IBPS Probationary Officers - Interview Guidance

మౌఖికంలో మెరిసే మెలకువలు!

ఐబీపీఎస్‌ అక్టోబర్‌/ నవంబర్‌లో నిర్వహించిన సీడబ్ల్యూఈ పీవో/ ఎంటీ- 4 పరీక్ష ఉత్తీర్ణులకు జనవరిలో మౌఖిక పరీక్షలు నిర్వహిస్తోంది. రాత పరీక్ష, మౌఖిక పరీక్షలు రెండింటిలో అభ్యర్థులకు వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అందువల్ల మౌఖిక పరీక్ష.. రాత పరీక్షలాగానే అత్యంత ముఖ్యమైనది. దీనికి సమగ్రంగా సన్నద్ధం కావటం ఉద్యోగసాధనలో అత్యంత ప్రధానం!
ఉద్యోగసాధనలో తుదిమెట్టు మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ). ఈ దశకు చేరుకున్న అభ్యర్థుల్లో ఉత్సుకతతో పాటు కొంత ఆందోళన కూడా సహజం. సవ్యమైన రీతిలో సంసిద్ధమైతే ఆత్మవిశ్వాసం పెంచుకోవచ్చు. బ్యాంకు, ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ మౌఖికపరీక్షలు త్వరలో జరగనున్నాయి. ఈ తరుణంలో అభ్యర్థులకు ఉపకరించే సూచనలు ఇవిగో...!
మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) 100 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో ఉత్తీర్ణులవడానికి 40% మార్కులు రావాలి. ఎస్‌సీ/ ఎస్‌టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఇది 35%. రాతపరీక్ష, మౌఖిక పరీక్షల మార్కుల వెయిటేజీ 80:20గా ఉంటుంది.
మౌఖిక పరీక్ష అనగానే ఎటువంటి ప్రశ్నలు అడుగుతారో అనే ఆందోళన మొదలవుతుంది. అయితే ఇంటర్వ్యూ అనేది అభ్యర్థుల తెలివితేటలు తెలుసుకోవడానికి అడిగే ప్రశ్నల పరంపర కాదు. దీని ముఖ్య ఉద్దేశం- వారి నిజాయతీ, తీరు తెన్నులు, ప్రవర్తన తెలుసుకోవడం. అలాగే చేయబోయే ఉద్యోగానికి ఏ మేరకు సరిపోతారో అంచనా వేయడం. పీవో ఉద్యోగానికి అభ్యర్థి నిర్వహణ సామర్థ్యం, బృందాన్ని నడపగలిగే నైపుణ్యాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.
ఎలాంటి ప్రశ్నలకు అవకాశం?
ముఖ్యంగా మూడు రకాల ప్రశ్నలు అడుగుతారు.
* బయోడేటా ఆధారిత/ వ్యక్తిగత ప్రశ్నలు: దీనిలో అభ్యర్థులు బయోడేటాలో పేర్కొన్న వ్యక్తిగత వివరాలు అడుగుతారు. విద్యార్హతలు, కుటుంబ వివరాలు, వారి ఆసక్తులు, బలాలు, బలహీనతలు, అభిరుచులు మొదలైన వాటి గురించిన ప్రశ్నలకు సిద్ధమవాలి.
* విద్యార్హతలు (అకడమిక్‌)/ ఉద్యోగ సంబంధ ప్రశ్నలు: అభ్యర్థులు చదివిన సబ్జెక్టులపై; ఉద్యోగానుభవం ఉంటే దానిపై ప్రశ్నలు ఉంటాయి.
* తాజా పరిణామాలు/ బ్యాంకింగ్‌ రంగ ప్రశ్నలు: జాతీయ, అంతర్జాతీయ తాజా పరిణామాలపై బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించిన ప్రశ్నలు.
ఇవి కాకుండా మరికొన్ని ఇతర ప్రశ్నలకు కూడా సిద్ధమవాలి.
ఇబ్బంది పెట్టే ప్రశ్నలు: అభ్యర్థులు తమ సంయమనం కోల్పోయేలాగా/ వాదనకు ప్రేరేపించేలా కొన్ని ప్రశ్నలు ఉండవచ్చు. వాటి ద్వారా ఒత్తిడి సమయంలో అభ్యర్థుల ప్రవర్తన తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.
సృజనాత్మక/ తార్కిక ప్రశ్నలు: ముందుగా వూహించని కొన్ని ప్రశ్నలకు అభ్యర్థులు అప్పటికప్పుడు ఆలోచించి సమాధానం చెప్పేవి. వీటి ద్వారా వారి సమయస్ఫూర్తి, తార్కిక, సృజనాత్మక నైపుణ్యాలను పరిశీలిస్తారు.
మౌఖిక పరీక్షకు ముందు...
