Preparation Plan

కలిపి కొట్టండి క్యాట్‌! + జీమ్యాట్‌

అత్యున్నతస్థాయి మేనేజ్‌మెంట్‌ విద్యను అందించే ఐఐఎంల్లోనూ, ఇతర ప్రఖ్యాత బి-స్కూళ్లలోనూ ప్రవేశాలు క్యాట్‌ ద్వారా లభిస్తాయి. ప్రతిభావంతులైన అభ్యర్థుల ఎంపిక కోసం ప్రశ్నల స్థాయిని పెంచి, పరీక్షను కాస్త కఠినంగానే నిర్వహిస్తారు. అయితే దశలవారీ ప్రిపరేషన్‌తో సులువుగా క్యాట్‌లో ర్యాంకు సాధించవచ్చు. అదే సన్నద్ధత జీమ్యాట్‌కు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇంజినీరింగ్‌ విద్యకు ఐఐటీలు ఎంత ప్రసిద్ధో... మేనేజ్‌మెంట్‌ విద్యలో ఐఐఎంలకు అంతటి పేరు. వీటిలో ప్రవేశించాలంటే... రాయాల్సిన పరీక్ష - కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (సీఏటీ). దీనికి ప్రకటన వెలువడింది. ప్రవేశ ప్రక్రియ తొలి దశలో రాత పరీక్ష, ఆపై గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలుంటాయి. ఈ ఏడాది నవంబర్‌ 24వ తేదీన రెండు స్లాట్లలో రాతపరీక్ష నిర్వహించనున్నారు.

కాన్సెప్టులపై పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తేనే క్యాట్‌లో మంచి స్కోరు సాధించటానికి వీలవుతుంది. ఆన్‌లైన్‌ పద్ధతిలో జరిగే ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్‌, సబ్జెక్టివ్‌ ప్రశ్నలుంటాయి. అయితే ఏటా పరీక్ష పద్ధతి మారుస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మాత్రం గత ఏడాది పద్ధతిలోనే అడిగే అవకాశం ఉంది.

వెర్బల్‌ ఎబిలిటీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌
అభ్యర్థుల పఠన సామర్థ్యం, భాషాపరిజ్ఞానం, గ్రామర్‌పై పట్టు, తార్కికంగా ఆలోచించగలిగే సామర్థ్యాన్ని ఇందులో పరిశీలిస్తారు. పాఠశాల స్థాయిలో చదివిన వ్యాకరణ అంశాలే ఇక్కడా ఉపయోగపడతాయి. ఎక్కువగా దృష్టి సారించాల్సిన అంశం- రీడింగ్‌ కాంప్రహెన్షన్‌. ఇందులో ఆర్థిక, శాస్త్ర- సాంకేతిక అంశాలకు సంబంధించిన ప్యాసేజ్‌లను ఇస్తున్నారు. 2018లో జరిగిన పరీక్షలో నాలుగు ప్యాసేజ్‌లు- ప్లాస్టిక్‌ బ్యాగ్‌ల వాడకం, ఆర్థిక రంగం తదితర అంశాలపై వచ్చాయి. అభ్యర్థులు జాతీయ, అంతర్జాతీయ ఆంగ్ల పత్రికల్లో వచ్చే ఆర్థిక-శాస్త్ర-సాంకేతిక అంశాలపై దృష్టి సారించాలి. అందులో రచయిత ఏం చెప్పదలచుకున్నాడు, ప్యాసేజ్‌ రాసిన ఉద్దేశం తదితర అంశాలను వేగంగా అర్థం చేసుకునే సామర్థ్యం పెంచుకోవాలి. దీనికి ఎలాంటి బేసిక్స్‌ అవసరం లేదు. కాబట్టి రోజుకు సాధ్యమైనన్ని ప్యాసేజ్‌లు సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ప్యాసేజ్‌లో వచ్చే కొత్త పదాలను డిక్షనరీలో చూడకుండా సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. దీంతో, పరీక్షలో కొత్త పదాలు వచ్చినా, అర్థం చేసుకునే పరిజ్ఞానం పెరుగుతుంది. అలాగే, రోజూ కొన్ని కొత్త పదాలు తెలుసుకుని వాటి సమాన, వ్యతిరేక అర్థాలు, ఆ పదంతో పదబంధాలు, నుడికారాలు, సామెతలు... ఇలా ఆ ఒక్క పదం గురించి సమగ్రంగా అధ్యయనం చేయాలి. ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో ఇవన్నీ దొరుకుతాయి.

