close

Ask the Expert
|
Feed Back
|
About us
|
Contant us
|
Pratibha Home

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల ప్రిప‌రేష‌న్

తెలుగు

తెలుగు.. తేలికే కదా అని ఆదమరిస్తే మొదటికే మోసం వస్తుంది. సరిగా చదివితే నిజానికి సులభంగానే ఉంటుంది. పాదభంగాలు లేకుండా పద్యాలు రాయడానికి పద్యాలను కంఠస్థం చేయాలి. వ్యక్తీకరణ అంశాల్లో అభ్యర్థి సృజనాత్మకతను ప్రదర్శించాలి. అప్పుడే మంచి మార్కులు సొంతమవుతాయి.

తెలుగు భాష విషయంలో ‘చేతిరాత’ ముఖ్యమైంది. అందువల్ల స్పష్టంగా అర్థమయ్యేలా రాయాలి. ప్రతి ప్రశ్న దగ్గర అక్షర దోషాలు లేకుండా రాస్తే 1 మార్కు కేటాయించాలని ఉంది.అందుకే అక్షర దోషాల్లేకుండా, విరామ చిహ్నాలను పాటిస్తూ, పేరాలుగా విభజించి రాయాలి. వాక్య నిర్మాణం లోపిస్తే చెప్పాలనుకున్న భావం వేరే అర్థంగా మారిపోయే ప్రమాదం ఉంది. రాసేటప్పుడు పూర్తి వాక్యనిర్మాణాన్ని మనసులో అనుకొని ఒక్కొక్కటిగా పూర్తి చేయాలి. కొట్టివేతలు లేకుండా జాగ్రత్త పడాలి.

ప్రతి పాఠంలోని సారాంశ భావనలను జ్ఞాపకం ఉంచుకోవాలి. పరీక్ష కేంద్రంలో పూర్తి ఏకాగ్రతతో ఉండాలి. ఆలోచనలకు పదును పెట్టాలి. సామర్థ్యాల వారీగా ప్రశ్నలు వస్తాయి కాబట్టి అవగాహన చేసుకోవాలి. పాఠ్యాంశాల నుంచి సామర్థ్యాల ఆధారంగా చదివిన అంశాన్ని అనుసంధానం చేసి, సొంతమాటల్లో రాయాలి.

ప్రశ్నపత్రం చదవడానికి 15 నిమిషాలు కేటాయించి, ప్రశ్నలను అర్థం చేసుకోవాలి. ఏ విభాగంలో ఎన్నో ప్రశ్నకు సమాధానం రాస్తున్నారో ఆ ప్రశ్న సంఖ్యను వేయడం మరవద్దు. పరీక్షలో ఏ ప్రశ్నకైనా దానికి కేటాయించిన మార్కులను బట్టి జవాబు రాయాలి. బహుళైచ్ఛిక సమాధానాల విషయంలో ఒకేసారి నిర్ణయానికి రావద్దు. ఆలోచించిన తర్వాతే జవాబును గుర్తించండి. పరీక్షలో తొలి ప్రశ్నకు మనమిచ్చే జవాబు మనలోని రచనా శక్తి తెలిపేలా ఉండాలి. మన నైపుణ్యం మొదటి జవాబుతోనే అర్థమయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి. మిమ్మల్ని అంచనా వేయడంలో మీరు రాసే తొలి సమాధానం కీలకం.

పేపర్లవారీగా సామర్థ్యాలు
పబ్లిక్‌ పరీక్షలో తెలుగు రెండు పేపర్లుగా ఉంటుంది. పేపర్ల వారీగా సామర్థ్యాలను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అవగాహన లేకుంటే మనం చదివే విషయాలు తారుమారు అవుతాయి. ఏ పేపరులో ఏ సామర్థ్యం ఉంటుందనేది స్ఫురణలో ఉండాలి. పేపర్‌- 1లో స్వీయరచన, పదజాలం; పేపర్‌- 2లో అవగాహన- ప్రతిస్పందన, సృజనాత్మకత, వ్యాకరణాంశాలుంటాయి.

స్వీయరచన: పాఠ్యాంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. ఎందుకంటే ప్రశ్నలు పుస్తకంలోనివి ఉన్నవి ఉన్నట్లుగా రావు. పాఠం ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. పరీక్షలో విషయాన్ని సొంత మాటల్లో అడిగిన విధంగా రాయాలి. మంచి పదజాలం ఉపయోగించాలి. వాక్యనిర్మాణ క్రమం చూసుకోవాలి. పాఠాల్లోని అంశాలు, వాక్యాలను వివరించడం, అభిప్రాయం చెప్పడం, సమర్థించడం, విభేదించడం, కారణాలు రాయడం, ప్రత్యక్ష భాగస్వామి అయినప్పుడు ఎలా స్పందిస్తారో సరిచూసుకోవడం చేయాలి. పాఠ్యాంశాల్లోని అంతరార్థాలను గ్రహించాలి.

పదజాలం: ప్రతి పాఠ్యాంశాల్లోని పదాలను పరిశీలనాత్మకంగా గ్రహించాలి. పదజాలంలో అడిగే విభాగాలు - అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, ప్రకృతి-వికృతి, వ్యుత్పత్త్యర్థాలు, సొంతవాక్యాలు. పుస్తకం చివర ఉన్న పదవిజ్ఞానాన్ని అనుసరించాలి.

పఠనావగాహన: చదివిన విషయాన్ని ముందుగా అవగాహన చేసుకోవాలి. అందులోని భావాన్ని తెలుసుకోవాలి. పరిచిత గద్యం, అపరిచిత గద్యం రెండుసార్లు చదవాలి. వాటిని ఏ రకంగా (ప్రశ్నలు అడిగి సమాధానాలు రాయడం, ప్రశ్నలు తయారుచేయడం, పట్టికగా ఇచ్చి అడగడం, తప్పొప్పులను గుర్తించడం మొదలైనవి) అడిగారో చూసుకొని జవాబులు రాయాలి. పరిచిత పద్యం పాఠ్యాంశాల నుంచి వస్తుంది. కాబట్టి ఆయా పాఠాల్లో కంఠస్థం చేయగల పద్యాలను నేర్చుకుని, పాదభంగం లేకుండా పూరించాలి. లేదా ప్రతిపదార్థం అడిగినట్లయితే రాయాలి.

సృజనాత్మకత: సృజనాత్మకతకు సంబంధించి వ్యవహారరూపం, సంభాషణలు, లేఖ, గేయం, కవిత, ఇంటర్వ్యూ ప్రశ్నావళి, వివాదాలు/సూక్తులు, కథ, వ్యాసం, కరపత్రం లాంటివి అంశాలుగా ఉంటాయి. మంచి పదజాలానికి ఊహాత్మక ఆలోచన ముఖ్యం. నూతనత్వం ఉండేలా చూడాలి. పోలికలు/ఉపమానాలు ఉపయోగించాలి. వాక్యనిర్మాణ క్రమం చాలా ముఖ్యం. సృజనకు పదునుపెడితే రాయగల నేర్పు అలవడుతుంది. సాధన చేయడం తప్పనిసరి.

అన్ని పాఠ్యాంశాల నుంచి కొత్త పదాలలో సంధులు, సమాసాలు, అలంకారాలను గుర్తించగలగాలి. బహుళైచ్ఛికంగా అడుగుతారు కాబట్టి తేడాలతో గుర్తించండి. వాక్యాల్లో సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త, కర్తరి, కర్మణి వాక్యాలతో పాటు, ప్రత్యక్ష, పరోక్ష కథనంలోకి మార్చడంలో తేడాలను తెలుసుకోవాలి. ఛంద‌స్సుపై అవగాహన ఉండాలి.

ఉపవాచక సాధన ఇలా...: ఉపవాచకం ‘రామాయణం’పై పట్టు సాధిస్తే పూర్తి మార్కులు సాధించవచ్చు. రామాయణంలోని ఒక్కొక్క కాండలోని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాండలవారీగా కథను గుర్తుంచుకుని సంపూర్ణ కథగా జోడించాలి. వ్యక్తులు, ప్రదేశాలనుబట్టి కాండాలను సంఘటనల క్రమాన్ని బట్టి కథను గుర్తుంచుకోవాలి. రామాయణానికి సంబంధించిన ప్రశ్నలు సిద్ధం చేసుకోవాలి. పాత్రల స్వభావాలను అంచనావేయాలి. విశ్లేషణాత్మక ఊహను పెంచుకోవాలి.

ముఖ్యమైన ప్రశ్నలు

లఘు సమాధాన ప్రశ్నలు
1. తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో - అన్న దాశరథి మాటలను సమర్థిస్తూ రాయండి?
2. నగరంలో తీరిక దక్కదు, కోరిక చక్కదు - ఎందుకో రాయండి?
3. అందరిలో చైతన్యం తేవడానికి మార్గం ఉపన్యాసం - సమర్థిస్తూ రాయండి?
4. పొత్తంబై కడు నేర్పుతో హితమునుద్బోధించు మిత్రుండు - దీనిపై మీ అభిప్రాయం రాయండి?
5. నరరూప రాక్షసుల గుణాలు ఎలా ఉంటాయి?
6. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరు ఏం చేస్తారో తెల్పండి.
7. ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష - సినారె మాటల్లో ఆంతర్యమేమిటి?
8. దొడ్డ బాల్వోవా - వృక్షం ప్రత్యేకత ఏమిటి?
9. ‘వ్రతము తప్పి భుజింపగ వలను గాదు’ - అన్న వ్యాసుడి మాటల్లో ఆంతర్యం రాయండి?
10. యుగాంతం కథ గొప్పతనం ఏమిటి?

