Ask the Expert
|
Feed Back
|
About us
|
Contant us
|
Pratibha Home
 

* బట్టీ విధానానికి స్వస్తి.. సృజనకు పదును
* ఈసారి సీసీఈ విధానంలో స్వల్ప మార్పులు
* విద్యార్థులకు పాఠ్య పుస్తక రచయితల సూచనలు

ఈనాడు, హైదరాబాద్‌: మార్చిలో నిర్వహించబోయే పదో తరగతి పరీక్షలకు ఈసారి తెలంగాణ వ్యాప్తంగా 31 జిల్లాల నుంచి అయిదున్నర లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. రెండేళ్లుగా నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలోనే పరీక్షలు జరుగుతున్నా ఈసారి స్వల్ప మార్పులతో ప్రశ్నపత్రాలు ఉంటాయి.. పరీక్షలకు విద్యార్థులు ఎలా సన్నద్ధం కావాలో సబ్జెక్టు నిపుణులు, పాఠ్యపుస్తక రచయితలు అమూల్యమైన సూచనలు, సలహాలను అందిస్తున్నారు.

ఐదు అంశాలపై పట్టు అవసరం
తెలుగు పరీక్షలో ఒక్కో పేపరులో ఎ, బి విభాగాలుగా విభజన ఉంటుంది. ‘బి’ విభాగం పేపర్లు చివరి అరగంటలో ఇస్తారు. తెలుగులో ఉత్తమ గ్రేడ్‌ సాధనకు అయిదు అంశాలపై దృష్టి సారించి సాధన చేయాల్సి ఉంటుంది.
అవగాహన- ప్రతిస్పందన: ఈ విభాగంలో పరిచిత గద్యం, అపరిచిత గద్యం, పరిచిత పద్యం, అపరిచిత పద్యం అంశాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. అపరిచిత పద్యం, గద్యంపై ఎక్కువ సాధన చేయాలి. అపరిచిత పద్యాలను వేమన, సుమతి మొదలైన నీతి శతకాల నుంచి ఎక్కువగా అడుగుతారు. విద్యార్థులు ఆయా పద్యాలను చదివి అర్థం చేసుకోవాలి. పరిచిత గద్యం, అపరిచిత గద్యం, అపరిచిత పద్యం/గేయం/కవిత అంశాలకు సంబంధించి ఎప్పుడూ ఒకే రకంగా ప్రశ్నలు అడగరు. ప్రశ్నలు-జవాబులు, ప్రశ్నల తయారీ, ఖాళీలను పూరించడం, తప్పొప్పులను, కీలక పదాలను, వ్యాక్యాలను గుర్తించడం తదితర విధాలుగా అడుగుతారు. విద్యార్థులు విషయ అవగాహన చేసుకుంటే ఎలా అడిగినా రాసేందుకు అస్కారముంటుంది.
స్వీయ రచన: అభ్యాసంలోని ప్రశ్నలు ఉన్నవి ఉన్నట్లుగా రావు. అలాంటి స్వభావం గలవి మాత్రమే వస్తాయి. అందుకే విద్యార్థులు పాఠం చదివి సొంతంగా ప్రశ్నలను తయారుచేసుకోవాలి. వాటికి జవాబులు రాసి ఉపాధ్యాయుడి సమక్షంలో తరగతి గదిలో చర్చించాలి. తద్వారా దోషాలను సరిదిద్దుకునేందుకు అవకాశముంటుంది. పుస్తకంలోని అంశాలపై, వాక్యాలపై అభిప్రాయాలు రాయడం, వివరించడం, విశ్లేషించడం, సమర్థించడం, విభేదించడం, తగిన కారణాలు రాయడం వంటివి అభ్యాసం చేయాలి.
