క్యాట్‌లో ఏమేం మార్పులు?

ఐఐఎంతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌)లో ఈ ఏడాది భారీ మార్పులను చేశారు. ప్రశ్నల సంఖ్యలో, పరీక్ష వ్యవధిలో కూడా మార్పు వచ్చింది. వాటి గురించి సవివరంగా చూద్దాం!
క్యాట్‌ మార్పులను 2014తో పోల్చకుండా 2009 నుంచి పరిశీలిస్తే స్పష్టమైన అవగాహన వస్తుంది. 2009లో క్యాట్‌ ఆన్‌లైన్‌గా మారింది. 2009, 2010 సంవత్సరాల్లో ఒకే తీరులో, 2011 నుంచి 2013 వరకు ఒకే తరహా విధానాన్నీ కొనసాగించారు.
రెండు విభాగాలు, ఒక్కో విభాగానికి 30 చొప్పున 60 ప్రశ్నలు. 2014లో ప్రశ్నల సంఖ్య 100కు పెరిగింది. 2014లో రెండు రోజుల్లో పరీక్షను నిర్వహించారు. తాజాగా ఒకే రోజులో పరీక్ష పూర్తి చేయడానికి వీలుగా పరీక్షకేంద్రాల సంఖ్యను పెంచారు. తదనుగుణంగా నగరాల సంఖ్యను కూడా భారీగా పెంచారు.
* గతంలో అత్యధిక ప్రాధాన్యమున్న క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు ఈసారి ప్రాధాన్యం తగ్గింది. గణితం, ఇంజినీరింగ్‌ నేపథ్యమున్న విద్యార్థులతో సమానంగా ఆర్ట్స్‌ విద్యార్థులు పోటీ పడడానికి వీలుగా ఈ మార్పు చేసి ఉండొచ్చు.
* ఇంగ్లిష్‌కు ప్రాధాన్యం పెరిగింది. ప్రపంచీకరణ నేపథ్యంలో మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు అంతర్జాతీయంగా రాణించడానికి ఆంగ్లానికి ప్రాధాన్యమిచ్చి ఉండవచ్చు.
2009, 2010 సంవత్సరాల్లో 150 నిమిషాల్లో పరీక్ష ఉండేది, 2011 నుంచి 2013 వరకు 140 నిమిషాలకు తగ్గించారు. 2014లో 170 నిమిషాలు చేశారు. అదే ఏడాది ప్రశ్నల సంఖ్య 100కు పెరిగింది. అలాగే 2009 నుంచి 2013 వరకు సెక్షన్ల వారీగా సమయ కేటాయింపులు ఉండేవి. 2014లో ఆ విధానాన్ని తొలగించి, మళ్లీ ఈ ఏడాది ప్రవేశపెట్టారు. 2014లో 170 నిమిషాల వ్యవధి ఉన్న పరీక్షకు ప్రస్తుతం 180 నిమిషాలు కేటాయించారు. గతంలో రెండు సెక్షన్లు ఉండేవి, ప్రస్తుతం మూడు సెక్షన్లుగా మార్చారు. ప్రతి సెక్షన్‌కు 60 నిమిషాలు కేటాయించారు. ఈ కేటాయింపు కోసమే 10 నిమిషాలు పెంచారని విశ్లేషించవచ్చు. ప్రశ్నల సంఖ్యలో మార్పు లేకపోవడం వల్ల ప్రశ్నల క్లిష్టత పెరిగే అవకాశముంది.
గతంలో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌, వెర్బల్‌ ఎబిలిటీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ల నుంచి ప్రశ్నలు అడిగేవారు. ఇవి రెండు సెక్షన్లుగా ఉండేవి. మొదటి సెక్షన్‌లో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ ఉండగా, రెండో సెక్షన్‌లో లాజికల్‌ రీజనింగ్‌, వెర్బల్‌ ఎబిలిటీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లు ఉండేవి. గతంలో అన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహావే. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ల నుంచి 50 ప్రశ్నలు వచ్చేవి. అయితే ఏ అంశం నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయన్న స్పష్టత ఉండేది కాదు.
