Ask the Expert
|
Feed Back
|
About us
|
Contant us
|
Pratibha Home
 

పరీక్షల పండుగ రానే వచ్చింది. ఒక్క క్షణాన్నీ వృథా చేయక విద్యార్థులు కష్టపడుతున్నారు. మంచి మార్కుల కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. 'ఇంకో పది నిమిషాలు ఇస్తే అదరగొట్టేవాళ్లం', 'అన్నీ తెలిసిన ప్రశ్నలే వచ్చినా.. సమాధానాలు రాసేందుకు సమయం సరిపోలేదు'... పరీక్ష కేంద్రం నుంచి బయటకు రాగానే... కొంతమంది విద్యార్థులు చెప్పే మాటలివి. అందరికీ అంతే వ్యవధి ఉంటుందని గుర్తించాలి. కొందరేమో సమాధానాలు రాయడాన్ని తొందరగా ముగించి, వాటిని జాగ్రత్తగా పరిశీలించి, తప్పులను సరి చేసుకుంటుంటారు. మరికొందరు సమయాన్ని సద్వినియోగం(టైమ్‌ మేనేజ్‌మెంట్‌) చేసుకోలేక చివరి నిమిషం వరకూ గాభరా పడుతూనే రాస్తుంటారు. చివర్లో గంట మోగడంతో చేసేదేమీ లేక కొన్ని ప్రశ్నలను వదిలేస్తారు. ఫలితంగా విలువైన మార్కులకు గండి పడుతుంది. దీన్ని ఎదుర్కోవాలంటే సమయ పరీక్షలో గెలవాల్సిందే...
పరీక్ష రాసేటప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే.. విద్యార్థి మానసికంగా విజయం సాధించినట్లేనంటున్నారు నిపుణులు. ఎంత కష్టపడి చదివినా.. సరిగా సమాధానాలు రాయకపోతే మంచి మార్కులు రావనే విషయం తెలుసుకోవాలి. పరీక్షకు ముందు ఎంత చదివామన్నది కాదు.. ఇచ్చిన సమయంలో అన్నింటికీ స్పష్టంగా జవాబులు రాయగలిగామా... లేదా అన్నది ముఖ్యం. ప్రశ్నపత్రాన్ని తయారు చేసేటప్పుడు సాధారణ విద్యార్థినే దృష్టిలో ఉంచుకుంటారు. పది నిమిషాలు మిగిలి ఉండగానే సమాధానాలు రాసేలా ప్రశ్నలను ఇస్తారనే విషయాన్ని ప్రతి విద్యార్థీ గుర్తించాలి. అందరికీ సమయం సరిపోయినప్పుడు నాకెందుకు సరిపోవడం లేదని... ప్రశ్నిం చుకోవాలి. పరీక్ష కాల వ్యవధే జీవితాన్ని మార్చే శక్తి అని గుర్తు పెట్టుకోవాలి. ప్రతి క్షణాన్నీ సక్రమంగా వినియో గించుకోవాలి.
తప్పులు చిన్నవే.. మూల్యమే ఎక్కువ
సాధారణంగా విద్యార్థులు పరీక్షల్లో సమయానికి సంబంధించి చిన్నచిన్న తప్పులే చేస్తుంటారు. అవే భారీ మూల్యానికి కారణమవుతాయని తెలుసుకోరు. ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదవకుండా హడావుడిగా సమా ధానాలు రాయడం ప్రారంభిస్తారు. ఇది చాలా తప్పు. ప్రశాంతంగా ఆలోచిస్తే.. దొరకని సమా ధానం అంటూ ఏదీ ఉండదనే విషయాన్ని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారికి తెలపాలి.
కొన్ని చిన్నపాటి తప్పులు...
* మార్కులకు తగ్గట్టుగా కాకుండా సమాధానాలను పేజీలకు పేజీలు నింపుతారు. (ఉదా: 2 మార్కుల ప్రశ్నకు ఓ పేజీ రాస్తారు)
* ప్రశ్న పూర్తిగా చదవకుండా.. సమాధానం రాయడం ప్రారంభిస్తారు. తర్వాత ప్రశ్నను మరోసారి చదివి.. అప్పటి వరకూ రాసినదాన్ని కొట్టి వేస్తారు.
* ప్రశ్నపత్రం పూర్తిగా చదవకుండానే రాయడం వల్ల దేనికి ఎంత సమయం కేటాయించుకోవాలో తెలియదు.
* తెలియని ప్రశ్న గురించే ఆలోచిస్తూ.. విలువైన సమయాన్ని వృథా చేసుకుంటారు.
* ప్రశ్నలకు పైన ఇచ్చిన సూచనలను చదవకుండానే పరీక్ష మొదలుపెడతారు. ఇందువల్ల అయిదు ప్రశ్నల్లో మూడు మాత్రమే రాయమంటే.. అన్నీ రాసేస్తారు. ఫలితంగా చివర్లో కొన్నింటిని వదిలేయాల్సి వస్తుంది.
* వేగంగా రాయలేక పోవడం.
* పక్కవాళ్లు సమాధానాలు ఎలా రాస్తున్నారని చీటికీమాటికీ చూస్తూ.. ఆందోళన చెంది వచ్చిన సమాధానాలను మరిచిపోతుంటారు.
* ఒకే ప్రశ్నకు రెండు సమాధానాలు రాస్తుంటారు. దీని వల్ల సమయం వృథా తప్ప.. అదనపు మార్కులు రావు.
* సమయాన్ని పట్టించుకోకుండా పరీక్ష రాస్తూనే ఉంటారు.