సృజనాత్మకత: పాఠ్యపుస్తకంలో నినాదాలు, సూక్తులు, కరపత్రం, సంభాషణ తదితర 13 వ్యవహార రూపాలున్నాయి. వీటిని ఎలా రాయాలో ఉపాధ్యాయుడి సహాయంతో అభ్యసించాలి. ఒక ప్రక్రియలో ఉన్న అంశాన్ని మరొక వ్యవహార రూపంలోకి మార్చి రాయడం అభ్యాసం చేయాలి. పాఠ్యపుస్తకంలోని వ్యవహార రూపాలను అడుగుతారు. వాటిలోని అంశాన్ని మార్చి అడుగుతారు. రెండు ప్రశ్నపత్రాల్లోనూ స్వీయరచన, సృజనాత్మకత చాలా కీలకం. ఉత్తమ గ్రేడును నిర్ధారించేవి ఇవే. పిల్లలు ఎక్కువగా ఈ రెండు అంశాలపై దృష్టి పెట్టాలి.
పదజాలం: పదజాలాన్ని ‘బి’ విభాగంలో ప్రత్యేకంగా ఇస్తారు. బహుళైచ్ఛిక ప్రశ్నలుగానే ఉన్నా.. బాగా ఆలోచించి జవాబులు గుర్తించకపోతే తప్పు రాసే అవకాశముంటుంది. ఒక్కోసారి పాఠం మధ్య నుంచీ అర్థాలు అడుగుతారు. అందుకు పాఠం క్షుణ్ణంగా చదవాలి. పాఠంలోని ముఖ్యమైన పదాలకు పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్త్యర్థాలు అడుగుతారు. కాబట్టి వాటిని తప్పనిసరిగా గుర్తించి అభ్యసించాలి.
వ్యాకరణం: వ్యాకరణాన్నీ ‘బి’ విభాగంలో ప్రత్యేకంగా ఇస్తారు. ఇందులోనూ అన్నీ బహుళైచ్ఛిక ప్రశ్నలే ఉంటాయి. పుస్తకంలో అభ్యాసాల్లో ఉన్నవి నేరుగా ఇవ్వరు కాబట్టి విద్యార్థులు తప్పనిసరిగా ఆలోచించి రాయాల్సి ఉంటుంది. అందుకే విద్యార్థులు సంధి, సమాసాలు, అలంకారాలు, చంధస్సు మూలాలను చక్కగా అర్థం చేసుకుంటే ఏ ఉదాహరణనైనా గుర్తించొచ్చు. పాఠం మధ్యలో ఉండే సంధులు, సమాసాలను అడిగే అవకాశముంటుంది.

అధ్యాయాల వారీగా సాధనతో గెలుపే
గణిత పరీక్ష మొదటి పేపర్‌ ఏడు(1-7) అధ్యాయాలు, రెండో పేపర్‌ ఏడు(8-14) అధ్యాయాల నుంచి ప్రశ్నపత్రాలు రూపొందుతాయి. విద్యార్థులు ఇప్పటినుంచే పూర్తయిన అధ్యాయాలకు ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట అధ్యాయాల వారీగా పేపర్‌-1, 2లకు సంబంధించిన సమస్యలను సాధన చేయాలి.
అధ్యాయాల వారీగా సాధన చేసేందుకు మొదటగా అధ్యాయంలోని భావనల అవగాహన కోసం ఇచ్చిన వాక్యాలను, వివరణలను, ఉదాహరణ సమస్యలను పూర్తిస్థాయిలో చదవాలి. ‘ఇవి చేయండి’, ‘ప్రయత్నించండి’, ఆలోచించండి’, చర్చించండి’లో ఉన్న సమస్యలను సొంతంగా చేయాలి.
ముందుగా అభ్యాసాల్లోని లెక్కలను సాధన చేయాలి. తర్వాత ఉపాధ్యాయుల సహకారంతో అలాంటివే కొన్ని కొత్త సమస్యలను రూపొందించి అభ్యాసం చేయాలి.
కొత్త సమస్యలను రూపొందించేప్పుడు అధ్యాయాల్లోని భావనల అవగాహన కోసం ఇచ్చిన వివరణల నుంచి ‘ప్రయత్నించండి.. ఆలోచించండి.. చర్చించండి’లో ఉన్న రీజనింగ్‌ లాజిక్‌ల ఆధారంగా తీసుకోవాలి. వాటినే అభ్యాసం చేయాలి. ఈ అభ్యాసమే గణితంలో మంచి ప్రగతిని సాధించడానికి దోహదం చేస్తుంది.
