషయంలో రైల్వే బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వ ఆశలకు.. కేటాయింపులు కాస్త అటూఇటూగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పది కొత్త రైలు మార్గాల కోసం సర్వే చేసేందుకు కేంద్రం ఆమోదించింది. ఇవి మినహా కొత్త రైళ్ల ప్రకటన సహా మిగిలిన అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు నిరాశే మిగిలింది. రాష్ట్ర విభజన చట్టంలోని కొత్త రైల్వేజోన్‌కు ఈ బడ్జెట్‌లోనూ మోక్షం కలగలేదు. ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యాగన్ వర్క్‌షాప్, కోచ్ ఫ్యాక్టరీ, విశ్వవిద్యాలయం వంటి భారీ ప్రాజెక్టులు ఏవీ ఆంధ్రప్రదేశ్‌కు దక్కలేదు.
ఏపీకి మంజూరుచేసిన కొత్త ప్రాజెక్టులు :
గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ లైన్.443 కిమీ దూరం అంచనావ్యయం రూ.4000 కోట్లు
తిరుపతి రైల్వేస్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు తిరుచానూరు రైల్వేస్టేషన్ అభివృద్ధి. అంచనావ్యయం రూ.10 కోట్లు. సీ క్లాస్ నుంచి బీ క్లాస్ స్టేషన్‌గా మార్పు.
రాజమండ్రిలో మెమూ రైళ్ల నిర్వహణ, మరమ్మతు కేంద్రం అంచనా రూ.7.2 కోట్లు.
నిర్మాణంలో ఉన్న వాటికి కేటాయింపులు:
నంద్యాల-ఎర్రగుంట్ల లైన్‌కు రూ.100 కోట్లు. దీంతో ఈ లైన్ నిర్మాణం ఈ ఏడాదే పూర్తికానుంది.
జగ్గయ్యపేట-మేళ్లచెరువు-జాన్‌పహాడ్ లైన్‌కు రూ.110 కోట్లు
ఇతర కేటాయింపులు
ఉత్తరాది-దక్షిణాదితో పాటు తూర్పుకోస్తా మార్గాన్ని అనుసంధానించేలా పీపీపీ విధానంలో విజయవాడ-ఖరగ్‌పూర్‌ల మధ్య ప్రత్యేక సరుకు రవాణా కారిడార్.
తిరుపతి స్టేషన్‌లో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు, స్టేషన్ సుందరీకరణ.

సర్వేకు ఆమోదం తెలిపిన ప్రతిపాదిత లైన్లు కేటాయించిన నిధులు
* డోన్-మహబూబ్‌నగర్ డబ్లింగ్ 175 కి.మీ. రూ.68 లక్షలు
* నల్లపాడు-బీబీనగర్ డబ్లింగ్ 175 కి.మీ. రూ.36 లక్షలు
* విజయవాడ-గుంటూరు వయా అమరావతి 67 కి.మీ. రూ.10 లక్షలు
* నర్సాపూర్-మచిలీపట్నం 85 కి.మీ. రూ.13 లక్షలు
* దర్శి-నర్సరావుపేట 65 కి.మీ. రూ.10 లక్షలు
* కంభం-ఒంగోలు 115 కి.మీ. రూ.17 లక్షలు
* చిత్తూరు-కుప్పం 118 కి.మీ. రూ.18 లక్షలు
* ఓబుళవారిపల్లి-వాయల్పాడు 150 కి.మీ. రూ.13 లక్షలు
* తుని-కొత్తవలస వయా నర్సీపట్నం 112 కి.మీ. రూ.17 లక్షలు

దక్షిణ మధ్య రైల్వేకి భారీగా కేటాయింపులు!
      'రైల్వే బడ్జెట్‌లో 'దక్షిణ మధ్య రైల్వే జోన్‌'కు కేంద్రం భారీగా నిధులు కేటాయించింది' అని ద.మ.రై జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా వెల్లడించారు.
వివరాలు..
తాజా బడ్జెట్‌లో కేంద్రం ద.మ.రై.కి రూ.6,412 కోట్లను కేటాయించింది.
గత బడ్జెటుతో పోలిస్తే ఇది 145 శాతం అధికం.
ఇందులో కొత్త మార్గాలకు రూ.1,219 కోట్లు.
డబ్లింగ్‌కి రూ.1,332.85 కోట్లు, వంతెనలకు రూ.187.28 కోట్లు.
2 రాష్ట్రాలకు ఆరు ప్రాజెక్ట్‌లు మంజూరు.
ఎంఎంటీఎస్ రెండో దశ నిర్మాణం 2017 డిసెంబరు కల్లా పూర్తి.
సికింద్రాబాద్‌లో టెర్మినల్ నిర్మాణం.
కృష్ణా పుష్కరాలకు పెద్ద సంఖ్యలో రైళ్లను నడిపేందుకు ప్రణాళిక.

వివిధ పద్దుల కింద బడ్జెటు కేటాయింపుల వివరాలు రూ. కోట్లలో..
