close


INTER

ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల ప్రిప‌రేష‌న్ - ముఖ్య‌మైన ప్ర‌శ్న‌లు

అంద‌రికీ అదే సిల‌బ‌స్‌.. అంతే స‌మ‌యం.. అయినా కొంద‌రికే మంచి మార్కులు. కార‌ణం చ‌ద‌వ‌డంలో తేడాలే. ఏది ముఖ్యం.. దేన్ని వ‌దిలేయాలి.. తెలుసుకుని ప్రిపేర్ కావ‌డ‌మే విజ‌య‌సూత్రం. అతిస్వ‌ల్ప స‌మాధాన ప్ర‌శ్న‌లేగా అని ఆద‌మ‌రిస్తే.. అత్యున్న‌త స్థానం అంద‌కుండా పోతుంది. చేతిరాత‌ను ప‌ట్టించుకోక‌పోతే త‌ల‌రాత మారిపోతుంది. ఇలాంటి ఇబ్బందులు తొల‌గాలంటే ఇప్ప‌టి నుంచైనా శ్ర‌ద్ధ పెట్టాలి. ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు ఫిబ్ర‌వ‌రి చివ‌ర్లో ప్రారంభం కానున్న నేప‌థ్యంలో స‌మ‌గ్ర ప్రిప‌రేష‌న్‌కు సాయ‌ప‌డే స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను నిపుణులు అందిస్తున్నారు.

భౌతికశాస్త్రం (ఫిజిక్స్‌)
ఇంటర్మీడియట్‌ భౌతికశాస్త్రంలో విద్యార్థులకు కావాల్సింది- కచ్చితత్వం, విషయ పరిజ్ఞానం. అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని సూటిగా, కూలంకషంగా రాయగలగాలి.
పటాలు సరిగా వేయాలి. దృశా పరికరాలకు సంబంధించిన కిరణ పటాలు (రే డయాగ్రమ్స్‌) బాగా సాధన చేయాలి. ఎక్కడా ఏకాగ్రతను కోల్పోకూడదు. చాప్టర్ల వెనకనున్న సమస్యలు చేయాలి. ప్రమాణాలు (యూనిట్లు) వేయడం మరిచిపోకూడదు.
సమాధానాలను వీలైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేసి, జ్ఞాపకం ఉంచుకుంటే గరిష్ఠ మార్కులు సాధించవచ్చు. ‘ఎలాగైనా పాస్‌ అవ్వాలి’ అనేకునేవారు దీర్ఘ సమాధాన ప్రశ్నలపై ఎక్కువ శ్రద్ధపెట్టాలి. వారికి ఇక్కడే 16 మార్కులను పొందే వీలుంటుంది. వీటిని వీలైనన్ని ఎక్కువసార్లు నేర్చుకోవడం, చూడకుండా రాయడం చేయాలి. వీళ్లు ఎలాగూ తక్కువ ప్రశ్నలు (ఎంపిక చేసుకున్నవే) నేర్చుకుంటారు. కాబట్టి, వాటిని పక్కాగా నేర్చుకోవాలి. ఎక్కడా తప్పులు దొర్లకూడదు. పరీక్షలో ఏ ప్రశ్ననీ వదిలేయకుండా ప్రతి ప్రశ్నకూ సంబంధిత సమాధానాన్ని కొంతైనా రాయాలి. వీలైనచోట్ల పటాలను గీయాలి. కొన్ని ఎంపిక చేసుకున్న చాప్టర్లలో నుంచి స్వల్ప సమాధాన ప్రశ్నలను కూడా బాగా నేర్చుకోవాలి.
చేయాల్సినవి
స‌న్నద్ధమయ్యేటపుడు..
* తప్పనిసరిగా చూడకుండా రాయడం (ముఖ్యంగా సమీకరణాలు ఉత్పాదించడం వంటివి)
* పటాలను వీలైనన్ని ఎక్కువసార్లు గీయడం
* ప్రశ్నల పట్టిక తయారు చేసుకుని, నేర్చుకున్నవి టిక్‌ చేసుకుంటూ చదవడం
* అతిస్వల్ప సమాధాన ప్రశ్నలకు జవాబులు బాగా కంఠస్థం చేయడం
* మార్కుల ప్రాధాన్యాన్నిబట్టి (వెయిటేజీ) నేర్చుకోవడం చేయాలి.
పరీక్ష రాసేటపుడు..
* మొత్తం అతిస్వల్ప సమాధాన ప్రశ్నలను వరుసగా ఒకచోట రాయడం
* సమాధానంలోని ముఖ్య భాగాలను అండర్‌లైన్‌ చేయడం
* దీర్ఘ సమాధాన ప్రశ్నలతో సమాధానాలు మొదలుపెట్టడం
* బాగా తెలిసిన సమాధానాలను ముందుగా రాయడం
* ప్రశ్న సంఖ్య తప్పనిసరిగా వేయడం
* రాసిన ప్రశ్నలను ప్రశ్నపత్రంలో టిక్‌ పెట్టుకోవడం
* గడియారంలో ఎప్పటికప్పుడు సమయం చూసుకోవడం, తద్వారా మిగతా ప్రశ్నలను ప్లాన్‌ చేసుకోవడం
* పెన్సిల్‌/ స్కెచ్‌పెన్‌తో మార్జిన్‌ వేయడం, సమాధానాల మధ్య గీతలు గీయడం
* పటాల కోసం కావాల్సిన సామగ్రి (పెన్సిల్, మర, రబ్బరు) తీసుకెళ్లడం
* వీలైనంతవరకు విడివిడిగా, పొందికగా స్పష్టంగా రాయడం
* చివరి కనీసం పావుగంట సమయం మిగిలేలా చూసుకోవడం (ఈ సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాశారో లేదో నిర్ధారించుకోవచ్చు) చేయాలి.
చేయకూడనివి
సన్నద్ధమయ్యేటపుడు..
* సమాధానాలను సంపూర్ణంగా కాకుండా సగం చదివి వదిలేయడం, తరువాత నేర్చుకుంటానంటూ వాయిదా వేయడం
* సమాధానంలో మొదటి రెండు, మూడు లైన్లు చూసి మిగతాది వచ్చేసింది అనుకోవడం
* పటాలను ఫ్లాష్‌ మెమరీలా గుర్తు పెట్టుకోవడం
* ఒక పద్ధతిలో కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో చదవడం, నేర్చుకోవడం చేయరాదు.
పరీక్ష రాసేటపుడు..
* ఏవైనా చిహ్నాలు వేయడం
* కొట్టివేతలు చేయడం
* ప్రశ్నలను తొందరపాటుతో అపసవ్యంగా చదవటం
* ఎవరినైనా ఉద్దేశించి ఏదైనా రాయడం (ప్రశ్నపత్రంలో)
* ఎవరినైనా ఏదైనా అభ్యర్థించడం (ప్రశ్నపత్రంలో) వంటివి చేయొద్దు.

