Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే 2015-16

2016 మార్చి 14న తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే 2015-16 ను శాసనసభలో ప్రవేశపెట్టారు.
ముఖ్యాంశాలు:
వరుసగా రెండో ఏడాది అలుముకున్న తీవ్ర కరవు పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రం 2015-16 ఆర్థిక సంవత్సరంలో 9.24 శాతం వృద్ధిరేటును సాధించింది. జాతీయ సగటు(7.6 శాతం) కంటే మెరుగైన గణాంకాలను నమోదు చేసింది. అన్ని రకాల పంటల దిగుబడి గత ఏడాదితో పోలిస్తే దాదాపు ఐదో వంతు తగ్గిపోయి వ్యవసాయ, అనుబంధ రంగాలన్నీ కలిపి -4.5 శాతం (రుణాత్మక) వృద్ధిరేటును నమోదు చేయగా, పరిశ్రమలు, విద్యుత్, వ్యాపారం, రియల్ ఎస్టేట్, సేవా రంగాలు మునపటి దూకుడును ప్రదర్శించాయి. దాంతో అభివృద్ధి గణాంకాలు పరుగులు తీశాయి. వృద్ధిరేటును ప్రస్తుత ధరల ప్రకారం చూసినా తెలంగాణ 11.7 శాతంతో సగర్వంగా నిలబడింది. రూ.5.83 లక్షల కోట్ల జీడీపీని నమోదు చేయనుంది. తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థికసర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
తలసరి ఆదాయంలోనూ తెలంగాణ రాష్ట్రం రూ.1.29 లక్షలతో దూసుకుపోతోంది. హైదరాబాద్ మహానగరంలో భాగంగా ఉన్న మూడు జిల్లాలు, కోస్తాను ఆనుకుని ఉన్న రెండు తెలంగాణ జిల్లాలు కలిపి... మొత్తం ఐదు జిల్లాలు లక్షకు పైగా తలసరి ఆదాయాన్ని నమోదు చేశాయి. అందులో హైదరాబాద్ అత్యధికంగా రూ.2.94 లక్షల తలసరి ఆదాయాన్ని కలిగివుంది. మిగతా ఐదు జిల్లాలు లక్ష కంటే తక్కువ తలసరిని నమోదు చేశాయి. అందులో ఆదిలాబాద్ (రూ.76,921), నిజామాబాద్(రూ.78,828)లు అట్టడుగున ఉన్నాయి.

తెలంగాణలో ఉపాధి కల్పన తీరుతెన్నులు క్రమంగా మారుతున్నాయి. వ్యవసాయం, పశు పోషణ, గనుల వంటి ప్రాథమిక రంగాల్లో ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈ రంగం నుంచి మానవ వనరులు క్రమంగా పరిశ్రమల వంటి ద్వితీయ శ్రేణి, వినోదం, సేవల వంటి తృతీయ శ్రేణి రంగాల్లోకి మళ్లుతున్నారు. అయితే, జీడీపీలో ఈ రంగాల వాటా పెరిగినంత వేగంగా ఉపాధి అవకాశాల వాటా పెరగడం లేదు. జీడీపీలో వ్యవసాయం వాటా తగ్గిపోతున్నంత వేగంగా ఉపాధి వాటా తగ్గడం లేదు. రాష్ట్ర జీడీపీలో వ్యవసాయం వాటా 12.9 శాతమే ఉన్నా 55 శాతం మంది ఇంకా ఈ రంగాన్నే నమ్ముకొన్నారు. సేవారంగాల వాటా అరవై శాతం దాటినా అక్కడ 26 శాతం మందికే ఉపాధి దొరుకుతోంది. అయితే, రాష్ట్ర వృద్ధిరేటు జాతీయ సగటును మించడంలో తృతీయ శ్రేణి (11 శాతం), ద్వితీయ శ్రేణి (8.6 శాతం) రంగాల పాత్రే కీలకంగా నిలిచింది.
