Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
2020 నాటికి ఆ 9 ఉద్యోగాలకు డిమాండ్

చదువులంటే ఇంజినీరింగ్, మెడిసిన్లే కాదు... ఉద్యోగమంటే టీచర్లు, మేనేజర్లే కాదు…ఆధునిక అవసరాలు, పెరుగుతోన్న టెక్నాలజీ కారణంగా కొత్త కోర్సులు, కెరీర్లు పుట్టుకొస్తున్నాయి. అభిరుచికి తగ్గ అవకాశాలు విస్తరిస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో కొన్ని కెరీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉండబోతోందని అంచనా వేస్తున్నారు. 2020 నాటికి జాబ్ మార్కెట్లో ఈ ఉద్యోగాలు హ‌ల్‌చ‌ల్‌ చేస్తాయని భావిస్తున్నారు. అవేంటో తెలుసుకుంటే వాటిపై ఆసక్తి ఉన్నవాళ్లు ఆ దిశగా అడుగులేయవచ్చు.

ఫుడ్ ఫ్లేవరిస్ట్...
రుచిని పసిగట్టి అందులోని మంచి చెడ్డలు వివరించగలరా...అయితే మీరు ఫుడ్ ఫ్లేవరిస్ట్ ఉద్యోగానికి ఎంపికైనట్టే. ఫుడ్ అంటే కేవలం తినుబండారాలనే కాదు. పానీయాలు, పోషక పదార్థ సప్లిమెంట్లు, టూత్ పేస్టు, ఔషధాలు, లిప్బామ్స్, సౌందర్య ఉత్పత్తులు, సుగంధద్రవ్యాలు...వీటిలో దేని రుచి గురించైనా మంచి చెడ్డలు వివరించే నైపుణ్యం, అదే ఉత్పత్తికి సంబంధించి వివిధ కంపెనీలు తయారుచేసినవాటిని విశ్లేషించడంపై ఆసక్తి ఉన్నవాళ్లు ఫుడ్ ఫ్లేవరిస్ట్ కెరీర్ దిశగా అడుగులేయవచ్చు.

వెటరినేరియన్
మూగజీవాలంటే ప్రేమ...వాటి ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలనే తపన ఉన్నవాళ్లు ఎంచుకోదగ్గ కోర్సు వెటర్నరీ సైన్స్. భార‌త్‌లో పాడి పరిశ్రమ ఎప్పటికీ విస్తరిస్తూనే ఉంటుంది.. అలాగే కోళ్లు, గొర్రెలు, మేకలు...ఇలాంటివాటి పెంపకం కూడా బాగా ఎక్కువైంది. పలు జాతులకు చెందిన కుక్కలనే కాకుండా పక్షులను కూడా చాలామంది పెంచుకుంటున్నారు. దీంతో వెటర్నరీ కోర్సులు చదివినవారికి డిమాండ్ పెరిగింది. పాలు, పాల ఉత్పత్తులు, మాంసాహారంపై డిమాండ్ ఉన్నంత వరకు వెటర్నరీ కోర్సులకు తిరుగుండదనే చెప్పుకోవచ్చు.

డేటా సైంటిస్ట్...
ప్రస్తుతం ఐటీలో డిమాండ్ ఉన్న కెరీర్.. డేటా సైంటిస్ట్. సమాచార నిర్వహణ, విశ్లేషణకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. అన్ని రంగాల్లోనూ డేటా సైంటిస్ట్ సేవలు అనివార్యమయ్యాయి. కంపెనీలు ముందడుగులో డేటా విశ్లేషణే కీలకంగా మారింది. సమాచారాన్ని క్రోడీకరించడం, వినియోగదారుల అవసరాలను గుర్తించడం, అవసరం లేని డేటాను తొలగించడం...ఇవన్నీ డేటా సైంటిస్ట్ విధులే. ప్రొగ్రామింగ్, డేటాబేస్లపై పరిజ్ఞానం, విశ్లేషణ సామర్థ్యం, తర్కం ఉన్నవాళ్లు డేటా సైంటిస్ట్ కెరీర్ దిశగా అడుగులేయవచ్చు.