ఈ ప్రశ్నలు చాలా ముఖ్యం
గత కొన్ని సంవత్సరాల ఐపీఈ ప్రశ్నపత్రాల ఆధారంగా... ఎక్కువగా పరీక్షలో రావడానికి ఆస్కారమున్న కొన్ని దీర్ఘ సమాధాన ప్రశ్నలు..
ప్రథమ సంవత్సరం
1. ఎ) పని, గతిజశక్తి భౌతిక రాశులను విశదీకరించండి. గతిజశక్తికి సమీకరణాన్ని ఉత్పాదించండి. పని-శక్తి సిద్ధాంతాన్ని నిరూపించండి.
బి) 25 మీటర్ల లోతుగల బావిలోంచి 600 కి.గ్రా నీటిని పైకి తీసుకురావడానికి, ఆ నీటిని 50 మీ/సె వేగంతో బయటకు పంపడానికి పంపునకు కావాల్సిన సామర్థ్యం ఎంత?
2. ఎ) స్వేచ్ఛాపతన వస్తువు విషయంలో శక్తి నిత్యత్వ సూత్రాన్ని ప్రవచించి నిరూపించండి.
బి) ఒక మిషన్‌ గన్‌ నిమిషానికి 360 బుల్లెట్లను ఒక్కొక్కటి 600 మీ/సె వేగంతో వదులుతోంది. ఒక్కో బుల్లెట్‌ ద్రవ్యరాశి 5 గ్రాములు అయితే ఆ మిషన్‌ గన్‌ సామర్థ్యం ఎంత?
3. అభిఘాతాలు అంటే ఏమిటి? అభిఘాత రకాలను వివరించండి. ఏక అక్షీయ అభిఘాతాలను వివరించి, తుది వేగాల సమీకరణాలను రాబట్టండి.
4. ఉష్ణగతిక శాస్త్ర రెండో నియమాన్ని ప్రవచించండి. ఉష్ణ యంత్రాన్ని శీతలీకరణాన్ని వివరించి వ్యత్యాసాలను తెలపండి.
5. ఉత్క్రమణీయ, అనుత్క్రమణీయ ప్రక్రియలను వివరించండి. కార్నో యంత్రం పనితీరుని వివరించండి. దాని దక్షతకు సమీకరణాన్ని రాబట్టండి.
రెండో సంవత్సరం
1. ఎ) డాఫ్ల్లర్‌ ప్రభావాన్ని నిర్వచించండి. ధ్వని జనకం చలనంలో ఉండే పరిశీలకుడు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు దృశ్య పౌనఃపున్యానికి సమీకరణాన్ని రాబట్టండి.
బి) నిశ్చలస్థితిలో ఉన్న ఒక పరిశీలకుడు తనవైపు రైలు వస్తున్నపుడు, దూరంగా వెళ్తున్నపుడు దృశా పౌనఃపున్యాలను వరుసగా 219 హెర్ట్జ్‌, 184 హెర్ట్జ్‌ గా గుర్తించాడు. గాలిలో ధ్వని వేగం 340 మీ/సె అయితే ఆ రైలు వేగాన్ని కనుక్కోండి.
2. ఎ) తెరచిన గొట్టంలోని గాలిస్తంభంలో స్థిర తరంగాల ఏర్పాటును వివరించండి. అందులో ఏర్పడే ఆరోహణ పౌనఃపున్యాలకు సమీకరణాలను ఉత్పాదించండి.
బి) మూసి ఉన్న 70 సె.మీ. పొడవున్న గొట్టం ప్రాథమిక పౌనఃపున్యాన్ని లెక్కించండి (గాలిలో ధ్వని వేగం 33 మీ/సె).
3. ఎ) విద్యుత్‌ సంవృత వలయాలకు కిర్కాఫ్‌ నియమాలను ప్రవచించండి. వీటి నుంచి వీట్‌స్టోన్‌ బ్రిడ్జి నియమాలను రాబట్టండి.
బి) 4 ఓముల‌ నిరోధం గల ఒక తీగను వృత్తాకారంలోకి వంచారు. అపుడు దాని వ్యాసం కొనల మధ్య ఫలిత నిరోధం ఎంత?
4. ఎ) విద్యుత్‌ సంవృత పటంతో పొటన్షియో మీటరు పనిచేసే విధానాన్ని వివరించండి. పొటన్షియో మీటరు నుంచి ఇచ్చిన ప్రాథమిక ఘటపు అంతర్నిరోధాన్ని కనుగొనే విధానాన్ని తెలపండి.
బి) 5 మీటర్ల పొడవున్న పొటన్షియో మీటరు తీగ కొనల మధ్య 6 ఓల్ట్‌ శక్మభేదాన్ని అనువర్తింపజేస్తే 180 సెం.మీ. పొడవున్న పొటన్షియో మీటరు తీగను తటస్థీకరించే ఘటపు విద్యుచ్ఛాలక బలం ఎంత?
5. కేంద్రక రియాక్టరు పనిచేసే విధానం, దాని సూత్రాన్ని పటం సాయంతో వివరించండి.
- ఎం. చంద్ర‌శేఖ‌ర్‌, శ్రీ గాయత్రి విద్యా సంస్థ‌లు, హైద‌రాబాద్‌.

