Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Budget 2017-18

తెలంగాణ బడ్జెట్‌ 2017-18 (ప్రవేశపెట్టిన తేదీ:13-03-2017)

1. 2017 - 18 రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
* గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం, సంక్షేమానికి పెద్దపీట, నీటిపారుదల రంగానికి, ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు, వ్యవసాయరంగ అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. సంక్షేమ రంగానికి అధిక కేటాయింపులతో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేశారు. గ్రామీణ వృత్తులు, ఆర్థిక ప్రేరణ ఇచ్చే పథకాలకు నిధుల కేటాయింపునకు ప్రాధాన్యమిచ్చారు. వర్గాలవారీగా వ్యక్తిగత ప్రయోజనాలతో సంక్షేమ పథకాల ద్వారా అవకాశం కల్పించారు.
* ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపు ఈ బడ్జెట్ ప్రత్యేకత. వీరికి చెందిన నిధుల వ్యయం కాకుంటే వచ్చే ఏడాది ఖర్చు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రతి మూడేళ్లకోసారి నిధుల వ్యయంపై చట్టసభల్లో నివేదికలు ప్రవేశపెట్టేలా నిర్ణయించడం ప్రత్యేకాంశం.
* వెనుకబడిన వర్గాల్లో బాగా వెనుకబడినవారి అభ్యున్నతికి ప్రత్యేకంగా వెయ్యి కోట్ల నిధులును కేటాయించడం మేలు చేసే అంశం. గ్రామాల్లో కులవృత్తులను నమ్ముకున్నవారికి ఆసరాగా కులాలవారీగా జీవనోపాధి పెంపు, మెరుగైన రాబడులకు ఊతమిచ్చేలా పద్దుల్లో నిధుల వాటా దక్కింది. గ్రామాల్లో వివిధ వర్గాల అభ్యున్నతికి నిధులను తొలిసారిగా బడ్జెట్‌లో కేటాయించారు.
* రాష్ట్రంలో గొర్రెల పెంపకానికి ప్రాధాన్యమిస్తూ వాటిపై ఆధారపడిన వర్గాలకు ఆసరాగా నిలుస్తూ ఈసారి భారీగా వ్యయం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
* నాయీ బ్రాహ్మణ, రజకులకు 'భరోసా కోసం రూ.500 కోట్లు కేటాయించింది. గతేడాది బడుగు, బలహీన వర్గాల కుటుంబాలు బాగా వినియోగించుకుని లబ్దిపొందిన కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చే మొత్తం బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. మత్స్య పరిశ్రమను ప్రోత్సహించడానికి అధికంగా నిధులిచ్చారు. కమ్మరి, వడ్రంగి సహా మొత్తం ఐదు కులాల సంక్షేమానికి రూ.200 కోట్లు, చేనేతకు రూ.1200 కోట్లు దక్కడంతో ఆ వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. శిశుమరణాల రేటును తగ్గించడానికి ప్రత్యేక కార్యాచరణకు బడ్జెట్ ద్వారా ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తల్లిపిల్లల సంరక్షణకు ప్రత్యేకంగా కేసీఆర్ కిట్ పథకం తీసుకొచ్చింది. కీలక సమయంలో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల్లో తల్లీపిల్లలకు ఇది తోడ్పడుతుంది.
* తొలి బడ్జెట్ నుంచి ప్రాధాన్యం దక్కించుకుంటున్న సాగునీటి రంగానికి ఈసారి భారీ కేటాయింపులు దక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ కారణాలతో కేటాయించిన మొత్తం వ్యయం కాకున్నా వచ్చే బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిగాయి. సాగునీటి ప్రాజెక్టులకు గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా రూ.25వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు.
* మిషన్ భగీరథ, రెండు పడక గదుల ఇళ్లకు, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను గతేడాది కంటే పెంచారు. బ్యాంకులు, హడ్కో రుణాలపై ఆధారపడిన మిషన్ భగీరథ, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పథకాలకు ఈసారి బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి మిషన్ భగీరథను పూర్తిచేసి ప్రతి ఇంటికీ రక్షిత నీటిని అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో బ్యాంకు రుణాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లను ప్రత్యేకంగా కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరంతో వ్యవసాయ రుణమాఫీ పూర్తి చేయడానికి వీలుగా ఆఖరు విడత బ్యాంకుల చెల్లింపులకు కేటాయింపులు చేయడంతో రుణమాఫీ పూర్తవుతుంది. రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణానికి హడ్కో రుణం ప్రధానమెనా బడ్జెట్‌లో కేటాయింపులు దక్కాయి.
* 2016 - 17 బడ్జెట్ అంచనాలు 14 శాతం తగ్గి, సవరించిన అంచనాలతో రూ.1.16 లక్షల కోట్లకు చేరగా, దీని పై 28 శాతం పెంచి కొత్త బడ్జెట్‌ను రూ.1,49,320.20 లక్షల కోట్లతో ప్రవేశపెట్టింది. వాణిజ్య పన్నుల రాబడి అంచనాల కంటే రూ.7వేల కోట్ల దాకా తగ్గి ఈసారి కూడా అమ్మకం పన్ను పైనే ప్రభుత్వం ఎక్కువ నమ్మకం పెట్టుకుంది.
* రాష్ట్ర పన్నుల ఆదాయం పెరుగుదల 19.6 శాతంగా పేర్కొని 2017 - 18 అంచనాలను రూపొందించింది. పెద్దనోట్ల రద్దు ప్రభావమున్నా, నిధుల జీఎస్‌డీపీలో రెండంకెల వృద్ధి రేటు నేపథ్యంలో బడ్జెట్ అంచనాలు పెరిగాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఆధారపడిన వ్యవసాయరంగం నుంచి జీఎస్‌డీపీ వాటా పెరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి జాతీయ సగటు కంటే ఎక్కువ ఉంది. పన్ను రాబడి అంచనాలు తగ్గడం, కేంద్ర నిధులు అంచనాలను అందుకోలేకపోవడం, నోట్ల రద్దు ప్రభావం నేపథ్యంలో ప్రతిపాదించిన బడ్జెట్‌లో 14 శాతం మేర తగ్గినట్లు ప్రభుత్వం విశ్లేషించింది. ఇదే సమయంలో రానున్న ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడి బాగా ఉంటుందని పెద్ద పద్దుకు శ్రీకారం చుట్టింది. పన్నులు, పన్నేతర ఆదాయం, కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్లు రూపంలో రూ.1.13 లక్షల కోట్లు సమకూర్చుకోనుండగా, మిగిలిన మొత్తాన్ని అప్పులు, కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా సమకూర్చుకోనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రం అప్పులు రూ.1.40 లక్షల కోట్లకు చేరుకోనుండగా, వివిధ సంస్థలు తీసుకున్న అప్పులకు ప్రభుత్వ గ్యారెంటీలు ఇప్పటికే రూ.31,453 కోట్లకు ఇచ్చినట్లు తెలిపింది. సంక్షేమం, అభివృద్ధితో బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
* రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఆర్థిక సంవత్సరంలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో దీనికి అనుగుణంగా 5వేల కోట్ల రూపాయలను ఈ బడ్జెట్‌లో కేటాయించింది. అంగన్‌వాడీలు, వీఆర్ఏలు, ఇతర ఉద్యోగుల కనీస వేతనాలు లక్ష్యంగా పెంచిన జీతాల పెంపునకు అనుగుణంగా సొమ్ములివ్వనున్నారు.
* ఈసారి బడ్జెట్‌లో విద్య, వైద్యం, ఆరోగ్యానికి నిధులు పెరిగాయి. ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌లకు రూ.1939 కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.5330 కోట్లు, బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.100 కోట్లను కేటాయించింది. చేనేత వర్గాల అభ్యున్నతికి రూ.1200 కోట్లను వ్యయం చేయనున్నట్లు ప్రకటించడం ఆ వర్గాలకు ఊరటనిచ్చే అంశం. చేనేత కార్మికులకు అండగా నిలిచేలా పవర్‌లూమ్‌ల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించింది.
* సాగునీటి శాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృధ్ధి, పాఠశాల విద్య, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, పురపాలకానికి రూ.5వేల కోట్ల కంటే ఎక్కువ నిధులు దక్కాయి.
* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రణాళిక, ప్రణాళికేతర బడ్జెట్ పద్దుల స్థానంలో నిర్వహణ పద్దు, ప్రగతి పద్దులతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. నిర్వహణ పద్దు కింద జీతాలు, నిర్వహణ వ్యయాలు, వడ్డీలు లాంటి వ్యయాలు ఉంటాయి. ప్రగతి పద్దు కింద మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం వివిధ పథకాలకు చేసే వ్యయాలు ఉంటాయి. గతంలో ప్రణాళికా బడ్జెట్‌లో ఉన్నవి అన్నీ ఇప్పుడు ఈ పద్దు కింద చూపారు.
* తెలంగాణ ప్రభుత్వం తెస్తున్న ఈ బడ్జెట్ బ్యాలెట్ బాక్స్ బడ్జెట్ కాదని, బతుకులను నిలబెట్టే బడ్జెట్ అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారానే తెలంగాణ అభివృద్ధి దిశగా పయనిస్తుందని, అందుకు అనుగుణంగానే గ్రామీణ వృత్తులకు ఆర్థిక ప్రేరణ ఇచ్చే పథకాలను రూపొందించామని ఆయన వెల్లడించారు. ఈ బడ్జెట్ కులవృత్తులకు ఆదరువుగా నిలిచి, కూలిన జీవితాలను నిలబెడుతుందని చెప్పారు. పెద్దనోట్ల రద్దు ప్రభావం 2016-17 బడ్జెట్‌పై ఎక్కువగానే ఉందని ఆర్థిక మంత్రి విశ్లేషించారు. అయినప్పటికీ 2016-17లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధి రేటు 10.01 శాతం మేర ఉంటుందని అంచనా వేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర నాలుగో బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఏ తరహా పథకాలను ఏ మేరకు నిధులతో చేపట్టబోయేది వివరించారు.