నాలుగు, రెండు మార్కుల ప్రశ్నలకు సమాధానాలు దాదాపుగా ఇచ్చిన సమస్యలోని దత్తాంశానికే చెందినవిగా ఉంటాయి. ఇచ్చిన సమాచారం, అవసరమైన పటాలు మొదలైనవి గుర్తించి సరిగా రాస్తే రెండు పేపర్లలో కలిసి సుమారు 14 మార్కులు పొందే అవకాశముంది. ఇందుకు సమస్యలను చదివి అవగాహన చేసుకోవడం, సమచారాన్ని గుర్తించడం, ఏం తెలుసుకోవాలో గుర్తించడం, పటాలు రాయడం వంటివి బాగా అభ్యాసం చేయాలి.
* ప్రతీ అధ్యాయంలో 3, 4 ప్రధాన భావనలుంటాయి. వాటిని బాగా అవగాహన చేసుకొని వాటికి చెందిన ఉదాహరణ, ‘ఇవి చేయండి’, ‘ప్రయత్నించండి’, అభ్యాసంలోని వివిధ రకాల సమస్యలను వ్యాసరూప, లఘు, అతి లఘు, బహుళైచ్ఛిక ప్రశ్నలుగా విభజించి అభ్యాసం చేయాలి. ఉదాహరణకు వాస్తవ సంఖ్యలు అధ్యాయంలో ప్రధానంగా మీకు యూక్లిడ్‌ భాగాహార న్యాయం, అంక గణిత ప్రాథమిక సిద్ధాంతం, కరణీయ సంఖ్యలు, సంవర్గమాన ధర్మాలు తదితర భావనలకు చెందిన సమస్యలు, వాటిపై విశ్లేషణాత్మక అవగాహన, రీజనింగ్‌, వాటి వినియోగానికి చెందిన సమస్యలను అభ్యాసం చేయాలి.
* జ్యామితీయ భావనలకు చెందిన సిద్ధాంతాలను బాగా అధ్యయనం చేయాలి. సిద్ధాంతాలకు చెందిన వినియోగంపై సమస్యలు రూపొందించి ఇస్తారు.
* త్రికోణమితి అనువర్తనాల్లో దత్తాంశాన్ని పటాలుగా గీయడంపై అభ్యాసం చేయగలిగితే ఈ అధ్యాయంలో ఎలాంటి సమస్య ఇచ్చినా చేయగలరు.
* గ్రాఫుల నిర్మాణంలో సరైన స్కేలును ప్రదర్శించడం, గ్రాఫులకు చెందిన విలువలను సరిగ్గా నమోదు చేయడం, జ్యామితి నిర్మాణానికి చెందిన సమస్యలు గీయగలగాలి.
* క్షేత్రమితిలో ఘణాకార వస్తు సముదాయాలతో కూడిన సమస్యలపై అభ్యాసం చేయాలి. ఒక రూపంలో ఉన్న వస్తువు మరో రూపంలోకి మార్చడం, వాటి మధ్య ఉన్న సంబంధంతో కూడిన సమస్యలపై పట్టు సాధించాలి.
* సాంఖ్యాకశాస్త్రం, నిరూపక జ్యామితి, సంభావ్యత అధ్యాయాలు మంచి స్కోరు చేయడానికి ఉపయోగపడే అధ్యాయాలు. వీటిలోని భావనలను లోతుగా అర్థం చేసుకోవాలి. ఈ అధ్యాయాల్లోని వివిధ రకాల ఉదాహరణలను అవగాహన చేసుకొని అభ్యసించాలి.

పదాలకు వాక్యరూపమిస్తే సరి
ఆంగ్లం పరీక్ష అంటేనే తెలుగు మాధ్యమంలో చదివే చాలా మంది విద్యార్థులకు భయం. మాకు ఆంగ్లం రాదు అన్న అపోహే దీనికి కారణం. రోజువారీ తెలుగు పద ప్రయోగంలోనే చాలా వరకు ఆంగ్లపదాలు దొర్లుతుంటాయి. అవే పదాలను సరైన క్రమంలో సందర్భానుసారంగా వాక్యరూపంలో వినియోగిస్తే ఆంగ్ల భాషపై పట్టు సాధించినట్లే.
