Ask the Expert
|
Feed Back
|
About us
|
Contant us
|
Pratibha Home
 

* తల్లిదండ్రులు విద్యార్ధుల్లో పదోతరగతి వార్షిక పరీక్షలపై గుబులు             * సమగ్ర నిరంతర మూల్యాంకనం(సీసీఈ)పై సందేహాలెన్నో..
* బట్టీకి స్వస్తి చెప్పాల్సిందే..                                                          * 'ఈనాడు' ఫోన్ఇన్‌లో నిపుణుల సమాధానాలు


* ప్రశ్న: వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్నాయి. ఇప్పుడు సీసీఈ విధానం అంటే పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది కదా.. మార్కులు ఎలా వస్తాయి. - రంగారెడ్డి, డాక్టర్ రెడ్డీస్‌లో ఉద్యోగి
జ: సీసీఈ విధానం అనేది కొత్తగా ఈ ఏడాది ప్రవేశ పెట్టినది కాదు. గత మూడు, నాలుగు ఏళ్ల నుంచి రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. కానీ ఈ విషయాన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పట్టించుకోలేదు. త్రైమాసిక, అర్థవార్షిక, వార్షిక పరీక్షలు ప్రభుత్వ పరీక్ష పత్రాల్ని కాకుండా సొంతంగా తయారు చేసుకున్న వాటితోనే నిర్వహిస్తున్నారు. తాజాగా పదోతరగతిలో కూడా సీసీఈ ద్వారానే పరీక్షలు నిర్వహించే సరికి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఈ విధానం బట్టీ పట్టే చదువులకు స్వస్తి చెప్పే దిశగా జరిగిన సంస్కరణ. ఆలోచనాత్మక చదువులకు స్థానం కల్పించడం.

* ప్రశ్న: కొత్త విధానంలో సాంఘికశాస్త్రంపై విద్యార్థులకు పూర్తిస్థాయి అవగాహన రావాలంటే ఎలా. పాఠాలు ఎలా చదివించాలి. - సాయెరాబాను, టీచరు, భాష్యం ఉన్నత పాఠశాల, హైదరాబాద్
జ: విద్యార్థులు పాఠ్యపుస్తకాల్ని పూర్తిగా చదివేలా చూడండి. గతంలో సాంఘికశాస్త్ర బోధన విషయంలో ఒక అపోహ ఉండేది. విద్యార్థులు పుస్తకం తెరవకూడదని, ఉపాధ్యాయుడు కూడా పాఠ్యపుస్తకం చూడకుండానే పాఠం చెప్పాలనే అంతా కోరుకునే వారు. కొత్త విధానం ద్వారా పాఠం చదివి దాన్ని నిత్యజీవితంలోని అంశాలతో అనుసంధానం చేసుకుంటూ బోధించాలి. విద్యార్థులు కూడా అలానే చదువుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పాఠ్యపుస్తకాన్ని అర్థవంతంగా అధ్యయనం చేయాలి.

* ప్ర: వార్షిక ప్రశ్నపత్రం నమూనా ఎలా ఉంటుంది. పాఠం వెనుక ఉన్న ప్రశ్నలే వస్తాయా. అంతు చిక్కడం లేదు. - సుప్రజ, గృహిణి, మారుతీనగర్
జ: 80శాతం ప్రశ్నలు పాఠంలోంచే వస్తాయి. 20 శాతం మాత్రం విద్యార్థుల ప్రాజెక్టులు, రాత అంశాలు, టెస్టులు ఇతర అంశాలలో భాగంగా పాఠశాల సంబంధిత ఉపాధ్యాయులు ఇస్తారు. ఇక్కడ ఒక అంశం గుర్తించాలి. పాఠం వెనుక ప్రశ్నలు అదే విధంగా ఇవ్వరు. వాటికి మార్పులు, చేర్పులు చేసి కొత్తగా, గతంలోని తీరుకు భిన్నంగా ప్రశ్నిస్తారు. అంటే ప్రశ్నించే తీరులో వైవిధ్యం ఉంటుంది. దాన్ని గుర్తించి సొంతంగా జవాబులు రాయాలి.