వృక్షశాస్త్రం (బోటనీ)
ఇంటర్మీడియట్‌లో ఆప్షనల్‌ సబ్జెక్టుల్లో మార్కులకు పోటీ పరీక్షల్లో వెయిటేజి ఉంది కాబట్టి, అత్యధిక మార్కులను సాధించడం అవసరం. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వృక్ష శాస్త్ర సబ్జెక్టులో అత్యధిక మార్కులను సాధించడానికి కొన్ని మెలకువలు పాటించాలి. సాధారణ స్థాయి విద్యార్థి కూడా దీనివల్ల అదనంగా మార్కులను పొందగలుగుతాడు.
మొదటి సంవత్సరంలో
1) పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం
2) మొక్కల ప్రత్యుత్పత్తి
3) మొక్కల అంతర్నిర్మాణ శాస్త్రాల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
జీవ ప్రపంచంలో వైవిధ్యం, ఆవృత బీజాల వర్గీకరణ శాస్త్రం, కణ నిర్మాణం, విధులు; వృక్ష ఆవరణ శాస్త్రాల నుంచి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఎక్కువగా రావొచ్చు. అతి స్వల్ప సమాధానాల ప్రశ్నల కోసం అన్ని అధ్యాయాలూ చదవాల్సిందే.
కనీసం 30 మార్కులు సాధించడానికి
దీర్ఘ సమాధాన ప్రశ్నలను పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం, పుష్పించే మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి- చదివితే సరిపోతుంది. స్వల్ప, అతిస్వల్ప సమాధాన ప్రశ్నల కోసం ముఖ్యమైనవి- ఆవృత బీజాల వర్గీకరణ శాస్త్రం, కణచక్రం, కణ విభజన, వృక్ష ఆవరణ శాస్త్రం.
ద్వితీయ సంవత్సరంలో
1) మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ
2) మొక్కల్లో శ్వాసక్రియ
3) జీవ సాంకేతిక శాస్త్రం, సూత్రాలు- ప్రక్రియలు
4) ఆహారోత్పత్తి అధికం చేసే వ్యూహాల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు రావొచ్చు.
వృక్ష శరీరధర్మ శాస్త్రం, సూక్ష్మజీవ శాస్త్రం, జన్యు శాస్త్రం, అణుజీవ శాస్త్రం, జీవ సాంకేతిక శాస్త్రాల నుంచి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఎక్కువగా రావొచ్చు. అతి స్వల్ప సమాధాన ప్రశ్నల కోసం అన్ని యూనిట్లూ తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది.
కనీసం 30 మార్కులు సాధించడానికి
వృక్ష శరీరధర్మ శాస్త్రంలోని స్వల్ప, అతిస్వల్ప, దీర్ఘ సమాధాన ప్రశ్నలు, సూక్ష్మ జీవశాస్త్రంలో స్వల్ప, అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు, జన్యు శాస్త్రంలో స్వల్ప, అతిస్పల్ప సమాధాన ప్రశ్నలు తప్పనిసరిగా చదవాలి.
చేయాల్సినవి
* ప్రశ్నపత్రంలోని దీర్ఘ సమాధాన/స్వల్ప సమాధాన/అతిస్వల్ప సమాధాన ప్రశ్నలను మొదట ఒకసారి చదవాలి. వాటిలో బాగా రాయగలమని భావించే ప్రశ్నలను మార్క్‌ చేసుకోవాలి.
* అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు (10) ఒకే దగ్గర రాయాల్సి ఉంటుంది, వాటిని మొదటే రాయాలనేం లేదు.
* అతిస్వల్ప సమాధాన ప్రశ్నలకు జవాబులను క్లుప్తంగా రాసి, వాటిలోని ముఖ్యపదాల కింద గీత గీయాలి.
* స్వల్ప సమాధాన ప్రశ్నలకు జవాబును సాధ్యమైనంతవరకు, అవసరాన్ని బట్టి పటం ద్వారా వివరించండి.
* పటాలను పేజీలో మధ్యస్థంగా వేయాలి, వాటి భాగాలను సరైన క్రమంలో కుడివైపు మాత్రమే సూచించాలి.
* దీర్ఘ సమాధానాల జవాబులకు కచ్చితంగా పటాలను వేయాలి. సమాధానాలను పాయింట్లుగా రాయాలి. పేరాగ్రాఫ్‌గా రాయకూడదు.
* 60 మార్కులను సాధించడానికి అతిస్వల్ప సమాధాన ప్రశ్నలను జాగ్రత్తగా, పూర్తిగా చదివి, సమాధానం రాయాలి.
* శాస్త్రీయ నామాలను వేర్వేరుగా కింద గీత గీస్తూ రాయాలి.
* ప్రథమ సంవత్సరంలో ఒక అతిస్వల్ప సమాధాన ప్రశ్న క్రోమోసోమ్‌ల సంఖ్య లేదా ప్లాయ్‌డీ లేదా కణవిభజనకు సంబంధించి వస్తుంది.
* అంతర్నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన పటాలను కలర్‌ పెన్సిళ్లు వాడి, వివిధ భాగాలను వేర్వేరుగా గుర్తించాలి.
* ద్వితీయ సంవత్సరంలోని దీర్ఘ సమాధాన ప్రశ్నల్లో, క్రెబ్స్‌ వలయం, కాల్విన్‌ వలయాల్లోని చర్యలను విడిగా, ఎంజైమ్‌ పేర్లతో సహా రాయాలి.
* అన్ని సమాధానాల్లో ముఖ్య పదాలను గీత ద్వారా సూచించాలి.
* అకాడమీ పుస్తకాలను శ్రద్ధగా చదివి, వాటి సమాధానాలను క్రమపద్ధతిలో రాయాలి. .
చేయకూడనివి
* అతిస్వల్ప సమాధాన ప్రశ్నలను 1 నుంచి 10 వరకు వేర్వేరు స్థానాల్లో రాయకూడదు.
* ప్రశ్నను పూర్తిగా చదవకుండా, సమాధానాన్ని ప్రారంభించకూడదు.
* సమాధానాలను రాసేటప్పుడు ఆ ప్రశ్నను తిరిగి రాయాల్సిన అవసరం లేదు. ప్రశ్న సంఖ్య సూచిస్తే సరిపోతుంది.
* దీర్ఘ సమాధానాలను పేరాగ్రాఫ్‌ రూపంలో రాయొద్దు.
* బుక్‌లెట్‌లో 24 పేజీలు ఉంటాయి, కాబట్టి సమాధానాలను వరుస క్రమంలో పేజీలు మధ్యలో వదలకుండా రాయండి.
* స్వల్ప సమాధాన ప్రశ్నల సమాధానాలు, పటాల వేర్వేరు స్థానాల్లో రాయొద్దు.
* బ్లూ లేదా బ్లాక్‌ పెన్‌ను మాత్రమే సమాధానాలకు ఉపయోగించాలి.
* ఆన్సర్‌ బుక్‌లెట్‌లో ఎక్కడ కూడా హాల్‌టికెట్‌ నంబరు, పేరు రాయకూడదు.
* సమాధానాలను విడతలవారీగా రాయొద్దు.
* పటాలను పెన్సిల్‌ లేదా కలర్‌ పెన్సిల్‌లతో మాత్రమే వేయాలి. స్కెచ్‌పెన్‌తో వేయకూడదు.