* పదో తరగతి పరీక్షల్లో ఆంగ్లం పేపర్‌లో మూడు భాగాలుంటాయి. రీడ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి రోజుకు రెండు లేదా మూడు పారాగ్రాఫ్‌లు చదివి అర్థం చేసుకోవాలి. ఆ పారాలో ఉన్న పాత్రల ప్రవర్తన అర్థం చేసుకుంటే సరిపోతుంది. వీలైతే రోజూ ఒక కథ చదవడం అవసరం. ఇది పేపర్‌-2లో మంచి మార్కులు సాధించడానికి దోహదపడుతుంది.
* వొకాబులరీ అండ్‌ గ్రామర్‌(పదజాలం, వ్యాకరణం) పరంగా తీసుకుంటే.. చదివిన కథలో పదాలను గుర్తించి వాటి అర్థం మారకుండా వేరే పదాలని వాడటం నేర్చుకోవాలి. వీలైతే గుర్తించిన పదాలకు వ్యతిరేక పదాలను, అర్థాలను, క్రియాపదాల వివిధ వాడుక రూపాలను నేర్చుకుంటే చాలా వరకు పదజాలం వచ్చినట్లే. వ్యాకరణంలో యాక్టివ్‌ వాయిస్‌ నుంచి ప్యాసివ్‌ వాయిస్‌, డైరెక్ట్‌ నుంచి ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్‌, డిఫైనింగ్‌, నాన్‌ డిఫైనింగ్‌ రిలేటివ్‌ క్లాజ్‌ లాంటివి ఎక్కువగా నేర్చుకోవాలి.
* క్రియేటివ్‌ రైటింగ్‌ (సృజనాత్మకంగా రాయడం) విషయానికొస్తే ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకోవడం ముఖ్యం. ప్రశ్నలో ఇచ్చిన ఆధారాలను సరిగ్గా ఉపయోగించి ఏదైనా విషయాన్ని కళ్లకు కట్టినట్లు సొంతంగా రాయడం అవసరం. ముందుగా ఇచ్చిన ప్రశ్నను చదివి దానికి మైండ్‌ మ్యాప్‌ను తయారుచేసుకోవాలి. రాయాల్సిన సమాచారాన్ని వరుస క్రమంలో పెట్టుకుని అప్పుడు రాయడం ఆరంభించేలా సాధన చేయాలి.
* ఆంగ్ల పరీక్ష సాధనకు సంబంధించి 19 అంశాలపై దృష్టి సారించాలి. న్యారేటివ్‌ రాయడం బాగా నేర్చుకుంటే స్టోరీ రైటింగ్‌, డిస్క్రిప్షన్‌, డ్రామా, కన్వర్జేషన్‌ సులభంగా వస్తుంది. వ్యాసం రాయడం నేర్చుకుంటే స్పీచ్‌ లెటర్‌ రాయడం వస్తుంది. వీటన్నింటికీ దేని నిబంధనలు దానికి పాటించాలి.

బట్టీ వద్దు.. అర్థం చేసుకుంటేనే మేలు
భౌతికశాస్త్రంలో ప్రతీ పాఠాన్ని క్షుణ్ణంగా చదివి అవగాహన పెంపొందించుకోవాలి. ఏ విషయాన్నీ బట్టీ పట్టకూడదు. భావనలు అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించాలి. పాఠ్యాంశం చివర ఉండే ‘అభ్యాసాన్ని మెరుగుపరుచుకుందాం’లోని ప్రతీ ప్రశ్నకు సొంతంగా జవాబులు రాయాలి. మీ ఉపాధ్యాయుడితో చర్చించి సరిగా ఉన్నాయా..? పరీక్షించుకోవాలి.
* విజ్ఞానశాస్త్రంలో ప్రయోగాలకు ఆరు మార్కులు కేటాయించారు. ప్రయోగాలకు ఏ పరికరాలు ఎంపిక చేసుకోవాలి? ఎలా నిర్వహించాలి? ఏ అంశాలను పరిశీలించాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అనే విషయాల్ని గుర్తుంచుకోవాలి. దీనికోసం మీరు రాసిన ప్రయోగ నివేదికలను చదవాలి.
