Ask the Expert
|
Feed Back
|
About us
|
Contant us
|
Pratibha Home
 

* ఆందోళన అవసరంలేదు
* అవగాహన పెంచుకుంటే చాలు
* 'ఈనాడు-మీతోడు'లో పదోతరగతి విద్యార్థులకు సబ్జెక్టు నిపుణుల సూచన      
కడప నగరం, రాజంపేట, రాయచోటి, న్యూస్‌టుడే: పది పరీక్షలంటే విద్యార్థులకు భయం. ఎలా చదవాలి. ఎలాంటి ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవాలి. ఇలా అనేక సందేహాలు. కారణంగా విద్యార్థుల్లో అదోరకమైన భయం ఏర్పడుతుంది. ఈ భయాన్ని తొలగించి, వారి సందేహాలను నివృత్తి చేయటానికి 'ఈనాడు-మీతోడు' నిపుణులైన ఉపాధ్యాయులతో ఫోన్‌ ఇన్‌ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 2న నిర్వహించింది. విద్యార్థులు, ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయుల నుంచి విశేష స్పందన లభించింది. సబ్జెక్టు నిపుణలకు ఫోన్‌చేసి తమ సందేహాలను నివృత్తిచేసుకున్నారు. నిర్ణీత సమయం అయిపోయినా మరో రెండు గంటలు సమాధానం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సబ్జెక్టు నిపుణులకు ఫోన్‌ చేయడం గమనార్హం. జిల్లా నుంచే కాకుండా చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల నుంచి కూడా ఫోన్‌లు రావడం విద్యార్థుల సందేహాల తీవ్రతను తెలియజేస్తోంది.
* ఆంగ్లంలో పట్టు సాధించండి - పాఠ్యపుస్తక రచయిత రహంతుల్లా

* ప్ర: పొలైట్‌ ఫామ్స్‌ ఎలా ఆన్సర్‌ చేయాలి? - ప్రజ్వల, ఎస్టీ ఆంటోని స్కూల్‌, కడప
జ: ప్రశ్న నంబరు 31 నుంచి 34 వరకు ప్రశ్నలు లాంగ్వేజి పంక్షన్స్‌పై ఉంటాయి. వీటికి సులువుగా సమాధానాలు రాయచ్చు. సలహాలు ఇవ్వడం, క్షమాపణ తెలియజేయడం, సమాచారసేకరణ, అనుమతి కోరడం వంటి వాటికి సంబంధించిన ఎక్స్‌ప్రెషన్స్‌ బాగా నేర్చుకోవడం ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయచ్చు. ఇట్స్‌ టైం, హైటైం వంటి పాఠంలోని ఎక్స్‌ప్రెషన్స్‌ సాధన చేయాలి.
* ప్ర: పాఠం చివరన ఉండే ప్రశ్నలు వస్తాయా? ఎలా సన్నద్ధమవ్వాలి ? - జయంతి, జడ్పీ పాఠశాల, రాజుల కండ్రిగ, చిత్తూరు జిల్లా
జ: పాఠంలోని ముఖ్యాంశాన్ని బట్టి ప్రశ్నలు ప్రిపేర్‌ కావాలి. ఉదాహరణకు వాట్‌ డూ యూ లెర్న్‌ ఫాం ది లైఫ్‌ వియూచిచ్‌? ఇన్‌ వాట్‌ వాట్‌ వే ఈజ్‌ ద ప్లే ద డియార్‌ డిపార్టెడ్‌ ఏ కామెంటరీ, ఆన్‌ ది హాలోనెస్‌ ఆఫ్‌ హూమన్‌ రిలేషన్‌షిప్‌ వంటి ప్రశ్నలను అభ్యాసం చేయాలి. సొంతంగా భావ వ్యక్తీకరణకు అవకాశం ఉన్న ప్రశ్నలను అధ్యయనం చేయాలి.
* ప్ర: పేపర్‌ -2లో ప్రశ్న నంబరు 12, 13 ప్రశ్నలు ఎలా అధ్యనం చేయాలి? - నాగజ్యోతి, మహర్షి పాఠశాల, పోరుమామిళ్ల
జ: ఈ ప్రశ్నలు అత్యధికంగా మార్కులు సాధించే విభాగాలు. రెండు ప్రశ్నలకు 20 మార్కులు ఉంటాయి. కన్వర్జేషన్‌ రైటింగ్‌, నెరేటివ్‌ రైటింగ్‌, బయోగ్రఫి స్కెచ్‌, రిపోర్టు రైటింగ్‌ లెటరు వంటి డిస్కోర్సెస్‌ (ఆధునిక భాషారూపాలు) సాధన చేయాలి. బయోగ్రఫి స్కెచ్‌లో పాఠాలలోని ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలు సాధన చేయాలి. పాఠ్యపుస్తకానికి సంబంధించిన వ్యక్తుల జీవిత చరిత్రలు రాయడం సులువవుతుంది. పాఠశాలలో జరిగే ముఖ్యమైన వేడుకలు (రిపబ్లిక్‌డే, స్కూల్‌ డే) వంటి వాటిపై స్నేహితునికి లేఖ రాయడం, సందర్భ అధారిత వార్త పత్రిక రిపోర్టు ఎలా తయారు చేయాలి వంటి వాటిపై దృష్టి సారిస్తే లాభాదాయకంగా ఉంటుంది.
