CLAT

యువర్‌ ఆనర్‌!

* ‘లా’ కోర్సుల్లో ప్రవేశాలకు క్లాట్‌

కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు (క్లాట్‌) స్కోరుతో దేశవ్యాప్తంగా 21 జాతీయస్థాయి సంస్థలు అయిదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ, ఏడాది వ్యవధి ఉండే ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఎన్నో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు సైతం ప్రవేశానికి అవకాశం ఇస్తున్నాయి. ఎల్‌ఎల్‌ఎం ప్రవేశ పరీక్షలో సాధించిన స్కోర్‌తో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి.
దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో పెండింగులో ఉన్న కేసులు 3.3 కోట్లు. అయిదు వేలకు పైగా జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఇవన్నీ న్యాయశాస్త్ర పట్టభద్రులకు ఉపాధి అవకాశాలను తెలుపుతున్నాయి. మరోవైపు సైబర్‌ క్రైమ్‌, ఆన్‌లైన్‌ మోసాలు, కాపీ రైట్‌ కేసులు పెరుగుతున్నాయి. పెరుగుతోన్న సాంకేతికత... లీగల్‌ పట్టభద్రులకు అవకాశాలు కల్పిస్తోంది. ప్రసిద్ధ సంస్థల్లో లా కోర్సులు చేసినవారు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా కార్పొరేట్‌ కంపెనీల్లో అవకాశాలు పొందుతున్నారు. లా గ్రాడ్యుయేట్లను జ్యుడీషియల్‌ క్లర్క్‌లుగా తీసుకుంటున్నారు. లీగల్‌ ప్రాసెస్‌ అవుట్‌ సోర్సింగ్‌ విస్తరిస్తోంది. బోధనలోనూ అవకాశాలుంటాయి. అయితే పీజీతోపాటు నెట్‌ అర్హత ఉంటే ప్రాధాన్యం లభిస్తుంది.

గేట్‌ స్కోర్‌తో పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలు ఉద్యోగాలిస్తున్నట్లుగానే క్లాట్‌ ఎల్‌ఎల్‌ఎం పరీక్ష స్కోర్‌, ఇంటర్వ్యూతో కొలువులు లభిస్తున్నాయి. భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌, ఓఎన్‌జీసీ లిమిటెడ్‌, నేషనల్‌ థర్మల్‌ పవర్‌, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌...లీగల్‌ విభాగాల్లో ఉద్యోగులుగా తీసుకుంటున్నాయి. ఎల్‌ఎల్‌ఎం ప్రవేశ పరీక్ష స్కోర్‌కు పీఎస్‌యూలు 75 శాతం వెయిటేజీ ఇస్తున్నాయి. మిగిలిన 25 శాతం ఇంటర్వ్యూకు కేటాయిస్తున్నాయి.

తెలంగాణలో నల్సార్‌ (హైదరాబాద్‌), ఆంధ్రప్రదేశ్‌లో దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (విశాఖపట్నం)లో క్లాట్‌ స్కోరుతో ప్రవేశాలు పొందవచ్చు. జాతీయస్థాయిలో 21 సంస్థల్లోనూ కలుపుకుని దాదాపు 2500 ఎల్‌ఎల్‌బీ సీట్లున్నాయి. కొన్ని సంస్థలు సగం లేదా కొంత శాతం సీట్లను ఆయా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో నింపుతున్నాయి. ఉదాహరణకు నల్సార్‌, హైదరాబాద్‌లో అయిదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో 105 సీట్లకు గాను 21 సీట్లు, ఎల్‌ఎల్‌ఎంలోనూ 40లో 10 సీట్లు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు కేటాయించారు. దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీ, విశాఖపట్నంలో ఎల్‌ఎల్‌బీ కోర్సులో 60, ఎల్‌ఎల్‌ఎంలో 12 సీట్లు ఆంధ్ర విద్యార్థులకు కేటాయించారు.

