Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఫార్మసీ పీజీకి మెట్టు... జీప్యాట్‌

ఫార్మా రంగంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆశించే విద్యార్థుల ఆశాకిరణం జీప్యాట్‌. ఏఐసీటీఈ ఇటీవల ఈ ప్రవేశపరీక్ష ప్రకటనను వెలువరించింది. నాణ్యమైన పీజీ ఫార్మసిస్టుల అవసరం పరిశ్రమకు ఎంతగానో ఉంది. దీంతో బీఫార్మసీ చదివేవారిలో చాలామంది జీప్యాట్‌లో మంచి ర్యాంకుతో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఎంఫార్మసీ/ ఎంఎస్‌ చదవాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ పరీక్ష విధానం, సన్నద్ధతకు మెరుగైన వ్యూహం తెలుసుకుందాం!

గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (జీప్యాట్‌)లో మంచి ర్యాంకు సాధించినవారికి మాత్రమే దేశంలో పేరొందిన బనారస్‌, పంజాబ్‌, ఆంధ్రా, కాకతీయ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఎంఫార్మసీ చదవడానికి అవకాశం ఉంటుంది. అలాగే దేశంలోని ప్రముఖ నైపర్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసర్చ్‌) ల్లో చేరాలంటే జీప్యాట్‌ అర్హత తప్పనిసరి.

ఎవరు రాయవచ్చు?
* 10+2 తరువాత నాలుగు సంవత్సరాల బీఫార్మసీ కోర్సు చదివినవారు (లేటరల్‌ ఎంట్రీ అభ్యర్థులతోసహా) జీప్యాట్‌- 2018 రాయడానికి అర్హులు.
* బీఫార్మసీ నాలుగో సంవత్సరం చదివేవారు కూడా ఈ పరీక్షను రాయవచ్చు. అయితే మూడో సంవత్సర విద్యార్థులు అనర్హులు.
* ఈ పరీక్షకు వయఃపరిమితి లేదు.

గుర్తుంచుకోవాల్సిన తేదీలు
* జీప్యాట్‌- 2018కు నమోదు చేసుకోవాల్సిన వెబ్‌సైట్‌ www.aictegpat.in
* నమోదు ఆఖరు తేదీ: డిసెంబరు 15, 2017
* ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: జనవరి 20, 2018
పరీక్ష ఫలితాలు 2018 జనవరి ఆఖరు వారంలోకానీ ఫిబ్రవరి మొదటి వారంలోకానీ ప్రకటించే అవకాశం ఉంది.

పరీక్ష విధానం
జీప్యాట్‌ మొదట్లో పేపర్‌- పెన్సిల్‌ విధానంలో ఉండేది. గత అయిదేళ్లుగా ఆన్‌లైన్‌ విధానంలోనే నిర్వహిస్తున్నారు. జీప్యాట్‌-2018ను కూడా ఆన్‌లైన్‌ విధానంలోనే నమోదు చేసుకోవాలి. పరీక్ష బహుళైచ్ఛిక విధానంలో ఉంటుంది. మొత్తం 125 ప్రశ్నలు. పరీక్ష వ్యవధి- 3 గంటలు. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కుల చొప్పున గరిష్ఠంగా 500 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. రుణాత్మక మార్కులున్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ ఒక మార్కు కోత విధిస్తారు.
గత సంవత్సరం జీప్యాట్‌లో జనరల్‌/ ఓబీసీ వారికి 113 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. ఎస్‌సీ/ ఎస్‌టీ/ వికలాంగులకు 82 మార్కులు వస్తే ర్యాంకు కేటాయించారు. అంటే జనరల్‌ కేటగిరీవారు 22.6%, ఎస్‌సీ/ ఎస్‌టీ/ వికలాంగులు 16.4% మార్కులు సాధిస్తే జీప్యాట్‌లో విజయం సాధించినట్లే. అయితే వీటి సాధన కూడా ఆషామాషీ కాదు. ప్రశ్నపత్రం చాలా కఠినంగా ఉంటుంది. 50% మార్కులు సాధిస్తే అఖిల భారత స్థాయిలో మంచి ర్యాంకు వచ్చే అవకాశముంది.
పరీక్ష కేంద్రాలు: దేశంలోని 58 పట్టణాల్లో ప్రవేశపరీక్షను నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌: తిరుపతి, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం.
తెలంగాణ: హైదరాబాద్‌, వరంగల్‌.