వెర్బల్‌ ఎబిలిటీలో క్లోజ్‌ టెస్ట్‌ ముఖ్యమైంది. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ ప్రిపరేషన్‌ ఇక్కడ కూడా సరిపోతుంది. వీటికి సంబంధించిన అంశాలను నేరుగా ప్రాక్టీస్‌ చేయాలి. వీటికి బేసిక్స్‌ చదవాల్సిన అవసరం లేదు. వెర్బల్‌ ఎబిలిటీలో వచ్చే మరో అంశం సెంటెన్స్‌ కరెక్షన్‌. ఇది గ్రామర్‌ ఆధారితమైంది. వెర్బ్‌ ఉపయోగం, టెన్సెస్‌, ఆడ్‌జెక్టివ్స్‌, ఆడ్‌వర్బ్స్‌ తదితర భాషాభాగాల వాడకంపై పాఠశాల స్థాయిలోనే అభ్యర్థులు నేర్చుకొని ఉంటారు. వాటిని అన్వయించే పద్ధతిని ఇక్కడ ప్రశ్నిస్తారు. ఒక వాక్యంలో వీటిని ఉపయోగించడంలో అభ్యర్థికున్న పరిజ్ఞానం ముఖ్యం. కాబట్టి, గ్రామర్‌లో ప్రాథమిక అంశాలను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి, పరీక్ష కోణంలో అభ్యాసం చేయాలి.

క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ
ఇందులో ఆల్జీబ్రా, అరిథ్‌మెటిక్‌, జామెట్రీ, నంబర్‌ సిస్టమ్‌, ప్రాబబిలిటీ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. నిజానికి ఇది మూడో సెక్షన్‌. అభ్యర్థులు సెక్షన్‌-1కు సంబంధించి నేరుగా పరీక్షలు రాయాలి (ఒక్క గ్రామర్‌ అంశానికి తప్ప). అయితే, సెక్షన్‌-3గా ఉన్న క్వాంటిటేటివ్‌ ఎబిలిటీలో మాత్రం ముందుగా ప్రాథమిక అంశాలపై పూర్తిగా పట్టు సాధించాలి. సూత్రాలు, షార్ట్‌కట్‌ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదు. నిజానికి కాన్సెప్ట్‌ ఆధారంగానే సూత్రాలు తయారవుతాయి. ఆ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. సాధ్యమైనంత తొందరగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలి. చాప్టర్ల వారీగా పరీక్షలు రాయాలి. ముందుగా బ్యాంక్‌ స్థాయి పరీక్షలో వచ్చే ప్రశ్నలను పరిశీలిస్తే, అవి కూడా బేసిక్స్‌గా ఉపయోగపడతాయి. అయితే, క్యాట్‌ పరీక్షలో క్లిష్టత ఎక్కువ ఉంటుంది. కాబట్టి 10 నుంచి 15 రోజుల్లో బేసిక్స్‌ను పూర్తి చేసి అభ్యర్థులు క్యాట్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ పరీక్షలను సాధన చేయాలి.
గత ఏడాది జరిగిన పరీక్షలో ఈ సెక్షన్‌లో గరిష్ఠంగా 12 నాన్‌-ఎంసీక్యూ (సబ్జెక్టివ్‌) ప్రశ్నలు అడిగారు. కాబట్టి, ఆబ్జెక్టివ్‌ అంశాలనే సబ్జెక్టివ్‌గా అన్వయించుకుంటూ సాధన చేయడం మంచిది. కిందటిసారి అరిథ్‌మెటిక్‌ నుంచి గరిష్ఠ స్థాయిలో ప్రశ్నలు వచ్చాయి. ఇవి సుమారు 14 ఉన్నాయి. (స్లాట్‌-1) అయితే ప్రతిసారీ అలాగే జరుగుతుందని చెప్పలేం. 2018లో రెండు స్లాట్లలోనూ నంబర్‌ సిస్టమ్‌లపైన కేవలం 4 ప్రశ్నలే ఇచ్చారు. అలాగని ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఇందులో వేగంగా సూక్ష్మీకరించే పద్ధతి వస్తే, వేగంగా జవాబును గుర్తించే వీలు ఉంది.

డాటా ఇంటర్‌ప్రిటేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌
మూడో సెక్షన్‌లో భాగంగా సిద్ధమైన అరిథ్‌మెటిక్‌ డాటా ఇంటర్‌ప్రిటేషన్‌కు ఆధారంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి అభ్యర్థులు నేరుగా ప్రాక్టీస్‌ ప్రశ్నలు చేయడం మొదలుపెట్టాలి. సరాసరి (యావరేజ్‌), శాతాలు (పర్సంటేజీలు), నిష్పత్తి-అనుపాతాలు (రేషియో అండ్‌ ప్రపోర్షన్‌) తదితర అంశాలు ఇక్కడ ఉపయోగపడతాయి. ఇందులో పైచార్ట్‌లు, సెట్‌ థియరీకి సంబంధించిన ప్రశ్నలు, గ్రాఫ్‌ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. విశ్లేషణ సామర్థ్యం ప్రధానం. నేరుగా పాత పరీక్ష పత్రాలు పరిశీలించడం ద్వారా ఈ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
లాజికల్‌ రీజనింగ్‌లో భాగంగా అరేంజ్‌మెంట్స్‌/ ర్యాంకింగ్స్‌/ టీం ఫార్మేషన్‌, పజిల్స్‌, సిలాజిజం, వెన్‌ డయాగ్రాం తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటికి కూడా బేసిక్స్‌ అంటూ ఉండవు. గత ప్రశ్న పత్రాలను పరిశీలించి నేరుగా ప్రశ్నలను సాధన చేయడమే మార్గం. ప్రశ్నలు కఠినంగా అనిపిస్తే బ్యాంకు స్థాయి పరీక్షల్లో వచ్చిన పరీక్షల ప్రశ్నలను మొదట ప్రాక్టీస్‌ చేయాలి. అవి ప్రాథమిక అంశాలుగా ఉపయోగపడతాయి. అయితే, క్యాట్‌ పరీక్షల్లో కఠినతా స్థాయిని బట్టి ఎక్కువగా వాటిని సాధన చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
కనీసం 15 నుంచి 25 రోజులు ప్రాథమిక స్థాయి ప్రశ్నల ప్రాక్టీస్‌కు వెచ్చించాలి. ఆ తర్వాత నేరుగా పూర్తిస్థాయి క్యాట్‌ మాక్‌ పరీక్షలకు సిద్ధం కావాలి. ఎప్పటికప్పుడు స్కోర్‌ పరిశీలించుకుంటూ, తరచూ తప్పులు చేస్తున్న విభాగాలకు సంబంధించిన వాటిని మరోసారి సరిచూసుకోవాలి.

