Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ప్రసిద్ధ సంస్థల్లో ఎంసీఏకు మార్గాలివీ....
 

పీజీలో ఎక్కువ మంది విద్యార్థులు చేరే కోర్సుల్లో మొద‌టి రెండు ఎంబీఏ, ఎంసీఏలే.. ప‌లు జాతీయ‌, రాష్ట్రస్థాయి ప‌రీక్షల ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశం ల‌భిస్తుంది. అయితే ఎంబీఏలో ప్రవేశానికి క్యాట్‌, మ్యాట్‌, సీమ్యాట్, జీమ్యాట్‌...ఇలా ఎన్నో ప‌రీక్షలు ఉన్నాయి. అదే ఎంసీఏ విష‌యానికొస్తే జాతీయ స్థాయి ప్రవేశ ప‌రీక్షలు కొన్నే. ఆ వివ‌రాలేంటో చూద్దాం....

ఎంబీఏతో పోల్చితే ఎంసీఏలో ప్రవేశానికి కొన్ని ప‌రిమితులు ఉన్నాయి. ఎందుకంటే ఎంబీఏలో చేర‌డానికి ఏదైనా డిగ్రీ ఉంటే స‌రిపోతుంది. కానీ ఎంసీఏలో అలా సాధ్యం కాదు. చాలా సంస్థల్లో ఎంసీఏ ప్రవేశ ప‌రీక్ష రాయ‌డానికి ఇంట‌ర్‌లో మ్యాథ్స్ త‌ప్పనిస‌రి.. దీంతో ఆర్ట్స్, ప్యూర్ సైన్స్ (బైపీసీ) గ్రూప్‌ల విద్యార్థులు ఈ కోర్సులో చేర‌డం సాధ్యం కాదు. అలాగే చాలా సంస్థలు ఉమ్మడి ప‌రీక్ష ద్వారా కాకుండా ప్రత్యేకంగా ప‌రీక్షలు నిర్వహించి విద్యార్థుల‌ను ఎంపిక చేసుకుంటున్నాయి. దీంతో విద్యార్థులు ఎంసీఏలో ప్రవేశానికి ప‌లు ప‌రీక్షలు రాయ‌డం త‌ప్పనిస‌రిగా మారింది. ఈ ప్రవేశ ప‌రీక్షల్లో నిమ్‌సెట్‌ను మేటిగా చెప్పుకోవ‌చ్చు. ఈ ప‌రీక్ష ద్వారా నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఎన్ఐటీ)ల్లో ప్రవేశం ల‌భిస్తుంది. ఆ త‌ర్వాత బిట్ మెస్రా ప‌రీక్ష కూడా ఉన్నత మైందే. దీనిద్వారా వివిధ బిర్లా సంస్థల్లో ఎంసీఏ కోర్సు చ‌దువుకోవ‌చ్చు.

నిమ్‌సెట్‌
నిమ్‌సెట్ అంటే నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్స్ ఎంసీఏ కామ‌న్ ఎంట్రెన్స్‌ టెస్ట్. ఈ ప‌రీక్ష ద్వారా 11 నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌)ల్లో ప్రవేశం ల‌భిస్తుంది. వీటిలో వ‌రంగ‌ల్ ఒక‌టి. దేశ‌వ్యాప్తంగా 30 జాతీయ సాంకేతిక విద్యా శిక్షణ‌ సంస్థ (నిట్‌)లు ఉన్నాయి. అయితే వీటిలో 11 మాత్రమే ఎంసీఏ కోర్సును అందిస్తున్నాయి. ఈ 11 సంస్థలూ ఉమ్మడి ప‌రీక్ష ద్వారా విద్యార్థుల‌ను ఎంపిక‌చేసి ఎంసీఏ కోర్సులోకి ప్రవేశం క‌ల్పిస్తున్నాయి.

ఎంసీఏ కోర్సు బోధిస్తున్న నిట్లు: అగ‌ర్తలా, అల‌హాబాద్‌, భోపాల్‌, కాలిక‌ట్‌, దుర్గాపూర్‌, జంషెడ్పూర్‌, కురుక్షేత్ర, రాయ్‌పూర్‌, సూర‌త్కల్‌, తిరుచిరాప‌ల్లి, వ‌రంగ‌ల్‌.

