Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Budget -2019

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ 2019- 20

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2019-20 బడ్జెట్‌ అంచనాలను వాస్తవ వ్యయం ప్రాతిపదికగా రూపొందించింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఏటా అంతకుముందు సంవత్సరం అంచనాల కంటే 12 శాతం పైగా పెంపుదలతో బడ్జెట్‌లను ప్రవేశపెట్టింది. ఈసారి మాత్రం భిన్నంగా వ్యవహరించింది. వాస్తవ వ్యయంతోబాటు సవరించిన అంచనాలను ప్రాతిపదికగా చేసుకుని 2018-19 బడ్జెట్‌ అంచనాల కంటే 4.4 శాతం పెరుగుదలతో ప్రతిపాదించింది. ఈసారి 1.82 లక్షల కోట్ల బడ్జెట్‌కు పరిమితమైంది. 2018-19వ సంవత్సరం బడ్జెట్‌ రూ.1.74 లక్షల కోట్లు కాగా దీన్ని రూ.1.61లక్షల కోట్లకు సవరించింది. ఈ నేపథ్యంలో 2019-20 బడ్జెట్‌ను సవరించిన అంచనాలకంటే 12.4 శాతం పెంపుదలతో బడ్జెట్‌ను ప్రతిపాదించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సొంత పన్ను రాబడుల్లో 30 శాతం వృద్ధి రేటును ప్రభుత్వం అంచనా వేసింది. 2018-19 సంవత్సరానికి సవరించిన అంచనాల మేరకు రూ.72,777 కోట్లు సొంత పన్ను రాబడులు కాగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.94,776 కోట్లుగా అంచనా వేసింది.

- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాగునీటి రంగానికి ఇప్పటివరకు చేసిన ఖర్చు పోనూ మార్చి ఆఖరు వరకు మరో రూ.7,680 కోట్లు ఖర్చు చేయడానికి అనుమతి లభించనుంది. మొత్తంగా అన్ని శాఖలకు కలిపి దాదాపు రూ.24,542.08 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు 2018-19వ ఆర్థిక సంవత్సరంలో తదుపరి ఖర్చుకు సంబంధించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు 2019 ఫిబ్రవరి 22న శాసనసభలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ 2019-20 లో వివిధ ప్రధాన శాఖలకు కేటాయించిన నిధుల వివరాలు:

విద్యుత్‌ రంగం

రాష్ట్ర బడ్జెట్‌లో విద్యుత్‌ రంగానికి వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2019-20) రూ.4006.92 కోట్లు కేటాయించారు. ఇందులో తొలి ఆరు నెలలకు రూ.2003.46 కోట్లను విడుదల చేస్తామని ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) కోసం గత బడ్జెట్‌లో రూ.5650 కోట్లు ఇచ్చారు. ఈసారి అంతకంటే రూ.1643 కోట్లు తగ్గించి కేటాయించారు.

పోలీసు శాఖ

ఈ బడ్జెట్‌లో పోలీసు శాఖకు రూ.4,540.95 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం పోలీస్‌ స్టేషన్ల ఆధునికీకరణ, వాహనాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇచ్చింది. గతేడాది ఒకేసారి 14వేల వాహనాలు కొనుగోలు చేసింది. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాలు, వాటి నిర్మాణానికి గతేడాది బడ్జెట్‌లో రూ.486 కోట్లు కేటాయించారు. రిసెప్షన్‌ కౌంటర్ల నిర్మాణానికి రూ.10 కోట్లు, ఆధునికీకరణకు రూ.306 కోట్లు కేటాయించారు.

రహదారులు

రహదారులకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.2,176 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆరు నెలలకు రూ.1,088 కోట్లు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల నుంచి రూ.2,500 కోట్లను రహదారులు-భవనాల శాఖ అప్పు తీసుకుంది.