ఈ ప్రశ్నలు చాలా ముఖ్యం
మొదటి సంవత్సరంలో ముఖ్యమైన దీర్ఘ సమాధాన ప్రశ్నలు
1) వేరు రూపాంతరాలను నిర్వచించండి. వివిధ విధులను నిర్వర్తించడానికి వేరు ఏవిధంగా రూపాంతరం చెందిందో వివరించండి.
2) వివిధ విధులను నిర్వర్తించడం కోసం కాండం ఏవిధంగా అనేక రకాలుగా రూపాంతరం చెందిందో వివరించండి.
3) వివిధ రకాల మధ్యాభిసార పుష్పవిన్యాసాలను వివరించండి.
4) ఆవృత బీజ మొక్కల్లో జరిగే ఫలదీకరణ విధానాన్ని వివరించండి.
5) భాగాలు గుర్తించిన చక్కటి పట సహాయంతో, ఆవృత బీజ పక్వదశలోని పిండకోశాన్ని వర్ణించండి. సహాయకణాల పాత్రను సూచించండి.
6) సూక్ష్మసిద్ద బీజాశయ పటం గీసి, దాన్ని ఆవరించిన కుడ్య పొరలను గుర్తించండి. కుడ్య పొరల గురించి క్లుప్తంగా రాయండి.
ద్వితీయ సంవత్సరంలో ముఖ్యమైన దీర్ఘ సమాధాన ప్రశ్నలు
1. క్రెబ్స్‌ వలయంలోని రసాయనిక చర్యలను వివరించండి.
2. గ్లైకాలిసిస్‌ను వివరించండి? అది జరిగే ప్రదేశం, అంత్య ఉత్పన్నాలు ఏవి? ఈ ఉత్పన్నాలు వాయు సహిత, వాయు రహిత శ్వాసక్రియల ద్వారా ఏ మార్పునకు లోనవుతాయి?
3. కాల్విన్‌ వలయం (పథం)ను వివరించండి?
4. పునస్సంయోజక డీఎన్‌ఏ సాంకేతిక విధానంలోని వివిధ ప్రక్రియలను క్లుప్తంగా వివరించండి.
5. పునస్సంయోజక డీఎన్‌ఏ సాంకేతిక విధానంలో వాడే సాధనాలను వివరించండి.
6. మీరు మొక్కల ప్రజనన విభాగంతో పనిచేసే ఒక శాస్త్రవేత్త. ఒక కొత్త రకాన్ని విడుదల చేసే క్రమంలో మీరు పాటించే వివిధ దశలను వివరించండి.
7. కణజాల వర్ధనం అనే సాంకేతిక విజ్ఞానం గురించి వివరించండి. సంప్రదాయ పద్ధతిలో మొక్కల ప్రజననం, సస్యాభివృద్ధి కార్యక్రమాల కంటే కణజాల వర్ధనం వల్ల వచ్చే లాభాలు ఏమిటి?
- జి.వెంకటేశ్వ‌ర‌రావు, శ్రీ గాయత్రి విద్యా సంస్థ‌లు, హైద‌రాబాద్‌.

