క్యాట్‌కు సర్వ సన్నద్ధత

మేనేజ్‌మెంట్‌ విద్యలో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించే కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌) పరీక్ష నవంబర్‌ 29న. అంటే ఇంకా 12 రోజుల వ్యవధి ఉంది. స్కోరు పెంచుకోవడమే లక్ష్యంగా అన్నివిధాలా పూర్తిస్థాయిలో సిద్ధం కావాల్సిన సమయమిది!
అభ్యర్థులకు ఇప్పటికే ప్రాథమికాంశాలు, అనువర్తనాలు, పరీక్షలో ఉపయోగించాల్సిన తీరు... తదితర అంశాలపై అవగాహన వచ్చి ఉంటుంది. వాటి జోలికి ఇప్పుడు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇదమిత్థంగా ఇప్పుడు చేయాల్సిందల్లా తగిన సాధనే.
అక్టోబర్‌ 25, 2015 నుంచే అడ్మిట్‌ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. అంటే ఇప్పటికే పరీక్ష షెడ్యూల్‌, సమయం కూడా తెలిసి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కేంద్రీకృత తయారీ ఎంతో కీలకం. అంటే, నిర్దిష్టంగా లోపాలను సవరించుకుంటూ వెళ్లడమే. ఆయా అంశాలను ఎంపిక చేసుకోవడమే. మాదిరి పరీక్షల ద్వారా ఈ ప్రక్రియ జరగాల్సి ఉంటుంది.
సొంత వ్యూహాలు ముఖ్యం
తుది మెరుగుల్లో భాగంగా, అభ్యర్థులు తమ వ్యక్తిగత శక్తిసామర్థ్యాల ఆధారంగా సన్నద్ధత సమయాన్ని కేటాయించుకోవాలి. అంటే, ఇప్పటికే బాగా నేర్చుకున్న అంశాలకు తక్కువ సమయాన్ని ఇస్తూ, పరిజ్ఞానం తక్కువగా ఉన్న అంశాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. గత ఏడాది క్యాట్‌ పరీక్ష రాసిన అభ్యర్థులు ఈ ఏడాది వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకోవాలి. అందుకు అనుగుణంగా పరీక్ష రాసే వ్యూహాన్ని నిర్దేశించుకోవాలి.
ముఖ్యంగా ఈ ఏడాది విభాగాల (సెక్షన్ల) వారీగా సమయాన్ని కేటాయించారు. పరీక్షలో మొత్తం మూడు సెక్షన్లుంటాయి. ప్రతి సెక్షన్‌కూ 60 నిమిషాలు కేటాయించారు. నిర్దేశించిన సమయంలో ఆ సెక్షన్‌లోని ప్రశ్నలకే సమాధానం కనుగొనాల్సి ఉంటుంది. గతంలోలా మరో సెక్షన్‌కు వెళ్ళడానికి వీలుండదు. దీని దృష్ట్యా ప్రతి సెక్షన్‌ కీలకం కానుందన్న విషయం స్పష్టమవుతుంది. అందుకే అభ్యర్థులు, ప్రస్తుతం పూర్తిస్థాయి పరీక్ష రాసి, విధిగా జవాబులను సరిచూసుకోవాలి. ఏ అంశం నుంచి తరచూ ఎక్కువ తప్పులు వస్తున్నాయో, ఆయా అధ్యాయాల ప్రాథమికాంశాల జోలికి మాత్రమే వెళ్లాలి.
ఉదాహరణకు- తొలి విభాగాన్నే పరిశీలిద్దాం. ఇందులో క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ నుంచి ప్రశ్నలుంటాయి. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీలో ఏ అధ్యాయం నుంచి తరచూ తప్పులు జరుగుతున్నాయో చూసుకోవాలి. ఆ అంశానికి సంబంధించిన అంశాలను పునశ్చరణ చేసుకోవాలి. అయితే లోతైన అధ్యయనానికి వెళ్లడానికి ఇది సమయం కాదు. ఆయా ప్రశ్నల అనువర్తనాలు, విభిన్న రీతిలో ప్రశ్నిస్తూ వెళ్లాలి.
