Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
2020కి విభిన్న ఉద్యోగాలకే డిమాండు

* తొమ్మిది ఉద్యోగాలు.. అత్యంత ప్రభావితం
* యువత దృష్టి సారిస్తే ఉజ్వల భవిత

అంతా వెళ్లే దారిలో వెళితే బతుకు కనిపిస్తుంది. అదే కొత్త దారిని ఎంచుకుంటే జీవితం కనిపిస్తుంది. దానిలోని మజా కనిపిస్తుంది. నిజమండీ ప్రతి కొత్త దారిలో సవాళ్లు ఎదురవుతాయి... పాఠాలు నేర్చుకోవచ్చు. కష్టాలు వస్తాయ్.. ఎదురించే కసి మనకు రావొచ్చు. గజిబిజి పజిళ్లు వస్తాయ్... వాటిని అధిగమించే సృజనాత్మక కళ సొంతం అవ్వొచ్చు. కాబట్టి... బతుకును కాదు.. జీవితాన్ని చూడు. అప్పుడే ఈ భూమి మీదకు నువ్వు వచ్చిన అసలైన పని మొదలవుతుంది... సత్కార్యం పూర్తి చేసే అవకాశం లభిస్తుంది... 2020లో కొత్త కొలువులు... ఊహించని ఉద్యోగాలు రావొచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఆ దిశగా యువతంత్రం సాగితే... భవిష్యత్తులో అద్భుతాలు సాధించవచ్చని దిల్లీకి చెందిన మీట్ కెరీయర్ డాట్ కామ్ సంస్థ అంతర్జాతీయంగా.. దేశీయంగా చేసిన పరిశోధనలో వెల్లడైంది.

పోషక పదార్థాల నిపుణులు
మనం తినే ఆహారంలో పోషక విలువల్ని తెలియజేసే వారిని పోషక పదార్థాల నిపుణులుగా పిలుస్తారు. వీరు ఏ ఆహారంలో ఎంత పోషక విలువలుంటాయి.. ఏ పానీయం ఎంత మోతాదులో తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది..? చెడిపోతుందనేది విశ్లేషిస్తారు. ఇంట్లో పెంపుడు జంతువులకు ఆహారం, పోషణకు సలహాలు, సూచనలిస్తారు. సౌందర్య సాధనాలు ఎలా వాడాలనే అంశాలపై అవగాహన కల్పించే సమగ్ర నిపుణులుగానూ వీరి అవసరం ఎంతో ఉంటుంది. దీనికి తగ్గట్లుగా బిస్కట్ పరిశ్రమలు, రెస్టారెంట్లు, చాక్లెట్లు పరిశ్రమలు, మసాలా దినుసుల పరిశ్రమలుంటున్నాయి.
* అవసరమైన నైపుణ్యాలు : చక్కగా మాట్లాడగలగడం, రాయడం.. కంప్యూటర్ నైపుణ్యం, పోషక పదార్థాల పట్ల అవగాహన, విశ్లేషణ సామర్థ్యం, ఆహార రుచులను ఇష్టపడటం.
* ఎక్కడెక్కడ అవసరం : ప్రస్తుతం మనం జంక్‌ఫుడ్ యుగంలో ఉన్నాం. అంతా క్యాటరింగ్ యుగం నడుస్తోంది.
* డిమాండ్ : 2020 నాటికి దేశంలో రూ.700 కోట్ల వ్యాపారం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమపై జరుగుతుందనేది అంచనా. వచ్చే మూడేళ్లలో 1.30 కోట్ల ఉద్యోగాలు ఈ రంగంలో సృష్టించబడతాయని అంచనా. దీనికి ప్రపంచంలోనే గ్లొబల్ పార్ట్‌నర్‌గా నవ్యనగరి అవతరించబోతోంది. విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సులో తొలి అంశం ఆహారశుద్ధి పరిశ్రమ.
* సంపాదన అంచనా : కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి ఏడాదికి రూ.2.50 లక్షలు ఆదాయం లభిస్తుందని అంచనా.

