Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Survey 2016-17

తెలంగాణ ఆర్థిక సర్వే 2016 - 17

* రాష్ట్ర సామాజిక, ఆర్థిక సర్వే 2016 - 17 నివేదికను ప్రభుత్వం 2017, మార్చి 13న శాసనసభలో ప్రవేశపెట్టింది.
ముఖ్యాంశాలు
* తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జాతీయ సగటు కంటే ఇది వేగంగా పెరుగుతోంది. రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాల మెరుగును ఇది సూచిస్తోంది.
* ప్రస్తుత ధరల్లో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం రూ.1,58,360. గత ఏడాది ఇది రూ.1,40,683. ఈ ఏడాది వృద్ధి 12.6 శాతం. జాతీయ వృద్ధిరేటు 10.2 శాతంతో పోలిస్తే తెలంగాణ ముందుంది.
* హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మాత్రమే తలసరి కన్నా ప్రజల ఆదాయం ఎక్కువగా ఉంది. మిగతా 27 జిల్లాలు రాష్ట్ర సగటు కన్నా వెనుకున్నాయి. ఇక 14 జిల్లాలైతే జాతీయ సగటు కంటే వెనుకబ‌డ్డాయి.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016 - 17) లో తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ) జాతీయ సగటును దాటింది. రెండంకెల వృద్ధిని సాధించింది.
* అర్ధ, గణాంక శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుత ధరల్లో ఈ ఏడాది (2016 - 17) రాష్ట్ర జీఎస్‌డీపీ విలువ రూ.6.54 లక్షల కోట్లుగా అంచనా. గతేడాది (2015 - 16) ఇది రూ.5.76 లక్షల కోట్లుండగా దానిపై 13.7 శాతం వృద్ధి నమోదైంది.
* 2011 - 12 నాటి స్థిర ధరల ప్రకారం చూస్తే ఈ ఏడాది (2016 - 17) తెలంగాణ జీఎస్‌డీపీ విలువ రూ.5.11 లక్షల కోట్లుగా ఉంది. గతేడాది (2015 - 16) ఇది రూ.4.64 లక్షల కోట్లుండగా, దానిపై 10.1 శాతం వృద్ధి నమోదైంది. జాతీయ జీఎస్‌డీపీ వృద్ధిరేటు 7.1 శాతంతో పోలిస్తే తెలంగాణ మరో 3 శాతం అదనంగా సాధించింది.
* తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జీఎస్‌డీపీ వృద్ధిరేటు జాతీయ సగటును మించిపోయింది. అంతకుముందు జాతీయ సగటు కంటే తక్కువగా ఉండేది.
* జిల్లా జీఎస్‌డీపీ లెక్కలను పరిశీలిస్తే 2015 - 16 లెక్కల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు వరసగా అగ్రస్థానాల్లో ఉన్నాయి. ఈ 4 జిల్లాల మొత్తం జీఎస్‌డీపీ విలువ మొత్తం రాష్ట్ర జీఎస్‌డీపీలో 52 శాతం ఉంది. మొత్తం 31 జిల్లాల్లో అత్యల్ప జీఎస్‌డీపీ రూ.5,428 కోట్లతో కొమరం భీం జిల్లా చివరి స్థానంలో ఉంది.
* ప్రాథమిక రంగంలో వృద్ధిరేటు 17.2 శాతం.
* ఆర్థికాభివృద్ధిని ప్రధానంగా 3 రంగాల వృద్ధి ఆధారంగా లెక్కిస్తారు. వీటిలో ప్రాథమిక రంగంలో వ్యవసాయం, పశుగణం, అడవులు, గనులు ఉన్నాయి. ప్రాథమిక రంగంలో వృద్ధిరేటు ఈ ఏడాది 17.2 శాతం. వాతావరణం అనుకూలించి పంటల సాగు బాగున్నందున ఈ రంగం నుంచి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి విలువ బాగా పెరిగింది. ఇలా ద్వితీయ, తృతీయ రంగాల వృద్ధిరేటు కూడా జాతీయ సగటు కంటే ఎక్కువ.
* వ్యవసాయ రంగాన్ని ప్రత్యేకంగా విడిగా పరిశీలిస్తే వృద్ధిరేటు ఈ ఏడాది ధరల్లో 12.1 శాతంగా నమోదైంది. గత రెండేళ్లుగా ఈ రంగంలో మైనస్ వృద్ధిరేటు ఉండేది.
* విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా; ఇతర వినియోగ సేవల రంగంలో ఈ ఏడాది మైనస్ 2.4 శాతం వృద్ధిరేటు ఉంది. అటవీ ఉత్పత్తుల రంగంలోనూ వరసగా మూడో ఏడాది మైనస్ వృద్ధిరేటు నమోదైంది. ఈ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాల్లో వృద్ధిరేటు పెరిగింది.
సేద్యంలోనే ఎక్కువ మందికి ఉపాధి:
* రాష్ట్ర జీఎస్‌డీపీలో వ్యవసాయం వాటా 14.7 శాతం. కానీ, రాష్ట్ర కార్మిక రంగంలో 54 శాతం మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. గ్రామీణ రంగంలో ఏకంగా 73 శాతం మంది ఈ రంగం పైనే ఆధారపడి ఉన్నారు.
* రాష్ట్ర జీఎస్‌డీపీలో సేవల రంగం వాటా 62 శాతమైనా, ఈ రంగం పైనే ఆధారపడి ఉపాధి పొందేవారు 28 శాతమే.
* జిల్లాలవారీగా చూస్తే వ్యవసాయంపై ఆధారపడి జీవించే కార్మికుల శాతం జయశంకర్ జిల్లాలో అత్యధికంగా 84, జోగులాంబలో 82, వరంగల్ గ్రామీణ జిల్లాలో 80గా ఉంది.
* గతంలో జిల్లా సగటు జనాభా 37.89 లక్షలుండేది. ఈ విషయంలో పశ్చిమ్ బంగ (45.63), ఆంధ్రప్రదేశ్ (37.99) తర్వాత తెలంగాణ 3వ స్థానంలో ఉండేది. కానీ, కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో జిల్లాల సగటు జనాభా 11.35 లక్షలకు తగ్గి 17వ స్థానానికి చేరింది.
* జనసాంద్రత పరంగా చూస్తే హైదరాబాద్‌లో చదరపు కిలోమీటరుకు సగటున 8172 మంది ఉంటే, కొమరంభీంలో 106 మంది మాత్రమే నివసిస్తున్నారు.
* తెలంగాణలో పంటల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరుగుతోంది. 2008 - 15 మధ్య కాలంలో వరి, మక్కలు, కంది, పత్తి క్వింటా సగటు ఉత్పత్తి వ్యయం వరసగా 69, 19, 42, 18 శాతం చొప్పున పెరిగాయి.
* దేశంలో అధికంగా పంటలు పండించే ఆరు ప్రధాన రాష్ట్రాల కంటే తెలంగాణలో పంటల సాగు వ్యయం అధికంగా ఉంది.
* మిషన్ కాకతీయతో చెరువులను మరమ్మతు చేయడంతో భూగర్భ జల మట్టాలు సగటున 2.55 మీటర్లు అదనంగా పెరిగాయి.
తెలంగాణలో చిన్న పరిశ్రమలే 61 శాతం
* పరిశ్రమల్లో ఉద్యోగాల కల్పనలో తెలంగాణ వాటా జాతీయ స్థాయితో పోల్చితే తక్కువగా ఉంది. దేశంలో మొత్తం 1,85,690 పరిశ్రమలుంటే తెలంగాణలోవి 5.96 శాతం (11,068) మాత్రమే. దేశంలో మొత్తం అన్ని పరిశ్రమల్లో కోటీ 35 లక్షల మంది ఉద్యోగులుంటే వీరిలో తెలంగాణ పరిశ్రమల్లో పనిచేసేవారు 5.5 శాతం (7.45) లక్షల మంది.
* రాష్ట్రంలో 8,618 పరిశ్రమలు ఖాయిలా జాబితాలో ఉన్నాయి. వీటిలో 80 శాతం నడపటం లాభదాయకం కాదు.
* టీఎస్ - ఐపాస్ ద్వారా గత జనవరి 24 నాటికి రాష్ట్రంలో 3327 పరిశ్రమలకు అనుమతించారు. వీటిలో రూ.51,358 కోట్ల పెట్టుబడులతో 2.12 లక్షల మందికి ఉపాధి లభించనుంది.
