Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
2016 - 17: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల బడ్జెట్ల తులనాత్మక పట్టిక
 

తెలంగాణ బడ్జెట్ 2016 - 17

ప్రవేశ పెట్టిన తేదీ: 14- 3 - 2016
జల ఆశలను ప్రతిబింబిస్తూ.. వారి ఆకాంక్షలకు భరోసానిస్తూ.. ముచ్చటగా మూడోసారి తెలంగాణ బడ్జెట్ రూపొందింది. ప్రజలకు చేసిన వాగ్దానాలన్నింటికీ పెద్దపద్దులో సముచిత స్థానాలు లభించాయి. అంకెల లెక్కలను చూసినా.. సర్కారు ప్రాధాన్యతలను గమనించినా ఇది సాగునీరు.. తాగునీరు.. సంక్షేమ రంగాల బడ్జెట్ అని చెప్పాలి. ఒక్క సాగునీటి రంగానికే కళ్లు చెదిరే కేటాయింపు. ఏకంగా రూ. 25,000 కోట్లు. అలాగని మిగతా రంగాలను విస్మరించకుండా ప్రధానమైన పథకాలనూ ఆర్థికమంత్రి భారీగానే కరుణించారు. మొత్తంమీద రూ. 1.30 లక్షల కోట్లతో భారీగా రూపొందిన ఈ బడ్జెట్ ఆద్యంతం వినూత్న పోకడలతో గతానికి పూర్తి భిన్నంగా నిలిచింది. ఇది పూర్తిస్థాయిలో అమలైతే బంగారు తెలంగాణ లక్ష్యసాధనకు మరికొన్ని అడుగులు పడ్డట్టే.
క్లుప్తంగా....
బడ్జెట్ మొత్తం - 1,30,415.87 కోట్లు
ప్రణాళికా వ్యయం - 67,630.73 కోట్లు
ప్రణాళికేతర వ్యయం - 62,785.14 కోట్లు
విద్యుత్తు రాయితీకి రూ.4,470 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఇది రూ.213 కోట్లు అదనం.
ఆకస్మిక అవసరాల కోసం మునుపెన్నడూ లేనంతగా రూ.4,675 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్).
ప్రభుత్వాసుపత్రుల్లో ఆధునిక వైద్య పరికరాలు, వ్యాధి నిర్ధారణ యంత్రాల కొనుగోలుకు రూ.916 కోట్లు.
రూ.100 కోట్లతో బ్రాహ్మణ సంక్షేమనిధి ఏర్పాటు.
వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, రామగుండం నగరపాలక సంస్థలు, అన్ని పురపాలక సంఘాలకు కలిపి రూ.1,200 కోట్లు కేటాయించడం ఇదే ప్రథమం.
ప్రజలకు రక్షితనీటిని అందించే 'మిషన్ భగీరథ' పథకానికి అయ్యే ఖర్చంతా హడ్కో, నాబార్డు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకోవాలని నిర్ణయం.
వివరంగా....
తెలంగాణ బడ్జెట్ ప్రజల జీవనంలో సమూల మార్పులకు నాంది పలుకుతుందని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పూర్తి సమాచారం, సమగ్ర అధ్యయనంతో వాస్తవాల ఆధారంగా దీన్ని రూపొందించామని వెల్లడించారు. ప్రజల మీద పన్ను భారం మోపకుండానే నిధులను సమీకరిస్తామన్నారు. దుబారాను బాగా తగ్గించుకుని ప్రజల కోసం ఎక్కువ ఖర్చు చేస్తామన్నారు. బంగారు తెలంగాణ కలను సాకారం చేసేందుకు అన్ని వనరులను, సామర్థ్యాలను రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి వినియోగిస్తున్నామని, ఉమ్మడి రాష్ట్రంలో అణచివేతకు గురైన తెలంగాణ అస్థిత్వ, సాంస్కృతిక వైభవాలను పునరుద్ధరిస్తామని చెప్పారు. బలహీన పాలన నుంచి ప్రజాపాలన దిశగా పయనిస్తున్నామని, పథకాలను సమర్థంగా అమలుచేసి ప్రజల దరికి చేర్చడమే లక్ష్యమని తెలిపారు. వాగ్దానాల అమలుకు వడివడిగా అడుగులు వేస్తున్నామన్నారు. 2016-17 వార్షిక బడ్జెట్‌ను ఆయన శాసనసభలో ప్రవేశ పెట్టారు.
ముఖ్యాంశాలు
బడ్జెట్ స్వరూపం (గణాంకాలు రూ.కోట్లలో)
వివరం 2015-16 బడ్జెట్ అంచనాలు 2015-16 సవరించిన అంచనాలు 2016-17 బడ్జెట్ అంచనాలు
బడ్జెట్ మొత్తం
ప్రణాళికా వ్యయం
ప్రణాళికేతర వ్యయం
మొత్తం రాబడులు
రెవెన్యూ మిగులు
ద్రవ్యలోటు
1,15,689.19
52,383.19
63,305.99
1,15,686.07
531.3
-16,968.75
1,00,061.87
42,079.57
57,982.29
1,00,162.32
60.54
-16,911.71
1,30,415.87
67,630.73
62,785.14
1,30,429.31
3,718.37
-23,467.29
సాగునీరు
ఈ బడ్జెట్ కేటాయింపు రూ.25,000 కోట్లు
సాగునీటి రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2015-16 సంవత్సరం చేసిన కేటాయింపులకు నాలుగు రెట్లు అదనంగా ఇచ్చింది. అప్పుడు ఇచ్చింది రూ. 8,140 కోట్లు కాగా ఇప్పుడు ఏకంగా రూ. 25,000 కోట్లు కేటాయించింది. దీంతోపాటు నిధుల వ్యయానికి సంబంధించి నీటిపారుదలశాఖకే సర్వాధికారాలనూ కట్టబెట్టడం విశేషం. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు కొత్తగా చేపట్టిన పథకాలకూ భారీగా నిధులు ఇచ్చింది. భూసేకరణ పూర్తికాకపోతే పనులు ముందుకు సాగవని గుర్తించిన ప్రభుత్వం ప్రతి ప్రాజెక్టుకు కేటాయింపుల్లోనూ భూసేకరణకు అవసరమైన మొత్తం ఇచ్చింది. ఈ శాఖకు ఇచ్చిన మొత్తం కేటాయింపులో సుమారు 5,000 కోట్ల రూపాయలు భూసేకరణకు ఇచ్చింది. అలాగే కేటాయింపుల్లో ప్రధాన వాటా పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలదే. ఈ రెండింటికే రూ. 14,147 కోట్లు కేటాయించారు. ఈ రెండు పథకాల కింద సుమారు 25 లక్షల ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టు ఉంది.
ఆదిలాబాద్ జిల్లాకే పరిమితమైన ప్రాణహిత పథకానికి రూ. 685 కోట్లు.
పునరాకృతి ద్వారా ఖమ్మం జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందుకు చేపట్టిన సీతారామ ఎత్తిపోతల (దుమ్ముగూడెం) పథకానికి రూ. 1,028 కోట్లు.
నల్గొండ జిల్లాలో ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే లక్ష్యంతో చేపట్టనున్న దిండి ఎత్తిపోతలకు రూ. 780 కోట్లు.
కంతనపల్లి ఎత్తిపోతల పథకంలో భాగంగా తుపాకులగూడెం వద్ద బ్యారేజి నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ఈ పని పూర్తికావాలంటే రూ. 2,000 కోట్లు అవసరం కాగా, రూ. 200 కోట్లు కేటాయించింది. కొత్తగా చేపట్టిన ఈ భారీ పథకాలన్నీ మూడేళ్లలో పూర్తి చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యం. అయితే నిర్ణీత వ్యవధిలోగా పనులు పూర్తి కావాలంటే మాత్రం ఈ నిధులు సరిపోవు.
ప్రాధాన్యతా క్రమంలో పూర్తి
జలయజ్ఞంలో భాగంగా చేపట్టి నిర్మాణంలో ఉన్న పథకాల్లో ఎక్కువ భాగం 2017 ఖరీఫ్ నాటికి పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
2016 ఖరీఫ్‌లో 6.2 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి లక్ష్యంగా పెట్టుకోగా, గుత్తేదారులు పనులు చేయకపోవడం, భూసేకరణలో సమస్యల కారణంగా ముందుకెళ్లలేదు. 2017 ఖరీఫ్ నాటికి 11.34 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలన్నది నీటిపారుదల శాఖ ప్రణాళిక. ఇందులో దేవాదుల, మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, కరీంనగర్ జిల్లాలోని ఎల్లంపల్లి, వరదకాలువ, ఆదిలాబాద్ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులున్నాయి.
నల్గొండ జిల్లాకు సాగునీరందించే శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గాన్ని కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని ప్రభుత్వం తలపెట్టింది.
మహబూబ్‌నగర్ జిల్లాలోని నాలుగు పథకాల కింద వచ్చే ఖరీఫ్‌లో రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలన్నది లక్ష్యం కాగా, ఈ పనులు పూర్తి కావాలంటే సుమారు రూ. 2,000 కోట్లు అవసరం. ప్రస్తుత బడ్జెట్‌లో సుమారు రూ. 600 కోట్లు కేటాయించారు.
దేవాదుల మూడోదశ
దేవాదుల ఎత్తిపోతల పథకం కింద మొదటి, రెండు దశల్లో మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి ప్రస్తుత కేటాయింపుల ప్రకారం ఎలాంటి నిధుల సమస్య ఉండదు. మూడోదశ పనులు లక్ష్యం మేరకు జరగాలంటే మాత్రం సరిపోవు.
ఎల్లంపల్లి పథకానికి అవసరమైన నిధులను కేటాయించారు. ఎల్లంపల్లిలో పనులు పూర్తికావడానికి, పునరావాసానికి కలిపి సుమారు రూ. 400కోట్లు అవసరం కాగా, రూ. 350కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఎల్లంపల్లి దాదాపు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే అవసరాన్ని బట్టి ఒక ప్రాజెక్టు నుంచి ఇంకో ప్రాజెక్టుకు నిధులను మళ్లించుకునే వెసులుబాటు నీటిపారుదల శాఖకే ఉన్నందున ఎలాంటి సమస్య ఉండబోదని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.
ఎస్సారెస్పీ రెండోదశ పూర్తి చేయడానికి సుమారు రూ. 300 కోట్లు అవసరం. ఈ పథకం కింద సుమారు ఆరువేల ఎకరాల భూసేకరణ పూర్తి చేయాల్సి ఉంది. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ. 40 కోట్లు కేటాయించారు. ఆదిలాబాద్ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం దీనికి తగ్గట్లుగానే నిధులు కేటాయించింది. ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు కేటాయించడంతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో అన్నింటికి అవసరమైన నిధులు అందలేదు.
మిషన్ కాకతీయ
ఈ బడ్జెట్ కేటాయింపు రూ.1,500 కోట్లు
చిన్ననీటి వనరుల అభివృద్ధికి, మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మొదటిదశ కింద చేపట్టిన పనుల్లో సగానికిపైగా పూర్తి కాగా, మిగిలినవి జరుగుతున్నాయి. రెండోదశకు పరిపాలనా అనుమతులు, టెండర్ కార్యక్రమాన్ని మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ నిర్ణయించింది. రెండోదశ కింద చేపట్టిన పనులకు ప్రస్తుతం కేటాయించిన నిధులను ఖర్చు చేయనున్నారు.