పరిశ్రమల శాఖ

ఈ శాఖకు సర్కారు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ.510.78 కోట్లను కేటాయించింది. ఇందులో భారీ పరిశ్రమలకు రూ.268 కోట్లు, చిన్న తరహా పరిశ్రమలకు రూ.158 కోట్లు, ఇతర పరిశ్రమలకు రూ.83 కోట్లు ప్రకటించారు. చేనేతకు గత బడ్జెట్‌లో రూ.1298 కోట్లను కేటాయించారు. దానితో పోలిస్తే ఈసారి కేటాయింపులు తగ్గాయి. పరిశ్రమల బడ్జెట్‌లో కొత్త పథకాలేమీ లేవు.

వైద్య ఆరోగ్యశాఖ

తాజా బడ్జెట్‌లో వైద్య ఆరోగ్య శాఖకు రూ.5,536 కోట్లు కేటాయించారు. ఇది ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కావడంతో, అధికారికంగా ఏ విభాగానికి ఎంత మొత్తంలో కేటాయించిందీ వెల్లడించలేదు. రూ.3 వేల కోట్ల వరకూ వేతనాలు, ఇతర నిర్వహణ వ్యయాలకే ఖర్చువుతుందని అంచనా. ఆరోగ్యశ్రీకి రూ.600 కోట్లు, ఉద్యోగుల ఆరోగ్య పథకానికి రూ.300 కోట్లు, ఔషధాలకు రూ.300 కోట్ల చొప్పున కేటాయింపులు జరిపినట్లు తెలుస్తోంది. గత అయిదేళ్ల బడ్జెట్‌లో ఒక్క 2015-16లో మినహా ఎప్పడూ సగటున 60-65% కంటే అధికంగా నిధులు ఖర్చయిన దాఖలాలు లేవు. దీంతో వాస్తవ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకొని వైద్య ఆరోగ్యశాఖ నిధులకు కోత పెట్టినట్లు తెలుస్తోంది. గత ఏడాది బడ్జెట్‌లో వైద్య ఆరోగ్యశాఖకు రూ.7,375 కోట్ల నిధులు కేటాయించగా.. ఈ ఏడాది దాదాపు రూ.1,839 కోట్ల నిధులను తగ్గించారు. అయితే కేంద్రం నుంచి జాతీయ ఆరోగ్య మిషన్‌ ద్వారా సుమారు రూ.1,200 కోట్ల వరకూ నిధులు మంజూరవుతాయని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల అంచనా.
- రాష్ట్రంలో ఇప్పటికే కంటి వెలుగు పథకం కింద 1.52 కోట్ల మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. దాదాపు 50 లక్షల మందికి కళ్లద్దాలను అందజేశారు. అయితే క్యాటరాక్ట్, గ్లకోమా, రెటినోపతి, కార్నియా సమస్యలతో బాధపడుతున్నవారిలో మాధ్యమిక ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు పొందాల్సినవారు దాదాపు 6.74 లక్షల మంది ఉండగా.. ఉన్నతస్థాయి ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సినవారు సుమారు 2.40 లక్షల మంది ఉన్నట్లు కంటి వైద్యశిబిరాల్లో గుర్తించారు. కంటి వెలుగు శస్త్రచికిత్సలకు, చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షల నిర్వహణకు రూ.600 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా. కొత్తగా నల్గొండ, సూర్యాపేటల్లో వైద్యకళాశాలలను ప్రారంభించనున్నట్లు సీఎం ప్రకటించారు. ఒక్కో కళాశాలకు రూ.500 కోట్లు అవసరమవుతాయని వైద్యవర్గాల అంచనా.