* ప్ర: కొత్త పాఠ్యపుస్తకంలోని థీమ్‌ ఆధారంగా పాఠ్యంశాలను రూపకల్పన చేశారు. మా అమ్మాయికి మొదటి నుంచి కర్సీవ్‌ రైటింగ్‌ అలవాటు. అలా రాస్తే మార్కులు సరిగా రావని తెలసింది. దీనిపై వాస్తవ సమచారం ఇవ్వగలరు? - తనూజా, రవీంద్ర పాఠశాల, ప్రొద్దుటూరు
జ: కర్సీవ్‌ రైటింగ్‌ అయినా ఇటాలిక్‌ రైటింగ్‌ అయినా దస్తూరి స్పష్టంగా అర్థమయ్యే రీతిలో రాస్తే తప్పని సరిగా మార్కులు ఇస్తారు. పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో అమ్మాయిని ఇటాలిక్‌ ప్రాక్టీస్‌ చేయించడం మంచిదికాదు.
* ప్ర: పేపర్‌-1 పార్టు బిలో గ్రామరుపై ప్రశ్నలు పాఠ్యాంశాల నుంచే ఇస్తారా, జనరల్‌గా ఉంటాయా? - హేమంత్‌ వర్మ, నారాయణ పాఠశాల, ఎన్జీవో కాలనీ
జ: పేపర్‌-1లో 14వ ప్రశ్న నుంచి 34వ ప్రశ్న వరకు పార్టు బి అంతా గ్రామర్‌ వకాబులరీ, పొనెటిక్స్‌, లాంగ్వేజి ఫంక్షన్స్‌పై విభిన్న రకాల ప్రశ్నలుంటాయి. ఈ విభాగం కోసం పాఠ్యాంశాల చివరలో ఇచ్చిన గ్రామరులో అంశాలు ప్రాక్టీస్‌ చేయాలి. రిలేటెడ్‌ క్లాజెస్‌, రిపోర్టెడ్‌ స్పీచ్‌, మాడల్స్‌, అప్రాప్రియేట్‌ వర్బ్సు ఫామ్‌ (ఫాస్ట్‌ ఫర్‌ఫెక్ట్‌, సింపుల్‌ ఫాస్టు) ప్రిపోజిషన్సు, ఆర్టికల్స్‌ పాస్ట్‌ ఫర్‌ఫెక్ట్‌ టెన్స్‌, కాంపౌండు ప్రిఫోజిషనల్‌ ప్రేజెస్‌ వంటి వాటిని అభ్యాసం చేస్తూ జనరల్‌ ఏరియాల్లో సాధన చేయాలి.
* ప్ర: ఆంగ్లంలో పదికి పది పాయింట్లు సాధించడం ఎలా? - ఎన్‌.విమల జడ్పీ పాటశాల, రాజుల కండ్రిగ, చిత్తూరు జిల్లా
జ: ఆంగ్లంలో పది పాయింట్లు సాధించడానికి ప్రశ్న పత్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రతి విభాగంపై పట్టు సాధించాలి. పేపర్‌ -1లో పోయం, ప్యాసేజ్‌, గ్రామర్‌, పేపరు -2లో 11, 13, 14, 15, 16, ప్రశ్నలు సాధన చేసి దస్తూరి చక్కగా ఉంటే అనుకున్న జీపీఏ సాధించవచ్చు. గ్రామర్‌ స్పెల్లింగ్‌ దోషాలను నివారించడానికి ఎక్కువసార్లు రాయాలి.
* ప్ర: శ్రద్ధగా చదువుతాను.. కానీ చదివినదంతా మరచిపోతున్నాను గుర్తుంచుకోవడానికి ఏం చేయాలి? - తాతాజి, జడ్పీ పాఠశాల, తిమ్మాపురం, తూర్పు గోదావరి జిల్లా
జ: ఎక్కువ సార్లు రాయడం అలవాటు చేసుకోండి. ఆంగ్లంలో ప్రశ్నలు తప్ప మిగతా ప్రశ్నలకు ఎక్కువగా చదవాల్సిన, గుర్తు పెట్టుకోవాల్సిన పనిలేదు. సమాధానాలు చదివి వాటిలో కివర్డు సహాయంతో సొంతంగా ఎక్కువసార్లు రాస్తే ప్రయోజనం ఉంటుంది.