తెలంగాణలో నిరుద్యోగిత సగటున 2.7 శాతం ఉంది. గ్రామాల్లో 1.1 శాతం ఉంటే, పట్టణ ప్రాంతాల్లో గరిష్ఠంగా 6.6 శాతం నమోదైంది. ముప్పయ్యేళ్లలోపు వయసు వారిలో పట్టణ నిరుద్యోగిత అత్యధికంగా 17.2 శాతంతో కొంత ఆందోళనకరంగా ఉంది. పట్టణ జనాభాలో 40 శాతం మంది నెలవారీ జీతాలతో ఉద్యోగాలు చేస్తుండగా, దాదాపు అంతే స్థాయిలో స్వయం ఉపాధి మీద బతుకుతున్నారు. గ్రామాల్లో స్వయం ఉపాధి, దినసరి కూలీలదే అగ్రస్థానం. నెలవారీ జీతాల ఉద్యోగులు బహుస్వల్పం. పనిచేయడానికి సిద్ధంగా ఉన్న మానవ వనరులు గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 75.7 శాతం మంది ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 51.8 శాతం మంది ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 74.4 శాతం మంది, హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 48.8 శాతం మంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తీవ్ర వివక్షకు గురైందని ఆర్థికసర్వే వ్యాఖ్యానించింది. వాటిని సరిచేసుకొనేందుకు జరిపిన సమష్ఠి, సుదీర్ఘ పోరాటం ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొంది. ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో తెలంగాణ అందించిన వాటాకు అది పొందిన నిధుల వాటాకు పొంతన లేదని తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి 12 ఏళ్లలో తెలంగాణ ప్రాంతానికి చెందిన రూ.85.83 కోట్ల మిగులును ఇతర ప్రాంతాలకు తరలించినట్లు కేంద్ర ప్రభుత్వం వేసిన లలిత్ కమిటీ తేల్చిందని ఆర్థికసర్వే పేర్కొంది. ఇందువల్ల తెలంగాణ ప్రాంతానికి జరిగిన నష్టాన్ని ఆర్థికవేత్త సీహెచ్.హనుమంతరావు తన పుస్తకంలో వివరించారని ప్రస్తావించింది.

14వ ఆర్థిక సంఘం 2004-13 మధ్యకాలంలో జిల్లాల వారీ ఆదాయ వ్యయాలను విశ్లేషించినపుడు ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో తెలంగాణ వాటా 49.5 శాతంగా తేలిందని, అందులో కేవలం 38.5 శాతమే తెలంగాణకు ఖర్చు పెట్టారని ఆర్థిక సర్వే పేర్కొంది. 1956 నుంచి యాభై ఎనిమిది ఏళ్లలో తెలంగాణ మిగులు వనరులను తరలించడం వల్ల ఇక్కడ సామాజిక ఆర్థిక అభివృద్ధికి కావాల్సిన పెట్టుబడులు తగ్గిపోయాయని, ఫలితంగానే తలకిందులైన ఆర్థికవ్యవస్థ వారసత్వంగా వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంవల్ల ఏర్పడిన పరిస్థితిని చక్కదిద్దడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలని వ్యాఖ్యానించింది. గాడితప్పిన విధానాలు వదిలించుకొని, భాగస్వామ్యం, జవాబుదారీతనం, అభివృద్ధి లక్ష్యంగా కలిగిన ప్రభుత్వ వ్యవస్థ కోసం సంస్కరణలు చేపట్టడానికి కొత్తరాష్ట్రం ఏర్పాటు సువర్ణావకాశమని పేర్కొంది. నిర్లక్ష్యాలను చక్కదిద్దడమే కాకుండా అందరికీ అవకాశాలను ఇచ్చే, ముందుచూపు కలిగిన 'బంగారు తెలంగాణ' నిర్మాణమే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక సర్వే వ్యాఖ్యానించింది.
1) ఆర్థికవృద్ధిని వేగవంతం చేసే చర్యలు తీసుకోవడం, 2) మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, 3) సామాజిక సంక్షేమం, సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా కార్యక్రమాలు... బంగారు తెలంగాణ విజన్‌లో భాగమని చెప్పింది.