చిన్నారుల్లో పౌష్ఠికాహార లోపం:
* తెలంగాణలో చిన్నారులను పౌష్టికాహార లోపం వేధిస్తోంది. సరైన తిండిలేక బాల్యం బక్కచిక్కి శల్యమవుతోంది. రాష్ట్రంలో ఐదేళ్ల లోపు చిన్నారుల్లో 28.1 శాతం మంది ఎదుగుదల లోపంతో బాధ పడుతుండగా 18 శాతం మంది నడుము బక్కచిక్కి పోయింది. 28.5 శాతం మంది పిల్లలు బరువు తక్కువతో బాధపడుతున్నారు. పాత జిల్లాల్లో గణాంకాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 38.3 శాతం మంది పిల్లలు ఎత్తు ఎదుగుదల సమస్యను ఎదుర్కొంటున్నారు. నడుము బక్కచిక్కిన చిన్నారులు నల్గొండ (23.1 శాతం)లో అధికంగా ఉండగా, బరువు తక్కువున్న పిల్లలు మహబూబ్‌నగర్ (37 శాతం)లో ఎక్కువగా ఉన్నారు.
* రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులు 61 శాతం మంది, మహిళలు 56.9 శాతం మంది, గర్భిణులు 49.9 శాతం మందిలో రక్తహీనత ఉంది.
* రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి పథకం కింద 3,69,677 మంది గర్భిణులకు పౌష్టికాహారం అందజేస్తోంది.
* తెలంగాణలో ఆసుపత్రుల్లో ప్రసవాలు 91.5 శాతం కాగా, గ్రామీణంలో 87.3 శాతంగా నమోదైంది.
* శస్త్రచికిత్స కాన్పుల్లో తెలంగాణ (58 శాతం) కంటే 16 రాష్ట్రాలు దిగువనున్నాయి. బాలింత మరణాల రేటు ప్రతి లక్ష ప్రసవాలకు 92గా నమోదైంది. 1000 మంది శిశువులకు 28 మంది మృతి చెందుతున్నారు.
* ఆదిలాబాద్‌లో అత్యధికంగా బాలింత మరణాల రేటు 152 కాగా, హైదరాబాద్‌లో తక్కువగా 71.
గ్రామీణ అక్షరాస్యతలో వెనుకబాటే:
* తెలంగాణలో అక్షరాస్యత: 66.5% (గ్రామీణ ప్రాంతాల్లో - 57.3%, పట్టణ ప్రాంతాల్లో - 81.1%)
* తెలంగాణ గ్రామీణ అక్షరాస్యతలో బిహార్ కంటే వెనుకబడి ఉంది. తెలంగాణలో 57.3% ఉంటే, బిహార్‌లో 59.8 శాతం ఉంది.
* షెడ్యూల్డ్ తెగల్లో (ఎస్టీ) అక్షరాస్యత: 49.5%, షెడ్యూల్డ్ కులాల్లో (ఎస్సీ) అక్షరాస్యత 58.9%.
* స్త్రీలల్లో అక్షరాస్యత 57.9%, పురుషుల్లో 75% ఉంది.
* బడి మానేస్తున్న పిల్లలు: 36.99%
* ఒకటి నుంచి పదో తరగతి లోపు బడి మానేస్తున్న పిల్లలు 36.99%. ఒకటి నుంచి ఐదో తరగతి మధ్య 16.33%, ఒకటి నుంచి ఎనిమిదో తరగతి మధ్య 29.42% మంది ఉన్నారు.
తలసరి అప్పు రూ.40,149
* తెలంగాణ రాష్ట్రంలో తలసరి అప్పు రూ.40,149. మొత్తం రాష్ట్ర అప్పు రూ.1,40,523 కోట్లు కాగా, 2011 జనాభా మేరకు ఒక్కో వ్యక్తిపై ఉన్న అప్పు రూ.40,149.
* రాష్ట్రంలో అప్పుల చిట్టా పెరిగింది. 2017 - 18 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ అప్పులు రూ.1,40,523 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో అప్పుల శాతం 18.51. అప్పుల మొత్తం క్రమంగా పెరుగుతోంది. 2015 - 16లో అప్పులు రూ.93,115 కోట్లు కాగా, 2016 - 17కు రూ.1,14,813 కోట్లుకు పెరిగింది.
