ప్రిప‌రేష‌న్ ప్లాన్‌

కలిపి చదివితే కలదు ఫలం!

* ఈఎస్‌ఈ ప్రిలిమ్స్‌, గేట్‌- 2019

రెండు కీలకమైన జాతీయస్థాయి పరీక్షలు! మొదటిది పీజీకీ, ఉద్యోగానికీ ఉపయోగపడితే; రెండోది సివిల్స్‌ తరహాలో సాంకేతిక హోదాను అందించటంలో సహాయపడుతుంది. ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రతిష్ఠాత్మకంగా భావించే గేట్‌, ఈఎస్‌ఈ (ప్రిలిమ్స్‌)లు కొత్త సంవత్సరంలో నెల రోజుల విరామంతో జరగబోతున్నాయి. వీటిలో ఏదో ఒకదాన్నే రాసేవారూ, రెండూ రాసేవారూ ఈ తరుణంలో వేటిపై దృష్టిపెట్టాలి? మంచి స్కోరు సాధించాలంటే... తమ సన్నద్ధతకు తుది మెరుగులు ఎలా దిద్దుకోవాలి?ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ -(ఈఎస్‌ఈ ప్రిలిమ్స్‌-2019) నాలుగు బ్రాంచీల్లో నిర్వహిస్తారు. ఆఫ్‌లైన్‌లో జరిగే ఈ పరీక్షకు దాదాపు 45 రోజుల సమయం ఉంది. గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ -(గేట్‌ - 2019) 24 బ్రాంచీల్లో జరుగుతుంది. ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్షకు సుమారు రెండు నెలల సమయం మిగిలుంది. సబ్జెక్టుల వెయిటేజిని విస్మరించకుండా చదవగలిగితే రెండు పరీక్షలకూ ఏకకాలంలో ప్రిపేర్‌ అయినట్లే అవుతుంది!
ఈఎస్‌ఈ ప్రిలిమినరీకి థియరీ ఆధారిత ప్రశ్నలనూ, కాల్‌క్యులేటర్‌ ఉపయోగించకుండా ప్రశ్నలనూ సాధన చేయాలి. ఈ పరీక్ష తర్వాత గేట్‌కు దాదాపు నెలరోజుల వ్యవధి దొరుకుతుంది. ఈ సమయంలో ఎక్కువగా న్యూమరికల్‌ ప్రశ్నలు సాధన చేయాలి. కరంట్‌ అఫైర్స్‌ నవంబరు మొదటివారం వరకూ చదివితే సరిపోతుంది.
గేట్‌, ఈఎస్‌ఈల ప్రశ్నల సరళిలో వ్యత్యాసం ఉంటుంది. ఈఎస్‌ఈలో థియరీ ఆధారిత ప్రశ్నలు ఎక్కువ. గేట్‌లో న్యూమరికల్‌ ప్రశ్నలు ఎక్కువ. ఈఎస్‌ఈ (ప్రిలిమ్స్‌), గేట్‌ల సిలబస్‌ దాదాపుగా సమానం. అయితే ఈఎస్‌ఈ మొత్తం సిలబస్‌ గేట్‌తో పోలిస్తే ఎక్కువే. టెక్నికల్‌ విభాగాన్ని పరిశీలిస్తే- ఈఎస్‌ఈలో 12 సబ్జెక్టులుగా, గేట్‌లో 10 సబ్జెక్టులుగా సిలబస్‌ను విభజించారు.
ఈఎస్‌ఈలో సబ్జెక్టులను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. గేట్‌లో అయితే సబ్జెక్టు బేసిక్స్‌, ప్రాథమిక ఉపయోగాలపై ప్రశ్నలు అధికం.
ఈఎస్‌ఈ (ప్రిలిమ్స్‌), గేట్‌లు రెండూ ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతాయి. ఈఎస్‌ఈ (ప్రిలిమ్స్‌)లో సమయం తక్కువ ఉంటుంది. (పేపర్‌-1లో 100 ప్రశ్నలకు 120 నిమిషాలు, పేపర్‌-2లో 150 ప్రశ్నలకు 180 నిమిషాలు); కానీ గేట్‌ రాయటానికి తగినంత సమయం ఉంటుంది. (65 ప్రశ్నలకు 180 నిమిషాలు).
వ్యవధి చాలా తక్కువగా ఉన్నందున ఈ పరీక్షలకు రోజుకు కనీసం 8 - 10 గంటల నాణ్యమైన సన్నద్ధత అవసరం. విలువైన సమయం వృథా కాకుండా జాగ్రత్తపడాలి. టీవీ, సినిమా, యూట్యూబ్‌ చూడడం, ఫేస్‌బుక్‌ వాడటం, వాట్సాప్‌ల్లో చాటింగులూ మానివేయడం ఎంతైనా మంచిది.
10% సమయం ప్రాథమిక అంశాలపై, 80% శాతం సమయం పరీక్షలోపు అతిముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టటం సరైన వ్యూహం. ఇక చివరి 10% సమయం కఠినమైన అంశాలకు కేటాయించుకోవాలి. అయితే సబ్జెక్టు మీద పూర్తిగా పట్టు లేనివారు కఠినమైన అధ్యాయాలకు ఈ తరుణంలో ఎక్కువ సమయం కేటాయించడం ఆచరణీయం కాదు. గేట్‌, ఈఎస్‌ఈల గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే దాదాపు 25 శాతం ప్రశ్నలు పునరావృతమవుతున్నాయి. వీటి కోసం సుమారు 20 సంవత్సరాల ప్రశ్నపత్రాలను సాధన చేయడం మంచిది. మాక్‌ టెస్ట్‌ సిరీస్‌లు రాసి, అందులోని ఫలితాల ప్రకారం తమకు పట్టున్న సబ్జెక్టుల్లో ఏ పొరపాట్లు చేస్తున్నారో గ్రహించి, సరిదిద్దుకోవాలి.

