క్యాట్ లో నెగ్గేదెలా!

మేనేజ్‌మెంట్ విద్యకు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సంస్థలు... ఐఐఎంలు. ప్లేస్‌మెంట్లలో లభించే వేతనాల విషయంలో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టించే ఈ సంస్థల్లో ప్రవేశం పొందాలంటే క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్)లో అత్యుత్తమ ప్రతిభ చూపాల్సిందే. మేనేజ్‌మెంట్‌ విద్యకు ప్రసిద్ధిగాంచిన ఐఐఎంలలో ప్రవేశం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. క్యాట్‌ పరీక్షలో మంచి స్కోరు సాధించడం కీలకం అయినప్పటికీ, అనేక సంస్థల్లో ప్రవేశానికి ఇదొక్కటే సరిపోదు. ఐఐఎంలు వేటికవే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు. అవసరమనుకుంటే అభ్యర్థులకు మళ్లీ రాతపరీక్షలు నిర్వహిస్తాయి. గ్రూప్‌ డిస్కషన్‌లు, ఇంటర్వ్యూలకు కొన్ని ఐఐఎంలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. మరికొన్ని సంస్థలు గత అకడమిక్‌ రికార్డు, పని అనుభవానికి పెద్దపీట వేస్తున్నాయి. విభిన్న విధానాల వల్ల అభ్యర్థుల్లో కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షలో నెగ్గాలంటే ఎలాంటి వ్యూహం అవసరం? అసలు ఐఐఎంలలో ప్రవేశ విధానం ఎలా ఉంటుంది? క్యాట్‌, అకడమిక్‌ రికార్డు, పని అనుభవం.. వీటిలో దేనికెంత వెయిటేజీ లభిస్తుంది? లాంటి సందేహాల‌కు ప‌రిష్కారాల‌ను చూద్దాం...
ఈ ఏడాది క్యాట్‌లో మార్పులు
గత క్యాట్ పరీక్షలతో పోల్చుకుంటే ఈసారి కొన్ని మార్పులు చేశారు. వాటిలో ప్రతి సెక్షన్‌లోనూ ప్రశ్నల సంఖ్యను 30 నుంచి 50కి పెంచారు. గతంలో ఉన్న పరీక్ష సమయాన్ని 140 నిమిషాల నుంచి 170 నిమిషాలకు పెంచారు. వీటితోపాటు మరికొన్ని స్వల్ప మార్పులు చేశారు.
¤ ఈ ఏడాది క్యాట్‌ను ఐఐఎం-ఇండోర్ నిర్వహిస్తుంది.
¤ మునుపటిలా కాకుండా పరీక్షను నవంబర్ 16, నవంబర్ 22 తేదీల్లో రెండు రోజులే నిర్వహించనున్నారు. గతంలో ఈ పరీక్షను 22 రోజులు నిర్వహించారు. అభ్యర్థులు ఈ వ్యవధిలో నచ్చిన స్లాట్స్ ఎంపికచేసుకుని పరీక్ష రాసేవారు. ఈసారి ప్రత్యేక స్లాట్స్‌కి అవకాశం లేనట్టే.
¤ ఈసారి పరీక్షను 99 పట్టణాల్లో నిర్వహిస్తారు. ఈ వివరాలు తర్వాత ప్రకటిస్తారు.
¤ పరీక్ష వ్యవధిని 30 నిమిషాలు పెంచారు. గతంలో 140 నిమిషాలు పరీక్ష నిర్వహించేవారు. ప్రస్తుతం దీన్ని 170 నిమిషాలకు మార్చారు. (2 గంటల 50 నిమిషాలు)
¤ ఇకపై ప్రతి సెక్షన్‌లోనూ 50 ప్రశ్నలు అడుగుతారు. గతంలో సెక్షన్‌కు 30 చొప్పున ప్రశ్నలుండేవి.
¤ పరీక్ష వ్యవధిలో అభ్యర్థులు ఒక సెక్షన్ నుంచి మరో సెక్షన్‌కు నచ్చినట్టు మారవచ్చు. వాళ్ల ఇష్ట ప్రకారం సెక్షన్లకు సమయాన్ని కేటాయించుకోవచ్చు. గతంలో ఈ సౌలభ్యం ఉండేది కాదు. ప్రతి సెక్షన్‌నూ నిర్ధేశిత వ్యవధిలోనే పూర్తిచేయాల్సి వచ్చేది.
