Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సాధనతో వేగం... మ్యాట్‌ వ్యూహం

ప్రతిష్ఠాత్మక బీ- స్కూళ్లలో ఎంబీఏ / తత్సమాన అంశాల్లో పీజీ చేయడానికి మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (మ్యాట్‌) రాయాల్సి ఉంటుంది. మేలో నిర్వహించే పరీక్షకు ప్రస్తుతం ప్రకటన వెలువడింది. దానికి సమగ్రంగా ఎలా సన్నద్ధం కావాలో తెలుసుకుందాం!

ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ మ్యాట్‌ను నిర్వహిస్తుంది. ఏటా ఫిబ్రవరి, మే, సెప్టెంబరు, డిసెంబరు నెలల్లో ఈ పరీక్షను నిర్వహిస్తుంటారు. మ్యాట్‌ పేపర్‌/ కంప్యూటర్‌ ఆధారిత పద్ధతిలో ఉంటుంది. అభ్యర్థులు తమ అనుకూలతలనుబట్టి ఏ విధానంలో అయినా రాయవచ్చు. పేపర్‌ ఆధారిత పరీక్షను మే 7న, కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను మే 13న నిర్వహించనున్నారు. అంటే పరీక్షకు సుమారుగా 45 రోజులు ఉందని భావించవచ్చు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి స్కోరు సాధించే అవకాశం ఉంది.       Readmore...


ఎంబీఏకు మరో దారి మ్యాట్‌

జాతీయ స్థాయిలో మేనేజ్‌మెంట్ విద్యా సంస్థల్లో ప్రవేశానికి ప‌లు ప‌రీక్షలు ఉన్నాయి. అలాంటివాటిలో ఒక‌టి మ్యాట్‌. ఏడాదికి నాలుగు సార్లు 'మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌' (MAT) నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మేలో నిర్వహించే మ్యాట్ ప్రక‌ట‌న వెలువ‌డింది. ఆ వివ‌రాలు చూద్దాం.

ఈ ప‌రీక్షను రెండు రకాలు (పేపర్‌ ఆధారితం, కంప్యూటర్‌ ఆధారితం) గా నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఏ పద్ధతినైనా ఎంచుకోవచ్చు. మ్యాట్‌ రాయడానికి క్యాట్‌లో మాదిరి కనీస మార్కుల శాతం నిబంధన ఏమీ లేదు. అందువల్ల డిగ్రీలో తక్కువ మార్కులు వచ్చినవారు కూడా మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థల్లో దరఖాస్తు చేసుకోవటానికి ఈ పరీక్ష ఓ మార్గంగా ఉంది. మల్టిపుల్‌ చాయిస్‌ సమాధానాలుండే ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఈ ప్రశ్నపత్రం ఉంటుంది. 150 నిమిషాల్లో 200 ప్రశ్నలను సాధించాల్సి వుంటుంది. ప్రతి సరైన జవాబుకూ ఒక మార్కు. తప్పు సమాధానం రాస్తే 1/4 మార్కు కోత విధిస్తారు. ఈ పరీక్ష అభ్యర్థి సాధారణ సామర్థాన్ని పరీక్షించేలా రూపొందింది. డిగ్రీ ఉత్తీర్ణులే కాకుండా, చివరి సంవత్సరం విద్యార్థులు కూడా మ్యాట్‌ రాయవచ్చు.

ఎలా సంసిద్ధం కావాలి?
విద్యార్థులు మొదట మాక్‌ మ్యాట్‌ రాయాలి. ఆన్‌లైన్‌లో ఉచితంగా నమూనా మ్యాట్‌ పరీక్షను రాసే వీలుంది. ఇలా చేస్తే పరీక్ష పద్ధతి అవగాహనకు వస్తుంది. దానికి అనుగుణంగా ఎలా చదవాలో ప్రణాళికీకరించుకోవచ్చు. ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నదీ, వేటిలో పటిష్ఠంగా ఉన్నదీ గుర్తించటానికి ఈ పరీక్ష ఫలితాలు ఉపయోగపడతాయి. వీటి ఆధారంగా ప్రిపరేషన్‌ ప్రణాళిక రూపొందించుకోవాలి.