రెండోదశలో 9,957 చెరువులకు మరమ్మతులు చేపట్టాలని నీటిపారుదల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా 1,885 చెరువులుండగా, 1,760 చెరువులతో మెదక్ రెండోస్థానంలో ఉంది. ఇప్పటివరకు సంబంధిత ఇంజినీర్ల నుంచి 9,356 చెరువులకు సంబంధించిన అంచనాలు చీఫ్ ఇంజినీర్ కార్యాలయానికి వచ్చాయి. రూ. 2,941.90 కోట్ల విలువ గల 8,718 చెరువుల ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లగా, ఇప్పటివరకు 4,657 చెరువులకు రూ. 1,591.27 కోట్లతో పరిపాలనా అనుమతులు వచ్చాయి. 2,957 చెరువులకు టెండర్లు పిలవడంతో పాటు 1,138 పనులకు ఒప్పందాలు జరిగాయి. 323 చెరువుల పనులను ప్రారంభించారు.
మిషన్‌కాకతీయ మొదటిదశలో మిగిలిన పనులు, ప్రస్తుతం రెండోదశలో పరిపాలనా అనుమతులు ఇచ్చిన, ఇస్తున్న పనులు పూర్తి చేయాలంటే సుమారు రూ. 3,000 కోట్లు అవసరం. ప్రస్తుతం చిన్ననీటి వనరులకు కేటాయించింది రూ. 2,452.52 కోట్లు కాగా, అందులో మిషన్ కాకతీయకు ఇచ్చింది సుమారు రూ. 1,500 కోట్లు. కేంద్రం నుంచి, నాబార్డు నుంచి ఇలా అదనపు మార్గాల నుంచి ఇంకా నిధులను సమీకరించాల్సి ఉంటుంది.
2016-17 బడ్జెట్‌లో ప్రాజెక్టులవారీగా కేటాయింపులు
ప్రాజెక్టు కేటాయింపు(రూ.కోట్లలో)
పాలమూరు-రంగారెడ్డి
కాళేశ్వరం ఎత్తిపోతల
దేవాదుల ఎత్తిపోతల
ప్రాణహిత-చేవెళ్ల
శ్రీరామ ఎత్తిపోతల (దుమ్ముగూడెం)
భక్తరామదాసు
ఎఎంఆర్‌పి-ఎస్ఎల్‌బిసి (దిండి ఎత్తిపోతలతో సహా)
శ్రీరామసాగర్ వరద కాలువ
ఎల్లంపల్లి
శ్రీరామసాగర్ మొదటిదశ
శ్రీరామసాగర్ రెండోదశ
కల్వకుర్తి ఎత్తిపోతల
కంతనపల్లి ఎత్తిపోతల
నెట్టెంపాడు
భీమా ఎత్తిపోతల
నిజాంసాగర్
నాగార్జునసాగర్ ఆధునికీకరణ
నాగార్జునసాగర్ ప్రాజెక్టు
లోయర్ పెన్‌గంగ
జూరాల
కొమరం భీం
మోడికుంటవాగు
కోయిల్‌సాగర్
సింగూరు
ఘనపూర్ ఆనకట్ట
పెద్దవాగు జగన్నాథనూర్
లెండి
గుత్ప
చిన్న నీటిపారుదల (మిషన్ కాకతీయతో సహా)
7860.88
6286
700
685
1028
120.57
1418
505.27
350
387.87
30
300
200
125
125
223
489
138
125
100
52
50
59.72
30
31
26
20
15
2264.36
మహిళా సంక్షేమం
ఈ బడ్జెట్ కేటాయింపు రూ.1,553 కోట్లు.
తెలంగాణ స్త్రీ, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖకు కేటాయింపులు యథాతథంగా ఉన్నాయి. 2015-16 బడ్జెట్‌లో రూ.1553 కోట్లను కేటాయించిన ప్రభుత్వం 2016-17 బడ్జెట్‌లో ఈ మేరకే కేటాయింపులు జరిపింది. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకానికి రూ.800 కోట్లను కేటాయించింది. అంగన్‌వాడీల భవన నిర్మాణాలకు రూ.50 కోట్లను నిర్దేశించింది. బాలికా సంరక్షణ పథకానికి రూ.56 కోట్లు, ఆరోగ్య లక్ష్మి పథకానికి రూ.404 కోట్లను ప్రతిపాదించింది. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్ఠికాహార పంపిణీకి రూ.300 కోట్లను పేర్కొంది.
మహిళా భద్రతకు రూ.30 కోట్లు:
మహిళా భద్రత పథకాలకు తొలిసారిగా రూ.30 కోట్లను కేటాయించింది. వికలాంగ విద్యార్థులకు ఉపకారవేతనాలకు రూ.50 లక్షలను ప్రతిపాదించగా వికలాంగులకు సబ్సిడీ పథకాల అమలుకు రూ.6 కోట్లు, పరికరాల పంపిణీ కోసం రూ.2.25 కోట్లను నిర్దేశించింది. వృద్ధులకు పునరావాసం, సహాయ కార్యక్రమాల కోసం రూ.4.50 కోట్లను కేటాయించింది.
వ్యవసాయ శాఖ
ఈ బడ్జెట్ కేటాయింపు రూ.7,258.32 కోట్లు.
వచ్చే ఏడాది వ్యవసాయ యాంత్రీకరణకు, మత్స్యకారుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ నిధులు భారీగా పెంచారు. ప్రధానమంత్రి పంటల బీమా పథకానికి సైతం నిధులు ప్రత్యేకంగా కేటాయించారు. మొత్తం మీద వ్యవసాయం, పశుసంవర్థకం దాని అనుబంధ రంగాలకు గతేడాదితో పోలిస్తే నిధుల కేటాయింపు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఈ రంగానికి 7,680.46 కోట్లు కేటాయించి రూ.6,881.08 కోట్లు ఖర్చు చేశారు. ఈసారి బడ్జెట్‌లో కేటాయింపు రూ.7,258.32 కోట్లు ఉంది. వీటిలో అత్యధికంగా రూ.4250 కోట్లు పంటరుణాల మాఫీ పథకానికి కేటాయించగా మిగతావి వ్యవసాయ, ఉద్యాన, పట్టుపరిశ్రమ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, మత్స్యశాఖలకు ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి కొత్తగా అమల్లోకి రానున్న 'ప్రధానమంత్రి పంటలబీమాకు రూ.134 కోట్లు కేటాయించారు. పంటలకు రైతులు చెల్లించే ప్రీమియంలో రాయితీని, పరిహారం చెల్లించడానికి ఈ నిధులు ఖర్చుచేస్తారు.
వ్యవసాయ యంత్రాలపై రాయితీ ఇవ్వడానికి గత బడ్జెట్‌లో రూ.50 కోట్లు ఇవ్వగా కొత్త బడ్జెట్‌లో దాన్ని రూ.335 కోట్లకు పెంచారు.
ఉద్యానశాఖ ద్వారా హరితపందిళ్ల నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీ రైతులకు పూర్తిగా వందశాతం రాయితీ ఇస్తారు. వచ్చే ఏడాది 600 మంది రైతులకు వీటిని ఉచితంగా నిర్మించి ఇస్తామని తెలిపారు.
హరితపందిరి పథకానికి గ‌త‌బ‌డ్జెట్‌లో రూ.188 కోట్లు కేటాయించి రూ.74 కోట్లు ఖర్చుచేయగా, కొత్త బ‌డ్జెట్‌లో రూ.199.50 కోట్లు ఇచ్చారు.
బిందుసేద్యానికి గ‌త‌బ‌డ్జెట్‌లో రూ.150 కోట్లు కేటాయించి రూ.117 కోట్లు ఖర్చు చేయగా, కొత్త బడ్జెట్‌లో రూ.190.50 కోట్లు కేటాయించారు.
శాఖలవారీగా చూస్తే.ఉదాహరణకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతానికి వివిధ పథకాల కింద రూ.864 కోట్లు కావాలని సహకార శాఖ ప్రతిపాదనలు ఇవ్వగా బడ్జెట్‌లో రూ.20.34 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మార్చాలన్న లక్ష్యానికి అనుగుణంగా నిధులు కేటాయించారు. హైదరాబాద్ సహకార వ్యవసాయ సొసైటీ(హాకా)కి విత్తనాల అభివృద్ధికి రూ.4.50 కోట్లు సహా మొత్తం రూ.40 కోట్లు కేటాయించారు. వచ్చే ఏడాదికి మత్స్యకారుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించారు. దీనిలో చేప విత్తన పెంపకం కేంద్రాలకు గత బడ్జెట్‌లో రూ.5.55 కోట్లు ఇవ్వగా కొత్త బడ్జెట్‌లో రూ.29 కోట్లు కేటాయించారు. మత్స్యకారుల అభివృద్ధికి ప్రస్తుత ఏడాది రూ.19.28 కోట్లు ఖర్చుచేస్తే వచ్చే ఏడాదికి దాన్ని రూ.70.15 కోట్లకు పెంచారు. పంటలకు ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని మద్దతు ధర ఇప్పించేందుకు ప్రత్యేకంగా 'మార్కెట్ జోక్యం పథకం (ఎంఐఎస్)' అమలు చేస్తోంది. దీనికింద గత బడ్జెట్‌లో రూ.75.22 కోట్లు కేటాయించి రూ.45.22 కోట్లు ఖర్చుపెట్టారు. కొత్త బడ్జెట్‌లో ఈ పథకం కింద నిధులేమీ ఇవ్వకపోవడం గమనార్హం.
అటవీశాఖ(హరితహారం)
ఈ బడ్జెట్ కేటాయింపు రూ.45.82 కోట్లు.
విస్తృతంగా చేపట్టదలచిన హరితహారం కార్యక్రమానికి వర్షాభావంతో ఏర్పడిన ప్రతికూలతలు ప్రభుత్వాన్ని పునరాలోచనలోపడేలా చేసినట్లున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కరవు నెలకొనటంతో నాటిన మొక్కల్ని సైతం కాపాడుకోలేని పరిస్థితి ఎదురైంది. కేటాయించిన నిధుల్నీ ఖర్చు చేయలేకపోయారు. బహుశా దీని ప్రభావం వల్లనేమో 2016-17 బడ్జెట్‌లో హరితహారానికి నిధులు కేటాయింపుల్లో ప్రాధాన్యం లభించలేదు. అనుకూలమైన వాతావరణం నెలకొనే వరకు కాస్త ఆచితూచి వ్యవహరించాలన్న ధోరణి కనిపిస్తోంది. గత ఏడాది నర్సరీల నిర్వహణకే రూ.100 కోట్లు వ్యయం చేశారు.
ఆరోగ్య శాఖ
ఈ బడ్జెట్ కేటాయింపు రూ.5966.89 కోట్లు.