సృజనాత్మక ప్రశ్నలు
1. దశ దిక్కులు బలి చక్రవర్తిని బళి బళి అని ఎందుకు పొగిడాయో విశ్లేషించండి?
2. ‘జీవన భాష్యం’ ద్వారా సినారె తెలిపిన జీవన విలువలు వివరించండి
3. గోలకొండ పట్టణ ప్రత్యేకతలను సొంత మాటల్లో రాయండి?
4. నెల్లూరి కేశవస్వామి కథలు కోహినూర్, జాకోబ్‌ వజ్రాలలాంటివి - వివరించండి?
5. శతక పద్యాలు మానవుల్లో నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందిస్తాయి. వివరించండి?
6. కొత్తబాట పాఠం ఆధారంగా ఆనాటి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయో రాయండి?
7. ఒకవేళ హిందూమతం, హిందువులు తమ చరిత్రను లిఖితబద్ధం చేయాలనుకుంటే సంస్కర్తగా భాగ్యరెడ్డి వర్మ పేరు మొదటి స్థానంలో ఉంటుంది - విశ్లేషించండి?
8. వ్యాసుడు పార్వతీదేవిల మధ్య జరిగిన సంభాషణలను బట్టి మీరేం గ్రహించారు?
9. పల్లె గొప్పతనం తెలుపుతూ వచన కవిత రాయండి?
10. గోలకొండ పట్టణ ప్రాశస్త్యాన్ని తెలుపుతూ కరపత్రం తయారు చేయండి.
11. కోపం పనికిరాదని తెలియజేసే ఒక కథను సొంత మాటల్లో రాయండి?

- గిర్ని అంజాగౌడ్‌

x

హిందీ

అసంబద్ధమైన దస్తూరి అపరిపక్వమైన విద్యకు నిదర్శనమని మహాత్మా గాంధీ అన్నారు. విద్యార్థులు సమాధానం రాసేటప్పుడు అక్షరాల ఆకృతి, పరిమాణం, వ్యవధి లాంటి దస్తూరి సూత్రాలను విధిగా పాటించాలి. పదాలను ఆకర్షణీయంగా తగిన పరిమాణంలో రాస్తే మూల్యాంకనం చేసేవారిని ఆకట్టుకోవచ్చు. సమాధానాలను క్లుప్తంగా, ఆకర్షణీయంగా, కీలక పదాలను ఉపయోగిస్తూ రాయాలి. కొట్టివేతలు, దిద్దుబాట్లు చేయకూడదు. అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకోవాలి. సమాధానాలను పెన్‌తోనే రాయాలి పెన్సిల్‌ను ఉపయోగించకూడదు.

తప్పనిసరిగా సెక్షన్, ప్రశ్న సంఖ్య వేయాలి. ఒక ప్రశ్నకు సమాధానాన్ని దాని ప్రాధాన్యతను బట్టి ఎంత మేర అవసరమో అంతే రాయాలి.

ఎక్కువగా రాయండి...
ప్రతి విషయాన్ని సాధన చేస్తూ రాయాలి. తద్వారా విషయాలు బాగా గుర్తుండి తప్పులు తగ్గుతాయి. రాతలో వేగం పెరుగుతుంది. హిందీని తెలుగులో అర్థం చేసుకొని చదవడం వల్ల సమాధానాలు సులువుగా రాయవచ్చు. సాధ్యమైనంత వరకు జవాబులను సొంతమాటల్లో రాసేందుకు ప్రయత్నించాలి. బట్టీపట్టడం వల్ల కొన్ని సందర్భాల్లో మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. హిందీలో మంచి మార్కులు పొందడంలో చేతిరాత కీలకమైంది. నిత్యం పాఠ్యపుస్తకంలోని ఏదో ఒక అభ్యాసాన్ని సాధన చేయడం అలవాటు చేసుకోవాలి. పదజాలం పెంచుకోవడానికి పాఠ్యాంశాలను ఏకాగ్రతతో చదవాలి. చక్కని పదజాలంతో విషయానికి తగిన భావాన్ని రాయాలి. సమాధానంలో విషయం అర్థమయ్యే విధంగా ఉండాలి. చదివిన విషయాన్ని మననం చేసుకుంటూ రాయడం వల్ల అక్షర దోషాలు తగ్గుతాయి. పేరాగ్రాఫ్‌లను విషయ అవగాహనతో ఒకటికి రెండుసార్లు చదవాలి.

పార్టు - A నుంచి విభాగం 1లో ‘అర్థ్‌గ్రాహ్యత ప్రతిక్రియా’ విద్యాప్రమాణానికి సంబంధించి నాలుగు భాగాలుగా విభజన చేశారు. ప్రతి భాగంలో ఒక్కో పేరాగ్రాఫ్‌లో గద్యాంశాలు/పద్యాంశాలతో కూడిన ప్రశ్నలు వస్తాయి. పేరాగ్రాఫ్‌ను శ్రద్ధగా ఒకటికి రెండుసార్లు చదివి, అవగాహన చేసుకొని ఇచ్చిన అయిదు ప్రశ్నలకు ఒక వాక్యంలో సమాధానాలు రాస్తే అయిదు మార్కులు మీ సొంతమవుతాయి.

గద్యభాగంలో చదవాల్సిన పాఠ్యాంశాలు...
1) ఈద్‌గాహ్‌
2) లోక్‌గీత్‌
3) అంతరాష్ట్రీయ స్తర్‌ పర్‌ హిందీ
4) స్వరాజ్య్‌ కీ నీఁవ్‌
5) దక్షిణీ గంగా గోదావరి
6) జల్‌ హీ జీవన్‌ హై
7) ధరతీ కే సవాల్‌ అంతరిక్ష్ కే జవాబ్‌

రెండో భాగం అపఠిత గద్యాంశ్‌ (గద్యభాగం)లో బాలసాహిత్యం ఉంటుంది. పేరాగ్రాఫ్‌ కింద అయిదు బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు ఉంటాయి. నాలుగు ఆప్షన్‌లలో సరైన సమాధానాన్ని గుర్తించాలి. కొట్టివేతలు లేకుండా రాయాలి లేదంటే మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. మూడో భాగంలో పద్యభాగం (పఠిత) నుంచి ఒక పద్యాంశాన్ని ఇస్తారు. దాన్ని క్షుణ్నంగా చదివి అర్థం చేసుకొని సమాధానాలు రాయాలి.

పద్యభాగంలో చదవాల్సిన పాఠ్యాంశాలు
1) బరస్‌త్‌ బాదల్‌
2) హమ్‌ భారత్‌వాసీ
3) కణ్‌ - కణ్‌ కా అధికారి
4) భక్తి పద్‌
5) నీతి దోహే

నాలుగో భాగంలో అపఠిత పద్యాంశం (ఆధునిక కావ్యం) ఉంటుంది. ఈ పద్యాంశానికి సమాధానాలను బహుళైచ్ఛిక ప్రశ్నల రూపంలో అడుగుతారు. వీటికి సరైన ఆప్షన్లను ఎన్నుకొని సమాధానపత్రంలో రాయాలి.

పై నాలుగు భాగాలను ఎక్కువగా సాధన చేసినట్లయితే 20 మార్కులు వస్తాయి.

విభాగం - IIలో సంక్షిప్త ప్రశ్నలన్నింటికీ నాలుగు వాక్యాల్లో జవాబులు రాయాలి. పద్య, గద్య పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ఒక ప్రశ్న రచయిత లేదా కవి గురించి అడుగుతారు. సుమిత్రానందన్‌ పంత్, మృదుల్‌ జోషి, ప్రేమ్‌చంద్, రామ్‌దారిసింహ్‌ దినకర్, భాగవత్‌ శరణ్‌ ఉపాధ్యాయ్, విష్ణు ప్రభాకర్, మీరాబాయి, రహీం, బిహారి కాకా కాలేలకర్, రైదాస్‌ లాంటి వారి గురించి తెలుసుకోవాలి. (4 × 4 = 16)

ముఖ్యమైన ప్రశ్నలు

విభాగం - IIIలో రెండు ప్రశ్నలు పద్యభాగం నుంచి అడుగుతారు. ఇందులో ఏదైనా ఒకదానికి పది వాక్యాల్లో విశ్లేషణాత్మకంగా, అభిప్రాయాలను తెలిపేవిధంగా, సారాంశాన్ని సమర్థిస్తూ రాయాలి. పాఠ్యాంశాలను క్షుణ్నంగా అర్థం చేసుకుంటే సులువుగా మార్కులు పొందవచ్చు. (1 × 7 = 7)
సూచన: బరస్‌తే బాదల్, కణ్‌ - కణ్‌ కా అధికారి, హమ్‌ భారత్‌వాసీ, భక్తి పద్‌లో నుంచి ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఈ పాఠ్యాంశాను శ్రద్ధగా చదవాలి.

ముఖ్యమైన ప్రశ్నలు

విభాగం - IVలో గద్యాంశానికి సంబంధించిన రెండు వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. ఒకదానికి మాత్రమే సమాధానం రాయాలి. విషయం పూర్తిగా చక్కటి భాషాశైలిలో సొంతమాటల్లో రాయాలి. పాఠ్యాంశాలను అవగాహనతో చదివితే మంచిది. (1 × 7 = 7)
సూచన: ప్రశ్నలను పాఠ్యపుస్తకంలో ఉన్నట్లు కాకుండా కొంచెం మార్చి అడుగుతారు. ఈద్‌గాహ్, స్వరాజ్య్‌ కీ నీఁవ్, లోక్‌గీత్, జల్‌ హీ జీవన్‌ హై పాఠ్యాంశాలను చదవాలి.

