క్యాట్‌.. కొత్తగా, కొంచెం కఠినంగా

నవంబర్‌ 29న నిర్వహించిన 'క్యాట్‌'లో కొత్తదనం కనిపించింది. పరీక్ష విధానంలో, సెక్షన్ల విభజనలో మార్పులను నోటిఫికేషన్‌లోనే స్పష్టంగా పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే పరీక్ష కొనసాగింది. ప్రాథమిక అంశాలపై పట్టు ఉండి, బాగా సాధన చేసినవారికి మంచి పర్సంటైల్‌ వచ్చేలా ప్రశ్నపత్రం ఉందన్నది ఎక్కువమంది భావన!
ప్రతిసారీ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌తో ప్రారంభమయ్యే క్యాట్‌లో ఈ దఫా ప్రారంభ విభాగంగా వెర్బల్‌ ఎబిలిటీ ఉంది. ఇది నోటిఫికేషన్‌లోనే పేర్కొన్నారు. అయితే కొన్ని అనూహ్య మార్పులను పరీక్ష గదిలోనే అభ్యర్థులు చూశారు. మొత్తంగా కొన్ని అంశాలు కఠినంగా, కొన్ని మధ్యస్థంగా, మరికొన్ని సులభంగా ఉన్నాయి.
ఆత్మవిశ్వాసం పెంచిన వెర్బల్‌ ఎబిలిటీ
తొలి అంశంగా వచ్చిన వెర్బల్‌ ఎబిలిటీలో ప్రారంభంలోనే కొంచెం సులభస్థాయిలో ప్రశ్నలు రావడంతో అభ్యర్థులు తేలికగా చేయగలిగారు. దీంతో ఆత్మవిశ్వాసం కూడా పెరిగిందని వారి భావన. నిజానికి ఈ విభాగంలో భారీ మార్పులున్నాయని చాలామంది చెప్పారు. గతంలో ఇందులో ఎన్నో అంశాల నుంచి ప్రశ్నలు వచ్చేవి. అయితే ఈసారి మాత్రం రెండు అంశాల చుట్టూ మాత్రమే ప్రశ్నలు తిరిగాయి. అవి రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, వెర్బల్‌ లాజిక్‌. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌పై పట్టు ఉన్నవారు ఇందులో పైచేయి సాధించేలా ఉంది.
రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ తరువాత, వరుసగా పారా జంబుల్స్‌, పేరా సమ్మరీ తదితర అంశాలకు ఒకింత ప్రాధాన్యం దక్కింది. గ్రామర్‌, పదసంపద (ఒకాబులరీ)పై ప్రశ్నలు రాకపోవడం చాలామంది చెప్పిన స్పష్టమైన మార్పు. ప్రశ్నపత్రంలో కొన్ని చాయిస్‌ లేని ప్రశ్నలు వచ్చాయి. ఇవి చాలా కఠినంగా ఉన్నాయని అభ్యర్థులు చెప్పారు.
చాయిస్‌ లేకపోవడం వల్లే, ఈ ప్రశ్నలను కఠినంగా ఇచ్చి ఉండవచ్చని భావించవచ్చు. అయితే బాగా సాధన చేసినవారు ఇందులో ఎక్కువ మార్కులు స్కోర్‌ చేసుకుని ఉండవచ్చు. వెర్బల్‌ ఎబిలిటీ విభాగానికి 34 ప్రశ్నలుండగా ఇందులో 24 ప్రశ్నలు రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి వచ్చాయి. అంటే ఇవి 70% ప్రశ్నలను ఆక్రమించాయి. 500 పదాలతో కూడిన రెండు ప్యాసేజీలు వచ్చాయి. వీటిలో ఒక్కోదాని నుంచి 3 ప్రశ్నల చొప్పున మొత్తం ఆరు ప్రశ్నలు వచ్చాయి. ప్యాసేజ్‌ నిడివి తక్కువగా ఉన్నా, ఇచ్చిన అంశం, ఏ మేరకు అవగాహన అభ్యర్థులు చేసుకున్నారన్న కోణంలో ప్రశ్నలు వచ్చాయి. మరో మూడు ప్యాసేజీలు ఒక్కోటి 800 పదాలతో ఉన్నాయి.