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో...
ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ద్వారా కోర్సులో ఎంపిక చేస్తారు.
కోర్సు: ఎల్‌ఎల్‌బీ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ మూడేళ్ల లా కోర్సు. రెసిడెన్షియల్‌ విధానంలో అందిస్తున్నారు.
అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో ఇంజినీరింగ్‌ /మెడిసిన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా పీజీలో ప్రథమ శ్రేణి మార్కులతో సైన్స్‌ /ఫార్మసీ డిగ్రీ లేదా ప్రథమ శ్రేణి మార్కులతో ఎంబీఏతోపాటు.. ఇంజినీరింగ్‌/మెడిసిన్‌లో యూజీ లేదా సైన్స్‌/ఫార్మసీలో పీజీ.
పరీక్ష ఇలా: ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్‌ 60, లాజికల్‌ రీజనింగ్‌ 20, మ్యాథమెటికల్‌ ఎబిలిటీ 15, బేసిక్‌ సైన్స్‌ (కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, లైఫ్‌ సైన్సెస్‌) 35, లీగల్‌ ఆప్టిట్యూడ్‌ 70 మార్కులకు ప్రశ్నలుంటాయి. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలుంటాయి.

ఎల్‌ఎల్‌ఎం...
అర్హత: మూడేళ్లు లేదా అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్‌లో ప్రథమ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణత.
రాత పరీక్షలో: లీగల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 120 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటాయి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 15
పరీక్ష తేదీ: మే 26 http://www.iitkgp.ac.in/law, http://www.iitkgp.ac.in/llm

గడువు తేదీ, అర్హతలు
ఎల్‌ ఎల్‌ బీ 5 సంవత్సరాల కోర్సులో చేరే విద్యార్థులు ఇంటర్‌ 45% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్‌సీ/ ఎస్‌టీ విద్యార్థులు 40% మార్కులు సరిపోతాయి. చివరి సంవత్సరం పరీక్షకు హాజరవుతున్న వాళ్లూ అర్హులే.
ఎల్‌ఎల్‌ఎం కోర్సు చేయదల్చినవారు ఎల్‌ఎల్‌బీ పరీక్షను 55% మార్కులతో; ఎస్‌సీ, ఎస్‌టీ వారు 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. చివరి పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు కూడా రాయవచ్చు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 15, 2019
దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.4000; ఎస్సీ, ఎస్టీలకు రూ.3500.
పరీక్ష తేది: 26.05.2019 (ఆదివారం) సాయంత్రం 3 నుంచి 5 వరకు ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారు. https://clatconsortiumofnlu.ac.in

ఎల్‌ఎల్‌బీ పరీక్షను ఆన్‌లైన్‌లో 200 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్‌ 40, జనరల్‌ నాలెడ్జ్‌/ కరెంట్‌ అఫైర్స్‌ 50, ఎలిమెంటరీ మ్యాథ్స్‌ (న్యూమరికల్‌ ఎబిలిటీ) 20, లీగల్‌ అవేర్‌నెస్‌/ లీగల్‌ ఆప్టిట్యూడ్‌ 50, లాజికల్‌ రీజనింగ్‌ 40 ప్రశ్నలు ఉంటాయి. రుణాత్మక మార్కులున్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి ప్రశ్నకూ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు.

