Latest News

పోలీసు నియామక ప్రకటనపై ప్రజాహిత వ్యాజ్యం
* పలు లోపాలున్నాయని ఆరోపణ
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ‌లో పోలీసు కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. సంబంధిత ప్రకటనలో పలు లోపాలున్నాయని, దాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ మెదక్‌ జిల్లా పుల్కల్‌ మండలం లక్ష్మిసాగర్‌ గ్రామానికి చెందిన మాదిగ మహేష్‌ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు ఛైర్మన్‌ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. వివిధ విభాగాల్లో 16,925 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన జారీచేసింది. ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు, స్పెషల్‌ పోలీసు ఫోర్స్‌ పోస్టుల భర్తీలో డ్రైవింగ్‌ లైసెన్సు ఉన్న అభ్యర్థులకు 3 వెయిటేజి మార్కులు ఇవ్వడం సరికాదు. ఏపీ పోలీసు సబార్డినేట్‌ సర్వీసు రూల్స్‌ ప్రకారం ఆ పోస్టుల భర్తీకి డ్రైవింగ్‌ అవసరం లేదు. హోంగార్డులకు గరిష్ఠ వయోపరిమితిని పెంచడం వల్ల ఇతర రిజర్వేషన్‌ అభ్యర్థులపై ఆ ప్రభావం పడుతుంది. జిల్లాలు, కమ్యూనిటీల వారీగా రోస్టర్‌ను ప్రకటించలేదు. ఎన్‌సీసీ - ఏ కేటగిరి అభ్యర్థులి పూర్తిగా విస్మరించారు. ఇంకా పలు లోపాలున్నాయి అని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వివరాల్ని పరిగణనలోకి తీసుకొని మే 10న జారీ చేసిన జీవో 49, పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌ మే 31న జారీచేసిన ప్రకటనలను నిలుపుదల చేయాలని కోరారు.

Posted on 01-07-2018