ఆర్థిక సర్వేలో మరికొన్ని విషయాలు:
వ్యవసాయంలో వరుసగా రెండో ఏడాది రుణాత్మక వృద్ధిరేటు నమోదుతో ప్రజల ఆదాయాలు బాగా పడిపోతున్నాయి. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక తరహా వ్యవసాయానికి పెద్దపీట వేసింది. బిందుసేద్యం, పాలీహౌస్‌ల పథకం, సాగు యంత్రాలు, పౌల్ట్రీకి కరెంటు సబ్సిడీ వంటి చర్యలు తీసుకుంది. చెరువుల్ని బాగుచేసే మిషన్ కాకతీయ చేపట్టింది. కరవు నివారణకు తక్షణ కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేసింది. అణగారిన వర్గాలను కరవు రక్కసి నుంచి కాపాడుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం.

తెలంగాణ అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నా విద్య, ఆరోగ్య రంగాలు బాగా వెనుకబడ్డాయి. కొన్ని జిల్లాల్లో మహిళా అక్షరాస్యత, మాతా, శిశు మరణాల రేటు ఆందోళనకరంగా ఉంది. వీటిని సరి చేయకుండా ఎంత అభివృద్ధి సాధించినా ఫలితం లేదు. ఈ దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రం ఏర్పడ్డాక శిశు మరణాలు వెయ్యికి 39 నుంచి 28కి తగ్గాయి.
ఆర్థిక పరామితుల్లో తెలంగాణ పలు రాష్ట్రాలను దాటేసింది. జీఎస్‌డీపీ, తలసరి ఆదాయాల్లో అద్భుతమైన ప్రగతిని కనబరచింది.
రాష్ట్ర ఆర్థిక వనరుల్లో ప్రధానమైన సేవారంగం, చక్కటి మౌలిక సదుపాయాలు, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులు, వ్యయం తక్కువ వంటి అంశాలు సేవారంగంలో రెండంకెల అభివృద్ధి సాధించేందుకు దోహదపడ్డాయి. స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో సేవారంగం కీలకపాత్ర పోషిస్తోంది. రాష్ట్ర గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ)లో 61శాతం సేవారంగం వాటానే అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక ముఖచిత్రం-2016లో పేర్కొంది. అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్నది సేవారంగం. సేవారంగంలో 62.3 శాతం మంది ఉపాధి పొందుతున్నారు. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్, టెక్నాలజీ (ఐసిటి) పర్యాటక, ఆర్థిక రంగాల్లో ఉపాధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

సేవారంగంలో ఉపాధికి మరింత అవకాశం ఉంది. సేవారంగంలో ఉపాధి అవకాశాలు అందుకోవడానికి నైపుణ్యం కొరత ఉంది. కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్య పూర్తిచేసుకున్నవారిలో పరిశ్రమకు అవసరమైన నైపుణ్యం కొరత ఉంటోంది. ఈ కొరతను తీర్చేందుకు విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు తెలంగాణ నైపుణ్యాభివృద్ధి సంస్థ (టాస్క్) ద్వారా ప్రభుత్వం కృషి చేస్తోంది.
సేవారంగంలో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్, టెక్నాలజీ కీలకంగా ఉంది. ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, ఎగుమతుల్లో హైదరాబాద్ కీలకంగా ఉంది. హైదరాబాద్‌లో 1300 ఐటీ సంస్థలు; 3.7 లక్షల మంది ఐటీ నిపుణులు ఉన్నారు. రూ.68,258 కోట్ల ఎగుమతులు ఉన్నాయి. 2014-15లో హైదరాబాద్‌లో 89 ఐటీ యూనిట్లు కొత్తగా వచ్చాయి. టీ-హబ్, టాస్క్ వంటివి కీలకంగా ఉన్నాయి.