* ఆంగ్ల విభాగంలో కాంప్రహెన్షన్‌ ప్యాసేజీలు, వ్యాకరణం ద్వారా అభ్యర్థి ప్రావీణ్యాన్ని పరిశీలిస్తారు. పద సంపదను పెంపొందించుకోవాలి. ద హిందూ లేదా మరేదైనా నచ్చిన ఆంగ్ల దినపత్రికను చదవడం మంచిది.
* జనరల్‌ నాలెడ్జ్‌ విభాగంలో ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించడంలో ఎన్‌సీఈఆర్‌టీ 8, 9 ,10 తరగతుల సోషల్, సైన్సు పుస్తకాల్లోని ముఖ్యాంశాలను మననం చేసుకోవాలి.
* గణితంలో ప్రాథమికాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పదో తరగతి స్థాయిలోపే ఇవన్నీ ఉంటాయి. ఇందులో అరిథ్‌మెటిక్‌ విభాగం నుంచే ప్రశ్నలు వస్తాయి. కాబట్టి వాటిపైనే దృష్టి పెట్టాలి. తక్కువ సమయంలో ప్రశ్నకు జవాబు గుర్తించడానికి వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి.
* లాజికల్‌ రీజనింగ్‌ ప్రశ్నలు తర్కంతో ముడిపడి ఉంటాయి. ఇచ్చిన అంశాల్లో పూర్తి విరుద్ధమైనవి గుర్తించాలి. పోలికలు, భేదాలు లాంటివాటి ఆధారంగా ఇవి వస్తాయి.
* లీగల్‌ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలు ప్రాథమిక స్థాయి అవగాహనతో ఎదుర్కోవచ్చు. అభ్యర్థి ఆలోచనా విధానం, విశ్లేషణ, నిర్ణయాలు తీసుకోవడంలో నైపుణ్యాలను పరిశీలిస్తారు. న్యాయవాద వృత్తికి అభ్యర్థులు ఎంతవరకు సరిపోతారో తెలుసుకునేలా ప్రశ్నలు ఉంటాయి. క్రిమినల్‌ లా, కాంట్రాక్ట్‌ యాక్ట్, ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్, లా ఆఫ్‌ టార్ట్‌ అంశాల నుంచే దాదాపు ప్రశ్నలన్నీ వస్తున్నాయి. ఈ నాలుగు అంశాల్లో ప్రాథమిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి.

పాత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి. ప్రశ్నలు తీరు, ఆయా విభాగాలవారీ అంశాలకు లభిస్తోన్న ప్రాధాన్యం గమనించాలి.
200 ప్రశ్నలకు 120 నిమిషాల్లో జవాబులు గుర్తించాలి అంటే ప్రతి ప్రశ్నకు గరిష్ఠంగా 36 సెకన్ల వ్యవధి మాత్రమే ఉంటుంది. సరైన సమాధానాన్ని తెలుసుకోవడం కొంచెం కష్టమే. ముఖ్యంగా ఎలిమెంటరీ మ్యాథ్స్, రీజనింగ్‌ విషయానికొచ్చేసరికి అసలు సమయం సరిపోకపోవచ్చు. పరీక్షకు ముందు బాగా సాధన చేయడం ద్వారా నిర్ణీత సమయంలోపు సమాధానాలు రాబట్టడానికి అవకాశం ఉంటుంది.
సెక్షన్లవారీ కటాఫ్‌ మార్కులు లేవు కాబట్టి నచ్చిన సెక్షన్‌ నుంచి జవాబులు గుర్తించవచ్చు. జవాబు రాబట్టడానికి ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలను ఆఖరులో సమయం ఉంటే ప్రయత్నించాలి.
పరీక్షకు పూర్తిగా సన్నద్ధమైన తర్వాతే మాక్‌ టెస్టులు రాయాలి. కనీసం ఏడెనిమిది రాయడం వల్ల సమయ పాలన అలవడుతుంది. ఏ అంశాల్లో వెనుకబడ్డారో తెలుసుకోవచ్చు. రెండు గంటల వ్యవధిలో పరీక్ష రాయటం సాధన చేస్తే పరీక్షలో సమయపాలన అలవడుతుంది.
కరెంట్‌ అఫైర్స్‌లో భాగంగా క్రీడలు, సైన్స్, సాహిత్యం, కళల్లో తాజా అవార్డుల వివరాలూ, ఐక్యరాజ్య సమితి విభాగాలు, విధులు, అవి ఉన్న ప్రాంతాలు తెలుసుకోవాలి. భారతదేశ భూగోళం, చరిత్రల్లో అవగాహన పెంచుకోవాలి. ఏదైనా ఆంగ్ల దినపత్రికను రోజూ చదవడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యాంశాలు నోట్సు రూపంలో రాసుకోవాలి. ఆంగ్లంలో ప్రావీణ్యం పెంచుకోవడానికీ ఆంగ్ల పత్రికాపఠనం ఉపయోగపడుతుంది.
ఎల్‌ఎల్‌ఎం ప్రవేశ పరీక్షను 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో వంద మార్కులు లా సబ్జెక్టు నుంచే ఉంటాయి. మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో వంద ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. మరో యాభై మార్కులకు సబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రెండు ఎస్సేలు రాయాలి. ఒక్కో దానికీ పాతిక మార్కులు.