అత్యంత కీలకమైన వైద్యఆరోగ్య రంగానికి తెలంగాణ సర్కారు 2016-17 బడ్జెట్ కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యమిచ్చింది. సర్కారు దవాఖానాలను ఆధునీకరిస్తామని చెప్పిన ప్రభుత్వం.. అందుకోసం భారీగానే నిధులు కేటాయించింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఒక్కసారిగా రూ.1035 కోట్ల నిధులను ఆరోగ్య రంగానికి పెంచింది. 2015-16లో ప్రణాళిక, ప్రణాళికేతర నిధులు కలుపుకొని రూ.4931.55 కోట్లు కాగా.. ఈ ఏడాది రూ.5966.89 కోట్లు ప్రతిపాదించింది. ఇందులో ప్రణాళికేతర వ్యయం రూ.3504.05 కోట్లు కాగా, ప్రణాళిక వ్యయం రూ.2462.83 కోట్లు. వైద్య పరికరాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షల పరికరాలను ఈసారి కొత్తగా ప్రణాళికేతర నిధుల్లో పొందుపర్చింది. అధునాతన వైద్య పరికరాల కోసం ప్రత్యేకంగా రూ.600 కోట్లు, వ్యాధి నిర్ధారణ పరీక్షల పరికరాల కొనుగోలుకు రూ.316 కోట్లు ప్రత్యేకంగా కేటాయించి. ఔషధాలు, శస్త్రచికిత్స ఉపకరణాలకు గత ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.117 కోట్లు కేటాయించగా.. ఈ బడ్జెట్‌లో దాదాపుగా రెట్టింపు నిధులను(రూ.225 కోట్లు) కేటాయించింది. గత బడ్జెట్‌లో ఆసుపత్రులవారీగా నిధులు కేటాయించినా ఆశించిన మేరకు వ్యయం చేయలేదు. ఈసారి అలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ప్రాధాన్యాంశాలను గుర్తించి.. నిధులు కేటాయించారు.
ముఖ్యాంశాలు
ఆసుపత్రుల్లో ఆకస్మిక అవసరాల కోసం ఆరోగ్య శాఖలో వివిధ విభాగాధిపతులకు రూ.56 కోట్లు.
పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది రూ.100 కోట్లు కేటాయించింది. ఇందులో వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులకు రూ.11 కోట్లు, బోధనాసుపత్రులకు రూ.60 కోట్లు, మిగిలినవి ఇతర విభాగాలకు. గత ఏడాది బోధనాసుపత్రులకు పారిశుధ్యానికి కేటాయించింది రూ.12 కోట్లే.
తొలిసారిగా వైద్య కళాశాలల్లో పరిశోధక నిధి కింద రూ.12 కోట్లు.
నెదర్లాండ్స్‌కు చెందిన రాబో బ్యాంకు ఆర్థిక సాయంతో ఉస్మానియా, గాంధీ, కింగ్‌కోఠి ఆసుపత్రులకు తోడుగా హైదరాబాద్‌లో మరో నాలుగు బహుళ ప్రత్యేక వైద్యసేవలు కలిగిన ఆసుపత్రుల నిర్మాణం.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా, ఖమ్మం, కరీంనగర్‌లోనూ ఆధునిక సౌకర్యాలతో కొత్త ఆసుపత్రుల నిర్మాణం.
రాష్ట్రవ్యాప్తంగా 40 చోట్ల రక్తశుద్ధి(డయాలసిస్) కేంద్రాలు, 40 చోట్ల వ్యాధి నిర్ధారణ కేంద్రాల ఏర్పాటు.
నిమ్స్‌లో వైద్య పరికరాల కొనుగోలుకు రూ.30 కోట్లు, పేదలకు ఉచితంగా వైద్య సేవలందించడానికి రూ.50 కోట్లు.
బీబీనగర్ నిమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.40 కోట్లు, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రికి రూ.23.40 కోట్లు.
ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టుకు రూ.464 కోట్లు.
ఆసుపత్రులు, వైద్యకళాశాలల్లో భవన నిర్మాణాలకు రూ.189 కోట్లు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి పెంచేందుకు రూ.68 కోట్లు, 24 గంటల సేవల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా ఏడింటిని తీర్చిదిద్దడానికి రూ.2 కోట్లు.
అత్యవసర వాహన సేవలు(108)కు గత ఏడాది రూ.15.67 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.60.58 కోట్లు.
సంచార గ్రామీణ వైద్యసేవలకు(104) గత ఏడాది రూ.21 కోట్లు కేటాయించగా.. రూ.32.21 కోట్లు.
గృహనిర్మాణం
ఈ బడ్జెట్ కేటాయింపు రూ.860.37 కోట్లు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని రుణాలతో నిర్వహించనుంది. 2016-17లో రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పరిధిలో లక్ష, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మరో లక్ష ఇళ్లను కట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో 60 వేలు; పట్టణ ప్రాంతాల్లో 40 వేలు నిర్మించనున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటిని రూ.5.04 లక్షలు; పట్టణ ప్రాంతాల్లో 5.30 లక్షలు; జీహెచ్ఎంసీ పరధిలో రూ.ఏడు లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. ఇళ్ల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని హడ్కో, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణంగా తీసుకోవాలని నిర్ణయించారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి - మిషన్ భగీరథ
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం మిషన్ భగీరథకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో అవసరమైన నిధులను రుణాల ద్వారానే సమకూర్చుకుని ముందుకెళ్లాల్సి ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనికి పూర్తిగా బడ్జెటేతర ఆర్థిక వనరులను వినియోగించుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
భగీరథకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.పదివేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా కట్టింది. ఈ మొత్తాన్ని హడ్కో, నాబార్డ్ కేంద్రసంస్థలతో పాటు బ్యాంకుల నుంచి రుణాల రూపంలో పొందనుంది.
భగీరథ పథకానికి 2015-16 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.4000 కోట్లను కేటాయించింది. ఇదికాక హడ్కో రుణం రూ.2500 కోట్లు అందుబాటులో ఉంది. నాబార్డ్ మరో రూ.1900 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిషన్ భగీరథకు రూ.8400కోట్లు అందుబాటులో ఉండగా రూ.2500 కోట్లు వ్యయం అయింది. ఈ నేపథ్యంలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో పథకానికి అది కూడా జిల్లా కార్యాలయాలకు రూ.98.39కోట్లను మాత్రం సర్కారు కేటాయించింది.
హడ్కో రుణం గతంలో మంజూరైంది కాకుండా, మార్చి 4న రూ.పదివేల కోట్ల రుణం పొందడానికి వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్ హడ్కోతో ఒప్పందం కుదుర్చుకుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకుల నుంచి రుణసహాయం అందనుందని ప్రభుత్వం ప్రకటించింది.
మిషన్ భగీరథ పూర్తి చేయటానికి రూ.40 వేల కోట్ల అంచనా వేయగా రూ.36,976 కోట్ల పనులకు పాలన అనుమతి ఇచ్చారు. వచ్చే మూడేళ్లలో పథకాన్ని పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబరుకల్లా 6100 గ్రామాలు, 12 పట్టణాలకు రక్షిత మంచినీరు అందించనున్నట్లు తెలిపింది. 2017 డిసెంబరు నాటికి 95 శాతం గ్రామాలకు నీరందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది.
జీహెచ్ఎంసీ
హెచ్ఎండీఏ ఈ బడ్జెట్ కేటాయింపు రూ.885 కోట్లు.
హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల ఏర్పాటు బాధ్యతను తెలంగాణ సర్కారు జీహెచ్ఎంసీకే అప్పగించింది. తాజా బడ్జెట్‌లో బల్దియాకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించలేదు. కేవలం రూ.70 కోట్లే కేటాయించారు. బల్దియా రూ.846 కోట్ల మిగులు బడ్జెట్‌లో ఉంది. సమగ్ర రోడ్ల అభివృద్ధి కింద ఈ ఏడాది నుంచి నగరంలో ఆకాశమార్గాలతో కూడిన రోడ్ల విస్తరణ ప్రాజెక్టును ప్రారంభించారు. మొదటి దశలో రూ.1350 కోట్ల వ్యయమవుతుంది. ఈ మొత్తాన్ని జీహెచ్ఎంసీనే భరించాల్సి ఉంది. ఈ చెల్లింపులు ప్రారంభిస్తే బల్దియాకు ఆర్థిక కష్టాలు తప్పవు.
రెండు పడక గదుల ఇళ్లకు జీహెచ్ఎంసీ వాటాను చెల్లించాల్సి వస్తే సంస్థపై భారం పడనుంది. బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ ద్వారా రూ.1000 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇలాగే అంతర్గత మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకుని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం బల్దియా అధికారులను కోరుతోంది.
జలమండలికి..
ఈ బడ్జెట్ కేటాయింపు రూ.1,000 కోట్లు.
బడ్జెట్‌లో జలమండలికి రూ.1000 కోట్లు కేటాయించారు. ఇందులో కృష్ణా, గోదావరి తాగునీటి ప్రాజెక్టుల రుణం మీద వార్షిక చెల్లింపులతోపాటు మిగిలిన ఉన్న పనుల కోసం రూ.750 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంది. అంటే మిగిలిన రూ.250 కోట్లను మౌలిక సదుపాయాలకు వ్యయం చేయాల్సి ఉంది. శివారు ప్రాంతాల్లోని 190 గ్రామాలు, మున్సిపాలిటీలకు తాగునీటిని అందించాలి. జలమండలి ప్రధానంగా మురుగునీటి వ్యవస్థ సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీన్ని మెరుగుపర్చాలంటే రూ.25 వేల కోట్ల వ్యయమవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల తేల్చారు. ఈ నిధులను బ్రిక్స్ బ్యాంక్ నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. నగరంలోని శివారు మున్సిపాలిటీలకు హడ్కో నిధులతో పూర్తిస్థాయిలో తాగునీటిని అందించడానికి పైపులైను నిర్మాణం కోసం రూ.1900 కోట్లతో పనులు ప్రారంభించారు.
హైదరాబాద్ శివార్లలో ఒక్కోటి 20 టీఎంసీల సామర్థ్యం కలిగిన రెండు జలాశయాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించారు. వీటికి నిధులపై బడ్జెట్‌లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. నిజాం కాలంలో నిర్మించిన తాగునీటి పైపులైన్ల వ్యవస్థను మార్చాలంటే కనీసం రూ.10 వేల కోట్లు అవసరమని అధికారులు తేల్చారు. మొదటి దశ కింద ఈ ప్రణాళికను అమల్లోకి తెచ్చి ఈ బడ్జెట్‌లో కొంతమేరకైనా నిధులను కేటాయిస్తే బాగుండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పురపాలకశాఖ
ఈ బడ్జెట్ కేటాయింపు రూ.4,815 కోట్లు.
ప్ర‌ణాళికా వ్యయం రూ.2169 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.2,646 కోట్లు.
పురపాలక శాఖకు 2015-16 వార్షిక బడ్జెట్‌లో చేసిన కేటాయింపులకు తగ్గకుంగా ఈ ఏడాది కేటాయింపులు జరిపారు. ప్రణాళికా వ్యయం రూ.2,169 కోట్లు కాగా ప్రణాళికేతర వ్యయంగా రూ.2,646 కోట్లు చూపారు. మొత్తంగా అన్ని విభాగాల్లో కలిపి రూ.4,815 కోట్లు కేటాయించారు.
పట్టణాభివృద్దికి పెద్దపీఠ వేస్తూ రాష్ట్రంలోని జీహెచ్ఎంసీ మినహా మిగిలిన అయిదు నగరపాలక సంస్థలకు ప్రత్యేకంగా రూ.700కోట్లు కేటాయించారు. వీటితోపాటు నగరపాలక సంస్థల్లో అభివృద్ది పనులకు ఉద్దేశించి రూ.173 కోట్లను కూడా ఇస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నారు.