* ప్ర: ప్రశ్న పత్రం ఎలా ఉంటుంది. ఏ ప్రశ్నలకు ఎన్ని మార్కులు వస్తాయి. వివరిస్తారా. - సుధాకర్, అత్తాపూర్., శ్రీనివాస్, ఉప్పల్
జ: ప్రశ్న ప్రతంలో 4 రకాల ప్రశ్నలు ఉంటాయి. అవి.. వ్యాసరూప ప్రశ్నలు నాలుగు, లఘు సమాధాన ప్రశ్నలు ఆరు, అతి లఘు సమాధానాలు ఏడు, బహుళైచ్చిక ప్రశ్నలు పది వస్తాయి. 20 శాతం మార్కులు మాత్రం పాఠశాల నుంచి ఇస్తారు. విద్యార్థులు పాఠం అంతా చదువుకుని ఉంటే వారిలో విషయ పరిజ్ఞానం ఎలా ఉంది.. అనే కోణంలో పరీక్షించేందుకు ప్రశ్నల్ని వేస్తారు. త్రైమాసికలో వచ్చిన రీతినే మళ్లీ ప్రశ్నపత్రం ఉంటుంది.

* ప్ర: మా కుమార్తె గణితంలో పెద్ద ప్రశ్నలు బాగానే చేస్తున్నా... అందులోని చిన్న, చిన్న ప్రశ్నలు మాత్రం చేయలేపోతుంది. వార్షిక పరీక్షల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. - మాధవి, కృష్ణానగర్, ఎల్లారెడ్డిగూడ
జ: ఇలాంటి పిల్లలకోసమే ఈ కొత్త విధానం అందుబాటులోకి తెస్తున్నాం. వాస్తవంగా పిల్లలకు ఆయా అంశాలపై పూర్తిగా అవగాహన కల్పించే దిశగా ఈ విధానం ఉంటుంది. ఉదాహరణకు భిన్నాలు అనే అంశం ఉందనుకోండి... దానిపైనా విద్యార్థులకు పూర్తి అవగాహన దిశగా పాఠ్యాంశాలు సిద్ధమయ్యాయి. ఆ విషయం అంతా తెలిస్తే అందులో చిన్న ప్రశ్న, పెద్ద ప్రశ్న అనే తేడా ఏమీ ఉండదు కదా. బట్టీ పట్టి గుర్తుపెట్టుకోవాల్సిన పని ఉండదిక.

* ప్ర: సొంతంగా జవాబులు రాయాలి కదా. అయితే హిందీ పరీక్షలు ఎలా. అర్థం కావడం లేదు. కాస్త వివరించండి. - అనురాగ్, పదో తరగతి విద్యార్థి, భాష్యం పాఠశాల
జ: పాఠం పూర్తిగా అవగాన చేసుకున్న తర్వాత అందులోని ముఖ్యమైన విషయాల్ని నోట్సు రూపంలో రాసుకోండి. ఆ అంశానికి సంబంధించిన ప్రశ్న వచ్చినప్పుడు తెలిసిన విషయాల్ని నేరుగా రాసేయండి. గతంలో గైడులో ఉన్నట్లో, ఆల్ ఇన్ వన్‌లో ఉన్నట్లో రాయాల్సిన పనిలేదు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బుల్లెట్ పాయింట్లు, మంచి పదాలు, వాక్యనిర్మాణం, సరైన సమాధానం, పేరాలుగా విడగొట్టడం, సొంతంగా ఆలోచించి క్లుప్తంగా రాయడం కీలకం.