అర్హత‌: బీఎస్సీ, బీసీఏ, బీఐటీ, బీటెక్/ బీఈ వీటిలో ఏదైనా డిగ్రీలో క‌నీసం 60 శాతం మార్కుల‌తో (ఎస్సీ, ఎస్టీలైతే 55 శాతం) ఉత్తీర్ణత సాధించాలి. ఆఖ‌రు సంవ‌త్సరం చ‌దువుతున్న విద్యార్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

సీట్ల సంఖ్య ఇలా: ఎంసీఏ కోర్సు అందిస్తోన్న 11 ఎన్ఐటీల్లోనూ మొత్తం 867 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్లన్నీ రాత‌ ప‌రీక్షలో చూపిన ప్రతిభ‌, రిజ‌ర్వేష‌న్ల ప్రాతిప‌దిక‌న అఖిల భార‌త స్థాయిలో భ‌ర్తీ చేస్తారు. ఆయా నిట్లవారీ రాష్ట్రాల కోటా లేదు. మొత్తం 867 సీట్లలో 424 సీట్లు ఓపెన్ కేట‌గిరీ ద్వారా భ‌ర్తీ చేస్తారు. ఓసీ కోటాలో భ‌ర్తీచేసే సీట్లకు ప‌రీక్ష రాసిన విద్యార్థులంద‌రూ పోటీ ప‌డొచ్చు. 226 సీట్లు ఓబీసీల‌కు, 125 ఎస్సీ విద్యార్థుల‌కు, 65 సీట్లు ఎస్టీ అభ్యర్థుల‌కు కేటాయించారు. పీహెచ్ విద్యార్థుల కోసం 28 సీట్లు ఉన్నాయి. వ‌రంగ‌ల్ నిట్‌లో మొత్తం 46 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రశ్నప‌త్రం: మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ప‌రీక్ష వ్యవ‌ధి రెండు గంట‌లు. అంటే ప్రతి ప్రశ్నకు నిమిషం స‌మ‌యం కేటాయించుకోవ‌చ్చు. ప్రశ్నప‌త్రం ఇంగ్లిష్‌లోనే ఉంటుంది. స‌బ్జెక్టుల వారీ మ్యాథ‌మెటిక్స్ 50 ప్రశ్నలు, ఎన‌లిటిక‌ల్ ఎబిలిటీ & లాజిక‌ల్ రీజ‌నింగ్ 40, కంప్యూట‌ర్ అవేర్‌నెస్ 10, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్ నుంచి 20 ప్రశ్నల‌డుగుతారు. ప్రతి స‌రైన జ‌వాబుకు 4 మార్కులు. త‌ప్పుగా గుర్తించిన ప్రతి స‌మాధానానికీ ఒక మార్కు త‌గ్గిస్తారు. రుణాత్మక మార్కులు ఉన్నాయి.

మార్కుల వెయిటేజీ: మొత్తం మార్కుల‌ను 1000గా ప‌రిగ‌ణిస్తారు. అంటే మ్యాథ్స్‌లో మొత్తం మార్కుల‌కు 3 రెట్లు, ఎన‌లిటిక‌ల్ ఎబిలిటీ & లాజిక‌ల్ రీజ‌నింగ్ మార్కుల‌కు ఒక‌టిన్నర రెట్లు, కంప్యూట‌ర్ అవేర్‌నెస్ విభాగంలో మార్కుల‌కు 2 రెట్లు, ఇంగ్లిష్ మార్కుల‌ను య‌థావిధిగా ఉంచి లెక్కిస్తారు. ఈ లెక్కన మ్యాథ్స్‌కు 600 మార్కుల‌న్నమాట‌. (50 ప్రశ్నలు ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కాబ‌ట్టి మొత్తం 200 మార్కులు. వీటికి 3 రెట్లు అంటే 600 మార్కులు) అలాగే ఎన‌లిటిక‌ల్ ఎబిలిటీ అండ్ లాజిక‌ల్ రీజ‌నింగ్‌కి 240 (మొత్తం 40 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 4 మార్కులు కాబ‌ట్టి 160 మార్కులు. వీటికి ఒక‌టిన్నర రెట్లు అంటే 160+80=240 మార్కులు), కంప్యూట‌ర్ అవేర్‌నెస్‌కు 80 (10 ప్రశ్నల‌కు 40 మార్కులు దానికి రెట్టింపు 80), ఇంగ్లిష్ విభాగానికి 80 (20 ప్రశ్నలు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కాబ‌ట్టి 80) మార్కులు కేటాయించారు.