ప్రభుత్వం హైదరాబాద్ మినహా మిగిలిన పురపాలక, నగరపాలక, నగరపంచాయతీల్లో నీటిసరఫరాను మిషన్ భగీరథ కింద చేపట్టాలని నిర్ణయించినప్పటికీ పూర్తిస్థాయి నిధులు కేటాయించలేదు. కేవలం రూ.25 కోట్లు మాత్రమే కేటాయించారు. మిగిలిన సుమారు రూ.3వేల కోట్లను రుణంగా సేకరించాలని యోచిస్తుండడంతో బడ్జెట్‌లో పెట్టలేదు.
ప్రణాళికేతర వ్యయంలో హెచ్ఎండీఏ, మెట్రోరైలు, జలమండలి ఖర్చులు.. : ప్రతీసారి ప్రణాళిక వ్యయంలో ఉండే హెచ్ఎండీఏ, మెట్రోరైలు, జలమండలి ఖర్చులను ఈ సారి ప్రణాళికేతర వ్యయంలో చూపించారు. జలమండలి తీసుకున్న అప్పులను చెల్లించడానికి రూ.వెయ్యికోట్లు కేటాయించారు. అలాగే ఎక్స్‌టెండెడ్ ఎయిడెడ్ ప్రాజెక్టులకు రూ.375కోట్లు, హెచ్ఎండీఏకు రూ.650కోట్లు(వార్షిక ఖర్చులు చెల్లించడానికి), హైదరాబాద్ మెట్రోరైల్‌కు రూ.200కోట్లు కేటాయించారు.
పోలీసుశాఖ
ఈ బడ్జెట్ కేటాయింపు రూ.4,302.92 కోట్లు
పోలీసుశాఖ పంట పండింది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వం 2016-17బడ్జెట్‌లో భారీస్థాయిలో నిధులు కేటాయించింది. ముఖ్యంగా ప్రణాళిక కింద ఏకంగా రూ.వెయ్యికోట్లకుపైగా కేటాయించింది.
ఒక్క సీసీకెమేరాల ఏర్పాటుకే రూ.225 కోట్లు, హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిర్వహణకు రూ.వంద కోట్లు కేటాయించడం గమనార్హం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పోలీసుశాఖ ఆధునికీకరణకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. బడ్జెట్‌లోనూ అంతే ప్రాధాన్యం ఇచ్చింది.
అణువణువూ నిఘా: హైదరాబాద్‌ను అత్యంత సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.. బడ్జెట్‌లో సీసీ కెమేరాల ఏర్పాటుకు రూ.225 కోట్లు మంజూరు చేసింది. వీటితో నగర వ్యాప్తంగా లక్షకుపైగా అత్యాధునిక కెమేరాలు ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తయితే ఇక నగరంలో ఎక్కడ ఏమి జరుగుతున్నా రాత్రీ, పగలూ తేడా లేకుండా కంట్రోల్ రూం నుంచి తెలుసుకోవచ్చు. ఈ కెమేరాల ద్వారా నమోదవుతున్న దృశ్యాలను వీక్షించేందుకు నిర్మించ తలపెట్టిన ప్రపంచస్థాయి కమాండ్ కంట్రోల్ భవనం నిర్మాణానికి రూ.140 కోట్లు కేటాయించింది. ఇక ఇలా నమోదవుతున్న దృశ్యాలలో నుంచి అనుమానితులను అప్పటికప్పుడు గమనించి పసిగట్టే విధానం ఏర్పాటు చేసేందుకు మరో రూ.30 కోట్లు కేటాయించింది. వెరసి ఒక్క హైదరాబాద్ కమిషనరేట్‌కే ప్రణాళిక వ్యయం కింద రూ.565 కోట్లు కేటాయించింది.
ట్రాఫిక్ నియంత్రణకు భారీ నిధులు: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య నానాటికీ తీవ్రమవుతోంది. ఎన్నిచర్యలు తీసుకుంటున్నా సరైన పరిష్కారం దొరకడంలేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దీన్ని చక్కదిద్దేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించింది.
శిక్షణకు నిధులు: తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి భారీ ఎత్తున పోలీసు నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 9 వేలకుపైగా కానిస్టేబుల్, 5 వందలకుపైగా ఎస్సై పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. అభ్యర్థుల ఎంపిక పూర్తయిన తర్వాత ఎస్సైలు తెలంగాణ పోలీసు అకాడమీలు, కానిస్టేబుళ్ళు జిల్లాల్లోని పోలీసు శిక్షణ కేంద్రాల్లో సంవత్సరంపాటు శిక్షణ తీసుకోవాల్సి ఉంది. ఇంతమందికి శిక్షణ ఇవ్వడం మామూలు విషయం కాదు. అందుకే శిక్షణ కేంద్రాల్లో వసతులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం సమృద్దిగా నిధులు మంజూరు చేసింది. పోలీసు అకాడమీకి రూ.30 కోట్లు, జిల్లాల్లో శిక్షణ కేంద్రాల అభివృద్ది చేసేందుకు రూ.58 కోట్లు కేటాయించింది. వీటిలో కొత్త భవనాల నిర్మాణం, శిక్షణకు అవసరమైన వసతులు సమకూర్చనున్నారు.
రహదారి భద్రతకు ప్రాధాన్యం: ఏటా తెలంగాణలో రోడ్డు ప్రమాదాల కారణంగా 7వేల మంది మరణిస్తున్నారు. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు మొదటిసారి తెలంగాణ పోలీసుశాఖ రోడ్డు భద్రతా మండలికి రూ.37 కోట్లు, దానికి అవసరమైన వాహనాల కొనుగోలుకు రూ.23 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో వాహనాలు సమకూర్చుకొని ప్రధాన రహదారులపై ఇక మీదట భద్రతా సిబ్బంది గస్తీ నిర్వహించనున్నారు.
కొత్త పోలీస్‌ష్టేషన్ల నిర్మాణానికి, ప్రజలతో మమేకమయ్యేలా పోలీస్‌స్టేషన్ల రూపురేఖలు మార్చేందుకు నిధులు కేటాయించింది. మొత్తంమీద పోలీసుశాఖకు ప్రస్తుత బడ్జెట్‌లో ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది. ప్రణాళికేతర కేటాయింపులు 2015-16లో రూ.3583.62 కోట్లు, 2016-17లో రూ.3271.18కోట్లు ఉండగా.. ప్రణాళిక కేటాయింపులు 2015-16లో రూ.125.54కోట్లు, 2016-17లో రూ.1031.74 కోట్లుగా ఉంది.
అగ్నిమాపకశాఖకు నిధులు: ప్రస్తుత బడ్జెట్‌లో ప్రభుత్వం అగ్నిమాపక-విపత్తు నిర్వహణ శాఖకు నిధులు పెంచింది. ప్రణాళికేతర వ్యయం కింద రూ.110.99 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ప్రణాళిక వ్యయం కింద రూ.111.72 కోట్లు కేటాయించింది. ఇందులో ప్రధానంగా అగ్నిమాపక యంత్రాల కొనుగోలుకు రూ.41.27 కోట్లు కేటాయించడం గమనార్హం.
విద్యాశాఖ
ఈ బడ్జెట్ కేటాయింపు రూ.10,738 కోట్లు.
విద్యారంగానికి ప్రభుత్వం ఈసారి కొంత వరకు బడ్జెట్‌ను తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2015-16) రూ.11,216 కోట్లు కేటాయించగా వచ్చే ఏడాదికి దాన్ని రూ.10,738 కోట్లకు కుదించింది. మొత్తంగా తాజా బడ్జెట్‌లో పాఠశాల విద్యకు రూ.8574 కోట్లు, ఉన్నత విద్యకు రూ.1720 కోట్లు(అందులో కళాశాల విద్యకు రూ.652 కోట్లు, ఇంటర్మీడియట్ విద్యకు రూ.658 కోట్లు), సాంకేతిక విద్యకు రూ.443 కోట్లు కేటాయించింది. సర్కారు బడులు, విద్యానాణ్యతపై తీవ్ర చర్చసాగుతుండగా పాఠశాల విద్యకు ప్రస్తుత బడ్జెట్ కంటే రూ.480 కోట్ల వరకు కోతపడటం గమనార్హం. విద్య భవిష్యత్తు పునాది అని చెబుతున్న ప్రభుత్వం నిధుల కేటాయింపు వద్దకు వచ్చేసరికి పెంచకపోగా...ఈసారి తగ్గించింది.
తాజా బడ్జెట్‌ను పరిశీలిస్తే నూతన విద్యా సంవత్సరంలోనూ 'కేజీ టూ పీజీ' విద్య కార్యరూపం దాల్చకపోవచ్చని స్పష్టమవుతోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రస్తుత సంస్థలను బలోపేతం చేస్తామని, విద్యా రంగాన్ని ప్రక్షాళన చేయాల్సి ఉందని చెబుతున్నారు. అందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలను దశల వారీగా గురుకులాలుగా మారుస్తామని పేర్కొంటున్నా అందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేదు.
ఉన్నత పాఠశాలల ఆస్తుల పరిరక్షణకు అవసరమైన ప్రహరీల నిర్మాణానికి రూ.25 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం 182 ఆదర్శ పాఠశాలలుండగా పలు చోట్ల గుత్తేదార్లు అసంపూర్తిగా భవన నిర్మాణ పనులను వదిలేశారు. వాటి పూర్తికి బడ్జెట్‌లో రూ.15 కోట్లు కేటాయించారు. ఇక ఆంగ్ల మాధ్యమం తరగతులు, పూర్వ ప్రాథమిక పాఠశాలల ప్రస్తావనే లేదు. మొత్తానికి ప్రక్షాళన తర్వాతే విద్యారంగంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణలో 2008 తర్వాత దాదాపు 65 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను మంజూరు చేసినా వాటికి కనీస భవనాలు లేవు. అవన్నీ ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నడుస్తున్నాయి. వాటికి ఈసారి రూ.45 కోట్లు కేటాయించారు.
జూనియర్ కళాశాలల భవనాలకు రూ.31.23 కోట్లు, వాటిల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాల సరఫరాకు రూ.7 కోట్లు కేటాయించారు. డిగ్రీ కళాశాలల్లోని నైపుణ్య విజ్ఞాన కేంద్రాల(టీఎస్‌కేసీ)కు రూ.15 కోట్లు కేటాయించారు.
ఉన్నత విద్యాశాఖ పరిధిలో రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలుండగా వాటిల్లో సిబ్బంది వేతనాలకు ప్రభుత్వం ఇచ్చే బ్లాక్‌గ్రాంట్ పెరగలేదు. ప్రస్తుత విద్యాసంవత్సరం ఎంత కేటాయించారో అంతే కేటాయిస్తున్నట్లు బడ్జెట్‌లో చూపారు. ఫలితంగా ఉస్మానియా లాంటి వర్సిటీలు వేతనాలకు సైతం ఇతరనిధులను వినియోగించుకోవాల్సి వస్తోంది.
రహదారులు
ఈ బడ్జెట్ కేటాయింపు రూ.3,790 కోట్లు.