* ప్ర: గణితం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రంలోని ప్రశ్నలకు జవాబులు ఎలా రాయాలి.పాఠం వెనకాల ఉన్న ప్రశ్నలు రావని చెబుతున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి. - భాగ్యలక్ష్మి, గృహిణి, మోహన్‌నగర్, కొత్తపేట
జ: ఈసారి మాత్రం పుస్తకం వెనుక ఉన్న ప్రశ్నలు యథాతథంగా రావు. గైడ్లు, క్వచ్చన్ బ్యాంకులు లేకుండా నేరుగా పాఠ్యపుస్తకాలు మాత్రమే చదవాలి. అందులోని అంశాల్ని అర్థం చేసుకుని సొంతంగా జవాబులు రాయాలి. కొన్ని సందర్భాల్లో ప్రశ్నలు పుస్తకం మధ్యలోంచి కూడా అడిగే అవకాశం ఉంది.

* ప్ర: పదోతరగతి వార్షిక పరీక్షల్లో నమూనా పత్రం ఎలా ఉంటుంది. - మాధవి ఠాకూర్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా
జ: త్రైమాసిక పరీక్ష పత్రం ఎలా ఉంటుందో సరిగ్గా అదేరీతిలో అర్థవార్షిక ప్రశ్నపత్రం, వార్షిక పరీక్ష పత్రం అలానే ఉంటుంది. హిందీ మినహా ప్రతి సబ్జెక్టులోనూ రెండేసి పేపర్లు ఉంటాయి. ఈ సారి ప్రత్యేకంగా పరీక్ష పేపరును విద్యార్థి పూర్తిగా చదవి అర్థం చేసుకోవడానికి అదనంగా 15 నిమిషాల సమయం కూడా ఇవ్వడం జరిగింది.

* ప్ర: పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి. కొత్త ప్రశ్న పత్రం ప్రకారం ప్రిపరేషన్‌లో మార్పులు ఉంటాయా. - నీలిమ-కూకట్‌పల్లి., రాధిక-వారాసిగూడ., సుప్రజ-ఉప్పల్ 10వ తరగతి విద్యార్థిని, శ్రీనివాసరావు- వనస్థలిపురం, వరలక్ష్మి-సాయినాథపురం, దినకరన్-హైదరాబాద్.
జ: సీసీఈ ప్రశ్నపత్రం ప్రకారం విద్యార్థులు సొంతంగా జవాబులు రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ తరహాలో ప్రశ్నలు ఉంటాయి. సొంతంగా అంటే ఏవో తెలిసిన సమాధానాలు కాకుండా పుస్తకం చదివి అర్థం చేసుకుని అందులోని అంశాలకు నిత్యజీవిత అనుభవాల్ని/ ఉదాహరణల్ని/ సన్నివేశాల్ని జోడించి జవాబులు రాయాల్సి ఉంటుంది.

* ప్ర: వార్షిక పరీక్షల్లో గణితంలో ఎక్కువ మార్కులు సాధించడం ఎలా.. -వి.వి.వి. ప్రసాద్-ప్రైవేటు ఉద్యోగి., రాధిక, పదో తరగతి విద్యార్థిని,ఉప్పుగూడ., అరుంధతి-సికింద్రాబాద్
జ: పుస్తకంలో ఇచ్చిన డూ దిస్, ట్రై దిస్, థింక్ అండ్ డిస్కస్ అనే అంశాల్ని బట్టీ పద్ధతిన కాకుండా బాగా సాధన చేయాలి. అవగాహనతో ఆలోచించి సమస్యల్ని సాధిస్తే ఎక్కువ మార్కులు సాధించడం పెద్ద కష్టమైన పనేంకాదు. ఈ ప్రయత్నం అనేది ఇప్పటి నుంచే మొదలు కావాలి.

* ప్ర: సాంఘిక శాస్త్ర ప్రశ్నలు ఎలా వస్తాయి. - శ్రీనివాస్-ఘట్‌కేసర్, శ్రీనివాస్-ఐడీపీఎల్ కాలనీ
జ: సాంఘిక శాస్త్రంలో ప్రధానంగా ఈ అంశాల ప్రాతిపదికన ఉంటాయి. అవి..విషయ అవగాహన, ఏదైనా ఇచ్చిన అంశాన్ని చదివి అభిప్రాయాల్ని వ్యక్తం చేసేవి, సమాచార సంబంధ ప్రశ్నలు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందించేవి ప్రశ్నించేవి, మ్యాప్‌రీడింగ్, ఉత్తమ మానవ లక్షణాలను పెంపొందించే రీతిలో ప్రశ్నలు ఉంటాయి.