* సమాచార నైపుణ్యానికి సంబంధించిన ప్రశ్నల విషయానికొస్తే.. పట్టికలో సమాచారం ఇవ్వడం, బొమ్మలు ఇవ్వడం, వాటిని విశ్లేషించి రాసేలా ఇస్తారు. దీని కోసం పాఠ్యపుస్తకంలోని పట్టికలను విశ్లేషించండి. మీరు చేసిన ప్రాజెక్టులను చదవండి. దీనికి ఆరు మార్కులు కేటాయించారు.
* బొమ్మలకు సంబంధించి నాలుగు మార్కులుంటాయి. పాఠ్యపుస్తంలోని బొమ్మలను జాగ్రత్తగా పరిశీలించండి. బొమ్మలు గీయడం, భాగాలు గుర్తించడం, తప్పుగా ఇచ్చిన భాగాలు సరిచేయడం, మిగిలిన భాగం పూర్తి చేయడంవంటి అంశాలు అడగడం జరుగుతుంది.
* పాఠ్యపుస్తకంలోని భావనలు నిజ జీవితంలో ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి?, భావనల ఆధారంగా సమస్యలను సాధన చేయడమెలా? అని సాధన చేయాలి. వీటికి నాలుగు మార్కులున్నాయి.
* పాఠ్యపుస్తకంలోని విషయాలను అవగాహన చేసుకుని ప్రతీ విషయాన్ని వివరించగలిగితే.. ఉదాహరణలు ఇవ్వగలిగితే 16 మార్కులు మీ సొంతమే.

చదవాలి.. విశ్లేషించాలి
జీవశాస్త్రంలో పాఠ్యపుస్తకాన్ని క్షుణ్ణంగా చదివి విద్యాప్రమాణాలపై అవగాహన పెంచుకోవాలి. వీటి ఆధారంగానే ప్రశ్నలు రూపొందించుకోవాలి. అంతర్గత ప్రశ్నలు, కీలక పదాలను ఆకళింపు చేసుకొని విశ్లేషించగలిగే సామర్థ్యాన్ని పెంచుకోవాలి.
* విద్యా ప్రమాణం-1 విషయ అవగాహనలో విశ్లేషణాత్మక ప్రశ్నలు, ఉదాహరణలు ఇచ్చే ప్రశ్నలు, భేదాలను తెలిపే ప్రశ్నలు, పోల్చే ప్రశ్నలు, కారణాలు తెలిపే ప్రశ్నలుంటాయి. విషయ అవగాహనలో దాదాపు 16 మార్కుల ప్రశ్నలు వస్తాయి.
* విద్యా ప్రమాణం-2లో ఆలోచించే ప్రశ్నలు, వూహించి సమాధానాలు రాసే ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. ఇవి 4 మార్కులకు ఉంటాయి.
* విద్యా ప్రమాణం-3లో ప్రయోగ నైపుణ్యానికి సంబంధించిన ప్రశ్నలుంటాయి. ప్రతీ ప్రయోగం, కృత్యం, ఉద్దేశం, విధానం పరిశీలనకు అవసరమైన పరికరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. ఇవి 6 మార్కులకుంటాయి.
* విద్యా ప్రమాణం-4లో ఇచ్చిన సమాచారాన్ని పట్టిక రూపంలో లేదా గ్రాఫ్‌ రూపంలో ప్రశ్నల ఆధారంగా విశ్లేషించగలగాలి. ఇందులో ఎక్కువగా సమాచార విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. దాదాపు 6 మార్కుల ప్రశ్నలుంటాయి.
* విద్యా ప్రమాణం-5లో భావనను బొమ్మల రూపంలో లేదా ఫ్లోచార్ట్‌గా ప్రదర్శించగలగాలి. ప్రతీ బొమ్మలో భావనను ప్రతిబింబించాలి. ప్రతీ బొమ్మ భాగాలు, విధులపై అవగాహన కలిగిఉండాలి. 4 మార్కులకు ప్రశ్నలిస్తారు.