జంతుశాస్త్రం
ఇంటర్‌ జంతుశాస్త్రంలో అత్యధిక మార్కులు తెచ్చుకోవాలంటే ముఖ్యమైన అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టటంతో పాటు కొన్ని మెలకువలు పాటించాలి.
మొదటి ఏడాదిలో 6, 8 యూనిట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. కనీసం 30 మార్కులు రావాలంటే గత మూడేళ్ల ప్రశ్నపత్రాల్లోని 2, 4 మార్కుల ప్రశ్నలపై శ్రద్ధ పెట్టడం, ప్రొటోజోవా గమనం- ప్రత్యుత్పత్తి, 6, 7 యూనిట్లను, కొన్ని అంశాలను 8వ యూనిట్‌ నుంచి చదవాలి. 60కి 60 మార్కులు సాధించాలనుకునేవారు 1, 3, 4 యూనిట్లలో ముఖ్యమైనవి, మిగతా యూనిట్లలో అన్ని 2, 4 మార్కుల ప్రశ్నలను చదువుకోవాలి.
రెండో సంవత్సరంలో జంతుశాస్త్ర రెండో ఏడాది పాఠ్యాంశాలు కొద్దిగా ఎక్కువ. కాబట్టి, సరైన ప్రణాళికతో సిద్ధం కావాలి.
చేయాల్సినవి
* మొదటి సంవత్సరంలో నూరు శాతం మార్కులు రావాలంటే విభాగం-ఎకు సంబంధించి పాఠ్యపుస్తకం వెనుక ఇచ్చిన ప్రశ్నలన్నీ చూసుకోవాలి.
* ముఖ్యమైన పదాలను ప్రత్యేకంగా కింద గీత గీయడం ద్వారా సూచించాలి.
* 8, 4 మార్కుల ప్రశ్నలకు చిత్రపటాన్ని గీయాలి.
* పటం గీయమని వచ్చిన ప్రశ్నలకు ప్రత్యేకంగా శ్రద్ధవహించాలి.
* విభాగం-ఎలోని ప్రశ్నలకు క్లుప్తంగా, ముఖ్యమైన అంశాన్ని వదలకుండా రాయాలి.
* విభాగం-సి రాసేటపుడు సమయపాలన విషయంలో శ్రద్ధ వహించాలి.
* పరాన్న జీవుల జీవిత చరిత్రలు నాలుగూ వదలకుండా చదవాలి.
* పర్యావరణ శాస్త్రంలోని ప్రశ్నలకు రాసే సమాధానాలకు హెడ్డింగులు ముఖ్యం.
* రెండో సంవత్సరంలో 60కి 60 మార్కులు సాధించాలంటే అన్ని యూనిట్లనూ చదవాలి. 2 మార్కుల ప్రశ్నలకు పాఠ్యపుస్తకంలోని అన్ని ప్రశ్నలూ చదవాలి.
* దంతం నిలువుకోత, నాడీ దండం అడ్డుకోత పటాలను సాధన చేయాలి.
* జన్యుశాస్త్రం, ప్రత్యుత్పత్తి వ్యవస్థ యూనిట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సాధారణంగా 24 మార్కుల వరకు వీటి నుంచి వస్తాయి.
* కనీసం 30 మార్కులు తెచ్చుకోవాలనుకునేవారు పై రెండు యూనిట్లూ, నిర్మాణ సామ్య అవయవాలు, క్రియాసామ్య అవయవాలు, ఉత్పరివర్తన సిద్ధాంతం వంటి ముఖ్యమైన 4 మార్కుల ప్రశ్నలు సాధన చేయాలి. ఇలాంటివారు 8వ యూనిట్లలో కొన్ని ముఖ్యమైనవి.. కాన్సర్, ఎలిసా వంటివి చూసుకుంటే సరిపోతుంది.
* ప్రతి సమాధానం తరువాత గీత గీయాలి.
* ప్రశ్నల సంఖ్యను గీతకు లోపలే స్పష్టంగా రాయాలి.
* సైనోవియల్‌ కీలు పటం కూడా సాధన చేయాలి.
చేయకూడనివి
* ఒక విభాగంలో కొన్ని ప్రశ్నలు, మరో విభాగంలోవి కొన్ని.. ఇలా చేసుకుంటూ వెళ్లకూడదు.
* ప్రశ్న సంఖ్య స్పష్టంగా గీత గీసి, దాని లోపల రాయాలి. లేదంటే మూల్యాంకనం చేయరు.
* కొట్టివేతలు లేకుండా జాగ్రత్తపడాలి.
* ఒకే సమాధానానికి ఎక్కువ సమయం కేటాయించకూడదు.
* 8 మార్కుల ప్రశ్నలకు పటాలను అశ్రద్ధ చేయకూడదు. కనీసం 2 మార్కులు దానికే ఉంటాయి.
* పటంలో భాగాలు గుర్తించేటపుడు అన్నివైపులా రాసి, చదవడానికి ఇబ్బందిపడేలా ఉండకూడదు.
* 8 మార్కుల ప్రశ్నలు కేవలం 3, 4 చదివి వెళ్లడం ప్రమాదకరం.
* 8 మార్కుల ప్రశ్నలకు సమాధానం రాసేటపుడు ముందుగా సరిగారాని ప్రశ్నలను రాయకూడదు.
* అకశేరుకాలు, సకశేరుకాలు (3, 4 యూనిట్లు) చదివేటపుడు మరీ ఎక్కువ సమయం కేటాయించడం అనవసరం.
* రెండో సంవత్సరంలో జన్యుశాస్త్రంలో 8 మార్కుల ప్రశ్నలకు సమాధానాల్లోనూ పట సాయంతో రాయడం మర్చిపోకూడదు.
ఏ యూనిట్‌నూ వదిలేయకూడదు.

ఈ ప్రశ్నలు చాలా ముఖ్యం
మొదటి సంవత్సరం
1. ప్లాస్మోడియం జీవిత చరిత్రను వివరించండి.
2. ఆస్కారిస్‌ ఎంబ్రికాయిడిస్‌ నిర్మాణాన్ని, జీవితచక్రాన్ని పటం సాయంతో వివరించండి.
3. బొద్దింక జీర్ణవ్యవస్థ పటం సాయంతో వివరించండి.
4. ఆహార గొలుసులను గురించి వివరించండి.
5. హావర్షియన్‌ వ్యవస్థను వివరించండి.
రెండో సంవత్సరం
1. మానవుడి గుండె నిర్మాణాన్ని చిత్రపటాన్ని గీసి వివరించండి.
2. మానవుడి గుండె పనిచేసే విధానాన్ని వివరించండి.
3. మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను వివరించండి.
4. మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను వివరించండి.
5. క్రిస్‌క్రాస్‌ అనువంశికత అంటే ఏమిటి?
6. మానవుడిలో సంప్రాప్తించే ఒక లింగ సహలగ్నత అంతర్గత లక్షణాన్ని వివరించండి.
- అక్కిరాల ద‌త్రాత్రేయ‌, శ్రీ గాయత్రి విద్యా సంస్థ‌లు, హైద‌రాబాద్‌.

రసాయన శాస్త్రం
ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల రసాయన శాస్త్రంలో అత్యధిక మార్కులు స్కోరు చేయటానికి కొన్ని మెలకువలు పాటించాలి. మొదట గమనించాల్సింది... పూర్తి సిలబస్‌ మీద సరైన అవగాహన అవసరం. అన్ని పాఠ్యాంశాలనూ 2 మార్కులు, 4 మార్కులు, 8 మార్కుల ప్రశ్నలుగా విభజించి ఎంపిక చేసుకుని (సెలక్టివ్‌) చదవాలి.

8 మార్కుల ప్రశ్నలు పరమాణు నిర్మాణం, ఆవర్తన పట్టిక, రసాయన బంధంలోనుంచి మాత్రమే రావడానికి అవకాశాలు ఎక్కువ. 4 మార్కుల ప్రశ్నలు స్టేట్స్‌ ఆఫ్‌ మ్యాటర్‌ (పదార్థాల స్థితి), స్టాయికియోమెట్రీ, ఉష్ణగతిక‌ శాస్త్రం (thermodynamics), హైడ్రోజన్ - దాని సమ్మేళనాలు, రసాయన సమతాస్థితి, అయానిక సమతాస్థితి, కర్బన రసాయన శాస్త్రం నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువ.