గేట్‌: అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యం
గేట్‌ను ఆన్‌లైన్లో నిర్వహించడం వల్ల ప్రశ్నపత్రాలను వివిధ సెట్లుగా రూపొందిస్తున్నారు. అందుకని అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యం లభిస్తోంది. ఏ సబ్జెక్టునూ నిర్లక్ష్యం చేయకుండా అన్నిటిలో ప్రతి అధ్యాయాన్నీ చదవాలి. ‌
* సృజనాత్మకంగా, పరిశోధనాత్మకంగా ఉన్న ప్రశ్నల కోసం మౌలికాంశాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యూపీఎస్‌సీ నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, సివిల్‌ సర్వీసెస్‌ ప్రశ్నలు చాలావరకూ ఈ పరీక్షలో అడుగుతుంటారు. కాబట్టి వీటిని గేట్‌ సిలబస్‌కు అనుగుణంగా సాధన చేయాలి. ‌
* ప్రతిరోజూ మ్యాథ్స్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ల కోసం కొంత సమయం కేటాయించడం వల్ల మంచి ర్యాంకుకు ఆస్కారం ఉంటుంది. ‌
* గ్రూప్‌-1 లోని ఒక మార్కు ప్రశ్నలను త్వరగా చేయాలి. చాలావరకూ ఈ విభాగంలో థియరీకి సంబంధించిన మౌలికాంశాలపై ప్రశ్నలు వస్తాయి. ‌
* చదివిన సబ్జెక్టుల్లో ఏవైనా ఎక్కువ మార్కులు వచ్చేవి వదిలివుంటే వాటిని ముందుగా సాధన చేయాలి. చదివిన అన్ని అంశాలూ పునశ్చరణ చేయాలి.
* ఇప్పటివరకూ చదివిన సబ్జెక్టుల్లో ఏవైనా ముఖ్యమైన అంశాలు వదిలిఉంటే వాటిని ప్రాముఖ్యం బట్టి చివరి సమయం వరకూ వేచి ఉండకుండా ముందుగానే సాధన చేయాలి. చివరి నెల సమయాన్ని పూర్తిగా పునశ్చరణ కోసం వెచ్చించడం శ్రేయస్కరం. అందుబాటులో ఉన్న ఈ సమయంలో న్యూమరికల్‌ ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. ‌
* అన్ని బ్రాంచీల్లో జనరల్‌ ఆప్టిట్యూడ్‌, ఇంజినీరింగ్‌ మ్యాథమేటిక్స్‌ ప్రతి దానినుంచీ దాదాపుగా 15 మార్కుల చొప్పున 30 మార్కులకు ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి అన్ని బ్రాంచీల అభ్యర్థులూ ఈ రెండింటిపై శ్రద్ధ వహించాలి.