ప్రక‌ట‌న‌: మార్చిలో వెలువ‌డుతుంది
ప‌రీక్ష: మేలో నిర్వహిస్తారు.
త‌ర‌గ‌తులు: జులై/ ఆగ‌స్ట్ నుంచి మొద‌ల‌వుతాయి.
వెబ్‌సైట్‌: https://nimcet2015.nita.ac.in

బిట్ మెస్రా ఎంసీఏ ఎంట్రెన్స్‌ టెస్ట్‌
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ-మెస్రాతోపాటు దాని ఆఫ్ క్యాంప‌స్‌లైన అల‌హాబాద్‌, జైపూర్‌, కోల్‌క‌తా, లాల్పూర్ (రాంచీ సిటీ), నోయిడాల్లో ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి బిట్ మెస్రా ప‌రీక్ష రాయాలి. ఈ ప‌రీక్షకు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ప్రక‌ట‌న ఫిబ్రవ‌రిలో వెలువ‌డుతుంది. మే చివ‌ర్లో ప‌రీక్ష నిర్వహిస్తారు. జూన్‌లో ఫ‌లితాలు వెలువ‌డ‌తాయి. ఆగ‌స్ట్ నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభిస్తారు.
అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్‌, డిగ్రీల్లో 60 (ఎస్సీ, ఎస్టీలైతే 55) శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత సాధించాలి. ఇంట‌ర్‌లో మ్యాథ్స్ చ‌ద‌వ‌డం త‌ప్పనిస‌రి. డిగ్రీలో కంప్యూట‌ర్ సైన్స్‌, మ్యాథ్స్‌, ఎల‌క్ట్రానిక్స్‌, స్టాటిస్టిక్స్‌, ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ వీటిలో ఏదో ఒక స‌బ్జెక్టు లేదా బీసీఏ కోర్సు చ‌దివుండాలి.
క్యాంప‌స్‌ల వారీ సీట్లు: అల‌హాబాద్ 60, జైపూర్ 45, కోల్‌క‌తా 55, మెస్రా 60, రాంచీ 120, నోయిడా 60 సీట్లు ఉన్నాయి.
రాత ప‌రీక్ష ఇలా: మొత్తం 120 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. వీటికి 2 గంట‌ల్లో స‌మాధానాలు రాయాలి. ప్రశ్నప‌త్రంలో 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-ఎలో మ్యాథ్స్ 60, ఎన‌లిటిక‌ల్ ఎబిలిటీ అండ్ లాజిక‌ల్ రీజ‌నింగ్ 20, కంప్యూట‌ర్ అవేర్‌నెస్ 20, ఇంగ్లిష్ 20 ప్రశ్నలు అడుగుతారు.
వెబ్‌సైట్‌: www.bitmesra.ac.in

జేఎన్‌యూ ఎంసీఏ
దేశంలోని ప్రసిద్ధ యూనివ‌ర్సిటీల్లో జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాల‌యం, న్యూదిల్లీ ఒక‌టి. ఈ యూనివ‌ర్సిటీలో ఎంసీఏ కోర్సు నిర్వహిస్తున్నారు. జేఎన్‌యూ సెట్ ద్వారా ప్రవేశం ల‌భిస్తుంది.
అర్హత‌: క‌నీసం 55 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌
రాత ప‌రీక్షలో: మ్యాథ్స్‌, కంప్యూట‌ర్ సైన్స్, జ‌న‌ర‌ల్ ఆప్టిట్యూడ్ అంశాల్లో ప్రశ్నల‌డుగుతారు.
వెబ్‌సైట్: www.jnu.ac.in/

బీహెచ్‌యూ ఎంసీఏ
ఎంసీఏ కోర్సు అందించే ప్రసిద్ధ సంస్థల్లో బెనార‌స్ హిందూ యూనివ‌ర్సిటీ (బీహెచ్‌యూ) ఒక‌టి. ఈ సంస్థ నిర్వహించే ఎంసీఏ ప‌రీక్షలో 150 మ‌ల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నల‌న్నీ మ్యాథ‌మెటిక‌ల్ ఆప్టిట్యూడ్‌, లాజిక‌ల్ రీజ‌నింగ్ విభాగాల నుంచే ఉంటాయి. వీటికి 150 నిమిషాల్లో స‌మాధానాలు రాయాలి. మ్యాథ్స్‌తో ఇంట‌ర్ చ‌దివి, ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులు బీహెచ్‌యూ ఎంసీఏ కోర్సుకి అర్హులు.
వెబ్‌సైట్‌: www.bhu.ac.in/

యూనివ‌ర్సిటీ ఆఫ్ దిల్లీ
ఎంసీఏ కోర్సు అందిస్తోన్న గొప్ప సంస్థల్లో దిల్లీ యూనివ‌ర్సిటీ ఒక‌టి. డిగ్రీలో మ్యాథ్స్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, స్టాటిస్టిక్స్‌, ఆప‌రేష‌న‌ల్ రిసెర్చ్‌ వీటిలో ఏదో ఒక స‌బ్జెక్టు చ‌దివిన‌వారు దిల్లీ యూనివ‌ర్సిటీ ఎంసీఏకు అర్హులు. మొత్తం 46 సీట్లు ఉన్నాయి.
వెబ్‌సైట్‌: www.du.ac.in