ముఖ్యాంశాలు
* 'ఇంతవరకు అమలైన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల స్థానే ఇక అభివృద్ధి నిధి అనేది ఉంటుంది. దీనివల్ల ఒక ఏడాది ఖర్చు చేయలేకపోయిన నిధులను తదుపరి సంవత్సరం ఖర్చు పెట్టేందుకు వీలవుతుంది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఇస్తున్న సాయాన్ని రూ.51,000 నుంచి రూ.71,116కు పెంచారు. గర్భిణులు ప్రభుత్వాసుపత్రిలో చేరితే వారి జీవన అవసరాల కోసం మూడు దశల్లో రూ.12,000 అందజేస్తారు. ఆడపిల్ల పుడితే మరో రూ.1000 అదనంగా అందుతుంది.' అని ఆర్థికమంత్రి పేర్కొన్నారు.
* 'ఇంతవరకు ప్రతి బడ్జెట్‌లోను ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు ఉండేవి. వీటి స్థానే రెవెన్యూ క్యాపిటల్ అనే పద్దులు ఉంటాయి. పతనమైన ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రజల సుదీర్ఘ ఆకాంక్షలు తీర్చే దిశగా తెలంగాణ భారీ పరివర్తన దశలో సాగుతోంది. 2016 - 17 బడ్జెట్‌లో 86 శాతం మేర ఖర్చు కాగలదని అంచనా వేస్తున్నాం. కోర్టు వ్యాఖ్యల కారణంగా భూముల అమ్మకాలు జరగలేదు. కేంద్రం నుంచి రావాల్సిన ప్రణాళిక నిధులు తగ్గాయి. వాణిజ్య పన్నుల ద్వారా రావాల్సిన బకాయిలూ వసూలు కాలేదు. వివిధ పథకాలను అమలుచేసే కార్పొరేషన్లకు బడ్జెటేతర పద్ధతుల్లో నిధులను సమకూరుస్తున్నాం. బడ్జెట్‌లోని కేటాయింపులతోపాటు ఆయా కార్పొరేషన్ల ద్వారా సమకూర్చే నిధులతో కలిపి చూస్తే 2017 - 18లో వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది' అని ఆర్థిక మంత్రి వెల్లడించారు.
* 'అభివృద్ధిలో తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 30కి పైగా ప్రత్యేక కార్యక్రమాలను అమలుచేస్తూ సంక్షేమ రంగంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. వందల కోట్లు వచ్చిపడినా పరిపాలన దక్షత, అంకితభావం లేకపోతే ప్రజాధనం నిరర్ధకమైపోతుంది. వృథా వ్యయానికి, అసంగత విధానాలకు స్వస్తి చెప్పి ప్రజా జీవన వికాసమే గీటురాయిగా కూర్చిన ఆర్థిక ప్రణాళిక ఇది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం ఇచ్చే బడ్జెట్ ఇది. దూరదేశాల్లో దుఃఖంతో బతుకులు వెల్లదీస్తున్న తెలంగాణ బిడ్డలు తిరిగి పల్లెకు పయనం కావాలన్నదే మా ఆకాంక్ష' అని ఆర్థిక మంత్రి ఈటల బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.

ఇతర ముఖ్యాంశాలు:
* రాష్ట్ర జీఎస్‌డీపీ 2016 - 17లో రూ.6.54 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. తలసరి ఆదాయం రూ.1.40 లక్షల నుంచి రూ.1.59 లక్షలకు పెరుగుదల.
* జిల్లా కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలు ఒకేచోట నిర్మాణం. రైతుల రుణ మాఫీ ఈ ఏడాదితో పూర్తి. చేపల పెంపకానికి పెద్ద ఎత్తున చిల్లర మార్కెట్ల ఏర్పాటు. చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాల అభివృద్ధి.
* నాయీ బ్రాహ్మణులకు, రజకులకు ప్రత్యేక సహకారం. గ్రామీణ ప్రాంతాల్లో నవీన క్షౌరశాలల ఏర్పాటుకు పెట్టుబడి, రజకుల వృత్తిని ఆధునికీకరించేందుకు వీలుగా వాషింగ్ మిషన్లు, డ్రయ్యర్లు, ఐరన్ బాక్సుల పంపిణీ, చెరువుల వద్దనే దోబీఘాట్ల నిర్మాణం.
* విశ్వకర్మలుగా పిలిచే ఔసల, కమ్మరి, కంచరి, వడ్రంగి, శిల్పకారులకు, వస్త్రాలు కుట్టి జీవించే మేర కులస్తులకు, కల్లుగీత ఆధారంగా జీవిస్తున్న గౌడ్లకు, కుమ్మరి తదితర కులవృత్తుల వారందరికీ ఆర్థిక సాయం. వారికి పరికరాల పంపిణీ.
* చేనేత కార్మికులకు కష్టాల నుంచి శాశ్వతంగా గట్టెక్కించడానికి త్రిముఖ వ్యూహం. చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయడం, నూలు, రసాయనాలు రాయితీపై పంపిణీ, మార్కెటింగ్ సదుపాయాల కల్పన.
* పుట్టిన బిడ్డ సంరక్షణ కోసం అవసరమయ్యే 16 వస్తువులతో కేసీఆర్ పేరుతో కిట్ల పంపిణీ. అందులో తల్లికి, బిడ్డకు ఉపయోగపడే సబ్బులు, బేబీ ఆయిల్స్, పౌడర్, డైపర్లు, షాంపు, పిల్లల ఆట వస్తువులు ఉంటాయి.
* వచ్చే పంచాయతీ ఎన్నికల నాటికి గిరిజన తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తారు.
* ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల చొప్పున 119 బీసీ పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరంలో ఆరంభం. మైనారిటీ వ్యాపారస్తులను ప్రోత్సహించేందుకు టీఎస్-ప్రైమ్ పథకం.

వివిధ రంగాలు - కేటాయింపులు:

పర్యాటకం, సాంస్కృతిక, యువజన శాఖలు:
* 2017 - 18 బడ్జెట్‌లో పర్యాటకం, సాంస్కృతిక, యువజన శాఖలకు రూ.198.03 కోట్లు కేటాయించింది. దీనిలో ప్రగతి పద్దు కింద రూ.119.43 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.78.61 కోట్లు కేటాయించింది. యువత స్వయం ఉపాధి కోసం విధివిధానాలు జారీ చేసినప్పటికీ గత ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో అసలు ఈ పథకం ఊసే ఎత్తలేదు. యువత శిక్షణ కోసం రూ.2.12 కోట్లు, సెట్విన్‌కు రూ.1.25 కోట్లు మాత్రమే కేటాయించింది. క్రీడా మైదానాల ఆధునికీకరణకు రూ.10 కోట్లు, క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాల కింద రూ.9 కోట్లు, శాప్ కోసం రూ.18 కోట్లు కేటాయించింది.
* పర్యాటక ప్రచారానికి రూ.19.01 కోట్లు ఇవ్వగా, మౌలిక సదుపాయాలకు రూ.7 కోట్లు మాత్రమే కేటాయించారు.
* సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణకు రూ.12 కోట్లు కేటాయించింది. వృద్ధ కళాకారుల పింఛన్ల కోసం రూ.5.85 కోట్లు, సాంస్కృతిక సారథుల కోసం రూ.17.12 కోట్లు, రవీంద్రభారతి, సాంస్కృతిక శాఖ పరిధిలోని విద్యాలయాలకు గ్రాంటుగా రూ.4 కోట్లు, రవీంద్రభారతి మరమ్మతులకు రూ.4.5 లక్షలు కేటాయించింది.