* దృష్టిపెడితే మంచి మార్కులు - జీవశాస్త్రం విషయ నిపుణులు రాజారత్నం
* ప్ర: జీవ శాస్త్రంలో మంచి మార్కులు సాధించాలంటే ఎలాచదవాలి.. సలహాలివ్వండి? - నరేష్‌, భార్గవి, జడ్పీ పాఠశాల, పొత్తపి .
జ: పాఠ్యాంశాన్ని బాగా చదివి భావనలు, విషయాన్ని పూర్తిస్థాయిలో అవగాహన చేసుకోవాలి. చదివేటపుడు ఉపాధ్యాయుడు బోధించిన అంశాలను పునఃస్మరణ చేసుకోవాలి. ముఖ్యమైన అంశాలను రాసుకోవాలి. పాఠ్యాంశాలను కొన్ని విభాగాలుగా చేసుకుని చదవడంవల్ల సులువుగా విషయాన్ని గుర్తించుకోవచ్చు. కీలకభావనలు, సమీకరణాలు, అబ్రివేషన్స్‌, ముఖ్యమైన పదజాలాన్ని ప్రత్యేకంగా ఛార్టుల్లో కానీ పేపర్లలో కానీ రాసుకుని తరగతి గది గోడలపై ప్రదర్శించుకుని అప్పడప్పడూ పునఃస్మరణ చేసుకుంటూ ఉండాలి. అనుమానాలు వస్తే ఉపాధ్యాయుడుని అడిగి నివృత్తి చేసుకోవాలి. ఇలా చేస్తే ఎక్కువ కాలం గుర్తించుకునే అవకాశం ఉంటుంది.
* ప్ర: బ్లూప్రింట్‌ ప్రకారం ప్రశ్నలు ఉంటాయా? - మహబూబ్‌బాషా, రవీంద్ర పాఠశాల, ప్రొద్దుటూరు
జ: మారిన కొత్త సిలబస్‌ ప్రకారం 1 నుంచి 8 పాఠాల వరకు మార్కుల భారత్వం (వెయిటేజి) సమానంగా ఇచ్చారు. వీటిలో అన్నీ ప్రాధాన్యం కల పాఠ్యాంశాలే. ప్రతి పాఠ్యాంశం నుంచి బ్లూప్రింట్‌ ఆధారంగానే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అరమార్కు, 1, 2, 4, 5 మార్కుల ప్రశ్నలు ప్రాధాన్యత క్రమంలో ఒక పాఠంలో తక్కువ ఎక్కువ ఉండవచ్చు. ఈ పాఠ్యాంశాలన్నీ కూడా జీవక్రియలకు సంబంధించినవి కావున ఒకదానితో ఒకటి అంతర్గత సంబంధం కలిగి ఉంటాయి.
* ప్ర: ప్రశ్నలన్నీ పాఠ్యపుస్తకం నుంచి వస్తాయా, బయట నుంచి వస్తాయా? - ఆర్‌.సాయిభార్గవరామ్‌, నారాయణ పాఠశాల, కడప
జ: కొత్త సిలబస్‌ ప్రకారం ప్రశ్నపత్రం ఎలా ఉంటుందో అని విద్యార్థులు, తల్లిదండ్రులతో సహా అందరూ ఆందోళన చెందుతున్నారు. ప్రశ్నపత్రం మాత్రం పాఠ్యాంశం విషయ పరిధి దాటి వెళ్లే అవకాశం ఉండదు. ఎందుకంటే భావనలు విషయాల ఆధారంగానే ప్రశ్నలు అడుగుతారు. కొత్త సిలబస్‌, కొత్త ప్రశ్నపత్రం కనుక బయటి ప్రశ్నలు అడిగే అవకాశం తక్కువ. అయితే ప్రశ్న అడిగే విధానం కొత్తగా ఉంటుంది. పాఠ్యాంశం చివరన అడిగే ప్రశ్నలు కాకుండా ఆ ప్రశ్నల ఆధారంగా వేరొకటి కొత్తగా అడగవచ్చు. ఆందోళన అక్కరలేదు. పాఠ్యవిషయం బాగా గుర్తు ఉంచుకుంటే ప్రశ్న ఎలా వచ్చినా సమాధానం రాయచ్చు.