ముఖ్యమైన ప్రశ్నలు

విభాగం - Vలో సృజనాత్మక విద్యా ప్రమాణాన్ని పరీక్షించే తరహాలో మూడు ప్రశ్నలు అడుగుతారు. వీటిలో లేఖ, వ్యాసం, ప్రకటన, పోస్టర్, శుభాకాంక్షలు, సంభాషణలు, ఇంటర్వ్యూ, సూక్తులు, నినాదాలు లాంటి ప్రశ్నలు ఇస్తారు. రెండింటికి మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుంది. ఒక్కోదానికి అయిదు మార్కులు. (2 × 5 = 10)

ముఖ్యమైన ప్రశ్నలు

పార్ట్‌ - Bలో 20 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. వీటికి 20 మార్కులు. ఈ ప్రశ్నల్లో శబ్ధ బండార్‌కి సంబంధించి పది ప్రశ్నలు, వ్యాకరణాంశాలపై పది ప్రశ్నలు అడుగుతారు. పాఠ్య పుస్తకంలోని పర్యాయ వాచీ శబ్ద్, సమూహ్‌ కా ఏక్‌ శబ్ద్, అంక్, బావ్‌వాచక్‌ శబ్్ద, సమానార్థ్, ముహావర్, భిన్నార్థ్, తత్సమ్, తద్భవ్, సహీవర్తనీవాలా శబ్ద్‌ లాంటి అంశాలను ఒకటికి రెండుసార్లు సాధన చేయాలి.
వ్యాకరణాంశాల్లో సంధి విచ్ఛేద్, సమాస్, ఉపసర్గ్, ప్రత్యయ్‌ కారక్, కాల్, సంయుక్త, సరళ్, మిశ్రితవాక్య్‌లను నేర్చుకున్నట్లయితే పది మార్కులు సాధించవచ్చు. భాషా కీ బాత్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.

- బి. రామ్మోహన్‌

x

ఇంగ్లిష్‌

పదో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్‌లో ఎక్కువ మార్కులు పొందాలంటే academic standards, weightage మీద జ్ఞానం పెంచుకోవాలి. బాగా సాధన చేయాలి. మొదటి పేపర్, రెండో పేపర్‌లకు academic standards ఒకటైనప్పటికీ మొదటి పేపర్‌లో పాఠ్యపుస్తకం నుంచీ, రెండో పేపర్‌లో పాఠ్యేతరం నుంచీ ప్రశ్నలుంటాయి. ప్రతి పేపర్‌లో 3 సెక్షన్లుంటాయి. విద్యార్థి చేతిరాత అర్థమయ్యేలా, నీట్‌గా ఉండాలి.

A: reading comprehension: దీనిలో ఎక్కువ మార్కులు స్కోర్‌ చేయవచ్చు. జవాబులను తార్కికంగా వివరిస్తూ సరళంగా, నేరుగా రాయాలి. ఈ సెక్షన్లో passage లకు సంబంధించి ప్రశ్నలుంటాయి. passageను copy చేయకుండా అవగాహన చేసుకొని రాయాలి.

1st paperలో ఎక్కువ మార్కులు పొందాలంటే పాఠాలను రెండు, మూడుసార్లు అర్థమయ్యేవరకు చదవాలి. passage లో ఒక ప్రశ్న...పైన ఇచ్చిన passage ఏ టెక్ట్స్‌ సంబంధించినది అని అడుగుతున్నారు. కాబట్టి ప్రతి పాఠం ఏ టెక్ట్స్‌ అనేది తెలిసివుండాలి. ఒక ప్రశ్న application typeలో అడుగుతున్నారు కాబట్టి ప్రతి unit concept, themeపై అవగాహన ఉండాలి. ప్రతి poemకు సంబంధించి simile, metaphor, personification and hyperbole etc పై పరిజ్ఞానం అవసరం. చదివిన పాఠాల passage లు కాబట్టి స్కోర్‌ చేసుకోవచ్చు.

11వ పేపర్‌లో పాఠ్యేతర 3 passage లు ఒక్కొక్కటి 5 మార్కులు సంబంధించి ఉంటాయి. (Q.no.115) వీటిని బాగా అర్థమయ్యేవరకు 2 లేదా 3 సార్లు చదవాలి. పాఠ్యేతర passage లు ఎక్కువగా సాధన చేయాలి 1st paper లో చెప్పిన సూచనలు పాటించాలి.

B: vocabulary and grammer: 1st paperలో 13-27 ప్రశ్నలు ఈ విభాగంలో ఉంటాయి. పాఠ్యపుస్తకం నుంచి వస్తాయి. ప్రతి పాఠంలో ఏ ఆర్టికల్స్tense, prepositions, conjunction, degrees of comparison మిగతా ఏ parts of speech ఉన్నాయో పూర్తి అవగాహన పెంచుకోవాలి. ప్రతి పాఠానికి సంబంధించి synonyms వాటి antonyms తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి పాఠ్యాంశం మీద పట్టు ఉండేలా చదవాలి.

11వ పేపర్‌లో పైన 1st paperలో చెప్పినవాటి మీద అవగాహనతోపాటు 16, 17, 18 ప్రశ్నలకు సంబంధించి ఎక్కువ శ్రమ చేయాలి. ఈ సెక్షన్లో 16-32 వరకు 10 మార్కుల ప్రశ్నలుంటాయి. 16, 17, 18 ప్రశ్నలు direct and indirect, active voice and passive voice, question tags మీద ఉంటాయి: వీటి ప్రాథమిక నిబంధనలు తెలుసుకొని ప్రశ్నలు సాధన చేయాలి.

C: creative writing: discourses అభ్యాసం చేస్తే కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. 10 పాయింట్లు సాధించాలంటే వీటిని బాగా సాధన చేయాలి.

1st paper లో చదివిన పాఠాలకు సంబంధించి discourses ఉంటాయి. Q.no: 28, 29 15 మార్కులకు ఈ విభాగంలో ఉన్నాయి. ప్రతి పాఠానికి సంబంధించి ఏ తరహా ప్రశ్నలు discourses మీద ఉంటాయో ఊహించి సాధన చేయాలి. అంటే ప్రతి పాఠంలో maximum discourses practice చేయాలి. అంతేకాకుండా discourses indicators (specific/ language) మీద అవగాహన ఉండాలి. format ను అనుసరించాలి.

11వ పేపర్‌లో 33, 34 ప్రశ్నలు పాఠ్యేతర విభాగానికి చెందినవి. matter ఇస్తారు. కాబట్టి అర్థమయ్యేవరకూ చదివి మొదటి పేపర్‌లో చెప్పిన సూచనలు పాటిస్తూ ఎక్కువ ప్రశ్నలు అభ్యాసం చేయాలి. ముఖ్యంగా format, indicatorsను దృష్టిలో పెట్టుకోవాలి.

Important expected discourses in 1st paper
Major discourses:
1. You have read the lesson "Attitude is Altitude". Describe the disadvantages faced by disabled man without arms and legs, taking references from the lesson "Attitude is Altitude".

2. You have read the lesson "Attitude is Altitude", in the lesson when Nick eight years old, he went to his mother crying and told her that he wanted to kill himself. Now write a possible conversation between Nick and his mother in this context.

3. Failures are the stepping stones to success. Write description in supporting statement extracting the references from the lesson. Every success story is also a story of great failures.

4. In the lesson "I will do it" you have read about Mr. Narayana Murthy, who became a pioneer of India's software industry. Now describe how and what qualities made him to become a pioneer of India's software industry.

5. In the play " The Dear departed" you know Amelia and Elijabeth did not see Abel properly. He was worried about their un- concern. Now decscribe the feelings of Abel about his daughters attitude.

6. In the lesson " The Brave Potter" the villagers praised the potter as braveman on seeing the tiger tied to the tree infront of his house. Now describe or narrate the thoughts of the potter.

7. Imagine that the author in the lesson "The Journey" realized and felt guilty of his behaviour with his father. Now describe the inner feelings of the author.

8. You have read the lesson '' A Tribute''. It describes life of Savithri. Imagine you are a news reporter and write an imaginary interview.

9. You have read the story "The storeyed house". You have read that Bayaji comes to his village after his retirement with an ambition. When he comes home his mother welcomes affectionately. Now write a possible conversation between bayagi and his mother in that context

10. In the lesson "Environment", you have read the news of Wangari Mathai on environment and its importance. Imagine that she visited your school. Write a conversation between you and Mathai.

11. In the lesson "jamaican fragment" the author gets the shock of his life when he mistakes the two boys in the garden as a master and a slave. He heaves a sigh of refief when he realises the next day that it was game.

Now imagine your self as the author and desrcibe your feelings you realized the mistake you made in the first day about the two boys.
Minor discourses:
1. your have read the story Nick who was born with no arms and legs. Imagine yourself as Nick's mother and make a diary entry of your feelings on the day gave birth to Nick.

2. Narayana Murthy has passed IIT entrance with high rank. He was thirlled and said to his father. But his father said, 'I can't afford you expenses at IIT, you can stay in mysore and study as much as you can'.

Imagine that you are Narayana Murthy and make an entry in you diary expressing you feelings.

3. In the play "The Dear Departed" Mr. Henry sent a message to jordans revealing old Man's death. Imagine they were not at home. Their son Jimmy received the message.
Now imagine you were Jimmy and send the message to jordans.

4. You have read the story "The Brave potter". The potter was appointed as general of the army. Now make a diary entry of the potter describing his thoughts.

5. In the Lesson 'My childhood' Abdul Kalam narrates about some memorable insidents of his childhood. Abdul kalam is made to sit on the back bench. Kalam and his friend feel very sad.
Now imagine your self as Kalam and make a diary entry of your feelings.