పద్దు
కేటాయించిన మొత్తం
నూతన మార్గాలు 1,219
రెండు లైన్ల విస్తరణ 1,333
పరికరాల కొనుగోలు 1,228
పెండింగు ప్రాజెక్టులకు 1,060
ట్రాక్ మరమ్మతులు 375
వంతెనల నిర్మాణం 185
వర్క్‌షాపు నిర్వహణ 168
రోడ్డు భద్రతకు 85
ట్రాపిక్ సౌకర్యాలకు 83
ప్రయాణికుల సౌకర్యాలకు 65
సిగ్నలింగ్ వ్యవస్థకు 61
విద్యుదీకరణ కోసం 44
కంప్యూటరీకరణ 33
ఉద్యోగుల క్వార్టర్లకు 40
ఇతరాలు 433

భారతీయ రైల్వేవ్యవస్థ - సమగ్ర సమాచారం
అతిపెద్ద పేరున్న రైల్వేస్టేషన్ ఆంధ్రప్రదేశ్‌లోని 'వెంకటనరసింహరాజువారిపేట'. చిన్న పేరున్నవి ఒడిశాలోని 'ఐబి', గుజరాత్‌లోని 'ఓడీ' స్టేషన్లు..
దేశంలోనే అత్యంత నెమ్మదిగా.. మెట్టుపాళ్యం-ఊటీ నీలగిరి ప్యాసింజరు గంటకు 10 కి.మీ. వేగంతో నడుస్తుంది.
దేశంలో అత్యంత వేగంగా నడిచే రైలు దిల్లీ-భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్. ఫరీదాబాద్-ఆగ్రా సెక్షన్‌లో ఇది గంటకు 150 కి.మీ. వేగంతో పరుగుతీస్తుంది.
మన దేశంలో వేగవంతమైన రైలు శతాబ్ది. ఇది దిల్లీ-హబీబ్‌గంజ్ (భోపాల్) మధ్య గంటకు 155 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.
అత్యంత దూరం నడిచే రైలు వివేక్ ఎక్స్‌ప్రెస్. దిబ్రూగఢ్-కన్యాకుమారి మధ్య 4,273 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది.
అత్యంత తక్కువగా కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించే రైలు నాగ్‌పుర్-అజ్నీ ప్యాసింజరు.
భారతీయ రైల్వేకు సుమారు 10.65 లక్షల కోట్ల ఎకరాల సొంత స్థలాలున్నాయి.
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన 'ఫెయిరీ క్వీన్' ఆవిరి ఇంజిన్ నేటికీ సేవలు అందిస్తోంది. 1885లో తయారైన ఈ ఇంజిన్ రెండు బోగీలతో దిల్లీ-అల్వార్‌ల మధ్య నడుస్తోంది. గిన్నిస్ రికార్డుతో పాటు అంతర్జాతీయ టూరిస్ట్ బ్యూరో అందించే హెరిటేజ్ అవార్డునూ ఇది సొంతం చేసుకుంది.
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో ఒకేచోట రెండు స్టేషన్లున్నాయి. రైలు పట్టాలకు ఒకవైపు శ్రీరాంపూర్, మరోవైపు బేలాపూర్ స్టేషన్లున్నాయి
రైళ్లలో ఎయిర్ కూలింగ్ సదు పాయం తొలిసారిగా 1874లో అందుబాటులోకి వచ్చింది.
ప్రజాప్రయోజనార్థం తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన భూగర్భ రైల్వే మార్గం కోల్‌కతా మెట్రో.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి రైలు 1864, అక్టోబరు 1న చిత్తూరు జిల్లాలోని రేణిగుంట-రెడ్డిపల్లి మధ్య నడిచింది.
విజయవాడ-మద్రాస్‌ల మధ్య తొలి బ్రాడ్‌గేజ్ రైలు మార్గం 1899లో ప్రారంభమైంది.
విజయవాడ-సికింద్రాబాద్‌ల మధ్య 1969లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైంది. దేశంలోనే అత్యంత వేగంగా నడిచే ఆవిరి ఇంజిన్ ఉన్న రైలుగా అప్పట్లో దీనికి పేరు.
నిజాం స్టేట్ రైల్వే 1873లో ఇంగ్లండ్‌లో ఏర్పాటైంది. దీనిలో నిజాం ప్రభుత్వ వాటా 5 లక్షల పౌండ్లు. వీరు నిర్మించిన తొలి రైల్వే లైను వాడి-హైదరాబాద్.
ప్రస్తుత కాచిగూడ రైల్వే స్టేషన్ అప్పట్లో 'నిజాం స్టేట్ రైల్వే' ప్రధాన కార్యాలయం. 1930లో మొత్తం రైల్వేల నిర్వహణను నిజాం ప్రభుత్వం స్వీకరించటంతో 'హిజ్ హైనెస్ ద నిజామ్స్ గ్యారెంటీడ్ స్టేట్ రైల్వేస్' ఆవిర్భవించింది.
