Preparation


భవితకు మలుపు!

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)లో ఉత్తీర్ణత విద్యార్థి సాంకేతిక పరిజ్ఞానానికి సూచిక. ఇంజినీరింగ్‌లో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకూ, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాలకూ గేట్‌ స్కోరు ప్రామాణికం. ఈ పరీక్ష వల్ల ప్రత్యక్షంగానే కాకుండా పరోక్ష ప్రయోజనాలూ ఉన్నాయి. దీనికి సర్వసన్నద్ధం ఎలా కావాలో తెలుసుకుందాం!

ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలతో పాటు ఐఐఎస్‌సీ, బెంగళూరు, వివిధ ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్‌/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్‌ విభాగాల్లో చేరడానికి గేట్‌ స్కోరు తప్పనిసరి. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, ఉన్నత విద్యాశాఖల తరఫున ఐఐఎస్‌సీ, ఐఐటీల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈసారి గేట్‌ను ఐఐటీ రూర్కీ నిర్వహిస్తోంది.
ఈ సంవత్సరం గేట్‌ను మనదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో- బంగ్లాదేశ్‌, ఇథియోపియా, నేపాల్‌, సింగపూర్‌, శ్రీలంక, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో కూడా నిర్వహిస్తున్నారు.
ప్రత్యక్ష ఉపయోగాలు
* గేట్‌ స్కోరుతో దేశంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో పీజీ కోర్సు ప్రవేశంతోపాటు నెలకు రూ.12,400 ఉపకార వేతనం లభిస్తుంది.
* ఈ స్కోరు పీహెచ్‌డీ ప్రవేశాలకూ ఉపయోగం. ఇంకా నెలకు రూ.28,000 ఉపకార వేతనం అందిస్తారు.
* ఎన్‌ఐటీఐఈ (ముంబయి)లో పీజీ డిప్లొమా చేయటానికి ఈ స్కోరు ఉపయోగపడుతుంది.
* ఈ స్కోరు ద్వారా ఐఐటీ ఢిల్లీ/దిల్లీ, ఎన్‌ఐటీ సూరత్‌కల్‌/తిరుచ్చిలో ఎంటెక్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ చేయడానికి ఎల్‌అండ్‌టీ ఉపకార వేతనం ఇస్తుంది. విజయవంతంగా ఎంటెక్‌ పూర్తిచేస్తే ఉద్యోగావకాశమూ కల్పిస్తుంది.
* గేట్‌ స్కోరు ఆధారంగా వివిధ ఐఐఎంలలో ఫెలో ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లు అందిస్తారు.
* బాబా అటామిక్‌ రిసర్చ్‌ సెంటర్‌ వంటి పరిశోధన సంస్థలు కూడా ఈ స్కోరును గుర్తిస్తున్నాయి. గ్రూప్‌-ఏ లెవల్‌ సంబంధిత పోస్టులైన సీనియర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌, సీనియర్‌ రిసర్చ్‌ ఆఫీసర్‌, ఎస్‌ఆర్‌ఓ (ఎస్‌అండ్‌టీ) నియామకాలకు కూడా గేట్‌ స్కోరే ఆధారం.
* కొత్తగా ఈ సంవత్సరం నుంచి డీఆర్‌డీఓ కూడా తమ సంస్థలో ఉద్యోగ నియామకాలకు గేట్‌ స్కోరును పరిగణనలోకి తీసుకుంటోంది.
* విదేశీ విద్య: ఈ స్కోరు ఆధారంగా ఎంఎస్‌, పీహెచ్‌డీ ప్రోగాం అందించే విదేశీ విశ్వవిద్యాలయాలు 1) సింగపూర్‌లోని నాన్‌యంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (ఎన్‌టీయూ) 2) నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ (ఎన్‌యూఎస్‌) 3) జర్మనీలోని RWTH AACHEN, టెక్నికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మ్యూనిచ్‌.
పరోక్ష ఉపయోగాలు
* కొత్తగా ప్రవేశపెట్టిన ఈఎస్‌ఈ స్టేజ్‌-1కు సిద్ధమవటానికి గేట్‌ సన్నద్ధత దృఢమైన పునాదిని వేస్తుంది.
* ఇది ఇతర పోటీపరీక్షలకూ ఉపయోగమే.
* ప్రాంగణ నియామకాల్లో, నియామక ఇంటర్వ్యూల్లో గేట్‌ ప్రిపరేషన్‌ పనికివస్తుంది.
దరఖాస్తు ప్రక్రియ
* ఐఐఎస్‌సీ, ఏడు ఐఐటీల్లోని ఏదో ఒక గేట్‌ జోనల్‌ వెబ్‌సైట్‌లోని ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ సిస్టమ్‌ (GOAPS ) ఉపయోగించి దరఖాస్తును ఆన్‌లైన్‌లో నింపి రిజిస్టర్‌ చేసుకోవాలి. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌: http://gate.iitr.ernet.in
