CLAT

మేటి సంస్థల్లో మెరిసే‘లా’!

* ‘లా’ కోర్సుల్లో ప్రవేశాలకు క్లాట్‌

విఖ్యాత సంస్థల్లో న్యాయవిద్యలో ప్రవేశం కోసం నిర్వహించే కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు (క్లాట్‌) ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 22 జాతీయ సంస్థల్లో అయిదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ, ఏడాది వ్యవధి ఉండే ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష ప్రామాణికం. ఈ సంస్థల్లో చదివినవారు ప్రాంగణ నియామకాల్లో మంచి అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. దేశంలోని వివిధ ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు క్లాట్‌ స్కోరుతో న్యాయవిద్యలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఈ ఏడాది యూజీ క్లాట్‌లో కొన్ని మార్పులు చేశారు. ఆ వివరాలు చూద్దాం!

ఇంటర్‌ తర్వాత అయిదేళ్ల లా కోర్సుల్లో చేరడానికి యూజీ క్లాట్‌ రాయాలి. ఈ సారి పరీక్షలో కొన్ని మార్పులు జరిగాయి. గతంతో పోలిస్తే పరీక్ష వ్యవధిని అలాగే ఉంచి ప్రశ్నల సంఖ్యను 200 నుంచి 150కి కుదించారు. ఎలిమెంటరీ మ్యాథ్స్‌ (న్యూమరికల్‌ ఎబిలిటీ) స్థానంలో క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ చేర్చారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే వస్తాయి. అయితే వీటిని నేరుగా అడగరు. ప్రతి విభాగంలోనూ ప్యాసేజ్‌లు ఇచ్చి వాటికింద ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు చొప్పున 150 ప్రశ్నలు వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ లో 28-32 ప్రశ్నలు (20 శాతం వెయిటేజీ), కరంట్‌ అఫైర్స్‌, జీకే 35-39 (25 శాతం వెయిటేజీ), లీగల్‌ రీజనింగ్‌ 35-39 (25 శాతం వెయిటేజీ), లాజికల్‌ రీజనింగ్‌ 28-32 (20 శాతం వెయిటేజీ), క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ 13-17 (10 శాతం వెయిటేజీ) వరకు ప్రశ్నలు వస్తాయి. పరీక్షను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తారు.

సన్నద్ధత ఇలా..
పరీక్ష ద్వారా అభ్యర్థిలో గ్రహణ, తార్కిక నైపుణ్యాలు, సామర్థ్యాలను మూల్యాంకనం చేస్తారు. న్యాయవిద్య అభ్యసించడానికి అవసరమైన ఆప్టిట్యూడ్‌, స్కిల్స్‌ ఉన్నాయా? లేవా? అనేది గమనిస్తారు.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌
పాసేజ్‌ ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఒక్కో పాసేజ్‌ 450 పదాల్లో ఉంటుంది. వర్తమాన అంశాలు, చరిత్రాత్మక ఫిక్షన్‌, నాన్‌ ఫిక్షన్‌ విభాగాల్లో ఈ ప్యాసేజ్‌లు ఉండవచ్ఛు ఇంటర్‌ విద్యార్థి అర్థం చేసుకునే స్థాయిలోనే, 5 నుంచి 7 నిమిషాల్లో చదవగలిగేలా ప్యాసేజ్‌ ఉంటుంది. వీటిద్వారా అభ్యర్థిలోని గ్రహణ, భాషా నైపుణ్యాలను గమనిస్తారు. జవాబు గుర్తించడానికి ఆ పాసేజ్‌ క్షుణ్నంగా చదవాలి. అందులోని ముఖ్యమైన అంశాలను అర్థం చేసుకోవాలి. అందులోని భిన్న అభిప్రాయాలు, వాదనలు.. అన్నీ బేరీజు వేసుకుని స్పష్టమైన అభిప్రాయానికి రావాలి. ఆ పాసేజ్‌లోని మాటలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల పదసంపదపై పట్టు పెంచుకోవాలి. దీంతో పాసేజ్‌ అర్థం చేసుకోవడం తేలికవుతుంది. ఆకళింపు చేసుకుంటూ వేగంగా చదవగలిగే నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి. వీలైనన్ని కాంప్రహెన్షన్‌ ప్రశ్నలు సాధన చేయాలి. దీంతోపాటు ద హిందూలాంటి పత్రికల్లో వచ్చే వ్యాసాలు అందులోనూ ముఖ్యంగా సమకాలీన చర్చనీయ అంశాలపై నిపుణుల అభిప్రాయాలు బాగా చదవాలి.