* ప్ర: ఐఐటీ తరహా ప్రశ్నలు వస్తాయా. అసలు ప్రశ్నలు ఎక్కడి నుంచి ఇస్తారు. మా కుమార్తె ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. మాకు ఇప్పటికీ ఈ విషయంలో గందరగోళంగా ఉంది. - నళిని, మెహదీపట్నం
జ: ప్రశ్నలు పుస్తకం వెనుక ఉన్నట్లుగా రావు, ఐఐటీలో అడిగే విధంగానే అవగాహన, అలోచన, అనుప్రయుక్తములతో కూడిన ప్రశ్నలు మాత్రమే వస్తాయి. మీ పాప చదివే పాఠశాలకు వెళ్లి అక్కడ ఉపాధ్యాయులు ఆమెకు పాఠం ఎలా బోధిస్తున్నారు అనే విషయాన్ని ప్రత్యక్షంగా చూడండి. పిల్లలకు పాఠ్యపుస్తకంలోని అన్ని విషయాలపైనా సంపూర్ణ అవగాహన ముఖ్యం.

* ప్ర: మా పిల్లవాడు ఆల్ ఇన్ వన్ చదువుతున్నాడు. మంచి మార్కులు వస్తాయా.. బాగా మార్కులు రావాలంటే ఏం చదవాలి.. - జనార్దన్ రెడ్డి, కొత్తపేట
జ: కొన్ని రకాల పుస్తకాలు విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి దోహదపడకపోగా వారిని బట్టీపట్టే మరయంత్రంగా తయారు చేయడానికి పనికొస్తున్నాయి. కొన్ని పాఠశాలలు వాటినే చదవాలనీ ఒత్తిడి చేస్తున్నాయి. ఇవి కేవలం పరీక్షల్లో మార్కులు సంపాదించడానికే కానీ విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీయడం లేదు. అలాంటి పుస్తకాలు చదివితే ఎక్కువ మార్కులు అలా ఉంచితే ఉన్న మార్కులు కూడా పోయే ప్రమాదం ఉంది.అలాంటి పుస్తకాలపైన దృష్టి పెట్టవద్దు. ముఖ్యంగా పాఠ్యపుస్తకాలపైనా ఎక్కువ దృష్టి పెట్టాలి.పాఠాన్ని పూర్తిగా అర్థం చేసుకుని చదవాలి.

* ప్ర: మా అమ్మాయి చదువులో కాస్త వెనుకబడి ఉంది. మార్కులు తక్కువగా వస్తాయి. కొత్తగా సీసీఈ విధానంలో ఆమె చదువగలుగుతుందా. - సత్యవేణి, షాపూర్
జ: ఇది చాలా మంది ప్రశ్న. సరిగ్గా అలాంటి విద్యార్థులకు ఈ విధానం మేలు చేస్తోంది. ఎందుకంటే బాగా మార్కులు రాని విద్యార్థులకు బట్టీపట్టే సామర్థ్యం లేదనేది స్పష్టం అవుతోంది. కానీ సీసీఈ విధానం మూలంగా అలాంటి విద్యార్దులకు తాము చదివి అర్థం చేసుకున్న విషయాల్ని సొంతంగా వ్యక్తికరించే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే వారికి ఈ విధానం మేలైంది.

* ప్ర: సీబీఎస్ఈ పరీక్ష పత్రంలోనూ మార్పులు ఉంటాయా.. - విష్ణు, 10వ తరగతి విద్యార్థి, సైనిక్‌పురి.
జ: సీబీఎస్ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉంటాయి. వాటిలో మార్కులు ఉండవు. కానీ రాష్ట్ర సర్కారు నిర్వహించే పరీక్షలు మాత్రం మన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రీతిగా నిర్వహిస్తున్నా పరీక్ష పత్రంలో మార్పులు ఉంటాయి.