పురపాలక శాఖ:
* పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలకు బడ్జెట్‌లో ఊతం లభించింది. ప్రగతి పద్దు కింద రూ.2869.22 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.2729.78 కోట్లు మొత్తం కలిపి రూ.5599 కోట్లు కేటాయించారు.
* పురపాలక శాఖకు 2014 - 15 బడ్జెట్‌లో కేటాయింపులు రూ.1264 కోట్లు కాగా, వ్యయం కూడా అంతే రూ.1264 కోట్లు ఉంది. 2015 - 16లో రూ.2131 కోట్లు కేటాయించగా, రూ.1618 కోట్లు వ్యయం అయింది. 2016 - 17లో రూ.2169 కోట్లు కేటాయించగా, 2017 ఫిబ్రవరి వరకు రూ.1569 కోట్లు వ్యయం చేశారు.
* తాజా బడ్జెట్‌లో వరంగల్ నగరపాలక సంస్థకు రూ.300 కోట్లు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం నగరపాలక సంస్థలకు రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు కేటాయించారు.
* పురపాలక సంఘాల తోడ్పాటుకు రూ.500 కోట్లు, అమృత పట్టణాల అభివృద్ధికి రూ.300 కోట్లు, స్మార్ట్ సిటీలకు రూ.200 కోట్లు, పట్టణాలు, నగరాల్లో స్వచ్ఛ భారత్‌కు రూ.115 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో జీవనోపాధుల కల్పనకు రూ.17.45 కోట్లను కేటాయించారు.
* హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు గతేడాది కంటే ఈ బడ్జెట్‌లో మిన్నగా మొత్తం రూ.1000 కోట్లు కేటాయించారు. నగరంలో వైట్ ట్యాపింగ్ రోడ్లతోపాటు మూసీ సుందరీకరణకు, నాలాల సంస్కరణలకు నిధులను ప్రత్యేకంగా కేటాయించడంతో ఆయా పనులను ఈ ఏడాది వేగంగా చేపట్టడానికి వీలు పడుతుంది. గత బడ్జెట్‌లో రూ.863 కోట్లు కోరితే రూ.70.30 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దీనికి అనేక రెట్లు ఈసారి బడ్జెట్‌లో కేటాయించడం విశేషం.
* తెలంగాణ రాష్ట్రంలో 40 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. పురపాలికల్లో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కేంద్ర పథకం అమృత్ కింద 12 పట్టణాలు ఎంపికైనా, పనులు ప్రారంభం కావాల్సి ఉంది. వరంగల్, కరీంనగర్‌లను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడానికి గుర్తించినా, మొదట గుర్తించినవాటిలో లేకపోవడంతో కార్యాచరణకు సమయం పడుతుంది. పట్టణ స్థానిక సంస్థలు కోట్లు వ్యయం చేస్తున్నా అవినీతితో నాసిరకం పనులతో ప్రజలకు పాట్లు తప్పడం లేదు.

సాగునీటి రంగం:
* 2017 - 18 బడ్జెట్‌లో సాగునీటి రంగానికి ప్రగతి పద్దు కింద రూ.23,676 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.1324 కోట్లు కలిపి మొత్తం రూ.25,000 కోట్లు కేటాయించారు.
* కోటి ఎకరాలను సాగులోకి తెచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామన్న తెరాస ప్రభుత్వం ఈ బడ్జెట్‌లోనూ అందుకు అనుగుణంగానే అడుగులు వేసింది.
* భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు ఇచ్చిన నిధుల్లో సగం రెండు ప్రాజెక్టుల్లో కేటాయించింది. పనులు కొలిక్కి వచ్చిన ప్రాజెక్టులను పూర్తిచేయడంతోపాటు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించే పనులకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చింది. 2016 - 17లో ప్రణాళిక కింద రూ.25 వేల కోట్లు కేటాయించినా, సగమే ఖర్చుచేసిన నేపథ్యంలో ఈసారి కేటాయింపు కొంత తగ్గింది. కేటాయింపులు ఘనంగా ఉన్నా దీనికి తగ్గట్టుగా నిధులు విడుదల చేయడం కీలకం.
* చిన్ననీటి వనరుల అభివృద్ధికి, ప్రత్యేకించి 'మిషన్ కాకతీయకు 2017 - 18లోనూ తెలంగాణ సర్కారు భారీగానే నిధులను కేటాయించింది. చిన్న నీటి వనరులకు రూ.2,126.96 కోట్లు కేటాయించగా, ఇందులో మిషన్ కాకతీయ పనులకు రూ.1480 కోట్లు చూపించారు.
* సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధి తరహాలో మానేరు రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలోని కమిటీ అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్‌ను పరిశీలించి, కరీంనగర్‌లోని దిగువ మానేరు ఆనకట్ట కింద మానేరు రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయాలని యోచించింది. ఇందుకు రూ.506 కోట్లు వ్యయమవుతుందని అంచనా కాగా, కొత్త బడ్జెట్‌లో రూ.193 కోట్లను కేటాయించారు.
* రాష్ట్ర అవతరణ నాటికి సాగునీటి రంగం అంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన వ్యయం రూ.39,840 కోట్లు. గత రెండున్నరేళ్లలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ రంగంపై సుమారు రూ.24 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇందులో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కిందనే రూ.20 వేల కోట్లు వెచ్చించారు.
* తెలంగాణ ప్రభుత్వ తాజా లక్ష్యం 67.92 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 11.38 లక్షల ఎకరాల స్థిరీకరణ. ఇందుకు సుమారు రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రానున్న మూడేళ్లలో ఈ పనులన్నీ పూర్తిచేయాల్సి ఉంది.
* నీటిపారుదల ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపులు గత మూడేళ్లలో ఇలా ఉన్నాయి. 2014 - 15లో కేటాయింపులు రూ.6500 కోట్లు కాగా, ఖర్చు రూ.5285 కోట్లు. 2015 - 16లో కేటాయింపులు రూ.8500 కోట్లు కాగా, ఖర్చు రూ.7776 కోట్లు. 2016-17లో కేటాయింపులు రూ.25000 కోట్లు కాగా, 2017 జనవరి నాటికి రూ.10,500 కోట్లు ఖర్చు చేశారు.

* ప్రధాన ప్రాజెక్టులకు కేటాయింపులు
ప్రాజెక్టు - కేటాయింపులు (రూ.కోట్లలో)
* కాళేశ్వరం ఎత్తిపోతల - 6,991.87
* పాలమూరు-రంగారెడ్డి - 4,000
* దేవాదుల ఎత్తిపోతల - 1,500
* సీతారామ ఎత్తిపోతల - 1,000
* కల్వకుర్తి - 1,000
* శ్రీశైలం ఎడమగట్టు కాలువ - 900
* శ్రీరామసాగర్ వదర కాలువ - 800
* ప్రాణహిత - 775.44
* కంతన పల్లి - 505
* దిండి ఎత్తిపోతల - 500
* సాగర్ ఆధునికీకరణ - 490
* శ్రీపాద ఎల్లంపల్లి - 400
* లోయర్ పెన్‌గంగ - 360
* నెట్టెంపాడు - 235
* శ్రీరామ సాగర్ - 215.50
* భీమా ఎత్తిపోతల - 200
* కోయల్ సాగర్ - 200
* ఎస్సారెస్సీ రెండో దశ - 150
* కొమరం భీం - 145
* నిజాం సాగర్ - 109
* పెద్దవాగు జగన్నాథపూర్ - 72
* సింగూరు - 50
* మోడికుంట వాగు - 50
* జూరాల - 50
* చిన్న నీటిపారుదల ప్రాజెక్టులకు - 2,126.93

మాతా శిశు సంరక్షణ
* 2017 - 18లో కేటాయింపు ప్రగతి పద్దు రూ.849.72 కోట్లు, నిర్వహణ పద్దు రూ.881.77 కోట్లు మొత్తం రూ.1731.50 కోట్లు.
* మాతా శిశు సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని పేర్కొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూసేందుకు రూ.12 వేల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. కేసీఆర్ కిట్ పేరిట మాతా, శిశువుకు మూడు నెలలకు అవసరమైన సబ్బులు, తువ్వాళ్లు, పౌడర్లు, డైపర్లు ఇవ్వనుంది.
* మొత్తంగా 2017 - 18 ఆర్థిక సంవత్సరంలో మహిళా శిశు సంక్షేమ శాఖకు ప్రగతి పద్దు కింద రూ.849 కోట్లు కేటాయించింది. ఇందులో మహిళా సహకార ఆర్థిక సంస్థకు రూ.60 కోట్లు, ఐసీడీఎస్‌కు రూ.57 కోట్లు ఇచ్చింది. అంగన్‌వాడీల్లో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలను పెంచింది. అంగన్‌వాడీ కేంద్ర భవన నిర్మాణానికి రూ.34 కోట్లు, ఆడపిల్లల భద్రత పథకానికి రూ.10 కోట్లు ఇచ్చింది.

