Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఆరు అంశాలపై పట్టు...ఉద్యోగాలకు తొలి మెట్టు!

ఉద్యోగ నియామక పోటీపరీక్షల్లో కొందరు అభ్యర్థులు తగిన ప్రతిభ చూపలేక వెనుకబడుతుంటారు. దీనికి కారణం కీలకమైన కొన్ని సబ్జెక్టులపై వీరికి తగినంత పట్టు లేకపోవటమే! ఆ సబ్జెక్టులేమిటి? వాటిపై అవగాహన పెంచుకోవడానికి ఏ తీరులో కృషి చేయాలి?
ఉద్యోగావకాశాలపై గ్రాడ్యుయేట్ల దృక్పథం మారింది. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలకంటే ప్రభుత్వరంగ సంస్థలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ప్రైవేటు సంస్థల్లో పని ఒత్తిడీ, నిలకడ లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రభుత్వరంగ సంస్థలపై మక్కువ పెరిగింది.
దీనికి తోడు ప్రభుత్వరంగ సంస్థల్లో జీతభత్యాలు అధికంగానే ఉన్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులకు రూ.45,000, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గ్రేడ్‌-బి ఆఫీసర్‌ పోస్టులకు రూ.75,000 వేతనాలు లభిస్తున్నాయి. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే సీజీఎల్‌ పరీక్ష ద్వారా ఎంపికైన గ్రూప్‌-బి ఆఫీసర్‌, రైల్వే రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ అయ్యే గూడ్స్‌గార్డ్‌.. ఇలాంటి పోస్టులకు భారీగానే జీతాలు వస్తున్నాయి. నోటిఫికేషన్లు కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వస్తున్నాయి.
ఈ తరుణంలో ఉద్యోగార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే.. పరీక్షకు సన్నద్ధమయ్యే విధానం కూడా ప్రత్యేకంగా ఉండాలి. కింద పేర్కొన్న ఆరు సబ్జెక్టులపై పట్టు సాధించగలిగితే సుమారు 65 ప్రభుత్వరంగ పరీక్షలు రాసుకునే అవకాశముంది.
* రీజనింగ్‌/ జనరల్‌ ఇంటెలిజెన్స్‌
* క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌
* జనరల్‌ ఇంగ్లిష్‌
* జనరల్‌ అవేర్‌నెస్‌
* బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌
* కంప్యూటర్‌ నాలెడ్జ్‌
పరీక్ష ఏదైనా ప్రశ్నలు మాత్రం కేవలం ఈ ఆరు సబ్జెక్టుల నుంచే అడుగుతున్నారని గమనించాలి. ప్రశ్నల సంఖ్య, పరీక్ష నిడివి మాత్రమే మారుతున్నాయి. క్లరికల్‌ పరీక్షలోని ప్రశ్నలస్థాయి కొంచెం తక్కువగా, ఆఫీసర్‌ పరీక్షలో ప్రశ్నలస్థాయి ఎక్కువగా ఉంటాయి.
ప్రతి పరీక్షలో ఒక క్రమపద్ధతిలో అంశాలవారీగా ప్రశ్నల సంఖ్యను గమనించుకోవచ్చు. సన్నద్ధత సమయంలోనే వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సన్నద్ధత కొనసాగిస్తే ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన, చేస్తున్న అభ్యర్థుల్లో చాలామందికి కోర్సు పూర్తిచేసిన తరువాత వారికి ఉన్న ఉద్యోగావకాశాలపై పూర్తి అవగాహన కొరవడుతోంది. అదే అవగాహన గ్రాడ్యుయేషన్‌ మొదటి సంవత్సరంలో కలిగివుండి వారు ఏ పరీక్షలను రాయాలనుకుంటున్నారో వాటికి సన్నద్ధత కొనసాగిస్తే అద్భుత ఫలితాలు రాబట్టవచ్చు.
అభ్యర్థులు తమకున్న అవకాశాలన్నీ తెలుసుకుని, ఆయా ఉద్యోగాల్లో ఉండే పని, ఇతరత్రా విషయాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయటం అవసరం. ఆపై తమ స్వభావానికి దగ్గరగా ఉండే ఉద్యోగాలకు ముందు నుంచీ సిద్ధమవడం ఉత్తమం.