* విద్యా ప్రమాణం-6లో అన్ని నిత్య జీవిత అనుప్రయోక్త పర్యావరణానికి సంబంధించి అన్వయించుకునేలా ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. జీవశాస్త్రంలోని అంశాలు నిత్య జీవితంలో ఎలా వినియోగిస్తామో అవగాహన కలిగి ఉండాలి. 4 మార్కులకు ప్రశ్నలడుగుతారు.

మాదిరి ప్రశ్నపత్రాలపై దృష్టి
ద్వితీయ భాష హిందీ ప్రశ్నపత్రంలో ‘ఎ’ విభాగం 60 మార్కులు. ‘బి’ విభాగం 20 మార్కులుంటుంది. ‘ఎ’ విభాగం ప్రశ్నలు అయిదు బిట్లలో ఇస్తారు. ఈ బిట్లను సమగ్రంగా సాధన చేసి ఆకళింపు చేసుకొంటే మంచి మార్కులు సాధించొచ్చు. మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.
* నాలుగు పద్యపాఠాలు కవి పరిచయాలను సమగ్రంగా చదివితే 20 మార్కులు పొందొచ్చు. ఉపవాచకంలోని నాలుగు పాఠాల నుంచి 5 మార్కులు, గద్యపాఠాల నుంచి 15 మార్కులు సాధించవచ్చు. ‘బి’ విభాగంలో గద్య, పద్య పాఠ్యాంశాల వ్యాకరణాంశాలకు సంబంధించి 20 బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. పాఠ్యాంశ అభ్యాసాల్లో ఇచ్చిన వ్యాకరణాంశాలతో పాటు పాఠ్యాంశంలోని వ్యాకరణాంశాలను సాధన చేస్తే మంచి మార్కులు రాబట్టొచ్చు.
* ‘ఎ’ విభాగం బిట్‌-1లో పఠన నైపుణ్యాలను పరీక్షించే ప్రశ్నలుంటాయి. పఠిత గద్యం, అపఠిత గద్యం, పఠిత పద్యం, అపఠిత పద్యాలకు అయిదు చొప్పున మార్కులను కేటాయిస్తారు. ప్రశ్నలకు ఒక్కో వాక్యంలో జవాబులు రాయాలి. పఠిత గద్యం విభాగంలో ఉపవాచక పాఠాలను బాగా చదివి ప్రతీ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అపఠిత గద్యం విషయానికొస్తే వ్యాసరూప గద్యాంశాలను బాగా అభ్యాసం చేసి అవగాహన పెంచుకోవాలి. పఠిత పద్యంలో బరస్‌ తే బాదల్‌, మా ముజే ఆనే దే, కన్‌ కన్‌ క అధికారి పాఠ్యాంశాలపై దృష్టి సారించాలి. అపఠిత పద్యంలో ఆధునిక హిందీ సాహిత్యంలో సరళ పద్యాలను అభ్యాసం చేసి అవగాహన పెంచుకోవాలి.
* బిట్‌-2లో ప్రతీ ప్రశ్నకు నాలుగు మార్కులుంటాయి కాబట్టి 3-4 వాక్యాల్లో రాయాలి. చిన్న ప్రశ్నలను సాధన చేయాలి.
* బిట్‌-3లో పద్య పాఠానికి సంబంధించి ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి. 7మార్కులు కేటాయిస్తారు. బరస్‌తే బాదల్‌, మా ముజే ఆనే దే, కన్‌ కన్‌ క అధికారి, భక్తిపద్‌ పాఠాల సారాంశాల ఆధారంగా చేసుకొని ప్రశ్నకు 8-10 వాక్యాల్లో సమాధానం రాసేలా అభ్యాసం చేయాలి.
* బిట్‌-4 గద్య పాఠానికి సంబంధించినది. గద్య పాఠాల సారాంశాల ఆధారంగా అభ్యాసం చేయాలి.
* బిట్‌-5 సృజనాత్మకాంశాలతో కూడినది. పది మార్కులు కేటాయిస్తారు. మూడు ప్రశ్నల్లో రెండింటికి (5 మార్కుల చొప్పున) సమాధానాలు రాయాలి.