సంక్షేమ రంగం
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు గతేడాదితో పోలిస్తే బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో అత్యంత వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేశారు. స్వయం ఉపాధి పథకాలకు ప్రాధాన్యమిచ్చారు.
* షెడ్యూలు కులాల సంక్షేమశాఖకు ప్రగతి పద్దు కింద రూ.9901.86 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.476.43 కోట్లు, మొత్తం రూ.10,378.29 కోట్లు కేటాయించారు.
* తాజా బడ్జెట్‌లో షెడ్యూలు తెగల సంక్షేమ శాఖకు ప్రగతి పద్దు కింద రూ.5719.33 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.393.27 కోట్లు మొత్తంగా రూ.6112.61 కోట్లు కేటాయించారు.
* తాజా బడ్జెట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు ప్రగతి పద్దు కింద రూ.4764.60 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.305.76 కోట్లు మొత్తంగా రూ.5070.36 కోట్లు కేటాయించారు.
* తాజా బడ్జెట్‌లో అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి ప్రగతి పద్దు కింద రూ.1226.32 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.23.35 కోట్లు మొత్తంగా రూ.1249.66 కోట్లు కేటాయించారు.
* ఆడపిల్లల వివాహానికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం 50 శాతం పెంచింది. లబ్దిదారులకు ఇప్పటివరకు రూ.51 వేలు అందుతుండగా దాన్ని రూ.75,116కి పెంచారు. కేటాయింపులు మాత్రం అందుకు అనుగుణంగా లేవు. 2017 - 18 ఏడాదికి అన్ని వర్గాలకు కలిపి రూ.850 కోట్లు పొందుపరిచారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయింపులు పెరగలేదు. బీసీలకు రూ.100 కోట్లు పెంచారు. గతేడాది చేసిన కేటాయింపులు 1,44,705 మందికి లబ్ది చేకూర్చేలా ఉంటే ఈ ఏడాదికి 1,13,158 మందికి మాత్రమే మేలు జరగనుంది.
* బోధనా రుసుం, ఉపకార వేతనాల కింద 2017 - 18 అంచనాలకు తగినట్లుగా రూ.2858.73 కోట్లు కేటాయించారు. గతేడాది బకాయిలు చెల్లించేందుకు రూ.3,200 కోట్లు అవసరం. ఆ నిధులు వెంటనే విడుదల చేస్తే ఉపకార వేతనాలు సకాలంలో అందుతాయి. లేకుంటే 2017 - 18 ఏడాది నిధులు గత బకాయిలు చెల్లించేందుకు సరిపోని పరిస్థితి.
* విదేశీ విద్యా పథకం కింద కేటాయింపులు తగ్గాయి. ఒక్కో విద్యార్థికి ఉపకార వేతనాన్ని రూ.20 లక్షలకు పెంచినప్పటికీ బడ్జెట్ పెరగలేదు. ఏటా 300 మంది బీసీ, ఈ బీసీ విద్యార్థులకు విదేశీ విద్యకు పంపించాలన్నది లక్ష్యం. ఈ లెక్కన 60 కోట్లు అవసరమైతే రూ.20 కోట్లతో సరిపెట్టారు. మైనార్టీలకు రూ.40 కోట్లు, ఎస్టీలకు రూ.16.70 కోట్లు ఇచ్చారు. ఎస్సీలకు వృత్తి సంబంధ విద్యా (ప్రొఫెషనల్ స్టడీస్) కింద పుస్తకాలు, న్యాయవాదులకు ఆర్థిక సహాయం, విదేశీ విద్యా పథకాలకు కలిపి రూ.157 కోట్లు కేటాయించారు. వీటలో విదేశీ విద్యకు రూ.60 కోట్లు ఉంటాయి.
* దళిత నిరుద్యోగ యువతకు ప్రత్యేకంగా రూ.84 కోట్లు రాయితీ కింద పేర్కొన్నారు. నిరుపేద ఎస్సీ కుటుంబాలకు మూడెకరాల భూమి, స్వయం ఉపాధి, శిక్షణ పథకాలకు కలిపి రూ.1334.88 కోట్లు పెట్టింది. ఎస్టీ భూముల అభివృద్ధి కోసం రూ.110 కోట్లు చూపించింది. ఎస్టీ యువత స్వయం ఉపాధి రుణాలకు రూ.193 కోట్లు కేటాయించింది. బీసీ ఆర్థిక సహకార సంస్థకు కేటాయింపులు లేవు. కొత్తగా ఏర్పాటైన ఎంబీసీ సహకార సంస్థకు రూ.1000 కోట్లు పేర్కొన్నారు. మైనార్టీ యువత స్వయం ఉపాధికి రూ.150 కోట్లు, క్రిస్టియన్లకు రూ.7 కోట్లు కేటాయించింది.
* ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న గురుకులాలకు భారీగా కేటాయింపులు చేసింది. వీటి నిర్మాణం, నిర్వహణకు రూ.2340 కోట్లు కేటాయించింది. సాంఘిక సంక్షేమ గురుకులాలకు రూ.1076 కోట్లు, గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలకు రూ.709 కోట్లు, మైనార్టీ గురుకులాలకు రూ.425 కోట్లు, బీసీ సంక్షేమ గురుకులాలకు రూ.130 కోట్లు ప్రకటించింది.

ఎస్సీ, ఎస్టీల ప్రత్యేకాభివృద్ధి
* ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధికి ఉపప్రణాళిక స్థానంలో ప్రత్యేక అభివృద్ధి నిధి పేరిట ప్రభుత్వం కేటాయింపులు జరిపింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి నిధులు భారీగా పెరిగాయి. జనాభా ప్రాతిపదికన ప్రగతి పద్దులో వాటా మేరకు ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించారు. ఈ పద్దు కింద రూ.22540.99 కోట్లు బడ్జెట్‌లో చూపించారు.
* 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్సీల జనాభా 15.45 శాతంగా ఉంది. జనాభా శాతం కంటే 16.33 శాతం ఎక్కువగా రూ.14375.12 కోట్లు ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధులుగా చూపించారు.
* ఎస్టీ జనాభా 9.27 శాతం ఉండగా, ఆ మేరకు రూ.8165.87 కోట్లుగా పేర్కొన్నారు.
* గతేడాదితో పోలిస్తే, ఎస్సీ, ఎస్టీలకు నిధుల కేటాయింపు 36 శాతం అదనం.
* ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల కేటాయించినప్పటికీ ఈ నిధుల వినియోగం, ఖర్చుపై ప్రత్యేక చట్టం సిద్ధం కాలేదు. కొత్త చట్టం వచ్చాక అందులో పేర్కొన్న విధివిధానాల మేరకు నిధుల ఖర్చు ఉంటుంది.
* ప్రత్యేకాభివృద్ధి నిధుల్లో సంబంధిత సంక్షేమ శాఖలను మినహాయిస్తే అధికశాతం నిధులు గ్రామీణాభివృద్ధి శాఖకు వెళ్తున్నాయి. ఎస్సీ నిధుల నుంచి రూ.1651.68 కోట్లు, ఎస్టీ నిధుల నుంచి రూ.1219.82 కోట్లు చూపించారు. ఈ నిధులతో ఆసరా ఫించన్లు ఇస్తున్నారు.
* నీటీ పారుదల శాఖ పరిధిలో చేపట్టే పనులకు రెండు విభాగాల నుంచి రూ.2367.57 కోట్లు చూపించారు. వ్యవసాయ యాంత్రికీకరణకు రూ.37 కోట్లు, పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద రూ.152.94 కోట్లు చూపించారు.
* పాలీహౌజ్ రాయితీ కింద రూ.25 కోట్లు, ఔషధాల కొనుగోలుకు రూ.54 కోట్లు, ఆరోగ్య శ్రీ పరిధిలో లబ్ధిదారులుగా లేని ఎస్సీ, ఎస్టీ పేద కుటుంబాలకు నిమ్స్‌లో వైద్య సహాయానికి రూ.3.86 కోట్లుగా పేర్కొన్నారు.
* మిషన్ భగీరథకు రూ.966.60 కోట్లు, 2 పడక గదుల పథకానికి రూ.500 కోట్లు ప్రత్యేక నిధుల్లోంచి కేటాయించారు.

పశు సంవర్థక, మత్స్య శాఖలు:
* మొత్తంగా పశుసంవర్థక, మత్స్య శాఖలకు ఈ బడ్జెట్‌లో రూ.594.74 కోట్లు కేటాయించారు. వీటిలో నిర్వహణ పద్దు (జీత భత్యాలు, పరిపాలనా ఖర్చులు)కు రూ.333.19 కోట్లు కేటాయించగా, మిగిలిన రూ.261.55 కోట్లు పథకాల అమలు (ప్రగతి పద్దు)కు ఖర్చు చేయనున్నారు.
* ఈ పథకాల సొమ్ములో ప్రగతి పద్దు కింద ప్రధానంగా పశుసంవర్థక శాఖకు రూ.163.63 కోట్లు, మత్స్య శాఖకు రూ.60.50 కోట్లు కేటాయించారు. మొత్తం నిధుల్లో పీవీ నర్సింహారావు పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.21.25 కోట్లు, పశువుల ఆస్పత్రుల సామగ్రికి రూ.5 కోట్లు, మందులకు రూ.20 కోట్లు, కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి రూ.43 కోట్లు, పాడిపరిశ్రమకు రూ.13.55 కోట్లు, పందుల పెంపకానికి రూ.కోటి, మత్స్యకారుల అభివృద్ధికి రూ.37.21 కోట్లు కేటాయించారు.
* వచ్చే రెండేళ్లలో 4 లక్షల యాదవ కుటుంబాలకు 84 లక్షల గొర్రెలు పంపిణీ చేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. వీటికవసరమైన నిధులు మాత్రం బడ్జెట్‌లో పూర్తిగా కేటాయించలేదు. రుణాలు, తీసుకుని గొర్రెల పంపిణీ విక్రయ ప్రక్రియ చేపడతామని వెల్లడించినా ఆ రుణాలు ఎంత...?, ఏ రూపంలో తీసుకుంటారో...? ప్రత్యేకంగా వివరించలేదు.