* ప్ర: కొత్త ప్రశ్నపత్రంలో డయాగ్రమ్స్‌లో ఏవైనా మార్పులు ఉన్నాయా. ఎలాంటివి రావచ్చు? -విద్యాధరి, నారాయణ పాఠశాల, కడప
జ: సులువుగా అయిదుకు అయిదు మార్కులు సాధించాలంటే చిత్రాలు వేయాల్సి ఉంటుంది. కొత్త విధానం ప్రకారం బొమ్మ దాని భాగాలు కాకుండా అదనంగా పటం గురించి వివరించమని అడిగే అవకాశం ఉంది. మరొక ప్రశ్నగా బొమ్మ ఇచ్చి దాని బాగాలు గుర్తించమంటారు. మనం కచ్చితంగా సమాధానం చేయాలంటే బొమ్మ దాని భాగాలు సాధన చేయాలి. బొమ్మ గురించి పూర్తి సమాచారం తెలుసుకుంటే సులువుగా మార్కులు సాధించవచ్చు. 1, 4, 6 పాఠ్యాంశాల్లోని బొమ్మలను ప్రాక్టీసు చేస్తే అయిదు మార్కులు సులువుగా సాధించవచ్చు.
* ప్ర: ప్రశ్నాపత్రంలో 1, 2, 4 మార్కుల ప్రశ్నలకు ఎన్ని పాయింట్లు రాయాల్సి ఉంటుంది? - జయంతి, జడ్పీ పాఠశాల, కేవీబీపురం, చిత్తూరు జిల్లా
జ: ఈ ప్రశ్నలకు ఎన్ని పాయింట్లు రాస్తున్నామనేదానికంటే అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం రాస్తున్నామా లేదా చూసుకోవాలి. మనం సరైన సమాధానం రాసినట్లయితే ఒక మార్కు ప్రశ్నకు ఒక పాయింటు, రెండు మార్కుల ప్రశ్నకు రెండు పాయింట్లు, నాలుగు మార్కుల ప్రశ్నలకు ఆరు నుంచి పది పాయింట్లు రాస్తే సరిపోతుంది. వీటికంటే ముఖ్యమైంది ప్రశ్నకు తగిన సమాధానం రాయాలి. అప్పుడే పూర్తి మార్కులు పొందే అవకాశం ఉంటుంది.
* ప్ర: ప్రశ్నపత్రంలో యాక్టివిటీకి సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన, ప్రాజెక్టు వర్కునకు సంబంధించి ప్రశ్నలు ఏవైనా వస్తాయా? - పవిత్ర, రవీంద్ర పాఠశాల, ప్రొద్దుటూరు
జ: వీటికి సంబంధించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అయితే అవి ప్రత్యేక సామర్థాల్య ఆధారంగా కాకుండా సామర్థ్యాలు అంతర్లీనంగా ఉండి మనకు నాలుగు మార్కుల ప్రశ్నగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రశ్న విధానం పాతమాడల్‌ కాబట్టి ఏ సెక్షన్‌లో కానీ బీ సెక్షన్‌లో కానీ నాలుగు మార్కుల ప్రశ్నలుగా వస్తాయి. పాఠ్యపుస్తకంలో కొన్ని ప్రాజెక్టుల పనులు, మీ ఉపాధ్యాయుడు బోధించిన అంశాలను చదువుకుంటే సమాధానాలు రాయచ్చు.
* ప్ర: బిట్‌ పేపరులో ఎలా మార్కులు సాధించాలి? - వి. తరుణ్‌కుమార్‌రెడ్డి, కావ్య మారుతి పాఠశాల, పోరుమామిళ్ల .
జ: బిట్స్‌ పూర్తి స్థాయిలో ఆన్సర్‌ చేయాలంటే పాఠ్యాంశాన్ని పూర్తిగా చదవాలి. పాఠ్యాంశం చివరన ఉన్న మనం ఏం నేర్చుకున్నాం అనే అంశాలను ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. అన్నీ పాఠ్యాంశాల్లో ఉన్న పట్టికలు, మీకు తెలుసా? ఆలోచించండి? చర్చించండి? కీలక పదాలు? లాంటి అంశాలను తప్పక మనం నేర్చుకున్నట్లయితే బిట్స్‌ మనం పూర్తి స్థాయిలో సమాధానం చేయచ్చు. బిట్స్‌ మాత్రమేకాకుండా ఒకటి, రెండు మార్కుల ప్రశ్నలు రాసే అవకాశం ఎక్కువ. పై అంశాలన్నీంటినీ దృష్టిలో ఉంచుకుని ఎలాంటి సందేహమైన ఉపాధ్యాయులతో నివృత్తి చేసుకుని నిర్భయంగా భావనలు, విషయాలను అర్థం చేసుకోవాలి. ప్రశ్న ఏవిధంగా వచ్చినా సమాధానం రాయవచ్చు.
