Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అర్థశాస్త్రంతో అవ‌కాశాలు విస్తృతం!
 

ఆస‌క్తి ఉండాలేగానీ ఆర్ట్స్ కోర్సులతోనూ రాణించ‌డం క‌ష్టమేమీ కాదు. దీనికి అర్థశాస్త్రమే మంచి ఉదాహ‌ర‌ణ‌. ఎంఏ ఎక‌నామిక్స్ కోర్సు పూర్తిచేసిన‌వాళ్లు కెరీర్‌లో ఎద‌గ‌డానికి అవ‌కాశాలెన్నో ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచ గ‌మ‌నమంతా అర్థశాస్త్రంపైనే ఆధార‌ప‌డి ఉంది. సెన్సెక్స్ దూసుకెళ్లడం, మాన‌వాభివృద్ధి సూచీ ముందుకెళ్లడం, ప్రజ‌ల జీవ‌న ప్రమాణాలు మెరుగుప‌డాల‌న్నా, అభివృద్ధి ప‌రుగులు తీయాల‌న్నా...... అన్నింటా అర్థశాస్త్రమే కీల‌కం. అందుకే ఈ కోర్సు చ‌దివిన‌వాళ్లకు ఉద్యోగ అవ‌కాశాలు విస్తృత‌మ‌య్యాయి. కోర్సుకున్న ప్రాధాన్యం దృష్ట్యా కొన్ని ఐఐటీలు ఎక‌నామిక్స్ ను ప్రత్యేక అంశంగా బోధిస్తున్నాయి. స‌బ్జెక్టుపై ప‌ట్టున్నవాళ్లు వ‌ర‌ల్డ్ బ్యాంక్‌తోపాటు ప‌లు విఖ్యాత ఆర్థిక సంస్థలు, రేటింగ్ ఏజెన్సీల్లో అవ‌కాశాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. అలాగే యూపీఎస్‌సీ ఏటా ఇండియ‌న్ ఎకనామిక్ స‌ర్వీస్ (ఐఈఎస్‌) ప‌రీక్షను నిర్వహిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎక‌నామిక్స్ కోర్సు స్వరూపం, ప్రముఖ సంస్థలు, ఉద్యోగ అవ‌కాశాల గురించి తెలుసుకుందాం....

ప‌రిధి..విస్తృతం
సైన్స్ స‌బ్జెక్టుల్లాగే అర్థశాస్త్రం ప‌రిధి చాలా విస్తృత‌మైంది. ఇందులో ఎన్నో అంత‌ర్భాగాలున్నాయి. దీంతో ఈ స‌బ్జెక్టును ఎంచుకున్నవారు ప‌లు విభాగాల్లో లోతుగా అధ్యయ‌నం చేయ‌డం త‌ప్పనిస‌రి. వాటిలో మైక్రో ఎక‌నామిక్స్‌, మ్యాక్రో ఎక‌నామిక్స్‌, సెమీమైక్రో ఎక‌నామిక్స్‌, ట్రేడ్‌, స్టాటిస్టిక్స్‌, మ్యాథ‌మెటిక్స్‌, మార్కెట్ అండ్ ప్రైస్ మెకానిజం, కన్జ్యూమ‌ర్ ఛాయిస్‌, ఎలాస్టిసిటీ, ప్రొడ‌క్షన్ ఫంక్షన్, .త‌దిత‌ర అంశాల గురించి ఎక‌నామిక్స్ కోర్సు చ‌దివిన‌వాళ్లు తెలుసుకుంటారు.

స్పెష‌లైజేష‌న్లెన్నో...
దేశంలో దాదాపు ప్రతి యూనివ‌ర్సిటీ లోనూ ఎంఏ ఎక‌నామిక్స్ కోర్సు బోధిస్తున్నారు. ప‌లు ప్రైవేటు సంస్థల్లోనూ పీజీ స్థాయిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. సైన్స్ కోర్సుల్లో ఉన్నట్టుగానే ఎక‌నామిక్స్‌లో ఎన్నో స్పెష‌లైజేష‌న్లు అందుబాటులో ఉన్నాయి. ఇంట‌ర్నేష‌న‌ల్ ఎక‌నామిక్స్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రేడ్‌, క్వాంటిటేటివ్ ఎక‌నామిక్స్‌, వ‌ర‌ల్డ్ ఎకాన‌మీ, అగ్రిక‌ల్చర‌ల్ ఎక‌నామిక్స్‌, ఫైనాన్షియ‌ల్ ఎక‌నామిక్స్‌, లేబ‌ర్ ఎక‌నామిక్స్‌, ఇండ‌స్ట్రియ‌ల్ ఎక‌నామిక్స్‌, మ్యాథ‌మెటిక‌ల్ ఎక‌నామిక్స్‌, బిజినెస్ ఎక‌నామిక్స్‌, బ్యాంకింగ్ ఎక‌నామిక్స్‌, ఎన్విరాన్‌మెంట‌ల్ ఎక‌నామిక్స్‌, డెవ‌ల‌ప్‌మెంట‌ల్ ఎక‌నామిక్స్‌, రూర‌ల్ ఎక‌నామిక్స్‌, ఎన‌లిటిక‌ల్ ఎక‌నామిక్స్‌, ఎక‌నోమెట్రిక్స్‌...ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్పెష‌లైజేష‌న్లే ఉన్నాయి.