రహదారులు భవనాలకు తెలంగాణ ప్రభుత్వం 2016-17 సంవత్సరానికి రూ.3,790 కోట్లు కేటాయించింది. ఇందులో భవనాలకు రూ.457 కోట్లు ఇచ్చింది. గడిచిన ఏడాది అన్నింటికీ కలిపి రూ.5,260 కోట్లు కేటాయించింది. 2015-16తో పోలిస్తే ఈ దఫా 1,470 కోట్లను తగ్గించింది. ప్రతి శాసనసభ్యుడికి ఆయా నియోజకవర్గ కేంద్రంలో ఒకే ప్రాంగణంలో కార్యాలయం, నివాస భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో భవన నిర్మాణాలకు రూ.457 కోట్లు కేటాయించారు. మార్చితో ముగియనున్న ఆర్థిక సంవత్సరంలో ఈ కేటాయింపులు రూ.295 కోట్లు మాత్రమే. 2,750 కిలో మీటర్ల మేర రెండు వరుసల రోడ్లను నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. 4వేల కిలోమీటర్ల మేర రహదారుల మరమ్మత్తులకు ఈ నిధులను వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మత్తులకు రూ.165 కోట్లు కేటాయించారు.
ఐటీశాఖ
ఈ బడ్జెట్ కేటాయింపు రూ.253.70 కోట్లు.
ప్రపంచవ్యాప్త దిగ్గజాలను ఆకర్షిస్తూ.. ఐటీ ఎగుమతుల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగానికి ఈసారి బడ్జెట్‌లో డబుల్ ధమాకా ప్రకటించింది. నిరుడు రూ.134 కోట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి దాదాపు రెట్టింపు స్థాయిలో రూ.253.70 కోట్లు కేటాయించింది.
ఇందులో ప్రణాళికేతర పద్దుల కింద రూ.1.94 కోట్లు; ప్రణాళిక కింద రూ.251.76 కోట్లు కేటాయించింది. టీ-హబ్ ఫౌండేషన్‌కు తొలిసారిగా రూ.5కోట్లు; ఫొటోనిక్స్‌వాలీ కార్పొరేషన్‌కు రూ.2కోట్లు ఇచ్చారు.
ప్రతి మండల కేంద్రంలో రూ.5 కోట్లతో ఓఎఫ్‌సీ సాంకేతిక పరిజ్ఞానంతో దూరదృశ్య సదస్సు (వీసీ) సదుపాయాలను ఏర్పాటు చేయబోతున్నారు.
ఐటీ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రూ.100 కోట్లు; ఐటీ ప్రోత్సాహక కార్యక్రమాలు, రోడ్‌షోలు ఏర్పాటు చేసేందుకు రూ.117 కోట్లు; తెలంగాణ నైపుణ్య విజ్ఞానాభివృద్ధి సంస్థ (టాస్క్) కోసం రూ.6 కోట్లు, సాఫ్ట్‌నెట్‌కు రూ.5.7 కోట్లు, మీసేవాకు 8.46 కోట్లు కేటాయించారు.
దళిత సంక్షేమం
ఈ బడ్జెట్ కేటాయింపు రూ.7,122 కోట్లు.
దళితులకు మరోసారి తెలంగాణ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. కొత్త బడ్జెట్‌లో రూ.7,122 కోట్లు కేటాయించింది. ఇది గత బడ్జెట్ కేటాయింపుల కంటే రూ.1575 కోట్లు ఎక్కువ.
సంక్షేమంలో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా దళిత అభివృద్ధి శాఖ కేటాయింపులు జరిగాయి. దళితుల ఉప ప్రణాళికకు కేటాయింపులు రూ.2560 కోట్ల‌ నిధులను కేటాయించింది. విద్యార్థులకు బోధన రుసుములు, ఉపకారవేతనాల కోసం రూ. 3000 కోట్లు వెచ్చింది. దళితులకు ఆర్థిక చేయూత పథకానికి రూ.1247 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.60 కోట్లు, గురుకుల సమీకృత పాఠశాలల కోసం రూ.124 కోట్లు, గురుకుల భవనాల నిర్మాణం, నిర్వహణకు మరో రూ. 150 కోట్ల కేటాయింపులు జరిగాయి. దళితులకు 50 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం రూ. 26 కోట్లను కేటాయించింది. కళాశాల వసతి గృహాలకు రూ.100 కోట్లను, స్టడీ సర్కిళ్ల కోసం రూ. పది కోట్లను, జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు రూ. 85 కోట్లను నిర్దేశించింది.
కళ్యాణలక్ష్మి పథకానికి రూ.200 కోట్లను ప్రతిపాదించింది.
దళితులకు ఉద్దేశించిన మూడెకరాల భూపంపిణీ పథకానికి ఈ సంవత్సరం నిధులను కేటాయించలేదు. గత సంవత్సరం నిధుల్లో మిగులు తేలడంతో వాటినే వెచ్చించాలని ఆదేశించింది.
వెనుకబడిన తరగతుల సంక్షేమం
ఈ బడ్జెట్ కేటాయింపు రూ.2,538 కోట్లు.
తెలంగాణలోని వెనకబడిన తరగతుల వారికి ఈ దఫా మెరుగైన రీతిలో బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. ఈ బడ్జెట్‌లో మొత్తం రూ.2538 కోట్లు కేటాయించింది. 2015-16తో పోలిస్తే రూ.366 కోట్లను అధికంగా ప్రతిపాదించింది. మరోసారి ఉపకారవేతనాలకే అధికంగా కేటాయింపులు రూ.1500 కోట్ల మేరకు నిర్దేశించింది.
బీసీ స్టడీ సర్కిళ్లకు రూ. 25 కోట్లను నిర్దేశించింది. బీసీ ఆర్థిక సహకార సంస్థకు రూ. 162 కోట్లు, వసతిగృహాలకు రూ.43 కోట్లు ప్రతిపాదించింది.
వృత్తి సమాఖ్యలకు నిధులను కేటాయించిన ప్రభుత్వం తొలిసారిగా అత్యంత వెనకబడిన వర్గాల వారి (ఎంబీసీ)ల అభివృద్ధి కోసం రూ.10 కోట్లతో ప్రత్యేక పథకాన్ని చేపట్టేందుకు అనుమతించింది.. సంచార జాతుల సమాఖ్యకు రూ.5 కోట్లను ఇచ్చింది. తొలిసారిగా బీసీ సంక్షేమ శాఖ ద్వారా అమలుగానున్న కల్యాణలక్ష్మి పథకానికి రూ. 300 కోట్లను కేటాయించింది.
దళిత, గిరిజన ఉప ప్రణాళికలు
దళిత, గిరిజన ఉప ప్రణాళికల అమలుకు మరింత ఊతమివ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త బడ్జెట్‌లో వీటికి రూ.3529 కోట్ల మేర నిధుల కేటాయింపులను పెంచింది. ఒకవైపు ఉప ప్రణాళికల నిధుల వినియోగం నిరాశాజనకంగా ఉన్నా ప్రభుత్వం ఆయా వర్గాల అభ్యున్నతిపై మరింత శ్రద్ధ చూపేందుకు వీలుగా మరిన్ని నిధులిచ్చేందుకు ముందుకొచ్చింది.
15.50 శాతం జనాభా దామాషా ప్రాతిపదికన మొత్తం ప్రణాళిక వ్యయం 67630.73 కోట్లలో దళిత ఉప ప్రణాళికకు రూ.10483.96 కోట్లను ప్రభుత్వం నిర్దేశించింది. దాదాపు 37 శాఖల్లోని నిధుల నుంచి ఈ కేటాయింపులు జరిగాయి.
ప్రణాళిక శాఖ పరిధిలో రూ.540 కోట్లు, పురపాలక శాఖలో రూ.283 కోట్లు, గృహ నిర్మాణ శాఖలో రూ.238 కోట్లు, స్త్రీశిశు సంక్షేమ శాఖలో రూ.209 కోట్లు.
గ్రామీణాభివృద్ధిలో రూ.144 కోట్లు, వైద్యఆరోగ్య కమిషనరేట్‌లో 198 కోట్లు ఈ కేటాయింపుల్లో ఉన్నాయి. మరోవైపు 9.12 శాతం జనాభా ప్రాతిపదికన ప్రణాళిక వ్యయంలోంచి రూ.6171.15 కోట్లు గిరిజన ఉప ప్రణాళికకు నిర్దేశించింది. 32 శాఖల నుంచి ఈ కేటాయింపులు జరిగాయి.
ప్రణాళిక శాఖలో రూ.317 కోట్లు, పంచాయతీరాజ్ శాఖలో రూ.230 కోట్లు, పురపాలక శాఖలో 172 కోట్లు, వైద్యఆరోగ్యశాఖలో రూ.145 కోట్లు, వ్యవసాయశాఖలో రూ.119 కోట్లు ఈ కేటాయింపుల్లో ఉన్నాయి. నిబంధనల మేరకు ఈ నిధులను దళిత, గిరిజనుల కోసమే వెచ్చించాలి.
గిరిజనులకు...
తెలంగాణ బడ్జెట్‌లో గిరిజనులకు మరోసారి ప్రాధాన్యం లభించింది. 2016-17 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.3752 కోట్లను కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.874 కోట్ల మేరకు కేటాయింపులు పెరిగాయి. విద్యాసంబంధిత పథకాలకు భారీగా నిధులను నిర్దేశించింది. మేడారం జాతర వద్ద శాశ్వత ఏర్పాట్లు, కొమురంభీమ్ స్మారక చిహ్నాల ఏర్పాటుకు నిధులను రూ. పది కోట్లను ప్రతిపాదించింది.
మైనారిటీల సంక్షేమం
మైనారిటీ సంక్షేమానికి 2015-16లో రూ.1104 కోట్లను కేటాయించింది.
మైనారిటీలకు కొత్తగా ప్రకటించిన 70 గురుకుల విద్యాలయాలకు నిధులను కేటాయించింది. ఆర్థిక చేయూత, స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీ కోసం రూ. 200 కోట్లను ప్రతిపాదించింది.
షాదీముబారక్ పథకానికి రూ.150 కోట్లను పేర్కొంది. వక్ఫ్‌బోర్డును బలోపేతానికి రూ. 65 కోట్లను నిర్దేశించింది.
షాదీఖానాల నిర్మాణానికి రూ.23 కోట్లను ప్రకటించింది. బోధనరుసుములు, ఉపకారవేతనాల కోసం రూ.250 కోట్లు, విదేశీ విద్యారుణ పథకానికి రూ.30 కోట్లను, స్టడీ సర్కిల్ నిర్వహణకు రూ.7 కోట్లను పేర్కొంది.
రంజాన్, క్రిస్మస్ పర్వదినాల సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ, ఇతర సహాయ కార్యక్రమాలు విందుల కోసం రూ.30 కోట్లను ప్రతిపాదించింది.
ముస్లింల ఆర్థిక స్థితిగతులపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన సుధీర్ కమిటీకి రూ.9.99 కోట్లను నిర్దేశించింది. దూదేకుల ముస్లిం సహకార సంస్థను ఏర్పాటు చేసి రూ.50 లక్షలను కేటాయించింది.
బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల మాదిరే పేద బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.100 కోట్లతో సంక్షేమ నిధిని ప్రకటించింది.
విద్యుత్తుశాఖ
ఈ బడ్జెట్ కేటాయింపు రూ.5,341.45 కోట్లు.