¤ సిలబస్‌లో ఎలాంటి మార్పులూ చేయలేదు. నాలుగు సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి... క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్, వెర్బల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్.
¤ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్ట్ 6న మొదలవుతుంది. సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. రిజిస్ట్రేషన్ కోసం మొత్తం 56 రోజులు అందుబాటులో ఉంటాయి.
¤ అక్టోబర్ 16 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
¤ ఫలితాలను డిసెంబర్ మూడో వారంలో ప్రకటిస్తారు.
¤ రిజిస్ట్రేషన్ ఫీజు ఆన్‌లైన్ విధానంలోనే(నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు) చెల్లించాలి.
¤ గతంలో 45 టెస్ట్ సైట్స్ ఉండగా ప్రస్తుతం వీటిని 354కు పెంచారు.దీంతో స్లాట్స్ కోసం ఇబ్బంది పడాల్సిన బెడద తప్పినట్టే.
¤ నవంబర్ 16, నవంబర్ 22 తేదీల్లో ప్రతి రోజూ రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. అంటే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులంతా 4 సెషన్లలోనే ఈ సారి పరీక్ష రాయడం పూర్తవుతుంది.
¤ అభ్యర్థులు పరీక్ష రాయడానికి మూడు సిటీలను ఎంచుకోవాలి. అవకాశాన్ని బట్టి ఎంపికచేసుకున్న వాటిలో మొదటి సిటీలో అందుబాటులో ఉన్న 4 సెషన్లలో ఏదో ఒక సెషన్‌లో పరీక్ష రాసే వీలు కల్పిస్తారు.
¤ అయితే ఏ తేదీలో పరీక్ష రాయాలో క్యాట్ సెంటర్ ర్యాండమ్‌గా నిర్ణయిస్తుంది. నచ్చిన తేదీని ఎంచుకునే వెసులుబాటు మాత్రం అభ్యర్థికి లేనట్టే.
¤ ఈ సారి పరీక్ష నిర్వహణ సాంకేతిక బాధ్యతలను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)కు అప్పగించారు.
ప్రవేశం ఎలా?
సాధారణంగా ఐఐఎంలు తమ అడ్మిషన్‌ విధానాన్ని ఎక్కడా బహిర్గతం చేయవు.సమాచార హక్కుచట్టం పుణ్యమాని రెండేళ్ల నుంచి ఐఐఎంలు అడ్మిషన్‌ విధానాన్ని వెల్లడిస్తున్నాయి. వివిధ ఐఐఎంలు పరిగణనలోకి తీసుకుంటున్న క్యాట్‌ స్కోరు, ఇతర అంశాలకు ఇస్తోన్న వెయిటేజీ, తదితర అంశాలు అభ్యర్థులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఐఐఎంలు వెల్లడిస్తోన్న సమాచారం వల్ల అభ్యర్థుల్లో అనేక అపోహలు కూడా ఏర్పడుతున్నాయి. అవి...
¤ ఎంపిక ప్రక్రియలో క్యాట్‌ స్కోరుకు ప్రాధాన్యం తగ్గుతోందని చాలామంది అభ్యర్థులు భావిస్తున్నారు.
¤ అకడమిక్‌ రికార్డు సరిగా లేకపోయినా, పని అనుభవం లేకపోయినా సీటు అవకాశాలు చాలా తక్కువని భావించేవారు కూడా ఎక్కువగానే ఉన్నారు.
పై అపోహల సారాంశం...