పశుసంవర్ధక శాఖ

ఈ బడ్జెట్‌లో పశుసంవర్ధక శాఖకు రూ.690 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న గొర్రెల పంపిణీకి సరిపడా నిధులు ఇప్పటికే విడుదలయ్యాయి. తాజాగా మత్స్య, పశుసంవర్ధక శాఖకు కలిపి కేటాయించిన రూ.1204.97 కోట్లలో పశుసంవర్ధక శాఖకే సగానికి పైగా సుమారు రూ.650 కోట్ల నుంచి రూ.690 కోట్లకు మించి నిధులు రానున్నాయి. మందుల కొనుగోలు, గడ్డి విత్తనాల పంపిణీ, ఇతర పథకాల అమలు, సిబ్బంది వేతనాలకు కలిపి రూ.200 కోట్లకు పైగా కేటాయించాల్సి ఉంది. విజయ డెయిరీకి పాలు పోస్తున్న పాడి రైతులకు లీటరు పాలపై రూ.4 ప్రోత్సాహం చెల్లిస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన నాలుగు డెయిరీల్లో పాలు పోసే 2.13 లక్షల మంది రైతులకు గేదెలు, ఆవులు ఇస్తున్నారు. మరో లక్షా అరవై వేల మంది లబ్ధిదారులకు పశువులు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ రెండు పథకాల అమలుకు అనుగుణంగా కేటాయింపులు జరిగాయి.
వ్యవసాయ అనుబంధంగా పనిచేసే పశు సంవర్థక శాఖ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసింది. పశు సంపదను పెంచేందుకు 2017లో గొర్రెల పంపిణీకీ శ్రీకారం చుట్టింది.
- 4 లక్షల మంది గొల్ల, కురుమలకు 75% రాయితీపై గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తోంది.
- ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.4,400 కోట్లు
- 2017-18లో రూ.1,500 కోట్లు, 2018-19లో రూ.1,800 కోట్లు సమకూర్చింది. లబ్ధిదారులు తమ వాటాగా రూ.1,100 కోట్లు చెల్లించారు
- అందజేసిన యూనిట్లు 3,58,650. ఒక్కో యూనిట్‌లో 21 గొర్రెలు ఉంటాయి.
గత అయిదేళ్లలో పశు సంవర్థక శాఖకు బడ్జెట్‌ కేటాయింపులు, ఖర్చు వివరాలు.. (రూ.కోట్లలో)
సంవత్సరం    కేటాయింపులు    ఖర్చు
2014-15      203.36      90.29
2015-16      182.06      145.78
2016-17      147.40      228.88
2017-18      179.79      80.30
2018-19      263.85      92.32

మత్స్య శాఖ

పశు సంవర్ధక, మత్స్యశాఖలకు కలిపి ఈ బడ్జెట్‌లో రూ.1204.97 కోట్లు కేటాయించారు. అందులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకానికి రూ.320 కోట్లు ప్రభుత్వ వాటాగా రావాల్సి ఉంది. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద రూ.43.45 కోట్లు, కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటాగా చెల్లించేందుకు రూ.24.91 కోట్లు అవసరమని ప్రతిపాదనలు వెళ్లాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద మరో రెండు, మూడు ప్రాంతాల్లో చేపలు పెంచేందుకు చర్యలు, చేపల ఎగుమతి, విక్రయాలకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టిన దృష్ట్యా నిధుల వాటా మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇవి కాకుండా అధికారులు, ఒప్పంద సిబ్బంది వేతనాలు కలిపి మరో రూ.120 కోట్లు ఖర్చవుతుందని అధికార వర్గాల అంచనా.

సాగునీటి రంగం

సాగునీటి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రూ.22,500 కోట్లు కేటాయించింది. గత రెండేళ్ల కంటే కేటాయింపు కొంత తగ్గినా వాస్తవంగా చూస్తే బడ్జెట్‌ నుంచి పెట్టిన ఖర్చుతో పోల్చితే వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా సాగునీటి రంగానికి భారీగా కేటాయింపులు చేసినట్లే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించగా, ఇప్పటివరకు రూ.22 వేల కోట్లు ఖర్చు చేశారు. అయితే ఇందులో సగానికి పైగా బ్యాంకుల నుంచి రుణంగా పొందినవే. సగం కూడా బడ్జెట్‌ నుంచి ఖర్చు చేయలేదు.
వాస్తవ బడ్జెట్‌ పేరుతో జీతాలు, నిర్వహణ, పనులు అన్నీ కలిపి బడ్జెట్‌ నుంచి రూ.14,569 కోట్లు, బ్యాంకుల నుంచి రుణం రూ.10430.10 కోట్లు కలిపి మొత్తం రూ.25 వేల కోట్లను నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. అయితే బ్యాంకుల నుంచి తీసుకొనే రుణంతో సంబంధం లేకుండానే రూ.22,500 కోట్లను ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఇందులో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకే రూ.20,093 కోట్లు కేటాయించారు. దీని ప్రకారం బడ్జెట్‌ కేటాయింపులు, బ్యాంకులిచ్చే రుణం కలిపి సుమారు రూ.30 వేల కోట్లకు పైగా నిధులు నీటిపారుదల శాఖకు అందుబాటులో ఉంటాయి.