చేనేత, జౌళి రంగం:
* 2017 - 18లో కేటాయింపు మొత్తం రూ.1283.31 కోట్లు. ఇందులో ప్రగతి పద్దు రూ.1270 కోట్లు కాగా, నిర్వహణ పద్దు రూ.13.31 కోట్లు.
* చేనేత, జౌళి రంగానికి చేయూతనిస్తామని ప్రకటించిన విధంగానే సీఎం కేసీఆర్ ఈ రంగానికి భారీ ఎత్తున నిధులను కేటాయించారు. 2016 - 17లో రూ.70 కోట్లను కేటాయించాలని రూ.30 కోట్లును మాత్రమే వెచ్చించారు. 2017 - 18లో మాత్రం కేటాయింపులు రూ.1283.31 కోట్లకు పెంచారు.
* చేనేత, జౌళి శాఖ నిధులను రెండు శాఖల పరిధిలో చేర్చారు. మొత్తం కేటాయింపుల్లో రూ.1200 కోట్లను బీసీ సంక్షేమ శాఖ పరిధిలో చేర్చగా, మిగిలిన రూ.83.31 కోట్లను పరిశ్రమల పరిధిలో ఉంచారు. చేతి వృత్తులకు నూతనోత్తేజం కల్పిస్తామని ప్రకటించిన ప్రభుత్వం దానికి అనుగుణంగా బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని వృత్తుల కేటగిరీలో చేనేతను చేర్చి నిధులను కేటాయించింది.
* చేనేత, జౌళికి ఇంత భారీ ఎత్తున కేటాయింపులు దేశంలో ఎక్కడా లేవు. తమిళనాడు బడ్జెట్ రూ.450 కోట్లు కాగా, గుజరాత్ కేటాయింపులు రూ.420 కోట్లు. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత బడ్జెట్ ఎప్పుడు రూ.200 కోట్లు దాటలేదు.
* రాష్ట్రంలో చేనేత, జౌళి రంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఆత్మహత్యలు కొనసాగడం, ఉపాధి కోసం కార్మికులు ఇబ్బందులు పడటం లాంటి అంశాలను పరిగణనలోనికి తీసుకుని సమస్యల పరిష్కారానికి ఈ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. చేనేత జౌళి ఉత్పత్తుల పెంపుతో పాటు వాటి విక్రయాలకు వీలుగా కార్యాచరణ ప్రారంభించారు. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని ఆయన పిలపునిచ్చారు.
* వరంగల్‌లో అంతర్జాతీయ స్థాయి జౌళి పార్కును, సిరిసిల్లలో భారీ జౌళి పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి నెలలోనే వరంగల్ రూరల్ జిల్లాలో మెగా పార్కుకు శంకుస్థాపన చేస్తామని సీఎం ప్రకటించారు. వీటి నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని కేటాయింపులను భారీగా పెంచింది.

వైద్య, ఆరోగ్య శాఖ:
* 2017 - 18లో మొత్తం కేటాయింపు రూ.5,976.17 కోట్లు. ఇందులో ప్రగతి పద్దు కింద రూ.2,666.07 కోట్లు. నిర్వహణ పద్దు కింద రూ.3,310.09 కోట్లు కేటాయించారు.
* కీలకమైన వైద్య ఆరోగ్య శాఖకు తెలంగాణ సర్కారు కొత్త బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యమిచ్చింది. గతేడాది కేటాయింపుల కంటే ఈసారి రూ.1,035 కోట్లు అధికంగా కేటాయించింది.
* గ్రామీణంలో ప్రసూతి వైద్యాన్ని బలోపేతం చేసేందుకు రూపొందించిన 'కేసీఆర్ అమ్మ ఒడి పథకానికి ప్రత్యేకంగా రూ.605 కోట్లు ఇచ్చింది. సర్కారు దవాఖానాల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు గర్భిణులకు మూడు విడతల్లో రూ.12 వేలు అందజేస్తామని ప్రకటించింది. కాన్పు నిమిత్తం ఆసుపత్రిలో చేరిన వెంటనే రూ.4 వేలు, కాన్పు తర్వాత ఇంటికెళ్లే సమయంలో మరో రూ.4 వేలు, పుట్టిన బిడ్డకు పోలియో టీకా వేయించడానికి వచ్చినప్పుడు మరో రూ.4 వేలను అందిస్తారు. ఆడపిల్ల పుడితే మరో వెయ్యి రూపాయలను ప్రోత్సహకంగా అందజేస్తారు.
* ఔషధాలకు నిరుడు రూ.223.42 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.245.19 కోట్లు కేటాయించారు. 'ఆరోగ్య శ్రీకి రూ.503.20 కోట్లు, ఉద్యోగుల ఆరోగ్య పథకానికి రూ.250 కోట్లు పొందుపరిచింది.
* 'ఆరోగ్య శ్రీ' పరిధిలోకి రాని దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు చికిత్స అందించేందుకు నిమ్స్‌కు రూ.10 కోట్లు. ఇది గతేడాది రూ.50 కోట్లు.
* తెలంగాణ రాష్ట్రం నవజాత శిశు సంరక్షణలో మెరుగైన ఫలితాలు సాధించింది. ప్రతి 1000 మంది శిశు జననాల్లో నవజాత శిశు మరణాల సంఖ్య 32 నుంచి 28కి తగ్గింది. ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఓపీ సంఖ్య 20 శాతం పెరగడంతో కేంద్ర ప్రభుత్వ పురస్కారం దక్కింది. లోపాలను చక్కదిద్దడానికి అవసరమైన నిధులను సమకూర్చుడంతో రాష్ట్రంలో 250 ఎంబీబీఎస్ సీట్లు పునరుద్ధణకు నోచుకున్నాయి. 200 పీజీ సీట్లకు కొత్తగా అనుమతినిచ్చారు.

ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ:
* 2017 - 18లో మొత్తం కేటాయింపు రూ.252.89 కోట్లు. ఇందులో ప్రగతి పద్దు కింద రూ.250.88 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.2.01 కోట్లు కేటాయించారు.
* తెలంగాణ వార్షిక బడ్జెట్‌లో సమాచార సాంకేతిక (ఐటీ), ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖకు గత ఆర్థిక సంవత్సరం కంటే కేటాయింపులు పెరిగాయి. కొత్త ప్రాజెక్టులతో పాటు ప్రస్తుతం ఉన్న వాటి విస్తరణ, పటిష్ఠం చేసేలా నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఇమేజ్ టవర్, టీహబ్, విస్తరణ తదితర ప్రాజెక్టుల నిర్మాణాలు, ఐటీ పార్కులు, పరిశ్రమల వద్ద మౌలిక వసతుల కోసం రూ.100 కోట్లను నిర్దేశించింది. ఐటీ రాయితీల కోసం రూ.20 కోట్లను కేటాయించింది. టీ-హబ్ మొదటి దశతో పాటు నిర్మాణం అనంతరం రెండో దశ నిర్వహణ కోసం రూ.8.64 కోట్లను ప్రతిపాదించింది.
* తెలంగాణ ప్రభుత్వ విజ్ఞాన అభివృద్ధి సంస్థ (టాస్క్)కు రూ.7.50 కోట్లను నిర్దేశించింది. కొత్త జిల్లా కేంద్రాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో దూర దృశ్య సమీక్ష (వీడియో కాన్ఫరెన్సింగ్) సౌకర్యం కల్పించేందుకు వీలుగా రూ.5 కోట్లను ఇచ్చేందుకు అంగీకరించింది.
* సాఫ్ట్‌నెట్ ద్వారా విద్యార్థ్థులకు పాఠాలు, నిరుద్యోగులకు పోటీ పరీక్షలపై శిక్షణ కోసం ప్రభుత్వం మన టీవీ ద్వారా ప్రసారాలు చేస్తోంది. దీని కోసం కొత్త బడ్జెట్‌లో రూ.6 కోట్లను కేటాయించింది.
* ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొత్త విధానాలపై దృష్టి సారించారు. దీనికి అనుగుణంగా ఫోటోనిక్స్ వ్యాలీకి రూ.2 కోట్లను కేటాయించారు.
* ఔత్సాహికుల ద్వారా ఐటీ అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు 2015 నవంబరులో తెలంగాణ ప్రభుత్వం టీహబ్‌ను ప్రారంభించగా, మంచి స్పందన లభిస్తోంది. ప్రతి పల్లెలో పౌరులకు ఆన్‌లైన్ సౌకర్యాలు అందించేందుకు డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2015 - 16లో రాష్ట్రం నుంచి రూ.75,070 కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి. ఈ రంగంలో సుమారు 4 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.