కొన్నిటిపైనే దృష్టి...
సరైన అవగాహన, పూర్తిస్థాయి మార్గదర్శకత్వం లేకపోవడంతో ఎంతోమంది ఉద్యోగార్థులు కేంద్ర, రాష్ట్ర, ఇతర ప్రభుత్వరంగ సంస్థల్లోని కొన్ని ఉద్యోగాలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన అభ్యర్థులు సాఫ్ట్‌వేర్‌, బ్యాంకు పరీక్షలపై మాత్రమే దృష్టిపెడుతున్నారు.
బ్యాంకులు నిర్వహించే స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల్లో ‘అగ్రికల్చర్‌ ఆఫీసర్‌’ పోస్టులు గత రెండు సంవత్సరాల్లో మిగిలిపోయాయంటే కారణం ఇదే.
వివిధ పరీక్షలన్నింటిలో 100- 200 ప్రశ్నలు లేదా 4- 5 సెక్షన్లుగా విభజించి ఇస్తారు. కొన్ని పరీక్షల్లో ఎంపిక ప్రక్రియ 2 అంతకంటే ఎక్కువ అంచెలుగా జరుగుతుంది. బ్యాంకు ప్రొబేషనరీ/ స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టు మినహా మరి ఏ ఇతర నోటిఫికేషన్లలోనూ మౌఖిక పరీక్ష లేదు. కేవలం ప్రతిభ ఆధారంగా, అది కూడా రాతపరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలన్నీ ఆన్‌లైన్‌ విధానంలోనే జరుగుతున్నాయి.

గ్రూప్‌- బి పోస్టులు
దేశంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అభ్యర్థులకు ఉన్న రెండో అత్యుత్తమ పోస్టు- గ్రూప్‌-బి. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌... కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ పరీక్ష ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది. టయర్‌-1, 2, 3, 4 అనే నాలుగు అంచెలుగా ఈ పరీక్ష ఉంటుంది. టయర్‌-1, 2 పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలతో ఉంటాయి. టయర్‌-3 డిస్క్రిప్టివ్‌ పరీక్ష, టయర్‌- 4 కంప్యూటర్‌ టైపింగ్‌ పరీక్ష.
ఈ పరీక్షలన్నీ అంచెలంచెలుగా పూర్తిచేసిన అభ్యర్థులకు మెరిట్‌ ఆధారంగా పోస్టులు కేటాయిస్తారు. 25 సంవత్సరాల్లోపు వయసు వారు గ్రూప్‌-బి పోస్టు ఉద్యోగంలో చేరితే పదవీ విరమణ నాటికి కమిషనర్‌ హోదాకు చేరుకునే అవకాశం ఉంది.
ఇవేకాకుండా రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ టెక్నికల్‌, నాన్‌టెక్నికల్‌ పోస్టులైన (కమర్షియల్‌ అప్రెంటిస్‌, ట్రాఫిక్‌ అప్రెంటిస్‌), గూడ్స్‌ గార్డ్‌, అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్‌, అసిస్టెంట్‌ లోకోపైలట్‌ నోటిఫికేషన్లు, ఎస్‌ఐడీబీఐ, సెబీ, నాబార్డ్‌, ఇస్రో, ఆప్‌కాబ్‌, డీసీసీబీ, ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీ, యూజీసీ, ఓఎన్‌జీసీ, గెయిల్‌, ఐఓసీఎల్‌, వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌, సింగరేణి వంటి ప్రభుత్వరంగ సంస్థల్లోని పోస్టులకోసం నోటిఫికేషన్లు వస్తున్నాయి.

ఏ సబ్జెక్టు ఎలా?
దేశంలోని అత్యుత్తమ సంస్థల్లో ఉద్యోగం పొందడానికి అభ్యర్థులు కేవలం ఆరు సబ్జెక్టులను అధ్యయనం చేయాలి. వాటిపై పట్టు సాధించాలి. వివిధ పోటీ పరీక్షల్లో వచ్చే ప్రశ్నల తీరును పరిశీలించాలి.
* ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి?
* ఏ అంశం (అధ్యాయం) నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి?
* ప్రశ్నలస్థాయి ఎలా ఉంది?
* ఏ సెక్షన్లు కీలకం? వాటిలో ఎన్ని మార్కులు పొందాలి?
* గతంలో జరిగిన పరీక్షల్లో కటాఫ్‌ మార్కులు ఎన్ని?
* పరీక్షకు కావాల్సిన స్టడీ మెటీరియల్‌, మాదిరి ప్రశ్నలు?
* సమాచారం సులువుగా గుర్తుపెట్టుకోవడమెలా?
* తక్కువ సమయంలో సమాధానం గుర్తించాలంటే ఎలాంటి సింప్లిఫికేషన్స్‌ వాడాలి?
ఇలాంటి వాటి గురించి క్షుణ్ణంగా పరిశీలించి, దరఖాస్తు చేసిన పరీక్షకు తగ్గట్టు సన్నద్ధత మొదలుపెట్టాలి.

1. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌
ఇందులో ముఖ్యంగా మూడు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అవి- న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, డేటా అనాలిసిస్‌. బ్యాంకు పరీక్షల్లో న్యూమరికల్‌ ఎబిలిటీ, డేటా అనాలిసిస్‌ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. స్టాఫ్‌ సెలక్షన్‌ పరీక్షల్లో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, గణితాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. పరీక్షను బట్టి (35-50) ప్రశ్నలు వస్తాయి. డేటా అనాలిసిస్‌ కీలకాంశం.
ఏ పరీక్షలోనైనా క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ సెక్షన్‌లో ఎక్కువ మార్కులు పొందితే మెరుగైన అవకాశం ఉంటుంది. సింప్లిఫికేషన్‌పై దృష్టిపెట్టి షార్ట్‌కట్స్‌, ఫార్ములాలపై శ్రద్ధ చూపిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. విషయపరిజ్ఞానంపై దృష్టిపెట్టి వీలైనన్ని ఎక్కువ ప్రశ్రలు సాధన చేయడం మంచిది.

2. రీజనింగ్‌
దీనిలో మొత్తం 4 విభాగాలుంటాయి. వెర్బల్‌, నాన్‌వెర్బల్‌, ఎనలిటికల్‌, లాజికల్‌ రీజనింగ్‌. ప్రశ్నలో తర్కం పట్టుకుంటే రీజనింగ్‌ ప్రశ్నలకు సమాధానం సులువుగా పెట్టవచ్చు. ఆలోచనావిధానం పరీక్షించేలా ఈ ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలో ఉన్న పూర్తి సమాచారాన్ని ఉపయోగించి వాస్తవికతకు దగ్గరగా ఉండేలా సమాధానాలు గుర్తించాలి.
అనలిటికల్‌, వెర్బల్‌ రీజనింగ్‌ నుంచి ప్రతి పరీక్షలో ప్రశ్నలుంటాయి. నాన్‌వెర్బల్‌ రీజనింగ్‌ నుంచి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, రైల్వే రిక్రూట్‌మెంట్‌ పరీక్షల్లో మాత్రమే ప్రశ్నలు వస్తాయి. లాజికల్‌ రీజనింగ్‌ నుంచి తక్కువ ప్రశ్నలు వస్తున్నాయి.
అనలిటికల్‌లో క్రిటికల్‌ లేదా హైలెవల్‌ ప్రశ్నలుంటాయి. ఇవి చేయాలంటే ఇంగ్లిష్‌ భాషపై పట్టుండాలి. ఇందులో ప్రశ్నలు గ్రూప్‌గా వస్తాయి. ఒకే అంశం నుంచి 5 ప్రశ్నలు గ్రూప్‌గా ఉంటాయి. సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, ఇన్‌పుట్‌- అవుట్‌పుట్‌, ఇన్ఫరెన్సెస్‌, కన్‌క్లూజన్స్‌, డెసిషన్‌ మేకింగ్‌, బ్లడ్‌ రిలేషన్స్‌ ముఖ్యమైనవి. సరైన పద్ధతిలో సాధన చేస్తే అన్ని ప్రశ్నలకూ సరైన సమాధానం గుర్తించేలా ఉంటాయి. ఎక్కువ మార్కులు పొందడానికి వీలున్న విభాగం ఇది.