* మౌఖిక పరీక్షలో అడగడానికి అవకాశం ఉన్న ప్రశ్నలు సిద్ధం చేసుకుని వాటికి సన్నద్ధమవాలి.
* విద్యార్హతలు, వయసు, కుల, ఆదాయం వంటి ధ్రువపత్రాలన్నింటినీ జిరాక్స్‌ కాపీలతో సహా సిద్ధం చేసుకుని పద్ధతి ప్రకారం ఫైల్‌ చేసుకుని ఉంచాలి.
* మౌఖిక పరీక్ష రోజు ధరించబోయే దుస్తులు ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
* స్నేహితులు, సన్నిహితుల ముందు రిహార్సల్స్‌ చేసుకోవాలి. వీలైతే రికార్డు చేసుకుని దానిని పరిశీలించడం ద్వారా పొరపాట్లు సరిచేసుకోవచ్చు.
ఇంటర్వ్యూ సమయంలో..
* సమాధానాలు సూటిగా, క్లుప్తంగా ఉండాలి. అవసరమైనచోట సోదాహరణంగా వివరించాలి.
* ఇంటర్వ్యూ మొత్తం ఉత్సాహంగా, ఉత్తేజితంగా ఉంటూ ఆసక్తి ప్రదర్శిస్తూ ఉండాలి.
* ప్రశ్నలు మొత్తం జాగ్రత్తగా వినాలి. మధ్యలో అంతరాయపరచడం, ప్రశ్న పూర్తి కాకుండానే జవాబులు మొదలుపెట్టడం చేయకూడదు.
* చిరునవ్వును ప్రదర్శించడం ద్వారా ఆందోళన లాంటివి బయటపడకుండా జాగ్రత్త పడవచ్చు.
* జవాబు తెలియని ప్రశ్నలకు ఆ విషయం చెప్పడానికి సంకోచించవద్దు.
మౌఖిక పరీక్షను ఎదుర్కోవడంలో కింది సూచనలు ఉపయోగపడతాయి.
* అబద్ధం చెప్పవద్దు: అభ్యర్థులు తమ విషయాలను నిజాయతీగా చెప్పాలి. ఒకవేళ అవాస్తవం చెప్పినా విశేషానుభవం ఉన్న సభ్యులు వాటిని గుర్తించే అవకాశం ఉంది. నిజాయతీగల అభ్యర్థులకే ప్రాధాన్యం ఇస్తారు.
* వాదన వద్దు: అభ్యర్థులు తాము చెప్పే విషయాలను నిదానంగా చెబుతూ సభ్యులను ఒప్పించాలి. అంతేకానీ వాదన పెట్టుకోకూడదు. అభ్యర్థులు ఒత్తిడిలో ఏవిధంగా వ్యవహరిస్తారో తెలుసుకునే ప్రయత్నంలో సభ్యులు ఆ విధంగా ప్రేరేపించవచ్చు.
* బట్టీ పట్టకూడదు: సభ్యులు అడిగే ప్రశ్నలకు జవాబులు చాలా సహజంగా చెప్పినట్లుగా ఉండాలి గానీ బట్టీపట్టి చెప్పినట్లుగా ఉండకూడదు. అలా చెబితే, అభ్యర్థులు చెప్పిన పని మాత్రమే చేయగలరనీ, సొంతంగా ఏమీ చేయలేరనీ సభ్యులు అభిప్రాయపడే అవకాశం ఉంది.
* ఉత్సుకతను ప్రదర్శించడం: ఇంటర్వ్యూ సమయంలో బాగా ఉత్సుకతనూ, నేర్చుకోవాలనే ఆసక్తినీ ప్రదర్శించడం ద్వారా సభ్యులను ఆకట్టుకోవచ్చు. ఉద్యోగులుగా చేరిన తరువాత వారు ప్రవర్తించబోయే తీరును ఇది తెలియజేస్తుంది.
* బలాలు/ బలహీనతలు పేర్కొనడం: అభ్యర్థులు వారి బలాలు, బలహీనతలను నిజాయతీగా పేర్కొనాలి. బలాలు, ఆసక్తులు, అమితంగా ఉండే ఇష్టాల గురించి వీలైనంత ఎక్కువగా పేర్కొనండి. వీలైతే వాటికి ఆధారాలు చూపించండి. అడిగితే గానీ బలహీనతలు పేర్కొనవద్దు. బలహీనతలు పరోక్షంగా బలాలను తెలియజేసేలా ఉండాలి.
ఇంటర్వ్యూలో తరచుగా అడిగే సాధారణ ప్రశ్నలకు బాగా సన్నద్ధమవాలి. వాటిలో కొన్ని..
* మీ గురించి చెప్పండి?