* ప్ర: మంచి మార్కులు సాధించడం ఎలా.. గైడ్లను బట్టీ పట్టడం వల్ల ప్రయోజనం ఉందా.. - లోకేశ్-గుండ్లపోచంపల్లి, అనిత-బీరప్పగడ్డ, జ్యోత్స్న-దిల్‌సుఖ్‌నగర్, కనకదుర్గ-బడంగ్‌పేట, నాగేశ్వరరావు-చైతన్యపురి
జ: ముందుగా ప్రశ్నను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి. సమాధానాలను దోషరహితంగా, సూటిగా రాస్తే సరిపోతుంది. విషయం లేకుండా పేజీలకు పేజీలు నింపడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. బట్టీ పట్టి రాస్తామంటే కుదరదు. ఇక నుంచి గైడ్లలో ఉన్న ప్రశ్నలు యథాతథంగా పరీక్షల్లో రావు. అందుకే బట్టీ విధానానికి స్వస్తి పలకాలి. గైడ్లు, ఆల్ఇన్‌వన్‌లు, క్వశ్చన్ బ్యాంకుల వల్ల ప్రయోజనం లేదు. జీవో నం.17 ప్రకారం ప్రభుత్వం వాటిని నిషేధించింది. ఆలోచించి సమాధానాలు రాస్తేనే మార్కులు ఎక్కువగా వస్తాయి.

* ప్ర: పిల్లలకు ఎక్కువగా ప్రాజెక్టు వర్క్ ఇస్తున్నారు. ఇంట్లో అది చేయడానికే సరిపోతోంది. చదివేదెప్పుడు. - వాణీచందర్-వీవీనగర్, పుష్పలత-వనస్థలిపురం, లలితాదేవి-కేపీహెచ్‌బీ, స్పందన-లింగంపల్లి, బాలకృష్ణారెడ్డి-మెహిదీపట్నం
జ: పిల్లలు ప్రాజెక్టు వర్క్‌ను ఉపాధ్యాయుల సమక్షంలోనే చేయాలనే నిబంధన ఉంది. ఇందుకు తప్పనిసరిగా ఒక పీరియడ్ కేటాయించాలి. ఆ సమయంలో విద్యార్థుల్లో తలెత్తే అనుమానాల్ని నివృత్తి చేసేందుకు ఆస్కారముంది. ఉపాధ్యాయులు తప్పించుకునేందుకే ఇంటి వద్ద ప్రాజెక్టు వర్క్‌కు పురమాయిస్తున్నారు. అలా చేస్తే ఫిర్యాదు చేయొచ్చు.

* ప్ర: ఎలాంటి ప్రశ్నలిస్తారు. ఎలా సన్నద్ధమవ్వాలి. - కల్పన-హిమాయత్‌నగర్, అనూజ-కోఠి, పర్వీన్-అంబర్‌పేట, హంసిని-లంగర్‌హౌస్, జ్యోతి-సనత్‌నగర్, సూరజ్‌సింగ్-మేడ్చల్
జ: సామర్థ్యాల ఆధారంగా ప్రశ్నలుంటాయి. పుస్తకంలో ప్రశ్న ఉన్నది ఉన్నట్లుగా వచ్చే అవకాశం లేదు. సిద్ధాంతాలు బట్టీ పడితే లాభం లేదు. సిద్ధాంతాల ఆధారంగా మాత్రమే ప్రశ్నలుంటాయి. ప్రస్తుతం జరుగుతున్న త్రైమాసిక, అర్ధవార్షిక పరీక్షాపత్రాల మాదిరిగానే వార్షిక పరీక్ష ఉంటుంది. 50శాతం ప్రశ్నలు సులభంగా, 30శాతం ఆలోచిస్తే సమాధానాలు వచ్చేలా ఉంటాయి. కేవలం 20శాతం మాత్రమే కష్టతరంగా ఉంటాయి. కాబట్టి ఆలోచనాశక్తిని పెంపొందించుకోవాలి.