ఉద్యోగాలివీ...
అర్థశాస్త్రం చ‌దివిన‌వాళ్లకు అవ‌కాశాలు ఎక్కువ‌గానే ఉంటాయి. స‌బ్జెక్టుపై విస్తృత‌ ప‌రిజ్ఞానం, ఆంగ్ల భాషా సామ‌ర్థ్యం రెండూ ఉంటే బ‌హుళ‌జాతి సంస్థల్లో కొలువులు సొంతం చేసుకోవ‌చ్చు. ప‌రిశోధ‌కులు, విశ్లేష‌కులు, ఆర్థిక స‌ల‌హాదారు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక‌ర్‌, వెంచ‌ర్ క్యాపిట‌లిస్ట్‌, ఆడిటర్‌, స్టాక్ బ్రోక‌ర్‌, మీడియా విశ్లేష‌కుడు, బిజినెస్ జ‌ర్నలిస్ట్ త‌దిత‌ర హోదాల‌తో ఉద్యోగాలు పొందొచ్చు. బోధ‌నా రంగంలో రాణించాల‌నుకునే ఎక‌నామిక్స్‌ గ్రాడ్యుయేట్లు బీఏ ఎక‌నామిక్స్ పూర్తయిన త‌ర్వాత బీఈడీ పూర్తిచేసి ఉన్నత పాఠ‌శాల‌ల్లో సాంఘిక‌శాస్త్ర ఉపాధ్యాయులుగా కొనసాగొచ్చు. ఎంఏ ఎక‌నామిక్స్‌తో జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో లెక్చర‌ర్‌గా స్థిర‌ప‌డొచ్చు. యూజీసీ నెట్ ద్వారా ప్రభుత్వ డిగ్రీ క‌ళాశాల‌ల్లో, యూనివ‌ర్సిటీల్లో ఎక‌నామిక్స్ పోస్టుల‌కు పోటీ ప‌డొచ్చు. బీ స్కూళ్లు, ఎంబీఏ క‌ళాశాల‌ల్లోనూ ఎక‌నామిక్స్ పోస్టు గ్రాడ్యుయేట్లకు అవ‌కాశాలుంటాయి. పీహెచ్‌డీ చేయ‌డం ద్వారా బోధ‌నా రంగంలోనే కాకుండా అర్థశాస్త్ర ప‌రిశోధ‌నా సంస్థల్లో రాణించ‌వ‌చ్చు.

అవ‌కాశాలిక్కడ‌...
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆర్థిక రంగంలో ప‌రిశోధ‌నా సంస్థలు, అంత‌ర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, క‌న్సల్టెన్సీలు, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఇంజినీరింగ్ కంపెనీలు, బీమా సంస్థలు, త‌యారీ సంస్థలు, ప్రక‌ట‌నా సంస్థలు, బోధ‌నా రంగం, మీడియా, రిటైల్‌ ...ఇలా భిన్న రంగాల‌కు చెందిన సంస్థల్లోని ప‌లు విభాగాల్లో అర్థశాస్త్ర నిపుణులు అవ‌కాశాలు సొంతం చేసుకోవ‌చ్చు.