మిషన్ భగీరథ:
* 'మిషన్ భగీరథ'కు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లను కేటాయించింది. మొత్తం ఖర్చులో 80 శాతం నిధులను బడ్జెట్ బయటి రుణాలుగా తెచ్చి ఖర్చు పెట్టనున్న, మిగతా 20 శాతాన్ని మాత్రం ప్రభుత్వం బడ్జెట్ నుంచి సమకూర్చాల్సి ఉంటుంది. ఆ ప్రకారం, లక్ష్యసిద్ధికి ప్రభుత్వం తన వాటాగా బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లను అందజేయాలి. ప్రస్తుతానికి రూ.3 వేల కోట్లను పొందుపరిచింది. ఈ ఏడాది డిసెంబరు నాటికి అన్ని గ్రామాలకు నదీ జలాలు చేరేలా కార్యాచరణ అమలవుతోందని, ఆ పై ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా కృష్ణా, గోదావరి జలాలు అందుతాయని ఆర్థిక మంత్రి ఈటల తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.
* ఇంటింటికీ తాగునీటిని అందించే భారీ పథకం 'మిషన్ భగీరథ. ఈ పథకంపై ఇతర రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. నల్లాల ద్వారా ప్రతి పల్లె వాసికీ రోజూ 100 లీటర్ల చొప్పున నీరివ్వడం, పట్టణాల దాహార్తిని తీర్చడం ఈ పథకం లక్ష్యాలు. 2017, డిసెంబరు నాటికి పూర్తి చేయాలనేది సంకల్పం.
* మొత్తంగా రూ.42 వేల కోట్ల మేర ఖర్చవనుండగా, 2017 మార్చి నెలాఖరునాటికయ్యే వ్యయం దాదాపు రూ.12 వేల కోట్లు. మిగతా రూ.30 వేల కోట్లను డిసెంబరు వరకు ఖర్చు పెట్టాల్సి ఉంది. ఇందులో రూ.24 వేల కోట్లు బ్యాంకులు రుణంగా ఇస్తాయి. ప్రభుత్వం తన వాటాగా మిగతా రూ.6 వేల కోట్లను తన 2017 - 18 బడ్జెట్ నుంచే వినియోగించాల్సి ఉంటుంది.

గృహనిర్మాణ రంగం
* 2017 - 18లో మొత్తం కేటాయింపు రూ.2330.10 కోట్లు. ఇందులో ప్రగతి పద్దు కింద రూ.1952.14 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.377.96 కోట్లు కేటాయించారు.
* రెండు పడక గదుల గృహ నిర్మాణం కోసం ఈ బడ్జెట్‌లో రూ.1000 కోట్లు పెట్టింది. మిగతా నిధులను ఇతర మార్గాల ద్వారా సమీకరణ చేస్తామని తెలిపింది. ఇప్పటికే ఈ పథకానికి రుణాన్ని ఇచ్చేందుకు హడ్కో ప్రాథమికంగా అంగీకరించింది.
* ప్రభుత్వం మంజూరు చేసిన 2.6 లక్షల గృహాల నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.17650 కోట్లు అవసరం. ఇందులో రూ.15 వేల కోట్లు రుణంగా తీసుకుంటే మిగతా మొత్తం రూ.2650 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా కింద భరించాలి. కానీ 2017 - 18 ఏడాదికి కేవలం రూ.1000 కోట్లు మాత్రమే కేటాయించింది.
* తెలంగాణలో ఇళ్లులేని కుటుంబాలకు ప్రభుత్వమే సొంత ఖర్చుతో గృహాలు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో రెండు పడక గదుల గృహ నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టింది. 2015 నవంబరులో విధివిధానాలు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతం, హైదరాబాద్‌లో మొత్తం 2.6 లక్షల గృహాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 2015 - 16లో 60 వేలు, 2016 - 17లో 2 లక్షల గృహాలు నిర్మించాలని నిర్ణయించింది. 2017 మార్చి నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

పౌర సరఫరాల శాఖ
* 2017 - 18లో మొత్తం కేటాయింపు రూ.1759.90 కోట్లు కాగా, దీనిలో ప్రగతి పద్దు కింద రూ.1732.69 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.27.21 కోట్లు కేటాయించారు.
* రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం కోత విధించింది. గడిచిన రెండేళ్లుగా ఏడాదికి రూ.2,200 కోట్ల చొప్పున కేటాయించగా ఈసారి తగ్గించింది.
* ఈ-పాస్ యంత్రాలను అమలు చేస్తే బియ్యం సరఫరాలో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వ ఆలోచన. ప్రజా పంపిణీ కింద సరఫరా చేసే బియ్యం పథకానికి సంబంధించిన రాయితీ మొత్తాన్ని రూ.2,600 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీల పథకాల నుంచి కొంత మొత్తం నగదును బియ్యం రాయితీ పథకానికి కేటాయించనుంది.
* విద్యార్థులకు సన్న బియ్యం పథకంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. దీనికి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పౌరసరఫరాల విభాగంలో ఆహార భద్రత పథకం కింద కేంద్రం ఇస్తున్న దానికంటే రాష్ట్రం ఎక్కువ బియ్యం ఇస్తోంది.

రహదారులు, భవనాల శాఖ:
* 2017 - 18 మొత్తం కేటాయింపులు రూ.5,033.63 కోట్లు కాగా, ఇందులో ప్రగతి పద్దు రూ.3,321.59 కోట్లు, నిర్వహణ పద్దు రూ.1,712.04 కోట్లు.
* జిల్లాల విస్తరణ నేపథ్యంలో నూతన కలెక్టరేట్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది.
* హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల కలెక్టరేట్లకు నూతన భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రూ.600 కోట్లు కేటాయించింది. కలెక్టరేట్ల నిర్మాణానికి మొత్తం రూ.1032 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.
* ప్రభుత్వం కార్యకలాపాల్లో కీలకంగా ఉండే సీనియర్ అధికారులు కూడా ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో ఉండే విధంగా గృహ సదుపాయం కల్పించేందుకు రూ.122.85 కోట్లు ఇచ్చారు.
* నూతన సచివాలయ నిర్మాణానికి రూ.50 కోట్లు.
* రాష్ట్రంలో అన్ని రకాల రహదారుల అభివృద్ధికి రూ.1986.71 కోట్లు. జిల్లా కేంద్రాల ప్రధాన రహదారులకు అత్యధికంగా రూ.737.69 కోట్లు కేటాయింపు. మండల కేంద్రాలు నుంచి జిల్లా కేంద్రాల రహదారులను రెండు మార్గాల రహదారులతో అనుసంధానం చేసేందుకు రూ.350 కోట్లు. రేడియల్ రోడ్లకు తొలిసారిగా రూ.100 కోట్లు.
* రైల్వే మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా రైల్వే ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో నూతన రైలు మార్గాల కోసం బడ్జెట్‌లో రూ.20 కోట్లు కేటాయించారు.
* సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్మించతలపెట్టిన కళాభారతికి రూ.50 కోట్లు.
* రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో 2,647 కి.మీ. మాత్రమే జాతీయ రహదారులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ కృషితో కేంద్రం నుంచి మరో 2,776 కి.మీ. మేర జాతీయ రహదారులుగా తీర్చిదిద్దేందుకు ఆమోదం వచ్చింది.
* రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ సర్కారు నిధుల్ని 70% - 80% మేర పెంచింది. 8 వేల కి.మీ. రహదారులను చక్కదిద్దారు. సుమారు 1200 కి.మీ. రెండు వరుసలుగా విస్తరించారు.