3. ఇంగ్లిష్‌
ఎక్కువమంది అభ్యర్థులు ఇబ్బంది పడేది ఈ సెక్షన్‌లోనే. వ్యాకరణం మీద పట్టుతోపాటు పఠన నైపుణ్యాలు (రీడింగ్‌ స్కిల్స్‌) ఉంటే ఈ విభాగంలో ఎక్కువ మార్కులు పొందవచ్చు. బ్యాంకు పరీక్షల్లోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే రీడింగ్‌ స్కిల్స్‌ ఉండాల్సిందే. మిగిలిన పరీక్షల్లోని ప్రశ్నలు ఎక్కువగా వ్యాకరణానికి సంబంధించి ఉంటాయి. ప్రశ్నను చదివిన వెంటనే సమాధానం గుర్తించగలిగేలా ఉంటాయి. ప్రతిరోజూ ఆంగ్ల దినపత్రిక చదివితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు.
రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, క్లోజ్‌ టెస్ట్‌, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌, సెంటెన్స్‌ అరేంజ్‌మెంట్‌, కరెక్షన్స్‌పై శ్రద్ధపెడితే మార్కులు అధికంగా వస్తాయి. యాంటనిమ్స్‌, సిననిమ్స్‌, ఆర్టికల్స్‌ ప్రశ్నలు ఎక్కువ సాధన చేసి ఏయే సందర్భాల్లో ఏ పదాలు వాడాలో గుర్తించాలి. ప్రతిరోజూ ఇంగ్లిష్‌ వార్తలు వినాలి. వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు సాధన చేయటం, గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను బట్టి నోట్స్‌ తయారు చేసుకుని సన్నద్ధమవటం చేస్తుండాలి. ఇలా కృషి కొనసాగిస్తే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు.

4. జనరల్‌ అవేర్‌నెస్‌
కరెంట్‌ అఫైర్స్‌, సోషల్‌, సైన్స్‌ అంశాలకు సంబంధించి ప్రశ్నలు ఏవిధంగా వస్తున్నాయో గమనించడం ముఖ్యం. ముఖ్యమైన సమాచారానికి నోట్స్‌ తయారు చేసుకోవాలి. వీలైనన్ని ఎక్కువసార్లు చదివి సమాచారం గుర్తుంచుకునేలా చదువుకోవాలి.
ఎక్కువ సమాచారం గ్రహించడం ద్వారా ఎక్కువ ప్రశ్నలను తక్కువ సమయంలో సమాధానాలు గుర్తించవచ్చు. హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ అంశాలు 8, 9, 10 తరగతుల్లో పాఠ్యాంశాలు చదివి, ఆబ్జెక్టివ్‌ విధానంలో అడగడానికి ఏవిధంగా అవకాశం ఉంటుందో అలా నోట్స్‌ తయారు చేసుకోవాలి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ అంశాలకు కూడా నోట్స్‌ తయారు చేసుకోవాలి. పాత ప్రశ్నపత్రాలు చూడడం ద్వారా ఏయే అంశాలు ముఖ్యమైనవో గుర్తించవచ్చు. దానికి అనుగుణంగా సన్నద్ధమవడం వల్ల మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు.
కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి రోజువారీ దినపత్రిక చదువుతూ అందులోని జాతీయ, అంతర్జాతీయ విషయాలు, సైన్స్‌-టెక్నాలజీ, ఉపగ్రహ ప్రయోగాలు, స్పోర్ట్స్‌, అవార్డులు, వైరస్‌, వ్యాక్సిన్లు, కార్పొరేట్‌ సంస్థల పూర్తి సమాచారం, ముఖ్యమైన ప్రదేశాలు, వార్తల్లోని వ్యక్తులు, పుస్తకాలు-రచయితలు, కేంద్రప్రభుత్వ పథకాలు, కేంద్రమంత్రులు- వారి శాఖలు, రాష్ట్రాలు- గవర్నర్లు, దేశాలు- ప్రధాన మంత్రులు- రాజధానులు- కరెన్సీ వంటి వాటి పూర్తి సమాచారాన్ని నోట్స్‌గా తయారు చేసుకోవాలి. పరీక్షకు ముందు ఎక్కువసార్లు నోట్స్‌ చదవడం వల్ల ఎక్కువ ప్రశ్నలకు సమాధానం గుర్తించవచ్చు.

5. బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌
బ్యాంకింగ్‌ విభాగంలో ఎకానమీ, ఫైనాన్స్‌ రంగాలను కలిపి ప్రశ్నలు అడుగుతున్నారు. రిజర్వ్‌ బ్యాంకు పాలసీలు, మానిటరీ పాలసీ, రెగ్యులేటరీ పాలసీ, బ్యాంకింగ్‌ రంగంలో వచ్చిన నూతన మార్పులు, ఆర్‌బీఐ రీఫార్మ్స్‌, కేవైసీ, బ్యాంకులు- హెడ్‌క్వార్టర్లు, గ్లోబల్‌ మార్కెట్‌కు సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి.
ఇన్సూరెన్స్‌ నుంచి ఇన్సూరెన్స్‌ పాలసీలు, బ్యాంకు- ఇన్సూరెన్స్‌లకు ఉన్న వ్యత్యాసాలు, ఎస్‌ఎల్‌ఆర్‌, సీఆర్‌ఆర్‌, యులిప్‌, పీపీఎఫ్‌లకు సంబంధించిన ప్రశ్నలతోపాటు కిసాన్‌ వికాస పత్రాలు, సేవింగ్స్‌ సర్టిఫికెట్‌, ఎల్‌ఐసీ, నాన్‌ ఎల్‌ఐసీ, జనరల్‌ ఇన్సూరెన్స్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ల వ్యత్యాసాలపై ప్రశ్నలు వస్తున్నాయి.

6. కంప్యూటర్‌ నాలెడ్జ్‌
ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లోని అన్ని శాఖల్లో కంప్యూటర్‌తోనే పనులన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఉద్యోగార్థులు కంప్యూటర్‌ వినియోగం, కీ బోర్డ్‌ షార్ట్‌కట్స్‌, వేగంగా టైప్‌ చేయడం, ఇన్‌పుట్‌- అవుట్‌పుట్‌ డివైజెస్‌పై కనీస అవగాహన పెంచుకుంటే మంచిది. టైపింగ్‌కు సంబంధించి ఎటువంటి సర్టిఫికెట్‌ కోర్సు చేయనప్పటికీ వేగంగా టైప్‌ చేయడం అలవాటు చేసుకుంటే ఉద్యోగరీత్యా పనిని తొందరగా పూర్తిచేయవచ్చు.
రాతపరీక్షకు సంబంధించి కంప్యూటర్‌ జనరేషన్స్‌, మైక్రోసాఫ్ట్‌వర్డ్‌, ఎక్స్‌ఎల్‌, పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌, ఇన్‌పుట్‌- అవుట్‌పుట్‌ డివైజెస్‌, యాంటీవైరస్‌, వైరస్‌, మాల్‌వేర్స్‌, నెట్‌వర్కింగ్‌, ఫైర్‌వాల్స్‌, డిఫాల్ట్‌ ఫైర్‌వాల్స్‌, స్టోరేజ్‌ డివైజెస్‌, డీఫాల్ట్‌ ఫైల్‌ ఎక్స్‌టెన్షన్స్‌, అబ్రివేషన్స్‌, టర్మినాలజీ, ఈ-మెయిల్‌, ఇంటర్‌నెట్‌ బ్రౌజింగ్‌, డేటా స్టోరేజ్‌ డివైజెస్‌ వంటి అంశాలపై అవగాహన కలిగివుండాలి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి వీలున్న సబ్జెక్టు కాబట్టి, అభ్యర్థులు పరీక్షకు తగ్గట్టుగా సన్నద్ధత కొనసాగించాలి.
ప్రభుత్వరంగ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. పరీక్షకు కావాల్సినట్టుగా ప్రశ్నలస్థాయిని పరిశీలిస్తూ సన్నద్ధమవాలి. ఆన్‌లైన్‌ పరీక్షలు వీలైనన్ని ఎక్కువ రాయాలి. ప్రతిరోజూ ఆంగ్ల దినపత్రికను చదవాలి. నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పరీక్షనూ సీరియస్‌గా తీసుకుంటే ప్రభుత్వ లేదా ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగం పొందడానికి ఎక్కువ కాలం పట్టదు!
ప్రభుత్వరంగ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. పరీక్షకు కావాల్సినట్టుగా ప్రశ్నలస్థాయిని పరిశీలిస్తూ సన్నద్ధమవాలి. ఆన్‌లైన్‌ పరీక్షలు వీలైనన్ని ఎక్కువ రాయాలి. ప్రతిరోజూ ఆంగ్ల దినపత్రికను చదవాలి.


Back..

Posted on 23-09-2016