ప్రతి అభ్యర్థీ తనకు నచ్చిన మూడు కేంద్రాలను ప్రాధాన్యక్రమంలో ఎంపిక చేసుకోవచ్చు. పరీక్ష కేంద్రం కేటాయించే క్రమంలో అభ్యర్థి మొదటి ప్రాధాన్యంగా పేర్కొన్న నగరానికే ప్రాధాన్యమిస్తారు. హాల్‌టికెట్‌ను అభ్యర్థికి పోస్టు ద్వారా పంపించరు. రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌లో హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. గత ఏడాది సుమారు 26,000 మంది హాజరుకాగా వారిలో 3550 మంది కటాఫ్‌ మార్కులు 113 కంటే ఎక్కువ స్కోరు చేశారు. ఎస్‌సీ/ ఎస్‌టీ/ వికలాంగులకు కటాఫ్‌ మార్కు 82గా నిర్ణయించడంతో మరో 744 మంది ఎస్‌సీ, 133 మంది ఎస్‌టీ, 21 మంది వికలాంగ అభ్యర్థులు జీప్యాట్‌లో అర్హులయ్యారు. అంటే గత సంవత్సరం అన్ని వర్గాలకు చెందిన 4448 మంది జీప్యాట్‌లో అర్హత పొందారు.

గత కటాఫ్‌ మార్కుల శైలి..
* కేటగిరీ 2013 2014 2015 2016 2017
* జనరల్‌, ఓబీసీ 145 125 125 115 113
* SC/ST/PWD 100 100 100 90 82
అఖిల భారతస్థాయిలో ప్రథమ స్థానం సాధించిన అభ్యర్థికి 261, రెండో స్థానం వారికి 250, మూడో స్థానం వారికి 250 మార్కులు వచ్చాయి. 100వ ర్యాంకు పొందిన అభ్యర్థికి వచ్చిన స్కోరు 188 మాత్రమే. నిపుణుల కమిటీ సిఫారసు మేరకు జీప్యాట్‌-2017 స్కోరు 3 సంవత్సరాలపాటు చెల్లుబాటవుతుందని ఏఐసీటీఈ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

బహుళ ప్రయోజనాల పరీక్ష
* జీప్యాట్‌లో అర్హత సాధించి ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫార్మసీ కళాశాలలో ఎంఫార్మసీ చదివే ప్రతి విద్యార్థికి రెండేళ్లపాటు నెలకు రూ.12,400 ఉపకార వేతనాన్ని భారత ప్రభుత్వం ఇస్తుంది. దీనిని రూ.16,000కు పెంచే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
* దేశంలోనే ఫార్మా విద్యారంగంలో అత్యుత్తమ సంస్థలుగా గుర్తింపు పొందిన నైపర్‌లలో ఎంఎస్‌ సీటు పొందడానికి నైపర్‌ నిర్వహించే ప్రవేశపరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ ప్రవేశపరీక్షను రాయడానికి జీప్యాట్‌ అర్హత పొందినవారే అర్హులు.
* ఫార్మసీ కళాశాలల్లో ఉపాధ్యాయ వృత్తికి ఎంపిక కూడా ఈ పరీక్ష స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తుంటారు.
* జీప్యాట్‌ స్కోరు ఎంఫార్మసీ తరువాత పీహెచ్‌డీలో చేరడానికి కూడా ఉపయోగపడుతుంది. దీనిలో అర్హులైనవారు ఎలాంటి ప్రవేశపరీక్షలకూ హాజరు కాకుండానే పీహెచ్‌డీ చేయవచ్చు. యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌ లాంటి ప్రభుత్వరంగ పరిశోధన సంస్థలు ఈ పరీక్ష స్కోరు ద్వారా అభ్యర్థులను ఎంపికచేసి వారికి ఉపకార వేతనాలనూ అందజేస్తాయి.

ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) గుర్తింపు పొందిన ఎంఫార్మసీ కోర్సులను అందిస్తున్న కళాశాలలు భారత్‌లో 546 ఉన్నాయి. వీటిలో తెలంగాణలో 95 కళాశాలలు 3092 ఎంఫార్మసీ సీట్లను అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి పొంది ఎంఫార్మసీ అందిస్తున్న 81 కళాశాలల్లో 2853 ఎంఫార్మసీ సీట్లున్నాయి. ఎంఫార్మసీలో 10 రకాల స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపులేని, ఎం ఫార్మసీ కోర్సును నిర్వహించడానికి అనుమతిలేని కళాశాలలకు దూరంగా ఉండటం మేలు.

ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌లపై గట్టి పట్టు పెంచుకుంటే జీప్యాట్‌లో మంచి ర్యాంకు సాధించడానికి వీలవుతుంది. అర్హత మార్కుల సాధన ఆషామాషీ కాదు. ప్రశ్నపత్రం చాలా కఠినంగా ఉంటుంది. 50% మార్కులు సాధిస్తే అఖిల భారత స్థాయిలో మంచి ర్యాంకు వచ్చే అవకాశముంది.

మెరుగైన స్కోరు సాధించాలంటే..
బీఫార్మసీ విద్యార్థులకు కళాశాలలో సుమారు 20 రకాల వివిధ పాఠ్యాంశాలను బోధిస్తారు. వీటిలో ముఖ్యమైనవి ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌. వీటిపై గట్టి పట్టు ఉంటే జీప్యాట్‌లో మంచి ర్యాంకు సాధించడానికి వీలవుతుంది. ఫార్మాస్యూటిక్స్‌లో ట్యాబ్‌లెట్స్‌, క్యాప్సూల్స్‌, ఇంజెక్షన్లు, సిరప్‌లతోసహా అన్నిరకాల ఔషధాల తయారీలో ఆధునిక ప్రక్రియలతోపాటు, ఫిజికల్‌ ఫార్మసీ, డిస్పెన్సింగ్‌, కమ్యూనిటీ ఫార్మసీ, హాస్పిటల్‌ ఫార్మసీ, ఫార్మాస్యూటికల్‌ జ్యూరిస్పుడెన్స్‌లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

ఫార్మకాలజీకి సంబంధించి ఔషధాల వర్గీకరణ, ఫార్మకో కైనటిక్స్‌, ఫార్మకో డైనమిక్స్‌, పేథోఫిజియాలజీ, జనరల్‌ ఫార్మకాలజీ, క్లినికల్‌ ఫార్మసీ, డ్రగ్‌ ఇంటరాక్షన్లు, కీమోథెరపీ, సెంట్రల్‌ నెర్వస్‌ సిస్టమ్‌లపై దృష్టి కేంద్రీకరించాలి. ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌ విషయానికొస్తే ఇండియన్‌ ఫార్మాకోపియాలోని అన్ని ఔషధాల విశ్లేషణ పద్ధతులు, గుడ్‌ లెబోరెటరీ ప్రాక్టీసెస్‌, మోడరన్‌ అనలిటికల్‌ టెక్నిక్‌లను నేర్చుకుంటే మార్గం సుగమం అవుతుంది.

ఫార్మకాగ్నసీలో క్రూడ్‌ డ్రగ్స్‌, వాటి విశ్లేషణ విధానాలు, మైక్రోస్కోపీ, బయోసింథటిక్‌ పాథ్‌వేస్‌లపై పట్టు సాధించాలి. వీటితోపాటు ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫార్మాబయోటెక్నాలజీ సబ్జెక్టుల్లో ప్రశ్నలను బహుళైచ్ఛిక విధానంలో సాధన చేయాలి. గత ప్రశ్నపత్రాలు, మాదిరి ప్రశ్నపత్రాల సాధన ద్వారా నైపుణ్యాలను పెంచుకోవచ్చు. ఏఐసీటీఈ వెబ్‌సైట్‌లో డిసెంబరు 20, 2017 తరువాత జీప్యాట్‌ మాదిరి ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంటాయి. ఇవి జీప్యాట్‌-2018 తరహాలోనే ఉండే అవకాశముంది. కాబట్టి, వీటిని సాధన చేయడం ద్వారా విజయానికి చేరువయ్యే అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు.

Notification Website

Posted on 24-10-2017