లీగల్‌ రీజనింగ్‌
ఇందులోనూ 450 పదాల్లో పాసేజ్‌ ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. లీగల్‌ అంశాలతో ముడిపడిన వాస్తవ సంఘటనలు, పరిణామాలు, పబ్లిక్‌ పాలసీ, నీతి, తాత్వికాంశాలపై ప్రశ్నలు వస్తాయి. అయితే ఈ ప్రశ్నలకు జవాబులు గుర్తించడానికి న్యాయవిద్యతో పరిచయం అవసరం లేదు. వర్తమానాంశాలపై అవగాహన, సమకాలీన న్యాయ, నైతిక సంఘటనలపై దృష్టి సారించాలి. ఇచ్చిన పాసేజ్‌ లోని నిబంధనలు, సూత్రాలు (నియమాలు) గుర్తించాలి. వాటిని వివిధ సందర్భాలకు అనువర్తించాలి. వాస్తవికతకు తర్కాన్ని జోడించి ఆలోచిస్తే ఈ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్ఛు

కరంట్‌ అఫైర్స్‌, జీకే
ఈ విభాగంలో కూడా 450 పదాల్లో పాసేజ్‌ ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. వార్తలు, జర్నలిస్ట్‌ సోర్సులు, నాన్‌ ఫిక్షన్‌ రచనల నుంచి ఈ పాసేజ్‌లు వస్తాయి. ఈ పాసేజీల్లో లీగల్‌ లేదా లీగల్‌ సంబంధిత అంశాలు ఉండవచ్ఛు అయితే సమాధానాలు గుర్తించడానికి లీగల్‌ అంశాల్లో ప్రావీణ్యం అవసరం లేదు. పాసేజ్‌ల ద్వారా వర్తమానాంశాలు, జనరల్‌ నాలెడ్జ్‌ల్లో అభ్యర్థి అవగాహన తెలుసుకునేలా ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా భారత్‌, ప్రపంచంలో చర్చనీయమవుతోన్న పరిణామాలు, సంఘటనలు; కళలు, సంస్కృతి; అంతర్జాతీయ అంశాలు, వర్తమానంతో ముడిపడిన చరిత్రాత్మక అంశాలు..తదితరాల్లో అభ్యర్థిని పరీక్షిస్తారు. అందువల్ల తాజా సంఘటనలను ప్రత్యేక దృష్టితో చదవాలి. వీటిపై నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవాలి.

లాజికల్‌ రీజనింగ్‌
ఈ విభాగంలో 300 పదాలతో ప్యాసేజ్‌ ప్రశ్నలు వస్తాయి. అయితే ఆ ప్యాసేజ్‌ కింద ప్రశ్నలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అడగవచ్ఛు వీటికి సరైన సమాధానం గుర్తించడానికి... ఇచ్చిన పాసేజ్‌లో ఆర్గ్యుమెంట్లు, కన్‌క్లూజన్లు గమనించాలి. వాటిని తార్కికంగా విశ్లేషించుకోవాలి.

క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌
ఈ విభాగంలో సమాచారం లేదా గ్రాఫ్‌లు లేదా అంకెలతో కూడిన చిత్రాలు లేదా కొన్ని వాస్తవికాంశాలు...వీటిలో ఏవైనా ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ఆ సమాచారం ఆధారంగా సరైన సమాధానం ఎంచుకోవాలి. గణితంపై పట్టు ఉంటే ఈ విభాగాన్ని ఎదుర్కోవచ్ఛు పదోతరగతిలోని రేషియో, ప్రపోర్షన్స్‌, ఆల్జీబ్రా, మెన్సురేషన్‌, స్టాటిస్టిక్స్‌ అంశాలను బాగా చదవుకోవాలి.