6. In the lesson "What is my name"?, the woman of the house forgets her name and in the process of getting to know her name, she finds her academic certificates missing.

Write a notice to put up at various places include...
1. No. of certificates
2. Contact details for the certificates to be handed over.

- వి. స‌త్య‌నారాయ‌ణ‌రావు

x

భౌతికశాస్త్రం

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలో.. భౌతికశాస్త్ర ప్రశ్నలు గుర్తుకు పెట్టుకుని, బట్టీపట్టి రాయడానికి వీలుగా ఉండవు. ఆలోచించి రాసేలా ఉంటాయి. విశ్లేషణాత్మకంగా అన్వయించి రాయాల్సి ఉంటుంది. సమాధానాలు ఒకేరకంగా రాయడానికి బదులు బహుళ విధాలుగా వచ్చేలా ప్రశ్నల స్వభావం ఉంటుంది.

ఆ ప్రశ్నలు నిర్ధారించిన విద్యాప్రమాణాలు, సాధించవలసిన సామర్థ్యాలకు సంబంధించినవై ఉంటాయి. పాఠ్యపుస్తకంలోని అన్ని ప్రశ్నలూ యథాతథంగా ప్రశ్నపత్రంలో రావు. అందువల్ల బట్టీపట్టి చదివే విధానానికి స్వస్తిచెప్పి విషయాన్ని అవగాహన చేసుకోవాలి. పాఠ్యాంశాల వారీగా వెయిటేజీ లేదు. సిలబస్‌ మొత్తానికి సమాన ప్రాధాన్యం ఉంటుంది. క్షుణ్ణంగా చదవాలి. పాఠాన్ని పూర్తిగా చదివి అందులో ముఖ్యమైన భావనలు, పటాలు, ఫార్ములాలు, ప్రయోగాలు, నిత్యజీవిత అనువర్తనాలను అవగాహన చేసుకోవాలి. పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలకు సమాధానాలు రాయటం అభ్యసించి, పునశ్చరణ చేయాలి. కృత్యాలు, ప్రయోగాలను సాధ్యమైనంతవరకూ వ్యక్తిగతంగా చేసి పరిశీలనలు, ఫలితాలను నమోదు చేయాలి. ప్రతి ప్రయోగ కృత్యానికీ నివేదికలు రూపొందించుకోవాలి. ప్రతి భావననూ విశ్లేషణాత్మకంగా చదవాలి. ప్రత్యేకంగా బొమ్మల ద్వారా వివరించగలగడం, అసంపూర్తిగా ఉన్న బొమ్మలను పూర్తిచేయడం, సందర్భోచిత పటాలు గీయటం సాధన చేయాలి.

ప్రశ్నల స్వభావం
విషయావగాహన: భౌతికశాస్త్రంలో నేర్చుకున్న భావనలను వివరించడం, ఉదాహరణలివ్వడం, కారణాలు చెప్పడం, పోలికలు, భేదాలు చెప్పటంపై ప్రశ్నలు.

ప్రశ్నించడం - పరికల్పనలు చేయడం: వివిధ భావనలపై విద్యార్థులు సొంతంగా ప్రశ్నలు అడిగేలా ఫలితాలు గురించి ఊహించే ప్రశ్నలు.

ప్రయోగాలు - క్షేత్ర పరిశీలనలు: ప్రయోగ విధానం, ఉపయోగించిన పరికరాలు, వచ్చిన ఫలితాలు, ప్రత్యామ్నాయ పరికరాలు ఉపయోగించిన విధానం, చరాలు మార్చినప్పుడు వచ్చే ఫలితాలు, అమరికకు పటాలు గీయటం వంటి ప్రశ్నలు.

సమాచార నైపుణ్యాలు: సమాచారాన్ని విశ్లేషించడం, సేకరించడం, ఉపయోగించిన సాధనాలు, నమూనా పట్టికలు తయారు చేయటం వంటి ప్రశ్నలు.

బొమ్మలు గీయడం: పరికరాల అమరిక, పనిచేసే విధానం, బొమ్మలు గీయడం, ఫ్లో చార్టులు, గ్రాఫులు గీయడం వంటి ప్రశ్నలు.

ప్రశంస, విలువలు, జీవవైవిధ్యం: అభినందించే, ప్రశంసించే పద్ధతులు, నిర్వహించే లేదా పాల్గొనే పనులు, నినాదాలు, కరపత్రాలు, వ్యాసాలు రాయడం వంటి ప్రశ్నలు.

ప్రశ్నపత్రంలో పార్టు-ఎ మూడు విభాగాలుగా ఉంటుంది. పార్టు ఎ-కి సమాధాన పత్రంలోనూ, పార్టు బి-కి ప్రశ్నపత్రంలోనూ సమాధానాలు రాయాలి.

పార్ట్‌-ఎలోని విభాగం-1లో 4 ప్రశ్నలుంటాయి. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. 1 లేదా 2 వాక్యాల్లో సమాధానం రాయాలి.

అనుస‌రించాల్సిన అంశాలు

* సరైన ప్రణాళిక, సంసిద్ధత, పునశ్చరణ మంచి గ్రేడ్‌ పాయింట్లు సాధించడానికి దోహదం చేస్తాయి.

* ఇంట్లో, పాఠశాలలో పునశ్చరణకు తగిన సమయం కేటాయించాలి.

* ప్రతి పాఠ్యాంశాన్నీ పూర్తిగా అవగాహన చేసుకుని చదవాలి.

* కీ పాయింట్లను తయారుచేసుకోవాలి.

* స్వయంగా ప్రశ్నలు తయారు చేసుకొని వాటికి జవాబులు రాయడం సాధన చేయాలి.

* పాఠ్యపుస్తకంలోని ‘అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం’లోని అన్ని ప్రశ్నలకు స్వయంగా సమాధానాలను రాసుకుని పునశ్చరణ చేసుకోవాలి.

ముఖ్య‌మైన ప్ర‌శ్న‌లు
ప‌రీక్ష‌లో ఇచ్చే ప్ర‌శ్న‌ప‌త్రంలో మార్కుల విభ‌జ‌న కింది విధంగా ఉంటుంది. పరీక్ష 40 గరిష్ఠ మార్కులకు ఉంటుంది. ప్రశ్నపత్రంలో పార్ట్‌-ఎ, బి విభాగాలుంటాయి.
* పార్ట్‌-ఎ మూడు విభాగాలు. పార్ట్‌-ఎకి సమాధాన పత్రంలో, పార్ట్‌-బికి ప్రశ్నపత్రంలోనే సమాధానాలు రాయాలి.
* పార్ట్‌-ఎలోని విభాగం-1లో 7 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. 1 లేదా 2 వాక్యాల్లో సమాధానం రాయాలి.
1 మార్కు ప్ర‌శ్న‌లు
1) NH3 లో ఉన్న సంకరీకరణం ఏమిటి?
2) కింది సమ్మేళనాల్లో ఏది త్రికబంధాన్ని కలిగి ఉంటుంది?
C3H6, C3H8, C3H4
3) విశిష్ట నిరోధానికి S.I. పద్ధతిలో ప్రమాణం ఏమిటి?
4) ఒక వాహకంలో 4 నిమిషాల్లో 90 కులూంబ్‌ల ఆవేశం ప్రవహిస్తే ఆ వాహకంలోని విద్యుత్‌ ప్రవాహం ఎంత?
* పార్ట్‌-ఎలోని విభాగం-2లో 6 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. 4 నుంచి 5 వాక్యాల్లో సమాధానం రాయాలి.
2 మార్కులు
1) 6, R2 నిరోధం గల రెండు నిరోధాలను సమాంతరంగా కలిపినప్పుడు ఫలిత నిరోధం 4 లు అయితే R2 విలువను కనుక్కోండి.
2) కింది సమీకరణాలను పూర్తిచేసి తుల్యం చేయండి.
(i) C3H8 + O2 -> ----------------- + ---------------
(ii) Na + H2O -> ------------------ + ---------------
3) వస్తువును 2F1, F1 ల మధ్య ఉంచినప్పుడు పుటాకార కటకం వల్ల ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని తెలిపే కిరణ చిత్రాన్ని గీయండి.
4. NaOH ఉపయోగాలను తెల్పండి.
* పార్ట్‌-ఎ విభాగం-3 లో 4 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. ప్రతి ప్రశ్నకు అంతర్గత వెసులుబాటు ఉంది. ఏదైనా ఒకదాన్ని ఎన్నుకొని సమాధానం రాయాలి. ప్రతి ప్రశ్నకు 8 నుంచి 10 వాక్యాల్లో సమాధానం రాయాలి.
4 మార్కులు
1) ఓవర్‌లోడ్‌ వల్ల విద్యుత్‌ సాధనాలు ఎందుకు పాడవుతాయి? ఓవర్‌లోడ్‌ వల్ల సంభవించే ప్రమాదాలను ఎలా నివారించగలం?
2) ఒక కుంభాకార కటక నాభ్యాంతరం 'f' ని కనుక్కోవడానికి చేసే ప్రయోగానికి కావాల్సిన పరికరాల జాబితాను రాసి, నాభ్యాంతరం కనుక్కోవడానికి చేసే ప్రయోగ విధానాన్ని వర్ణించండి.
3) ధాతువులను సాంద్రీకరణం చెందించే ప్రక్రియలను తెలిపి, వివరించండి.
4) విద్యుత్‌ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం ఏది? దాని పటం గీసి, భాగాలను గుర్తించండి.
5) సాధారణంగా దృష్టి దోషాలు ఎన్నిరకాలు? అవి ఎలా ఏర్పడతాయి? పట సహాయంతో వివరించండి. కటకాలను ఉపయోగించి దృష్టి దోషాలను ఎలా సవరిస్తారో వివరించండి.
6) వేలన్సీ బంధ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఈ సిద్ధాంతం ఆధారంగా O2 అణువు ఏర్పడే విధానాన్ని వివరించండి.
* పార్టు-బిలో 10 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1/2 మార్కు. ఇచ్చిన నాలుగు సమాధానాల్లో (A, B, C, D) ఒకదాన్ని ఎంచుకుని బ్రాకెట్లలో రాయాలి. దిద్దేసిన, కొట్టివేసి రాసిన సమాధానాలకు మార్కులు ఇవ్వరు.
1) ఒక పరమాణువులో చివరి ఎలక్ట్రాన్‌ క్వాంటం సంఖ్యలు 3, 2, -2, +1/2 అయితే, దాని పరమాణు సంఖ్య ( )
A) 19 B) 20 C) 21 D) 22
2) అత్యధిక ఋణ విద్యుదాత్మకత గల మూలకం బాహ్యతమ కర్పరంలోని ఎలక్ట్రాన్‌ విన్యాసం ( )
A) ns2np3 B) ns2np4 C) ns2np5 D) ns2np6