బ్యాంకింగ్...
దేశంలో ఇప్పుడు ప్రతి పౌరుడికీ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలన్నీ బ్యాంకు సేవలతో అనుసంధానమయ్యాయి. ఇంటర్నెట్ కారణంగా మొబైల్ బ్యాంకింగ్ విస్తరిస్తోంది. పలు రకాల వస్తువుల కోసం రుణం తీసుకునేవాళ్లు, మదుపు చేసేవారు పెరుగుతున్నారు. కొనుగోళ్లు, చెల్లింపులు అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. దీంతో బ్యాంకింగ్ రంగంలో నిపుణుల అవసరం పెరిగింది.

ఎథికల్ హ్యాకింగ్...
సమాచారం భద్రంగా దాచుకోవడం ఇప్పుడు అత్యంత కష్టమైన ప్రక్రియగా మారుతోంది. హ్యాకర్లు చిన్నచిన్న లోపాలను ఆధారంగా చేసుకుని విలువైన సమాచారాన్ని (వ్యక్తిగత, సంస్థాగత) దొంగిలిస్తున్నారు. దీంతో ఊహించని స్థాయిలో నష్టం ఏర్పడుతోంది. కొన్నిసార్లైతే సంబంధిత వెబ్సైట్లనే పూర్తిగా నిలిపివేస్తున్నారు. హ్యాకింగ్కు అడ్డుకట్ట వేయడానికి ఆవిర్భవించిందే ఎథికల్ హ్యాకింగ్. వీళ్లు సంబంధిత వ్యవస్థ సాంకేతికంగా ఎంత పటిష్ఠంగా ఉందో పరిశీలిస్తారు. దాడిచేయడానికి అవకాశమున్న మార్గాలను అన్వేషిస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా తమ దృష్టికి వచ్చిన లోపాలను సరిచేస్తారు. దీంతో బయటవాళ్లు హ్యాకింగ్ చేయడానికి సాధ్యంకాని విధంగా సంబంధిత వెబ్ లేదా నెట్‌వ‌ర్క్‌, వ్యవస్థ రూపొందుతుంది. భద్రత, ఆర్థిక సేవలేకాకుండా సమాచారంతో ముడిపడి ఉండే ప్రతి కంపెనీకీ ఎథికల్ హ్యాకర్ల సేవలు అనివార్యమయ్యాయి. సైబర్ దాడులను సమర్థంగా తిప్పికొట్టడం ఎథికల్ హ్యాకర్లతోనే సాధ్యం. ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్- కోల్‌క‌తాతోపాటు పలు సంస్థలు ఎథికల్ హ్యాకింగ్ కోర్సులు అందిస్తున్నాయి.

క్లినికల్ థెరపిస్ట్...
ఆధునిక జీవనం అవకాశాలతోపాటు ఒత్తిడినీ తీసుకొచ్చింది. రకరకాల సమస్యలతో మానసికంగా కుంగిపోతున్నవాళ్లెందరో మనచుట్టూ ఉన్నారు. వీరిని సాధారణ స్థాయికి తీసుకురావడానికి క్లినికల్ థెరపిస్టుల సేవలెంతో కీలకం. ఈ పనిని ఎక్కువగా క్లినికల్ సైకాలజిస్టులు చేస్తుంటారు. సైకాలజీలో ఒక స్పెషలైజేషన్ కోర్సుగా క్లినికల్ సైకాలజీ ఉంటుంది. సమస్యలను విశ్లేషించి పరిష్కార మార్గాలను చూపే సమర్థత, ఎదుటివారు చెప్పింది ఓపికగా వినేంత సహనం ఈ రెండూ క్లినికల్ థెరపిస్టులకు తప్పనిసరి. ప్రస్తుతం ఉద్యోగులు, వ్యాపారులే కాకుండా విద్యార్థులు, గృహిణులు, ధనికులు, పేదవారు...ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక మానసిక సమస్యతో సతమతమవుతునే ఉన్నారు. దీంతో భవిష్యత్తులో క్లినికల్ థెరపిస్టుల సేవలు విస్తరించనున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ సైకాలజీ అండ్ రీసెర్చ్- బెంగళూరు తదితర సంస్థలు ఈ విభాగంలో కోర్సులు అందిస్తున్నాయి.