* ప్ర: భాషాపరీక్షల్లో వ్యాకరణ ప్రశ్నలు ఎలా ఉంటాయి.. - జయగణేష్-అంబర్‌పేట, రాజు-ఉప్పల్
జ: తెలుగు, హిందీల్లో మల్టీపుల్ ఛాయిస్‌గా ఉంటాయి. ఆలోచించి గుర్తించేలా ఉంటాయి. ఆంగ్లంలో ఒక పేరాఇచ్చి తప్పులను సరిచేయాలని సూచిస్తారు. ఈ పేపర్ భాషా సామర్థ్యాల ఆధారంగా ఇస్తారు.

* ప్ర: సొంతంగా జవాబు రాస్తే దిద్దేవాళ్లకు నచ్చకుంటే ఎలా.. - జి.స్పందన, కైలాష్‌నగర్-లింగంపల్లి
జ: రాసే విధానాన్ని, వివరించిన తీరును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అభిప్రాయాలను ప్రామాణికంగా తీసుకోరు.
* ప్ర: కార్పొరేట్ పాఠశాలల్లో సంస్కరణల్ని అమలు చేయకుండా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఏం చర్యలు తీసుకుంటారు. - వీణ, చందానగర్
జ: ప్రతీ పాఠశాలలో సంస్కరణల్ని అమలు చేయాల్సిందే. అలా చేయకుండా ఇబ్బంది పెడుతుంటే టోల్‌ఫ్రీ నం: 18004253525కి ఫిర్యాదు చేయొచ్చు. సంస్కరణల అమలుపై రాష్ట్రవ్యాప్తంగా పరిశీలన జరుపుతున్నాం.

* ప్ర: కార్పొరేట్ స్కూళ్లలో పుస్తకాలు విపరీతంగా ఇస్తున్నారు. ప్రయోజనముందా. - జ్యోత్స్న, దిల్‌సుఖ్‌నగర్
జ: కార్పొరేట్ స్కూళ్లలో కేవలం బిజినెస్ కోసమే ఎక్కువ పుస్తకాలు ఇస్తున్నారు. పరీక్షల్లో మాత్రం పాఠ్యపుస్తకాల ఆధారంగానే ప్రశ్నాపత్రం ఉంటుంది. ఈ విషయమై తల్లిదండ్రులు కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలను గట్టిగా అడగాలి.

* ప్ర: పరీక్షల్లో ఎక్కువ మార్కులు సంపాదించడానికి టిప్స్ ఏమిటి. వివరిస్తారా. - రవి, బడంగ్‌పేట, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్
జ: పిల్లలు పుస్తకం మొత్తం చదివి అవగాహన చేసుకుని ఆ తర్వాత తమకు నచ్చిన రీతిలో సమాధానాలు రాయడానికి ఇది ఒక చక్కటి అవకాశం. ఎంత సృజనాత్మకంగా జవాబులు రాస్తే... అంత మెరుగ్గా మార్కులు వస్తాయి. మంచి భాష ఉపయోగించడం, పరీక్షలో విషయ వ్యక్తీకరణ సూటిగా స్పష్టంగా ఉండాలి. సంబంధిత పదజాలాన్ని (సాంకేతిక, శాస్త్రీయ, విషయ సంబంధ) వాడాలి. సరైన ఉదాహరణలు ఇవ్వడం, అర్థవంతంగా రాయడం ముఖ్యం కానీ ప్రత్యేకంగా టిప్స్ అనేవి లేవు.