ప్రాథమిక అంశాల్లో పూర్తిస్థాయిలో పరిశోధన రీతిలో కాకుండా పరీక్ష దృష్టితో పరిశీలించడమే ప్రస్తుతం చేయాల్సింది. అన్ని విభాగాలకూ ఇది వర్తిస్తుంది. అయితే మూడో సెక్షన్లో భాగంగా ఉన్న రీడింగ్‌ కాంప్రహెన్షన్‌కు సంబంధించి ఈ వ్యూహం అవసరం లేదు. ఈ అంశానికి సంబంధించి తరచూ తప్పులు వస్తూంటే సాధ్యమైనన్ని ఎక్కువ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ ప్రశ్నలకు సమాధానం సాధించాలి.
ప్రతిభ ఆధారంగా సమయ కేటాయింపులు
ప్రతి సెక్షన్‌కు కేవలం 60 నిమిషాలు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే రెండు, మూడు సెక్షన్లలో ఒక్కో దానిలో రెండేసి విభాగాలను పేర్కొన్నారు. ఈ రెండు విభాగాలకు సమయంపై పరిమితులు లేవు. కాబట్టి అభ్యర్థులు తమకు బాగా పట్టున్న అంశానికి సంబంధించి ఎక్కువ ప్రశ్నలు అటెంప్ట్‌ చేయాలి. అందుకు అనుగుణంగా మాదిరి పరీక్షలను కూడా రాయాలి. 29 నవంబర్‌న పాటించబోయే వ్యూహాన్నే మాదిరి పరీక్షల్లోనూ తూచా తప్పకుండా పాటించాలి. మానసికంగా సంసిద్ధత వస్తుంది. రెండు, మూడు సెక్షన్లలో వేర్వేరు విభాగాలను పేర్కొన్నారు. ఆయా విభాగాల్లో మార్పును అనుమతిస్తారు.
ఉదాహరణకు- రెండో సెక్షన్‌లో డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌లను పేర్కొన్నారు. వీటిలో ఏ ప్రశ్నలను ఎంచుకోవాలనుకుంటే వాటిలోకి వెళ్లొచ్చు. కాబట్టి బాగా పట్టున్న అంశాలకు మొదట సమాధానం కనుగొనాలి. అభ్యర్థులు మాక్‌ పరీక్ష రాసేటపుడు ఈ తరహా వ్యూహాలను అనుసరిస్తే అసలు పరీక్షలో సాఫీగా సమాధానం కనుగొనే సామర్థ్యం వస్తుంది.
డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలకు సిద్ధం
ఈ ఏడాది క్యాట్‌లో డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలు కూడా అడగనున్నారు. గత ఏడాది ఈ తరహా ప్రశ్నలు లేవు. ఈ ప్రశ్నలకు రుణాత్మక మార్కులు లేవు. అంటే అభ్యర్థులు వీటిని సాధ్యమైనన్ని ఎక్కువ సాధన చేయాలి. ప్రతి ప్రశ్న కోణాన్నీ ఎలా మార్చగలరో వూహించగలగాలి.
ఇందుకు చివరి ఈ 12 రోజులే కీలకం. ఇతర అభ్యర్థులతో కలిసి సాధన చేస్తే అవగాహన పెరుగుతుంది. ఇది ఎంతో ప్రయోజనకరం. ఏ రోజు పరీక్ష రాశారో ఆ వెంటనే ఈ కసరత్తు చేయాలి. దీంతో కాన్సెప్టుపై కూడా పూర్తి స్థాయి పట్టు వస్తుంది.
ఈ దఫా మార్పులు
ఈసారి పరీక్షలో పెన్ను, చిత్తు కాగితాలను పరీక్ష గదిలోనే అందుబాటులోకి తేనున్నారు. అలాగే సిస్టమ్‌లోనే సమయం కనిపిస్తూ ఉంటుంది. 60 నిమిషాలు ముగియగానే ఆ సెక్షన్‌కు 'లాక్‌' పడుతుంది. సబ్మిట్‌ బటన్‌ యాక్టివేట్‌ అవుతుంది. దానిని క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయకపోయినా సొంతంగానే సబ్మిట్‌ అయ్యేలా ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఆ తర్వాత సమాధానాల సారాంశం కూడా తెరపై కనిపిస్తుంది. తెరలో సమాధానాల పెల్లెట్‌ కుడివైపున ఉంటుంది. వాటి స్థితులను తెలియజేయడానికి వేరువేరు రంగులను పేర్కొన్నారు.