ఇందులో రాయితీకి: రూ.4470.10 కోట్లు
రాష్ట్ర బడ్జెట్‌లో ఈసారి విద్యుత్ రాయితీకి కేటాయింపులు పెరిగాయి. 2015-16లో కంటే ఇది సుమారు రూ.213 కోట్లు అధికం. వ్యవసాయ అనుబంధ రంగాలకు డిస్కమ్‌లందిస్తున్న సేవలకుగాను రాయితీ కింద ప్రభుత్వం నిరుడు రూ.4257 కోట్లు కేటాయించగా 2016-17లో ఆ మొత్తాన్ని 4470.10 కోట్లకు పెంచింది.
ఈసారి ఇంధన శాఖకు బడ్జెట్‌లో రూ.5341.45 కోట్ల కేటాయింపులు దక్కాయి. గత ఏడాది ఈ మొత్తం రూ.7400 కోట్లు! అయితే, బడ్జెట్‌లో సవరించిన అంచనాలను రూ.5563 కోట్లుగా లెక్కించారు.
కేంద్ర ప్రభుత్వ ఉదయ్ (ఉజ్వల్ డిస్కమ్ సహాయ యోజన) పథకంలో చేరాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో అప్పుల భారం తగ్గుతోందని సంతోషించిన తెలంగాణ డిస్కమ్‌లకు తాజా కేటాయింపు ఒకింత నిరాశనే మిగిల్చింది. బడ్జెట్‌లో రాయితీ మొత్తాన్ని పెంచినా... తెలంగాణ డిస్కమ్‌లపై భారం మాత్రం తగ్గటం లేదు. మరోవైపు వచ్చే మూడేళ్లలో 23912 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఆ దిశగా కేటాయింపులు మాత్రం చేయలేదు.
నిరుడు విద్యుదుత్పత్తిలో పెట్టుబడుల కోసం జెన్‌కోకు రూ.వెయ్యి కోట్లు కేటాయించగా.. ఈసారి నయాపైసా ఇవ్వలేదు. రుణం ద్వారా కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తున్నా వాటిలో జెన్‌కో ఈక్విటీ (ప్రభుత్వం) కూడా కొంతమేరకు ఉంటుంది. కానీ, వాటి ప్రస్తావన 2016-17 బడ్జెట్‌లో లేదు. హైవోల్టేజీ పంపిణీ వ్యవస్థల (హెచ్‌వీడీఎస్) కోసమని తెలంగాణ ట్రాన్స్‌కోకు రూ.190 కోట్లు కేటాయిస్తున్నట్లు మాత్రం చూపారు. సంప్రదాయేతర ఇంధన వనరులకు కూడా పెద్దగా కేటాయింపులేమీ లేవు.
ఇటీవలే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి (ఈఆర్‌సీ) సమర్పించిన వార్షిక/స్థూల ఆర్థిక అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)లో తమ లోటును రూ.8789 కోట్లుగా తెలంగాణ డిస్కమ్‌లు పేర్కొన్నాయి. ఆ మొత్తంలో సుమారు రూ.2వేల కోట్ల వరకూ ఛార్జీల రూపంలో వసూలు చేసుకోవటానికి ప్రతిపాదనలు చేశాయి. వాటిని ఈఆర్‌సీ యథాతథంగా ఆమోదించినా ఇంకా రూ.6789 కోట్ల లోటు అలాగే ఉంటుంది. పైగా...ఈ ఖరీఫ్ నుంచి పగటిపూట వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ అందించాలని నిర్ణయించారు. ఆ విషయాన్ని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో నొక్కి చెప్పారు కూడా! అయితే, 9 గంటల విద్యుత్ వల్ల ఎంతలేదన్నా రూ.3వేల కోట్ల అదనపు భారం డిస్కమ్‌లపై పడనుంది.
పరిశ్రమల శాఖ
ఈ బడ్జెట్ కేటాయింపు రూ.967 కోట్లు.
బడ్జెట్ సంస్కరణల ప్రభావం పరిశ్రమల శాఖపై పడింది. అనేక పద్దులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త బడ్జెట్‌లో రాయితీలు, మౌలిక వసతులకే పెద్దపీట వేసింది. చేనేత తదితర అనుబంధ రంగాల్లో కేటాయింపులకు కోత విధించింది. 2015-16లో పరిశ్రమలు, దాని పరిధిలోని లిడ్‌క్యాప్, చేనేత, చక్కెర, గనుల శాఖకు కలిసి కేటాయింపులు రూ.973 కోట్లు కాగా 2016-17లో రూ.967 కోట్లను మాత్రమే కేటాయించింది.
ఈ దఫా కేటాయింపుల్లో పరిశ్రమలకు ప్రోత్సాహకాల కింద రూ.230 కోట్లు, విద్యుత్ రాయితీల కోసం రూ.182 కోట్లు, ఇతర పథకాల కోసం రూ.235 కోట్లను కేటాయించింది. మెదక్ జిల్లాలోని నిమ్జ్‌కు రూ.100 కోట్లను, ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణకు రూ.50 కోట్లను ప్రతిపాదించింది. చిన్న, ఆహారశుద్ధి పరిశ్రమలకు తొలిసారిగా పావలా వడ్డీ పథకం ప్రవేశపెట్టింది. దీనికి రూ.86 కోట్లను కేటాయించింది.
గనుల శాఖకు రూ.34 కోట్లు, చక్కెర శాఖకు రూ.22 కోట్లను కేటాయించింది. చర్మఉత్పత్తుల పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (లిడ్‌క్యాప్) కేటాయింపులు రూ.1.63 కోట్లకు తగ్గాయి.
చేనేత నిధుల్లో కోత
చేనేత శాఖకు 2015-16 బడ్జెట్‌లో రూ.196 కోట్లు కేటాయించారు. ఈ దఫా బడ్జెట్‌లో రూ.83 కోట్లను ప్రతిపాదించారు. ఇందులో ప్రణాళిక వ్యయం రూ.70 కోట్లే. రూ. 43.21 కోట్లను చేనేత ప్రోత్సాహకానికి, కార్మికుల సంక్షేమానికి రూ.26 కోట్లను ప్రతిపాదించారు.
పంచాయతీరాజ్, ఉపాధిహామీ
ఈ బడ్జెట్ కేటాయింపు రూ.2,352 కోట్లు.
తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు, కరవుతో సతమతమవుతున్నా.. రాష్ట్రంలో ఉపాధిహామీ పథకం ఆశించిన మేర అమలు కావడంలేదు. పథకాన్ని మరింత సమర్థంగా ప్రయోజనకరంగా అమలు చేసేందుకు అవకాశమున్నా ఉపయోగించుకోవడంలేదనే విమర్శ ఉంది. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో రూ.500కోట్ల మేర వ్యయం చేయలేదు. దీంతో 2016-17 బడ్జెట్‌లో రూ.2,352 కోట్లే కేటాయించారు. ఎంత వ్యయం చేస్తే అంతమొత్తంలో నిధులు కేంద్రం నుంచి పొందే అవకాశమున్నా ఉపయోగించుకోవడంలేదు. లక్ష్యం మేరకు ఉపాధి పనులు కల్పించలేకపోతున్నారు. రాష్ట్రంలో తీవ్రమైన కరవు ఉన్నా ఇప్పటి వరకూ లక్ష్యంలో 92 శాతం మేరకే పనులు కల్పించారు. 1190 లక్షల పనిదినాలకు 1088 లక్షల పనిదినాలే కల్పించారు. చేసిన పనులకు సకాలంలో చెల్లింపులు జరగడం లేదు. 37 శాతం మేరకు చెల్లింపుల్లో జాప్యత చోటుచేసుకుంటోంది. సకాలంలో నిర్ధేశించిన లక్ష్యం మేరకు పనులు పూర్తికావడం లేదు. వ్యక్తిగత విభాగంలో పనులు తక్కువగా ఉన్నాయి. సహజవనరుల పరిరక్షణ, ప్రజాపనుల వాటా తక్కువగా ఉండగా.. వ్యవసాయ అనుసంధానం పరిస్థితీ ఆశాజనకంగా లేదు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ఉపాధితో అనుసంధానం ఉపయోగించుకోవడంలేదు.
గ్రామీణాభివృద్ధి
ఈ బడ్జెట్ కేటాయింపు రూ.1,662 కోట్లు.
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్‌శాఖ గత ఏడాది కేటాయించిన నిధులను పూర్తిగా వ్యయం చేయలేకపోయింది. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రోడ్డు వసతి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ప్రతి పంచాయతీ కేంద్రాన్ని తారురోడ్డుతో అనుసంధానం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రస్తుత సంవత్సరంలో రూ.1443కోట్లు కేటాయించగా..వ్యయం చేసింది రూ.944 కోట్లే. రాష్ట్రంలో మొత్తం గ్రామీణ రోడ్లు 64,046 కిలోమీటర్లు ఉండగా ఇందులో సీసీ రోడ్లు 1,717 కిలోమీటర్లు, తారురోడ్లు 18,564 కి.మీ. కంకరరోడ్లు 14148 కి.మీ. ఉండగా 29,617 కిలోమీటర్లు అంటే సగం మట్టిరోడ్లే ఉన్నాయి. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.1,662 కోట్లు కేటాయించగా.. ఇందులో కేంద్రం కేటాయించిన రూ.539 కోట్లు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నిధులు ఉన్నాయి.
యాదాద్రి, వేములవాడ
తెలంగాణలోని రెండు సుప్రసిద్ధ క్షేత్రాలకు తెలంగాణ ప్రభుత్వం 2016-17 బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించింది. యాదాద్రి(యాదగిరిగుట్ట) శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించింది. యాదాద్రి అభివృద్ధికి గత బడ్జెట్‌లో కూడా రూ.100 కోట్లు కేటాయించింది. యాదాద్రి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌ను రూపొందించిన విషయం తెలిసిందే.
వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించింది. ఈ ఆలయం అభివృద్ధికి ప్రత్యేకంగా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించే పనిలో ప్రభుత్వం ఉంది. రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి ఇంత పెద్దమొత్తంలో నిధులు కేటాయించటం ఇదే ప్రథమం.
ఆర్టీసీకి...
2016-17 బడ్జెట్‌లో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.40 కోట్లు కేటాయించింది. ఈ మొత్తాన్ని నూతన బస్సుల కొనుగోలుకు వినియోగించనున్నారు. 2015-16 బడ్జెట్‌లో రూ.152 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ రూ.40 కోట్లు మాత్రమే విడుదల చేసింది.
గ్యాస్ కనెక్షన్లు కోసం రూ.27.22 కోట్లు
రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు వంటగ్యాస్ కనెక్షన్‌ను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 43 లక్షల కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువనున్నట్లు అధికారుల అంచనా. అందులో 14.5 లక్షల కుటుంబాలకు వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం బడ్జెట్‌లో రూ.21 కోట్లు కేటాయించింది. ఎస్సీ ప్రణాళిక కింద రూ.3.86 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.2.36 కోట్లు కేటాయించింది.
విదేశీ రుణ ప్రాజెక్టులకు రూ.1354.85 కోట్లు!
తెలంగాణ రాష్ట్రంలో వివిధ దేశాలకు చెందిన ఆర్థికసంస్థల సహకారంతో సాగుతున్న ప్రాజెక్టులకు 2016-17 వార్షిక బడ్జెటులో ప్రభుత్వం రూ.1354.85 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపుల కన్నా ఇది రూ.322.85 కోట్లు అదనం.
