Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఎఫ్‌సీఐ పోస్టులకు సిద్ధమేనా?
 

భారత ప్రభుత్వరంగ సంస్థ ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వివిధ కేటగిరీల్లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీల నియామకానికి ఇటీవల ప్రకటన విడుదల చేసింది. జోన్‌ల వారీగా 349 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్న సౌత్‌ జోన్‌లోనే దాదాపు మూడో వంతు (113) ఖాళీలున్నాయి. వీటికి తయారయే విధానం తెలుసుకుందాం!
ఐబీపీఎస్‌ స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పరీక్షను పోలి ఉండి 6 నెలల శిక్షణ కాలం తరువాత మేనేజర్‌ స్థాయిలో దాదాపు నలభై వేల జీతంతో నియమితులయ్యే ఉద్యోగాలివి. సాధారణ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ విద్యార్థులకు- ముఖ్యంగా బ్యాంకు పరీక్షలు రాసే అభ్యర్థులకు మంచి అవకాశం. అభ్యర్థులు ఏదో ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
వీటిలో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (జూనియర్‌/ డిపో/ మూవ్‌మెంట్‌) ఉద్యోగాలకు సాధారణ డిగ్రీ, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (అకౌంట్స్‌/ టెక్నికల్‌/ సివిల్‌ ఇంజినీరింగ్‌/ మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌) ఆయా సబ్జెక్టులతో కూడిన డిగ్రీ ఉండాలి.
పరీక్ష విధానం
ఈ పోస్టులకు రాతపరీక్ష, బృందచర్చ, మౌఖిక పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.
మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (జనరల్‌/ డిపో/ మూవ్‌మెంట్‌) రాతపరీక్షలో ఒకే పేపర్‌ (పేపర్‌-1) ఉంటుంది. మిగిలిన పోస్టులకు రెండు పేపర్లు (పేపర్‌-1, 2) ఉంటాయి.
పేపర్‌-1లో రీజనింగ్‌, డేటా అనాలిసిస్‌, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, మేనేజ్‌మెంట్‌, కరెంట్‌ అఫైర్స్‌తో కూడిన జనరల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 120 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలుంటాయి.
పేపర్‌-2లో అభ్యర్థులు దరఖాస్తు చేసిన పోస్టుకు సంబంధించిన సబ్జెక్టు నుంచి 120 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలుంటాయి. వీటిలో అకౌంట్స్‌ పరీక్షకు జనరల్‌ అకౌంటింగ్‌, ఫైనాన్స్‌; టెక్నికల్‌ పరీక్షకు అగ్రికల్చర్‌, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ బయోటెక్నాలజీ నుంచి ప్రశ్నలుంటాయి. అదేవిధంగా సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పరీక్షకు ఆయా సబ్జెక్టుల్లో ప్రశ్నలుంటాయి. వీటిలో ఒక్కో పేపర్‌కు 90 నిమిషాల కాలవ్యవధి ఉంటుంది. వీటికి రుణాత్మక మార్కులు లేవు.
సన్నద్ధత
వీటిలో పేపర్‌-1లోని జనరల్‌ ఆప్టిట్యూడ్‌లో ప్రశ్నలు వచ్చే సబ్జెక్టులన్నీ బ్యాంకు పరీక్షలోనివే. అందువల్ల బ్యాంకు పరీక్షలకు ఇంతకు ముందునుంచే సిద్ధమవుతున్నవారికి ప్రత్యేకమైన సన్నద్ధత అవసరం లేదు. వీరు పేపర్‌-2లో వారు దరఖాస్తు చేసుకున్న పోస్టుకు సంబంధించిన సబ్జెక్టుకు బాగా సన్నద్ధమయితే సరిపోతుంది. ఇతరులు మాత్రం రెండింటికీ బాగా తయారవాలి. పేపర్‌-1లోని జనరల్‌ ఆప్టిట్యూడ్‌లోని ప్రశ్నలు వచ్చే రీజనింగ్‌, డేటా అనాలిసిస్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్స్‌, మేనేజ్‌మెంట్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ విభాగాల నుంచి ఒక్కోదాని నుంచి 20- 25 వరకు ప్రశ్నలు వచ్చే అవకాశముంది.