పెంపుడు జంతువుల సంరక్షకులు
హైదరాబాద్‌కు చెందిన తన్మయి అనే యువతి కొత్తగా పశువైద్యం కోర్సులో పట్టా పొంది ప్రభుత్వ వైద్యాధికారిగా పనిచేస్తూనే సాయంత్రం వేళ పెంపుడు జంతువుల క్లినిక్ పెట్టుకుని, హోం విజిట్‌లు చేస్తూ ఏడాదికి రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షలు అదనంగా సంపాదిస్తోంది. ఆమెకు అది అభిరుచి కూడా.. అంత డిమాండు పెంపుడు జంతువుల సంరక్షణకు ఉంది. రాబోయే రోజుల్లో ఈ డిమాండు మరింత పెరగబోతోంది. పశువులు, పక్షులు, పెంపుడు జంతువులకు ఆహారం.. వైద్యం.. సంరక్షణకు సంబంధించిన ఉద్యోగ భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఉంటుంది.
* కావాల్సిన నైపుణ్యాలు : జంతువుల పట్ల ప్రేమ, పరిశీలన, తెలుసుకోవాలనే నైపుణ్యం, చూపుల నుంచి భావాలను పసిగట్టడం, శాస్త్రీయ వైఖరి, శారీరక దృఢత్వం
* డిమాండు : పెంపుడు జంతువుల కొనుగోలు, పోషణ, మార్కెటింగ్ 2020 నాటికి 36 శాతం వృద్ధి చెందుతుందని అంచనా.
* వేతన అంచనా : ఏడాదికి కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల ఆదాయం లభిస్తుంది.
* కోర్సు అందించే కళాశాలలు : భారత పశు పరిశోధనా సంస్థ, బెంగుళూరు, బోఫాల్, హర్యానా, మద్రాస్, కోల్‌కతా.

డేటా సైంటిస్ట్..
బ్యాంకింగ్.. వ్యాపార రంగాల్లో ఐటీ, సమాచార ఆధారిత శాస్త్ర సాంకేతిక అంశాల్ని విశ్లేషించడం. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నివేదిక ప్రకారం రాబోయే రోజులన్నీ వీరివే. సత్యం నాదెండ్ల, సుందర్ పిచ్చై చదివిన కోర్సు ఇదే. ప్రపంచంలో అత్యంత డిమాండు కలిగిన ఉద్యోగంగా దీన్ని భావిస్తారు.
* అవసరమైన నైపుణ్యాలు : విశ్లేషణాత్మక నైపుణ్యం, నిరంతరం నూతన విషయాలు తెలుసుకోవాలనే కుతుహలం, నాయకత్వ లక్షణాలు, భావ వ్యక్తీకరణ నైపుణ్యం.
* డిమాండు : 2020 నాటికి 50 శాతం అదనంగా డేటా సైంటిస్టులు అవసరమవుతారు.
* వేతన అంచనా : ఫ్రెషర్స్‌కు ఏడాదికి రూ.4 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది.
* కోర్సు అందిస్తున్న విశ్వవిద్యాలయాలు : ఐఐటీ ఖరగ్‌పూర్, బిజినెస్ స్కూల్ కోల్‌కతా, ఎస్‌బీ జైన్ స్కూల్ ముంబై, విదేశాల్లో స్టాన్‌ఫర్డ్ యూనివర్సీటీ యుఎస్ఏ.

బ్యాంకింగ్ రంగం
బ్యాంకింగ్ రంగం ఎప్పటి నుంచే ఉపాధి కల్పనా రంగం. నగదు రహిత ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో వీరి అవసరాలు రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతాయి. శాస్త్ర సాంకేతిక బ్యాంకింగ్ రంగం ముందుకు వెళ్తుంది. ఆన్‌లైన్, నెట్ బ్యాంకింగ్ సేవలు గణనీయంగా పెరుగుతాయి.
* నైపుణ్యాలు : నిర్వహణ సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాలు, సభ్యులతో మర్యాదగా ప్రవర్తించడం, నిజాయతీగా వ్యవహరించడం, సమస్యను శాస్త్రీయంగా పరిష్కరించడం, ఓర్పు, నేర్పు.
* డిమాండు : 2020 నాటికి 20 నుంచి 30 శాతం మంది అదనంగా అవసరమవుతారు.
* వేతనం : కొత్తవారు ఏడాదికి రూ.4 లక్షలు ఆదాయంగా సంపాదించవచ్చు.