ప్రభుత్వ ప్రణాళిక..
వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి నీటిని మళ్లించేలా పనులు పూర్తి చేయడంతో పాటు తర్వాత ఖరీఫ్‌ సీజన్‌ నాటికి ఆయకట్టుకు నీరందించే పనులు కూడా పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. మరో రెండు మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది సంకల్పం. 2021-22 వరకు ప్రాజెక్టుల వారీగా ఎంత నిధులు అవసరమో నీటిపారుదల శాఖ అంచనా వేసింది. దీని ప్రకారం 2019-20లో కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.9000 కోట్లు అవసరం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు కూడా రూ.9000 కోట్లు అవసరమని అంచనా వేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రాజెక్టులకు రూ.1000 కోట్లు అందుబాటులో ఉంటాయి. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, గట్టు, తుమ్మిళ్ల ఎత్తిపోతల, జూరాల ప్రాజెక్టులకు ఈ నిధులు ఖర్చు చేయాలి. దీంతో పనులన్నీ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 2018-19వ ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ జిల్లాలోని ప్రాజెక్టులకు రూ.1070 కోట్లు కేటాయించినా ఇప్పటివరకు ఖర్చు రూ.600 కోట్లకు మించలేదు.

చిన్ననీటి పారుదల శాఖ
ప్రభుత్వం చిన్ననీటి పారుదల శాఖకు బడ్జెట్‌లో రూ.2.377.67 కోట్లు కేటాయించింది. గత అయిదు సంవత్సరాల్లో మిషన్‌ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే 20,192 చెరువుల పనులు పూర్తిచేయగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్రంలో 12,150 గొలుసుల్లో 27,814 చెరువులు ఉన్నట్లు గుర్తించారు. గొలుసుకట్టు వ్యవస్థకు సమీపంలోని ప్రాజెక్టు కాల్వల నుంచి నీటిని తరలించేలా తూములు, అనుసంధాన కాల్వలను నిర్మించనున్నారు.

గృహ నిర్మాణ శాఖ

బడ్జెట్‌లో గృహ నిర్మాణ శాఖకు పెద్దపీట వేసిన ప్రభుత్వం రూ.4,709.52 కోట్లు కేటాయించింది. 2017-18 బడ్జెట్‌లో ఈ మొత్తం రూ.2,643 కోట్లు మాత్రమే. రానున్న ఆరు నెలల్లో ఈ మొత్తం నుంచి రూ.2,357.76 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,80,616 రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేసిన ప్రభుత్వం, వీటి నిర్మాణానికి గత అయిదేళ్లలో రూ.4,290.57 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది జనవరి 31 నాటికి 19,195 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా, మరో 91 వేల ఇళ్ల నిర్మాణం 90 శాతం మేర పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. మిగతా బడ్జెట్‌ నిధులను పూర్తిగా ఈ పథకం కోసమే వినియోగిస్తే మరో 63 వేల ఇళ్లను ఈ ఏడాది పూర్తిచేయొచ్చు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఇప్పటి వరకు ఖర్చుచేసిన నిధులు, ఈ బడ్జెట్‌లో కేటాయించిన నిధులను కలిపితే రూ.9 వేల కోట్లు అవుతుంది. ప్రభుత్వ లక్ష్యం పూర్తి కావాలంటే ఇంకా రూ.10 వేల కోట్లు అవసరం.