వ్యవసాయం, పట్టు పరిశ్రమ, ఉద్యాన మార్కెటింగ్ శాఖలు
* 2017 - 18లో మొత్తం కేటాయింపు రూ.5899.52 కోట్లు. దీనిలో ప్రగతి పద్దు కింద 5283.09 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.616.43 కోట్లు కేటాయించారు.
* వచ్చే ఏడాది సాగు చేసే పంటలకు బీమా ప్రీమియం, విత్తన రాయితీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు భారీగా పెంచింది. కానీ హరిత పందిరి, వ్యవసాయ యంత్రాల రాయితీలకు కేటాయింపులు తగ్గించింది.
* తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వెయ్యి ఎకరాల్లో హరిత పందిరి వేయించడానికి భారీగా రాయితీలిస్తామని ప్రకటించారు. కానీ ఏటేటా నిధుల కేటాయింపు తగ్గిస్తున్నారు.
* రుణమాఫీ పథకానికి తుది విడతగా ఇవ్వాల్సిన రూ.4 వేల కోట్లను ఈ బడ్జెట్‌లో కేటాయించారు. రైతుకు పంట రుణం తీసుకున్న తేదీ నుంచి ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే పూర్తి వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది. వడ్డీ లేని రుణాలు అనే పథకం పేరుతో దీన్ని అమలు చేస్తున్నారు. దీనికి కొత్తగా రూ.250 కోట్లను కేటాయించారు. ప్రస్తుత ఏడాదితో పోలిస్తే రూ.100 కోట్లు అదనంగా పెంచారు.
* రుణ మాఫీకి 2014 - 15లో రూ.4250 కోట్లు, 2015 - 16లో రూ.4050 కోట్లు, 2016 - 17లో రూ.4040 కోట్లు కేటాయించి, ఏటికేడాది మొత్తం వ్యయం చేశారు. రుణమాఫీకి నాలుగేళ్ల వ్యవధి కోసం రూ.17 వేల కోట్లు బడ్జెట్‌ను కేటాయించి, ఏటా ఒక వంతు చొప్పున విడుదల చేస్తున్నారు. ఏటా బడ్జెట్‌లో కేటాయించిన మొత్తాన్ని 6 నెలలు ఆలస్యంగానైనా పూర్తిగా విడుదల చేస్తున్నారు.
* వ్యవసాయ, ఉద్యాన శాఖల్లో ప్రధాన పథకాలకు బడ్జెట్ కేటాయింపుల తీరు 2017 - 18లో ఇలా ఉంది: విత్తన రాయితీ రూ.126.61 కోట్లు, పంటల బీమా రూ.200 కోట్లు, జాతీయ ఆహార భద్రత మిషన్ రూ.64.68 కోట్లు, వ్యవసాయ యంత్రాల రాయితీ రూ.300 కోట్లు, ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన రూ.127.87 కోట్లు, హరితపందిరికి రూ.70 కోట్లు, బిందు సేద్యం రూ.45.84 కోట్లు.

విద్యా శాఖ:
* 2017 - 18 మొత్తం కేటాయింపు రూ.12705.00 కోట్లు కాగా, ఇందులో ప్రగతి పద్దు కింద రూ.2682.00 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.10023.00 కోట్లు కేటాయించారు.
* విద్యాశాఖకు 2017 - 18 ఆర్థిక సంవత్సరానికి కొంత మేరకు నిధుల పెంచినా విద్యలో వస్తున్న వేగవంతమైన మార్పులకు అనుగుణంగా ఈ కేటాయింపులు లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2016 - 17లో కేటాయింపులు రూ.10,738 కోట్లు ఉండగా, ఈసారి అది రూ.12705 కోట్ల పెరిగింది. ప్రగతి పద్దు కింద కేటాయించిన రూ.2682 కోట్లలో పాఠశాల విద్యా శాఖకు రూ.2058 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ.563.58 కోట్లు, సాంకేతిక విద్యా శాఖకు రూ.60.85 కోట్లు కేటాయించారు.
* రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25,994 ప్రభుత్వ పాఠశాలలు, 391 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), 192 ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించిన నిధులు సరిపోవు.
* విద్యాశాఖకు చేసే కేటాయింపుల్లో 84 శాతం వేతనాలకే పోతుండటంతో అభివృద్ధి పనులకు కేవలం 16% మాత్రమే దక్కుతున్నాయి.

సమాచార, పౌర సంబంధాల శాఖ:
* తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖకు 2017 - 18 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.335.80 కోట్లను కేటాయించింది. ఇందులో ప్రగతి పద్దు రూ.301.44 కోట్లు కాగా, నిర్వహణ పద్దు రూ.34.36 కోట్లు.
* కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పథకాల ప్రచారానికి ప్రభుత్వం రూ.240 కోట్లను కేటాయించింది. ఇందులో రూ.100 కోట్లు పత్రికా ప్రకటనలకు, రూ.70 కోట్లు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారాలకు, రూ.70 కోట్ల అవుట్‌డోర్ మీడియా ప్రచారానికి కేటాయించింది. పాత్రికేయుల సంక్షేమానికి రూ.30 కోట్లను నిర్దేశించింది. ప్రెస్ అకాడమికి రూ.10 కోట్లను ప్రతిపాదించింది.

పోలీసు శాఖ
* 2017 - 18 మొత్తం కేటాయింపు రూ.4,827 కోట్లు. ఇందులో ప్రగతి పద్దు కింద రూ.975 కోట్లు, నిర్వహణ పద్దుకింద రూ.3,852 కోట్లు కేటాయించారు.
* ఈ బడ్జెట్‌లో పోలీసు శాఖ ఆధునికీకరణకు ఎక్కువ మొత్తం కేటాయించారు.
* హైదరాబాద్ కమిషనరేట్‌కు రూ.714 కోట్లు, నిఘా విభాగానికి రూ.115 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్‌కు రూ.171 కోట్లు, రాచకొండ కమిషనరేట్‌కు రూ.171 కోట్లు ఠాణాల వద్ద రిసెప్షన్ గదుల నిర్మాణానికి రూ.16 కోట్లు, నూతన భవనాల నిర్మాణానికి రూ.43 కోట్లు, వరంగల్ కమిషనరేట్ నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించారు.
* రాష్ట్రంలో పౌర ప్రయోజిత ట్రాఫిక్ నిర్వహణా పరిష్కారం కోసం రూ.5 కోట్లు, వ్యవస్థీకృత నేరాలు, ముఠాలను విశ్వషించే సాంకేతిక పరిజ్ఞానం కోసం రూ.5 కోట్లు, హైదరాబాద్‌లో కమాండ్ కంట్రోల్ భవనం నిర్మాణానికి రూ.145 కోట్లు కేటాయించారు.
* ఠాణాలను స్నేహపూర్వకంగా మార్చడానికి రూ.15 కోట్లు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పౌర ప్రయోజిత ట్రాఫిక్ పరిజ్ఞానం కోసం రూ.50 కోట్లు కేటాయించారు.

పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి:
* 2017 - 18లో కేటాయింపు మొత్తం రూ.14723.41 కోట్లు. ఇందులో ప్రగతి పద్దు రూ.12832.32 కోట్లు కాగా, నిర్వహణ పద్దు రూ.1891.09 కోట్లు.
* తెలంగాణ ఆవిర్భావం తర్వాత గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ రంగంలో కేటాయింపులకు మించి ఖర్చులు జరగడం విశేషం. ఉపాధి హామీ, ఆసరా పథకాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఉపాధిహామి పథకానికి సీసీ రోడ్లు, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు లాంటివాటిని అనుసంధానం చేస్తూ 2017 - 18లో కేంద్రం నుంచి రూ.3 వేల కోట్లకు పైగా రాబట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. పలు గిరిజన తండాలను పంచాయతీలుగా ప్రకటించాలని నిర్ణయించడంతో వాటికి రోడ్లు నిర్మించాలనే యోచనలో ఉంది.
* తెలంగాణలో ఒంటరి మహిళలతో పాటు మరింత మందికి నెలవారీ ఆసరా పింఛన్లు అందే సూచనలు కనిపిస్తున్నాయి. ఆసరా పింఛన్ల కోసమే ప్రస్తత బడ్జెట్‌లో ప్రభుత్వం ఏకంగా రూ.5,330 కోట్లు కేటాయించింది. ఇది ప్రస్తుత (2016 - 17) బడ్జెట్‌లోని రూ.4,693 కోట్లు కేటాయింపుతో పోలిస్తే రూ.637 కోట్లు ఎక్కువ. ఇదే బడ్జెట్‌లో ఒంటరి మహిళలకు పింఛన్లు ఇచ్చేందుకు ఏడాదికి రూ.172 కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఒంటరి మహిళలకూ నెలకు రూ.1000 చొప్పున పింఛను ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
* ఆసరా ద్వారా నెలవారీ ఇచ్చే పింఛను మొత్తాన్ని బాగా పెంచడంతో భారీగా నిధులు అవసరమవుతున్నాయి. రాష్ట్రంలో ఆసరా కింద ఇప్పటికే 36 లక్షల మందికి పింఛన్లు ఇస్తుండగా మరో రెండు లక్షల మందికి పైగా ఒంటరి మహిళలకూ ఏప్రిల్ 1 నుంచి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు.

అటవీ శాఖ
* 2017 - 18లో మొత్తం కేటాయింపు రూ.331.61 కోట్లు. ఇందులో ప్రగతి పద్దు రూ.13.02 కోట్లు కాగా, నిర్వహణ పద్దు రూ.318.59 కోట్లు.
* హరితహారం కింద రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంను 23 నుంచి 34 శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం ఇందుకోసం భారీగానే ఖర్చు చేస్తోంది. అయితే ఇందుకు అవసరమైన నిధులను వివిధ పథకాల ద్వారా మళ్లిస్తోంది.
* ఏవైనా ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేటప్పుడు కోల్పోయిన అటవీ విస్తీర్ణానికి కంపా పథకం కింద నష్ట పరిహారం చెల్లిస్తుంటారు. ఈ నిధులను మొక్కలు పెంచడానికి వాడుకోవాలి. ఇలాంటి పథకాల ద్వారా హరితహారానికి అవసరమైన నిధులు సమకూర్చుతోంది.