ప్రస్తుత విధానంలో ఈ తరహా స్పష్టత వచ్చింది. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి వచ్చే ప్రశ్నల సంఖ్యను పేర్కొన్నారు. అంటే ఈ దఫా విద్యార్థులకు ప్రణాళికలో మరింత అనుకూలత ఉంది. లాజికల్‌ రీజనింగ్‌, వెర్బల్‌ ఎబిలిటీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లు ఒక సెక్షన్‌గా గతంలో ఉండేవి. ఈ మూడింటిలో నుంచి 50 ప్రశ్నలు వచ్చేవి. ఏ అంశం నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయన్న విషయంలో పరీక్షకు సిద్ధం అయ్యేటపుడు సందిగ్ధత ఉండేది. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ను క్లిష్టంగా భావించే వాళ్లు, ఎన్ని ప్రశ్నలు వస్తాయన్నది ఇదమిత్థంగా తెలియకపోవడంతో సన్నద్ధతలో ఇబ్బందులు ఉండేవి.
సెక్షన్లవారీగా తాజా మార్పులు పరిశీలిస్తే... మూడు సెక్షన్లను పేర్కొన్నారు.
* మొదటి సెక్షన్‌లో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి ప్రశ్నలడుగుతారు. ఇందులో అరిథ్‌మెటిక్‌, జామెట్రీ, ఆల్జీబ్రా, నెంబర్‌ సిస్టమ్‌లు ఉంటాయి. ఈ విభాగం నుంచి 34 ప్రశ్నలు వస్తాయి.
* రెండో సెక్షన్‌లో లాజికల్‌ రీజనింగ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అంశాలను పేర్కొన్నారు. డేటా సఫిషియన్సీ కూడా ఇందులో భాగంగా ఉంది. ఈ సెక్షన్‌లో 32 ప్రశ్నలుంటాయి. అయితే ఎందులోంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయన్న విషయంపై నోటిఫికేషన్‌లో స్పష్టత లేదు.
* మూడో సెక్షన్‌లో వెర్బల్‌, రీడింగ్‌ కాంప్రహెన్షన్లు కలిసి ఉంటాయి. ఇందులో రీడింగ్‌కాంప్రహెన్షన్‌, గ్రామర్‌ ఆధారిత ప్రశ్నల (క్లోజ్‌టెస్ట్‌, ఒకాబులరీ, సెంటెన్స్‌ కరెక్షన్‌, ప్యారా జంబుల్స్‌, క్రిటికల్‌ రీజనింగ్‌) అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందులో కూడా మొత్తం 34 ప్రశ్నలుంటాయి.
తొలి సెక్షన్‌లో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఒక్కటే పేర్కొని, 34 ప్రశ్నలు ఇస్తారన్న స్పష్టత ఉంది. రెండు, మూడు సెక్షన్లలో ఒకటి కంటే ఎక్కువ అంశాలను పేర్కొని ప్రశ్నలను ఇచ్చినా ఒక్కో అంశం నుంచి ఎన్ని ఇస్తారన్న స్పష్టత లేదు. కాబట్టి తొలి సెక్షన్‌పై వ్యూహం పక్కాగా ఉండి, మిగతా అంశాల్లోనూ సమాన ప్రాధాన్యమిస్తూ సిద్ధం కావాల్సివుంటుంది.
ఈ దఫా క్యాట్‌లో అతిపెద్ద మార్పుగా పరిగణించదగ్గది, డిస్క్రిప్టివ్‌ పద్ధతి. విద్యార్థుల విషయ అవగాహన ఎంతమేరకు ఉందన్న అంశాన్ని పరిశీలించడానికి ఈ విధానాన్ని ప్రవేశపెట్టి ఉండవచ్చు. కేవలం ఆబ్జెక్టివ్‌ అయితే సమాధానం రాబట్టడం కోసం ఏ వ్యూహం అనుసరించాడన్నది సంబంధం లేదు, సరైందా కాదా అన్నది మాత్రమే కీలకం. ప్రస్తుతం అది కుదరదు. అభ్యర్థుల విషయ అవగాహనను తెలుసుకునే వీలుంది.
రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, చాలామందికి క్లిష్టంగా ఉండే అంశం. 2014లో సెక్షన్లవారీగా సమయ నిబంధనలు లేనందువల్ల ఎక్కువ సమయం ఆ విభాగానికి అధిక ప్రాధాన్యమిచ్చే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం అలా వీలుకాదు. ప్రస్తుత విధానంలో సెక్షన్లవారీగా సమయ ప్రణాళిక వేసుకోవాల్సి ఉంటుంది.
2013లో 40 పట్టణాల్లో 76 పరీక్ష కేంద్రాల్లో క్యాట్‌ నిర్వహించారు. సుమారు 20 రోజులపాటు ఈ పరీక్షలు కొనసాగాయి. 2014లో ఈ రోజుల సంఖ్యను కుదించి కేవలం రెండు రోజుల్లో నిర్వహించారు. నవంబర్‌ 16, 22 రోజుల్లో ఇవి జరిగాయి. పట్టణాల సంఖ్య 99కి పెరిగింది. 354 పరీక్షకేంద్రాలుండేవి.
2015లో తొలిసారిగా ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. 136 పట్టణాల్లో 650 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. గతంలో అభ్యర్థులు ఏవైనా పరీక్ష జరిగే మూడు పట్టణాలను 'ఆర్డర్‌ ఆఫ్‌ ప్రిఫరెన్స్‌' రూపంలో ఎంపిక చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు నాలుగు పట్టణాలను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు.
క్యాట్‌ దరఖాస్తుకు సమయం తగ్గింది. 2014లో ఆగస్టు 6 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ఉంది. అంటే దరఖాస్తుకు 56 రోజుల సమయం ఉంది. ఆన్‌లైన్‌లో కాకుండా ఫీజు చెల్లింపు ఆఫ్‌లైన్‌ చెల్లించడానికి వీలు కల్పించారు. తాజా నోటిఫికేషన్‌లో దరఖాస్తుకు పది రోజులు తగ్గించారు. అంటే 46 రోజుల సమయం మాత్రమే ఉంది. ఆగస్టు 6 నుంచి సెప్టెంబర్‌ 20లోపు దరఖాస్తు పూర్తిచేసుకోవాలి. మొత్తం ఫీజును (రూ.1600) ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ఆఫ్‌లైన్‌ చెల్లించే అవకాశాన్ని తొలగించారు.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు ఈసారి ప్రాధాన్యం తగ్గింది. గణితం, ఇంజినీరింగ్‌ విద్యార్థులతో సమానంగా ఆర్ట్స్‌ విద్యార్థులు పోటీ పడడానికి వీలుగా ఈ మార్పు చేసి ఉండొచ్చు.
ప్రపంచీకరణ నేపథ్యంలో మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు అంతర్జాతీయంగా రాణించడానికి వీలుగా ఆంగ్లానికి ప్రాధాన్యం లభించింది.
2014లో 170 నిమిషాల వ్యవధి ఉన్న పరీక్షకు ప్రస్తుతం 180 నిమిషాలు కేటాయించారు. ప్రశ్నల సంఖ్యలో మార్పు లేకపోవడం వల్ల ప్రశ్నల క్లిష్టత పెరిగే అవకాశముంది.
* ఈసారి క్యాట్‌ నవంబర్‌ 29న జరగనుంది. పరీక్ష ఒకే రోజులో పూర్తిచేయనున్నారు. గతంలో సాధారణంగా అక్టోబర్‌లో నిర్వహించేవాళ్లు. 2014లో నవంబర్‌లో నిర్వహించారు. ప్రస్తుతం నవంబర్‌ చివరకు వెళ్లింది. అంటే అభ్యర్థులకు సన్నద్ధతకు ఒక నెల వ్యవధి అందుబాటులోకి వచ్చింది.
* 2015లో 'ఆన్‌స్క్రీన్‌' క్యాలిక్యులేటర్‌ వాడుకునే వీలు కల్పించారు. ఇంతకు ముందు ఎన్నడూ క్యాట్‌లో ఈ అవకాశం లేదు. ఇది తొలిసారి ప్రవేశ పెట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షకేంద్రాలు: కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం.

Posted on 08.08.2015

Ushodaya Enterprises Private Limited 2015