అకడమిక్‌ రికార్డుకు ప్రాధాన్యం పెరిగి, క్యాట్‌లో సాధించే స్కోరుకు ప్రాముఖ్యం తగ్గడం. అన్ని ఐఐఎంలు అభ్యర్థుల తొలిదశ వడపోతకు క్యాట్‌ స్కోరును పరిగణనలోకి తీసుకుంటాయి. ఇంటర్వ్యూలకు, ఫైనల్‌ సెలక్షన్‌కు అభ్యర్థులను ఎంపిక చేయడానికి క్యాట్‌ స్కోరుకు భిన్నరీతిలో వెయిటేజీ ఇస్తున్నాయి. గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలకు ఎంపిక చేసే దశలో వివిధ ఐఐఎంలు క్యాట్‌ స్కోరుకు ఇస్తోన్న వెయిటేజీ:
¤ 100 శాతం వెయిటేజీ: ఐఐఎం (షిల్లాంగ్‌, రాంచీ, రాయపూర్‌, తిరుచ్చి, ఉదయపూర్‌)
¤ 70 - 80 శాతం వెయిటేజీ: ఐఐఎం (అహ్మదాబాద్‌, కోల్‌కతా, లక్నో, కాశీపూర్‌)
¤ 50 - 55 శాతం వెయిటేజీ: ఐఐఎం (కొజికోడ్‌, ఇండోర్‌, రోహ్‌టక్‌)
¤ ఐఐఎం బెంగళూరు ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో క్యాట్‌ స్కోరుకు 30.77 శాతం వెయిటేజీ ఇస్తుంది.
దీన్ని బట్టి మొత్తం 13 ఐఐఎంలలో 9 సంస్థలు క్యాట్‌ స్కోరుకు 70 శాతానికిపైగా వెయిటేజీని ఇస్తున్నాయని తెలుసుకోవచ్చు. అకడమిక్స్‌, పని అనుభవానికి మిగతా వెయిటేజీ ఉండేది. అంటే క్యాట్‌కు గతంలో కంటే ప్రాధాన్యం పెరిగింది కానీ ఏమాత్రం తగ్గలేదు. ఐఐఎంలలో సీట్లు సాధించిన కొంతమంది అభ్యర్థుల అనుభవాలను చదివి చాలామంది అపోహ పడుతున్నారు.
ఐఐఎంలలో ప్రతి అభ్యర్థి ఎంపికకు అనేక అంశాలు దోహదపడుతుంటాయి....
¤ క్యాట్‌ స్కోరు - మొత్తం సెక్షన్‌ల వారీగా, అకడమిక్స్‌, అనుభవం, రిజర్వేషన్‌ మొదలైనవి. అన్ని సంస్థలు వేటికవే ప్రత్యేక ప్రాధమ్యాలను నిర్ణయించుకుంటాయి. అందువల్ల ఒకరిద్దరు అభ్యర్థులు తమకు ఫలానా కారణం వల్ల సీటు వచ్చిందంటే, అది మిగతా అందరికీ, అన్ని ఐఐఎంలకు వర్తించకపోవచ్చు. ఉదాహరణకు... 5 ఐఐఎంలు మొదటి దశ స్క్రీనింగ్‌లో అకడమిక్స్‌, పని అనుభవానికి ఏమాత్రం వెయిటేజీ ఇవ్వడం లేదు. కేవలం క్యాట్‌ స్కోరు ఆధారంగానే వడపోత పోస్తున్నాయి. అందువల్ల వీటిలో సీటు సాధించిన అభ్యర్థుల అనుభవాన్ని మిగతా సంస్థలకు వర్తింపచేయకూడదు. ఎందుకంటే క్యాట్‌ స్కోరుకు 45-50 శాతం మాత్రమే వెయిటేజీ ఇచ్చే సంస్థలున్నాయి. క్యాట్‌లో అద్భుతమైన స్కోరు వచ్చినా ఈ సంస్థల్లో ఇంటర్వ్యూలకు ఎంపిక కాకపోవచ్చు. దీన్ని ఆధారంగా చేసుకొని క్యాట్‌ స్కోరుకు ప్రాధాన్యం తగ్గిందని కూడా చెప్పలేము.
¤ ఈ విషయంలో అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే... మంచి అకడమిక్‌ రికార్డు, పని అనుభవం ఉంటేనే కొన్ని ఐఐఎంలలో ప్రవేశం లభించవచ్చు. కానీ ఈ అంశాలను పట్టించుకోకుండా, క్యాట్‌లో మంచి స్కోరు వస్తే సీటు ఇచ్చే ఐఐఎంలు కూడా ఉన్నాయని మర్చిపోవద్దు.
క్యాట్ ద్వారా వివిధ ఐఐఎంలలో ప్రవేశం లభించే మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లు:
¤ పీజీపీ: ఐఐఎం (అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా, ఇండోర్, కాశీపూర్, కొజికోడ్, లక్నో, రాయపూర్, రాంచి, రోహ్‌టక్, షిల్లాంగ్, తిరుచ్చి, ఉదయపూర్.