* ప్ర: ప్రశ్నలు అన్నీ పాఠ్యాంశం చివర ఉన్నవే వస్తాయి? లేకపోతే సొంతంగా ఇస్తారా? మనం సమాధానం ఎలా రాయాలి? - యోగబాలాజి, వేదవ్యాస్‌ పాఠశాల, రాయచోటి
జ: పాఠ్యాశం చివరన ఉన్న ప్రశ్నలు చాలా వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రశ్నలు సీసీఈ నమూనాలోనే పరోక్షంగా ఇవ్వడం జరిగింది. అయితే ఇవే ప్రశ్నలు మార్పు చేసి అడిగే అవకాశం ఉంది. అప్పడు వేర్వేరు ప్రశ్నలు అని భావించకుండా మనం చదివిన భావనల నుంచే జవాబురాయాలి. వాటిని కొత్త ప్రశ్నలుగా భావించద్దు. ప్రశ్నలన్నీ పాఠ్యపుస్తకం నుంచే వస్తాయి. విద్యార్థులు ధైర్యంగా పరీక్షలకు సిద్ధంకండి.
* ప్ర: జవాబులు పాఠ్యపుస్తకంలో ఉన్నది ఉన్నట్లుగా రాయాలా? సొంతవాక్యాలు కలిపి రాయచ్చా? - ప్రత్యూషా, బెటాలియన్‌ పాఠశాల, కడప
జ: మొదట ప్రశ్నను బాగా చదివి అర్థం చేసుకుని ఏ సమాధానం అయితే సరిపోతుందో ఆ జవాబును మనం పాఠ్యపుస్తకం నుంచి అయినా, బయట నుంచి అంశాలతో అయినా రాయచ్చు. ప్రశ్నకు తగిన సమాధానం కచ్చితంగా ఉండాలి. ప్రస్తుత పాఠ్యాంశాల్లో కాన్సెప్టు ఓరియెంటేషనులో లెసన్సు ఉన్నాయి. మనం సొంతంగా రాసే అవకాశం తక్కువగా ఉంటుంది. పర్యావరణం, సహజవనరుల పాఠ్యాంశానికి సంబంధించి కొంత వరకు బయట విషయాలను జోడించవచ్చు.
* అర్థం చేసుకుంటూ చదవాలి - భౌతికశాస్త్ర నిపుణుడు డి.అన్వర్‌బాషా
* ప్ర: ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఎలా చదవాలి? ఏమేమి చదవాలి? - కవిత, ఏవీఆర్‌ పాఠశాల, మైదుకూరు
జ: పాఠ్యపుస్తకంలోని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చదవాలి. వాటిని అర్థం చేసుకోవాలి. నేర్చుకున్న విషయాలకు సంబంధించి ఎన్నెన్ని విధాలుగా ప్రశ్నలు అడగవచ్చో తెలుసుకోవాలి. అంటే ప్రశ్నించే నైపుణ్యతను పెంపొందించుకోవాలి.
* ప్ర: రెండు మార్కులు, నాలుగు మార్కుల ప్రశ్నలకు ఎన్నెన్ని పాయింట్లల్లో జవాబు రాయాలి? - జయసాయి, గౌతం స్కూల్‌, ప్రొద్దుటూరు
జ: ప్రశ్న అడిగిన విధానం మేరకు సమాధానాలు రావాల్సి ఉంటుంది. రెండు మార్కుల ప్రశ్నలకు కనీసం నాలుగు పాయింట్లు, నాలుగు మార్కుల ప్రశ్నకు 8-10 పాయింట్లు రాయాల్సి ఉంటుంది.
* ప్ర: నాలుగు మార్కుల ప్రశ్నలు ఏ చాప్టర్‌ నుంచి ఎక్కువగా వస్తాయి? - తరుణ్‌కుమార్‌, మహర్షి హైస్కూల్‌, పోరుమామిళ్ల
జ: ఫిజిక్స్‌ పార్టు నుంచి ఉష్ణం, విద్యుత్‌, విద్యుదయస్కాంతం పాఠ్యాంశాల్లో రెండు ప్రశ్నలు, కాంతి నుంచి రెండు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. రసాయన శాస్త్రం నుంచి పరమాణు నిర్మాణం, కర్భన రసాయనశాస్త్రం, రసాయన బంధం, ఆవర్తన పట్టిక నుంచి వస్తాయి.

* ప్ర: కాంతిలో సంజ్ఞా సాంప్రదాయాన్ని చెప్పండి? - ప్రవళ్లిక, రాజు పాఠశాల, కడప
జ: అన్ని దూరాలను ధృవం నుంచి కొలవాలి. పతన కాంతి దిశలో కొలచిన దూరాలను ధనాత్మకంగా, వ్యతిరేఖదిశలో కొలిచిన దూరాలను రుణాత్మకంగా తీసుకోవాలి. ప్రధానాక్షంపై గల బిందువులనుంచి పైవైపుకి కొలచిన ఎత్తులను ధనాత్మకంగాను, కింది వైపుకి రుణాత్మకంగాను తీసుకోవాలి.