విద్య

విద్యాశాఖకు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కింద తాజాగా రూ.12,220.75 కోట్లు కేటాయించారు. 2018-19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ కంటే కేటాయింపులు రూ.1,057.59 కోట్ల మేర తగ్గాయి. ముఖ్యంగా ప్రగతి పద్దు (ప్లాన్‌) బడ్జెట్‌లోనే ఆ మొత్తాన్ని తగ్గించారు. రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ శాఖల్లో విద్యాశాఖది ప్రథమ స్థానం. ఒక్క పాఠశాల విద్యాశాఖలోనే 1.09 లక్షల మంది శాశ్వత ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. దాదాపు 15 వేల మంది విద్యా వాలంటీర్లు ఉన్నారు. ఉన్నత, సాంకేతిక విద్యాశాఖల్లో మరికొన్ని వేల మంది ఉద్యోగులున్నారు. ఏటా కేటాయించే బడ్జెట్‌లో 85% వేతనాలు, నిర్వహణకే ఖర్చవుతున్నాయి. ఈసారి ఆ వ్యయం మరింత పెరగనుంది. రానున్న విద్యాసంవత్సరం 8,792 మంది ఉపాధ్యాయులు కొత్తగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. పాఠశాల విద్యాశాఖకు 2018-19 బడ్జెట్‌లో రూ.8,685.79 కోట్లు నిర్వహణ పద్దు కింద కేటాయించగా రానున్న ఆర్థిక సంవత్సరానికి రూ.9,786.19 కోట్లు చూపారు. అంటే రూ.1,101 కోట్లు పెంచారు. ఉన్నత విద్యాశాఖలో రూ.1,663.63 కోట్ల నుంచి రూ.1,876.44 కోట్లకు పెరగగా సాంకేతిక విద్యాశాఖలోనూ స్వల్పంగా పెంచారు. ప్రగతి పద్దు (ప్లాన్‌) కింద 2018-19కి పాఠశాల విద్యాశాఖకు రూ.2,144.51 కోట్లు కేటాయించగా ఈసారి పెట్టుబడి వ్యయం కింద రూ.122 కోట్లు చూపించారు.


(2019-20 బడ్జెట్‌లో పెట్టుబడి వ్యయం కింద చూపారు)

సంక్షేమ రంగం

రాష్ట్రంలో సంక్షేమ వర్గాలకు మొత్తం 2019-20 ఏడాదికి రూ.29,507.45 కోట్ల నిధులు కేటాయించింది. ఇవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పేర్కొన్న నిధులతో పోలిస్తే రూ.816 కోట్లు అదనం. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు నిధులు భారీగా పెరిగాయి. ఎస్సీలకు దాదాపు రూ.1,296.7 కోట్లు, ఎస్టీలకు రూ.906.6 కోట్లు అదనంగా కేటాయింపులు జరిగాయి. ఎంబీసీలకు రూ.1,000 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. అదే సమయంలో బీసీ సంక్షేమశాఖకు నిధులు తగ్గిపోయాయి. గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే బీసీలకు దాదాపు రూ.1,391 కోట్లకు పైగా (23 శాతం) తగ్గించింది. మరోవైపు 119 కొత్త గురుకులాలు రానున్నాయి. వీటి నిర్వహణ భారం పెరగనుంది. ప్రస్తుత కేటాయింపులు ఏ మూలకూ సరిపోని పరిస్థితి నెలకొంది. మైనార్టీలకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.4 కోట్లు పెంచుతూ రూ.2003.92 కోట్లను కేటాయించింది.
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి
ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి నిధి కింద 2019-20 ఏడాదికి ప్రభుత్వం రూ.26,408 కోట్లు కేటాయించింది. ప్రస్తుత బడ్జెట్‌తో పోలిస్తే ఈ కేటాయింపులు దాదాపు రూ.263 కోట్లు అధికం. జనాభా ప్రాతిపదికన ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.16,581 కోట్లు, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ కింద రూ.9,827 కోట్లు చూపించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.12,206 కోట్లు ఖర్చుచేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జనవరి 31 నాటికి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధిలో దాదాపు 46.65శాతం నిధులు ఖర్చు అయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర బడ్జెట్‌లో ఖర్చు 50.40 శాతంగా ఉంది. ఈ లెక్కన ఇంకా ప్రగతి పద్దు కింద ఖర్చు కావాల్సిన నిధులు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది.
కల్యాణలక్ష్మికి రూ.1,450 కోట్లు
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద ఇచ్చే ఆర్థిక సహాయానికి ఈ బడ్జెట్‌లో కేటాయింపులు పెరగలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మాదిరిగా 2019-20 బడ్జెట్‌లోనూ రూ.1,450 కోట్లు కేటాయించారు. ఈ పథకాల కింద దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికీ సహాయం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ప్రతిఏటా ఈ పథకం కింద డిమాండ్‌ పెరుగుతోంది. ఇప్పటికే 5 లక్షలకు పైగా మంది దరఖాస్తు చేసుకోగా, దాదాపు 4.28 లక్షల మందికి సహాయం అందింది.