మానవాభివృద్ధి మెరుగు
* మానవాభివృద్ధి సూచీలో తెలంగాణ పదో స్థానంలో ఉంది. 2004 - 05లో 13వ స్థానంలో ఉండేది.
* తలసరి ఆదాయం, ఆయుర్దాయం, ఆరోగ్య ప్రమాణాలు, అక్షరాస్యత, విద్య, తదితర అంశాల్లో పురోగతిని చూపే మానవాభివృద్ధి సూచీలో మొదటి స్థానంలో కేరళ, రెండో స్థానంలో తమిళనాడు ఉన్నాయి.
* తర్వాతి స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు వరసగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, హరియాణా ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.
జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం తెలంగాణ వివరాలు
* తెలంగాణ గ్రామాల్లో అప్పులతో సతమతమవుతున్న రైతులు 69.4% (దేశంలోనే మొదటి స్థానం).
* గ్రామాల్లో కుటుంబ సగటు అప్పు రూ.68,485.
* సాగులో తెలంగాణ స్థానం... విస్తీర్ణంలో 16, ఉత్పాదకతలో 14. పంటల దిగుబడిలో నాలుగో స్థానం. (ఉత్పాదకతలో మొదటి మూడు స్థానాల్లో వరుసగా పంజాబ్, హరియాణా, కేరళ నిలిచాయి)
* 2016 - 17 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన వ్యవసాయ రుణాలు రూ.27,000 కోట్లు. అందింది రూ.18,000 కోట్లే.
* జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఆరోగ్య సూచీలో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. సగటు ఆయుర్దాయం, మాతాశిశు మరణాలు ఈ సూచీకి ప్రాతిపదిక. ఇందులో మొదటి మూడు స్థానాల్లో వరుసగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ఉన్నాయి.
అంకెల్లో తెలంగాణ
* జనాభా : 3.50 కోట్లు
* పురుషులు : 1.76 కోట్లు
* స్త్రీలు : 1.73 కోట్లు
* గ్రామాల్లో జనాభా : 2.13 కోట్లు
* పట్టణాల్లో జనాభా : 1.36 కోట్లు
* హిందువులు : 2,99,48,451
* ముస్లింలు : 44,64,699
* క్రైస్తవులు : 4,47,124
* బౌద్ధులు : 32,553
* సిక్కులు : 30,340
* జైనులు : 26,690
* ఇతరులు : 5,422
* ఏ మతానికీ చెందనివారు : 2,38,699
* మొత్తం భూ కమతాలు: 55.54 లక్షలు, వీటి కిందున్న భూమి : 61.97 లక్షల హెక్టార్లు
* సగటు కమతాల పరిమాణం : 1.12 హెక్టార్లు
* పట్టణాలు : 158
* గ్రామపంచాయతీలు : 8,687
* రెవెన్యూ గ్రామాలు : 10,434
* స్త్రీపురుష లింగ నిష్పత్తి : 988/1000 (ప్రతి 1000 మంది పురుషులకు 988 మంది స్త్రీలున్నారు)
* మొత్తం పట్టభద్రులు : 26,51,886
* పురుష పట్టభద్రులు : 16,94,505
* మహిళా పట్టభద్రులు : 9,57,381
* మొత్తం కుటుంబాలు : 83,03,612
* సగటు కుటుంబం : ఇంటికి నలుగురు
* మొత్తం అల్లోపతి ఆసుపత్రులు : 206
* మొత్తం పీహెచ్‌సీలు : 613, పడకలు : 22,495
* సంప్రదాయ వైద్య ఆసుపత్రులు : 11 (వీటిలో ఆయుర్వేదం 4, యునాని 3, హోమియో 3, ప్రకృతివైద్యం 1 ఉన్నాయి), మొత్తం పడకలు: 717
* మొత్తం చెరువుల కిందున్న భూమి : 2,82,867 హెక్టార్లు
* కాల్వల కిందున్న భూమి : 4,70,374 హెక్టార్లు
* బావులు, గొట్టపు బావుల కిందున్న భూమి : 23,35,515 హెక్టార్లు
* ఇతరాలు : 75,234 హెక్టార్లు