Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కేవీపీవై ఫెలోషిప్స్‌ - 2019
 

* పరిశోధనల ప్రోత్సాహానికి ఉపకారం

విద్యార్థుల్లో సైన్స్‌ పట్ల అభిరుచిని, ఆసక్తిని పసిగట్టి, పెంపొందించి వారిని పరిశోధనల దిశగా నడిపించాలనే లక్ష్యంతో కిశోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజన (కేవీపీవై)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భావిపౌరులను దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయడమే పథకం ఉద్దేశం. దీని ద్వారా బేసిక్‌ సైన్సెస్‌లో ప్రతిభను ప్రదర్శించిన అభ్యర్థులకు ఉపకారవేతనాలను అందిస్తారు. కేంద్రం ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ నిధులను సమకూరుస్తుంది.

సైన్స్‌ సబ్జెక్టుల్లో ఇంటర్‌, డిగ్రీ ప్రథమ సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థుల కోసం కిశోర్‌ వైజ్ఞానిక ప్రోత్సాహన్‌ యోజన (కేవీపీవై) ప్రకటన వెలువడింది. ఎంపికైనవారికి డిగ్రీలో ఉన్నప్పుడు మూడేళ్లపాటు ప్రతినెలా రూ.5000 ఉపకారవేతనంగా చెల్లిస్తారు. అలాగే పీజీలో రూ.7000 చొప్పున అందిస్తారు. వీటితోపాటు ఏటా కంటింజెన్సీ గ్రాంటు, ప్రసిద్ధ సంస్థల్లో వేసవి క్యాంపులూ ఉంటాయి. జాతీయస్థాయి ఆప్టిట్యూడ్‌ పరీక్షలో చూపిన ప్రతిభ, ముఖాముఖి ద్వారా స్కాలర్‌షిప్పులకు అర్హులను ఎంపిక చేస్తారు. ఇందులో ఎస్‌ఏ, ఎస్‌ఎక్స్‌, ఎస్‌బీ అని మూడు స్ట్రీములున్నాయి.
ఎస్‌ఏ: ప్రస్తుత విద్యా సంవత్సరం (2019-20)లో సైన్స్‌ సబ్జెక్టుల్లో (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బయాలజీ) జూనియర్‌ ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులు ఈ విభాగం కిందకి వస్తారు. పదో తరగతిలో మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల్లో కనీసం 75 శాతం మార్కులు సాధించినవారు కేవీపీవై రాతపరీక్షకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 65 శాతం మార్కులు పొందాలి. వీరు ఇంటర్లో కనీసం 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు 2021-22 విద్యా సంవత్సరంలో బేసిక్‌ సైన్సెస్‌ (బీఎస్సీ, బీఎస్‌, బీస్టాట్‌, బీమ్యాథ్స్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌) కోర్సుల్లో చేరితేనే ఈ స్కాలర్‌షిప్‌ వర్తిస్తుంది. వీళ్లు సీనియర్‌ ఇంటర్‌లో ఉన్న సమయాన్ని ఇంటెరిమ్‌ పీరియడ్‌గా పరిగణిస్తారు. ఈ వ్యవధిలో ప్రాంతీయ, జాతీయస్థాయి సైన్స్‌ క్యాంపులకు ఆహ్వానిస్తారు. ప్రయాణ ఖర్చులు భరించి, ఉచిత వసతి కల్పిస్తారు.
ఎస్‌ఎక్స్‌: 2019-20లో సైన్స్‌ సబ్జెక్టుల్లో (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బయాలజీ) సీనియర్‌ ఇంటర్‌ చదువుతున్నవారు ఈ స్ట్రీమ్‌ పరిధిలోకి వస్తారు. వీరంతా పదో తరగతిలో మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల్లో కనీసం 75 శాతం (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 65 శాతం) మార్కులు పొంది ఉండాలి. అలాగే సైన్స్‌ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 50 శాతం) మార్కులతో ఇంటర్‌ పూర్తిచేయాలి. దీంతోపాటు 2020-21 విద్యా సంవత్సరంలో బీఎస్సీ, బీఎస్‌, బీస్టాట్‌, బీమ్యాథ్స్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్‌ కోర్సుల్లో చేరితేనే స్కాలర్‌షిప్‌ వర్తిస్తుంది.

ఎస్‌బీ: 2019-20లో ప్రథమ సంవత్సరం బీఎస్సీ/బీఎస్‌/బీస్టాట్‌/బీమ్యాథ్స్‌/ ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ/ఎంఎస్‌ కోర్సులు చదువుతున్నవారు స్కాలర్‌షిప్‌ కోసం నిర్వహించే రాతపరీక్షకు అర్హులు. వీళ్లు సైన్స్‌ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులైతే 50 శాతం) మార్కులతో ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్‌ తర్వాత విరామం ఉండకూడదు. వీరు డిగ్రీ/ ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులైతే 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తేనే స్కాలర్‌షిప్‌కి ఎంపికవుతారు.

ఎంపిక విధానం
జాతీయస్థాయిలో జరిగే ఆన్‌లైన్‌ ఆప్టిట్యూడ్‌ పరీక్షలో ప్రతిభ చూపినవారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు. పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. ఆప్టిట్యూడ్‌ పరీక్షలో పొందిన మార్కుల్లో 75 శాతం + ఇంటర్వ్యూ మార్కుల్లో 25 శాతం కలిపి మెరిట్‌ లిస్ట్‌ తయారు చేస్తారు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు గడువు: ఆగస్టు 20 సాయంత్రం 5 వరకు
దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.వెయ్యి; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500. పరీక్ష తేది: నవంబరు 3
పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో హైదరాబాద్‌. http://kvpy.iisc.ernet.in

పరీక్షలో ఏం ఉంటుంది?
ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ఉంటుంది. రాతపరీక్ష కోసం ప్రత్యేకమైన సిలబస్‌ ఏమీ నిర్దేశించలేదు. విద్యార్థికి సైన్స్‌ సబ్జెక్టుల్లో ఉన్న అవగాహన, అర్థం చేసుకునే తీరు, విశ్లేషణను పరిశీలిస్తారు. సాధారణంగా వాళ్లు రాసే స్ట్రీమ్‌ను బట్టి పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ / ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రథమ సంవత్సరంలోని సైన్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టుల స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టును కేవీపీవై వెబ్‌సైట్‌లో చూడవచ్చు. దీనివల్ల ప్రశ్నపత్రంపై ఒక అవగాహన ఏర్పడుతుంది.
ఎస్‌ఏ స్ట్రీమ్‌ వారికి సైన్స్‌, మ్యాథ్స్‌ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. ఎస్‌బీ, ఎస్‌ఎక్స్‌ స్ట్రీమ్‌ల్లో రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో నాలుగు సెక్షన్లు.. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బయాలజీ. రెండో భాగంలోనూ ఈ సబ్జెక్టులతోనే నాలుగు సెక్షన్లు ఉంటాయి. అయితే అభ్యర్థులు మొదటి భాగంలో కనీసం మూడు సబ్జెక్టులు, రెండో భాగంలో కనీసం రెండు సబ్జెక్టుల ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు. పాత ప్రశ్నపత్రాలు, సమాధానాలు కేవీపీవై వెబ్‌సైట్‌లో ఉంటాయి. పరీక్షలో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికలు పూర్తిచేస్తారు.

నోటిఫికేష‌న్‌ వెబ్‌సైట్‌

Posted on 10-07-2019