ఈఎస్‌ఈ (ప్రిలిమినరీ): థియరీ ప్రశ్నలు ఎక్కువ
* పేపర్‌-1లోని జనరల్‌ స్టడీస్‌ ఖీ ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్‌లో 200 మార్కులు ఉన్నందున ప్రిపరేషన్‌లో ప్రతిరోజూ కొంత సమయాన్ని దీనికి కేటాయించాలి. ‌
* దీనిలో సాధించే మార్కులు మెయిన్స్‌కు అర్హత సాధించడంతోపాటు అంతిమ ర్యాకు సాధించడంలో కీలకపాత్ర పోషిస్తాయని మర్చిపోకూడదు. ‌
* పరిధి చాలా ఎక్కువే. చాలావరకూ ప్రశ్నలు థియరీ ఆధారితంగా ఉంటాయి. ‌
* స్టేట్‌మెంట్‌ బేస్డ్‌ ప్రశ్నల సాధనపై తగినంత జాగ్రత్త వహించాలి.
* ఎన్నడూ చదవని కొత్త విషయాలను వదిలివేయడం మంచిది. ఇప్పటివరకు సాధన చేసినవాటినే పునశ్చరణ చేయాలి. ‌
* ఇప్పటివరకూ చదివిన అంశాల పునశ్చరణ ముఖ్యం. థియరీ ఆధారిత ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. పరీక్షలో కాల్‌క్యులేటర్‌ అనుమతి లేనందున కాల్‌క్యులేటర్‌ ఉపయోగించకుండా ప్రశ్నలు సాధించటం అలవాటు చేసుకోవాలి.
* టెక్నికల్‌ సబ్జెక్టులతోపాటు జనరల్‌ స్టడీస్‌లోని 10 అంశాలపై కూడా శ్రద్ధ వహించాలి. అయితే జనరల్‌ స్టడీస్‌ విషయంలో లోతైన అధ్యయనం అవసరం లేదు. ప్రాథమికాంశాలపై శ్రద్ధ పెడితే సరిపోతుంది. ‌
* అన్ని బ్రాంచీల్లో జనరల్‌ స్టడీస్‌, ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్‌ (పేపర్‌-1) కామన్‌. ఇందులో 10 సబ్జెక్టులుంటాయి. అన్ని బ్రాంచీలవారూ దీన్ని దృష్టిలో ఉంచుకుని సిద్ధమైతే మంచి స్కోరు వస్తుంది.

ఆ ప్రశ్నల ఎంపిక ముఖ్యం
పరీక్షలో ప్రతి ప్రశ్నకూ సరైన సమాధానం రాయడం కష్టం. పరీక్ష సమయంలో ఎన్ని ప్రశ్నలు, ఏ ప్రశ్నలు రాస్తే ఎన్ని మార్కులు సాధించగలమనేది నిర్ణయించుకోవాలి. సన్నద్ధమయ్యే సమయంలో కూడా ఇదే సూత్రాలు పాటించాలి.
రుణాత్మక మార్కులతో చాలా జాగ్రత్త. జవాబు తెలియకున్నా అంచనా వేసి గుర్తిస్తే అది తప్పయితే నష్టం జరుగుతుంది.
ఇప్పటికే ప్రతి సబ్జెక్టుకూ సంబంధించి అభ్యర్థులు షార్ట్‌నోట్సు తయారు చేసుకొనివుంటారు. వాటితో పాటు ముఖ్యమైన ఫార్ములాలూ, వాటికి సంబంధించిన కొన్ని మాదిరి ప్రశ్నలూ సాధన చేయాలి. కఠినమైన అంశాలను రెండు మూడు సార్లు మననం చేసుకోవాలి.
పునశ్చరణ (రివిజన్‌)తో పాటు ఆన్‌లైన్లో నిర్వహించే మాదిరి ప్రశ్నపత్రాలకు జవాబులు రాయడం మేలు. దీనివల్ల సమగ్ర అవగాహన లేని అంశాలను కొంతవరకూ మెరుగుపరుచుకునే వీలుంది.
కొన్ని ప్రశ్నలకు పూర్తి సమాచారం ఇవ్వరు. తార్కికంగా ఆలోచించి, వాటికి సమాధానం రాబట్టాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలు ప్రామాణిక పుస్తకాల్లోని అభ్యాస ప్రశ్నల్లో ఉంటాయి. న్యూమరికల్‌ ప్రశ్నలను సమయపాలనను దృష్టిలో పెట్టుకుని సాధన చేయాలి.

Posted on 19-11-2018

Previous Papers

  • 2016
  • 2013