సాధారణంగా ఎక్కువమంది దీన్ని ఇబ్బందిపడే ప్రశ్నలా భావిస్తూ దీనికి ఎలా సమాధానం చెప్పాలో అని సందేహపడుతూ ఉంటారు. అయితే తమ పేరు, విద్యార్హతలు, కుటుంబ వివరాలు మాత్రమే తెలియజేయకుండా తమ గురించి సభ్యులకు సానుకూలంగా తెలియజేస్తూ సభ్యుల ఆలోచనలను, అడిగే ప్రశ్నలను తమ బలాలవైపు మళ్లించుకునే అవకాశంగా తీసుకోవాలి. తమ బలాలు, అనుకూలాంశాలు, ఇష్టాలు, ఆసక్తులు, లక్ష్యాలు వారు సాధించిన విజయాలు మొదలైనవి తెలియజేయాలి.
* బ్యాంకింగ్‌ రంగాన్ని ఎంచుకోవడానికి కారణం?
దీనికి నిజాయతీగా ఎందుకు బ్యాంకు ఉద్యోగం చేయాలనుకుంటున్నారో పేర్కొనండి (ఎక్కువమంది ఎంచుకోవడానికి కారణం- ఉద్యోగ భద్రత, జీతభత్యాలు, ప్రజలకు ముఖాముఖి సేవ చేసే అవకాశం, కెరియర్‌లో పురోగతి మొదలైనవి).
* ఈ ఉద్యోగానికి మిమ్మల్నే ఎందుకు ఎంచుకోవాలి?
దీనికి తమ అర్హతలు, బలాలు తెలియజేస్తూ మిగిలినవారికంటే తామెలా ప్రత్యేకమో పేర్కొనగలగాలి.
* మీరు సాధించిన పెద్ద విజయం?
* మీరు బ్యాంకుకుఎలా ఉపయోగపడతారు?
* 10 సంవత్సరాల తరువాత మిమ్మల్ని మీరు ఏవిధంగా/ ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు?
* ఈ రోజు దినపత్రిక విశేషాలు.. మొదలైనవి.
బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించిన సమాచారాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆర్‌బీఐ గురించి బాగా చూసుకోవాలి. అలాగే తాజా విషయాలన్నింటినీ ముఖ్యంగా ఆర్థిక రంగానికి సంబంధించినవి తెలుసుకోవాలి.
ఎంత నేర్చుకున్నా వాటిని స్పష్టంగా ధైర్యంగా తెలియజేయగలగడం మీదే మార్కులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆవిధంగా సన్నద్ధతను కొనసాగించాలి.
హావభావాల్లో జాగ్రత్త!
కాళ్ళు నేలపై ఉంచి నిటారుగా కూర్చోవాలి.
* ఒక కాలును వెనక్కి వంచి కూర్చోకూడదు. ఇది అసహనాన్నీ, ఆందోళననూ సూచిస్తుంది. కాళ్ళను క్రాస్‌గా పెట్టకూడదు. అది అభ్యర్థి ఆత్మస్త్థెర్యంతో లేరని భావించేలా చేస్తుంది.
తలను స్థిరంగా ఉంచిగానీ, స్వల్పంగా వంచి గానీ ఇంటర్వ్యూను ఎదుర్కోవచ్చు.
* ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల ముందు తలను కిందికి దించి ఉంచకూడదు. అది వ్యతిరేక అభిప్రాయాన్ని కలుగజేస్తుంది. అంగీకార సూచకంగా తలను అతిగా వూపటం కూడా సరి కాదు.
కళ్ళతో చూడటం వీలైనంత సహజంగా ఉండాలి. ప్రశ్న అడిగిన వ్యక్తినే కాకుండా అప్పడప్పుడూ మిగిలినవారిని కూడా చూస్తూ మళ్ళీ యథాస్థితికి చూపులు మరలుస్తుండాలి.
* ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల కళ్ళలోకి చూడలేకపోతే అది బిడియాన్నీ, స్త్థెర్యలేమినీ సూచిస్తుంది. అలా అని కళ్ళలోకి అదేపనిగా చూడటం సరి కాదు. నేలచూపులు కూడా కూడదు. మాట్లాడుతూ ఎటో చూడటం చేయకూడదు.
చేతులను కుర్చీ రెస్ట్‌ మీద/ మోకాళ్ళ మీద ఉంచాలి.
* చేతులు కట్టుకుని ఉండటం ఆత్మరక్షణకూ, బోర్డు సభ్యులతో అంగీకరించకపోవడానికీ చిహ్నాలు. చేతులను గట్టిగా బిగించి కూర్చోకూడదు. అది అభ్యర్థి ఒత్తిడిలో ఉన్నట్టు సూచిస్తుంది. చెవులను తాకటం, మెడను చేత్తో రుద్దుకోవటం చేయకూడదు. ఆ చర్యలు అభ్యర్థికి తన మాటలపై తనకు నమ్మకం లేదనేదానికి సంకేతాలు.