సమాచారాన్ని కాపాడే హ్యాకర్లు
దస్త్రాలకు కాలం చెల్లింది. ఇప్పుడు కీలక, విలువైన సమాచారం మన నెట్టింట్లోకి వచ్చేసింది. కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌ల్లోనే సమాచారమంతా ఉంటోంది. విలువైన సమాచారాన్ని సురక్షితంగా కాపాడే వారే హ్యాకర్లు ఐటీ పరిశ్రమకు కావాలి.
* అవసరమైన నైపుణ్యాలు : జావా లేదా సీ ప్లస్‌ప్లస్‌లో నైపుణ్యం. యూనిస్‌పై సంపూర్ణ అవగాహన, విశ్లేషణా నైపుణ్యం, శాస్త్రీయంగా సమస్యను పరిష్కరించడం.
* డిమాండు : వచ్చే మూడేళ్లలో దేశంలో 60 లక్షల మంది అవసరమవుతారు. మంచి అవకాశం కలిగిన ఐటీ పరిశ్రమగా దీన్ని భావిస్తున్నారు.డిమాండ్‌కు.. ఉద్యోగుల లభ్యతకు ఎంతో వ్యత్యాసముంది.
* వేతనం : కొత్తగా ఉద్యోగంలో చేరేవారు ఏడాదికి రూ.8 లక్షల నుంచి రూ.50 లక్షలు వేతనంగా పొందుతారని అంచనా.
* కోర్సు అందించే విశ్వవిద్యాలయాలు : ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ కోల్‌కత, ఇంటర్ సాప్ట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్ హైదరాబాద్, ఐఈఎంటీ ఘజియాబాద్.. విదేశాల్లో లండన్ కళాశాల యుకే, క్యాలిఫోర్నియా యూనివర్సీటీ యూఎస్ఏ, టెక్సాస్ యూనివర్సీటీ యూఎస్ఏ.

క్లినికల్ థెరపిస్టులు.. సైకాలజిస్టులు
మానసిక సమస్యలతో బాధపడే వారికి స్వాంతన చేకూర్చి సమసమాజంలో సంతోషంగా వారు జీవించేలా చేసే వారినే క్లినికల్ థెరపిస్టులు.. సైకాలజిస్టులుగా పిలుస్తారు. మానసిక రోగులు పెరుగుతున్న కొద్ది వీరి సేవలు ఎంతో కీలకం. రాబోయే రోజుల్లో పరిశ్రమల్లో, కుటుంబాల్లో వీరి అవసరం ఎక్కువ.
* అవసరమైన నైపుణ్యాలు : మంచి ప్రసార భావ నైపుణ్యం, దయార్ధ్ర హృదయం, పూర్తిస్థాయి సహన ప్రదర్శన, సమస్యా పరిష్కార దృక్పథం.
* డిమాండు : 2020 నాటికి భారతదేశంలో ఇప్పుడున్న వారికి 100 శాతం ఎక్కువమంది నిపుణులు అవసరమవుతారు.
* వేతనం : కొత్తవారు ఏడాదికి రూ.4 లక్షల నుంచి రూ.15 లక్షలు వేతనంగా పొందుతారు.
* కోర్సు అందించే విశ్వవిద్యాలయాలు : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైకాలజి అండ్ రీసెర్చ్ బెంగుళూరు, ఆమిటి ఇనిస్టిట్యూట్ నోయిడా, విదేశాల్లో హార్వర్డ్ యూనివర్సీటీ యూఎస్ఏ, యూనివర్సీటీ ఆఫ్ కేంబ్రిడ్జి యూఎస్ఏ, యూనివర్సీటీ ఆఫ్ క్యాలిఫోర్నియా యూఎస్ఏ.

పర్యావరణవేత్తలు
పరిశ్రమలు, గృహాలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో పర్యావరణ సంరక్షణ.. నేల, నీరు, గాలి సంరక్షణ.. ఇంధన పొదుపులపై అవగాహన కల్పించే ప్రకృతి ప్రేమికులు.
* అవసరమైన నైపుణ్యాలు : మంచి భావ ప్రసార నైపుణ్యం, శారీరక సామర్థ్యం, డేటా విశ్లేషణా నైపుణ్యం, నిర్వహణా సామర్థ్యాలు, మంచి నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం, శాస్త్రీయ వైఖరి, సైన్సుపట్ల అవగాహన.
* డిమాండు : 2020 నాటికి పర్యావరణవేత్తల అవసరం 11 శాతం పెరుగుతుంది.
* వేతనం : ఫ్రెషర్స్‌కు రూ.4 నుంచి రూ.5 లక్షలు.
* విద్యాలయాలు : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సు సెంటర్ బెంగుళూరు, శ్రీవెంకటేశ్వర కాలేజ్ దిల్లీ, విదేశాల్లో.. యాష్‌ఫోర్టు యూనివర్సీటీ యూఎస్ఏ.