- కంచర్ల గగన్‌ కుమార్‌

x

సాంఘికశాస్త్రం

పరీక్షల ముందు ఏం చదవాలి? ఎలా చదవాలి? అనే సందేహాలు విద్యార్థులను భయాందోళనలకు గురి చేస్తూంటాయి. అయితే తగిన మెలకువలు పాటిస్తే వాటిని అధిగమించి, పరీక్షల్లో మంచి స్కోరు సంపాదించవచ్చు. పదోతరగతి విద్యార్థులకు శ్రమించే తత్వం, సన్నద్ధత చాలా ముఖ్యం. కష్టపడి చదవటం అలవాటు చేసుకోవాలి. చదివేటప్పుడూ, రాసేటప్పుడూ ‘ఇక చాలు’ అనే భావన రానీయకండి. ఇంకాస్త చదివితే మార్కులు పెరుగుతాయి. కొంచెం ఆలోచించి రాస్తే మరో అర మార్కు సంపాదించవచ్చు అనే భావనతో పరీక్షలు రాయండి.

ప్రణాళిక: ఏ పని చేపట్టినా ఒక పద్ధతిని ఆచరిస్తే ఫలితం బాగుంటుంది. ప్రతి సబ్జెక్టుకూ కొంత సమయం కేటాయించాలి. ముఖ్యమైన ప్రశ్నలను గుర్తించి, వాటిని బాగా చదివి, చూడకుండా రాయాలి. రాని ప్రశ్నలను వదిలివేయకుండా మళ్ళీ ప్రయత్నించాలి.

ప్రశాంతత: పరీక్షలంటే భయపడితే చదివింది కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. వాటి గురించి భయపడాల్సిన అవసరమే లేదు. సన్నద్ధమయ్యేటప్పుడూ, పరీక్షలు రాసేటప్పుడూ కూడా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండటం ఎంతో అవసరం. ‘నేను సాధించగలను, తప్పక సాధిస్తాను’ అనే విశ్వాసాన్ని పెంచుకోవాలి.

చేతిరాత: పరీక్షల్లో చేతిరాతకు ప్రాధాన్యం ఉంటుంది. అందువల్ల దీనిపై శ్రద్ధ వహించాలి. ఒకవేళ మీ చేతిరాత బాగుండకపోతే ఆందోళన చెందాల్సిన పనిలేదు. దస్తూరి అందంగా ఉండటం ముఖ్యం కాదు; మీరు రాసింది దిద్దేవారికి అర్థం కావాలి. అందుకు పదానికీ పదానికీ¨ మధ్య కాస్త ఖాళీ ఇవ్వండి. అలాగే ప్రతి రెండు వాక్యాల మధ్యా కొంచెం దూరం పాటించండి. అంతే!

పునశ్చరణ: పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ ఇంతకుముందు చదివిన ప్రశ్నలనే పునశ్చరణచేస్తూ అవగాహన పెంచుకోవాలి. పరీక్షకు ముందు సబ్‌ హెడ్డింగ్స్, ముఖ్యమైన పాయింట్లు మాత్రమే చదవాలి. 1, 2, 4 మార్కుల ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలపై పట్టు సాధించాలి. ఛాయిస్‌ లేని 1/2, 1, 2 మార్కుల ప్రశ్నలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. రోజూ ఒకటి లేదా రెండు వ్యాసరూప ప్రశ్నలు రాయడాన్ని సాధన చేస్తే పరీక్షలో వేగంగా, తప్పులు లేకుండా విషయాన్ని వివరించడం సాధ్యమవుతుంది. స్టడీ మెటీరియల్‌లోని ప్రశ్నలను ఇప్పటికే చాలావరకు చదివిఉంటారు. వాటిని మినహాయించి మిగతా ప్రశ్నలపై దృష్టి పెట్టండి. జవాబులను చదివేసమయంలో బిట్లుగా వచ్చే పాయింట్లను అండర్‌లైన్‌ చేసి ఉంచుకోండి. పరీక్షలు సమీపించినప్పుడు వాటిని పునశ్చరణ చేయండి.

ప్రశ్నపత్రం చదవాలి: పరీక్షల్లో విద్యార్థులంతా సాధారణంగా చేసే పొరపాటు. ప్రశ్నపత్రాన్ని చదవడానికి 15 నిమిషాలు కేటాయించి, ఆ సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. ప్రశ్నపత్రాన్ని క్షుణ్ణంగా చదివితే ఎలా రాయాలి అనే అంశంపై స్పష్టత ఏర్పడుతుంది. అలాగే సమయపాలన తేలికవుతుంది.

మార్కులకు అనుగుణంగా: ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు ఏయే అంశాలను తప్పనిసరిగా రాయాలి అనే దానిపై విద్యార్థులకు స్పష్టత అవసరం. అడిగిన ప్రశ్నకు ఏ పాయింట్లు ఉంటే పూర్తి మార్కులు పొందుతారో తెలుసుకొని ఉండాలి. మొదట ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులకు అనుగుణంగా తప్పనిసరిగా రాయాల్సిన అంశాల తర్వాతే, మిగతావి రాయటం మేలు.

అవసరముంటేనే అడిషనల్స్‌: అదనపు జవాబుపత్రాలను (అడిషనల్స్‌) అవసరంమేరకే తీసుకోండి. ఎక్కువ పేజీల్లో సమాచారం ఉంటే మంచి మార్కులు సాధించవచ్చు అనేది అపోహే. జవాబు పత్రాల్లో అవసరానికి మించి ఖాళీలు వదిలి ఎక్కువ అడిషనల్స్‌ తీసుకోవద్దు. ఇలా చేయడం వల్ల మీ జవాబు పత్రాలు మూల్యాంకనం చేసేవారికి విసుగ్గా అనిపించడంతోపాటు మీపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. ఎక్కువ పేజీలు ఉంటే ఎక్కువ మార్కులు ఇస్తారని రాసిన జవాబునే మళ్లీ రాయవద్దు. అవసరమైన మేరకే రాయాలి. అనవసర విషయాలు చర్చించడం వల్ల మార్కులు తగ్గడం, సమయం వృథా కావడం తప్ప ప్రయోజనం ఉండదు.

సమయ సద్వినియోగం: కొందరు విద్యార్థులు పరీక్షలో సమయం చూసుకోకుండా రాస్తూనే ఉంటారు. ఇలాంటివారు తమకు తెలిసిన జవాబులు రాయకుండానే పేపర్‌ ఇచ్చేయాల్సి వస్తుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఆయా ప్రశ్నలకు నిర్దేశిత సమయాన్ని మాత్రమే కేటాయించండి. మొదట మీకు వచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. మరిచిపోయిన జవాబులను చివరిలో ప్రయత్నించండి. ప్రశ్నల నంబరు వేయడం మరవకండి. వీటిని మార్జిన్‌ ఎడమపక్క వేయాలి. జవాబుల్లో ఉపశీర్షికలు (సబ్‌హెడ్డింగ్స్‌) ఉంటే వాటిని అండర్‌లైన్‌ చేయాలి. ఉపశీర్షికలు లేని సమాధానాల్లోని పాయింట్స్‌లో ముఖ్యపదాలను అండర్‌లైన్‌ చేయండి. అదనపు (ఛాయిస్‌) ప్రశ్నలకు ముందే రాయకండి. చివరిలో సమయం ఉంటేనే రాయండి.

జవాబులను పూర్తిగా రాయాలి. అవసరమైనచోట అదనపు పాయింట్లను జతచేయాలి. అర్థమయ్యే చేతరాత, క్రమబద్ధంగా రాసిన జవాబులు, ఉప విభాగాలు, ముఖ్యమైన పదాలను అండర్‌లైన్‌ చేయడం, మార్జిన్‌ వదలడం, ప్రశ్నపత్రం దిద్దేవారిని ఆకట్టుకుంటాయి. అన్ని జవాబులూ రాసిన తర్వాత, జవాబు పత్రాన్ని అంతా చదివి తప్పులుంటే సరిచేయండి.

భూగోళశాస్త్ర పాఠ్యాంశాలను చదివేటప్పుడు భారతదేశ పటాన్నీ, చరిత్ర పాఠ్యాంశాలను చదివేటప్పుడు ప్రపంచపటాన్నీ దగ్గర పెట్టుకుని వాటికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు పటాలను చూస్తూ చదవండి. ఒకసారి చదివితే ఏదీ రాదు. వచ్చేవరకూ చదవండి. బిట్స్‌ (బహుళైచ్ఛిక ప్రశ్నలు) బట్టీ పట్టవద్దు. డ్రిల్లింగ్‌ (ఒకరిని ఒకరు అడగటం) చేస్తే మేలు.