¤ పీజీపీ - ఏబీఎం: ఐఐఎం (అహ్మదాబాద్, లక్నో)
¤ పీజీఎస్ఈఎం: ఐఐఎం బెంగళూరు
¤ పీజీపీపీఎం: ఐఐఎం బెంగళూరు
¤ ఈపీజీపీ: ఐఐఎం ఇండోర్
¤ పీజీడీహెచ్ఆర్ఎం: ఐఐఎం రాంచీ
¤ ఎఫ్‌పీఎం: ఐఐం (అహ్మదాబాద్, బెంగళూరు, కాలికట్, ఇండోర్, కాశీపూర్, కొజికోడ్, లక్నో, రాయపూర్, రాంచీ, షిల్లాంగ్, తిరుచ్చి.
అగ్రశ్రేణి ఐఐఎంలలో సీటుకు..
క్యాట్‌లో అద్భుతమైన స్కోరు ఉన్నప్పటికీ ఇంటర్వ్యూకు ఎంపిక కాని అభ్యర్థులు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా పాత ఐఐఎంల విషయంలో ఇలాంటి సందర్భాలు చాలా ఎదురవుతుంటాయి. ఉదాహరణకు ఐఐఎం అహ్మదాబాద్‌ను తీసుకుంటే... ఇందులో 192 జనరల్‌ కేటగిరీ సీట్లు ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి 2011లో 540 మందిని ఇంటర్వ్యూలకు షార్ట్‌లిస్ట్‌ చేశారు. క్యాట్‌లో టాప్‌ 540 మంది జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు అనుకుందాం. అప్పుడు ఇంటర్వ్యూకు ఎంపిక కావాలంటే.. మొత్తం 2 లక్షల పైచిలుకు అభ్యర్థుల్లో టాప్‌ 0.25 శాతం మందిలో ఉండాలి. అంటే 99.5 పర్సంటైల్‌ వచ్చినా ఇంటర్వ్యూ దశకు ఎంపిక కాకపోవచ్చు. పాతవాటితో పోల్చుకుంటే కొత్త ఐఐఎంలలో ఇంటర్వ్యూలకు ఎంపిక కావడానికి తక్కువ పర్సంటైల్‌ సరిపోతుంది. గత ఏడాది 6 కొత్త ఐఐఎంలు జనరల్‌ కేటగిరీలో 97 పర్సంటైల్‌ వరకు ఇంటర్వ్యూలకు పిలిచాయి. సెక్షనల్‌ కటాఫ్‌లను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
అకడమిక్స్‌, అనుభవం ఏ మేరకు?
పైనల్‌ సెలక్షన్స్‌లో వివిధ ఐఐఎంలు అకడమిక్స్‌, అనుభవానికి ఇస్తోన్న వెయిటేజీ ఇలా ఉంది..
¤ ఐఐఎంలు (అహ్మదాబాద్‌, ఇండోర్‌, షిల్లాంగ్‌, రోహ్‌టక్‌): 0 శాతం వెయిటేజీ
¤ ఐఐఎంలు (కోల్‌కతా, లక్నో, కాశీపూర్‌): 7 - 8 శాతం
¤ ఐఐఎంలు (కొజికోడ్‌, రాంచి, తిరుచ్చి, ఉదయపూర్‌): 11 - 15 శాతం
ఐఐఎం బెంగళూరు ఒక్కటే అకడమిక్స్‌, అనుభవానికి 47.62 శాతం వెయిటేజీ ఇస్తుంది. దీన్ని మినహాయిస్తే, అకడమిక్స్‌, అనుభవానికి లభిస్తోన్న గరిష్ఠ వెయిటేజీ 15 శాతం. మిగతా 85 శాతం వెయిటేజీ క్యాట్‌ స్కోరు, జీడీ / ఎస్సే/ ఇంటర్వ్యూలలో ప్రతిభకు లభిస్తుంది. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. ఇంటర్వ్యూకు ఎంపికైతే సీటు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. తర్వాత దశల్లో (గ్రూప్‌ డిస్కషన్‌ / ఎస్సే / పర్సనల్‌ ఇంటర్వ్యూ) పనితీరును మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తే ఐఐఎంలో సీటు సాధించవచ్చు.
