SBI POs - Preparation Plan

పిలుస్తోంది ఎస్‌బీఐ!

* 2000 పీఓ పోస్టులు
* భారీ స్థాయిలో ఉద్యోగ యోగం

బ్యాంకు ఉద్యోగం కొట్టాలనే వారికిది మంచి తరుణం. భారీసంఖ్యలో ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పి.ఒ.) పోస్టుల నియామకానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సిద్ధమయింది. మరోపక్క బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలు కూడా ఉద్యోగ ఖాళీల భర్తీకి ఉపక్రమించాయి. కొత్త అభ్యర్థులూ, అనుభవం ఉన్నవారూ దరఖాస్తు చేసుకుని, ఈ బ్యాంకుల రాతపరీక్షల సన్నద్ధతపై పూర్తి దృష్టిపెట్టాలి. అందుకు ఉపకరించే కీలకాంశాల విశ్లేషణ, మార్గదర్శకత్వం ఇదిగో!

బ్యాంకు పరీక్షలు రాసే అభ్యర్థులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసేవి.. ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులు. వీటి భర్తీకి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా 2000 పోస్టులు భర్తీ కానున్నాయి. డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్‌లో ఉన్నవారూ దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉంది. అయితే వారు 31 ఆగస్టు 2018 తేదీ లోపు ఉత్తీర్ణులై ఉండాలి.

పరీక్షా విధానం గత ఏడాది మాదిరిగానే ఉన్నప్పటికీ ప్రిలిమినరీలో మాత్రం చిన్న మార్పు ఉంది. ప్రిలిమినరీ పరీక్ష మొత్తానికి ఉన్న 60 నిమిషాల సమయాన్ని విభాగాల వారీగా ఒక్కొక్క దానికి 20 ని. చొప్పున మూడు విభాగాలకు కేటాయించారు. ఇది మినహా మిగిలినదంతా గత సంవత్సరంలాగే ఉంది. ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎస్‌బీఐకి ఉండే ప్రత్యేకతల వల్ల ఎక్కువమంది ఈ పరీక్షకు పోటీ పడతారు. ఉద్యోగం సాధించి, దానిలో చక్కని ప్రతిభ చూపే అభ్యర్థులు తక్కువ సమయంలోనే ఉన్నతస్థానం చేరుకోవచ్చు. 25 సంవత్సరాల్లోపు పి.ఒ.గా చేరే అభ్యర్థులు బ్యాంకు ఛైర్మన్‌ హోదా వరకూ చేరుకునే అవకాశం ఉంది.అందుచేత పరీక్ష కూడా ఇతర బ్యాంకు పరీక్షలతో పోల్చినపుడు హెచ్చుస్థాయిలోనే ఉంటుంది.

కొత్త తరహా ప్రశ్నలు
ఎస్‌బీఐ పీఓ పరీక్షలో ప్రతీసారీ కొన్ని కొత్త తరహా మోడల్‌ ప్రశ్నలు ప్రవేశపెడుతుంటారు. సాధారణంగా ఇతర పి.ఒ. పరీక్షలో ఉండే మోడల్‌ ప్రశ్నలతోపాటు వీటిని అదనంగా ఇస్తారు. అంతకుముందు చూడని ఆ తరహా ప్రశ్నలు సాధించడానికి సన్నద్ధమై ఉండాలి.

ప్రిలిమినరీ, మెయిన్స్‌ రాత పరీక్షల్లో ఉన్న మొత్తం ఏడు విభాగాలను పరిశీలిస్తే.. ప్రిలిమినరీ పరీక్షలో ఉన్న మూడు విభాగాలు మెయిన్స్‌ పరీక్షలో కూడా ఉన్నాయి. ప్రిలిమ్స్‌లో ఉన్న క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, మెయిన్స్‌లో ఉన్న డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌ ఒకే విభాగానికి చెందినవి. అందుచేత మెయిన్స్‌ పరీక్షకు సన్నద్ధమైతే ప్రిలిమినరీ పరీక్ష సన్నద్ధత కూడా దాదాపు పూర్తవుతుంది.

ఏ విభాగం ఎలా?
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌
ప్రిలిమినరీ పరీక్షలో ఉన్న ఈ విభాగంలో ప్రశ్నలు, సింప్లికేషన్స్‌, అప్రాక్సిమేట్‌ వాల్యూస్‌, నంబర్‌ సిరీస్‌, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌, పర్ముటేషన్‌ కాంబినేషన్స్‌, ప్రాబబిలిటీ, వివిధ అరిథ్‌మెటిక్‌ టాపిక్స్‌ నుంచి ఉంటాయి.

డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌
మెయిన్స్‌ పరీక్షలోని ఈ విభాగం సాధించడానికి అరిథిమెటిక్‌ టాపిక్స్‌ బాగా నేర్చుకోవాలి. ముఖ్యంగా పర్సంటేజెస్‌, ఏవరేజి, రేషియో-ప్రపోర్షన్‌లపై అవగాహన వుండాలి. కాలిక్యులేషన్స్‌ వేగంగా చేయగలగాలి. దీనిలో టేబుల్స్‌, లైన్‌గ్రాఫ్‌లు, బార్‌ డయాగ్రమ్‌లు, పై-ఛార్టులు, కేస్‌లెట్స్‌ నుంచి ఎక్కువగా ప్రశ్నలుంటాయి. ఒకటికంటే ఎక్కువ గ్రాఫ్‌లున్న మిక్స్‌డ్‌ గ్రాఫ్‌ మోడల్స్‌ కూడా ముఖ్యమే. గ్రాఫ్‌ల మధ్య వున్న సంబంధాన్ని త్వరగా తెల్సుకొని ప్రశ్నలు సాధించాలి. అలాగే పర్ముటేషన్స్‌-కాంబినేషన్స్‌, ప్రాబబిలిటీ, కొన్ని అరిథ్‌Çమెటిక్‌ ప్రశ్నలు కూడా వస్తాయి. ఈ విభాగానికి అభ్యాసం బాగా అవసరం.

రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌
ప్రిలిమినరీ, మెయిన్స్‌ రెండింటిలోనూ రీజనింగ్‌ వుంది. ఎస్‌బీఐ పీఓ రీజనింగ్‌ ప్రశ్నలు హెచ్చుస్థాయిలో వుంటాయి. సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, పజిల్‌ టెస్ట్‌, కోడెడ్‌ ఇనీక్వాలిటీస్‌, ఇన్‌పుట్‌- అవుట్‌పుట్‌, డేటా సఫిషియన్సీ, ఎలిజిబిలిటీ టెస్ట్‌, స్టేట్‌మెంట్‌ సంబంధ ప్రశ్నలు, ఇతర రీజనింగ్‌ టాపిక్స్‌ బాగా నేర్చుకుని సాధన చేయాలి. ముఖ్యంగా స్టేట్‌మెంట్‌ సంబంధ ప్రశ్నలలో ఆప్షన్లు అన్నీ సరైనవిగా భ్రమింపజేసేలా వుంటాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంగ్లిష్‌ పరిజ్ఞానం పెంచుకుంటే ఇలాంటి ప్రశ్నలు సులభంగా సాధించే అవకాశం వుంటుంది. కంప్యూటర్‌ నుంచి 5-10 ప్రశ్నలు రావొచ్చు.

ఇంగ్లిష్‌ లాంగ్వేజి
ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండింటితోపాటుగా డిస్క్రిప్షన్‌ టెస్టులోనూ ఈ విభాగం వుంది. అందుకని ఇది చాలా ముఖ్యం. ప్రశ్నలు వచ్చే సెంటెన్స్‌ కంప్లీషన్‌, పారా జంబుల్డ్‌, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌, క్లోజ్‌ టెస్ట్‌, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌ మొదలైన మోడల్‌ ప్రశ్నలతోపాటు రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, సిననిమ్స్‌, యాంటనిమ్స్‌ ప్రశ్నలుంటాయి. పాసేజీని వేగంగా చదివి గ్రహించగలిగితే కాంప్రహెన్షన్‌ ప్రశ్నలు సాధించవచ్చు.
డిస్క్రిప్షన్‌ టెస్ట్‌లో లెటర్‌ రైటింగ్‌, ఎస్సే రైటింగ్‌లు వుంటాయి. అభ్యర్థులు వీటిని బాగా సాధన చేయాలి. ఏదైనా విషయం తీసుకుని 150-200 పదాలతో ఎస్సే రాయగలిగేలా చూసుకోవాలి. ఎక్కువమంది బ్యాంకు పరీక్షల్లో ఫెయిలయ్యేది దీనిలోనే అని గుర్తుంచుకొని సాధన చేయాలి.

జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌
ఈ విభాగంలోని ప్రశ్నలు కరెంట్‌ అఫైర్స్‌, బ్యాంకింగ్‌ టర్మినాలజీ, స్టాండర్డ్‌ జి.కె.ల నుంచి వుంటాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక సంబంధాలపై ఎక్కువగా ప్రశ్నలుంటాయి. గత 5, 6 నెలలకు సంబంధించిన తాజా పరిణామాలు బాగా చూసుకోవాలి. ఐఎంఎఫ్‌, వరల్డ్‌ బ్యాంక్‌, ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ మొదలైన అంతర్జాతీయ, నీతి ఆయోగ్‌ లాంటి జాతీయ ఆర్థిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ, ఆర్‌బీఐ, స్టాక్‌ మార్కెట్‌, ఇతర జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న విషయాలు తెలుసుకోవాలి. కేవలం ప్రశ్న- జవాబు పద్ధతిలో కాకుండా పరిణామాలను విశ్లేషించేలా తయారవ్వాలి.

రెంటికీ కలిపే తయారవ్వాలి
ప్రిలిమినరీ, మెయిన్స్‌ రెండింటిలో ఒకే సబ్జెక్టులున్నాయి. కాబట్టి అభ్యర్థులు రెండింటికీ కలిపే ప్రిపేర్‌ అవ్వాలి. అలాగే ప్రిలిమ్స్‌ తరువాత మెయిన్స్‌ పరీక్షకు 20-25 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి మెయిన్స్‌ పరీక్షకు కూడా ఇప్పటినుంచే సన్నద్ధమవ్వాలి. మెయిన్స్‌కు చదివితే సహజంగానే ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌ పూర్తవుతుంది. ప్రిలిమినరీ పరీక్షకు రెండు నెలల సమయం ఉంది. ఆలోగా ప్రిలిమ్స్‌ విభాగాలతోపాటు మెయిన్స్‌ విభాగాలు కూడా పూర్తయ్యేవిధంగా చూసుకోవాలి. కొత్తగా బ్యాంక్‌ పరీక్షలు రాసే అభ్యర్థులు రీజనింగ్‌, అరిథ్‌మెటిక్‌ టాపిక్స్‌ అన్నీ నేర్చుకొని వీలైనన్ని వివిధ రకాల ప్రశ్నలు ప్రాక్టీస్‌ చేయాలి. పూర్తిస్థాయి మోడల్‌పేపర్‌లు సమయాన్ని నిర్దేశించుకుని రోజుకు ఒకటైనా తప్పనిసరిగా రాయాలి. గతంలో జరిగిన ఎస్‌బీఐ పీఓ పరీక్ష ప్రశ్నపత్రాలు పరిశీలించి ప్రశ్నలు ఏ తరహా, ఏ స్థాయిలో ఉంటున్నాయో గమనించాలి. తమ ప్రిపరేషన్‌ ఆ స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. ఒక ప్రణాళికతో, నిబద్ధతగా సన్నద్ధమయితే అత్యధికులు కోరుకునే ఎస్‌బీఐ పీఓ ఉద్యోగం తప్పకుండా సంపాదించవచ్చు.

అవకాశాలు మరో రెండు...
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి 158 క్రెడిట్‌ ఆఫీసర్ల భర్తీ కోసం నోటిఫికేషన్‌ వెలువడింది. 60% మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏ, ఎమ్‌ఎస్సీ, ఎమ్‌కాం, ఎమ్‌ఏ (ఎకనామిక్స్‌), సీఏ, ఐసీడబ్ల్యూఏ విద్యార్హతలు గల అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. వెల్త్‌ మేనేజ్‌మెంట్‌/ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో కనీసం 3 సంవత్సరాల ఉద్యోగానుభవం గల గ్రాడ్యుయేట్‌ అభ్యర్థుల కోసం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి 424 సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, ఇతర పోస్టుల కోసం ప్రకటన విడుదలయింది. రాతపరీక్ష/ఇంటర్వ్యూ/గ్రూప్‌ డిస్కషన్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

క్రెడిట్‌ ఆఫీసర్లు/రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ల బాధ్యతలు
క్రెడిట్‌ ఆఫీసర్లు రుణ సంబంధ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. అందుకే వీరిని లోన్‌ ఆఫీసర్లుగా కూడా వ్యవహరిస్తారు. దరఖాస్తుదారుల అప్లికేషన్లు సక్రమంగా ఉన్నాయో లేదో చూడటం, ఆమోదించిన రుణాలు సకాలంలో దరఖాస్తుదారులకు విడుదలయ్యేలా చూడటం, వారు పొందిన రుణాలు తిరిగి సక్రమంగా బ్యాంకుకు చెల్లించే లాగా చూడటం వీరి విధులు. రిలేషన్‌షిప్‌ మేనేజర్‌లు బ్యాంక్‌ కస్టమర్ల/ ఖాతాదారుల వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. అంటే బ్యాంక్‌ ప్రొడక్ట్‌లు, సర్వీస్‌లను వారికి తెలపడం, సలహాలివ్వడం చేస్తారు.