భాషా పరీక్షల్లో పట్టు ఇలా..
* రీడింగ్ కాంప్రహెన్షన్‌పై పట్టు సాధించి ఎక్కువ మార్కులు సాధించాలంటే పిల్లలు సొంతంగా చదివి, అర్థం చేసుకొని, స్పందించేలా తరగతి గదిలో అవకాశం కల్పించాలి.
* పదజాలం, వ్యాకరణం విషయాలపై పట్టు రావాలంటే ఎడిటింగ్ విధానం గురించి అనుభవం కలిగించాలి.
* సృజనాత్మక విభాగంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే.. విద్యార్థి దైనందిన జీవిత విశేషాలను, పాఠ్య పుస్తక విషయాలతో అనుసంధానం చేసి తరగతి బోధనలో అంతర్భాగం చేయించాలి.
* విద్యార్థులు స్వీయరచన, సృజనాత్మక రచన, నిజజీవిత అనుభవాలు ప్రతిబింబించేలా తరగతి గది కృత్యాలను రూపొందించుకోవాలి.

ఉత్తీర్ణత ఇలా..
* పరీక్షకు సంబంధించి ఒక్కో సబ్జెక్టులోని రెండు ప్రశ్నాపత్రాల్లో కలిపి 80 మార్కులకు తప్పనిసరిగా 28 మార్కులు రావాలి. మూల్యాంకనంతో కలుపుకొని 35 మార్కులు వస్తే పాసైనట్లు లెక్క.
* ఒకవేళ మూల్యాంకనంలో సున్నా మార్కులొచ్చినా పరీక్షలో 35 మార్కులొస్తే పాసైనట్లే.
* అలా కాకుండా మూల్యాంకనంలో 20 మార్కులొచ్చినా సరే పరీక్షలో 28 మార్కులు రాకపోతే అనుత్తీర్ణులుగా పరిగణిస్తారు.
* సెకండ్ లాంగ్వేజ్‌లో అయితే పరీక్షల్లో 16 మార్కులు తప్పనిసరి. మూల్యాంకనంతో కలిపి 20 మార్కులొస్తే ఉత్తీర్ణులవుతారు. మూల్యాంకనంలో సున్నా వచ్చినా.. పరీక్షలో 20 వస్తే సరిపోతుంది.

80 మార్కులకే పరీక్ష
* పదో తరగతిలో గతంలో ప్రతీ సబ్జెక్టుకు వంద మార్కుల ప్రశ్నపత్రం ఉండేది. ఈసారి నుంచి 80 మార్కులకే ఉంటుంది. రెండు పేపర్లు 40 మార్కుల చొప్పున ఉంటాయి.
* ఒక్కో పేపర్‌లో వ్యాసరూప ప్రశ్నలు 4 (10-15 వాక్యాలు), లఘురూప ప్రశ్నలు 6 (5 వాక్యాలు), అతిలఘు ప్రశ్నలు 7 (1-2 వాక్యాలు), ఆబ్జెక్టివ్(లక్ష్యాత్మక) ప్రశ్నలు 10 ఉంటాయి.
* వ్యాసరూప ప్రశ్నకు 4, లఘు ప్రశ్నకు 2, అతిలఘు ప్రశ్నకు 1, లక్ష్యాత్మక ప్రశ్నకు అర మార్కు చొప్పున ఉంటాయి.
* మిగిలిన 20 మార్కులు ఫార్మటివ్ అసెస్‌మెంట్ (నిర్మాణాత్మక మూల్యాంకనం)కు ఇస్తారు. ఒక్కో మూల్యాంకనానికి 5 మార్కుల చొప్పున నాలుగుంటాయి. మొదటి మూల్యాంకనం ప్రాజెక్టు వర్క్, రెండోది స్లిప్ టెస్ట్, మూడోది పుస్తకంలో ప్రశ్నలకు సొంత జవాబులు రాసే రాత పని. కాగా నాలుగోది సబ్జెక్ట్ వారీగా ఉంటుంది. సైన్స్ అయితే ల్యాబ్ రికార్డులు సమర్పించడం, సోషల్ అయితే సమకాలీన సంఘటనపై నివేదిక తయారుచేయడం, భాష అయితే పుస్తక సమీక్ష చేయాల్సి ఉంటుంది. ఈ మూల్యాంకనాన్ని ఆయా పాఠశాలల్లోనే అంతర్గతంగా నిర్వహించి మార్కుల వివరాలను బోర్డుకు పంపించాల్సి ఉంటుంది.