నిజాం స్టేట్ రైల్వే స్వాతంత్య్రం అనంతరం 1952, ఏప్రిల్ 1న సెంట్రల్ రైల్వేలో విలీనమైంది. ఆ తర్వాత అక్టోబరు 2, 1966లో ఆరంభమైన దక్షిణ మధ్య రైల్వేలో భాగమైంది.
హైదరాబాద్-దిల్లీ మధ్య ఆంధ్రప్రదేశ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 1976 లో ప్రారంభమైంది.
దక్షిణ మధ్య రైల్వేలో తొలి విద్యుదీకరించిన రైలు మార్గం విజయవాడ-గూడూరు మధ్య 1980 డిసెంబరు 15న ప్రారంభమైంది.
దక్షిణ మధ్య రైల్వేలో తొలి కంప్యూటరైజ్డ్ పాసింజర్ రిజర్వేషన్ వ్యవస్థ (పీఆర్ఎస్) సికింద్రాబాద్ స్టేషన్‌లో 1989, సెప్టెంబర్ 30న ఆరంభమైంది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొదటి ఎస్కలేటర్ సదుపాయం విజయవాడ రైల్వేస్టేషన్‌లో 2000లో అందుబాటులోకి వచ్చింది.
దేశంలో రోజూ మొత్తం 21,000 రైళ్లు ప్రయాణిస్తున్నాయి. ఇవి ప్రయాణించే మొత్తం దూరం.. భూమికి చంద్రునికి మధ్య దూరానికి మూడున్నర రెట్లతో సమానం. అంటే 13.4 లక్షల కిలోమీటర్లు! దేశవ్యాప్తంగా 1.15 లక్షల కిలోమీటర్ల మేర రైలు పట్టాలు 65,808 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాలు, 7,115 స్టేషన్లు ఉన్నాయి. భారతీయ రైల్వేల మొత్తం మార్గంతో భూమధ్య రేఖను ఒకటిన్నరసార్లు చుట్టిరావచ్చు. భారతీయ రైల్వే రోజూ 2.50 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ఇది ఆస్ట్రేలియా జనాభా కన్నా ఎక్కువ.
దేశంలో గూడ్సు రైళ్ల ద్వారా నిత్యం 1.3 కోట్ల టన్నుల సరకులు రవాణా అవుతున్నాయి. రైల్వే శాఖలో ఉద్యోగులు 16 లక్షలు. ప్రపంచంలోనే అత్యధిక ఉద్యోగులున్న సంస్థల్లో దీనిది 8వ స్థానం. 2.5 లక్షల సరకు రవాణా పెట్టెలు, 66 వేలకు పైగా ప్రయాణ బోగీలు, 15 వేల వరకు ఇంజిన్లు ఉన్నాయి.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్‌ఫాం ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉంది. దీని పొడవు 1,336.33 మీటర్లు.
దేశంలో తొట్టతొలి రైలు ముంబయి-థానేల మధ్య 1853 ఏప్రిల్ 16న పరుగుతీసింది.
అత్యంత ఎక్కువగా హౌరా-అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్‌కు 115 స్టాపులున్నాయి. ఒక ఎక్స్‌ప్రెస్‌కు ఇన్ని స్టాపులుండటం దీనికే చెల్లింది.
త్రివేండ్రం-హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్... వడోదరా-కోటా మధ్య నాన్‌స్టాప్‌గా 528 కి.మీ. ప్రయాణిస్తుంది.
ఉత్తరాన జమ్ము-కశ్మీర్‌లోని బారాముల్ల, పశ్చిమాన గుజరాత్‌లోని భుజ్‌కు సమీపంలో నలియా, దక్షిణాన కన్యాకుమారి, తూర్పున అసోంలోని తీన్‌సుకియాలో ఉన్న లెడోలు.. దేశ నలుమూలల్లో ఉన్న చిట్టచివరి రైల్వేస్టేషన్లు.
రైల్వేలో కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ వ్యవస్థ 1986లో దిల్లీలో ప్రారంభమైంది.
దేశంలోనే అత్యంత ఆలస్యంగా నడిచేది గౌహతి-తిరువనంతపురం రైలు. సగటున 10 నుంచి 12 గంటలు ఆలస్యంగా నడుస్తుంది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన జమ్ము-కశ్మీర్‌లోని చినాబ్ నదిపై నిర్మితమవుతోంది. కుతుబ్‌మినార్ కంటే అయిదు రెట్లు ఎక్కువ ఎత్తులో... ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ పొడవుగా... నదీ జలాలకు 359 మీటర్ల ఎత్తులో ఉండనుంది.
జమ్ము-కశ్మీర్‌లోని పీర్ పంజల్ రైల్వే సొరంగం దేశంలోనే అతి పొడవైనది (11.215 కి.మీ.).
తొలిసారిగా 1891లో ఫస్ట్‌క్లాస్ బోగీల్లో మరుగుదొడ్డి సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1907లో మిగతా బోగీల్లో ఆ సదుపాయం కల్పించారు.
దేశంలో సముద్రంపై నిర్మించిన తొలి రైల్వే వంతెన పంబన్ బ్రిడ్జి. ఇది తమిళనాడు, పంబన్ ద్వీపంలోని రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానం చేస్తుంది.