8 మార్కుల ప్రశ్నలు మూడింటిలో రెండు మాత్రమే రాయాలి కాబట్టి బాగా తెలిసిన 2 ప్రశ్నలను ఎంచుకోవాలి. సుమారు 250 పదాలతో రెండు మూడు పేజీల్లో కూలంకషంగా అవసరమైనచోట డయాగ్రామ్స్‌ (పటం) వేసి సమాధానం రాయాలి. ప్రశ్నలను పూర్తిగా అర్థం చేసుకొని దానికి కావాల్సిన‌ సమాధానం మాత్రమే రాయాలి. ఇక్కడ అదనపు ప్రశ్నకు సమాధానం రాయాలని ప్రయత్నించకూడదు.

4 మార్కుల ప్రశ్నల్లో 8 ప్రశ్నలకుగాను 6 ప్రశ్నలు మాత్రమే రాయాలి. బాగా తెలిసిన 6 ప్రశ్నలకు 50 నుంచి 60 పదాల్లో రాయాలి. ఒకవేళ సమయం మిగిలివుంటే అదనపు ప్రశ్నలకు సమాధానాలు రాస్తే అదనపు ప్రయోజనం లభిస్తుంది. ఎందుకంటే ఎగ్జామినర్‌ ఈ ప్రశ్నల్లో బాగా రాసిన అంటే.. ఎక్కువ మార్కులు వచ్చిన ప్రశ్నలను పరిగణనలోనికి తీసుకుంటారు. అందుకని అధిక మార్కులు వచ్చే అవకాశం ఉంది.

2 మార్కుల ప్రశ్నల్లో చాయిస్‌ లేదు. 10 ప్రశ్నలూ సరిగ్గా రాస్తేనే 60 మార్కులు వస్తాయి. అన్ని పాఠ్యాంశాలూ పూర్తిగా చదవాలి. .

ప్రథమ సంవత్సరంలో..
* అకాడమీ పుస్తకాల్లో పాఠ్యాంశం చివరున్న అన్ని రెండు మార్కుల ప్రశ్నలూ జాగ్రత్తగా చదివితే గరిష్ఠ మార్కులు తెచ్చుకోవడం సులభమే. 2 మార్కుల ప్రశ్నలు - ఎన్విరాన్‌మెంట్‌ కెమిస్ట్రీ, యస్‌ బ్లాక్, పి-బ్లాక్‌ నుంచి దాదాపు 6 ప్రశ్నల వరకు అడిగే అవకాశం ఉంటుంది. అయానిక సమతాస్థితిలో పీహెచ్‌ ప్రాబ్లమ్స్‌మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అకాడమీ పుస్తకంలో వెనుక వైపున ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను బాగా సాధన చేయాలి.

ద్వితీయ సంవత్సరంలో...
* కర్బన రసాయన శాస్త్రం నుంచి 16 మార్కులుంటాయి. కాబట్టి ఈ విభాగం మీద ఎక్కువ దృష్టి సారించాలి. దీనిలో వచ్చే అన్ని Named Reactions బాగా సాధన చేయాలి. కార్బాక్సిలికామ్లాల ఆమ్లత్వం, అమైన్స్‌ క్షారత్వం ఆర్డ‌రును సాధన చేయాలి. ద్రావణాలు, లోహ‌సంగ్రహణ శాస్త్రం, ఉపరితల రసాయన శాస్త్రం, సంక్లిష్ట సమ్మేళనాలు, జీవ అణువులనుంచి 4 మార్కుల మీద ఎక్కువ సాధన చేయాలి. పాలిమర్స్, నిత్య జీవితంలో రసాయనశాస్త్రం, ఘన స్థితి ద్రావణాలు, లోహ సంగ్రహణ శాస్త్రం, సంక్లిష్ట సమ్మేళనాల నుంచి 2 మార్కులమీద ఎక్కువ సాధన చేయాలి. వీలైనంత వరకు 2 మార్కుల సమాధానాలు వరుస క్రమంలో రాయటం మేలు.