ఎన్విరాన్‌మెంట‌లిస్ట్‌...
పర్యావరణ ప్రేమికులు ఎన్విరాన్‌మెంట‌లిస్ట్‌గా రాణించడానికి అవకాశాలున్నాయి. వివిధ రకాల ప్రమాదాలు, విపత్తుల నుంచి పర్యావరణాన్ని పరిరక్షించడమే ఎన్విరాన్‌మెంట‌లిస్ట్‌ల ప్రదాన విధి. పరిశ్రమల కారణంగా భూమి, నీరు, గాలి కాలుష్యం కాకుండా చూడడం వీరి కర్తవ్యాల్లో ముఖ్యమైనది. నశించిపోతున్న జీవజాతుల మనుగడకు కృషి చేయడమూ విధుల్లో భాగమే. సామాన్యశాస్త్రాలపై ఆసక్తి ఉన్నవాళ్లు పర్యావరణవేత్తలగా రాణించగలరు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఎన్విరాన్‌మెంట‌లిస్ట్‌లకు డిమాండ్ పెరిగింది.

బయోమెడికల్ ఇంజినీర్...
బయాలజీ, హెల్త్‌కేర్‌ రంగాలకు ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని అందించేవాళ్లే బయోమెడికల్ ఇంజినీర్లు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించడానికి వైద్య రంగంలో పరికరాల పాత్ర ఎంతో కీలకం. ఇంజినీర్లు పరికరాలను తయారుచేయగలరు. అయితే ఎలాంటి పరికరాలు కావాలో చెప్పడానికి వైద్య రంగంపై అవగాహన తప్పనిసరి. అందువల్ల అటు ఇంజినీరింగ్ ఇటు మెడిసిన్ రెండింటి కలయికతో ఆవిర్భవించిందే బయో మెడికల్ ఇంజినీరింగ్. ప్రస్తుతం రకరకాల వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. వాటిని నిర్ధారించడానికి తేలికైన, సులువైన కొత్త పరికరాల ప్రాధాన్యం పెరిగింది. అలాగే ఆ పరికరాలు సమర్థంగా పనిచేయాలంటే సాఫ్ట్‌వేర్‌ కూడా కీలకమే. ఈ విధులను సమర్థంగా నిర్వహించగలిగేవాళ్లే బయోమెడికల్ ఇంజినీర్లు. మెడిసిన్, ఇంజినీరింగ్ రెండు రంగాలపైనా ఆసక్తి, కంప్యూటర్లపై పనిచేయడానికి ఇష్టం, డిజైన్లు సృష్టించాలనే తపన ఉన్నవాళ్లు బయోమెడికల్ ఇంజినీర్లగా రాణించవచ్చు.

మొబైల్ అప్లికేషన్ డెవలపర్...
మూడేళ్ల కిందటివరకు వెబ్‌సైట్లను డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో చూసేవారు. కానీ ఇప్పుడు మొబైల్లో అదికూడా వెబ్ కాకుండా యాప్(అప్లికేషన్లు) రూపంలో చూస్తున్నారు. నచ్చిన యాప్ డౌన్‌లోడ్‌ చేసుకుని వేని మోపితే చాలు వెంటనే డిస్‌ప్లే అవుతుంది. ఇటు నెటిజన్లకు అటు సంస్థలకు ఇద్దరికీ యాప్స్ ఎంతో సౌలభ్యంగా మారాయి. మరికొన్నాళ్లకు వెబ్‌సైట్లు కనుమరుగైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మొబైల్ అప్లికేషన్లే హ‌ల్‌చ‌ల్‌ చేస్తాయి. ప్రొగ్రామింగ్ స్కిల్స్ ఉన్నవాళ్లు మొబైల్ అప్లికేషన్ డెవ‌ల‌ప‌ర్‌గా రాణించవచ్చు.


Back..

Posted on 02-12-2016