* ప్ర: బిట్‌ పేపర్‌లో అని సమాధానాలు రావాలంటే ఏం చేయాలి? - జ్యోత్స్న, చైతన్య పాఠశాల, కడప
జ: పాఠ్యశం పూర్తిగా చదవాలి. పట్టికల్నిస్థిరాంకాలను నేర్చుకోవాలి. మోడల్‌ పేపర్లు బాగా ప్రాక్టీస్‌ చేయాలి.
* ప్ర: పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలను నేరుగా అడుగుతారా? మార్పు చేస్తారా? - హేమంత్‌వర్మ, నారాయణ పాఠశాల, కడప
జ: పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలు 40-50 శాతం వరకు అడుగుతారు. మిగిలిన ప్రశ్నలు పాఠ్యంశంలో ఎక్కడి నుంచైనా అడగవచ్చు.

* ప్ర: ప్రైవేట్‌ పబ్లిషర్స్‌ ముద్రించిన ఆల్‌ఇన్‌వన్‌ చదవొచ్చా? - మోహన్‌రాజ్‌, రవీంద్రభారతీ పాఠశాల, కడప
జ: మొదట పాఠ్యపుస్తకంలోని ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ తరువాతే ప్రాక్టీస్‌ కోసం ఆల్‌ఇన్‌వన్‌ చదువచ్చు.

* ప్ర: బొమ్మలు గీయడంలో మెలుకువలు చెప్పండి? ముఖ్యమైన బొమ్మలు ఏవి? - నవీన్‌కుమార్‌రెడ్డి, లావలూరు జడ్పీ పాఠశాల, కొండాపురం
జ: బొమ్మలను ఆకర్షణీయంగా గీయాలి. భాగాలను ఖచ్చితంగా గుర్తించాలి. విద్యుత్తు మోటారు, ఏసీ డైనమో, విశిష్ణోష్టం, డి-ఆర్బిటాళ్లు, మాయలర్‌ బొమ్మ, రవర్బరేటరీ ఫర్నీస్‌(కొలిమి) వంటి బొమ్మలు ఎక్కువగా వస్తాయి.

* ప్ర: ఇథైల్‌ ఆల్కాహాల్‌ దేనినుంచి తయారు చేస్తారు? - తరుణ్‌కుమార్‌, మహర్షీ పాఠశాల, పోరుమామిళ్ల
జ: ఎథీన్‌ నుంచి పీ2ఓ5 ఉత్ప్రేరక సమక్షంలో చేస్తారు.

* ప్ర: పబ్లిక్‌ పరీక్షలో పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలు ఎలా ఉంటాయి? బిట్‌ పేపర్‌ ఎలా ఉండవచ్చు? - సుబ్బారెడ్డి, ఫిజికల్‌సైన్స్‌ ఉపాధ్యాయుడు, మైదుకూరు
జ: 40-50 వరకు పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలు నేరుగా అడగవచ్చు. మిగతా ప్రశ్నలు అర్థం చేసుకుని సమాధానం రాయాలి. బిట్‌లో 20 బహుళైశ్చిక ప్రశ్నలు, ఐదు ఖాళీలు, ఐదు జత పరిచేవి ఉంటాయి.

* ప్ర: ప్రయోగశాల కృత్యం నుంచి ప్రశ్నలు అడుగుతారా? - కె.మహబూబ్‌బాషా, ఉర్దూ హైస్కూల్‌, సుండుపల్లి
జ: ఖచ్చితంగా అడుగుతారు. పాఠ్యపుస్తకంలోని ప్రయోగశాల కృత్యాలను తప్పక నేర్చుకోవాలి.

* ప్ర: ఉత్సాదనలు, సమస్యలు ఏఏ పాఠాల నుంచి వస్తాయి? - షబ్బీర్‌, పీఎస్‌ ఉపాధ్యాయుడు, రైల్వేకోడూరు
జ: విద్యుత్‌ నుంచి ఉత్పాదనలు, వక్రీతలాల వద్ద కాంతి వక్రీ భవనం నుంచి సమస్యలు వస్తాయి.

* ప్ర: ఉత్సాదనలు, సమస్యలు ఏఏ పాఠాల నుంచి వస్తాయి? - షబ్బీర్‌, పీఎస్‌ ఉపాధ్యాయుడు, రైల్వేకోడూరు
జ: విద్యుత్‌ నుంచి ఉత్పాదనలు, వక్రీతలాల వద్ద కాంతి వక్రీ భవనం నుంచి సమస్యలు వస్తాయి.