ఆధునికీకరణ ప్రాజెక్టులకు రూ.448.25 కోట్లు, అవుటర్ రింగు రోడ్డు ప్రాజెక్టుకు రూ.235 కోట్లు, హైఓల్టేజీ విద్యుత్తు పంపిణీ వ్యవస్థకు రూ.190 కోట్లు, వివిధ ప్రాంతాల్లో చిన్ననీటిపారుదల ట్యాంకుల నిర్మాణానికి రూ.159.18 కోట్లు, తెలంగాణలోని పట్టణ, మున్సిపాలిటీల్లో సంస్కరణలకు రూ.140 కోట్లు, తెలంగాణ రోడ్డు ప్రాజెక్టులకు రూ.60 కోట్లు, జీవనోపాధి కల్పనా పథకాలకు రూ.40.82 కోట్లు, తెలంగాణ గ్రామీణ సమ్మిళత అభివృద్ధి కార్యక్రమానికి రూ.40 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు రూ.39.85 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
తాగునీటికి...
తాగునీటి పథకాల నిర్వహణకు పంచాయతీరాజ్ సంస్థలకు రూ.30 కోట్లను, గ్రామీణ తాగునీటి పథకాలకు రూ.100 కోట్లను కేటాయించారు. జాతీయ గ్రామీణ తాగునీటి పథకాలకు రూ.177 కోట్ల కేంద్ర నిధులు అందుబాటులోకి వచ్చాయి.
మహిళా సంఘాలు - వడ్డీలేని రుణాలు
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలకు రూ.148 కోట్లు కేటాయించారు. జిల్లా నీటియాజమాన్య నిర్వహణ సంస్థలకు రూ.28.95 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన రూర్బన్ మిషన్‌కు రూ.13.38 కోట్లు కేంద్రం కేటాయించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు గత బడ్జెట్‌లో రూ. 129 కోట్లు కేటాయించగా ఈ సారి రూ.132.98 కోట్లు కేటాయించారు.
ఏకగ్రీవ‌ పంచాయతీలకు
ఏకగ్రీవ‌ గ్రామపంచాయతీలకు ఈ సారి బడ్జెట్‌లో రూ.45.16 కోట్లు కేటాయించారు. గతంలో ఇది రూ.4.51 కోట్లు మాత్రమే. స్థానిక సంఘాలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.94.02 కోట్లు కేటాయించారు.
యువజన వ్యవహారాలు, పర్యాటకం
యువజన వ్యవహారాలు, పర్యాటక, సాంస్కృతిక శాఖకు 2016-17 బడ్జెట్‌లో రూ.232 కోట్లు కేటాయించారు. పర్యాటక రంగంలో పర్యాటక ప్రచారానికి రూ.27.23 కోట్లు, ప్రాజెక్టులకు రూ.10 కోట్లు కేటాయించారు.ఆబ్కారీ ఆదాయం
ఆబ్కారీ ఆదాయం రూ.14,161 కోట్లు
తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయ వనరు ఆబ్కారీ శాఖ. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖ నుంచి రూ.14,161 కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మద్యం అమ్మకాలపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్) ద్వారా రూ.9618 కోట్లు రాబట్టాలని ప్రతిపాదించారు. మద్యం దుకాణాలు, బార్లు, డిస్టిలరీలు, బ్రూవరీలు, కల్లు దుకాణాల లైసెన్సు రుసుములు, జరిమానాలు, ఇతర వనరుల ద్వారా మొత్తం రూ.4543 కోట్లు సమకూర్చుకోనున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.3916 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలపై వ్యాట్ ద్వారా రూ.8291 కోట్లు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బడ్జెట్‌లో ప్రతిపాదనల ప్రకారం 2016-17లో దీనిపై 16 శాతం అదనంగా ఆదాయం లభించనుందని అంచనా. 2015 ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు మద్యం అమ్మకాల ద్వారా రూ.11,452 కోట్లు సమకూరాయి. ఆబ్కారీ శాఖ గణాంకాల ప్రకారం ఫిబ్రవరి నెలాఖరు నాటికి మద్యం అమ్మకాల్లో ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు మొదటి మూడు స్థానాలు; హైదరాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలు చివరి స్థానాల్లో ఉన్నాయి.
భవనాల నిర్మాణానికి రూ.2.67 కోట్లు: రాష్ట్రవ్యాప్తంగా 138 ఆబ్కారీ స్టేషన్లు, 24 ఆబ్కారీ సూపరింటెండెంట్ల కార్యాలయాలు, పది ఉపకమిషనర్ల కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో 90 శాతం వరకు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. చాలా జిల్లాల్లో భవనాలకు స్థలం అందుబాటులో ఉన్నా నిర్మాణాలకు నిధులులేవు. నూతన నిర్మాణాలకు బడ్జెట్ మంజూరుచేయాలని ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపారు. 2016-17 బడ్జెట్‌లో ఆబ్కారీశాఖ భవనాల నిర్మాణానికి రూ.2.67 కోట్లు కేటాయించారు.
ఇదీ తెలంగాణ
విస్తీర్ణం: 1,12,077 చ.కి.మీ.
మొత్తం జనాభా: 3,52,86,757
అత్యధికం: రంగారెడ్డి జిల్లా 52,96,741 (15.13%)
అత్యల్పం: నిజామాబాద్ 25,51,335 (7.29%)
జనాభా రీత్యా జిల్లాల వరుస క్రమం:
1. రంగారెడ్డి (15.13%)
2. మహబూబ్‌నగర్ (11.58%)
3. హైదరాబాద్ (11.27%)
4. కరీంనగర్ (10.79%)
5. వరంగల్ (10.03%)
6. నల్గొండ (9.97%)
7. మెదక్ (8.67%)
8. అదిలాబాద్ (7.83%)
9. ఖమ్మం (7.45%)
10. నిజామాబాద్ (7.29%)
ఎవరెంత మంది?
పురుషులు: 176.12 లక్షలు
స్త్రీలు: 173.92 లక్షలు
పిల్లలు: 38,99,166 (ఆరేళ్లలోపు)
2001-2011 మధ్య జనాభా పెరుగుదల 13.58%
అంతకు ముందు దశాబ్దంలో పెరుగుదల 18.77%
ఎక్కడెంత మంది?
గ్రామ జనాభా: 61.12%, పట్టణ జనాభా: 38.88%
పట్టణ జనాభా: 136.09 లక్షలు.
2001-2011 మధ్య పట్టణ జనాభా పెరుగుదల: 38.12%
విస్తృతి
జిల్లాలు: 10
మొత్తం పట్టణాలు: 158
రెవెన్యూ డివిజన్లు: 42
మున్సిపల్ కార్పొరేషన్లు: 6
మున్సిపాలిటీలు: 37
నగర పంచాయతీలు: 25
జిల్లా పరిషత్‌లు: 9
మండల ప్రజా పరిషత్‌లు: 438
గ్రామ పంచాయతీలు: 8,687
రెవెన్యూ మండలాలు: 459
రెవెన్యూ గ్రామాలు: 10,434
లింగ నిష్పత్తి
1000 మంది పురుషులకు స్త్రీలు 998 మంది
నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో లింగ నిష్పత్తి 1000 కంటే ఎక్కువగా ఉంది.
కానీ 0-6 వయసు పిల్లల్లో లింగ నిష్పత్తి 2001లో 957, 2011లో 932. దీనర్థం గత దశాబ్దకాలంలో రాష్ట్రంలో ఆడపిల్లల జననాలు తగ్గాయనే!
ఎస్సీ జనాభాలో లింగ నిష్పత్తి 1008 (రాష్ట్ర సగటు కంటే ఎక్కువ)
ఎస్టీ జనాభాలో లింగ నిష్పత్తి 977 (రాష్ట్ర సగటు కంటే తక్కువ)
అట్టడుగు వర్గాలు
ఎస్సీలు: 54,08,800
రాష్ట్ర జనాభాలో 15.45%
అత్యధికం: కరీంనగర్ జిల్లా 7,09,757 (18.80%)
అత్యల్పం: హైదరాబాద్ జిల్లా 2,47,927 (6.29%)
ఎస్సీల్లో అక్షరాస్యులు: 28,53,371 (58.9%)
అత్యధికం: హైదరాబాద్ జిల్లా 77.72%
అత్యల్పం: మహబూబ్‌నగర్ జిల్లా 47.72%
ఎస్టీలు: 31,77,940
రాష్ట్ర జనాభాలో 9.08%
అత్యధికం: ఖమ్మం జిల్లా 6,56,577 (25.18%)
అత్యల్పం: హైదరాబాద్ జిల్లా 48,937 (1.24%)
ఎస్టీల్లో అక్షరాస్యులు: 14,12,617 (49.51%)
అత్యధికం: హైదరాబాద్ జిల్లా 69.34%
అత్యల్పం: మహబూబ్‌నగర్ జిల్లా 42.29%
పట్టణాల్లోని ఎస్సీలు: 13,36,557 (24.71%)
పట్టణాల్లోని ఎస్టీలు: 3,47,901 (10.95%)
బ్యాంకులు (2015 సెప్టెంబరు 30 నాటికి)
రాష్ట్రంలో మొత్తం బ్యాంకు శాఖలు: 4383
అత్యధికం: హైదరాబాద్ (1094)
అత్యల్పం: ఆదిలాబాద్ (243)
టెలిఫోన్ ఎక్స్ఛేంజీలు
మొత్తం: 1,756
అత్యధికం: రంగారెడ్డి, హైదరాబాద్ (400)
అత్యల్పం: ఆదిలాబాద్ (133)
చేతిపంపులు (2013-14)
రాష్ట్రం మొత్తం: 1,58,496
అత్యధికం: ఆదిలాబాద్ (23,261)
అత్యల్పం: నిజామాబాద్ (11,984)
గుడ్ల ఉత్పత్తి (2013-14లో)
మొత్తం ఉత్పత్తి: 1006 కోట్లు
అత్యధికం: మెదక్ (222 కోట్లు)
అత్యల్పం: 8 కోట్లు
పోస్టాఫీసులు
మొత్తం: 5832
అత్యధికం: మహబూబ్‌నగర్(845)
అత్యల్పం: హైదరాబాద్ (155)
ఆసుపత్రులు
అల్లోపతి: 206
ప్రభుత్వ అల్లోపతి వైద్యులు: 4,713
ఆసుపత్రులు అత్యధికం: హైదరాబాద్ జిల్లాలో 36
అత్యల్పం: కరీంనగర్ జిల్లాలో 14
మొత్తం పీహెచ్‌సీలు: 613
పడకలు: 20,450
సంప్రదాయ వైద్యం
ఆసుపత్రులు: 11
వైద్యులు: 655
ఆసుపత్రులు:
     ఆయుర్వేదం 4
     యునాని 3
     హోమియో 3
     ప్రకృతివైద్యం 1
ఆసుపత్రుల్లో మొత్తం పడకలు: 717
హెచ్ఐవీ బాధితులు 2013-14లో కొత్తగా గుర్తించినవారు 16,966
స్త్రీలు: 7,954
పురుషులు: 8,970
ఇతరులు: 42
అత్యధికం: హైదరాబాద్ 3,898
అత్యల్పం: అదిలాబాద్ 662
(మిగతా జిల్లాలన్నింటా 1000కి పైనే ఉన్నారు)
చికిత్స పొందుతున్న మొత్తం బాధితులు: 51,592 (మార్చి 2014 వరకు)
కుటుంబాలు
మొత్తం కుటుంబాలు: 83,03,612 (సగటు కుటుంబం ఇంటికి నలుగురు)
మొత్తం ఆవాసాలు: 1,00,78,599
ఇళ్లు లేనివారు: 83,969
అత్యధికం: రంగారెడ్డి 20,107
అత్యల్పం: ఖమ్మం 3,822
మతాలవారీ జనాభా
హిందువులు: 2,66,30,949
ముస్లింలు: 38,53,213
క్రైస్తవులు: 3,84,373
జైనులు: 19,959
సిక్కులు: 23,821
బౌద్ధులు: 29,628
ఇతరులు: 3,082
ఏ మతానికీ చెందనివారు: 42,246 (2001 జనాభా లెక్కల ఆధారంగా..)