నోటిఫికేషన్‌ ముఖ్యాంశాలు
దరఖాస్తు తేదీలు (ఆన్‌లైన్‌లో)
ప్రారంభతేదీ: 2.06.2015
చివరి తేదీ: 2.07.2015
దరఖాస్తు ఫీజు: రూ.600 (ఎస్‌సీ/ ఎస్‌టీ/ పీడబ్ల్యూడీ/ మహిళ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు)
గరిష్ఠ వయసు (1.08.2015 నాటికి): 28 సంవత్సరాలు
పరీక్ష కేంద్రాలు (సౌత్‌ జోన్‌): హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం
వెబ్‌సైట్‌: www.fcijobsportal.com
* రీజనింగ్‌: సాధారణ రీజనింగ్‌లోని బ్లడ్‌ రిలేషన్స్‌, డైరెక్షన్స్‌, సిలాజిజమ్‌, సీక్వెన్స్‌- సిరీస్‌, వెన్‌ డయాగ్రమ్‌, డేటా సఫిషియన్సీ, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్‌తోపాటుగా లాజికల్‌ రీజనింగ్‌లోని పజిల్‌ టెస్ట్‌, ఇన్‌పుట్‌- అవుట్‌పుట్‌ స్టేట్‌మెంట్‌ సంబంధ ప్రశ్నలు మొదలైన వాటిలోనివి బాగా నేర్చుకుని సాధన చేయాలి.
* డేటా అనాలసిస్‌: గ్రాఫులు, పట్టికతోకూడిన ఈ ప్రశ్నలు సాధించడానికి అభ్యర్థులు అంకగణితంలోని శాతాలు, సగటు, నిష్పత్తి, లాభనష్టాలు, వడ్డీ మొదలైనవాటిని బాగా నేర్చుకోవడంతోపాటు లెక్కలు వేగంగా చేయగలిగేలా సాధన చేయాలి. అంకగణితంలోని ఇతర అంశాలను కూడా నేర్చుకుంటే ఇతర బ్యాంకు పరీక్షలకు కూడా బాగా ఉపయోగం.
* జనరల్‌ అవేర్‌నెస్‌: దీనిలో జనరల్‌ నాలెడ్జ్‌లో ఉండే ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జనరల్‌ సైన్స్‌- టెక్నాలజీ, జాగ్రఫీ, ముఖ్యతేదీలు, వార్తల్లోని వ్యక్తులు, పుస్తకాలు- రచయితలు, అవార్డులు మొదలైనవాటిని బాగా చూసుకోవాలి. కరెంట్‌ అఫైర్స్‌ కూడా దీనిలో భాగంగానే ఉంటుంది.
* కంప్యూటర్‌ అవేర్‌నెస్‌: సాధారణంగా దీనిలోని ప్రశ్నలు కంప్యూటర్‌ బేసిక్స్‌, ఎంఎస్‌ ఆఫీస్‌, విండోస్‌, ఇంటర్నెట్‌, ఆపరేటింగ్‌ సిస్టం, నెట్వర్కింగ్‌, టర్మినాలజీ మొదలైనవాటితోపాటుగా కంప్యూటర్‌ రంగానికి సంబంధించిన తాజా పరిణామాల నుంచి ఉంటాయి. బాగా దృష్టిసారిస్తే ఈ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలన్నింటినీ తేలికగా సాధించవచ్చు.
పేపర్‌-2 విభాగం అభ్యర్థులు తమ అకడమిక్‌ డిగ్రీలో చదివిన సబ్జెక్టుతో ఉండడంతో దానిలో మంచి మార్కులు సాధించవచ్చు. అయితే సబ్జెక్టుకు సంబంధించిన అంశాలన్నీ బాగా చూసుకోవాలి.
పరీక్ష తేదీని నోటిఫికేషన్‌లో వెల్లడించనప్పటికీ పరీక్షకు కనీసం రెండున్నర నెలలకు పైగా సమయం ఉంటుంది. ఈ సమయంలోనే వీటన్నింటికీ బాగా తయారవ్వాలి. ఈ పరీక్ష సన్నద్ధత రాబోయే ఐబీపీఎస్‌ పరీక్షలకు చాలా ఉపయోగకరం.

posted on 16-6-2015