రిజర్వేషన్‌ ఉన్న అభ్యర్థులు క్యాట్‌లో తక్కువ స్కోరు వచ్చినా నిరాశపడాల్సిన అవసరం లేదు. అందువల్ల పట్టు విడవకుండా ప్రిపరేషన్‌ కొనసాగించాలి. పైన తెలిపిన దానికంటే కొంచెం ఎక్కువ పర్సంటైల్‌ తెచ్చుకుంటే సీటు అవకాశాలు అధికంగా ఉంటాయి. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 97 పర్సంటైల్‌ వచ్చినా ఐఐఎంలో సీటు లభించే అవకాశం ఉంది.
¤ ఐఐఎంల ప్రవేశ ప్రక్రియ దేనికదే వేర్వేరుగా ఉంటుంది. క్యాట్ స్కోరు ఆధారంగా అభ్యర్థులను ప్రాథమిక స్క్రీనింగ్ చేస్తారు. తర్వాత ఎంపిక ప్రక్రియలో అనేక దశలు ఉంటాయి. అవసరమైతే ఐఐఎంలు మళ్లీ రాతపరీక్షలు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. క్యాట్ స్కోరు అత్యంత ముఖ్యమైనా, అనేక సంస్థల ఎంపిక ప్రక్రియలో అకడమిక్ రికార్డు, పని అనుభవం, తదితర అంశాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఐఐఎంల వెబ్‌సైట్లలో ఆయా సంస్థల ఎంపిక విధానం ఉంటుంది.
విభాగాల వారీగా సిద్ధమవడం ఎలా?
క్వాంటిటేటివ్ ఎబిలిటీ
సెలెక్టివ్‌గా ప్రిపేరవడం సరైన విధానం కాదు. వదిలేసిన అంశాల నుంచి ప్రశ్నలు వస్తే నష్టపోతారు. పరీక్షకు 3-4 వారాల ముందు వరకు క్వాంటిటేటివ్ ఎబిలిటీలోని అన్ని అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. తర్వాత ముఖ్యమైన అంశాలకు ఎక్కువ సమయం వెచ్చించాలి.
డేటా ఇంటర్‌ప్రెటేషన్:
రెండు రకాల సామర్థ్యాలు ఉంటే ఈ విభాగంలో ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయవచ్చు.
1. క్లిష్టమైన సమాచారాన్ని విశ్లేషించగలగాలి. నిత్యం సాధన చేయడం ద్వారానే ఈ సామర్థ్యాన్ని పెంపొందించుకోగలరు. తేలికైన ప్రశ్నల నుంచి ప్రారంభించి క్రమేణా క్లిష్టతను పెంచుకుంటూ, వివిధ రకాల ప్రశ్నలను సాధన చేయాలి. మీరు అనుసరించే స్టడీ మెటీరియల్, ప్రామాణిక పుస్తకాల్లో ఉండే డేటా ఇంటర్‌ప్రెటేషన్ ప్రశ్నలన్నీ చేయాలి. తర్వాత ఆన్‌లైన్‌లో లభించే ప్రాక్టీస్ టెస్ట్‌లను సాధన చేస్తే మంచిది.
2. కాలిక్యులేషన్స్ వేగంగా చేయగలిగితే ఈ ప్రశ్నలకు సమాధానాలు తేలిగ్గా తెలుసుకోవచ్చు. వివిధ రకాల ప్రశ్నల సెట్‌లను సాధన చేస్తూ, వేగం పెంచుకోవాలి. ఇది చెప్పినంత తేలికైన పనేమీ కాదు. చిన్న చిన్న కాలిక్యులేషన్స్‌కు నంబర్లతో కుస్తీ పడుతూ సమయం తీసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. నిరంతర సాధన ద్వారా వేగాన్ని పెంచుకోవచ్చు.
