CAT

క్యాట్‌ మ్యావ్‌ అన్నా..

* ఇంకా ఉన్నాయి అవకాశాలు!

మేనేజ్‌మెంట్‌ విద్యకు జాతీయస్థాయిలో అత్యున్నత పరీక్ష క్యాట్‌ ఇటీవల ముగిసింది. ఏ కారణాల వల్ల అయినా అందులో సరిగా రాణించలేకపోతే రాబోయే రోజుల్లో మరికొన్ని పరీక్షలు జరగనున్నాయి. వాటిలో మంచి ర్యాంకు సాధిస్తే ప్రసిద్ధ బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశం పొందవచ్చు.

మేనేజ్‌మెంట్‌ విద్యలో పీజీ చేయాలనుకునే వారికి ముందుగా గుర్తుకు వచ్చేది క్యాట్‌ (కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌). ఐఐఎంల్లో ఎంబీఏకి ఈ స్కోరునే పరిగణనలోకి తీసుకుంటారు. గత నెల 25న ఈ పరీక్ష జరిగింది. క్యాట్‌ సరిగా రాయలేకపోతే మంచి సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ పీజీ చేయాలనే కల కరిగిపోయినట్లు కాదు. త్వరలో జరగబోయే మరిన్ని ప్రవేశ పరీక్షలతో దేశవ్యాప్తంగా ఉన్న పలు ఉన్నతస్థాయి విద్యాసంస్థల్లో కోర్సుల్లో చేరవచ్చు.

జేవియర్స్‌ ఆప్టిట్యూట్‌ టెస్ట్‌
క్యాట్‌ తర్వాత అత్యంత ఆదరణ పొందిన ఎంబీఏ ప్రవేశ పరీక్షగా ఎక్స్‌ఏటీకి గుర్తింపు ఉంది. ఏటా 90 వేలకు పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారు. జంషెడ్‌పూర్‌, బెంగళూరు, భువనేశ్వర్‌లలోని జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ పరిధిలోని ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ వంటి ప్రఖ్యాత సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ విద్యను అభ్యసించడానికి ఎక్స్‌ఏటీ రాయాల్సి ఉంటుంది. ఇందులో సాధించిన స్కోరుతో దేశవ్యాప్తంగా 150కి పైగా బిజినెస్‌ స్కూళ్లలో అడ్మిషన్‌ పొందవచ్చు. ఈ పరీక్షలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. మొదటిది వెర్బల్‌ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీ. రెండోది డెసిషన్‌ మేకింగ్‌. మూడోది క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌. ఈ మూడు సెక్షన్ల నుంచి 74 ప్రశ్నలు వస్తాయి. నాలుగో సెక్షన్‌ అయిన జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు, తప్పు ప్రశ్నకు ఒక మార్కులో నాలుగో వంతు నెగెటివ్‌ మార్కు ఉంటుంది. కనీసం ప్రయత్నించకుండా వదిలేసిన ప్రశ్నలు ఎనిమిది దాటితే 0.05 నెగెటివ్‌ మార్కు ఉంటుంది. అందుకే అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్‌ 7, 2018 (ఆలస్య రుసుంతో). జనవరి 6న పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలను జనవరి చివరి వారంలో విడుదల చేస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ఆన్‌లైన్‌ విధానంలో ఉంటుంది. ‌
www.xatonline.in

టిస్‌నెట్‌ - ఎంబీఏ
టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టీఐఎస్‌ఎస్‌) పరిధిలోని స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ లేబర్‌ స్టడీస్‌ పీజీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి టిస్‌ నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టిస్‌నెట్‌)ను నిర్వహిస్తున్నారు. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి.
మెదటిది 30 మార్కులకు ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ. రెండోది లాజికల్‌ రీజనింగ్‌. మూడోది జనరల్‌ అవేర్‌నెస్‌. చివరి రెండు సెక్షన్లు 40 మార్కులకు ఉంటాయి. మొత్తం వంద మార్కులకు వంద ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్‌ మార్కు లేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ డిసెంబర్‌ 10, 2018. పోస్టు ద్వారా దరఖాస్తును డిసెంబర్‌ 12, 2018 లోపు సంబంధిత కార్యాలయానికి చేరవేయాలి. పరీక్ష తేదీ జనవరి 13, 2019. ఒక గంట 40 నిమిషాలు పరీక్ష వ్యవధి. పరీక్ష స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను కోర్సులోకి తీసుకుంటారు.
www.tiss.edu