రెండు గంటల పరీక్ష
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రెడిట్‌ ఆఫీసర్ల ఆన్‌లైన్‌ రాత పరీక్షలో ఇంగ్లిష్‌ లాంగ్వేజి, జనరల్‌ అవేర్‌నెస్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌లు ఉంటాయి. వీటిలో ఒక్కోదానికి 50 మార్కులు ఉంటాయి. మొత్తం పరీక్షా సమయం 2 గంటలు. వీటిలో ఆంగ్లం క్వాలిఫైయింగ్‌ కోసం మాత్రమే. వీటిలోని మార్కులను మెరిట్‌ లిస్ట్‌ కోసం పరిగణించరు. తప్పు సమాధానానికి నెగిటివ్‌ మార్కులు ఉన్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పరీక్షా విధానాన్ని పేర్కొనలేదు. ఇతర బ్యాంకు పరీక్షల్లోని విభాగాలే దీనిలో ఉండొచ్చు.

ఇంగ్లిష్‌ లాంగ్వేజి: గ్రామర్‌ ఆధారంగా దాదాపు సగం ప్రశ్నలుంటాయి. పారా జంబుల్డ్‌, రీ అరేంజ్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌, గ్రమాటికల్‌ ఎర్రర్‌ ఫైండింగ్‌, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌, క్లోజ్‌ టెస్ట్‌, సెంటెన్స్‌ కంప్లీషన్‌ మోడల్‌ ప్రశ్నలు బాగా ప్రాక్టీస్‌ చేయాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, ఇంగ్లిష్‌ వొకాబులరీల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి.

జనరల్‌ అవేర్‌నెస్‌: దీనిలోని ప్రశ్నలు కరెంట్‌ అఫైర్స్‌, బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌, స్టాండర్డ్‌ జి.కె.ల నుంచి ఉంటాయి. గత 5, 6 నెలల కరెంట్‌ ఎఫైర్స్‌ను చూసుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, కేంద్రప్రభుత్వ పథకాలు మొదలైన వాటిని బాగా చూడాలి. ఆర్‌బీఐ, భారతదేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ, బ్యాంకింగ్‌ టర్మినాలజీ, బ్యాంక్‌లు - ట్యాగ్‌లైన్ల గురించి తెలుసుకోవాలి.

ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌: ఆర్థిక వ్యవహారాలను చూసే బాధ్యత గల పోస్టు కాబట్టి అభ్యర్థులకు ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సబ్జెక్ట్‌ పట్ల ఉన్న అవగాహన తెలుసుకునేందుకు దీన్ని ఈ పరీక్షలో చేర్చారు. డెఫినిషన్‌, ఇంట్రడక్షన్‌ టు ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌, సోర్సెస్‌ ఆఫ్‌ ఫైనాన్సింగ్‌, కాపిటలైజేషన్‌, కాపిటల్‌ స్ట్రక్చర్‌, కాస్ట్‌ ఆఫ్‌ కేపిటల్‌, ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌ అనాలిసిస్‌, లివరేజ్‌, కేపిటల్‌ బడ్జెటింగ్‌, వర్కింగ్‌ కేపిటల్‌, వర్కింగ్‌ కేపిటల్‌ మేనేజ్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ సిస్టంతో పాటు ఇతర ముఖ్యమైన టాపిక్స్‌ను బాగా చూసుకోవాలి.

సబ్జెక్టులు మూడే!
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రెడిట్‌ ఆఫీసర్ల పరీక్ష జూన్‌ 10న నిర్వహిస్తారు. దాదాపు 50 రోజుల సమయముంటుంది. పరీక్షలో కేవలం మూడు సబ్జెక్టులే ఉన్నాయి. సాధారణంగా బ్యాంక్‌ పరీక్షల్లో ఉండే సన్నద్ధతకు ఎక్కువ సమయం పట్టే ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ విభాగాలు దీనిలో లేవు. కాబట్టి పరీక్షకు ఉండే ఈ 50 రోజుల సమయం సన్నద్ధతకు సరిపోతుంది. ఇంగ్లిష్‌ విభాగంలో ఉత్తీర్ణులయ్యేమేరకు చూసుకొని మిగిలిన రెండు విభాగాల్లో వీలైనన్ని ఎక్కువ మార్కులు పొందే ప్రయత్నం చేయాలి. అభ్యర్థులు అన్ని విభాగాలకూ సమ ప్రాధాన్యమిస్తూ ప్రిపరేషన్‌ సాగించాలి.

Posted on 23-04-2018