వీటిలో ఒక్కోదాని నుంచి 6 ప్రశ్నల చొప్పున మొత్తం 18 ప్రశ్నలు వచ్చాయి. ప్యాసేజీల్లో గతంలో ఒకాబులరీ ప్రశ్నలు ఉండేవి, ఇవి ఈ దఫా కనిపించకపోవడం, ఎంతమేరకు ప్యాసేజీ అర్థం చేసుకున్నారన్న కోణం చుట్టే ప్రశ్నలు తిరిగాయి. మొత్తంగా బాగా సాధన చేసిన అభ్యర్థి తేలికగా 30 ప్రశ్నలవరకు సమాధానం గుర్తించేలా ప్రశ్నపత్రం ఉంది.
ప్రాథమిక అంశాలపై బాగా పట్టు ఉండి, అంతగా సాధన చేయనివారికి ఇది అంతగా మేలు చేయలేదు. సగటు సామర్థ్యం ఆధారంగా పరిశీలిస్తే, 25- 30 ప్రశ్నలమేరకు చాలామంది సమాధానం గుర్తించారు. ఇందులో 90% సరైన సమాధానాలు సరైనవైతే బహుశా 95 పర్సంటైల్‌ రావచ్చన్నది ఎక్కువమంది అభ్యర్థులు వ్యక్తం చేసిన అభిప్రాయం.
సంక్షిప్తంగా...
* మొత్తంగా క్యాట్‌ 2015 ప్రశ్నలస్థాయిని బట్టి చూస్తే, మధ్యస్థం నుంచి కఠినంగా ఉన్నాయని విశ్లేషించవచ్చు.
* ప్రాథమిక అంశాలపై పట్టుతోపాటు విశ్లేషణ సామర్థ్యముండి, ఎక్కువగా సాధన చేసినవారై మంచి పర్సంటైల్‌ సాధించేలా ప్రశ్నపత్రం ఉందన్నది ఎక్కువమంది అభిప్రాయం.
* 70కి పైగా ప్రశ్నలకు సమాధానాలు, 90% కచ్చితత్వంతో గుర్తించినవారు మంచి పర్సంటైల్‌ ఆశించవచ్చు.
* మల్టిపుల్‌ చాయిస్‌ లేని ప్రశ్నలకు రుణాత్మక మార్కులు లేకపోవడం అభ్యర్థులందరికీ లాభించే అంశం. వీటిని అటెంప్ట్‌ చేసిన అభ్యర్థులు మంచి స్కోరు దిశగా వెళ్లవచ్చు.
* నోటిఫికేషన్‌లో పేర్కొన్న కొత్త అంశాలకు తోడుగా, క్రమం తప్పకుండా ప్రశ్నలు వస్తున్న ఎన్నో అంశాలకు సంబంధించిన ప్రశ్నలు లేకపోవడం చాలామంది అభ్యర్థులకు ఆశ్చర్యం కలిగించింది.
కఠినంగా డేటా ఇంటర్‌ప్రిటేషన్‌
వెర్బల్‌ ఎబిలిటీ తర్వాత వచ్చిన ఈ విభాగంలో ప్రశ్నల స్థాయి కఠినంగా ఉందని చాలామంది చెప్పారు. మొత్తం 32 ప్రశ్నలు రాగా, 16 ప్రశ్నలు డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి, 16 ప్రశ్నలు లాజికల్‌ రీజనింగ్‌ నుంచి వచ్చాయి. అంటే రెండింటికీ సమ ప్రాధాన్యం ఇచ్చారన్నది అర్థమవుతుంది. ప్రతిదానిలో చాయిస్‌లేని ప్రశ్నలు నాలుగున్నాయి. ఓవరాల్‌ పర్సంటైల్‌ను ప్రభావితం చేసేలా ఈ విభాగముందన్నది ఎక్కువమంది అభిప్రాయం.