క్లాట్‌ తాజా మార్పుల ప్రకారం మాదిరి ప్రశ్నలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తు చేసుకున్నవారికి ఆయా విభాగాలవారీ స్టడీ మెటీరియల్‌తో పాటు చేయాల్సిన ఎక్సర్‌సైజ్‌లూ ఇస్తారు. అభ్యర్థులు ప్రశ్నలను వేగంగా చదివి అర్థం చేసుకోవడం ముఖ్యం. ఏదైనా ప్రామాణిక ఆంగ్ల దినపత్రికను చదవడం తప్పనిసరి. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ విభాగంలోని ప్రశ్నలకు తక్కువ వ్యవధిలో సమాధానం గుర్తించడానికి పదో తరగతి గణితంపై పట్టు ఉండాలి. పరీక్షలకు ముందు కనీసం పది మాక్‌ టెస్టులు రాయాలి. వెనుకబడిన విభాగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

మాక్‌ పరీక్షలు తప్పనిసరి
ఇంతకు ముందు క్లాట్‌ పరీక్షలో 200 ప్రశ్నలు ఉండేవి. కొత్త క్లాట్‌ నమూనాలో, తక్కువ ప్రశ్నలకు (150) సమాధానం ఇవ్వాలి. కానీ ప్రతి ప్రశ్నకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి రావొచ్ఛు ఎందుకంటే,
ఏ ప్రశ్నకి సమాధానం ఇవ్వాలన్నా పాసేజ్‌ మొత్తం చదివి అర్థం చేసుకోవాలి. అంతే కాదు, పాసేజ్‌లో చెప్పిన దాన్ని అన్వయించగలగాలి. కొత్త విధానంలో విజయం సాధించాలంటే పలు రకాల స్కిల్స్‌ తప్పనిసరి. అవి ఏంటంటే...
* తక్కువ సమయంలో పాసేజ్‌లను చదివి అర్థం చేసుకునే నైపుణ్యం
* చదివిన విషయాలను అన్వయించగలగడం
* ప్రస్తుత సంఘటనల గురించి అవగాహన (కరెంట్‌ అఫైర్స్‌). అది కూడా కేవలం పైపైన కాకుండా, విషయానికి సంబంధించిన వివరణాత్మక అవగాహన
* వాదనలను విశ్లేషించడం, పాసేజ్‌లోని ఊహలను (Assumptions) గుర్తించడం, డిడక్షన్‌, కంక్లూజన్‌ లాంటివి చేయడానికి కావాల్సిన తార్కిక నైపుణ్యాలు
* గ్రాఫ్‌లు, చార్టుల రూపంలో సమర్పించిన డేటాను వివరించే సామర్థ్యం, వాటిపై గణిత లెక్కింపులు చేయగలగడం క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ సెక్షన్‌లో కీలకం.

పైన చెప్పినవన్నీ చేయగలగాలంటే విద్యార్థులు విస్తృతంగా చదవడం, వేగం, గ్రహణ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడం అవసరం. నవలలు, వార్తాపత్రిక కథనాలు, సంపాదకీయాలు, పత్రికలు, ఆంగ్లంలో విమర్శనాత్మక సమీక్షలు, వార్తాంశాలను వివరంగా చదవడం కీలకం. వాటిని చదివిన తరువాత సొంతంగా నోట్సు తయారుచేసుకోగలగాలి. పాఠశాల స్థాయిలో నేర్చుకున్న శాతాలు, నిష్పత్తులు, సగటులు వంటి ప్రాథమిక అంకగణితం బాగా ప్రాక్టీస్‌ చెయ్యాలి.

మాక్‌ పరీక్షలను తప్పనిసరిగా రాయాలి. వీటి ద్వారా మీ బలహీనతలు తెలుసుకోవడంతో పాటు సమయ నిర్వహణ తెలుస్తుంది. బలహీనంగా ఉన్న అంశాల్లో ఎక్కువ కృషి చేయాలి. క్లాట్‌ లాంటి పోటీ పరీక్షలో విజయవంతం కావాలంటే, ఒత్తిడిలో మీ పెర్ఫార్మన్స్‌ మెరుగుపడాలి. అందుకోసం ఎన్ని ఎక్కువ మాక్‌ పరీక్షలు రాస్తే, అంత మంచిది.