శిశు సంక్షేమం
మహిళా, శిశు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమశాఖకు కేటాయింపులు స్వల్పంగా తగ్గాయి. 2019-20 ఏడాది బడ్జెట్‌లో రూ.1,628.23 కోట్లతో సరిపెట్టారు. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.1,798.82 కోట్లు పేర్కొన్న ప్రభుత్వం కొత్త బడ్జెట్‌లో రూ.170 కోట్లు తగ్గించింది.

అటవీ శాఖ

2019-20 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అటవీశాఖకు రూ.342.47 కోట్లు కేటాయించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి రూ.12 కోట్లు పెరిగాయి. ప్రతిపాదనలతో పోలిస్తే మాత్రం నిధుల కేటాయింపు తక్కువగానే ఉంది. ఈసారి రూ.549 కోట్లు కావాలని అటవీశాఖ కోరింది. ఇందులో ప్రధానంగా.. పట్టణ అటవీ పార్కులకు రూ.110 కోట్లు, అటవీకరణకు రూ.215 కోట్లు కావాలని అడిగింది. రూ.342 కోట్లలో అంశాలవారీగా కేటాయింపులపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుత బడ్జెట్‌ కేటాయింపుల్లో భూసార జలసంరక్షణ, అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, పర్యవరణం శాస్త్రీయ పరిశోధనలకు అన్నింటికి కలిపి రూ.342 కోట్లు కేటాయించింది. 2014తో పోలిస్తే మాత్రం ఈసారి కేటాయింపులు రూ.54 కోట్లు తగ్గాయి.

నిరుద్యోగ భృతి

రాష్ట్రంలో నిరుద్యోగభృతిని అమలు చేసే దిశగా ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1,810 కోట్ల నిధులు కేటాయించింది. అర్హులైన నిరుద్యోగులకు ప్రతినెలా రూ.3,016 చొప్పున నిరుద్యోగభృతి కింద ఇవ్వనున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్యపై స్పష్టమైన గణాంకాలు లేవు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ వివరాల మేరకు దాదాపు 28 లక్షల మంది ఉద్యోగార్థులు ఉన్నారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు ఆ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేశారు. కార్మికశాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఉపాధి కల్పన కార్యాలయాల్లో నమోదై, ఎప్పటికప్పుడు పునరుద్ధరణ చేసుకుంటూ చెల్లుబాటులో ఉపాధికల్పన కార్డులున్న నిరుద్యోగుల సంఖ్య దాదాపు 9 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. ఇలా ఒక్కోచోటా ఒక్కో లెక్క ఉంది. బడ్జెట్‌ నిధుల కేటాయింపు, నెలవారీ నిర్దేశించుకున్న వ్యయాలను పరిశీలిస్తే గరిష్ఠంగా 5 లక్షల మంది నిరుద్యోగులకు భృతి చెల్లించేందుకు అవకాశముంది.
నిరుద్యోగులెంతమంది?
- టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్‌ ప్రకారం: 28 లక్షల మంది
- తెలంగాణ కార్మికశాఖలో నమోదు: 9 లక్షల మంది
- ఉపాధి సేవా కేంద్రంలో నమోదు: లక్ష మంది
- ప్రతినెలా నిధుల వ్యయం: రూ.150.88 కోట్లు
- ప్రతినెలా లబ్ధిదారులు: 5 లక్షల మంది (అంచనా)