హైద‌రాబాద్ సెంట్రల్ యూనివ‌ర్సిటీ
హెచ్‌సీయూలో ఎంసీఏ కోర్సులో మొత్తం 60 సీట్లు ఉన్నాయి. ఇంట‌ర్‌లో మ్యాథ్స్ చ‌దివిన‌వారే అర్హులు. ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత సాధించాలి. రాత ప‌రీక్షలో చూపిన ప్రతిభ ద్వారా కోర్సులో ప్రవేశం ల‌భిస్తుంది. డిసెంబ‌ర్‌/ జ‌న‌వ‌రిలో ప్రక‌ట‌న వెలువ‌డుతుంది. ఫిబ్రవ‌రిలో ప‌రీక్షలు నిర్వహిస్తారు. జూన్ చివ‌ర్లో త‌ర‌గ‌తులు మొద‌ల‌వుతాయి.
వెబ్‌సైట్‌: http://acad.uohyd.ac.in/couPG.html

పుణే యూనివ‌ర్సిటీ
పుణే యూనివ‌ర్సిటీ ఎంసీఏ కోర్సును 1983లో ప్రారంభించింది. మొత్తం 60 సీట్లు ఉన్నాయి. రాత ప‌రీక్ష ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు.
వెబ్‌సైట్‌: http://cs.unipune.ac.in/index.php

ఇవేకాకుండా వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (విట్‌), శ‌స్త్ర యూనివ‌ర్సిటీ...త‌దిత‌ర సంస్థల్లో ఎంసీఏ చ‌దువుకునే అవ‌కాశం ఉంది.

ఐసెట్‌
రాష్ట్ర స్థాయిలో ప‌రీక్షల విష‌యానికొస్తే తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటిగ్రేటెడ్ కామ‌న్ ఎంట్రెన్స్‌ టెస్ట్ (ఐసెట్‌) నిర్వహిస్తున్నారు. ఈ ప‌రీక్ష ద్వారా యూనివ‌ర్సిటీ కాలేజీలు, వాటి అనుబంధ క‌ళాశాలల్లో ఎంసీఏతోపాటు ఎంబీఏ కోర్సుల్లో న‌చ్చిన‌ దాన్ని ఎంచుకోవ‌చ్చు. ఎంసీఏలో ప్రవేశానికి ఇంట‌ర్‌లో మ్యాథ్స్ చ‌దివిన‌వారే అర్హులు.

ఏమ‌డుగుతారంటే: ప్రశ్నప‌త్రంలో 3 సెక్షన్లు ఉంటాయి. ఎన‌లిటిక‌ల్ ఎబిలిటీ నుంచి 75, మ్యాథ‌మెటిక‌ల్ ఎబిలిటీ 75, క‌మ్యూనికేష‌న్ ఎబిలిటీ 50 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 మార్కుల‌కు ప్రశ్నప‌త్రం ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. నెగెటివ్ మార్కులు ఉండ‌వు. ప‌రీక్ష వ్యవ‌ధి రెండున్నర గంట‌లు.
వెబ్‌సైట్‌: http://apicet15.org/ , http://tsicet.org/

అవ‌కాశాలు...
పైన పేర్కొన్న సంస్థల్లో చ‌దివిన‌వారికి అవ‌కాశాల ప‌రంగా తిరుగులేద‌నే చెప్పుకోవ‌చ్చు. సాఫ్ట్‌వేర్‌, నెట్‌వ‌ర్కింగ్‌లో వివిధ విభాగాల్లో రాణించ‌వ‌చ్చు. ఉన్నత సంస్థల్లో చ‌దివిన విద్యార్థులు కెరీర్ ప్రారంభంలో రూ. 3.6 ల‌క్షల నుంచి 9 ల‌క్షల వ‌ర‌కు వార్షిక ప్యాకేజీని అందుకోవ‌చ్చు. అయితే వీరికి బీటెక్ (కంప్యూట‌ర్ సైన్స్‌/ ఐటీ) బ్రాంచ్ విద్యార్థుల నుంచి పోటీ ఉంటుంది. అలాగే ఎమ్మెస్సీ (సీఎస్‌) అభ్యర్థులు కూడా పోటీనిస్తారు. ఎంసీఏ పూర్తిచేసిన‌వారు అద‌న‌పు ప్రావీణ్యం కోసం కావాల‌నుకుంటే గేట్ లేదా పీజీఈసెట్ ద్వారా ఎంటెక్ చ‌దువుకోవ‌చ్చు. మ‌రో పీజీ అవ‌స‌రం లేద‌నుకుంటే పీహెచ్‌డీ పూర్తిచేయ‌వ‌చ్చు.


posted on 9-6-2015