వ్యాఖ్యానించడం: ‘ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి వ్యాఖ్యానించడం’ అనే నైపుణ్యంలో ఇచ్చే పేరాను కొంతమంది ఉన్నది ఉన్నట్లు రాస్తున్నారు. ఇలా చేయకూడదు. పేరాను పూర్తిగా చదవండి. ప్రశ్నను అర్థం చేసుకోండి. దానికి సంబంధించిన అంశాలు మాత్రమే రాయండి. అభిప్రాయాలు అడిగినప్పుడు ఆ పేరాలోని అంశాలను ఆధారంగా చేసుకొని రాయండి. దీనికోసం పాఠ్యపుస్తకంలోని రెండు పేరాలను తీసుకుని సాధన చేయండి.

పట్టికలు, గ్రాఫ్‌లు, పటాలు: పాఠ్యపుస్తకంలో ఉన్న పట్టికలు, గ్రాఫ్‌లు, పటాలను పరిశీలించండి. ఆ పట్టిక మనకు ఏమి తెలియచేస్తుంది? సమాచారంలో మొదటి, చివరి స్థానంలో ఏం ఉన్నాయి? వాటి మధ్య తేడా ఏమిటి? ప్రత్యేకత ఏమిటి? పటాలైతే ఏ దిక్కులో ఏ దేశాలున్నాయి? భారతదేశపటంలో ఏ వైపు ఏ రాష్ట్రాలున్నాయి? మొదలైన ప్రశ్నలతో వాటిని పరిశీలనాత్మక ధోరణిలో చూడండి.

పట నైపుణ్యాలపై అవగాహన ఉంటే తక్కువ సమయంలోనే ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఈ నైపుణ్యంలో మూడు విధాలుగా ప్రశ్నలు వస్తాయి. రాష్ట్రాలను, భారతదేశ చిత్తుపటాలను గీయమనడం; ప్రాంతాలను, దేశాలను గుర్తించమనడం; గుర్తించిన పటాన్నిచ్చి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయమనడం. ఈ మూడింటినీ సాధన చేయండి. ఈ సాధన ద్వారా సాంఘికశాస్త్ర పాఠ్యాంశాలను బట్టీపట్టకుండా అర్థం చేసుకోవచ్చు. దేశాలు, దీవులు, ఇతర ప్రాంతాలను కొన్ని ఆకారాల్లో (జంతువులు, పక్షులు, అక్షరాలు, అంకెలు) గుర్తుపెట్టుకుంటే వాటిని సులభంగా గుర్తించవచ్చు. మ్యాప్‌ను గుర్తించేటప్పుడు ప్రశ్న సంఖ్యను అక్కడ వేయకూడదు. గుర్తించిన చోట పేరు మాత్రమే రాయాలి. ఒకవేళ స్థలం లేకపోతే బాణం గుర్తువేసి రాయాలి. లేదా గుర్తించాల్సిన ప్రదేశంలో మ్యాప్‌పై సంఖ్యవేసి, ఎదురుగా పేరు రాయాలి.

సమకాలీన అంశాలు: ఈ నైపుణ్యంలో పాఠ్యపుస్తకంలో ఉన్న పాఠ్యాంశాలకు సంబంధించిన సమకాలీన అంశాలపై మాత్రమే ప్రశ్నలు వస్తాయి.

* మొదటి పేపర్‌లో- పాఠశాల విద్య, భ్రూణహత్యలు, మహిళలపై అఘాయిత్యాలు, లింగ వివక్ష, మధ్యాహ్న భోజన పధకం, మురికి వాడలు, చౌకధరల దుకాణాలు, నీరు- అమ్మకాలు, నీటి కాలుష్యం, భూగర్భజలాలు, ప్రపంచీకరణ, పోషకాహారం, భూగోళం వేడెక్కడం, పర్యావరణ పరిరక్షణ, ఓజోన్‌పొర.

* రెండో పేపర్‌లో- ప్రపంచయుద్ధాలు, భారతదేశంతో ఇతర దేశాల సంబంధాలు, ప్రాజెక్టులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జాతీయ, ప్రాంతీయ పార్టీలు, నూతన రాష్ట్రాలు, జిల్లాల ఏర్పాటు, రాజ్యాంగ సవరణలు, సామాజిక ఉద్యమాలపై దృష్టిపెట్టండి.

బిట్‌పేపర్‌ రాసేటప్పుడు: బిట్‌పేపర్‌ ఇచ్చిన వెంటనే మెయిన్‌ పేపర్‌ రాయడం ఆపి బిట్‌పేపర్‌ పూర్తి చేయాలి. సమయం ఉంటే ఆ తర్వాత మెయిన్‌ పేపర్‌ రాయాలి.

* A, B, C, D లు బ్రాకెట్టులో రాసేటప్పుడు సరిగా రాయండి. జవాబులు తప్పు రాశామనుకుంటే దానిపై దిద్దవద్దు. తప్పు అనుకున్నదాన్ని పూర్తిగా కొట్టివేసి, అప్పుడు సరైన సమాధానం రాయాలి. అన్ని బిట్లనూ పూరించండి. ఒక్కోసారి ఏదైనా బిట్‌ తప్పుగా రావచ్చు. ఇలాంటివి అటెమ్ట్‌ చేస్తే మార్కు వస్తుందని మర్చిపోవద్దు.

ముఖ్యమైన ప్రశ్నలు

పేపర్‌-1
1. ‘వ్యవసాయానికి మైదాన ప్రాంతాలు తోడ్పడినంతగా పీఠభూమి ప్రాంతాలు తోడ్పడవు’. ఈ పరిస్థితి భారతదేశంలో ఎలా ఉంది?
2. మిగతా రంగాలకంటే సేవారంగానికి ప్రత్యేకత ఉంది. కొన్ని ఉదాహరణలతో వివరించండి. (ఏపీకి మాత్రమే)
* ఆర్థిక కార్యకలాపాలను ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగా విభజించడం ఉపయోగకరమేనా? ఎందుకు (తెలంగాణకు మాత్రమే)
3. మీ రాష్ట్రంలో ‘పాఠశాల విద్యను విప్లవం‘గా చేపట్టాలంటే ఏమి చేయాలో తగు సూచనలు ఇవ్వండి.
4. ‘భూగోళం వేడెక్కడానికి మానవుడే కారణం’. వివరించండి.
5. వలసలు వెళ్ళినవారు ఆ ప్రాంతంలో సమస్యలు సృష్టిస్తారా/సమస్యలకు కారణం అవుతారా? మీ సమాధానానికి కారణాలు రాయండి?
6. ప్రపంచీకరణ మన దేశ అభివృద్ధిని కుంటుపరుస్తుంది అని ఒకరంటే దేశాభివృద్ధికి సహాయపడుతుంది అని మరొకరు అంటున్నారు- వ్యాఖ్యానించండి.
7. పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో చైతన్యం రావడానికి రెండు నినాదాలు రాసి, ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
8. ‘ప్రత్యేక ఆర్థిక మండలి’ (సెజ్‌) అని దేన్ని అంటారు? వివరించండి?
9. భారతదేశ చిత్రపటాన్ని గీచి, మీ రాష్ట్రాన్ని, దాని రాజధానిని గుర్తించండి.
10. ఆనకట్టలు కట్టడం వలన ఎవరికి లాభం కలుగుతుంది? ఎవరికి నష్టం కలుగుతుంది?

పేపర్‌-2
1. రెండో ప్రపంచ యుద్ధానికి దోహదం చేసిన ప్రత్యేక అంశాలేవి?
2. లెనిన్, స్టాలిన్‌లు రష్యాసమాజంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు?
3. చైనాలో భూ సంస్కరణల కోసం చేపట్టిన కార్యక్రమాలు రాసి, వాటి ఫలితాలు తెల్పండి.
4. సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసే ప్రక్రియలో పటేల్‌ కృషిని ప్రశంసించండి?
5. రాజ్యాంగ సభ చర్చల్లో ‘అంటరానితనం’ అనే అంశంపై ప్రొమథరంజన్‌ ఠాకూర్‌ ఏమన్నారు?
6. భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను తెలపండి?
7. ఎన్నికల సంఘం విధులు తెలిపి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అది ఎలా నియంత్రిస్తుందో వివరించండి? (తెలంగాణకు మాత్రమే)
* పొరుగు దేశాలతో శాంతియుతంగా ఉండటానికి మన దేశం చేపట్టాల్సిన చర్యలను సూచించండి? (ఏపీకి మాత్రమే)
8. బహుళ పార్టీ వ్యవస్థ వల్ల ప్రజలు పొందుతున్న ప్రయోజనాలు, ఎదుర్కొంటున్న సమస్యలను తెలపండి?
9. సామాజిక ఉద్యమాల మౌలిక అంశాలను రాయండి?
10. గ్రామపెద్దలు, కోర్టులు వివాదాలు/తగాదాలను పరిష్కరించే విధానాలను పోల్చండి. మీరు దేన్ని ఇష్టపడతారు? ఎందుకు? (ఏపీకి మాత్రమే)
* తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో వివిధ వర్గాల ప్రజల కృషిని వివరించండి? (తెలంగాణకు మాత్రమే)

- బొమ్మడి నారాయణరావు

x

గణితశాస్త్రం

నూరుశాతం మార్కులను కచ్చితంగా సాధించగలిగే సబ్జెక్టు గణితశాస్త్రం. దీనిలో విజయానికి వేగం, కచ్చితత్వం రెండూ తప్పనిసరి. గణితశాస్త్రంలో ఉన్న ప్రశ్నలు యథాతథంగా ఇవ్వకున్నా ఆ ప్రశ్నలను దృష్టిలో పెట్టుకొని కొంత మార్పుచేసి ఇస్తారు. కాబట్టి లెక్కను ఒక్కటికి రెండుసార్లు చదివితే సమాధానం లభిస్తుంది. రెండు పేపర్లలో చివరగా 5 మార్కులకు 10 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలుంటాయి. ఏ ఒక్క ప్రశ్నను కూడా వదిలిపెట్టకుండా సమాధానాలు రాయాలి.