వెర్బల్ ఎబిలిటీ
¤ ఈ విభాగంలో రీడింగ్ కాంప్రహెన్షన్‌కు ఎనలేని ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో 3-4 ప్యాసేజ్‌లు ఉంటాయి. ఒక్కో ప్యాసేజ్‌లో మూడు లేదా నాలుగు ప్రశ్నలు ఇస్తారు. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయాలంటే... అభ్యర్థులకు విభిన్న అంశాలను చదివే అలవాటు ఉండాలి. మొదట నేరుగా సమాధానాలు లభించే ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
¤ తర్వాత మిగతా వాటిని ప్రయత్నించాలి. పరీక్షలో ఒక్కో ప్యాసేజ్‌కి 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం కేటాయించవద్దు. అన్ని ప్యాసేజ్‌లకు సమాధానాలు రాయడానికి ప్రయత్నించాలి.
¤ గ్రామర్, వర్డ్ బేస్డ్ ప్రశ్నలు కొన్ని ఉంటాయి. గ్రామర్ నియమాలను తెలుసుకోవాలి. దీనికి 'రెన్ అండ్ మార్టిన్' లాంటి ప్రామాణిక పుస్తకాలు సరిపోతాయి. వర్డ్ బేస్డ్ ప్రశ్నల సాధనకు రోజూ 30 నిమిషాలు కేటాయించాలి. సాధారణంగా తప్పుగా ఉపయోగించే పదాలను తెలుసుకొని వాటిని బాగా సాధన చేయాలి. Root - prefix - suffix ల పద్ధతిని అనుసరిస్తే ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయడం తేలిక.
¤ ఇందులో మరో ముఖ్యమైన అంశం... వెర్బల్ రీజనింగ్. దీనిలో పేరా జంబుల్స్, పేరా కంప్లీషన్, క్రిటికల్ రీజనింగ్ ప్రశ్నలు ఉంటాయి. ఇవి జీమ్యాట్‌లో అడిగే ప్రశ్నలను పోలి ఉంటాయి. పరిచయ వాక్యాలను చదివితే పేరాగ్రాఫ్ దేని గురించి ఇచ్చారో అర్థం అవుతుంది. తద్వారా పేరాగ్రాఫ్‌లోని రెండు వాక్యాలను కలిపే conjunctions, content connectives ఏమిటో తెలుసుకోవచ్చు.
లాజికల్ రీజనింగ్
ఈ విభాగంలో ప్రశ్నలు ప్రధానంగా మూడు అంశాల నుంచి వస్తాయి. అవి.. పజిల్స్, వెన్ డయాగ్రామ్‌లు, క్యూబ్‌లు, డిడక్షన్స్, లాజికల్ కనెక్టివ్స్. పజిల్స్‌లో అడిగే ప్రశ్నలు సాధారణ స్థాయిలో ఉంటాయి. వీటితోపాటు డిడక్షన్స్, వెన్ డయాగ్రామ్స్‌లో ప్రశ్నలను సాధించడానికి మంచి స్టడీ మెటీరియల్ చదివితే సరిపోతుంది. ఆయా అంశాల్లో విభిన్న రకాల ప్రశ్నలను సాధన చేయాలి. శకుంతలా దేవి, జార్జ్ సమ్మర్స్ పజిల్ పుస్తకాలు ఉపయోగపడతాయి. వీటి ద్వారా లాజిక్ పజిల్స్, వాటిని సాధించే మార్గాలను తెలుసుకోవచ్చు.
ప్రిపరేషన్‌లో కింది అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి...
¤ వివిధ అంశాల్లోని ప్రాథమిక భావనలపై పట్టు సాధించాలి.
¤ అన్ని ఫార్ములాలను, భావనలను చార్టు రూపంలో ఒకచోట రాసుకోవాలి. వీటిని వీలైనప్పుడల్లా పునశ్చరణ చేస్తుండాలి.
¤ ఆయా ఫార్మాలాలను ఏ సందర్భాల్లో ఉపయోగించాలో తెలుసుకోవాలి.
¤ ఒక్కో టాపిక్ నుంచి క్యాట్‌లో అడిగే స్థాయి గల 30-40 ప్రశ్నలు సాధించాలి.
విభాగాన్ని బట్టి వ్యూహం...
ఈ సందర్భంలో అభ్యర్థులకు తలెత్తే ప్రశ్న... ముందు ప్రశ్నలన్నీ చదవాలా? లేక ప్రశ్నల స్థాయిని బట్టి సమాధానాలు గుర్తిస్తూ ముందుకు సాగాలా? దీనికి అభ్యర్థులు సమాధానాలు గుర్తించే విభాగాన్ని బట్టి వ్యూహం రూపొందించుకోవాలి.