పీజీ క్లాట్‌
ఈ పరీక్ష కూడా 150 మార్కులకే ఉంటుంది. అయితే ఇందులో మల్టిపుల్, సబ్జెక్టు ప్రశ్నలు వస్తాయి. మల్టిపుల్‌ విభాగంలో వంద ప్రశ్నలు వస్తాయి. వీటికి వంద మార్కులు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. సబ్జెక్టివ్‌లో రెండు వ్యాసాలు రాయాలి. ఒక్కో దానికి 25 చొప్పున 50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో వ్యాసాన్ని 800 పదాల్లో పూర్తిచేయాలి. లా, వర్తమాన సంఘటనలపై ముడిపడి వ్యాసరూప ప్రశ్నలు వస్తాయి. మొత్తం పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఎల్‌ఎల్‌ఎం ప్రవేశ పరీక్షకోసం ఎల్‌ఎల్‌బీ పాఠ్యపుస్తకాలను పూర్తి స్థాయిలో ఆపోశన పట్టాలి. సబ్జెక్టుపై పట్టుంటునే సీటు సొంతమవుతుంది.

స్కోరుతో ఉద్యోగం
గేట్‌ స్కోరుతో పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలు ఉద్యోగాలిస్తున్నట్లుగానే క్లాట్‌ ఎల్‌ఎల్‌ఎం పరీక్ష స్కోర్, ఇంటర్వ్యూతో కొలువులు లభిస్తున్నాయి. భారత్‌ హెవీ ఎల్రక్టికల్స్‌ లిమిటెడ్, ఓఎన్‌జీసీ లిమిటెడ్, నేషనల్‌ థర్మల్‌ పవర్, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్, పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌...లీగల్‌ విభాగాల్లో ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగులుగా తీసుకుంటున్నాయి. వీరికి లా ఆఫీసర్‌/ అసిస్టెంట్‌ లీగల్‌ అడ్వైజర్‌/ ట్రెయినీ లీగల్‌ అడ్వయిజర్‌ హోదాలు దక్కుతున్నాయి. ఇలా అవకాశం కల్పించే సంస్థల సంఖ్య భవిష్యత్తులో మరింత పెరగనుంది. ఈ పరీక్షలో సాధించిన స్కోర్‌ కు నియామక సంస్థలు (పీఎస్‌యూలు) దాదాపు 75 శాతం వెయిటేజీ ఇస్తున్నాయి. మిగిలిన 25 శాతం ఇంటర్వ్యూకు కేటాయిస్తున్నాయి.

అవకాశాలు...
ఎక్కువ మంది విద్యార్థులు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా మంచి వేతనాలతో కార్పొరేట్‌ కంపెనీల్లో అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. బహుళజాతి కంపెనీలు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులు, ప్రైవేటు ఈక్విటీ కంపెనీలూ, కన్సల్టింగ్‌ సంస్థలూ, అకౌంటింగ్‌ కంపెనీల్లో న్యాయశాస్త్ర పట్టభద్రులకు ఉపాధి లభిస్తుంది. లా గ్రాడ్యుయేట్లను జ్యుడీషియల్‌ క్లర్క్‌లుగానూ తీసుకుంటున్నారు. లీగల్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌ విస్తరిస్తోంది. బోధనలోనూ అవకాశాలు ఉంటాయి. ఎన్జీవోలు, చైల్డ్‌ రైట్స్, హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్లు, కార్పొరేట్‌ లీగల్‌ సెల్స్‌ ...తదితర చోట్ల కొలువులు వస్తాయి. కంపెనీలకు సేవలు అందించడానికి కార్పొరేట్‌ లీగల్‌ ఫర్మ్‌లు సైతం ఉన్నాయి. వీటిలో పెద్ద మొత్తంలో వేతనాలు చెల్లిస్తున్నారు. మీడియా సంస్థల్లోనూ లీగల్‌ జర్నలిజంలో అవకాశాలు ఉంటాయి. సైబర్‌ క్రైమ్, ఆన్‌లైన్‌ మోసాలు, కాపీ రైట్‌ కేసులు ఎక్కువవుతున్నాయి. పెరుగుతోన్న సాంకేతికత లీగల్‌ పట్టభద్రులకు అవకాశాలు కల్పిస్తోంది.