బయోమెడికల్ ఇంజినీర్
వీరి అవసరం ఇప్పటికే ఎంతో ఉంది. రాబోయే రోజుల్లో గుండె సంబంధ శస్త్రచికిత్సలు రోగుల ఇళ్ల వద్దే జరుగుతాయి. బయో మెడికల్ ఇంజినీర్ అంటే శాస్త్ర సాంకేతిక సూత్రాలు జీవ శాస్త్రానికి.. ఆరోగ్య సంరక్షణకు అన్వయించడం. సాంకేతిక నైపుణ్యతను ఆరోగ్య సంరక్షణ పరికరాల తయారీకి, సాఫ్ట్‌వేర్ రుపొందించి హెల్త్‌కేర్ పరిశ్రమలకు సహకారం అందించడం. గతంలో బైపాస్ సర్జరీకి ఆరు గంటలు పట్టేది. ఇప్పుడు గంటన్నరలో పూర్తవుతోంది. అందుకు బయో మెడికల్ ఇంజినీర్ల సేవలే కారణం.
* అవసరమైన నైపుణ్యాలు : విశ్లేషణా సామర్థ్యం.. వైద్య, ఇంజినీరింగ్ రంగాలపట్ల ఆసక్తి.. మంచి భావ ప్రసార నైపుణ్యం. కంప్యూటర్ నైపుణ్యం, సృజనాత్మకత, గణిత నైపుణ్యాలు, సమస్యల్ని పరిష్కరించే సామర్థ్యాలు.
* డిమాండు : 2020 నాటికి 27 శాతం మంది అదనంగా అవసరం.
* వేతనం : కొత్తగా ఉద్యోగంలో చేరేవారు ఏడాదికి రూ.13 లక్షల నుంచి రూ.50 లక్షలు ఆదాయంగా పొందుతారని అంచనా.
* కోర్సు అందించే విశ్వవిద్యాలయాలు : ఐఐటీ రూర్కీ, ఎయిమ్స్ దిల్లీ, ఎస్ఆర్ఎం యూనివర్సీటీ దిల్లీ, ఎంఐటీ మణిపాల్. విదేశాల్లో.. జార్జా ఇనిస్టిట్యూట్ అట్లాంటా, యూఎస్ఏ.. డూక్ యూనివర్సీటీ యూఎస్ఏ, స్టాన్‌ఫోర్డు యూనివర్సీటీ యూఎస్ఏ, యూనివర్సీటీ ఆఫ్ క్యాలిఫోర్నియా యూఎస్ఏ.

మొబైల్ ఆప్లికేషన్ డెవలపర్
స్మార్ట్‌ఫోన్లలో వినోదం, సమాచారం యాప్స్‌తో పాటు సాప్ట్‌వేర్‌ను రూపొందించే నిపుణులు.
* అవసరమైన నైపుణ్యాలు : నూతన ఆలోచనల రూపకల్పన.. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు, విశ్లేషణాత్మక ఆలోచనలు, సుదీర్ఘ గంటలు పనిచేసే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు, మొబైల్ యాప్స్ అభివృద్ధిపై అనుభవం, నూతన ఆవిష్కరణలు చేయాలనే పట్టుదల.
* డిమాండు : వచ్చే మూడేళ్లలో 32 శాతం మంది అదనంగా అవసరం.
* వేతనం : కొత్తవారు ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు ఆదాయంగా పొందుతారు.
* కోర్సు అందించే విశ్వవిద్యాలయాలు : గీక్ మెంటర్స్ నోయిడా, భారతీ విద్యాపీఠ్ పూణే, ఎన్ఐటీ దిల్లీ, విదేశాల్లో స్టాన్‌ఫోర్డు యూనివర్సీటీ యూఎస్ఏ, మిచిగాన్ యూనివర్సీటీ యూఎస్ఏ, మెసాసూసెట్స్ యూనివర్సీటీ యూఎస్ఏ.


Back..

Posted on 30-01-2017