13 రోజుల పక్కా వ్యూహం!

ఐఐఎంలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో ఎంబీఏ సీటును అందించే ప్రవేశపరీక్ష క్యాట్‌. దీనికి మరో 13 రోజుల సమయం ఉంది. కచ్చితత్వం, వేగం- ఈ రెండే లక్ష్యంగా ఇకపై సన్నద్ధత కొనసాగాలి!
అభ్యర్థులు ప్రాథమిక భావనల అవగాహన, వాటి అనువర్తనం, విభిన్న విధానాల్లో సమాధానం కనుగొనడం, వేర్వేరు రకాల ప్రశ్నలను పరిశీలించడం ఇప్పటికే పూర్తిచేసి ఉంటారు. ఇప్పుడు వీటికి తుదిమెరుగులు దిద్దాల్సి ఉంది. ఈ సమయంలో వీరిలో చాలా సందేహాలు మెదులుతూ ఉంటాయి.
పరీక్షను ఎదుర్కొనే పరిజ్ఞానం నాలో ఉందా? ఎలాంటి అంశాలను విస్మరించవచ్చు? ఎన్ని నమూనా పరీక్షలు రాయాలి? మంచి మార్కులశాతానికి ఎన్ని ప్రశ్నలను రాయాలి?... ఇలా ఎన్నో సంశయాలు. సరైన వ్యూహంతో వీటికి సమాధానం కనుగొనవచ్చు.
పరీక్షకు అనుగుణంగా...
రాయబోతున్న పరీక్షకు అనుగుణంగా సిద్ధం కావాలి. ఇటీవలి కాలంలో వస్తున్న ప్రశ్నల ధోరణిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పరీక్షలో రెండు సెక్షన్లు ఉన్నాయి. 1. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 2. వెర్బల్‌ ఎబిలిటీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌. ఆయా సెక్షన్లలో ఇటీవలి కాలంలో వస్తున్న ప్రశ్నల సరళిని పరిశీలిస్తే...
డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కు సంబంధించి 1990- 1999 ప్రశ్నపత్రాలు కీలకం. ఈ సంవత్సరాల్లో జరిగిన ప్రశ్నపత్రాలనే కొత్తకోణంలో ఇస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరాల్లో పరీక్ష పత్రాలను విభిన్న కోణాల్లో విశ్లేషించుకోవాలి. వెర్బల్‌ ఎబిలిటీకి సంబంధించి 1997- 2008 సంవత్సరాల మధ్య వచ్చిన ప్రశ్నపత్రాల్లోని ప్యారా జంబుల్స్‌, ప్యారా కంప్లీషన్లతోపాటు తార్కిక పరిజ్ఞాన ప్రశ్నలు ముఖ్యం. ఇతర సంవత్సరాల్లో ఈ ప్రశ్నల ప్రాతిపదికన కొత్త రకంగా ఇస్తున్నారు. కాబట్టి వాటిపై పట్టు సాధించడంతోపాటు, కొత్త కోణంలో వాటిని ఎలా అడిగేందుకు ఆస్కారం ఉంటుందో చూసుకుంటే పరీక్ష కోణం అవగాహనకు వచ్చినట్లే.
రీడింగ్‌ కాంప్రహెన్షన్‌కు సంబంధించి 2000- 2008 మధ్య వచ్చిన ప్రశ్నలు ప్రధానం. ఈ మధ్య కాలంలో వచ్చిన కాంప్రహెన్షన్‌ నిడివిలానే, గత కొంతకాలంగా కాంప్రహెన్షన్ల నిడివి ఉంటోంది.
క్వాంటిటేటివ్‌ ఎబిలిటీకి సంబంధించి 1995- 2008 మధ్య నిర్వహించిన ప్రశ్నపత్రాలు ముఖ్యం. ఈ మధ్యకాలంలో నిర్వహించిన పరీక్షల్లో క్యాట్‌ పరీక్షల్లోని ప్రశ్నల్లో సూత్రాల ఆధారితమైనవి కాకుండా తార్కిక పరిజ్ఞాన ప్రాతిపదికగా వచ్చాయి. గత కొంతకాలంగా కూడా ఇదే ధోరణి క్యాట్‌ పేపర్‌లో ఉంటోంది. ఈ ఒరవడి కొనసాగుతుంది కాబట్టి సన్నద్ధత కూడా ఇలానే ఉండడం మంచిది.
వెర్బల్‌ ఎబిలిటీ: రెండు వారాల సమయం ఉందని కొత్త ఒకాబులరీ నేర్చుకోవడం/ గ్రామర్‌ అంశాలపై పట్టు సాధించడం కోసం సమయాన్ని వెచ్చించొద్దు. ఈ రెండు వారాల్లో సాధనే కీలకం. గత సంవత్సరాల్లో అడిగిన పదాల అర్థాలను (ఒకాబులరీలో భాగంగా) తెలుసుకోవాలి.
పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాది కాబట్టి, అందులో నాలుగు ఆప్షన్లుంటాయి. సరైన ఆప్షన్‌తోపాటు మిగతా మూడు ఆప్షన్ల అర్థాలను కూడా తెలుసుకోవడం ద్వారా గరిష్ఠ లబ్ధి పొందవచ్చు. పునశ్చరణ, మాదిరి పరీక్షలు రాయడానికీ సమయాన్ని కేటాయించాలి. మాదిరి ప్రశ్నపత్ర విశ్లేషణకు ప్రాధాన్యం ఉంది. మాదిరి పరీక్ష తరువాత ఎలాంటి విశ్లేషణ చేయకపోవడం సముచితం కాదు. ఇందులో పరిశీలించాల్సిన అంశాలు- ఎక్కువగా ఏ తరహా ప్రశ్నలను అటెంప్ట్‌ చేయలేకపోతున్నారో చూడాలి. సమయ నిర్వహణ ఎలా ఉందో పక్కాగా పరిశీలించుకోవాలి. లోటుపాట్లను గమనించుకుని తర్వాత రాసే పరీక్షలో తిరిగి అలాంటివి లేకుండా జాగ్రత్తపడాలి.
కొత్త తరహా ప్రశ్నలకు సంబంధించి ప్రాథమిక అంశాల నుంచి సిద్ధం కావడానికి ఇది సమయం కాదు. అందుకే ఇప్పటికే బాగా పట్టు ఉన్నవాటిని ఎంచుకుని, అందులో విభిన్న కోణాలను పరిశీలిస్తే లబ్ధి పొందవచ్చు.
ఈ దశలో సరైన ఎంపిక, ఎంపిక చేసినవాటిలో లోతైన అధ్యయనం అన్న ప్రాతిపదికన సన్నద్ధత సాగాలి.
వాక్యాలను సరిచేయడం (సెంటెన్స్‌ కరెక్షన్‌)లో ఎక్కువగా వ్యాకరణ అంశాలుంటాయి. అయితే పూర్తిగా ఆయా సూత్రాలకు వెళ్లకుండా, వివరణలో నేర్చుకున్న అంశాలకే పరిమితం కావాలి. వాక్యాలను సరిచేయడంలో కూడా నాలుగు ఆప్షన్లు ఉంటాయి. ఒక సమాధానం ఎందుకు సరైందో తెలుసుకోవడంతోపాటు, మిగతావి ఎందుకు సరైనవి కావో కూడా తెలుసుకుంటే మంచిది.
13 రోజుల్లో కనీసంగా పదిరోజుల పాటు రోజూ ఈ విభాగంలో 10 ప్రశ్నలు చేస్తే మొత్తం 100 ప్రశ్నలు సాధన చేసినట్లు. అందులో ప్రతిదానికి నాలుగు ఆప్షన్ల వివరణ చదివితే, మొత్తం 400 వ్యాకరణ అంశాలు తెలిసినట్లు. ఈ తరహా విధానంతో పరీక్ష ఓరియంటేషన్‌ కూడా అవగాహనకు వస్తుంది.
వెర్బల్‌ ఎబిలిటీలో రీడింగ్‌ కాంప్రహెన్షన్‌కు సంబంధించి ఏ తరహా పేరాగ్రాఫ్‌లతో అనుకూలంగా ఉందో పరిశీలించుకోవాలి. సాధారణంగా కాంప్రహెన్షన్లు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అర్థశాస్త్రం, తత్వశాస్త్రం (ఫిలాసఫీ), చరిత్ర అంశాల నుంచి వస్తున్నాయి. ఇందులో అభ్యర్థులు వేటిని చదవడంలో ఆసక్తిగా ఉన్నారో, అలాగే ఎందులో ఎక్కువగా సరైన సమాధానాలు గుర్తిస్తున్నారో పరిశీలించుకుని, వాటిని ఎక్కువగా సాధన చేయాలి. పరీక్ష రాసేపుడు కూడా ఆ తరహా కాంప్రహెన్షన్లు ఎంచుకోవడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుంది.
క్వాంటిటేటివ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో మొత్తం 16 అధ్యాయాలున్నాయి. ఇందులో మళ్లీ ఉప అంశాలు కూడా ఉన్నాయి. పరీక్షలో జామెట్రీ, నంబర్‌ సిస్టమ్‌కు అత్యధిక ప్రాధాన్యం ఉంది. సింహభాగం ప్రశ్నలు ఈ రెండు అంశాల నుంచే వస్తున్నందున, వీటిని నిత్యం అన్నిరకాల మోడళ్ళపై సాధన చేస్తే మెరుగు.
డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో రోజూ కనీసం 50 ప్రశ్నలు సాధన చేయాలి. అయితే 'సెలెక్టివ్‌ అప్రోచ్‌' చాలా కీలకం. ప్రతి డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో క్లిష్టంగా, సులువుగా ఉండే ప్రశ్నలుంటాయి. సులువైనవాటిని గుర్తించి వాటినే రాసేలా సాధన చేయాలి. అంటే అభ్యర్థి ఏది సులువో, ఏది కష్టమో చదివేటపుడు విశ్లేషించే స్థాయికి చేరాలి. ఇంతకుముందు చెప్పినట్లు నిత్యం కనీసం 50 ప్రశ్నలు సాధన చేయడం ద్వారా ఆ స్థాయి పది రోజుల్లో తెచ్చుకోవచ్చు.
మెలకువలు
పూర్తిస్థాయి మాదిరి పరీక్షలతోపాటు సెక్షన్లవారీగా నమూనా పరీక్షలు రాయడం, పూర్వ క్యాట్‌ ప్రశ్నపత్రాలను పరిశీలించడం చాలా అవసరం. పరీక్ష పూర్తయిన వెంటనే సమాధానాలను పరిశీలించుకోవాలి. ఎక్కువగా తప్పు చేస్తున్న అంశాలను గుర్తించి అందులో ఒక్కసారి ప్రాథమిక భావనలను తిరగేయాలి. అవసరమైతే ఆ అంశాలకు సంబంధించి సాధ్యమైనన్ని ఎక్కువ ప్రశ్నలను పరిశీలించాలి.
పూర్తిస్థాయి మాదిరి పరీక్ష రాసేపుడు నిజంగా క్యాట్‌ రాస్తున్న వాతావరణాన్ని కల్పించుకోవడం సముచితం. అభ్యర్థులు తమకు కేటాయించిన సమయస్లాట్‌ను చూసుకుని, అదే స్లాట్‌లో మాదిరి పరీక్ష రాయడం ప్రయోజనకరం.
పరీక్షకు రెండు 2.50 గంటల సమయం. 100 ప్రశ్నలు. అంటే ఒక్కో ప్రశ్నకు సుమారుగా 1.4 నిమిషాల వ్యవధి ఉంటుంది. ఇంత తక్కువ సమయంలో ప్రశ్న చదివి అర్థం చేసుకుని, సమాధానం రాబట్టాల్సి ఉంటుంది. అంటే ప్రశ్నను కూడా వేగంగా చదివి అర్థం చేసుకునేలా ఈ పదిరోజుల సాధన చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
తమకు ఏఏ అంశాల్లో పట్టు ఉందో ముందుగా విశ్లేషించుకోవాలి. కొత్త తరహా ప్రశ్నలకు సంబంధించి ప్రాథమిక అంశాల నుంచి సిద్ధం కావడానికి ఇది సమయం కాదు. అందుకే ఇప్పటికే బాగా పట్టు ఉన్నవాటిని ఎంచుకుని, అందులో విభిన్న కోణాలను పరిశీలిస్తే లబ్ధి పొందవచ్చు.ఈ దశలో సరైన ఎంపిక, ఎంపిక చేసినవాటిలో లోతైన అధ్యయనం అన్న ప్రాతిపదికన సన్నద్ధత సాగాలి.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌/ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌.. ఏదైనా సరే చివరకు సూక్ష్మీకరించాల్సిందే. కాబట్టి నిత్యం 50- 100 వరకు సూక్ష్మీకరణ ఆధారిత ప్రశ్నలను సాధన చేస్తే వేగం పెరుగుతుంది. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో కూడా ఇదెంతో ఉపయోగపడుతుంది. క్వాంటిటేటివ్‌ పేపర్లో ప్రాధాన్యం ఉన్న నంబర్‌ సిస్టమ్‌కు కూడా ఇది చాలా ఉపయోగం.
డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో సరాసరి, శాతాలు, నిష్పత్తి-అనుపాతాలపై పట్టు అవసరం.
2001- 2008 వరకు వివిధ అంశాల నుంచి వచ్చిన ప్రశ్నలు అధ్యాయాల వారీగా పట్టికల్లో చూడొచ్చు. (2009 నుంచి పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నందువల్ల ప్రశ్నపత్రాలు అందుబాటులో లేవు).

Posted on 03.11.2014

Ushodaya Enterprises Private Limited 2014