* లేఖ విషయంలో చుట్టీ పత్ర్‌, పితాజీ కో పత్ర్‌, మిత్ర్‌ కో పత్ర్‌లతో పాటు విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, పాఠశాల సంచాలకుడు, పురపాలక కమిషనర్‌.. తదితరులకు రాసే నమూనాలను అభ్యాసం చేయాలి.
* సాహితిక విధా, ఆత్మకథ, సంభాషణ్‌, సూచన, కరపత్ర్‌, సాక్షాత్కార్‌ సంబంధిత అంశాలను సాధన చేయాలి.

పటాలు, పాఠ్యాంశాలపై అవగాహన
సాంఘికశాస్త్రంలో ప్రశ్నాపత్రాల సరళిని పరిశీలిస్తే సెక్షన్‌-1లో ఒక మార్కు ప్రశ్నలు ఏడు, సెక్షన్‌-2లో రెండు మార్కుల ప్రశ్నలు ఆరు, సెక్షన్‌-3లో నాలుగు మార్కుల ప్రశ్నలు 4, ‘బి’ విభాగంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు పది ఉంటాయి. బహుళైచ్ఛిక ప్రశ్నలు కేవలం విషయ అవగాహన నుంచి మాత్రమే వస్తాయి.
* ప్రశ్నల స్వభావం తీసుకుంటే విద్యార్థులు అర్థం చేసుకునే భావనల ఆధారంగా ఆలోచించి రాసేలా ఇస్తున్నారు. ఉదాహరణకు ‘ఉమ్మడి వనరుగా నీళ్లు’ అనే భావన ఆధారంగా ప్రశ్న ఇలా అడగవచ్చు. ఉమ్మడి వనరుగా భావించే నీళ్లు ‘ప్రజా ఆస్తి’గా ఎందుకు పరిగణించాలి? అలాగే మీ ప్రాంతంలో భూగర్భ జలాల తగ్గుదలకు కారణాలను రాయండి? తరహాలో నిజ జీవితానికి అన్వయించే ప్రశ్నలు వచ్చే అవకాశముంది.
* విద్యార్థులు ఇచ్చిన అంశాన్ని చదవి అర్థం చేసుకోవడం ద్వారా రాసేలా, సమస్యల ఆధారంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేలా ప్రశ్నలు ఉండవచ్చు. సమాచార నైపుణ్యాలలో పట్టిక లేదా గ్రాఫ్‌ వస్తుంది. నాలుగు మార్కుల ప్రశ్నల కింద గతంలో మాదిరిగా పట్టిక/గ్రాఫ్‌ కింద ప్రశ్నలు రావు. విశ్లేషణ చేసి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పట నైపుణ్యాల విభాగంలో పటంలో గుర్తించడం(మ్యాప్‌ పాయింటింగ్‌) కింద ఇచ్చే అంశాలు కొన్ని పరోక్షంగా ఇస్తారు. ఉదాహరణకు మహారాష్ట్ర రాజధాని, ద్వీపకల్ప పీఠభూమిలో ప్రవహించే నది అని ఇవ్వొచ్చు. అంటే పటంలో గుర్తించే అంశాలు కూడా భావనల ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. అందుకే విద్యార్థులు తెలంగాణ, భారతదేశం అవుట్‌లైన్‌ పటాలు గీయడం సాధన చేస్తే మంచిది.
* పాఠం వారీగా కాకుండా బహుళైచ్ఛిక ప్రశ్నలను తయారు చేసుకోవాలి. సమాచార నైపుణ్యాల కోసం పాఠ్యపుస్తకం పరిధి దాటి దినపత్రికల్లో వచ్చిన దత్తాంశాలను తరగతి గదిలో విశ్లేషణ చేయాలి. ఉదాహరణకు ఉష్ణోగ్రతలు, వర్షాలు, చలి తీవ్రత, భూగర్భజలాలు, రాజకీయ పార్టీల ఎన్నికల ఫలితాలు తదితరాలను అడగొచ్చు. పట నైపుణ్యాల కోసం ప్రపంచ పటం, భారతదేశ పటాలను అట్లాస్‌లో పరిశీలించి సాధన చేయాలి. ప్రశంస, సున్నితత్వం కోసం కరపత్రం, నినాదాలు, ఉత్తరాలను సాధన చేయాలి.

posted on 22.11.2016