* మొదట చిత్తు కాగితంపై సమస్యను సాధించి.. దాన్ని తిరిగి సమాధాన పత్రంలోకి ఎక్కిస్తారు.
* ఓ ప్రశ్నకు సమాధానం గతంలో చదివినదే అయినా.. గుర్తుకు రాకపోవడంతో... దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ.. నాకు ఇది గుర్తుకు రావడం లేదంటూ కాలాన్ని వృథా చేస్తుంటారు.
* పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికి చేరుకోకపోవడం.
ఇలా దాటేద్దాం
పరీక్ష ప్రారంభమైన 10 నిమిషాల వరకు సమాధానాలు గుర్తుకు రాకపోవడం... మార్కులు తక్కువగా వస్తాయని ఆందోళన కలగడం సాధారణం. ఇలాంటి సమయంలో మనకు బాగా వచ్చిన సమాధానాన్ని ముందుగా రాస్తే.. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తద్వారా మిగిలిన జవాబులను ఆడుతూ పాడుతూ రాసేయొచ్చు.
* ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టివేతలు లేకుండా ఉండాలి. ఒకవేళ చేసినా.. ఇష్టం వచ్చినట్లుగా కాకుండా.. తప్పుగా రాసిన పదంపై అడ్డంగా ఓ చిన్న గీత పెడితే చాలు.
* పశ్నపత్రాన్ని పూర్తిగా చదవాలి. ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలో నిర్ణయించుకోవాలి.
* 2 మార్కుల ప్రశ్నకు కచ్చితంగా రెండు నిమిషాలే కేటాయించాలి.
* పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందే.. ఇంటి దగ్గర గతేడాది ప్రశ్నపత్రం సాయంతో నమూనా పరీక్షను రాయాలి. అప్పుడే మనం ఎంత సమయంలో సమాధానాలు రాయగలు గుతున్నాం... చదివింది ఎంతవరకు గుర్తుందో ప్రత్యక్షంగా తెలిసే అవకాశం ఉంది.
* చివర్లో తెలియని ప్రశ్నను జాగ్రత్తగా చదివి.. అందులో మనకు తెలిసిన పదం ఏదైనా కనిపిస్తే.. దాని గురించి రాస్తూ పోవాలి. అలా రాసే క్రమంలో జవాబు మనకే తడుతుంది.
* ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవధి ముగియక ముందే పరీక్ష కేంద్రాన్ని విడిచి వెళ్లకూడదు. ఒకవేళ రాయడం ముందే పూర్తయితే.. జవాబులను సరిచూసుకోవాలి.
* పరీక్ష ప్రారంభం కావడానికి గంట ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ చదవకూడదు. మిత్రులతో సరదాగా మాట్లాడుతూ నవ్వుతూ ఉండాలి. అలా చేస్తే.. ఆందోళన హుష్‌కాకి అవుతుంది.
* ప్రశ్నను జాగ్రత్తగా చదవాలి.. ఏం అడుగుతున్నారో గమనించాలి. అవసరమైన సమాధానాన్నే రాయాలి.
* వేగంగా రాసేందుకు రోజూ చేతిరాతను సాధన చేయాలి. చదివిన అంశాలను ఓసారి కాగితంపై రాసి చూసుకోవాలి. ఇలా చేస్తే చేతిరాతలో వేగం పెరగడంతో పాటు అంశం మెదడులో నిక్షిప్తమవుతుంది.
* సమాధానాలను పేజీలకు పేజీలు కాకుండా.. మార్కులను దృష్టిలో ఉంచుకొని రాయాలి.
* ఒకే ప్రశ్నకు రెండు సమాధానాలు రాస్తే.. ఒకటి తప్పైనా మొత్తం మార్కులు పోతాయి.
* అనుకున్నట్లుగా ప్రతి ప్రశ్నకు సమయం కేటాయిస్తున్నామా లేదా అని మధ్యమధ్యలో చూసుకోవాలి.
* ముందుగా ఏ ప్రశ్నలకు సమాధానాలు రాయాలో నిర్ణయించుకున్నాకే ప్రారంభించాలి.
* పరీక్ష హాల్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కవారిని చూసి ఆందోళన చెందకూడదు.
* బొమ్మలు వేయడానికి.. అనవసరమైన డిజైన్లకు సమయాన్ని వృథా చేసుకోకూడదు.
* అవసరమైన సామగ్రిని వెంట తీసుకెళ్లాలి.
చిరునవ్వుతో ఎదుర్కోవాలి
చాలామంది విద్యార్థులు పరీక్షల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. చిన్నచిన్న తప్పిదాల వల్ల విలువైన మార్కులను కోల్పోతున్నారు. ప్రశ్నపత్రాన్ని కచ్చితంగా, క్షుణ్నంగా చదవాలి. ముందుగా తెలిసిన సమాధానాలనే రాయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వాటికి సమాధానాన్ని ముందు రాయకూడదు. కంప్యూటర్లు, ట్యాబ్‌ల వల్ల చేతి రాతలో వేగం మందగించింది. వేగంగా.. క్లుప్తంగా.. స్పష్టంగా సమాధానాలు రాస్తేనే మార్కులు వస్తాయి. మోములో చిరునవ్వులు చిందిస్తూ.. పరీక్ష హాల్‌లోకి వెళ్లాలి. ఏ సమాధానమైనా ఆత్మవిశ్వాసంతో రాయాలి. అప్పుడే విజయం సిద్ధిస్తుంది.
      - బీవీ సత్య నగేష్‌, టైం మేనేజ్‌మెంట్‌ నిపుణులు

posted on 11.03.2015