కామన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌
కామన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (సీఎంఏటీ - 2019)ను ఈ సంవత్సరం నుంచి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. సుమారు 500కు పైగా బీ స్కూల్స్‌ ఈస్కోరును అడ్మిషన్లకు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. బిట్స్‌ మెస్రా, రాంచీలు; పుణే యూనివర్సిటీ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (పీయూఎంబీఏడీఎంఎస్‌); గోవా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌; కేజే సోమయ్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ -ముంబయి తదితర ప్రసిద్ధ బిజినెస్‌ స్కూళ్లు సీమ్యాట్‌ స్కోరుతో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఈ పరీక్షలో నాలుగు సెక్షన్లు ఉంటాయి.

1) లాజికల్‌ రీజనింగ్‌,
2) లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌
3) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌
4) జనరల్‌ అవేర్‌నెస్‌.

ప్రతి సెక్షన్‌ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు నాలుగు మార్కులు. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి ఒక మార్కులో నాలుగోవంతు కోత ఉంటుంది. సెక్షనల్‌ కటాఫ్‌ పద్ధతి లేదు. మూడు గంటల వ్యవధితో 400 మార్కులకు పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో ఉంటుంది. సెక్షనల్‌ కటాఫ్‌ లేదు కాబట్టి విద్యార్థి ఆసక్తి మేరకు ఏదైనా మూడు సెక్షన్లపై పట్టు సాధిస్తే మంచి పర్సంటైల్‌ తెచ్చుకోవచ్చు. బేసిక్‌ మేథమేటిక్స్‌ (అరిథ్‌మెటిక్‌)కి సంబంధించి 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న అధ్యాయాలపై పట్టు సాధించాలి. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్‌ 7. పరీక్ష జనవరి 28, 2019న రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. 2019 ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడిస్తారు.
www.aicte-cmat.in

ఐఆర్‌ఎంఏ ఎస్‌ఏటీ
ప్రతిష్ఠాత్మక ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌-ఆనంద్‌ (ఐఆర్‌ఎంఏ)లో పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఆర్‌ఎం) కోర్సును అభ్యసించడానికి ఐఆర్‌ఎంఏ సోషల్‌ అవేర్‌నెస్‌ టెస్ట్‌ (ఎస్‌ఏటీ)కి హాజరు కావాల్సి ఉంటుంది. క్యాట్‌, ఎక్స్‌ఏటీ స్కోర్ల ఆధారంగా కూడా ఈ కోర్సులోకి ప్రవేశం కల్పిస్తారు. షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులకు ఐఆర్‌ఎంఏఎస్‌ఏటీ గ్రూప్‌ యాక్టివిటీ, పర్సనల్‌ ఇంటర్వ్యూలు ఒకే రోజు ఉంటాయి. ఈ పరీక్షలో అభ్యర్థి సామాజిక స్పృహ, జనరల్‌ అవేర్‌నెస్‌లను అంచనా వేస్తారు. ముఖ్యంగా వ్యవసాయం, విద్య, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ, ఎన్వైరాన్‌మెంట్‌, ఎంప్లాయిమెంట్‌ అండ్‌ లిటరసీ, మానవ హక్కులు, జనాభా (గ్రామీణ, పట్టణ), ఎకానమీ, ఆరోగ్య సమస్యలు వంటి వాటిపై ప్రశ్నలు వస్తాయి. క్యాట్‌/ఎక్స్‌ఏటీ స్కోరు లేదా ఐఆర్‌ఎంఏఎస్‌ఏటీ స్కోరు, పర్సనల్‌ ఇంటర్వ్యూ, గ్రూప్‌ యాక్టివిటీలు, వైవిధ్య ప్రొఫైల్స్‌ ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ను విడుదల చేస్తారు. వంద మార్కులకు ఇర్మాసాట్‌ ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ 31 డిసెంబర్‌, 2018. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్‌ యాక్టివిటీ ఫిబ్రవరి రెండు, మూడు వారాల్లో జరుగుతాయి. మార్చి మొదటి వారంలో ఫలితాలను వెల్లడిస్తారు. రూరల్‌ మేనేజ్‌మెంట్‌ పట్ల ఆసక్తి ఉన్నవారికి ఇది తగిన కోర్సు.
www.irma.ac.in

