Latest News

మూడు ద‌శ‌ల్లో పోలీసు ఎంపిక ప్ర‌క్రియ‌

* తొలుత 200 మార్కులకు ప్రాథమిక రాత పరీక్ష
* ఆపై దేహదారుఢ్య, తుది పరీక్షలు

ఈనాడు - అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులు సాధనలో మునిగిపోయారు. రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి మొత్తం మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. లక్షల్లో దరఖాస్తులు వస్తాయన్న అంచనాల నేపథ్యంలో తొలుత ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి, అందులో ఎంపికైన వారికి మాత్రమే దేహదారుఢ్య పరీక్షలు జరపనుంది. వీటిలో అర్హత సాధించిన వారికి తుది రాత పరీక్షలు నిర్వహించనుంది. ఈ మూడు దశల ఎంపిక విధానం ఎలా ఉండనుంది? ఏయే అంశాలపై ఎన్ని మార్కులకు పరీక్ష ఉంటుంది? తదితర వివరాలు...
పోస్టులు: సివిల్‌ ఎస్సై, ఏఆర్‌ ఆర్‌ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై, డిప్యూటీ జైలర్‌, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌
ప్రాథమిక రాత పరీక్ష..
2 పేపర్లు.. 200 మార్కులు (ఆబ్జెక్టివ్‌)
పేపర్‌ 1: అర్థమెటిక్‌, రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ
పేపర్‌ 2: జనరల్‌ స్టడీస్‌
అర్హత మార్కులు: ఓసీ అభ్యర్థులు 40 శాతం, బీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, విశ్రాంత సైనికోద్యోగులు 30 శాతం మార్కులు సాధించాలి. ఒక్కో ప్రశ్నపత్రంలో వేర్వేరుగా నిర్దేశిత అర్హత మార్కులు సాధించాలి. ఈ మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి.
దేహదారుఢ్య పరీక్షలు..
ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి తొలుత శారీరక కొలతల (పీఎంటీ) పరీక్షలు, అనంతరం పరుగు, లాంగ్‌జంప్‌ పరీక్షలు నిర్వహిస్తారు.
100 మీటర్లు, 1600 మీటర్ల పరుగు పందెం
* పురుష అభ్యర్థులు వంద మీటర్ల పరుగును 15 సెకన్లలో, 1600 మీటర్ల పరుగును 8 నిమిషాల్లో పూర్తి చేయాలి.
* మహిళా అభ్యర్థులు 100 మీటర్లను 18 సెకన్లలో, 1600 మీటర్లను 10 నిమిషాల 30 సెకన్లలో..
* విశ్రాంత సైనికోద్యోగులు 100 మీటర్లను 16.5 సెకన్లలో, 1600 మీటర్లను 9 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేయాలి.
లాంగ్‌ జంప్‌
పురుషులు 3.80 మీటర్లు, మహిళలు 3.65 మీటర్లు, విశ్రాంత సైనికోద్యోగులు 2.75 మీటర్లు లాంగ్‌ జంప్‌ చేయాలి.
సివిల్‌ ఎస్సై, డిప్యూటీ జైలర్‌, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌..
ఈ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులు 1600 మీటర్ల పరుగు పందెంలో తప్పనిసరిగా అర్హత సాధించాలి. లాంగ్‌జంప్‌, 100 మీటర్ల పరుగులో ఏదో ఒక దాంట్లో అర్హత సాధిస్తే చాలు. ఈ మార్కులేవీ తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.
ఏఆర్‌ ఆర్‌ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై
ఈ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులు వంద మార్కులకు దేహదారుఢ్య పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. 100 మీటర్ల పరుగు, 1600 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌ మూడు విభాగాల్లోనూ అర్హత సాధించాలి. 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌నకు 30 చొప్పున 60 మార్కులు, 1600 మీటర్ల పరుగుకు 40 మార్కులు కేటాయించారు. వారు ఎంత తక్కువ సమయంలో వీటిని పూర్తి చేస్తే అన్ని ఎక్కువ మార్కులు లభిస్తాయి. ఈ మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు.
తుది రాత పరీక్ష (మెయిన్స్‌)
సివిల్‌ ఎస్సై, డిప్యూటీ జైలర్‌ (పురుషులు, మహిళలు), స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులకు
పేపర్లు: 4
మార్కులు: 600
పేపర్‌ 1: ఆంగ్లం (100 మార్కులకు)
పేపర్‌ 2: తెలుగు (100 మార్కులకు)
* ఈ రెండు పేపర్లు వివరణాత్మక విధానం (డిస్క్రిప్టివ్‌)లో ఉంటాయి. వీటిలో అర్హత మార్కులు సాధిస్తే సరిపోతుంది.
పేపర్‌ 3: అర్థమెటిక్‌, రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ (200 మార్కులకు)
పేపర్‌ 4: జనరల్‌ స్టడీస్‌ (200 మార్కులకు)
* వీటిలో ప్రశ్నలు బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి.
* ఆంగ్లం, తెలుగు పేపర్లలో అర్హత సాధించకపోతే మిగతా రెండు పేపర్లను పరిగణనలోకి తీసుకోరు.
తుది ఎంపిక ఇలా
చివరి రెండు ప్రశ్నపత్రాల్లో (400 మార్కులకు) అత్యధిక మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేస్తారు.
ఏఆర్‌ ఆర్‌ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై పోస్టులకు
పేపర్లు: 4
మార్కులు: 400
పేపర్‌ 1: ఆంగ్లం (100 మార్కులకు)
పేపర్‌ 2: తెలుగు (100 మార్కులకు)
* ఈ రెండు పేపర్లు డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటాయి. అర్హత మార్కులు సాధిస్తే సరిపోతుంది.
పేపర్‌ 3: అర్థమెటిక్‌, రీజనింగ్‌ (100 మార్కులకు)
పేపర్‌ 4: జనరల్‌ స్టడీస్‌ (100 మార్కులకు)
* బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నలు ఉంటాయి
తుది ఎంపిక ఇలా
చివరి రెండు ప్రశ్నపత్రాల్లో (200 మార్కులకు) అభ్యర్థి సాధించిన మార్కులను, 100 మార్కులకు నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలో సాధించిన మార్కులను కలుపుతారు. అత్యధిక మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేస్తారు.

Posted on 03-11-2018