మాక్‌ పరీక్షలు ముఖ్యం
* కఠినమైన క్యాట్‌ను సులువుగా మార్చుకోవటానికి సాధ్యమైనన్ని నమూనా (మాక్‌) పరీక్షలు రాయాలి.
* బేసిక్స్‌కు ఎక్కువ సమయం కేటాయించకూడదు. గ్రామర్‌, అరిథ్‌మెటిక్‌లకు సంబంధించి ప్రాథమికాంశాలను మాత్రమే పరిశీలించాలి. మిగతావాటికి నేరుగా పరీక్షలు ప్రాక్టీస్‌ చేస్తూ ప్రిపరేషన్‌ సాగించాలి.
* రోజూ పదసంపద (వొకాబులరీ) పెంచుకోవాలి. కేవలం ఒక పదానికి సూచన, వ్యతిరేక అర్థాలను ఎలా ఉపయోగిస్తారో పరిశీలించి ఆపేయకుండా, ఆ పదాన్ని భిన్న భాషాభాగాలుగా ఎలా ఉపయోగించవచ్చో చూడాలి. అలాగే ఆ పదానికి సంబంధించి సామెతలు, నుడికారాలు ఉంటే వాటి వాడకం తీరు, అర్థం తెలుసుకోవాలి.
* ప్రతి సెక్షన్‌కు 60 నిమిషాలు కేటాయిస్తారు. ఈ సమయంలో మరో సెక్షన్‌కు వెళ్లేందుకు వీలు ఉండదు.
* క్యాట్‌ను దేశవ్యాప్తంగా 156 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌తోపాటు కరీంనగర్‌, వరంగల్‌ల్లో పరీక్ష కేంద్రాలున్నాయి.ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు, విశాఖపట్టణం, కర్నూల్‌, విజయవాడ, నెల్లూరు తదితర జిల్లాల్లో పరీక్ష కేంద్రాలున్నాయి.

క్యాట్‌ సన్నద్ధత జీ మ్యాట్‌కూ ఉపయోగం
విదేశాల్లో మేనేజ్‌మెంట్‌ విద్యను చదవడానికి రాయాల్సిన పరీక్ష జీమ్యాట్‌. దీని రిజిస్ట్రేషన్‌ను సంవత్సరంలో ఎప్పుడయినా చేసుకోవచ్చు. ఇది అభ్యర్థుల విశ్లేషణ, రాత, తార్కిక, గణిత సామర్థ్యాలను పరీక్షిస్తుంది..‘క్యాట్‌’కు సిద్ధమయ్యే అభ్యర్థులు దాదాపుగా జీ మ్యాట్‌కు కూడా సిద్ధమయినట్లే. రెండు పరీక్షలకూ ఉమ్మడిగా ఉన్న అంశాలు- వెర్బల్‌ రీజనింగ్‌, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, క్వాంట్‌, లాజికల్‌ రీజనింగ్‌. రెండిట్లో ప్రశ్నల స్థాయి దాదాపు సమానం.
* వెర్బల్‌ రీజనింగ్‌లో భాగంగా రెండు పరీక్షల్లో ఆంగ్లాన్ని విశ్లేషణాత్మకంగా అడుగుతారు.
* జీ మ్యాట్‌లో గ్రాఫ్‌ ఆధారిత ప్రశ్నలు పెద్దగా ఉంటాయి. క్యాట్‌లో ఒకింత చిన్నగా ఉంటాయి. అయితే వేగంగా విశ్లేషించే సామర్థ్యం రెండింటికీ అవసరమే.
* రెండు పరీక్షలకూ కాన్సెప్టు కీలకం కాబట్టి క్యాట్‌ సన్నద్ధత జీమ్యాట్‌కూ ఉపయుక్తం. జీ మ్యాట్‌ అభ్యర్థులు అదనంగా అనలిటికల్‌ రైటింగ్‌ అసెస్‌మెంట్‌కు తయారవ్వాల్సివుంటుంది.

- పి. గోపాలకృష్ణ
Posted on 31-07-2019

Quick Links