ఐబీఎస్‌ఏటీ
ఇక్ఫాయ్‌ (ఐసీఎఫ్‌ఏఐ) బిజినెస్‌ స్కూల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ను ఇక్ఫాయ్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తుంది. అహ్మదాబాద్‌, పుణే, హైదరాబాద్‌, బెంగళూరు, గుర్‌గ్రామ్‌, జైపూర్‌, ముంబయి, కోల్‌కతా, డెహ్రాడూన్‌లలో ఈ సంస్థ క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిల్లో ఎంబీఏ చదవడానికి ఈ పరీక్షకు హాజరు కావాలి. ఆన్‌లైన్‌ విధానంలో రెండు గంటల వ్యవధితో ఈ పరీక్ష జరుగుతుంది. వెర్బల్‌ ఎబిలిటీ, డేటా అడిక్వసీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, రీడింగ్‌ కాంప్రెహెన్షన్‌, క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ విభాగాల నుంచి మొత్తం 140 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు. గ్రూప్‌ డిస్కషన్‌, మౌఖిక పరీక్ష ద్వారా అభ్యర్థులకు అడ్మిషన్‌ ఇస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్‌ 12, 2018. డిసెంబర్‌ 22న మొదటి షిఫ్ట్‌, డిసెంబర్‌ 23న రెండో షిఫ్ట్‌ పరీక్ష జరుగుతుంది. సీట్ల కేటాయింపు తదితరాలు మార్చి, 2019లో నిర్వహిస్తారు.
www.ibsindia.org

ఇతర పరీక్షలు
ఈ పరీక్షలే కాకుండా గీతం యూనివర్సిటీ నిర్వహించే ఆన్‌లైన్‌ టెస్ట్‌ (జీఓటీ - పీజీ) ద్వారా గీతం స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్‌నేషనల్‌ బిజినెస్‌లో అడ్మిషన్‌ పొందవచ్చు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల్లో నిర్వహించే ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఐసెట్‌) ద్వారా వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలోని కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌లో పీజీ విద్యను అభ్యసించవచ్చు.

కామన్‌ సెక్షన్లపై పట్టు పెంచాలి
ప్రతి మేనేజ్‌మెంట్‌ ప్రవేశ పరీక్షలో కామన్‌గా లాజికల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ ఉంటాయి. ప్రధానంగా వీటిపై దృష్టిపెడితే కచ్చితంగా మంచి మెరిట్‌ సాధించవచ్చు. టిస్‌, ఐఆర్‌ఎంఏల్లో సీటు సాధించాలనుకునే అభ్యర్థులు జనరల్‌ అవేర్‌నెస్‌, సమకాలీన సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలి. ఇప్పటి దాకా ప్రిపరేషన్‌ మొదలుపెట్టనివారు కనీసం రెండు సెక్షన్లపై పట్టు సాధించాలి. మిగిలిన సెక్షన్లపై కనీస పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. కోరుకున్న సీటు దక్కించుకోవాలంటే కేవలం ప్రవేశ పరీక్షల్లో మార్కులు సాధిస్తే సరిపోదు. గ్రూప్‌ డిస్కషన్‌పైనా పట్టు కలిగి ఉండాలి. ఇందుకోసం ఏదో ఒక సమకాలీన అంశంపై ఇంగ్లిష్‌లో స్నేహితులతో చర్చను ప్రాక్టీస్‌ చేయవచ్చు. మౌఖిక పరీక్షలకు కొంత సాధన చేయాల్సి ఉంటుంది. ఇందుకు వార్తా పత్రికలు చదవడం, ఇంగ్లిష్‌ న్యూస్‌ ఛానల్స్‌ చూడటం మంచిది.


- ప్రొ. బి. రాజశేఖర్‌, డీన్‌, స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ హెచ్‌.సి.యు
Posted on 04-12-2018

Quick Links