ముఖ్యమైన ప్రశ్నలు
మొదటి సంవత్సరం

రెండు మార్కులు
1) ప్రామాణిక ఎంట్రోపి (Absolute Entropy) అంటే ఏమిటి?
2) గ్రాఫైట్‌ మంచి విద్యుద్వాహకం ఎందుకు?
3) 250 మి.లీ., 0.5 N ద్రావణం తయారీకి కావాల్సిన Na2CO3 ద్రవ్యరాశిని కనుక్కోండి.
4) BOD, COD లను నిర్వచించండి.
5) ఎ)
బి)
యొక్క IUPAC పేర్ల‌ను రాయండి.
నాలుగు మార్కులు
1) డైబోరేన్‌ నిర్మాణాన్ని వివరించండి.
2) వాయు అణుచలన సిద్ధాంతంలోని ముఖ్యమైన (Kinetic Molecular Theory) ప్రతిపాదనలు రాయండి.
3)
పైన తెలిపిన స‌మీక‌ర‌ణంలో A, B, C ఉత్ప‌న్నాలు రాయండి.
ఎనిమిది మార్కులు
1) ఎ) బోర్‌ పరమాణు సిద్ధాంత ప్రతిపాదనలు వివరించండి.
బి)బోర్‌ సిద్ధాంతం ఆధారంగా హైడ్రోజన్‌ వర్ణపటాన్ని వివరించండి.
2) ప్రథమ, ద్వితీయ అయనీకరణ శక్మాలను నిర్వచించండి. ద్వితీయ అయనీకరణ శక్మం కంటే ప్రథమ అయనీకరణ శక్మం ఎందుకు ఎక్కువ ఉంటుంది. అయనీకరణ శక్మాలను ప్రభావితం చేసే అంశాలు వివరించండి.
3) N2, O2 మాలిక్యులర్ ఆర్బిటాల్‌ డయాగ్రమ్‌ను వివరించండి. ఇంకా N2, O2 బంధ‌క్రమం, అయస్కాంత ధర్మాన్ని వివరించండి.
రెండో సంవత్సరం
రెండు మార్కులు
1) ఐసోటానిక్‌ ద్రావణాలు అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి.
2) CuSO2. 5 H2O నీలివ‌ర్ణం క‌లిగి ఉంటుంది. కానీ అనార్ద్ర‌ CuSO2 వ‌ర్ణ‌ర‌హితం (Colour less)గా ఎందుకు ఉంటుంది?
3) కాపర్ లోహ సంగ్రహణంలో సిలికా పాత్ర ఏమిటి?
4) శూన్య‌, ప్ర‌థ‌మ‌, ద్వితీయ క్ర‌మాంక చ‌ర్య‌ల ప్ర‌మాణాలు రాయండి.
5) కార్బైల్ అమైన్ చ‌ర్య‌ను వివ‌రించండి.
నాలుగు మార్కులు
1) ప్లవనప్రక్రియ విధానం (Froth Flotation) వివరించండి.
2) సంక్లిష్ట సమ్మేళనాల వెర్నర్‌ సిద్ధాంతాన్ని ఉదాహరణల‌తో వివరించండి.
3) భౌతిక, రసాయన అధిశోషణం మధ్య భేదాలు రాయండి.
ఎనిమిది మార్కులు
1) ఎ) కోల్‌రాష్‌ నియమాన్ని నిర్వచించి వివరించండి.
బి) అభిఘాత సిద్ధాంతం (Collision Theory) ప్రతిపాదనలు రాయండి.
2) కింది వాటి గురించి రాయండి.
ఎ) రీమ‌ర్ - టీమ‌న్‌
బి) కానిజారో చ‌ర్య‌
సి) విలియంస‌న్ చ‌ర్య‌
డి) HVZ చ‌ర్య‌
- టి. లక్ష్మీనారాయణ, శ్రీ చైత‌న్య విద్యాసంస్థ‌లు.

గణితశాస్త్రం
ఇంటర్మీడియట్‌ విద్యార్థులు గణితంలో 75 మార్కులు చాలా సులభంగా సాధించవచ్చు. సమయం కూడా సరిపోతుంది. ఇందుకు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది.
* 7 మార్కుల ప్రశ్నల్లో బాగా తెలిసినవి 5 ప్రశ్నలు ఎంచుకుని సమాధానాలు రాయాలి (50 నిమిషాలు)
* 4 మార్కుల ప్రశ్నల్లో బాగా తెలిసినవి 5 ఎంచుకుని సమాధానాలు రాయాలి (40 నిమిషాలు)
* 2 మార్కుల ప్రశ్నల్నింటినీ వరుసక్రమంలో రాయడానికి ప్రయత్నించాలి (40 నిమిషాలు)
* పై మూడింటినీ ఏదో క్రమంలో పూర్తిచేసిన తరువాత మిగిలిన 7 మార్కుల ప్రశ్న ఒకటి, 4 మార్కుల ప్రశ్న ఒకదానికి సమాధానం ఇవ్వండి (15 నిమిషాలు)
* చివరగా మిగిలిన 7, 4 మార్కుల ప్రశ్నలను సాధించండి (15 నిమిషాలు)
ఈ క్రమంలో రాస్తే.. పొరబాటున ఎక్కడైనా (7 లేదా 4 మార్కుల ప్రశ్నలు) జవాబు తప్పు అయినా అన్నింటినీ చేసుండటం వల్ల మార్కులు నష్టపోయే అవకాశం ఉండదు. చివరగా 2 మార్కుల ప్రశ్నల సమాధానాలను పరిశీలించుకోవాలి (20 నిమిషాలు).
మొదటి సంవత్సరంలో..
* మ్యాథ్స్‌- 1ఎలో మంచి మార్కులు సాధించాలంటే ముందుగా మాత్రికలు చూసుకోవాలి. ఈ అధ్యాయానికి 22 మార్కుల వెయిటేజీ ఉంది. దీని నుంచి రెండు 7, ఒక 4, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి.
* సదిశల నుంచి ఒక 7, రెండు 4, మూడు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. మొత్తం మార్కులు 21.
* ప్రమేయాలు వెయిటేజీ 11 మార్కులు. ఒక 7, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. దీని నుంచి సిద్ధాంతాలు ముఖ్యమైనవి.
* తరువాత సులభమైన అధ్యాయం గణితానుగమనం. దీని నుంచి 7, 4 మార్కుల ప్రశ్నలు ఒక్కొక్కటి చొప్పున వస్తాయి.
* ఆపై త్రికోణమితీయ నిష్పత్తులు, త్రికోణమితీయ పరివర్తనలు చదవాలి. దీని వెయిటేజీ 15 మార్కులు. దీని నుంచి 7, 4 మార్కుల ప్రశ్నలు ఒక్కొక్కటి చొప్పున, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి.
* ఆ తర్వాత త్రిభుజ ధర్మాలు చదవాలి. దీని వెయిటేజీ 11 మార్కులు. 7, 4 మార్కుల ప్రశ్నలు ఒక్కొక్కటి చొప్పున వస్తాయి.
* దీని తరువాత త్రికోణమితీయ సమీకరణాలు, విలోమ త్రికోణమితీయ ప్రమేయాల నుంచి ఒక్కొక్కటి చొప్పున 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి.
* చివరగా 2 మార్కుల కోసం అతి పరావలయ ప్రమేయాలు చదివితే సరిపోతుంది.
మొదటి సంవత్సర విద్యార్థులు కష్టంగా భావించే సబ్జెక్టు 1బి. కానీ ప్రణాళిక ప్రకారం చదివితే మంచి మార్కులు సాధించవచ్చు. దీనిలో నిరూపక జ్యామితి, కలన గణితం అనే రెండు భాగాలుంటాయి.
* ముందుగా నిరూపక జ్యామితిలోని సరళరేఖలతో సన్నద్ధత ప్రారంభించాలి. దీనికి 15 మార్కుల వెయిటేచ్కీజీజి ఉంది. రెండు 2 మార్కుల ప్రశ్నలూ, 7, 4 మార్కుల ప్రశ్నలు ఒక్కొక్కటి చొప్పునా వస్తాయి.
* ఆ తరువాత సరళరేఖ యుగ్మాలు చూసుకోవాలి. దీని నుంచి రెండు ఏడు మార్కుల ప్రశ్నలు వస్తాయి. దీనిలో మొదటి భాగం (మొదటి రెండు అభ్యాసాలు)లో వరకు ఒక ప్రశ్న, రెండో భాగం (మూడో అభ్యాసం) నుంచి రెండో ప్రశ్న వస్తుంది.
* త్రిపరిమాణ జ్యామితిలో 3 అధ్యాయాలుంటాయి. 1) త్రిపరిమాణ నిరూపక వ్యవస్థ (దీనికి 2 మార్కులు) 2) దిక్‌ కొసైన్‌లు, దిక్‌ నిష్పత్తులు (7 మార్కులు) 3) తలాలు (2మార్కులు)
* తరువాత కలన గణితాన్ని మొదలుపెట్టాలి. దీని నుంచి రెండు 2 మార్కుల ప్రశ్నలు, 4, 7 మార్కుల ప్రశ్నలు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 15 మార్కులకు వస్తాయి.
* ఇప్పుడు స్పర్శరేఖలు, సరళ రేఖలు, అభిలంబ రేఖలను ఎంచుకోవాలి. దీని నుంచి 4, 7 మార్కుల ప్రశ్నలు ఒక్కొక్కటి చొప్పున వస్తాయి. మొత్తం వెయిటేచ్కీజీజి 13 మార్కులు. ఇక్కడి వరకూ ఆరు 7 మార్కుల ప్రశ్నలు అయ్యాయి.
* తరువాత 4 మార్కుల కోసం బిందు పథం, అవధులు అవిచ్ఛిన్నత, పైన చెప్పిన అధ్యాయాలూ చూసుకోవాలి.
రెండు మార్కులకు.. పై అధ్యాయాలతోపాటు దోషాలు - ఉజ్జాయింపు, మీన్‌ వాల్యూ థీరమ్‌లను చదివితే సరిపోతుంది.
వెయిటేజీప్రకారం.. ద్విపరిమాణ జ్యామితి నుంచి 37 మార్కులు, త్రిపరిమాణ జ్యామితి నుంచి 11, కలన గణితం నుంచి 49 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.

రెండో సంవత్సరం
కొంతమంది సులభంగా, మరికొంతమంది కష్టంగా భావించే సబ్జెక్టు మ్యాథ్స్‌ 2 ఏ. 75కు 75 మార్కులు తెచ్చుకోవాలంటే..
* పూర్ణసంఖ్యలకు 8 మార్కుల వెయిటేజీ (4 + 2 + 2)
* డిమోయర్‌ సిద్ధాంతం వెయిటేజీ 9 మార్కులు (7 + 2)
* దీని తరువాత సులభమైన అధ్యాయం యాదృచ్ఛిక చలరాశులు - సంభావ్యత విభజనలు. వెయిటేజీ 9 మార్కులు (7 + 2)
* దీని తరువాత సులువైన అధ్యాయం సంభావ్యత. దీని నుంచి 15 మార్కులు వస్తాయి (ఒక 7, రెండు 4 మార్కుల ప్రశ్నలు)
* ఆపై ద్విపద సిద్ధాంతం. వెయిటేజీ 16 మార్కులు (రెండు 7, రెండు 4 మార్కుల ప్రశ్నలు)
* తరువాత సిద్ధమవ్వాల్సింది - ప్రస్తారాలు - సంయోగాలు. వెయిటేజీ 12 మార్కులు. ప్రస్తారాల నుంచి ఒకటి 4, ఒక 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి.
* వర్గ సమాసాలు చాలా సులభమైన అధ్యాయం. వెయిటేజీ 6 మార్కులు. 4, 2 మార్కుల ప్రశ్నలు ఒక్కొక్కటి చొప్పున వస్తాయి.
విద్యార్థులు చాలా కష్టంగా భావించే సబ్జెక్టు 2బి. దీనిలో నిరూపక జ్యామితి, కలన గణితం అనే రెండు భాగాలుంటాయి.
* మొదట నిరూపక జ్యామితిలో వృత్తాలు చూసుకోవాలి. తరువాత వృత్త సరణి.
* ఈ రెండు అధ్యాయాలూ పూర్తయ్యాక కలన గణితం మొదలుపెట్టాలి. మొదటగా సమాకలనం. తరువాత నిశ్చిత సమాకలనం. ఆపై అవకలన సమీకరణాలు.
* నిరూపక జ్యామితితో పోలిస్తే కలన గణితాన్ని విద్యార్థులు సులభంగా భావిస్తారు. అందుకే వృత్తాలు, వృత్త సరణి తర్వాత కలన గణితం మొదలుపెట్టాలి. కలన గణితంలో మార్కులు సాధించడం సులభం.
* పరావలయం, దీర్ఘవృత్తం, అతిపరావలయం.. ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి మొదటగా పరావలయం, తరువాత దీర్ఘవృత్తం, చివరగా పరావలయాన్ని చదవాలి.
మ్యాథ్స్‌ 2బిలో కచ్చితంగా సిద్ధం కావాల్సిన అధ్యాయాలు - వృత్తాలు (22 మార్కులు), వృత్తసరణి (6 మార్కులు), పరావలయం (9 మార్కులు), అతి పరావలయం (6 మార్కులు), సమాకలనం (18 మార్కులు), నిశ్చిత సమాకలనం (15 మార్కులు), అవకలన సమీకరణాలు (13 మార్కులు).
ఇక వేటిని వదిలేయవచ్చు అనే ప్రశ్న వస్తే రెండు అధ్యాయాలను చెప్పవచ్చు. అవి - దీర్ఘవృత్తం (8 మార్కులు), వైశాల్యాలు (4 మార్కులు).
- ఆర్‌. శ్రీనివాసరాజు, శ్రీ చైత‌న్య విద్యాసంస్థ‌లు.

Published on 22-01-2019