¤ వెర్బల్ ఎబిలిటీలో ప్రశ్నలను చదివేటప్పుడే చాలా వాటికి సమాధానాలు గుర్తించవచ్చు, కఠినమైనవిగా భావిస్తే వదిలేయవచ్చు. మళ్లీ మళ్లీ చదవాల్సిన అవసరం ఉండదు. క్వాంటిటేటివ్ ఎబిలిటీలో ప్రశ్నలకు ఈ పద్ధతి ఆచరణీయం కాదు. చదువుతున్నప్పుడు తేలిగ్గా అనిపించిన వాటికి సమాధానాలు రాయవచ్చు. కఠినమైనవి తర్వాత చేయవచ్చు. దీనివల్ల నష్టం కూడా ఉంటుంది. ప్రశ్నలనీ చదివిన తర్వాత మొదట్లో ఉన్న ప్రశ్నలను గుర్తుంచుకోవడం కష్టం. అవే ప్రశ్నలను మళ్లీ మళ్లీ చదవడం వల్ల సమయం వృధా అవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆయా విభాగాల్లోని ప్రశ్నలను విభజించుకోవాలి. ఉదాహరణకు... ఒక్కో విభాగంలో 50 ప్రశ్నలుంటే, వీటిని 10 ప్రశ్నలు చొప్పున 5 భాగాలుగా చేసుకోవాలి. అలాగే ఒక్కో భాగానికి 10 నిమిషాల చొప్పున సమయాన్ని కూడా విభజించుకోవాలి. తద్వారా ప్రతి భాగంలో తేలికైన, కఠినమైన ప్రశ్నలను గుర్తిస్తూ, సమాధానాలు రాయవచ్చు.
¤ లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్ విభాగాల్లో ప్రశ్నలు వివిధ సెట్స్ రూపంలో ఉంటాయి. వీటిని భాగాలుగా విభజించుకొని రాయడం చాలా తేలిక. ప్రశ్నల కఠినత్వాన్ని ఏ మేరకు అర్థం చేసుకోగలరనేది ఇక్కడ కీలకం. ఇందులో విఫలమైతే కఠినమైన ప్రశ్నలపై సమయం వృధా చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాక ప్రశ్నలన్నీ చదవడానికి సమయం కూడా సరిపోదు. తద్వారా తేలికైన ప్రశ్నలకు కూడా సమాధానాలు రాయలేక తీవ్రంగా నష్టపోతారు.
¤ క్యాట్‌లో మంచి స్కోరు సాధించి ఐఐఎంలో సీటు తెచ్చుకుంటే అభినందనీయం. ఒకవేళ ఐఐఎంలలో ప్రవేశం లభించకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా అనేక బిజినెస్ స్కూళ్లు క్యాట్ స్కోరు ఆధారంగా మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. కొన్ని సెంట్రల్ యూనివర్సిటీలు కూడా క్యాట్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
మాక్ టెస్ట్‌ల విశ్లేషణ:
¤ మాక్ టెస్ట్‌ల ద్వారా ప్రశ్నలను ఏ మేరకు అర్థం చేసుకుంటున్నారో అంచనా వేసుకోవచ్చు. తేలికైన ప్రశ్నలను ఎక్కువ సంఖ్యలో వదిలేస్తున్నా, కఠినమైన ప్రశ్నలను ఎక్కువగా ప్రయత్నించినా, మీ వ్యూహంలో మార్పు అవసరం. క్వాంటిటేటివ్ అంశాల్లో అభ్యర్థులు తమ అవగాహన స్థాయిని అంచనా వేసుకోవాలి. మాక్ టెస్ట్‌లు రాస్తూ, అంశాల వారీగా వాటిని విశ్లేషించుకోవాలి. తరచూ తక్కువగా స్కోర్ చేస్తున్న అంశాలు, స్కోర్లలో పదేపదే వ్యత్యాసం ఉంటున్న అంశాలపై దృష్టిపెట్టాలి.