15 నిమిషాల అదనపు సమయం
ఈసారి పరీక్షలకు 15 నిమిషాల అదనపు సమయం ఇవ్వనున్నారు. పరీక్ష పత్రాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవడం కోసం దీన్ని కేటాయించారు. ద్వితీయ భాష మినహాయించి ఒక్కో పేపర్‌కు 2.30 గంటల సమయం(15 నిమిషాలు అదనం) ఉంటుంది. అలాగే ద్వితీయ భాష లేదా 80 మార్కులకు నిర్వహించే పరీక్షకు మూడు గంటల సమయం(15 నిమిషాలు అదనం) ఉంటుంది.

భాషేతర శాస్త్రాల్లో ఇలా..
* భాషేతర విషయాల్లో బట్టీ పట్టకుండా స్వయంగా పాఠాల్ని చదివి, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమాజసభ్యులతో చర్చించి తగిన సమాచారం సేకరించి, విశ్లేషించుకుని వ్యాఖ్యానించుకునే రీతిలో చదువు సాగాలి.
* విద్యార్థులు జ్ఞానాన్ని గ్రహించడం కాకుండా దాని నిర్మాణ ప్రక్రియలో వారే ప్రధాన భాగస్వాములయ్యేలా చదవాలి.
* కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా అదనపు సమాచారం కోసం రెఫరెన్స్ పుస్తకాలు, ఇతర గ్రంథాలు, వార్తాపత్రికలు చదివి, తోటి విద్యార్థులతో అనుభవాల్ని పంచుకోవాలి.
* పిల్లల్లో బహుముఖ ఆలోచన ప్రక్రియలకు అవకాశం ఉండే రీతిలో చదువుకొనసాగాలి.
* పరీక్షలు చదువులో అంతర్భాగం, జ్ఞానాన్ని మెరుగు పర్చడానికి దోహదకారులు కావాలి. ముఖ్యంగా భాషేతర విషయాలు పిల్లల్లో ప్రక్రియా నైపుణ్యాలను వెలికి తీయడానికి దోహదం చేస్తాయి. దానికి అనుకూలంగా అభ్యసన ప్రక్రియ ఉండాలి.

సంస్కరణల ఉద్దేశం
పాఠశాల విద్యార్థులను కేవలం పరీక్షలకు సన్నద్ధం చేసే సంస్థగా పరిణమించడం ఆందోళన కలిగిస్తున్న తరుణంలో గత మే 14న 9, 10 తరగతుల పరీక్షల సంస్కరణల గురించి జీవోఎంఎస్ నం.17ను సర్కారు జారీ చేసింది. కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థులు గైడ్లు, ప్రశ్నల బ్యాంకులు, స్టడీ మెటీరియళ్లను ఆశ్రయించి బట్టీ పడుతున్నారు. మార్కులు, ర్యాంకుల కోసం అనాలోచితంగా కుస్తీ పడుతున్నారు. ఈక్రమంలో మానసిక ఒత్తిడికి గురవుతూ.. పాఠశాలలు జ్ఞానార్జన కేంద్రాలకు బదులుగా కోచింగ్ సెంటర్ల పాత్రకు పరిమితమవుతున్నాయి. ఈనేపథ్యంలో విద్యార్థుల్లో అన్వేషణ తత్వాన్ని పెంచడం, రిఫరెన్స్ పుస్తకాలను చదివేలా చేయడం, విచక్షణా జ్ఞానాన్ని, విశ్లేషణా నైపుణ్యాలను పెంచడం సంస్కరణల ముఖ్య ఉద్దేశం. ఈక్రమంలోనే ప్రాజెక్టు పనులు, ప్రయోగాలు, అసైన్‌మెంట్లు, పిల్లల భాగస్వామ్యం.. తదితర అంశాలనూ మూల్యాంకనంలో భాగం చేశారు.

posted on 15-12-2014