ప్రతి టాపిక్‌లోనూ కాన్సెప్ట్‌పై అవగాహన పెంచుకోవటంపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు- రేషియోస్‌ అనే అధ్యాయంలో కీలకాంశం ఏమిటో గ్రహించాలి. తర్వాత ప్రశ్నలు సాధన చేయాలి. అన్ని రకాల ప్రశ్నలకూ జవాబులు రాసేలా తయారవ్వాలి. మళ్ళీ ఇదే అధ్యాయంలో మరోసారి ఎక్సర్‌సైజులు చేయాలి. ఈసారి సమయం చూసుకోవాలి. 40 నిమిషాలకు 40 మాథ్స్‌ ప్రశ్నలంటే నిమిషానికి ఓ ప్రశ్న. ఒక ఎక్సర్‌సైజులో 10 ప్రశ్నలుంటే వాటిని 10 నిమిషాల్లో చేయటానికి ప్రయత్నించాలి. కొన్ని ప్రశ్నలకు నిమిషం కంటే ఎక్కువ వ్యవధి పట్టవచ్చు; కొన్నిటికి నిమిషం కంటే తక్కువ సమయం పట్టొచ్చు. మొత్తమ్మీద వాటన్నిటినీ 10 నిమిషాల్లో పూర్తిచేయటం ముఖ్యం. ఈ రకంగా చేస్తే వేగం, కచ్చితత్వం కూడా పెరుగుతాయి.

ఒక ప్రధానాంశంలోని అన్ని టాపిక్స్‌లోని కాన్సెప్టులపై పట్టు వచ్చాక, వాటన్నిటిపై ఓ పరీక్ష రాయాలి. ఉదాహరణతో చెప్పాలంటే- అరిథ్‌మెటిక్‌లో రేషియో, పర్సంటేజి, సింపుల్‌ ఇంటరెస్ట్‌, కాంపౌండ్‌ ఇంటరెస్ట్‌, వర్క్‌, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ ఉంటాయి. ఈ కాన్సెప్టులపై అవగాహన సాధించాక అరిథ్‌మెటిక్‌లో పరీక్ష రాసి పరిశీలించుకోవాలి. నేర్చుకున్న అంశాలు దీనివల్ల మరింత పటిష్ఠమవుతాయి. విభిన్నమైన ప్రశ్నల నమూనాలను నిర్దిష్ట వ్యవధిలోనే చేయగలుగుతారు.

జనరల్‌ అవేర్‌నెస్‌ మినహాయించి మిగిలిన మూడు విభాగాలకూ ఇదే తీరు పాటించాలి. ఒక్కో విభాగంపై పట్టు సాధించాక పూర్తి నిడివి పరీక్ష అభ్యాసం చేయటం మొదలుపెట్టాలి. ఒకేసారి రెండున్నర గంటల సమయంలో పరీక్ష రాయటానికి శక్తి, సహనం అవసరమవుతాయి. ఇలాంటి నమూనా పరీక్షలు రాశాక సరైన, తప్పు జవాబులు రెంటినీ విశ్లేషించుకోవాలి. ఫలితంగా స్కోరు క్రమంగా మెరుగుపడుతుంది. అసలైన పరీక్షలో సందేహాలకు అతీతంగా మంచి స్కోరు సాధ్యమవుతుంది. కాన్సెప్టులపై మొదట దృష్టిపెట్టాలి. తర్వాత ఎక్సర్‌సైజులు చేయాలి. క్రమంగా పూర్తినిడివి పరీక్షలు రాసి, నైపుణ్యాలూ, వ్యూహాలకు పదునుపెట్టుకోవాలి.

విభాగాలవారీగా...

లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌:
వెర్బల్‌ కోసం క్రమం తప్పకుండా చదివే అలవాటు అవసరం. అందుబాటులో ఉన్న వార్తాపత్రికలూ, పుస్తకాలూ, మ్యాగజీన్ల పఠనం చాలా మేలు చేస్తుంది. పాసేజ్‌ ఏ టాపిక్‌లోంచి అయినా రావొచ్చు కాబట్టి విభిన్నమైన అంశాలు చదవటం మంచిది. ఈ విభాగంలో రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ చాలా ముఖ్యం కాబట్టి దీన్ని బాగా సాధన చేయాలి. వొకాబ్యులరీ కోసం కూడా బాగా చదవటం తప్పనిసరి. ప్రతిరోజూ కొన్ని పదాలను గుర్తుంచుకోవడం/ నేర్చుకోవడం చేయాలి. గ్రామర్‌ బేస్డ్‌ ప్రశ్నల కోసం వ్యాకరణ సూత్రాలు నేర్చుకోవాలి. రకరకాల ప్రశ్నలను అభ్యాసం చేయాలి.

మ్యాథమెటికల్‌ స్కిల్స్‌:
టైమ్‌, స్పీడ్‌ అండ్‌ డిస్టెన్స్‌, మిక్చర్స్‌ అండ్‌ అలిగేషన్స్‌, పైప్స్‌ అండ్‌ సిస్టర్న్స్‌, రేషియో, ప్రపోర్షన్‌, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌, సింపుల్‌-కాంపౌండ్‌- ఇంటరెస్ట్‌, పర్సంటేజెస్‌, పర్మ్యుటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్‌, ప్రాబబిలిటీ... ఇవి ప్రధానమైన టాపిక్స్‌. ప్రాథమికాంశాలను అర్థం చేసుకోవటం, గణిత ఫార్ములాలు నేర్చుకోవటం, సాధన చేయటం తప్పనిసరి.

డేటా ఎనాలిసిస్‌ అండ్‌ సఫిషియన్సీ:
విద్యార్థులు వివిధ చార్టులు తెలిపే సమాచారాన్ని అర్థం చేసుకోవడం, అన్వయించటం చేయగలగాలి. ఈ ప్రశ్నలు సులువుగానే ఉంటాయి గానీ సమయం ఎక్కువ తీసుకుంటాయి. అందుకే బాగా అభ్యాసం చేయాలి. డేటా సఫిషియన్సీ ప్రశ్నలకు సంబంధించి ప్రాథమిక అంశాలను తెలుసుకోవటం ప్రధానం. ప్రశ్నలను జాగ్రత్తగా చదివాకే జవాబు గుర్తించటానికి ప్రయత్నించాలి.

ఇంటెలిజెన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్‌:
అసర్షన్‌ అండ్‌ రీజన్‌, కాజ్‌ అండ్‌ ఎఫెక్ట్‌, వర్డ్‌ ఆనాలజీ, ఫ్యామిలీ ట్రీ, క్లాక్స్‌, సింబల్‌ బేస్‌డ్‌ ఫ్యామిలీ ట్రీ, డైరెక్షన్స్‌, మ్యాట్రిక్స్‌ అరేంజ్‌మెంట్స్‌, సిరీస్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. అరేంజ్‌మెంట్స్‌కు సంబంధించిన ప్రశ్నలు అధిక సమయం తీసుకుంటాయి. ఇలాంటి ప్రశ్నలకు జవాబులు కనుక్కోవటానికి నిర్దిష్ట విధానమంటూ ఏదీ ఉండదు. అందుకే వీటికి ఎక్కువ సాధన అవసరమవుతుంది. ఇతర ప్రశ్నలైన క్లాక్స్‌, ఫ్యామిలీ ట్రీ మొదలైనవి సులువైనవే. ఈ విభాగం మ్యాథ్స్‌లాంటిదే. అభ్యాసం చాలా కీలకం.

ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌:
ప్రతిరోజూ వార్తాపత్రికలు చదువుతూ జాతీయం, అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై అవగాహన పెంచుకునేవారికి ఈ విభాగంలో ప్రశ్నలకు జవాబులు గుర్తించటం సులభమే.

ముఖ్య స‌మాచారం
ద‌ర‌ఖాస్తుల ల‌భ్యత‌కు చివ‌రి తేదీ: ఏప్రిల్ 25
పూర్తిచేసిన ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీ: ఏప్రిల్ 28
పేప‌ర్ బేస్డ్ ప‌రీక్ష తేదీ: మే 7 (ఆదివారం)
కంప్యూట‌ర్ బేస్డ్ ప‌రీక్ష తేదీ: మే 13 (శ‌నివారం)
ప‌రీక్ష ఫీజు: రూ.1400
వెబ్‌సైట్‌: https://www.aima.in

Posted on 09-03-2017 @ eenadupratibha.net