ఐఐటీల్లోనూ...
గ‌డిచిన నాలుగైదేళ్ల నుంచి కొన్ని ఐఐటీలు ఎక‌నామిక్స్ కోర్సును యూజీ, పీజీ స్థాయిలో బోధిస్తున్నాయి. ఈ స‌బ్జెక్టులో బీఎస్‌, బీఎస్‌-ఎంఎస్‌, ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఎంఎస్‌సీ, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. చెన్నై, కాన్పూర్‌, ఖ‌ర‌గ్‌పూర్‌, మాండి, పాట్నా, గాంధీన‌గ‌ర్‌, ఇండోర్ ఐఐటీలు ఎక‌నామిక్స్‌లో వివిధ కోర్సులు నిర్వహిస్తున్నాయి. బీఎస్‌, బీఎస్‌-ఎంఎస్ కోర్సులు కాన్పూర్‌లో, ఎమ్మెస్సీ కోర్సు ఖ‌ర‌గ్‌పూర్‌లో నిర్వహిస్తున్నారు. ఎక‌నామిక్స్‌లో పీహెచ్‌డీ కోర్సు కాన్పూర్‌, ఖ‌ర‌గ్‌పూర్‌, మాండి, పాట్నా, గాంధీనగ‌ర్‌, ఇండోర్‌ల్లో అందుబాటులో ఉంది. ఐఐటీ మ‌ద్రాస్ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఎక‌నామిక్స్ కోర్సు నిర్వహిస్తోంది.

జాతీయ స్థాయిలో పేరున్న సంస్థలు
జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ, న్యూదిల్లీ
వెబ్‌సైట్: http://www.jnu.ac.in/

ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్‌, న్యూదిల్లీ
వెబ్‌సైట్: http://econdse.org/

హైద‌రాబాద్ సెంట్రల్ యూనివ‌ర్సిటీ
వెబ్‌సైట్: http://www.uohyd.ac.in/

ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ ఇన్‌స్టిట్యూట్ కోల్‌క‌త‌, న్యూదిల్లీ (ఎం.ఎస్. క్వాంటిటేటివ్ ఎక‌నామిక్స్)
వెబ్‌సైట్: http://www.isical.ac.in/

జామియా మిల్లియా ఇస్లామియా యూనివ‌ర్సిటీ, న్యూదిల్లీ
http://jmi.ac.in/

గోఖ‌లే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎక‌నామిక్స్‌, పుణే
వెబ్‌సైట్: http://www.gipe.ac.in/

మ‌ద్రాస్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్‌, చెన్నై
వెబ్‌సైట్: http://www.mse.ac.in/

ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవ‌ల‌ప్‌మెంట్‌ రీసెర్చ్‌, ముంబై
వెబ్‌సైట్: http://www.igidr.ac.in/

బెనార‌స్ హిందూ యూనివ‌ర్సిటీ, వార‌ణాసి
వెబ్‌సైట్: http://www.bhu.ac.in/

ఆంధ్రప్రదేశ్‌లో...
ఆంధ్రా యూనివ‌ర్సిటీ, విశాఖ‌ప‌ట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in/

ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీ, గుంటూరు
వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in/

శ్రీవెంక‌టేశ్వర యూనివ‌ర్సిటీ, తిరుప‌తి
వెబ్‌సైట్: www.svuniversity.ac.in/

శ్రీకృష్ణదేవ‌రాయ యూనివ‌ర్సిటీ, అనంత‌పురం
వెబ్‌సైట్: www.skuniversity.org/

డా.బి.ఆర్‌.అంబేద్కర్ యూనివ‌ర్సిటీ, శ్రీకాకుళం
వెబ్‌సైట్: www.brau.in/index.shtml

తెలంగాణ‌లో...
ఉస్మానియా యూనివ‌ర్సిటీ
వెబ్‌సైట్: www.osmania.ac.in/

కాక‌తీయ యూనివ‌ర్సిటీ
వెబ్‌సైట్: www.kakatiya.ac.in/

ఈ యూనివ‌ర్సిటీల‌కు అనుబంధంగా ఉన్న ప‌లు ప్రైవేటు క‌ళాశాల‌ల్లోనూ ఎంఏ ఎక‌నామిక్స్ కోర్సును బోధిస్తున్నారు. ఆయా యూనివ‌ర్సిటీలు నిర్వహించే పీజీ సెట్‌ల ద్వారా ప్రవేశం ల‌భిస్తుంది.

యూపీఎస్‌సీ ఐఈఎస్ ప‌రీక్ష
యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్‌సీ) ఏటా ఇండియ‌న్ ఎక‌నామిక్ స‌ర్వీసెస్ (ఐఈఎస్‌) ప‌రీక్షను నిర్వహిస్తోంది.
అర్హత‌: ఎక‌నామిక్స్‌, అప్లయిడ్ ఎక‌నామిక్స్‌, బిజినెస్ ఎక‌నామిక్స్, ఎక‌నామెట్రిక్స్ వీటిలో ఎందులోనైనా పీజీ ఉత్తీర్ణత‌.
వ‌యోప‌రిమితి: 21 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల‌కు నిబంధ‌న‌ల ప్రకారం గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు ఉంటాయి)
వెబ్‌సైట్‌: www.upsc.gov.in

posted on 18-6-2015