సేవారంగం వాటా ఇలా.. (ప్రస్తుత ధరల్లో)
వ్యాపారం, మరమ్మత్తులు, హోటళ్లు రెస్టారెంట్లు: 18.9 శాతం
రవాణా, నిల్వ సమాచార రంగం, బ్రాడ్‌కాస్టింగ్ సేవలు: 13.9 శాతం
ఆర్థిక సేవలు: 9.6 శాతం
రియల్ఎస్టేట్, వృత్తి సేవలు: 18.6 శాతం
ప్రజా పాలన: 19.9 శాతం
ఇతర సేవలు: 17.1 శాతం
తెలంగాణ రాష్ట్రానికి దేశీయ, విదేశీ పర్యాటకులు పెరుగుతున్నారు. 2013లో 5.42 కోట్ల మంది, 2014లో 7.25 కోట్ల మంది పర్యాటకులు రాష్ట్రానికి రాగా 2015 ఆఖరునాటికి 9.46 కోట్ల మంది వచ్చారు. పర్యాటకులు అత్యధికంగా సందర్శించిన జిల్లా కరీంనగర్. తర్వాత స్థానంలో ఆదిలాబాద్ ఉంది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు ముందున్నాయి. 2015లో 1.26 లక్షల మంది పర్యాటకులు రాగా, 1.22 లక్షల మంది హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు వచ్చారు. జులై నెలలో పర్యాటకులు అత్యధికంగా సందర్శించారు. మొత్తం పర్యాటకుల్లో 40 శాతం మంది జులైలోనే వచ్చారు.
తెలంగాణలో సుమారు సగం మందికి క్షయ వ్యాధి పట్ల అసలు అవగాహనే లేదని 2016 సామాజిక, ఆర్థిక ముఖచిత్రం వెల్లడించింది. హెచ్ఐవీ రోగులకు క్షయ సోకే ప్రమాదం ఎక్కువనీ, వారు మృతిచెందడానికి ఇదే ప్రధాన కారణంగా నిలుస్తోందనీ... ఈ రెండు వ్యాధుల పట్ల ఉన్న సంబంధంపై ప్రజలకు అవగాహనను పెంచాల్సిన అవసరముందని సర్వే స్పష్టం చేసింది. క్షయను తొలిదశలో గుర్తించలేకపోవడం, ఔషధాలను క్రమంగా తీసుకోకపోవడం, తదితర కారణాలు వ్యాధి ముదిరేందుకు ముఖ్యకారణంగా నిలుస్తున్నట్లు తేలింది. 77% మంది పురుషులు, 65% మంది మహిళల్లో క్షయ గురించి ఏదో సందర్భంలో విన్నట్లు వెల్లడవుతున్నా.. వీరిలోనూ సుమారు సగం మందికి క్షయ ఎలా వ్యాప్తి చెందుతుందో తెలియదని సర్వే చెప్పింది.
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వడంవల్ల పాల సేకరణ భారీగా పెరిగిందని సామాజిక ఆర్థిక ముఖచిత్రం వెల్లడించింది. ఈ పథకాన్ని 2014 నవంబరు ఒకటి నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. పథకం ప్రారంభించడానికి ముందు విజయ డెయిరీకి రోజుకు సగటున లక్షా 18 వేల లీటర్ల పాలను రైతులు పోసేవారు. పథకం ప్రారంభించిన తర్వాత ఒక దశలో అవి 5.58 లక్షల లీటర్లకు పెరిగాయి. గత ఏప్రిల్ నెలలో మొత్తం 68.2 లక్షల లీటర్లు సేకరించగా ఈ ఏడాది జనవరి నెలలో ఏకంగా కోటీ 38 లక్షల లీటర్ల పాలు రైతులు డెయిరీకి ఇచ్చారు. పాలు విరివిగా రావడం వల్ల రైతులకు చెల్లించాల్సిన రాయితీ సైతం భారీగా పెరిగింది. గత జనవరిలో మొత్తం 86,515 మంది రైతులు డెయిరీకి పాలు పోయగా వారికి 5.5 కోట్ల ప్రోత్సాహాకాన్ని చెల్లించినట్లు ముఖచిత్రంలో ప్రణాళికశాఖ తెలిపింది. ఈ ప్రోత్సాహకాన్ని తమకు పాలు పోసే రైతులకూ ప్రభుత్వం ఇవ్వాలని ఇటీవల కరీంనగర్, ముల్కనూరు డెయిరీలు అడగడంతో అధ్యయనానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది.