Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఎంబీఏ ప్రవేశానికి ఎన్నో మార్గాలు!
 

ప్రపంచ‌వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో విద్యార్థులు మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి పోటీ ప‌డుతున్నారు. ఏటా ఈ ప‌రీక్షల‌కు పోటీప‌డే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. విఖ్యాత బీ స్కూల్స్‌లో ప్రవేశానికి అన్ని దేశాల‌వారూ కామ‌న్‌గా జీమ్యాట్‌ను రాస్తున్నారు. భార‌త్‌లోనూ ప‌లు రకాల ఎంబీఏ ప్రవేశ ప‌రీక్షలు ఉన్నాయి. ఐఐఎంలతోపాటు దేశంలో పేరొందిన బీ స్కూల్స్‌లో చేరాలంటే క్యాట్ రాయాలి. అలాగే జేవియ‌ర్ సంస్థల్లో ప్రవేశానికి ఎక్స్ఏటీ, సింబ‌యాసిస్‌ల్లో చేర‌డానికి శ్నాప్‌, మ‌ధ్యస్థాయి సంస్థల్లో ప్రవేశాల‌కు మ్యాట్‌...రాష్ట్రస్థాయిలో చ‌ద‌వ‌డానికి ఐసెట్‌....ఇలా ప‌లు ప‌రీక్షలే ఉన్నాయి. అయితే ఈ ప‌రీక్షల స్వరూపం ఎలా ఉంటుందో విద్యార్థులు తెలుసుకోవ‌డం ముఖ్యం.

విదేశాల్లో చ‌ద‌వ‌డానికి జీమ్యాట్‌
విదేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాల‌యాల్లో ఎంబీఏ కోర్సు చేయాలంటే జీమ్యాట్ రాయాల్సి ఉంటుంది. ఈ ప‌రీక్ష స్థాయి క్యాట్ కంటే కొంచెం క‌ష్టంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అభ్యర్థులు పోటీ ప‌డ‌తారు. జీమ్యాట్ స్కోర్‌తో దేశంలోని ప్రముఖ బీ స్కూళ్లలోనూ ప్రవేశాలు పొంద‌వ‌చ్చు.

జీమ్యాట్ విధానం: ఎన‌లిటిక‌ల్ రైటింగ్‌, ఇంటిగ్రేటెడ్ రీజ‌నింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, వెర్బల్ అంశాల్లో ప్రశ్నలుంటాయి. ఎన‌లిటిక‌ల్ రైటింగ్ 30 నిమిషాల వ్యవ‌ధి. ఇంటిగ్రేటెడ్ రీజ‌నింగ్‌లో టేబుల్ ఎనాల‌సిస్ నుంచి 12 ప్రశ్నలు అడుగుతారు. వ్యవ‌ధి 30 నిమిషాలు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో 37 ప్రశ్నల‌ను 75 నిమిషాల వ్యవ‌ధిలో పూర్తిచేయాలి. వెర్బల్ విభాగంలో 41 ప్రశ్నలను 75 నిమిషాల్లో పూర్తిచేయాలి. మొత్తం వ్యవ‌ధి 3 గంట‌ల 30 నిమిషాలు. ప‌రీక్ష మ‌ధ్యలో 30 నిమిషాల బ్రేక్ ఉంటుంది. దీంతో క‌లిపి ప‌రీక్ష వ్యవ‌ధి 4 గంట‌లు.
వెబ్‌సైట్‌: www.mba.com/india

కామ‌న్ అడ్మిష‌న్ టెస్ట్ (క్యాట్‌)
దేశంలో విశిష్టమైన మేనేజ్‌మెంట్ ప‌రీక్ష ఇదే. దీనిద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న160 బీ స్కూల్స్‌లో ప్రవేశం ల‌భిస్తుంది. 19 ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)ల్లో విద్యాభ్యాసానికి క్యాట్ స్కోరే ప్రామాణికం. ఈ ప‌రీక్షను ఆన్‌లైన్లో నిర్వహిస్తారు. సెప్టెంబ‌ర్‌లో ప్రక‌ట‌న వెలువడుతుంది. నవంబ‌ర్‌లో ప‌రీక్షలు ఉంటాయి. ఫిబ్రవ‌రి నుంచి ఏప్రిల్ వ‌ర‌కు గ్రూప్ డిస్కష‌న్‌, ఇంట‌ర్వ్యూలు నిర్వహిస్తారు. జులై, ఆగ‌స్ట్‌ల్లో ప్రవేశాలుంటాయి. ప‌రీక్షలో జ‌న‌ర‌ల్ ఆప్టిట్యూడ్‌ అంటే... ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, డేటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్‌, లాజిక‌ల్ రీజ‌నింగ్ అంశాల్లో ప్రశ్నల‌డుగుతారు. సీట్ల భ‌ర్తీ కోసం ఒక్కో ఐఐఎం ఒక్కోర‌క‌మైన విధానాన్ని అనుస‌రిస్తున్నాయి. ఎంపిక‌కు అనుస‌రించే విధానంలో ఏటా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచంలోనే అత్యంత క‌ఠిన‌మైన ప‌రీక్షల్లో ఒక‌టిగా క్యాట్ గుర్తింపు పొందింది. క్యాట్ స‌న్నద్ధత‌తో మిగిలిన మేనేజ్‌మెంట్ ప‌రీక్షల‌ను సులువుగానే ఎదుర్కోవ‌చ్చు.

క్యాట్‌-2014 ఇలా: క్యాట్‌ ప‌రీక్ష విధానంలో త‌ర‌చూ మార్పులు ఉంటాయి. 2014లో... సెక్షన్‌-1లో క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంట‌ర్ ప్రిటేష‌న్ నుంచి 50; సెక్షన్‌-2లో వెర్బల్ ఎబిలిటీ, లాజిక‌ల్ రీజ‌నింగ్ నుంచి 50 అంటే మొత్తం 100 ప్రశ్నలు అడిగారు. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. మొత్తం ప్రశ్నప‌త్రానికి 300 మార్కులు. ప్రతి త‌ప్పు స‌మాధానానికీ ఒక మార్కు చొప్పున త‌గ్గిస్తారు. ప‌రీక్ష వ్యవ‌ధి 170 నిమిషాలు.
వెబ్‌సైట్‌: https://iimcat.ac.in

జేవియ‌ర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎక్స్ఏటీ)
క్యాట్ త‌ర్వాత ఎక్కువ మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో రాసే మేనేజ్‌మెంట్ ప‌రీక్ష ఎక్స్ఏటీ. దీన్ని జేవియ‌ర్ లేబ‌ర్ రిలేష‌న్స్ ఇన్‌స్టిట్యూట్ (ఎక్స్ఎల్ఆర్ఐ) నిర్వహిస్తుంది. ఈ స్కోర్‌తో దేశ‌వ్యాప్తంగా ఉన్న వంద సంస్థల్లో ప్రవేశం ల‌భిస్తుంది. ప‌రీక్షలు సాధారణంగా జ‌న‌వ‌రి మొద‌టివారంలో నిర్వహిస్తారు.

ఎక్స్ఏటీ-2015 వివ‌రాలు: ఇందులో రెండు భాగాలు ఉంటాయి. పార్ట్ -1లో మూడు సెక్షన్లు.. సెక్షన్‌-ఎలో వెర్బల్ ఎబిలిటీ 28 ప్రశ్నలు, సెక్షన్‌-బి డెసిష‌న్ మేకింగ్ 23, సెక్షన్‌-సి క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్ 33 ప్రశ్నలు అడుగుతారు. పార్ట్‌-2 జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ 30 ప్రశ్నలు ఉంటాయి. ఇదే విభాగంలో ఒక ఎస్సే కూడా రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. త‌ప్పు స‌మాధానానికి పావు మార్కు చొప్పున త‌గ్గిస్తారు. ప‌రీక్ష వ్యవ‌ధి 3 గంట‌లు.
వెబ్‌సైట్‌: www.xatonline.net.in/

సింబ‌యాసిస్ నేష‌న‌ల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శ్నాప్‌)
దేశ‌వ్యాప్తంగా ఉన్న సింబ‌యాసిస్ సంస్థల్లో ప్రవేశానికి శ్నాప్ టెస్ట్ రాయాలి. ఈ సంస్థ ఆధ్వర్యంలో 13 బీ స్కూళ్లు ఉన్నాయి. ఈ సంస్థల్లో ఎక్కువ భాగం పుణే, ముంబై, బెంగ‌ళూరుల్లోనే ఉన్నాయి.

శ్నాప్‌-2014 ప‌రీక్ష ఇలా: జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్ 40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ 40, రీజ‌నింగ్ 30 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 180 మార్కుల‌కు ప్రశ్నప‌త్రం ఉంటుంది. 150 ప్రశ్నలు ఉంటాయి. రీజ‌నింగ్‌లో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. మిగిలిన విభాగాల్లో ప్రతి ప్రశ్నకు ఒక‌ మార్కు చొప్పున కేటాయించారు.
వెబ్‌సైట్‌: www.snaptest.org/

కామ‌న్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్ టెస్ట్ (సీమ్యాట్‌)
సీమ్యాట్ స్కోర్ తో దేశ‌వ్యాప్తంగా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఎంబీఏ క‌ళాశాల‌ల్లో ప్రవేశం పొందొచ్చు. ఈ ప‌రీక్షను ఏడాదికి రెండుసార్లు సెప్టెంబ‌ర్‌, ఫిబ్రవ‌రిల్లో నిర్వహిస్తారు.
ప‌రీక్ష విధానం: క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్ అండ్ డేటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్‌, లాజిక‌ల్ రీజ‌నింగ్‌, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ ఒక్కో అంశంలో 25 చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. త‌ప్పుగా గుర్తించిన స‌మాధానానికి ఒక మార్కు చొప్పున త‌గ్గిస్తారు. ప‌రీక్ష వ్యవ‌ధి 3 గంట‌లు.
వెబ్‌సైట్‌: www.aicte-cmat.in

మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్‌)
ఈ ప‌రీక్షను ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేష‌న్ నిర్వహిస్తుంది. ఏడాదికి నాలుగు సార్లు... ఫిబ్రవ‌రి, మే, సెప్టెంబ‌ర్‌, డిసెంబ‌ర్‌ల్లో ప‌రీక్షలు జ‌రుగుతాయి. పేప‌ర్ బేస్డ్‌, కంప్యూట‌ర్ బేస్డ్ రెండు విధానాల్లోనూ ప‌రీక్ష నిర్వహిస్తారు. విద్యార్థి న‌చ్చిన విధానంలో ప‌రీక్షను రాసుకోవ‌చ్చు. ఈ ప‌రీక్షలో జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ అంశంలోనూ ప్రశ్నల‌డుగుతారు. అయితే ఈ సెక్షన్ స్కోర్‌ను బీస్కూళ్లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం లేదు.

మ్యాట్ తీరిదీ: లాంగ్వేజ్ కాంప్రహెన్షన్‌, మ్యాథ‌మెటిక‌ల్ స్కిల్స్, డేటా ఎనాల‌సిస్ అండ్ స‌ఫీషియ‌న్సీ, ఇంటెలిజెన్స్ అండ్ క్రిటిక‌ల్ రీజ‌నింగ్‌, ఇండియ‌న్ అండ్ గ్లోబ‌ల్ ఎన్విరాన్‌మెంట్ ఈ అంశాల్లో ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 160 మార్కుల‌కు ప్రశ్నప‌త్రం ఉంటుంది. ఇండియ‌న్ అండ్ గ్లోబ‌ల్ ఎన్విరాన్‌మెంట్ విభాగాన్ని మార్కుల కోసం లెక్కించ‌రు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.
వెబ్‌సైట్‌: www.aima.in

ఐఐఎఫ్‌టీ ఎంట్రెన్స్‌ టెస్ట్
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)- న్యూఢిల్లీ, కోల్‌క‌తా క్యాంప‌స్‌ల్లో ప్రవేశానికి ఈ ప‌రీక్ష రాయాలి.

ప‌రీక్షలో: ఇందులో 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-1లో పార్ట్‌-1 డేటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్ నుంచి 15 ప్రశ్నలు, పార్ట్‌-2 క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు, సెక్షన్-2 జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ నుంచి 26, సెక్షన్‌-3 పార్ట్‌-1 రీడింగ్ కాంప్రహెన్షన్ 17, పార్ట్‌-2 వెర్బల్ ఎబిలిటీ 20, సెక్షన్‌-4 లాజిక‌ల్ రీజ‌నింగ్ 20 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 118 ప్రశ్నలు. వీటికి 100 మార్కులు. జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌లో ఒక్కో ప్రశ్నకు అర మార్కు, వెర్బల్ ఎబిలిటీలో ఒక్కో ప్రశ్నకు ముప్పావు మార్కు చొప్పున కేటాయించారు. మిగిలిన అన్ని విభాగాల‌కూ ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు.
వెబ్‌సైట్‌: http://edu.iift.ac.in/

ఎన్‌మ్యాట్
నార్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎన్‌మ్యాట్ ప‌రీక్ష నిర్వహిస్తోంది. ఈ సంస్థకు ముంబై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌ల్లో క్యాంప‌స్‌లు ఉన్నాయి. ఈ ప‌రీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. అభ్యర్థులు మూడుసార్లు ప‌రీక్ష రాసుకోవ‌చ్చు. వీటిలో ఎక్కువ మార్కులు వ‌చ్చిన సంద‌ర్భాన్ని టాప్ స్కోర్‌గా తీసుకుని ఎంపిక‌లు చేప‌డ‌తారు.

ఎన్‌మ్యాట్‌-2015లో: లాంగ్వేజ్ స్కిల్స్ 32, క్వాంటిటేటివ్ స్కిల్స్ 48, లాజిక‌ల్ రీజ‌నింగ్ 40 ప్రశ్నలు అడిగారు. మొత్తం 120 ప్రశ్నలు. వ్యవ‌ధి రెండు గంట‌లు. నెగెటివ్ మార్కులు లేవు. సెక్షన్ల వారీ క‌టాఫ్‌లు ఉంటాయి.
వెబ్‌సైట్‌: http://nmat.org.in/

మ‌రికొన్ని....
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్‌, ముంబై త‌మ క్యాంప‌స్‌ల్లో ప్రవేశానికి టిస్‌నెట్ ప‌రీక్షను నిర్వహిస్తుంది. ఈ ప‌రీక్ష ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ రెండు విధాల‌గానూ ఉంటుంది.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ మేనేజ్‌మెంట్ ఆనంద్..రూర‌ల్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశానికి ప్రత్యేక ప‌రీక్ష నిర్వహిస్తోంది.
ముద్రా ఇన్‌స్టిట్యూట్ ఆప్ క‌మ్యూనికేష‌న్‌, అహ్మదాబాద్.. అడ్వర్టైజింగ్ కోర్సులో ప్రవేశానికి సొంతంగా ప‌రీక్ష నిర్వహిస్తోంది.
ఇక్ఫాయ్ (ఐబీఎస్‌), గీతం...త‌దిత‌ర సంస్థలు ప్రత్యేక ప‌రీక్షలు నిర్వహించి ఎంబీఏలో ప్రవేశం క‌ల్పిస్తున్నాయి.

స్కోర్ ఒక్కటే స‌రిపోదు...
జాతీయ‌ స్థాయిలో నిర్వహించే ఎంబీఏ ప‌రీక్షల్లో కేవ‌లం రాత ప‌రీక్షలో ప్రావీణ్యం సాధిస్తే స‌రిపోదు. అది రెండో ద‌శ‌కు చేరడానికే ఉప‌యోగ‌ప‌డుతుంది. అనంత‌రం నిర్వహించే గ్రూప్ డిస్కష‌న్‌, ఎస్సే రైటింగ్‌, ఇంట‌ర్వ్యూల్లో ప్రతిభ చూపితేనే పేరున్న సంస్థల్లో ఎంబీఏ సీటు ఖాయ‌మ‌వుతుంది.

అలాగే క్యాట్‌లో ఎక్కువ స్కోర్ సాధించినంత మాత్రాన మంచి బీ స్కూల్‌లో సీటు ఖాయ‌మైన‌ట్టే అనుకోలేం. ఎందుకంటే ఈ స్కోర్‌కు ఒక్కో ఐఐఎం ఒక్కో విధ‌మైన వెయిటేజీ ఇస్తున్నాయి. ఐఐఎం అహ్మదాబాద్ విష‌యానికొస్తే క్యాట్ స్కోర్‌కి వంద శాతం వెయిటేజీ ఇస్తుంది. అదే ఐఐఎం బెంగ‌ళూరైతే 50 శాతం వ‌ర‌కే వెయిటేజీ ఇస్తుంది. మిగిలిన 50 శాతం అక‌డ‌మిక్ ప్రతిభ‌, ప‌ని అనుభ‌వం, ఎక్స్‌ట్రా క‌రిక్యుల‌ర్ యాక్టివిటీస్‌, ..త‌దిత‌ర విభాగాల్లో అభ్యర్థి ప్రావీణ్యాన్ని గుర్తించి తుది ఎంపిక చేప‌డుతుంది.
సాధార‌ణంగా క్యాట్‌లో క‌నీసం 92 ప‌ర్సెంటైల్ సాధించిన విద్యార్థులు దేశంలో టాప్‌-25 బీ స్కూళ్లలో ప్రవేశం పొంద‌డానికి ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయి. అలాగే వీరు రూ.9 ల‌క్షల వార్షిక వేత‌నాన్ని పొంద‌వ‌చ్చు.

ప‌రీక్ష విధానంలోనూ త‌ర‌చూ మార్పులు ఉంటాయి. అయితే ప్రశ్నల‌డిగే అంశాలు మాత్రం అవే.

ఐసెట్‌
రాష్ట్ర స్థాయిలో ప‌రీక్షల విష‌యానికొస్తే తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటిగ్రేటెడ్ కామ‌న్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్‌) నిర్వహిస్తున్నారు. ఈ ప‌రీక్ష ద్వారా యూనివ‌ర్సిటీ కాలేజీలు, వాటి అనుబంధ క‌ళాశాలల్లో ఎంబీఏతోపాటు ఎంసీఏ కోర్సుల్లో న‌చ్చిన‌ దాన్ని ఎంచుకోవ‌చ్చు.

ఏమ‌డుగుతారంటే: ప్రశ్నప‌త్రంలో 3 సెక్షన్లు ఉంటాయి. ఎన‌లిటిక‌ల్ ఎబిలిటీ నుంచి 75, మ్యాథ‌మెటిక‌ల్ ఎబిలిటీ 75, క‌మ్యూనికేష‌న్ ఎబిలిటీ 50 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 మార్కుల‌కు ప్రశ్నప‌త్రం ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. నెగెటివ్ మార్కులు ఉండ‌వు. ప‌రీక్ష వ్యవ‌ధి రెండున్నర గంట‌లు.
వెబ్‌సైట్‌: http://apicet15.org/ , http://tsicet.org/

Previous Papers

ఈ అంశాల్లోనే ప్రశ్నలు...
ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే వివిధ ప‌రీక్షలన్నీ క్యాట్ నుంచి ఐసెట్ వ‌ర‌కు ఎక్కువ‌గా న్యూమ‌రిక‌ల్ ఆప్టిట్యూడ్‌, అర్థమెటిక్‌, రీజ‌నింగ్, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్‌, మ్యాథ‌మెటిక‌ల్ ఆప్టిట్యూడ్ అంశాల‌పైనే దృష్టిపెడుతున్నాయి. అయితే ప్రశ్నప‌త్ర స్థాయుల్లో వ్యత్యాసం ఉంటుంది. కొన్ని సంస్థలు నిర్వహించే మేనేజ్‌మెంట్ ప‌రీక్షల్లో జీకే, క‌రెంట్ అఫైర్స్‌కూ ప్రాధాన్యం ఉంటుంది.

ఇత‌ర ప్రయోజ‌నాలెన్నో..
ఎంబీఏలో ప్రవేశానికి నిర్వహించే ప‌రీక్షల స‌న్నద్ధత‌తో ప‌లు ర‌కాల పోటీ ప‌రీక్షల‌ను ఎదుర్కోవ‌డం సులువ‌వుతుంది. బ్యాంక్ పీవో, ఎస్ఎస్‌సీ-సీజీఎల్‌, రైల్వే నాన్‌టెక్నిక‌ల్ జాబ్స్‌, ఎల్ఐసీ, ఎన్ఐసీ...త‌దిత‌ర ఇన్సూరెన్స్ కంపెనీల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌, ఎల్ఐసీలో డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్, నాబార్డ్‌, ఆర్‌బీఐల్లో అడ్మినిస్ట్రేష‌న్‌ ఉద్యోగాల‌కు నిర్వహించే ప‌రీక్షలకు త‌ల‌ప‌డ‌వ‌చ్చు. సిల‌బ‌స్ దాదాపు ఒకేలా ఉండడమే దీనికి కార‌ణం. అయితే జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌ను అద‌నంగా చదువుకోవాలి. క్యాంప‌స్ రిక్రూట్‌మెంట్ కోసం నిర్వహించే ప‌రీక్షల్లోనూ ఈ అంశాల‌పైనే ప్రశ్నల‌డుగుతారు.

posted on 5-6-2015