క్లాట్‌తో ప్రవేశాలిక్కడ...
* నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు (ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ)
* నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ లీగల్‌ స్టడీ అండ్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా, హైదరాబాద్‌ (నల్సార్‌)
* ద నేషనల్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ యూనివర్సిటీ, భోపాల్‌ (ఎన్‌ఎల్‌ఐయూ)
* ద వెస్ట్‌ బెంగాల్‌ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జుడీషియల్‌ సైన్సెస్, కోల్‌కతా (డబ్ల్యూబీఎన్‌యూజేఎస్‌)
* నేషనల్‌ లా యూనివర్సిటీ, జోధ్‌పూర్‌ (ఎన్‌ఎల్‌యూజే)
* హిదయతుల్లా నేషనల్‌ లా యూనివర్సిటీ, రాయ్‌పూర్‌ (హెచ్‌ఎన్‌ఎల్‌యూ)
* గుజరాత్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ, గాంధీనగర్‌ (జీఎన్‌ఎల్‌యూ)
* డా.రామ్‌ మనోహర్‌ లోహియా నేషనల్‌ లా యూనివర్సిటీ, లఖ్‌నవూ (ఆర్‌ఎంఎల్‌ఎన్‌ఎల్‌యూ)
* రాజీవ్‌గాంధీ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా, పంజాబ్‌ (ఆర్‌జీఎన్‌యూఎల్‌)
* చాణక్య నేషనల్‌ లా యూనివర్సిటీ, పట్నా (సీఎన్‌ఎల్‌యూ)
* ద నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ లీగల్‌ స్టడీస్, కొచ్చి (ఎన్‌యూఏఎల్‌ఎస్‌)
* నేషనల్‌ లా యూనివర్సిటీ ఒడిశా, కటక్‌ (ఎన్‌ఎల్‌యూఓ)
* నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ స్టడీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ లా, రాంచీ (ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్‌)
* నేషనల్‌ లా యూనివర్సిటీ అండ్‌ జుడిషియల్‌ అకాడమీ, అసోం (ఎన్‌ఎల్‌యూజేఏఏ)
* దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీ, విశాఖపట్నం (డీఎస్‌ఎన్‌ఎల్‌యూ)
* తమిళనాడు నేషనల్‌ లా స్కూల్, తిరుచిరాపల్లి (టీఎన్‌ఎన్‌ఎల్‌ఎస్‌)
* మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీ, ముంబయి (ఎంఎన్‌ఎల్‌యూ)
* నేషనల్‌ లా యూనివర్సిటీ, నాగ్‌పూర్‌ (ఎన్‌ఎల్‌యూ)
* నేషనల్‌ లా యూనివర్సిటీ, ఔరంగాబాద్‌ (ఎన్‌ఎల్‌యూ)
* హిమాచల్‌ ప్రదేశ్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ, సిమ్లా
* ధర్మశాస్త్ర నేషనల్‌ లా యూనివర్సిటీ, జబల్‌పూర్‌

Posted on 04-04-2019