¤ కచ్చితత్వాన్ని పెంపొందించుకోవడానికి ఒకే ఒక మార్గం... సాధన చేయడం. సాధన కంటే ముందు బేసిక్స్‌పై పట్టు ఏర్పరచుకోవడం తప్పనిసరి. పరీక్షకు కొద్ది రోజులు మాత్రమే ఉన్నందువల్ల అన్ని అంశాలను క్షుణ్నంగా నేర్చుకోవడం కూడా ఈ దశలో వీలుకాకపోవచ్చు. మాక్ టెస్ట్‌ల ద్వారా ఏ అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలో తెలుసుకొని, తదనుగుణంగా సమయం కేటాయించుకోవాలి. మీరు ఏ అంశాల్లో వెనుకబడ్డారో మీకు అవగాహన ఉంటుంది... కానీ మాక్ టెస్ట్‌ల ద్వారా ఏర్పడే అవగాహనను కూడా దానికి జోడిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
¤ మీ ప్రిపరేషన్, వ్యూహాలు, ప్రయత్నాలు అన్నీ ఏ మేరకు ఫలితాన్నిస్తున్నాయో మాక్ టెస్ట్‌ల ద్వారా ఎప్పుటికప్పుడు అంచనా వేసుకోవాలి. ప్రశ్నలను ఎంపిక చేసుకునే విధానాన్ని కూడా ప్రతీ టెస్ట్ తర్వాత విశ్లేషించుకోవాలి. మాక్ టెస్ట్‌లలో సరిగా స్కోరు చేయలేకపోతే నిరాశపడవద్దు.
గత పేపర్ల విశ్లేషణ:
పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించుకోవాలి. ఏ అంశాల నుంచి క్రమం తప్పకుండా ప్రశ్నలు ఇస్తున్నారో తెలుసుకొని వాటికి ఎక్కువ సమయం కేటాయించాలి.
గరిష్ఠ స్కోరు ఎలా?
¤ ఏ పరీక్షలోనైనా అభ్యర్థి సాధించిన స్కోరే అందులో అతని విజయాన్ని లేదా వైఫల్యాన్ని నిర్ణయిస్తుంది. ఇది క్యాట్ పరీక్షకూ బాగా వర్తిస్తుంది.
ఐఐఎంలలో సీటు సాధించడానికి మొదటి అడుగైన క్యాట్‌లో మంచి స్కోరు సాధించాలంటే కింది మెలకువలు పాటించాలి.
¤ పరీక్షలో ఎన్ని ప్రశ్నలు చేయడానికి ప్రయత్నించారు, ఏ మేరకు కచ్చితంగా సమాధానాలు రాశారనే అంశాలు అత్యంత కీలకమైనవి. ఈ అంశాలు రెండూ ఒకదానికొకటి సంబంధం గలవి. రెండింటిలో మెరుగైన పనితీరు కనబరిస్తేనే మంచి స్కోరు సాధించగలరు. పరీక్షకు ముందు కచ్చితమైన ప్రణాళికతో క్రమం తప్పకుండా ప్రిపరేషన్, సాధన చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. పరీక్ష సమయంలో కూడా సరైన వ్యూహం అవసరం.
¤ ప్రశ్నలను ఎంపిక చేసుకోవడంలో జాగ్రత్తలు అవసరం. ప్రతి విభాగంలోనూ తేలికైన ప్రశ్నలన్నిటికీ తప్పకుండా నిర్దిష్ఠ సమయంలో సమాధానాలు రాయాలి. తర్వాత కొంచెం కఠినమైన ప్రశ్నలను ప్రయత్నించాలి. ఈ దశలోనూ ప్రశ్నల ఎంపిక ముఖ్యం. ప్రశ్నలు చదివేటప్పుడు కఠినత్వం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోగలగాలి. తేలికైన ప్రశ్నలను ఎలాంటి పరిస్ధితుల్లోనూ వదలకూడదు. ప్రశ్నలు మొత్తం చదివితేనే ఇలా చేయగలరు.
అర్హతలు, దరఖాస్తు విధానం
¤ కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులు క్యాట్‌కు అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి పేరు (పదో తరగతి సర్టిఫికెట్‌లో ఉన్న విధంగా) మీద దరఖాస్తును కొనాలి.
¤ క్యాట్ వెబ్‌సైట్: http://www.iimcat.ac.in/


Ushodaya Enterprises Private Limited 2014