పౌరసరఫరాల శాఖ

పౌరసరఫరాల శాఖకు కేటాయింపుల్లో కాస్తంత కోత పడింది. 2019-20 సంవత్సరానికి రూ.2,744 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,800 కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర కేటాయింపుతో పోలిస్తే ఈ బడ్జెట్‌లో కేటాయింపులు రూ.56 కోట్లు తక్కువ. ఈ మొత్తాన్ని బియ్యం రాయితీ కోసమే కేటాయించారు. ఓటాన్‌ అకౌంట్‌ కావటంతో 12 నెలలకు బడ్జెటును ప్రతిపాదించినప్పటికీ కేటాయింపులు మాత్రం ఆరు నెలలకే. ఆ మేరకు ఆరు నెలలకు రూ. 1,372 కోట్లు కేటాయించారు.
- ఈ-పాస్‌ విధానం అమలు ద్వారా ఏటా రూ. 600-700 కోట్ల వరకు ఆదా అవుతోంది.
- పౌర సరఫరాల శాఖలో బియ్యం మినహా ఇతర పథకాలేవీ లేవు. రాష్ట్రం ఏర్పడ్డాక.. ఈ శాఖ బడ్జెట్లో ప్రభుత్వం రూ.4,705 కోట్లు కోత విధించింది. గత ఐదేళ్లలో ఈ శాఖకు రూ.10,900 కోట్లు కేటాయించినా విడుదల చేసింది రూ.6,195 కోట్లే.

ఆసరా ఫించన్లు

రాష్ట్రంలో ఆసరా పింఛన్లు అందుకునేవారి సంఖ్య 50 లక్షలకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. వీరందరికీ ఏప్రిల్‌ నుంచి నెలకు రూ.2,016 (దివ్యాంగులైతే రూ.3,016) చొప్పున పింఛను అందుతుంది. 2019-20 బడ్జెట్‌ను రూ.1.82 లక్షల కోట్లతో ప్రవేశపెట్టగా, అందులో 6.62 శాతం (రూ.12,067 కోట్లు) మేర ఆసరా పింఛన్లకే ఖర్చుకానుంది. ఆసరా పింఛన్లను ప్రస్తుతం 40లక్షల మంది అందుకుంటున్నారు. వయో పరిమితి కుదించడం వల్ల అదనంగా 10లక్షల మంది ఆసరా పరిధిలోకి రావచ్చని అంచనా.
- రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న వివిధ రకాల పింఛన్లకు.. ఏటా రూ.12,067 వేల కోట్లు అవసరం.
- కేంద్రం జాతీయ సామాజిక సాయం కింద ఇచ్చే వాటా: రూ.300 కోట్లు. మిగిలినదంతా రాష్ట్ర ఖజానా నుంచే ఖర్చు చెయ్యాల్సి ఉంటుంది.
- ఇప్పటి వరకూ 65 ఏళ్లు దాటిన వారికి ఇస్తున్న వృద్ధాప్య ఫింఛన్లను ఇకపై 57 ఏళ్ల నుంచే ఇవ్వనున్నారు.
- వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, కళాకారులు.. ఇలా వివిధ వర్గాలకు ఇస్తున్న పింఛన్‌ మొత్తాలను రెట్టింపు చేస్తారు.