* ప్ర: రెండు మార్కులకు ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు? - రామ్మోహన్‌, బద్వేలు
జ: పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలతో పాటు పాఠ్యపుస్తకంలోని 'ఆలోచించండి- చర్చించండి' అనే భాగం నుంచి కూడా అడుగుతారు.

* ఆలోచించి జవాబులు రాస్తేసరి! : సాంఘికశాస్త్ర విషయ నిపుణులు
* ప్ర: పదోతరగతి పరీక్షలకు ఎన్ని పేపర్లులుంటాయి. ఏపాఠాల నుంచి ప్రశ్నలు వస్తాయి.? - నవీన్‌కుమార్‌, జడ్పీఉన్నత పాఠశాల, మైదుకూరు
జ: సాంఘికశాస్త్రంలో రెండుపేపర్లుంటాయి. పేవర్‌- 1, 50మార్కులు, పేపరు- 2 50మార్కులుంటాయి. పేపర్‌ ఒకటి నుంచి భూగోళశాస్త్రం, అర్థశాస్త్రం నుంచి ప్రశ్నలుంటాయి. పాఠ్య పుస్తకంలో 1 నుంచి 12 పాఠాలలో, పేపరు-2లో చరిత్ర, పౌరశాస్త్రం నుంచి అడుగుతారు. ఇందుకు పాఠ్య పుస్తకం నుంచి 13 నుంచి 22 పాఠాలు కేటాయించారు.
* ప్ర: పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలే అడుగుతారా. పాఠ్యపుస్తకానికి సంబంధించి సాధారణంగా, పరోక్షంగా పశ్నలుంటాయా? - రుచిత, రాజు పాఠశాల, రాజంపేట
జ: పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలనే అడుగుతారు. ప్రశ్నపత్రంలో 80 శాతం ప్రశ్నలు పాఠంచివరల్లో మీఅభ్యసనాన్ని మెరుగుపర్చుకోండి. మిగతా 20 శాతం ప్రశ్నలు పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశ ప్రశ్నలు(ఇన్‌బాక్స్‌, ఇన్‌టెక్ట్స్‌) ఉంటాయి.
* ప్ర: పాతపద్ధతిలో కొత్త విధానంలో ప్రశ్నలుంటాయని అధికారులు అంటున్నారు నిజమా? - కార్థ్యాయని, శ్రీచైతన్య పాఠశాల, ప్రొద్దుటూరు
జ: గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాలమాదిరిగా 1, 2, 4 మార్కుల ప్రశ్నలు, బహుళైచ్ఛిక, ఖాళీలు, జతపర్చుము వాటితో ప్రశ్నపత్రం ఉంటుంది. కొత్తప్రశ్నలంటే విద్యార్థి, ఆలోచించి జవాబులు రాసేలా ఉంటాయి. ఉదాహరణకు హిమాలయాల ప్రాముఖ్యాన్ని వర్ణించండి? గతంలో అడిగేవారు. ప్రస్తుతం అదేప్రశ్నను హిమాలయాలుప్రస్తుతం ఉన్నస్థానంలో లేకపోతే భారత ఉపఖండ శీతోష్ణస్థితులెలా ఉండేవని అడుగుతారు.

* ప్ర : ఒకటి, రెండు నాలుగు మార్కుల ప్రశ్నలకు జవాబులు రాసేవిధానమెలా? - శివకుమార్‌, అధ్యాపకుడు, లయోలకళాశాల, పులివెందుల
జ : ఒకమార్కు ప్రశ్నలకు ఏకవాక్యంలోనికాని, రెండు పాయింట్లగా జవాబు రాయాలి. రెండు మార్కుల ప్రశ్నలకు నాలుగు నుంచి ఆరు పాయింట్లు, నాలుగు మార్కుల ప్రశ్నలకు 8 నుంచి 10 పాయింట్లు ఉండేలా రాయాలి. ముఖ్యంగా నాలుగుమార్కుల ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు సబ్‌హెడ్డింగ్‌లు ఉంచితే మంచిది.
* ప్ర : బిట్‌పేపరు ఎన్నిమార్కులకు.. ఎలా ఉంటుంది? - మమతారెడ్డి, కేఆర్‌ఆర్‌ఎం, పాఠశాల, కడప
జ : బిట్‌పేపరు 15 మార్కులకు ఉంటుంది. 30 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో 20 బహుళైచ్ఛిక ప్రశ్నలు 5 ఖాళీలు, 5 జతపరిచే ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలకు అరమార్కుచొప్పున 15 మార్కులు కేటాయించారు.పాఠ్యా పుస్తకంలోని అంశాల నుంచి బిట్‌పేపరులో ప్రశ్నలుంటాయి. వీటిని గమనించాలి.