» ఎలాంటి రంగూ లేని ప్రశ్నలు అటెంప్ట్‌ చేయనివి.
» నారింజ రంగుతో ఉంటే అభ్యర్థులు ప్రశ్నను చదివారు కానీ సమాధానం గుర్తించలేదని అర్థం.
సాధారణంగా అభ్యర్థులు జవాబుని గుర్తించినా మరోసారి సమీక్షించాలనుకుంటారు. ఈ దఫా ఆన్‌లైన్‌లోనూ వేర్వేరు రంగులతో దీనిని సూచించనున్నారు.
» ఆకుపచ్చ రంగు మార్క్‌ అయితే, ప్రశ్నకు జవాబు గుర్తించడం పూర్తయింది, అయితే సమీక్షకు ఎలాంటి గుర్తు చేయలేదని. అంటే ప్రశ్నలపై సమీక్ష కోసం మార్క్‌ చేసుకునే వెసులుబాటు ఉంది.
» వంగపండు రంగులో ప్రశ్న హైలైట్‌ అయ్యిందంటే ప్రశ్నకు సమాధానం గుర్తించలేదు, అయితే సమీక్షకు వెసులుబాటు ఉంది.
» వంగపండు రంగుండి, దానిపై టిక్‌ మార్క్‌ ఉంటే, సమాధానం గుర్తించడం పూర్తయింది. అయితే సమీక్షకు టిక్‌ ఉందని భావం.
ఈ రంగుల భావనలను అభ్యర్థులు పక్కాగా గుర్తుంచుకోవాలి. మాక్‌ పరీక్షల్లోనూ ఈ తరహా విధానాలనే అవలంబించాలి. ఒకవేళ ఆ స్థాయిలో సాఫ్ట్‌వేర్‌ లేని పక్షంలో ఏదో రీతిలో గుర్తులను పెట్టుకోవాలి. దీనికి కారణం పరీక్ష హాలులో నేరుగా ఏ ప్రశ్నకు అయినా వెళ్లే వెసులుబాటు ఉంది. అన్ని ప్రశ్నలనూ అటెంప్ట్‌ చేశాక సమయముంటే ప్రశ్నకు సమాధానం గుర్తించి సమీక్షకు టిక్‌ చేసిన వాటిలోకి నేరుగా వెళ్లాలి. ఎందుకంటే వాటిని తక్కువ సమయంలో పూర్తిచేయవచ్చు. మాదిరి పరీక్షలో ఈ తరహా వ్యూహాన్నే అవలంబించాలి.
గమనించండి
» అభ్యర్థులకు తమకు ఏ స్లాట్‌లో పరీక్ష వచ్చిందో ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. అదే స్లాట్‌లో మాదిరి పరీక్షను రాయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. వేరే సమయంలో రాసినా గడియారాలను పరీక్ష స్లాట్‌ సమయానికే అడ్జస్ట్‌ చేసుకోవాలి. దీనివల్ల ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటాయిస్తున్నాం, ఇంకెంత సమయముంది... ఇలా పలు అంశాలపై పట్టు వస్తుంది.
» అభ్యర్థులకు ఈ ఏడాది ఆన్‌స్క్రీన్‌ క్యాలిక్యులేటర్‌ అందుబాటులో ఉంటుంది. కాబట్టి, కొన్ని సూక్ష్మీకరణ అంశాలను ఎక్కువగా సాధన చేస్తూ సమయాన్ని వృథా చేయకూడదు.
» క్యాట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా 'మాదిరి పరీక్ష' అందుబాటులో ఉంది. అభ్యర్థులు దీనిని విధిగా రాయాలి. నిజపరీక్షలో స్క్రీన్‌ ఎలా ఉంటుందో ఇందులో పూర్తిగా అవగతమవుతుంది.
» ప్రశ్నలకు సమాధానం మార్చుకునే వెసులుబాటు ఉంది. దేన్ని మార్చుకోవాలనుకుంటున్నారో దానిపై క్లిక్‌ చేస్తే 'క్లియర్‌ రెస్పాన్స్‌' అనే ఆప్షన్‌ వస్తుంది. దానిని క్లిక్‌ చేయడం ద్వారా సమాధానాన్ని మార్చుకోవచ్చు.

Published on 16-11-2015
 
© Ushodaya Enterprises Private Limited 2015