వ్యవసాయశాఖ

వ్యవసాయ రంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించారు. గత డిసెంబరు 11 వరకూ రైతులు తీసుకున్న పంట రుణాలను (ఒక్కో రైతుకు రూ.లక్ష వరకూ) మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.20,107 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వీటిలో రైతుబంధు పథకానికి రూ.12 వేల కోట్లు, రుణమాఫీ పథకానికి రూ.6 వేల కోట్లు, రైతు బీమా పథకానికి రూ.650 కోట్లు ఇస్తారు. గత బడ్జెట్‌లో రూ.15,511 కోట్లను కేటాయించగా ఈసారి మరో రూ.4596 కోట్లను అదనంగా పెంచారు.
రైతు బంధు
ఈ పథకం కింద ఈ ఏడాది ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండుసార్లు ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండుసార్లు ఇవ్వనున్నారు. ఈ పథకానికి ఈ ఏడాది రూ.10 వేల కోట్లు ఖర్చు కాగా వచ్చే ఏడాది రూ.12 వేల కోట్లు కేటాయించారు. ఎకరానికిచ్చే సొమ్ము రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చినందున నిధులు అదనంగా రూ.2 వేల కోట్లు పెంచారు.
ఏటా వ్యవసాయ రంగానికి బడ్జెట్‌ కేటాయింపులు (రూ.కోట్లు)
సంవత్సరం      కేటాయింపు      విడుదల
2014-15      6062.10      5017
2015-16      4709.31      4570.77
2016-17      4809.91      4542.16
2017-18      6994.15      5827.57
2018-19      15,511.56      13,000
హరితపందిరి
తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి సాధించేందుకు ఒక్కో రైతుకు 3 ఎకరాల్లో హరితపందిరి నిర్మాణానికి రూ.81 లక్షల వరకూ రాయితీ ఇవ్వడం ఈ పథకం ప్రత్యేకత. గత ఐదేళ్లలో అదనంగా 1187 ఎకరాల్లో రూ.360 కోట్ల రాయితీలిచ్చి ప్రభుత్వం ఈ పందిళ్లు నిర్మించింది.
- రుణమాఫీ పథకం కింద 35.29 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.16,124 కోట్లు అప్పులను ప్రభుత్వం తీర్చేసింది. రైతుల తరపున బ్యాంకులకు నిధులు విడుదల చేసింది.
- రాష్ట్రం ఏర్పడినప్పుడు 4.17 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యమున్న గోదాములే ఉండేవి. కొత్తగా మరో 22.50 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యమున్న గోదాముల్ని ప్రభుత్వం నిర్మించింది.
- బిందు, తుంపర్ల పరికరాలను రాయితీపై ఇచ్చేందుకు ‘సూక్ష్మసేద్యం’ పథకాన్ని అమలుచేస్తోంది. గత ఐదేళ్లలో రూ.1777.73 కోట్లు ఖర్చుచేసి 6.34 లక్షల ఎకరాల్లో ఈ పరికరాలు అమర్చింది.
- ఎలక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌(ఈనామ్‌) పథకం కింద 47 మార్కెట్లలో ఆన్‌లైన్‌లో పంటల కొనుగోళ్లు ప్రారంభించారు. ఇప్పటికే 22.74 లక్షల టన్నుల పంటలను ఈ విధానంలో కొని రైతులకు రూ.7029 కోట్లు చెల్లించారు.
- కూలీల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నందున వారిని ఆదుకోవడానికి ఐదేళ్లలో రూ.507 కోట్లతో వ్యవసాయ యంత్రాలను రాయితీలపై రైతులకు అందజేశారు.
- రైతు ఏ కారణంతో కన్నుమూసినా 10 రోజుల్లోనే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారాన్ని ఉద్దేశించిన పథకమిది. 18 నుంచి 59 ఏళ్ల వయసు మధ్య ఉన్న 29 లక్షల మంది రైతుల తరపున ‘భారతీయ జీవిత బీమా సంస్థ’కు రూ.600 కోట్లను ప్రీమియం సొమ్ముగా గత జులైలో చెల్లించింది. గత ఆగస్టు 14 నుంచి ఇప్పటివరకు 5,675 మంది రైతులు కన్నుమూయగా.. వారి కుటుంబాలకు రూ.283 కోట్లను బీమా పరిహారంగా అందజేసింది.

 

Posted on 23.02.2019