విద్యుత్తు శాఖ
* విద్యుత్తు శాఖకు గతేడాది కంటే కొత్త బడ్జెట్‌లో నిధులు తక్కువగా కేటాయించారు. వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీల మేరకు నిధులు పేర్కొనలేదు. గతేడాది మొత్తం బడ్జెట్ రూ.5,311.45 కోట్లు కాగా అందులో రాయితీల చెల్లింపులకు రూ.4470.10 కోట్లను విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లకు విడుదల చేశారు.
* 2017 - 18 సంవత్సరానికి విద్యుత్తు శాఖకు రూ.4203.21 కోట్లు కేటాయించారు. వీటిలో రాయితీల చెల్లింపులకు నికరంగా రూ.3516.51 కోట్లు ఇచ్చారు. రాయితీల పద్దు కింద ఇచ్చినవిపోను మిగిలినవి నిర్వహణ పద్దు కింద ఖర్చు పెట్టాల్సి ఉంది.
* 2017 - 18లో డిస్కంల ఆర్థిక లోటు దాదాపు రూ.9824 కోట్లు ఉంటుందని అంచనా. ఈ నిధులను ప్రభుత్వం బడ్జెట్‌లోనైనా కేటాయించాలి లేదంటే కరెంటు ఛార్జీల పెంపునకు అనుమతించాలి. ఇప్పుడు రాయితీ కోటా కింద రూ.3516.51 కోట్ల్లు ఇచ్చినందున మిగిలిన రూ.6300 కోట్లను ఛార్జీల పెంపు ద్వారా సమకూర్చుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందా అన్నది కీలక ప్రశ్న.

పరిశ్రమలు, వాణిజ్యం
* 2017 - 18లో మొత్తం కేటాయింపు రూ.985.15 కోట్లు. ఇందులో ప్రగతి పద్దు రూ.854.70 కోట్లు కాగా, నిర్వహణ పద్దు రూ.130.45 కోట్లు.
* తెలంగాణ ప్రభుత్వం రూ.2017 - 18 బడ్జెట్‌లో పరిశ్రమల శాఖలో రాయితీలు, మౌలిక వసతులకు పెద్దపీట వేసింది. హైదరాబాద్ శివార్లలో నిర్మించే ఔషధనగరి నిమ్జ్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వద్ద నిర్మించే నిమ్జ్‌లకు భూసేకరణ కోసం రూ.200 కోట్లను కేటాయించింది. పారిశ్రామిక సమూహాల నిర్మాణం కోసం రూ.155 కోట్లను ప్రతిపాదించింది. విద్యుత్ సబ్సిడీ కోసం రూ.180 కోట్లు, పావలావడ్డీ పథకం అమలుకు రూ.70 కోట్లు, పారిశ్రామిక అభివృద్ధి ప్రోత్సాహకాలకు రూ.55 కోట్లను ఇచ్చింది.
* పారిశ్రామిక రంగంలో కొత్త ఆవిష్కరణల కోసం రూ.25 కోట్లను ప్రతిపాదించింది. ఖాదీ పరిశ్రమ అభ్యున్నతికి రూ.20 కోట్లను నిర్దేశించింది.

గజ్వేల్‌కు రూ.100 కోట్లు
* ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజక వర్గ పరిధిలోని గజ్వేల్ ప్రాంత అభివృద్ధి అథారిటీకి బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు. ఈ నిధుల నుంచి గజ్వేల్ అథారిటీకి రూ.50 కోట్లు, మెదక్ జిల్లాలోని మిగతా ప్రాంతాలతో అనుసంధాన రోడ్లకు రూ.50 కోట్లు ఇచ్చారు.
* అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రి వద్ద ఉండే ప్రత్యేక నిధికి రూ.754.70 కోట్లు కేటాయించారు.
* తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి నిధులను భారీగా తగ్గించింది. గత బడ్జెట్‌లో రూ.4675 కోట్లను కేటాయించగా, ఈ సారి ఆ మొత్తాన్ని రూ.1000 కోట్లకు కుదించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందజేసే నియోజక వర్గ అభివృద్ధి నిధుల కోసం రూ.362.25 కోట్లను కేటాయించింది.

2015-16 వాస్తవ వ్యయం రూ.97,922 కోట్లు
* గత ఆర్థిక సంవత్సరం (2015 - 16) వాస్తవ వ్యయాన్ని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రూ.1,15,608 కోట్ల బడ్జెట్‌కు రూ.97,922 కోట్లు ఖర్చు చేసింది. పన్ను వసూళ్లు, కేంద్రం నుంచి వస్తాయని అంచనా వేసిన గ్రాంట్లు, ఇతర మార్గాల ద్వారా సమీకరించవచ్చని అంచనా వేసిన నిధుల్లో కోత పడటంతో దీనికి తగ్గట్లుగా ఖర్చులోనూ కోతపడింది. బడ్జెట్‌లో కేటాయింపు కంటే రూ.17,686 కోట్లు తగ్గింది. అన్ని రకాల రెవెన్యూ వసూళ్లు రూ.94,131.51 కోట్లుగా అంచనా వేయగా, రూ.76.133.83 కోట్లు వచ్చింది. ఖర్చు దీనికి తగ్గట్టుగానే రూ.93,600.21 కోట్ల నుంచి రూ.75,895.74 కోట్లకు తగ్గింది. పెట్టుబడి వ్యయం తగ్గిపోయింది.
* సాగునీటి రంగానికి మాత్రమే కేటాయింపులో 90 శాతానికి పైగా ఖర్చు చేశారు. మిగిలిన అన్ని రంగాల్లో తగ్గిపోయింది.
* వ్యవసాయం, అనుబంధ రంగాలు, గ్రామీణాభివృద్ధికి రూ.9,156 కోట్లు కేటాయించగా, సగం కూడా ఖర్చు చేయలేదు.
* రవాణా అనుబంధ రంగాల్లో రూ.5,907 కోట్లకుగాను రూ.2000 కోట్లకు మించి ఖర్చు చేయలేకపోయింది. ఆరోగ్యం, విద్యలోనూ కోత పడింది.

2016-17 బడ్జెట్‌లో భారీ కోత
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016 - 17) బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.18,224 కోట్ల మేర తగ్గించి అంచనాలను సవరించింది. ఈ ఏడాది ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కలిపి మొత్తం బడ్జెట్ రూ.1,30,415 కోట్లుగా నిర్ణయించింది. ఆర్థిక సంవత్సరం ముగింపు వచ్చేటప్పటికి రాబడిని, వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని అంచనాలను సవరించి రూ.1,12,191 కోట్లుగా నిర్ణయించింది. ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ఈ వివరాలను వెల్లడించారు.
* సవరించిన అంచనాల్లో ప్రణాళికా నిధుల్లోనే ఎక్కువ కోత పడింది. మొత్తం రూ.16,340 కోట్ల మేరకు ప్రణాళిక వ్యయం తగ్గించారు. ఇందులో సాగునీటి రంగానికి ఎక్కువ మొత్తం తగ్గించారు. ఈ రంగానికి ప్రణాళిక కింద రూ.25,000 కోట్లు కేటాయించి ప్రతినెలా రూ.2000 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించినా, ఆచరణలో కార్యరూపం దాల్చలేదు. ప్రతినేలా చేసిన పనులకు తగ్గట్లుగా బిల్లులు చెల్లించలేదు. దీంతో ప్రస్తుతం బడ్జెట్‌ను సవరించి రూ.14,918 కోట్లుగా ప్రతిపాదించింది. రవాణా రంగానికి రూ.4,711.82 కోట్లు కేటాయించగా, దీన్ని సవరించి రూ.3,548.82 కోట్లకు తగ్గించారు.
* సంక్షేమ రంగానికి రూ.23,473.41 కోట్ల నుంచి రూ.21,850.47 కోట్లకు తగ్గించారు. అంటే సుమారు రూ.1600 కోట్లు తగ్గిపోయింది.


తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ప్రణాళిక, ప్రణాళికేతర బడ్జెట్ పద్దుల స్థానంలో నిర్వహణ పద్దు, ప్రగతి పద్దులతో 2017 - 18 బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
* నిర్వహణ పద్దు: దీని కింద జీతాలు, నిర్వహణ వ్యయాలు, వడ్డీలు లాంటి వ్యయాలు ఉంటాయి.
* ప్రగతి పద్దు: దీని కింద మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం వివిధ పథకాలకు చేసే వ్యయాలు ఉంటాయి. గతంలో ప్రణాళిక బడ్జెట్‌లో ఉన్నవి అన్నీ ఇప్పుడు ఈ పద్దు కింద చూపారు.