క్లాట్‌తో ప్రవేశాలిక్కడ...
* నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు (ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ)
* నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ లీగల్‌ స్టడీ అండ్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా, హైదరాబాద్‌ (నల్సార్‌)
* ద నేషనల్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ యూనివర్సిటీ, భోపాల్‌ (ఎన్‌ఎల్‌ఐయూ)
* ద వెస్ట్‌ బెంగాల్‌ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జుడీషియల్‌ సైన్సెస్, కోల్‌కతా (డబ్ల్యూబీఎన్‌యూజేఎస్‌)
* నేషనల్‌ లా యూనివర్సిటీ, జోధ్‌పూర్‌ (ఎన్‌ఎల్‌యూజే)
* హిదయతుల్లా నేషనల్‌ లా యూనివర్సిటీ, రాయ్‌పూర్‌ (హెచ్‌ఎన్‌ఎల్‌యూ)
* గుజరాత్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ, గాంధీనగర్‌ (జీఎన్‌ఎల్‌యూ)
* డా.రామ్‌మనోహర్‌ లోహియా నేషనల్‌ లా యూనివర్సిటీ, లఖ్‌నవూ (ఆర్‌ఎంఎల్‌ఎన్‌ఎల్‌యూ)
* రాజీవ్‌గాంధీ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా, పంజాబ్‌ (ఆర్‌జీఎన్‌యూఎల్‌)
* చాణక్య నేషనల్‌ లా యూనివర్సిటీ, పట్నా (సీఎన్‌ఎల్‌యూ)
* ద నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ లీగల్‌ స్టడీస్, కొచ్చి (ఎన్‌యూఏఎల్‌ఎస్‌)
* నేషనల్‌ లా యూనివర్సిటీ ఒడిశా, కటక్‌ (ఎన్‌ఎల్‌యూఓ)
* నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ స్టడీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ లా, రాంచీ (ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్‌)
* నేషనల్‌ లా యూనివర్సిటీ అండ్‌ జుడిషియల్‌ అకాడమీ, అసోం (ఎన్‌ఎల్‌యూజేఏఏ)
* దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీ, విశాఖపట్నం (డీఎస్‌ఎన్‌ఎల్‌యూ)
* తమిళనాడు నేషనల్‌ లా స్కూల్, తిరుచిరాపల్లి (టీఎన్‌ఎన్‌ఎల్‌ఎస్‌)
* మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీ, ముంబయి (ఎంఎన్‌ఎల్‌యూ)
* నేషనల్‌ లా యూనివర్సిటీ, నాగ్‌పూర్‌ (ఎన్‌ఎల్‌యూ)
* నేషనల్‌ లా యూనివర్సిటీ, ఔరంగాబాద్‌ (ఎన్‌ఎల్‌యూ)
* హిమాచల్‌ ప్రదేశ్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ, సిమ్లా
* ధర్మశాస్త్ర నేషనల్‌ లా యూనివర్సిటీ, జబల్‌పూర్‌
* డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ, సోనాపేట్, హర్యానా (డీబీఆర్‌ఏఎన్‌ఎల్‌యూ)

గడువు తేదీ, అర్హతలు
* ఎల్‌ఎల్‌బీ 5 సంవత్సరాల కోర్సులో చేరే విద్యార్థులు ఇంటర్‌ 45% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్‌సీ/ ఎస్‌టీ విద్యార్థులు 40% మార్కులు సరిపోతాయి. చివరి సంవత్సరం పరీక్షకు హాజరవుతున్న వాళ్లూ అర్హులే.
* ఎల్‌ఎల్‌ఎం కోర్సు చేయదల్చినవారు ఎల్‌ఎల్‌బీ పరీక్షను 55% మార్కులతో; ఎస్‌సీ, ఎస్‌టీ వారు 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. చివరి పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు కూడా రాయవచ్ఛు
* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2020
* దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.4000; ఎస్సీ, ఎస్టీలకు రూ.3500.
* పరీక్ష తేది: మే 10
వెబ్‌సైట్: https://consortiumofnlus.ac.in/

Posted on 13-01-2020