సమస్యలు సాధించేటపుడు ప్రతి ప్రశ్నకూ దత్తాంశం తప్పనిసరిగా రాయాలి. గ్రాఫ్‌ గీసేటపుడు పెన్సిల్‌తో గీయాలి. స్కేలు రాయాలి. నిర్మాణం చేసేటపుడు చిత్తుపటం తప్పక గీయాలి. నిర్మాణక్రమం పూర్తిగా రాయాలి. ఈ విధంగా చేసేటప్పుడు 3 మార్కులలోపు సంపాదించుకోకపోయినా 10 జీపీఏ వస్తుంది. పరీక్ష పత్రాన్ని మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులకు ఇబ్బంది కలుగకుండా సెక్షన్, ప్రశ్న నంబరు స్పష్టంగా వేయాలి. ప్రతి ప్రశ్న పూర్తికాగానే కి¨ంద మార్జిన్‌ కొట్టాలి.

* మొదట 1 మార్కు ప్రశ్నలు 7 ఇస్తారు. వీటిని వరసగా రాస్తే బాగుంటుంది. దీనికి కనీసం 15 నిమిషాల సమయం కేటాయించాలి. ఇందులో ఏదైనా రాకుంటే ప్రశ్న నంబరువేసి తర్వాత ప్రయత్నించాలి.

* 2 మార్కుల ప్రశ్నల్లో సులభంగా ఉండే 3 ప్రశ్నలు మొదట ఎంచుకోవాలి. వీటిని రాయడానికి 30 నిమిషాల సమయం కేటాయించాలి.

* 4 మార్కుల 4 ప్రశ్నలను అంతర్గత ఎంపిక ద్వారా ఇస్తారు. కనీసం 2 ప్రశ్నలను మొదటగా ప్రయత్నించి రాయాలి. వీటికి 30 నిమిషాల సమయం కేటాయించాలి.

* తర్వాత చివరగా మిగిలిన 2 మార్కుల ప్రశ్నలు 2, 4 మార్కుల ప్రశ్నలు 2 రాయటానికి 45 నిమిషాల సమయం కేటాయించుకొని సాధించాలి.

* చివరి 30 నిమిషాల సమయంలో 10 మల్ట్లిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలున్న పేపర్‌ ఇస్తారు. వాటిని జాగ్రత్తగా ఆలోచించి తి, తీ, ది, దీ లలో సరైన సమాధానాన్ని గుర్తించాలి. ప్రతి ప్రశ్నకూ 1/2 మార్కు. సమాధానం రాసినపుడు కొట్టివేతలు, దిద్దివేతలు, రెండు సమాధానాలూ రాయకూడదు. ఇలా రాస్తే ఆ ప్రశ్నకు మార్కులు ఇవ్వరు.

పేపర్‌-1 లో
* మంచి మార్కులు సాధించాలంటే రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాలు, సంగత సమీకరణాలు, అసంగత సమీకరణాలు, పరస్పర ఆధారిత రేఖీయ సమీకరణాలు, జతకు సంబంధించిన సమస్యలు, గ్రాఫ్స్‌ బాగా సాధన చేయాలి. ఈ అధ్యాయం నుంచి 7 నుంచి 12 మార్కులు వస్తున్నాయి.

* సమితులు అధ్యాయం నుంచి దాదాపుగా 4 మార్కుల ప్రశ్న ప్రతిసారీ వస్తోంది. సమితుల సమ్మేళనం, చేదనం, భేదాల సమస్యలు, వెన్‌ చిత్రాలను సాధన చేయాలి.

* నిరూపక రేఖాగణితంలో 4 మార్కుల సమస్యలు- త్రిదాకరణ బిందు నిరూపకాలు కనుగొనడం, త్రిభుజ వైశాల్యం కనుగొనడం, బిందువులను ఇచ్చి వాటిని కలుపగా ఏర్పడే పటం, దాని వైశాల్యం కనుగొనటం. ఈ అధ్యాయంలో ముఖ్యంగా సూత్రాలు బాగా నేర్చుకోవాలి.

* వాస్తవ సంఖ్యలు అధ్యాయానికి సంబంధించి యూక్లిడ్‌ భాగహార నియమం, సంవర్గమానాల సూత్రాలు, సమస్యలు బాగా సాధన చేయాలి.

* బహుపదుల అధ్యాయానికి సంబంధించి 4 మార్కుల సమస్యలో బహుపదికి రేఖాచిత్రాన్ని గీసి, శూన్యాలను కనుగొనటం ముఖ్యమైనది. బహుపది, ఘన బహుపదికి శూన్యాలకు, గుణకాలకు మధ్యగల సంబంధం సరిచూడటం, బహుపది భాగహారం ముఖ్యమైనవి.

* వర్గసమీకరణాల అధ్యాయానికి సంబంధించి వర్గాన్ని పూర్తిచేయటం ద్వారా వర్గసమీకరణం సాధించటం; రాతసమస్యలను వర్గసమీకరణాలకు మార్చి సాధించడం, ఇంకా వర్గసమీకరణ మూలాల స్వభావం ముఖ్యమైనవి.

* శ్రేఢులు అధ్యాయానికి సంబంధించి అంకశ్రేఢి ్ఞ-్ఠ పదాల మొత్తానికి సంబందించిన సమస్యలు, గుణశ్రేఢి ్ఞ-్ఠ వ పదం కనుగొనడం.ఈ అధ్యాయంలో సూత్రాలు బాగా సాధన చేయాలి.

ముఖ్యంగా ఏ చాప్టర్‌కూ మార్కుల వెయిటేజి ఇవ్వడం లేదు. ఏ అధ్యాయంనుంచైనా విద్యాప్రమాణాల ఆధారంగా వెయిటేజి ఇస్తారు. దృశ్యీకరణ, ప్రాతినిత్యపరచడం నుంచి 4 మార్కుల సమస్య సమితులు, రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత, బహుపదులనుంచి ఎక్కువగా ఇస్తారు. ప్రతి అధ్యాయంలోని విషయం మీద శ్రద్ధపెట్టాలి.

పేపర్‌-2 లో
మంచి మార్కులు సాధించాలంటే మొట్టమొదటిగా త్రికోణమితి అధ్యాయాన్ని బాగా సాధన చేయాలి. త్రికోణమితీయ నిష్పత్తులు, త్రికోణమితీయ సర్వసమీకరణాలకు సంబంధించిన సమస్యలు అభ్యాసం చేయాలి.

* దీనికి అనుబంధంగా ఉన్న అధ్యాయం త్రికోణమితీయ అనువర్తనాలు. ఈ చాప్టర్‌నుంచి 4 మార్కుల సమస్య తప్పకుండా వస్తుంది. ముఖ్యంగా లంబకోణం త్రిభుజాలతో కూడిన సమస్యలు వాటికి పటం గీయడం, సమస్యను సాధించడం చేయాలి.

* సులభంగా మార్కులు సాధించే అధ్యాయం సంభావ్యత. పేకముక్కలు - సంభావ్యత, సంభావ్యత అనువర్తనాలకు సంబంధించిన సమస్యలు సాధన చేయాలి. దీనికోసం కారణాంకాలు, గుణిజాలు, సరిసంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, ఇంకా బేసిసంఖ్యల మీద అవగాహన పెంచుకోవాలి.

* ఎటువంటి విద్యార్థి అయినా చేయగలిగే అధ్యాయం సాంఖ్యకశాస్త్రం. ఈ అధ్యాయంలో 4 మార్కుల సమస్య తప్పకుండా వస్తుంది. సమస్యా సాధన లేదా దృశ్యీకరణ - ప్రాతినిధ్యపరచడం వస్తుంది. ముఖ్యంగా గ్రాఫ్‌కు సంబంధించి ఆరోహణ, అవరోహణ సంచిత పౌనఃపున్యాలను తయారుచేసి ఓజీవ్‌ వక్రం గీయడం. సమస్యాసాధనలో అంకగణిత సగటు, మధ్యగతం లేదా బహుళకానికి సంబంధించి సమస్య వస్తుంది. దీనికోసం సూత్రాలు, అందులోని పదాలను వివరించటం సాధన చేయాలి.

* క్షేత్రమితి అధ్యాయంలో ముఖ్యంగా ఘనాకార వస్తువుల సముదాయ ఉపరితల వైశాల్యానికి సంబంధించిన సమస్యలు సాధించాలంటే సూత్రాలమీద పట్టు సాధించాలి. సమస్యను అర్థం చేసుకొని దత్తాంశంలో ఏమి ఇచ్చారో రాయాలి. ఒక ఆకృతిలో ఉన్న వస్తువును మరో ఆకృతిలోకి రూపాంతరం చేసే సమస్యలు సాధించాలంటే ఘనపరిమాణాల మీద అవగాహన పెంచుకోవాలి.

* తర్వాత వృత్తాలకు స్పర్శరేఖలు, ఛేదన రేఖలు అధ్యాయంలోంచి 4 మార్కుల సమస్య తప్పకుండా వస్తుంది. బాహ్య బిందువు నుంచి వృత్తానికి స్పర్శరేఖలు నిర్మించటం బాగా సాధన చేయాలి. ఇంకా షేడ్‌ చేసిన ప్రాంత వైశాల్యం కనుగొనే సమస్యలు బాగా అభ్యసించాలి.