విద్యుత్ వినియోగం
మొత్తం కనెక్షన్లు: 2.61 కోట్లు
వినియోగం: 72518 మిలియన్ యూనిట్లు (లోటెన్షన్, హైటెన్షన్ రెండూ కలిపి)
తలసరి వినియోగం(అన్ని కేటగిరీల్లో)
తలసరి విద్యుత్ వినియోగం
అత్యధికం: మెదక్..1439(గంటకు కిలోవాట్లు)
అత్యల్పం: ఖమ్మం..554(గంటకు కిలోవాట్లు)
పట్టణ పద్దు
మున్సిపాలిటీల ఆదాయ వ్యయాలు
అధికాదాయం: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)
ఈ ఏడాది మొత్తం బడ్జెట్: రూ.5500కోట్లు
జీహెచ్ఎంసీకి రకరకాలుగా వస్తున్న ఆదాయం: రూ.2200 కోట్లు
ఖర్చు: జీహెచ్ఎంసీకి వచ్చే ఆదాయంలో దాదాపు 80 శాతం.
అత్యల్ప ఆదాయం: ఆందోల్-జోగిపేట రూ.84.93 లక్షలు
పాఠశాలలు
మొత్తం పాఠశాలలు: 43,293
మొత్తం ఉపాధ్యాయులు: 2,34,879
1-5 తరగతులకు..
పాఠశాలలు: 25,331
ఉపాధ్యాయులు: 84,084
6-10 తరగతులకు
పాఠశాలలు: 9937
ఉపాధ్యాయులు: 94,524
అక్షరాస్యత
మొత్తం: 2,06,96,778 (66.54%)
పురుషుల్లో 75.04%
స్త్రీలలో 57.99%
అత్యధికం: హైదరాబాద్ జిల్లా 83.25%
అత్యల్పం: మహబూబ్‌నగర్ జిల్లా 55.04%
వికలాంగులు
మొత్తం: 10,46,822
పురుషులు: 5,65,413
స్త్రీలు: 4,81,409
అత్యధికం: హైదరాబాద్ జిల్లా 1,77,909
అత్యల్పం: నిజామాబాద్ జిల్లా 65,943
రహదారులు (2013 - 2014)
మొత్తం రోడ్లు: 90,880 కి.మీ.లు
పంచాయతీరాజ్ రోడ్లు: 70,201 కి.మీ.లు
రోడ్లు భవనాల శాఖ రోడ్లు: 24,244 కి.మీ.
జాతీయ రహదారులు: 2592 కి.మీ.
అడవులు (చదరపు కి.మీ.లో) (2014 - 2015)
మొత్తం విస్తీర్ణం: 27,292
రిజర్వ్‌డ్: 19,696
రక్షిత అడవులు: 6,953
మిగతా అడవులు: 624.30
అత్యధికం: ఆదిలాబాద్ (7,232)
అత్యల్పం: రంగారెడ్డి, హైదరాబాద్ (731)
పశు సంపద (2012 గణాంకాలు)
ఆవులు, ఎద్దులు: 50.34 లక్షలు
గేదెలు, దున్నపోతులు: 41.94 లక్షలు
గొర్రెలు: కోటి 29 లక్షలు,
మేకలు: 46.75 లక్షలు
కోళ్లు: 6.91 కోట్లు
కుక్కలు: 3,47,015
వ్యవసాయం
మొత్తం భూమి: 112.07 లక్షల హెక్టార్లు
అటవీ ప్రాంతం: 27.29 లక్షల హెక్టార్లు (23.89%)
వ్యవసాయ భూమి: 49.61 లక్షల హెక్టార్లు (43.20%)
బీడు భూమి: 6.07 లక్షల హెక్టార్లు (5.36%)
మొత్తం భూకమతాలు
మొత్తం కమతాల విస్తీర్ణం: 61,96,825 హెక్టార్లు
సగటు కమతా సైజు: 1.12 హెక్టార్లు
1 హెక్టారు కన్నా తక్కువున్న, సన్నకారు కమతాలు: 62%
10 హెక్టార్ల కన్నా ఎక్కువున్న పెద్ద కమతాలు: 0.28%
వీరి వద్దనున్న భూమి: 4.01%
0.5 హెక్టార్ల కన్నా తక్కువున్న కమతాలు, అలాగే 20 హెక్టార్ల కన్నా ఎక్కువున్న కమతాలు.. రెండూ అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో ఉన్నాయి.
20 హెక్టార్ల కన్నా ఎక్కువున్న కమతాలు మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికం (379). ఆ తర్వాతి స్థానాలు అదిలాబాద్ జిల్లా (350), వరంగల్ జిల్లా (347)
బీడు భూమి: 6.07 లక్షల హెక్టార్లు
అత్యధికం: నల్గొండ జిల్లా (1,21,351 హెక్టార్లు)
తర్వాతి స్థానాల్లో ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలున్నాయి.
అత్యల్పం: రంగారెడ్డి (27,084 హెక్టార్లు)
ఎరువుల వాడకం
అత్యధికం: కరీంనగర్ జిల్లా 208.59 టన్నులు
అతి తక్కువ: మెదక్ 89.34 టన్నులు
పంటలు ఉత్పత్తులు
వరి మొత్తం విస్తీర్ణం
ఎక్కువ పండేదెక్కడ? (హెక్టార్లలో)
వరి: కరీంనగర్ 4,17,912
గోధుమ: అదిలాబాద్ 3,110
జొన్న: నిజామాబాద్ 6,755
మొక్కజొన్న: కరీంనగర్ 86,302
రాగి: రంగారెడ్డి 327
పెసర: కరీంనగర్ 3,855
మినుము: కరీంనగర్ 4,155
కంది: కరీంనగర్ 266
మామిడి ఉత్పత్తి
అత్యధికం: కరీంనగర్ జిల్లా 1,63,821 టన్నులు
తర్వాతి స్థానం ఖమ్మం 1,32,850 టన్నులు
ఉల్లి ఉత్పత్తి
అత్యధికం: మెదక్ 1,70,543 టన్నులు
తర్వాతి స్థానం మహబూబ్‌నగర్ 96,853 టన్నులు
పండ్లు, కూరలు తోటల విస్తీర్ణం (అత్యధికం హెక్టార్లలో)
నిమ్మ: నల్గొండ 4860
ద్రాక్ష: రంగారెడ్డి 400
జామ: రంగారెడ్డి 1,027
బొప్పాయి: ఖమ్మం 173
సపోట: మహబూబ్‌నగర్ 222
కూరగాయలు (అత్యధికం హెక్టార్లలో)
సొర: రంగారెడ్డి 232
బెండ: మహబూబ్‌నగర్ 1,749
వంగ: రంగారెడ్డి 2,375
ఆకుకూరలు: రంగారెడ్డి 2,375
బఠాణీ: మెదక్ 170 హెక్టార్లు
సాగునీరు (2014-15 నాటికి) నీటి సదుపాయం ఉన్న భూమి
నికరంగా సాగునీరు అందుతున్న భూమి: 17.26 లక్షల హెక్టార్లు
సాగునీటి సదుపాయాలు (2014-15)
మొత్తం చెరువుల కింద ఉన్న భూమి: 1.13 లక్షల హెక్టార్లు
కాల్వల కింద ఉన్న భూమి: 2.43 లక్షల హెక్టార్లు
బావులు, గొట్టపు బావుల కింద: 21.16 లక్షల హెక్టార్లు
ఇతర జలవనరుల కింద: 0.57 లక్షల హెక్టార్లు
సాగవుతున్న నికర విస్తీర్ణం (అత్యధికం హెక్టార్లలో)
చెరువుల కింద: వరంగల్ 70,017
కాల్వలు కింద: నల్గొండ 80,864
గొట్టపు బావుల కింద: మహబూబ్‌నగర్ 2,12,626
బావుల కింద: కరీంనగర్ 3,88,636
పట్టభద్రులు
మొత్తం: 12,81,400
పురుషులు: 9,10,695
స్త్రీలు: 3,70,705
గ్రామీణ ప్రాంతాల్లో పట్టభద్రులు: 2,79,664
ఎక్సైజ్ ఆదాయం (2013 - 2014)
రాష్ట్రం మొత్తం: రూ.3607.15 కోట్లు
అత్యధికం: రంగారెడ్డి(రూ.1945.84 కోట్లు)
అత్యల్పం: నిజామాబాద్ (రూ.53.52 కోట్లు)
తలసరి ఆదాయం (2014-15) (తొలి సవరించిన అంచనాల ప్రకారం)
రాష్ట్ర తలసరి: రూ.1,29,182
అత్యధికం: హైదరాబాద్ (రూ.2,94,220)
అత్యల్పం: ఆదిలాబాద్(రూ.76,921)
పరిశ్రమలు (2012-13)
మొత్తం పరిశ్రమలు: 10,279
అత్యధికం: రంగారెడ్డి (3,797)
అత్యల్పం: ఆదిలాబాద్ (285)
ఉపాధి కల్పన కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు, కల్పించిన ఉపాధి(2013)
మొత్తం రిజిస్ట్రేషన్లు
అత్యధికం: కరీంనగర్(19,694)
అత్యల్పం: నల్గొండ(10,426)
ఉద్యోగాలు పొందినవారు
అత్యధికం: మహబూబ్‌నగర్‌ (114)
అత్యల్పం: ఆదిలాబాద్ (7)
పోలీసు బలగాలు (2013-14)
సివిల్ బలగాలు(అన్నీ కలిపి): 63211
అత్యధికం: హైదరాబాద్ 6319
అత్యల్పం: రంగారెడ్డి 726
ఆర్మ్‌డ్ రిజర్వ్ /స్పెషల్ బెటాలియన్ల బలగాలు: 22,321
అత్యధికం: హైదరాబాద్ 1754
అత్యల్పం: 236
పర్యాటకుల రాక
దేశీయ పర్యాటకులు: 7,23,99,113
అత్యధికం: వరంగల్(2,32,27,277)
అత్యల్పం: నిజామాబాద్ (6880)
విదేశీ పర్యాటకులు: 75171
అత్యధికం: హైదరాబాద్ (70,000)
అత్యల్పం: కరీంనగర్, ఖమ్మం, మెదక్ - 0
కోర్టు కేసులు (2013-14)
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు: 3,65,304
అత్యధికం: మహబూబ్‌నగర్ (55,080)
అత్యల్పం: హైదరాబాద్ (20,304)
దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారు: 7,22,151
అత్యధికం: రంగారెడ్డి (1,09,700)
అత్యల్పం: ఆదిలాబాద్ (50,604)