ఇంతకుముందు సెక్షన్‌లో (వెర్బల్‌ ఎబిలిటీ), ప్రాథమిక అంశాలపై పట్టు లేకపోయినా సాధన బాగా ఉన్నవారికి అనుకూలంగా ఉన్నా ఈ విభాగం మాత్రం ప్రాథమిక అంశాలపై పట్టు, సాధన బాగా చేసినవారికి మాత్రమే స్కోరు వచ్చేలా ఉంది. దత్తాంశాలను విశ్లేషించేలా ప్రశ్నలు రూపొందాయి. దీంతో ప్రశ్నలకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది. ఈ విభాగంలో 14 నుంచి 16 ప్రశ్నల మేరకు చేయగలిగామని చాలామంది చెప్పడం చూస్తే ఎంత కఠినంగా ఉందో వూహించవచ్చు.
లాజికల్‌ రీజనింగ్‌లోనూ ప్రశ్నలు చాలా కఠినంగా వచ్చాయి. గ్రూప్స్‌ అరేంజ్‌మెంట్‌ ప్రశ్నలు ఎక్కువగా ఉండడంతో వాటి విశ్లేషణకు ఎక్కువ సమయం పట్టిందని, దీంతో తక్కువ ప్రశ్నలు రాసినట్లు అభ్యర్థులు చెప్పడం బట్టి చూస్తే, ఓవరాల్‌ పర్సంటైల్‌ను ఈ విభాగం ప్రభావితం చేస్తుందని అనుకోవచ్చు.
డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ విభాగంలో ప్రశ్నల స్థాయి కఠినంగా ఉంది. మొత్తం 32 ప్రశ్నలు రాగా, 16 ప్రశ్నలు డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి, 16 ప్రశ్నలు లాజికల్‌ రీజనింగ్‌ నుంచి వచ్చాయి. అంటే రెంటికీ సమ ప్రాధాన్యం. ప్రతిదానిలో చాయిస్‌లేని ప్రశ్నలు నాలుగున్నాయి. ఓవరాల్‌ పర్సంటైల్‌ను ప్రభావితం చేసేలా ఈ విభాగముందన్నది ఎక్కువమంది అభిప్రాయం.
సులభంగానే క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌
ప్రాథమిక అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఈ విభాగానికి ఇచ్చారనేది ఎక్కువమంది అభ్యర్థులు వ్యక్తం చేసిన అభిప్రాయం. గత క్యాట్‌ పరీక్షలతో పోలిస్తే, కొంతమేర ఈ ఏడాది ప్రశ్నలు ఈ విభాగానికి సంబంధించిన మేరకు సులభంగానే వచ్చాయి. చాయిస్‌లేని ప్రశ్నలు తొలి స్లాట్‌లో కేవలం 10 రాగా, రెండో స్లాట్‌లో ఏకంగా 15 వచ్చాయి. అలాగే, నంబర్‌ సిస్టమ్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తూ ఉండే ఒరవడి కొనసాగగా, ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఈ అంశం నుంచి ప్రశ్నల సంఖ్య తగ్గిందని చాలామంది పేర్కొన్నారు.
అరిథ్‌మెటిక్‌, ఆల్జీబ్రాలు ఈ విభాగంలో ప్రాధాన్యం దక్కించుకున్నాయి. ఈ రెండు అంశాల నుంచే 20 ప్రశ్నల వరకు వచ్చాయంటే వీటికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని తెలుసుకోవచ్చు. కేవలం షార్ట్‌కట్‌లపై ఆధారపడినవారికి అంతగా ప్రయోజనముండదు. అంటే ప్రాథమిక అంశాల కోణంలో ప్రశ్నలు ఉన్నాయని విశ్లేషించవచ్చు. వీటిపై పట్టుతోపాటు బాగా సాధన చేసినవారు 30 ప్రశ్నలవరకు సమాధానాలు గుర్తించగలిగారు.Published on 07-12-2015
 
© Ushodaya Enterprises Private Limited 2015