* ప్ర : ప్రశ్నలకు జవాబులు బట్టీపట్టి రాస్తే మార్కులు రావంటున్నారు.నిమమేనా? - సాయిభార్గవరాం, నారాయణ పాఠశాల, కడప
జ : ఇది నిజంకాదు. ప్రశ్నకు సంబంధించిన జవాబు ఉందాలేదా అని మాత్రమే పరిశీలించి మార్కులు ఇస్తారు.
* ప్ర : మ్యాప్‌ పాయింటింగ్‌కు సంబంధించి ఏ పేపరుకు ఏయే అంశాలిచ్చారు? - ఫజుల్‌, షబ్బీర్‌, ప్రభుత్వఉన్నత పాఠశాల, రాయచోటి
జ : ఒకటో పేవర్‌లో పార్టుఏలో 23వ ప్రశ్నగా భారతదేశపటం ఇస్తారు. ఇందులోని ఏబీ విభాగాల్లో ఒకవిభాగంలోని అయిదు అంశాలను గుర్తించాలి. దానికి అయిదు మార్కులు కేటాయించారు. రెండో పేపరులో పార్టుఏలో 23వ ప్రశ్నగా ప్రపంచపటం ఇస్తారు. ఇందులో ఏబీ విభాగాల్లో ఓవిభాగం నుంచి అయిదు అంశాలను గుర్తించాలి. దీనికి అయిదు మార్కులు కేటాయించారు.
* ప్ర : మ్యాప్‌ పాయింట్‌లో ప్రశ్నలు ఏవిధంగా అడుగుతారు? - నాగలక్ష్మి, పెయింట్‌జోసెఫ్‌పాఠశాల, కడప
జ : మ్యాప్‌ పాయింట్‌లో పాఠ్యపుస్తకంలోని అంశాలను మాత్రమే ప్రశ్నలుగా అడుగుతారు. వాటినికూడ ప్రత్యక్షంగానే అడుగుతారు. ఒకటో పేపరులో భారతదేశపటంలో రాష్ట్రాలు, రాజధానులు, నిమ్మోన్నతాలు, నదులు, జనసాంద్రత, విమానాశ్రాలయపై ప్రశ్నలు అడుగుతారు. రెండో పేపరులో ప్రపంచపటంలో అన్నిఖండాల పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. రెండు పేపర్ల మ్యాప్‌ పాయింట్‌ కోసం పాఠ్యపుస్తకంలోని 10, 60, 82, 198, 202, 286 పేజీల్లోని మ్యాపులను క్షుణ్ణంగా పరిశీలిస్తే అధిక మార్కులు సాధించవచ్చు.
* ప్ర : మ్యాప్‌ పాయింట్‌ ఎలా సాధన చేయాలి? - నాగేశ్వర్‌, బ్రిలియంట్‌ హైస్కూల్‌, రైల్వేకోడూరు
జ : భారతదేశపటం, ప్రపంచపటాల్లో మొదట కొన్నిముఖ్యమైన ప్రాంతాలను అట్లాస్‌లాంటి పుస్తకాలను చూసి ఒకసారి చూస్తూ గుర్తుపట్టి, మరోసారి చూడకుండా గుర్తు పెట్టడం సాధనచేయాలి. ప్రపంచపటంలో ఖండాలవారీగా, దేశాలను సముద్రాలను సాధన చేయాలి.
* ప్ర : తూర్పుకనుమల్లో ఎత్త్తెన పర్వతంఏది? - సాయిజ్యోతిస్వరూప్‌, శాంతి నికేతన్‌పాఠశాల, కడప
జ : విశాఖపట్నంలోని చింతపల్లెవద్ద ఉన్న అరోమకొండ(మహేంద్రగిరి).
* ప్ర : వృత్తివ్యవస్థనిర్మాణంలో గనుల తవ్వకం ఏరంగానికి చెందినది? - సుమలత, సాయిబాబా హైస్కూల్‌, ప్రొద్దుటూరు
జ : వ్యవసాయరంగానికి చెందినది
* ప్ర : మ్యాప్‌పాయింట్‌లోని అంశాలను ఏలా గుర్తించాలి.? - తరుణ్‌కుమార్‌రెడ్డి, మహర్షిహైస్కూల్‌, పోరుమామిళ్ల
జ : ప్రశ్నపత్రంలో అంశాలను మ్యాపులో గుర్తించేటపుడు వాటిసంఖ్య మాత్రమే కాకుండా, దానిపేరు రాయాలి. స్థలంసరిపోనప్పుడు బాణపుగుర్తుద్వారా పేరు సూచించాలి.

posted on 03.02.2015