* చివరగా సరూపత్రిభుజాలు అధ్యాయంలో 4 మార్కులకు సంబంధించి ఇచ్చిన స్కేలు ప్రకారం- ఇచ్చిన త్రిభుజానికి సరూపంగా ఉండేటట్లు త్రిభుజాన్ని నిర్మించటం, థేల్స్, పైథాగరస్‌ సిద్ధాంతాల అనువర్తనాల సమస్యలను బాగా సాధన చేయాలి.

- పి. వేణుగోపాల్‌

x

జీవశాస్త్రం

మనకు తెలిసిన వాటినే మళ్లీ వివరంగా తెలుసుకుంటూ సరదాగా చదువుకునేదే జీవశాస్త్రం. దీని అధ్యయనంలో మొక్కలు, జంతువులు మన జీవితాలతో ఎలా ముడిపడి ఉన్నాయో అర్థమవుతుంది. జీర్ణక్రియ జరిగే తీరు.. మూత్రపిండాల మాయాజాలం.. విటమిట్ల విశిష్టత వంటివన్నీ మనకు సంబంధించినవే. వాటిపై అవగాహన పెంచుకొని పరీక్షలో బొమ్మలు వేసి సమాధానాలు రాస్తే మంచి మార్కులు వస్తాయి. అందుకే బొమ్మలు వేయడం ప్రాక్టీస్‌ చేయాలి.

పదో తరగతి జీవశాస్త్రంలో అత్యధిక మార్కులు (గ్రేడ్‌) తెచ్చుకోవాలంటే ముఖ్యమైన అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టడంతోపాటు కొన్ని మెలకువలు పాటించాలి. దీనివల్ల సాధారణస్థాయి విద్యార్థి కూడా ఎ గ్రేడును చేరుకోవచ్చు. చక్కనైన చేతిరాతతో సరైన సమాధానాలు రాస్తే ఎక్కువ మార్కులు సులువుగా పొందవచ్చు.

జీవశాస్త్రంలో పాఠ్యాంశాలు- పోషణ, శ్వాసక్రియ, ప్రసరణ, విసర్జన, నియంత్రణ, ప్రత్యుత్పత్తి, జీవక్రియలో సమన్వయం, అనువంశికత, మన పర్యావరణం, సహజవనరులు వంటి 10
పాఠాల్లో అన్నింటికీ సమప్రాధాన్యం ఉన్నప్పటికీ మొదటి 5 పాఠాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశముంది.

పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశాలను క్షుణ్ణంగా, శ్రద్ధగా చదివి, మీకు తెలుసా? కృత్యం, పట్టికలు, ఫ్లోచార్టులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వీటినుంచే ప్రశ్నలు అడుగుతారు.

ముందుగా ప్రశ్నపత్రాన్ని 15 నిమిషాలు క్షుణ్ణంగా చదివి, బాగా తెలిసినవాటిని మార్క్‌ చేసుకొని, వాటినే ముందుగా రాయాలి.

* 1 మార్కు ప్రశ్నలలో పుస్తకంలోని 10 పాఠాలను కవర్‌ చేస్తూ ఇస్తారు. ఇందులో ఒక ప్రశ్న కచ్చితంగా ఏదేని పటం ఇచ్చి భాగాలను గుర్తించమని గానీ, పటం గుర్తించమని గానీ అడుగుతారు.

* 2 మార్కుల ప్రశ్నలకు 3-4 వాక్యాల్లో సమాధానం నేరుగా రాయాలి. అవసరమైనచోట, చక్కని పటం ద్వారా వివరించాలి. జవాబు పత్రంలో పెన్సిల్‌తో పటాన్ని మధ్యలోవేసి భాగాలను పెన్సిల్‌తోనే ఒకవైపు మాత్రమే రాయాలి. పటం పేరును తప్పక సూచించాలి.

* 4 మార్కుల ప్రశ్నలకు అంతర్గత వెసులుబాటు ఉంటుంది. కాబట్టి వీటిలో బాగా రాయగలిగిన వాటినే మార్క్‌ చేసుకొని ముందుగా రాయాలి. వీటిని పేరాల్లా కాకుండా పాయింట్ల రూపంలో రాస్తూ, ముఖ్యమైన పదాలకు కింద గీత గీయాలి.

* వీటిలో ఒక ప్రశ్న కచ్చితంగా పట్టిక రూపంలో ఉండొచ్చు. దానికి దిగువ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు పట్టిక నుంచి గ్రహించి రాయాల్సివుంటుంది.

* అంతేకాకుండా ఒక ప్రయోగానికి సంబంధించిన ప్రశ్న పోషణ, శ్వాసక్రియ, ప్రసరణ వంటి పాఠ్యాంశాల నుంచి వచ్చే అవకాశముంది. దీని ఉద్దేశం- పరికరాలు, విధానం, ఫలితం వంటి అంశాలను పటంతో సహా ప్రయోగాన్ని వివరిస్తే పూర్తి మార్కులు పొందగలుగుతారు.

* సెక్షన్‌ నంబర్‌ను, ప్రశ్న నంబర్‌ను స్పష్టంగా రాయాలి.

జాగ్రత్తలు

* ప్రశ్నపత్రాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా రాయకూడదు.

* దీర్ఘ సమాధానాలను పేరాల రూపంలో రాయకూడదు.

* పటంతో కూడిన ప్రశ్నల విషయంలో.. పటం ఒకచోట, సమాధానం మరోచోట రాయకూడదు.

* సమాధాన పత్రంలో సుమారు 18 లైన్ల కంటే ఎక్కువ రాయకూడదు.

* ఎరుపు, ఆకుపచ్చ పెన్‌లను సమాధానపత్రంలో వాడకూడదు.

* జవాబు పత్రంలో పేరునుగానీ, హాల్‌టిక్కెట్‌ నెంబర్‌గానీ రాయకూడదు.

* ఏ ప్రశ్ననూ వదిలివేయకూడదు.

* కొట్టివేతలు చేయకూడదు.

ముఖ్యమైన ప్రశ్నలు
1. కిరణజన్య సంయోగక్రియకు CO2 అవసరమని నిరూపించే ప్రయోగ విధానాన్ని తెలపండి.
2. పోషకాహారలోపం అంటే ఏమిటి? దీనివల్ల వ‌చ్చే వ్యాధుల్ని తెలపండి.
3. కిరణజన్య సంయోగక్రియ యాంత్రికాన్ని దశలతో వివరించండి.
4. శ్వాసక్రియలో వాయుప్రసార మార్గం ఫ్లో చార్టు గీయండి.
5. కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియల మధ్య పోలికలు తెలపండి.
6. జీవుల్లో వాయుమార్పిడి వ్యవస్థ పరిణామం గురించి వివరించండి.
7. మూలకేశాల ద్వారా ద్రవాభిసరణ పద్ధతిలో మొక్కలు నీటిని గ్రహించే విధానాన్ని వివరించండి.
8. ఎ) సిస్టోల్, డయాస్టోల్‌ బి) దారువు, పోషక కణజాలం మధ్య భేదాలు రాయండి.
9. ధమనులను శాఖలుగా విస్తరించిన చెట్టుతో పోలుస్తారు. ఎందుకు?
10. మానవుడి గుండె అంతర్నిర్మాణాన్ని వర్ణించండి.
11. మానవుడిలో మూత్రం ఏర్పడే విధానాన్ని పటం సహాయంతో తెలపండి.
12. మానవ శరీరంలో అనుబంధ విసర్జక అవయవాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటిని వివరించండి.
13. ప్రతీకార చర్యాచాపం అంటే ఏమిటి? ఇందులో పాల్గొనే భాగాలు తెలపండి.
14. మొక్కల్లో గల వివిధ రకాల అనువర్తనాలను తెలపండి.
15. అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలను ఉదాహరణ సహితంగా తెలపండి.
16. ఆవృత బీజాల్లో జరిగే ద్విఫలదీకరణాన్ని తెలపండి.
17. మాతృకణాల కంటే పిల్లకణాల్లో క్రోమోజోమ్‌ల సంఖ్య సగానికి తగ్గించకపోతే ఏమవుతుంది?
18. మాస్టికేషన్‌ అంటే ఏమిటి? అందుకు తోడ్పడే వివిధ రకాల దంతాలను వివరించండి.
19. జీర్ణనాడీవ్యవస్థను రెండో మెదడుగా పరిగణించడం ఎంతవరకు సమంజసం?
20. జన్యుశాస్త్ర ప్రయోగాల్లో మెండల్‌ తన ప్రయోగాలకు బఠాణి మొక్కను ఎంపిక చేసుకోవడానికి కారణాలు ఏమిటి?
21. ద్విసంకరణను వివరించడంలో మెండల్‌ స్వతంత్రవ్యూహన సిద్ధాంతాన్ని తెలపండి.
22. నిర్మాణస్వామ్య, క్రియాస్వామ్య అవయవాల పరిణామాన్ని తెలపండి.
23. పోషకస్థాయి అంటే ఏమిటి? జీవావరణ పిరమిడ్‌లో అది దేన్ని తెలియజేస్తుంది?
24. క్రిమిసంహారకాల వాడకాన్ని ఆపివేసి, నేల కాలుష్యాన్ని నివారించడానికి ఉపయోగపడే ఏవైనా మూడు కార్య‌క్ర‌మాల‌ను సూచించండి.
25. పర్యావరణ పరిరక్షణకు అవసరమైన 4R's యొక్క సూత్రాన్ని వివరించండి.

- బి. శివలింగా గౌడ్‌

x