* గేట్‌ 2017 దరఖాస్తు ఫారాలు ఆన్‌లైన్‌లో సంబంధిత వెబ్‌సైట్లో మాత్రమే లభిస్తాయి. బయట ఎక్కడా అమ్మరు.
* గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఆఖరి సంవత్సరం చదివే, ఇంజినీరింగ్‌ పూర్తయిన విద్యార్థులు గేట్‌ రాయటానికి అర్హులు. మూడో సంవత్సరం విద్యార్థులు అనర్హులు.
* ఇంజినీరింగ్‌ పూర్తయినవారు డిగ్రీ సర్టిఫికెట్‌/ ప్రొవిజనల్‌తో దరఖాస్తు చేయాల్సివుంటుంది. కోర్సు చదువుతున్న విద్యార్థులకు ప్రిన్సిపల్‌ నుంచి పొందిన అనుమతి పత్రం సరిపోతుంది.
గేట్‌-2017: ప్రధాన విషయాలు
* ఈ పరీక్షను 23 పేపర్లలో నిర్వహిస్తున్నారు. గేట్‌ను ఆన్‌లైన్లో నిర్వహించడం వల్ల ప్రశ్నపత్రాలను వివిధ సెట్లుగా రూపకల్పన చేస్తున్నారు. కాబట్టి అధ్యాయాలతో సహా అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. అభ్యర్థులు ఏ సబ్జెక్టునూ నిర్లక్ష్యం చేయకుండా అన్ని సబ్జెక్టుల్లో ప్రతి అధ్యాయాన్నీ చదవాలి.
* గేట్‌ స్కోరు పీజీ ప్రవేశానికి మూడు సంవత్సరాలు, పీఎస్‌యూలకు 1 లేదా 2 సంవత్సరాలు చెల్లుబాటులో ఉంటుంది.
వర్చ్యువల్‌ కాల్‌క్యులేటర్‌:
* పరీక్ష కేంద్రంలోకి కాల్‌క్యులేటర్‌, మొబైల్స్‌ను అనుమతించరు. అభ్యర్థులు కాల్‌క్యులేషన్స్‌ చేసుకోవడానికి ఆన్‌లైన్‌ వర్చువల్‌ కాల్‌క్యులేటర్‌ను అందుబాటులోకి ఉంచుతారు. కంప్యూటర్‌ మౌస్‌ను ఉపయోగించి ఈ కాల్‌క్యులేటర్‌ను వాడుకోవచ్చు.
* వర్చ్యువల్‌ కాల్‌క్యులేటర్లో అన్ని రకాల ఫంక్షన్లు లేకపోవడం వల్ల దీనికి అనుగుణంగానే వివిధ విభాగాల్లో ప్రశ్నలు రూపొందే అవకాశం ఉంది.
* ఇమేజినరీ ఫంక్షన్స్‌, హైయర్‌ ఆర్డర్‌ సమీకరణాలకు సంబంధించిన ప్రశ్నలు అడగకపోవచ్చు.
* గేట్‌ ఉదయం, మధ్యాహ్నం ప్రత్యామ్నాయ వారాంతాల్లో (శనివారం, ఆదివారం) 2017 ఫిబ్రవరి 4, 5; ఫిబ్రవరి 11, 12 లలో జరుగుతుంది.
* ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ మౌస్‌ను ఉపయోగించి సరైన ఆప్షన్‌ గుర్తించాలి.
* న్యూమరికల్‌ ప్రశ్నలకు ఆప్షన్లు ఇవ్వరు. ఈ ప్రశ్నలకు సమాధానాలు వర్చువల్‌ కీ బోర్డును ఉపయోగించి రాయాలి.
గేట్‌ ప్రశ్నపత్రం మొత్తం 100 మార్కులకు. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలుంటాయి.
విభాగం-1 (జనరల్‌ ఆప్టిట్యూడ్‌): ఇందులో 10 ప్రశ్నలుంటాయి. ఒకటి నుంచి ఐదు ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. 6 నుంచి 10 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు.
* ఈ విభాగంలోని 4 నుంచి 5 ప్రశ్నలు ఇంగ్లిష్‌ సంబంధితం (వెర్బల్‌ ఎబిలిటీ). మిగతావి క్వాంటిటేటివ్‌కు సంబంధించిన ఇవ్వొచ్చు.
విభాగం-2 (సంబంధిత ఇంజినీరింగ్‌ సబ్జెక్టులు): ఇందులో 55 ప్రశ్నలుంటాయి. 1-25 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. 26-55 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు.
* గత సంవత్సరం ప్రశ్నపత్రంలో కామన్‌ డేటాబేస్డ్‌ ప్రశ్నలు, లింక్‌ ప్రశ్నలు ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా ఈ ప్రశ్నలు ఇవ్వకపోవచ్చు.
నెగిటివ్‌ మార్కులతో జాగ్రత్త: గేట్‌లో ఒక తప్పు జవాబుకు 33.33 శాతం రుణాత్మక మార్కులుంటాయి. అంటే ఒక మార్కు ప్రశ్నలకు 1/3, రెండు మార్కుల ప్రశ్నలకు 2/3 చొప్పున మైనస్‌ మార్కులుంటాయి. న్యూమరికల్‌ ప్రశ్నలకు రుణాత్మక మార్కులుండవు.
ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది?
పరీక్షపత్రంలో ప్రశ్నలు ఎలా ఉండాలో, ఏ సబ్జెక్టుకు ఎంత ప్రాధాన్యం ఉండాలో ఐఐటీల కోర్‌ కమిటీ నిర్ణయిస్తుంది. గత పరీక్షపత్రాల సరళి ప్రకారం పరిశీలిద్దాం.
ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ బ్రాంచిల్లో...
35 శాతం ప్రశ్నలు: కామన్‌ సబ్జెక్టుల్లో ఉంటాయి. ఉదా: డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌, అనలాగ్‌ ఎలక్ట్రానిక్స్‌, మైక్రో ప్రాసెసర్స్‌, నెట్‌వర్క్‌ థియరీ, కంట్రోల్‌ సిస్టమ్స్‌, సిగ్నల్‌ అండ్‌ సిస్టమ్స్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ థియరీ
35 శాతం ప్రశ్నలు: సంబంధిత కోర్‌ సబ్జెక్టుల్లో
ఎ) ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌: పవర్‌ సిస్టమ్స్‌, మెషిన్స్‌, మెజర్‌మెంట్స్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌
బి) ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌: ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ థియరీ, కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్‌ డివైసెస్‌
సి) ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ ఇంజినీరింగ్‌: సెన్సార్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రానిక్‌ మెజర్‌మెంట్స్‌, ఆప్టికల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌
గణితం: 10-15 శాతం ప్రశ్నలు. అయితే ఈ విభాగంలోనివి శుద్ధ గణితంలాగా ఉండవు. ఇంజినీరింగ్‌ అప్లికేషన్‌తో ఉంటాయి.
* ముఖ్యమైన సూచన ఏమిటంటే... ప్రశ్నలు ఆయా రంగాల్లోని నూతన ఆవిష్కరణలను దృష్టిలో పెట్టుకునివుంటాయి. ఎలక్ట్రికల్‌ పేపర్లో పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ పేపర్లో డిజిటల్‌ కమ్యూనికేషన్‌, వీఎల్‌ఎస్‌ఐ విభాగాల్లో నిత్యం మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సబ్జెక్టుల్లో లోతుగా అధ్యయనం చేయాల్సిందే!
* ప్రతి పేపర్లో పదికి మించిన సబ్జెక్టులు. కానీ మొత్తం ప్రశ్నలు 65. ఏ సబ్జెక్టుకు ఎన్ని ప్రశ్నలు అనేది ఐఐటీలకు ఒక సవాలుగా మారింది. అందుకని ఐఐటీ ప్రొఫెసర్లు రెండు మూడు సబ్జెక్టుల విషయాలను కలిపి ప్రశ్నలుగా సంధిస్తున్నారు. ప్రతి పేపర్లో వివిధ సబ్జెక్టులను మిళితం చేస్తూ ప్రశ్నలు రూపొందిస్తున్నారు.
విజయానికి సూత్రాలు
1. ఇప్పటినుంచే రోజూ కనీసం 6 నుంచి 8 గంటలు సాధనకు కేటాయించాలి. ప్రతి వారాంతం, నెలకోసారి చదివిన అంశాలను విశ్లేషించుకోవాలి. సన్నద్ధతలో పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం.
2. పరీక్షలో ప్రతి ప్రశ్నకూ సరైన సమాధానం రాయడం కష్టం. మూడు గంటల వ్యవధిలో ఎన్ని ప్రశ్నలు, ఏ ప్రశ్నలు రాస్తే ఎన్ని మార్కులు సాధించగలమనేది నిర్ణయించుకోవాలి.
3. సన్నద్ధమయే సమయంలో కూడా ఇదే సూత్రాలు పాటించాలి. అందుబాటులో ఉన్న ఆరునెలల సమయంలో ఏవి చదివితే ఎక్కువ మార్కులు వస్తాయో నిర్ణయించుకోవాలి.
4. ఆన్‌లైన్‌ మోడల్‌ పేపర్లను తప్పనిసరిగా సాధన చేయాలి.
5. తొలిసారి సిద్ధమయేటపుడు ప్రతి అధ్యాయానికీ సంబంధించి ముఖ్య విషయాలను చిన్న పట్టికల ద్వారా సంక్షిప్తంగా తయారుచేసుకోవాలి. పరీక్ష ముందురోజుల్లో పునశ్చరణకు ఇది చాలా ఉపయోగం.
6. ప్రామాణిక పాఠ్యపుస్తకాలను ఎంచుకోవడం ప్రధానం
7. ఇంజినీరింగ్‌, సివిల్‌ సర్వీసెస్‌ గత ప్రశ్నపత్రాల అధ్యయనం చాలా ప్రయోజనకరం. దీనివల్ల ఒక అంశాన్ని ఎన్నివిధాలుగా అడగటానికి అవకాశం ఉంటుందో తెలుస్తుంది.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబరు 1, 20160
ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు గడువు: అక్టోబరు 4, 2016
గేట్‌-2017 తేదీలు: 2017 ఫిబ్రవరి 4, 5; ఫిబ్రవరి 11, 12

GATE - 2017 Info.

  • Preparation
  • Notification
  • Syllabus